ఆర్థిక మాంద్యం ఎందుకొస్తుంది ?

ప్రపంచ ఆర్థిక మాంద్యం ఆయా దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. అసలు మాంద్యం అంటే ఏమిటి? మామూలు అర్థంలో వరుసగా రెండు త్రైమాసికాలు గనుక జిడిపి వృద్ధిరేట్‌ తిరోగమనంలో సాగితే ఆ దేశం మాంద్యంలోకి జారుకున్నట్లు పరిగణిస్తారు. ఇటీవల పత్రికలు, ప్రసార సాధనాలు, రేటింగ్‌ సంస్థలు, ఆర్థిక వేత్తలు ధరల పెరుగుదల, పరిశ్రమల మూత, నిరుద్యోగం, పేదరికం గురించి ఆందోళన ప్రకటిస్తున్నాయి. అయితే దీన్ని మాంద్యం అనవచ్చునా అని పాలకులు, ప్రభుత్వ అనుకూల ఆర్థిక వేత్తలు చర్చలు జరుపుతున్నారు. వీరు ఆర్థిక పరిభాషలోని మాంద్యం (రిసెషన్‌) అనలేమని, ఇది కేవలం మందకోడితనం(స్లోడౌన్‌) మాత్రమేనని వాదిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావాన్ని విశ్లేషించే క్రమంలో మార్క్స్‌ మాంద్యం గురించి సూత్రీకరించాడు. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో అధికోత్పత్తికి చెందిన సంక్షోభాలు నిర్ణీత సమయాల్లో సంభవిస్తుంటాయి. కార్మికుల శ్రమ దోపిడీ రేటును పెంచే అధునాతన సాంకేతికతను పరిశ్రమల్లో ప్రవేశపెట్టడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది కాని అత్యధిక సంఖ్యలో కార్మికులు తొలగింపునకు గురై నిరుద్యోగులుగా మారుతారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కోరలు చాస్తున్నదా? సంక్షోభం గుప్పిట్లోకి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు చేరబోతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రబల డాలరు ఉరుములతో కుదేలవుతున్న అన్ని దేశాల కరెన్సీలు, చుక్కలనంటుతున్న ద్రవ్యోల్బణం, కరిగిపోతున్న పారెక్సు నిల్వలు, ఫలితంగా ఆర్థిక మాంద్యం మేఘాలు అన్ని దేశాలను కమ్ముకుంటున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రస్తుతం ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, వివిధ రేటింగ్‌ ఎజెన్సీలు, ఆర్థిక వేత్తలు ఆయా దేశాల వృద్ధి రేటును తగ్గిస్తున్నాయి. ద్రవ్యోల్బణం, అధిక ధరలు, నిరుద్యోగం అన్ని దేశాలను వెంటాడుతున్నది. ఇప్పుడు ఒక దేశమనేది లేదు, యావత్‌ ప్రపంచమే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రెండేళ్లు కొవిడ్‌లో కుదేలైన ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్న సమయంలోనే యుక్రెయిన్‌ – రష్యా యుద్ధం వచ్చింది. పర్యావసానంగా వెనుకబడిన దేశాలు, వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి.

అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం వల్ల నిరాశజనకమైన పరిస్థితులు, మరింత అనిశ్చితి నెలకొన్నాయని ‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఔట్‌ లుక్‌’ గత జూలైలో పేర్కొంది. ‘ప్రపంచ దేశాలు ఈ ఆర్థిక మందగమనాన్ని తప్పించుకోవడం కష్టం’ అని ప్రపంచ బ్యాంకు అధ్యకక్షుడు డేవిడ్‌ మల్ఫాస్‌ వ్యాఖ్యానించారంటే పరిస్థితుల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉత్పత్తి, ఉపాధి రంగాలు నీరుగారి పోతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలి పోతున్నాయి. డాలర్‌ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఫలితంగా ధరలు పెరుగుతున్నంత వేగంగా సామాన్యుల ఆదాయాలు పెరుగక పోవడంతో ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా క్షీణిస్తోంది. ఫలితంగా మార్కెట్‌ మందగిస్తోంది. దీంతో పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉంది.

అమెరికా డాలర్‌ ఆధిపత్యం :

ప్రపంచ వాణిజ్యంలో డాలర్‌ మార్పిడి విధానం ప్రపంచ కరెన్సీగా ఉన్నందున అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఇవాళ డాలర్‌ దెబ్బకు ప్రపంచ దేశాల కరెన్సీలు కుదేలవుతున్నాయి. అగ్ర రాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ పెలుసుగా కన్పిస్తున్నా, ఆ దేశ కరెన్సీ విలువ మాత్రం రోజు రోజుకు బలపడుతోంది. డాలర్‌ దెబ్బకు మన రూపాయితో పాటు ప్రపంచ దేశాల కరెన్సీలు విలవిలలాడుతున్నాయి. యూరో, పౌండు, యాన్‌ కూడ బక్కచిక్కాయి. అమెరికా డాలర్‌తో రూపాయి మారక విలువ అక్టోబర్‌ 19న రూ. 83.20కి పడిపోయింది. అమెరికా, పశ్చిమ దేశాలు ద్రవ్య విధానాన్ని అంచనాలకు మించి కఠినతరం చేస్తున్నందున ఆసియా ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నస్థితికి చేరుతుందని ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎడిబి) హెచ్చరించింది. రిస్క్‌ సంబంధిత దేశాల నుండి విదేశీ నిధులు వేగంగా తరలిపోతాయన్నారు.

1980ల నుంచి విరుచుకుపడిన ప్రతి ఆర్థిక సంక్షోభానికి సామ్రాజ్యవాద అమెరికా డాలర్‌ విలువ పెంచడం,  లేదా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచడం కారణంగా ఉంది. 1982లో లాటిన్‌ అమెరికా దేశాల్లో రుణ సంక్షోభం, 1994లో మెక్సికో రుణాల ఎగవేత, 1997లో తూర్పు ఆసియా దేశాల ఆర్థిక సంక్షోభం, 1998లో రష్యా రుణాలకు ఎగనామం, 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఇలా ప్రతి దాని వెనకా పైన చెప్పుకొన్న కారణమే ఉంది. ఈ ఏడాదీ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును రెండున్నర శాతం పెంచింది. ఫలితంగా డాలర్‌ విలువ 22 శాతం పెరిగింది. గడచిన కొన్ని నెలలుగా ప్రపంచమంతటా స్టాక్‌ మార్కెట్‌ మదుపరులు 32 లక్షల కోట్ల డాలర్ల మేర సంపద కోల్పోయారు. అందుకే అమెరికన్‌ ఆర్థికవేత్త పాల్‌ శామ్యూల్‌ సన్‌ ఏమన్నారంటే ‘అమెరికన్‌ డాలర్‌కున్న విపరీతమయిన డిమాండ్‌ వల్ల అమెరికా ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఫెడరల్‌ రిజర్వు బ్యాంకు ఎటువంటి డిఫాల్ట్‌ రిస్క్‌ లేకుండా అతి తక్కువ వడ్డీకి అమెరికన్‌ డాలర్లను ఇష్యూ చేయగలదు. వడ్డీరేటు మార్పులతో ప్రపంచ దేశాలలో డాలర్‌ సరఫరాని ప్రభావితం చేస్తోంది.

అమెరికా డాలర్‌ ఆధిపత్యానికి మూలాలు సౌది అరేబియాతో అమెరికా 1974 జూన్‌ 9న కుదుర్చుకున్న ఒప్పందంలో ఉన్నాయి. 1973లో ప్రపంచం చమురు సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పట్లాగానే ధరలు ఆకాశాన్నంటడంతో అమెరికా నుంచి జపాన్‌ దాక పెట్రో ఉత్పత్తుల రేట్లు గరిష్టానికి పెరిగాయి. దీంతో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన సౌదితో అమెరికా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో జరిపే చమురు వ్యాపారమైనా అమెరికా డాలర్ల రూపంలో చెల్లింపులు జరుగాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక పేమెంట్‌ను పెట్రో డాలర్‌గా వ్యవహరిస్తారు. క్రూడ్‌ను ఉత్పత్తి చేసే దేశాలేవైనా డాలర్లు ఇస్తేనే క్రూడ్‌ అమ్ముతాయి. గడిచిన 50 ఏళ్లుగా ఈ పెట్రో డాలర్‌ సిస్టమ్‌ ఎదురులేకుండా కొనసాగుతోంది.

అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఏ దేశమైనా సరే డాలర్లను కొనాల్సి రావడంతో రిజర్వ్‌ కరెన్సీగా ‘డాలర్‌’ ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా వాణిజ్యం జరిగేది క్రూడాయిల్‌లోనే కాబట్టే అరేబియా గల్ఫ్‌లో అమెరికా అన్ని యుద్ధాలు చేసింది. లిబియా (ముఅమ్మర్‌ గద్దాఫి), ఇరాక్‌ (సద్దామ్‌ హుసేన్‌), సిరియా (బషర్‌ అల్‌ అస్సాద్‌)లు పెట్రోడాలర్‌ పెత్తనానికి వ్యతిరేకంగా గొంతెత్తడం  వల్లే అమెరికా వాటిని నామరూపాల్లేకుండా బాంబులతో నేలమట్టం చేసింది. అయితే, ఇప్పటిదాకా పుతిన్‌లాంటోడు అమెరికాకు తగలకపోవడంతో దాని ఆటలు బాగానే సాగాయి. ఉక్రెయిన్‌ యుద్ధంతో ఇప్పుడు పుతిన్‌ పశ్చిమ దేశాలపై కరెన్సీ వార్‌కు సైతం తెరలేపారు. ఇవాళ ఏ వర్ధమాన దేశానికి డాలర్‌ ఆధిపత్యాన్ని, విదేశీ రుణాలను, ద్రవ్య పెట్టుబడులను నిరోధించే శక్తి లేదు. ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం, రిజర్వ్‌లో 65 శాతం, ఫారెక్స్‌ వ్యాపారంలో 90 శాతం అమెరికన్‌ డాలర్‌దే ఆధిపత్యం అన్నది గమనించాలి. అందువల్లనే ప్రపంచ మారక ద్రవ్యంగా డాలర్‌ చలామణి అవుతోంది.

రష్యాపై ఆంక్షల బ్యాక్‌ ఫైర్‌ :

ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా, పశ్చిమ దేశాలు రష్యా ఎగుమతులపై విధించిన ఆంక్షలతో ప్రపంచ దేశాల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లయింది. అగ్రరాజ్య అమెరికా కూటమి ఆడుతున్న ఆంక్షల గేమ్‌కు ప్రపంచ దేశాలు బలవుతోన్నాయి. అమెరికా రెచ్చగొట్టడంతో రష్యా క్రూడ్‌, గ్యాస్‌పై ఆంక్షలు విధించిన యూరప్‌ దేశాలు.. తమ గొయ్యి తామే తవ్వుకున్నాయి. వాస్తవానికి యూరప్‌ మొత్తం క్రూడ్‌, గ్యాస్‌ దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతం పైనే. జర్మనీ తదితర కొన్ని దేశాలైతే ఏకంగా 60-80 శాతం క్రూడ్‌-గ్యాస్‌ అవసరాలకు రష్యా పైనే అధారపడ్డాయి. అంతేకాదు రష్యా నుంచి నేరుగా పైపు లైన్ల (నార్డ్‌స్ట్రీమ్‌) ద్వారా యూరప్‌ మొత్తానికి సరఫరా వ్యవస్థ ఉండటంతో అత్యంత చౌకగా కూడా లభించేది. అయితే, రష్యాపై ఆంక్షలతో ఈ చౌక క్రూడ్‌, గ్యాస్‌కు చాలా దేశాలు నో చెప్పాయి. జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ వంటి కొన్ని దేశాలు ప్రత్యామ్నాయం లేక రష్యా రూబుల్స్‌లోనే చెల్లించి దిగుమతులు చేసుకుంటున్నాయి.

యూరప్‌పై ప్రతికారంగా నార్డ్‌స్ట్రీమ్‌ పైప్‌లైన్‌ నిర్వహణ, రిపేర్ల పేరుతో రష్యా గ్యాస్‌ ఎగుమతుల్లో దాదాపు సగానికి పైగా కోత పెట్టడంతో ఇప్పుడు యూరోపియన్‌ దేశాలు.. ముఖ్యంగా జర్మనీ గజగజలాడుతోంది. ఎందుకంటే యూరప్‌లో చలికాలం మొత్తం ఇళ్లలో వెచ్చదనం కోసం గ్యాస్‌ హీటర్లనే ఉపయోగిస్తారు. అంతేకాదు, యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో చాలా కంపెనీలు నడిచేది గ్యాస్‌తోనే. వీటికి గ్యాస్‌ సరఫరాలు తగ్గితే, మూతబడే పరిస్థితి నెలకొంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కెమికల్‌ కంపెనీ అయిన బిఎఎస్‌ఎఫ్‌.. తమకు గ్యాస్‌ కోత పెడితే ప్లాంట్‌ను మూసేయాల్సి వస్తుందని ఇప్పటికే సంకేతాలిచ్చింది. రష్యా చౌక గ్యాస్‌ను కాదని, అమెరికా నుంచి భారీ ధరకు యూరప్‌ దేశాలు దిగుమతి చేసుకుంటుండటం మరో విచిత్రం. ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న అమెరికా… యూరప్‌ దేశాలనూ ఆర్థికంగా కకావికలం చేస్తోందని అక్కడి ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు. ”అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం. కానీ మిత్రుడిగా ఉండటం ప్రాణాంతకం” అంటూ అమెరికా రాజనీతిజ్ఞుడు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ ఎ.కిసింజర్‌ చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద రష్యాపై ఎడాపెడా విధిస్తున్న ఆంక్షలు… బ్యాక్‌ఫైర్‌ కావడంతో పశ్చిమ దేశాలు గిలగిలా కొట్టుకుంటున్నాయి. భౌగోళిక రాజకీయాల్లో కూడ మార్పు చోటు చేసుకుంటున్నది.

ముంచుకొస్తున్న మాంద్యం :

ప్రపంచాన్ని మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. వచ్చే ఏడాదికల్లా ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసేలా కన్పిస్తోంది. కరోనా దెబ్బ నుంచి కోలుకోకముందే వచ్చిపడ్డ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం తదితరాలతో ఆర్థిక వృద్ధి క్రమంగా కుంటుపడుతూ ప్రధాన దేశాలన్నీ మాంద్యం వైపు అడుగులేస్తున్నాయి… ఈ ఏడాది చివరలో అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక మాంద్యం తప్పదని ప్రముఖ ఆర్థికవేత్త నౌరీల్‌ రౌబినీ  అంచనా వేస్తున్నారు. ఇది స్వల్పకాలిక మాంద్యంగా ఉండబోదని తీవ్రమైన సుదీర్ఘమైన మాంద్యంగా ఉంటుందని ఆయన అన్నారు. అమెరికాతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా తలెత్తే ఈ ఆర్థిక మాంద్యం 2023 సంవత్సరమంతా కొనసాగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రపంచం ఆర్థిక మాంద్యం బారిన పడటం ఖాయమని ప్లోరిడాకు చెందిన నెడ్‌ డేవిస్‌ రీసెర్చ్‌ చెబుతోంది. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ జూలైలో చేసిన సర్వేలో మాంద్యం తప్పదని 49 శాతం ఆర్థికవేత్తలు పేర్కొనగా అక్టోబర్‌లో వారి సంఖ్య 63 శాతానికి పెరిగింది. 12 నెలల్లోపే అమెరికా మాంద్యం కోరల్లో చిక్కడం ఖాయమని సర్వే తేల్చింది.

వర్ధమాన దేశాలపై ఇది సుదీర్ఘ ప్రభావమే చూపవచ్చని ప్రపంచ బ్యాంకు అధ్యకక్షుడు డేవిడ్‌ మల్ఫాస్‌ ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు. కరోనా, యుద్ధం, వాతావరణ విపరిణామాలు ప్రపంచాన్ని అంధకారంలోకి నెడుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి ఎండీ క్రిస్టలినా జార్జివా హెచ్చరించారు. చాలా దేశాల్లో జిడిపి వృద్ధిరేటు నానాటికీ పడిపోతోంది. 2022లో ప్రపంచ ఆర్థిక పురోగతి రేటు 6.1 శాతముంటే 2023 నాటికి ఏకంగా సగానికి సగం పడిపోయి 3.2 శాతానికి పరిమితం కావచ్చని ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. సంపన్న దేశాల ఆర్థిక వృద్ధి కూడా నేల చూపులే చూస్తోంది. యూరప్‌ జిడిపి 1.2 శాతానికి, బ్రిటన్‌ కేవలం 0.3, ఫ్రాన్స్‌ 0.7కు పరిమితం కావచ్చని అంచనా. సవరించిన వృద్ధి రేట్ల ప్రకారం చూసినా అమెరికా 1 శాతం, చైనా 3.2 శాతంతో సరిపెట్టుకునేలా ఉన్నాయి. 2016తో పోలిస్తే ప్రపంచ జిడిపి 2.3 శాతం పెరగాలన్నది అంచనా కాగా కరోనా, యుద్ధం తదితరాల దెబ్బకు 1.7 శాతానికే పరిమితమైంది. ఇలా పడిపోయిన ఉత్పాదకత విలువ ఏకంగా17 లక్షల కోట్ల డాలర్లు. అంటే ప్రపంచ ఆదాయంలో ఏకంగా 20 శాతం!

ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో విపరీతంగా పెరిగిపోయిన ధరలకు కళ్లెం వేసేందుకు ఈ ఏడాది ఏకంగా 90 దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేశాయి. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు కూడ వడ్డీ రేటు పెంచింది. ఈ దెబ్బకు ఉత్పాదకత తగ్గడంతో పెట్టుబడులు, వినియోగం పడిపోయి మాంద్యం ముంచుకొస్తోంది. ధరల అదుపు కోసమని పదేపదే వడ్డీ రేట్లు పెంచితే మాంద్యం బారిన పడక తప్పదని జార్జ్‌ వాషింగ్టన్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ పావ్‌లిన్‌ టియెన్‌ అన్నారు. అమెరికా ఫెడరల్‌ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపుతో 90 దేశాలు కరెన్సీ విలువలు పతనమయ్యాయి. గతేడాది 125.7గా ఉన్న ఆహారోత్పత్తుల ధరల సూచీ ఈ ఏడాది 146.94 పాయింట్లకు పెరిగింది. మాంద్యం దెబ్బకు ఐటి కంపెనీలు నియామకాలకు కత్తెర వేస్తున్నాయి. అమెరికాలో నిరుద్యోగిత వచ్చే డిసెంబర్‌ నాటికి 3.7 శాతానికి, 2023 జూన్‌కల్లా 4.7కు పెరుగుతుందని అంచనా.

భారత్‌ను ఆవరిస్తున్న మాంద్యం :

ప్రపంచ ఆర్థిక మందగమనం ఆయా దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీని ప్రభావం భారత పైనా చూపిస్తోంది. నిర్దేశించిన లక్ష్యాలను ప్రభావితం చేస్తున్నది. ప్రపంచ ఆర్థిక మందగమనం ప్రభావంతో భారత అధిక ఎగుమతి ప్రణాళికలపై దెబ్బ పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికే కొవిడ్‌, లాక్‌డౌన్‌ వంటి పరిస్థితులను ఎదుర్కొని ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్నాయనుకుంటున్న తరుణంలో ఆర్థిక మందగమనం రూపంలో మరో ఉపద్రవం ముంచుకొస్తున్నదని మోడీ సర్కారును హెచ్చరించారు. భారత్‌కు ముఖ్యమైన ఎగుమతి మార్కెట్లు యుఎస్‌, యూరప్‌ దేశాలు. అయితే, రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య యుద్ధం సదరు దేశాల పరిస్థితులను దిగజార్చాయి. రష్యా దేశంపై ఆంక్షలతో కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాలైతే ఎన్నడూ లేనంతగా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాయి.

చైనాకు భారత్‌ ఎగుమతులు 36 శాతం తగ్గుదలను చూశాయి. అలాగే, చైనా నుంచి భారత్‌ దిగుమతులు 29 శాతం పెరగటం గమనార్హం. మోడీ ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుందని ఆర్థిక, వాణిజ్య నిపుణులు హెచ్చరించారు. మన విదేశీ మారక నిల్వలు వరుసగా రెండు మాసాల నుంచి తిరోగమనంలో ఉన్నట్లు అక్టోబర్‌ 7న రిజర్వు బ్యాంకు పేర్కొంది. విదేశీ మారక నిల్వలు మూడు వారాల్లో 3.817 బిలియన్‌ డాలర్లు తగ్గి అక్టోబర్‌ 28 నాటికి 542.42 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. అక్టోబర్‌ మాసంలో 2.47 బిలియన్‌ డాలర్ల విలువైన బంగారం నిల్వలు క్షీణించి 37.2 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి.అమెరికాతో భారత వాణిజ్య లోటు 3.8 శాతానికి పెరుగుతుందని ఆర్‌బిఐ అంచనా వేసింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారక విలువ  బలహీనపడడం వల్ల భారత్‌లో సామాన్యుల పైనే భారం పడుతున్నది. ఎందుకంటే, ద్రవ్యోల్బణం పెరుగుతుండటం వల్ల వస్తువులు, సేవలకు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకునే వంటనూనె, పప్పు దినుసులకు ఎక్కువ ఖర్చు అవుతుంది.

అంతర్జాతీయ వ్యాపారంలో లావాదేవీలకు డాలర్లలోనే చెల్లిస్తుంటాం. దీనివల్ల సరఫరా జరిగేందుకు డాలర్ల రూపంలోనే చెల్లింపులు పూర్తి చేయాలి. రూపాయి బలహీనపడటం వల్ల అన్ని రకాల దిగుమతులకు ఎక్కువ డాలర్లు కట్టాల్సి వస్తుంది. దేశీయంగా పెట్రోలు, డిజిల్‌ ధరలు మరింత పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. ఇది ఆహార ధరలపైనా ప్రభావం చూపుతుంది. దీనిపై ఆధారపడిన అనేక పరిశ్రమలు దెబ్బతింటాయి. ఇంకా వేరే దేశాలకు పర్యటించాలనుకునే వారికి, విదేశాల్లో చదివే విద్యార్థులకు కూడా ఖర్చులు భారమవుతాయి. ప్రపంచ మందగమనం మనపై ప్రభావం చూపటం ప్రారంభించింది. ఒకటి, అధిక విలువ కలిగిన ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గటం ప్రారంభమైంది. రెండు, భారత్‌ భారీ పరిమాణంలో ఎగుమతి చేసే ముడి పదార్ధాలు, మధ్యవర్తుల ధరలు ఇటీవలి నెలల్లో బాగా పడిపోయాయి.

ప్రపంచ ఆర్థిక మందగమనం, ధరల పెరుగుదల, కరెన్సీ హెచ్చు తగ్గులు భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం  చేస్తోన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ద్రవ్యోల్బణం ఎగిసిపడుతోంటే… మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి పడకేస్తుందని స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత ఏడాది ఆగస్టులో భారత పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) మైనస్‌ 0.8 శాతానికి పడిపోయి. 18 మాసాల కనిష్ఠ స్థాయికి దిగజారింది. మైనింగ్‌, తయారీ ఉత్పత్తులు వరుసగా 3.9 శాతం, 0.7 శాతం చొప్పున తగ్గాయి. దేశంలో నమోదవుతున్న హెచ్చు ధరలు డిమాండ్‌ను దెబ్బతీస్తున్నాయి. దీంతో పారిశ్రామిక ఉత్పత్తుల అమ్మకాలు పడిపోవడంతో ఆ ప్రభావం తయారీ రంగంపై పడుతుంది.

వినియోగదారుల ద్రవ్యోల్బణం (సిసిఐ) 7.41 శాతానికి ఎగిసింది. తాజా గణాంకాలు ఆర్‌బిఐ విధాన పరపతిపై తీవ్ర ఒత్తిడిని పెంచనున్నాయి. దేశంలో ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలని… అంటే  4-6 శాతానికి మధ్య ఉండేలా ఆర్‌బిఐ లక్ష్యంగా పెట్టుకోగా.. కొన్ని నెలల నుంచి ఈ పరిమితి దాటి ద్రవ్యోల్బణం నమోదవుతుంది. ఇది ఆర్‌బిఐ, కేంద్రానికి ప్రధాన సవాల్‌గా మారింది. హెచ్చు ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఆర్‌బిఐ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 83  చేరువలో నమోదు కావడం… దిగుమతి ఉత్పత్తుల ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తోంది.

పెట్టుబడిదారీ విధానం – మార్కిస్టు అవగాహన :

పెట్టుబడిదారీ విధానంలోనే ఆరాచకం ఉంటుంది. మార్కెట్‌ ఆటు పోట్లు ఉంటాయి. రుణ వ్యవస్థ అలజడులకు గురవుతుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సంక్షోభాలు, మాంద్యాలు అనివార్యంగా చోటు చేసుకుంటాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో మాంద్యం, సంక్షోభం, పునరుజ్జీవనం, వికాసం అనే నాలుగు థలు ఒక క్రమంలో వస్తుంటాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలో సరుకులు లాభాల కొరకే ఉత్పత్తి చేస్తారు. ప్రజల అవసరాలు, ప్రయోజనాలు, కొనుగోలు శక్తి పెట్టుబడిదారుడు దృష్టిలో పెట్టుకోడు. ఉత్పత్తి పెరిగి మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గితే వెంటనే ఉత్పత్తి తగ్గిస్తాడు, కార్మికులను తొలగిస్తాడు. ప్రజల కొనుగోలు శక్తికంటే ఉత్పత్తి అయిన సరుకుల విలువ ఎక్కువగా ఉంటుంది. అంటే అవసరాల కంటే సరఫరా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఉత్పత్తి అయిన సరుకులు మొత్తం అమ్మకం కావు. ఫలితంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని కుదించాల్సి రావడాన్ని ఆర్థిక మాంద్యం అంటారు. మాంద్యం పెరిగితే వచ్చేది సంక్షోభం.

సంక్షోభం, మాంద్యం, పునరుజ్జీవనం, వికాసం అనే నాలుగు థలు పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో సహజమని, ఉత్పత్తి విధానంలో నిరుద్యోగాన్ని సవరించి, వనరుల వినియోగాన్ని పునర్‌ నిర్ధారించి అధికోత్పత్తిని సాధించడానికి జరిగే అనివార్య ప్రక్రియలని బూర్జువా అర్థశాస్త్రం బోధిస్తుంది. అంటే ఈ నాలుగు థల వలయంలో సంక్షోభం, మాంద్యంల పాత్ర కన్నా పునర్‌జ్జీవం, వికాసం పాత్ర ప్రధానమన్నట్లుగా, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం సంక్షోభాలను అధిగమిస్తున్నట్లుగా పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు ప్రవచిస్తుంటారు. సంక్షోభం వచ్చినప్పుడల్లా 1929 సంక్షోభాన్ని తట్టుకుని నిలిచినట్టు చెబుతారు. అదే సమయంలో సంక్షోభం చాయలే లేని సోవియట్‌ సోషలిస్టు ఆర్థిక వ్యవస్థ గురించి కూడ చర్చ వస్తోంది. అధికోత్పత్తి-అల్ప వినియోగం సంక్షోభానికి మూల కారణంగా మార్క్సిస్టు ఆర్థికవేత్తలు సూత్రీకరించారు. అలాగే ఉత్పత్తి శాఖల (ప్రథమ, ద్వితీయ, తృతీయ) మధ్య అసమతౌల్యత వల్ల కూడ సంక్షోభాలు సంభవిస్తాయని విశ్లేషించారు.

పెట్టుబడిదారీ విధానంలో సరుకుల ఉత్పత్తి ప్రజల అవసరాలకు అనుగుణంగా కాక, పెట్టుబడిదారుల లాభాపేక్ష ప్రాతిపదికగా జరుగుతుంది. సమీకృతమైన ప్రపంచీకరణ గావించబడిన ఉత్పత్తి, అవసరానికి మించిన ఉత్పత్తి, ఉత్పత్తికి తగ్గట్టుగా వినియోగం జరుగకపోవడం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో ప్రధానమైన వైరుధ్యంగా ఉంటుంది. అంటే, ఉత్పత్తి ప్రక్రియ ఎంతగా సామాజికంగా మారుతుందో, ఉత్పత్తి సాధనాలు, ఫలితాలు అంతగా వ్యక్తిగత ఆస్తిగా మారుతాయి. సంపద పెరుగుదల ఎంత పెద్ద ఎత్తున సాగుతుందో, పేదరికం కూడ అంతే ఎక్కువగా విస్తరిస్తుంది. యంత్రాల వాడకం ఎంతగా పెరుగుతుందో అంతగా నిరుద్యోగం విస్తరిస్తుంది. ఇటువంటి అనేక మౌలిక వైరుధ్యాల వల్లనే, పెట్టుబడిదారీ విధానంలో ఒక పక్క అధికోత్పత్తి మరొక పక్క అల్పవినియోగం కొనసాగుతాయి.

పెట్టుబడిదారులకు లాభాలు శ్రామికుల శ్రమ దోపిడీ వల్ల వస్తుంది కనుక, ప్రతి సంక్షోభ సమయంలో యంత్రాల వాడకం, సాంకేతికను జోడించడం చేస్తారు. అంటే యాంత్రీకరణకు పూనుకుంటారు. దీంతో నిరుద్యోగం పెరుగుతుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం, స్వభావంలోనే దోపిడీతత్వం నిబిడికృతమై ఉన్నందున ఉపశమనాలు సంక్షోభాలను పరిష్కరించలేవు. కాకపోతే ఈసారి ఏర్పడిన సంక్షోభాన్ని ఎంతో కొంత తగ్గించవచ్చు. మళ్లీ మరింత పెద్ద సంక్షోభం వస్తుంది. అప్పుడు ఈ మందు కూడ పనిచేయదు. పెట్టుబడిదారీ స్వభావమే సంక్షోభానికి కారణమైనప్పుడు, ఆ స్వభావాన్ని యధాతథంగా ఉంచి, పైపై పూతలు, మెరుగులు, సంస్కరణలు, చిట్కా మంత్రాలు ఎన్నిటితోనైనా ఆ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు. 

ముగింపు :

పాలక వర్గాలు సామ్రాజ్యవాద దోపిడీకి, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి దాసోహం చేస్తోన్నారు. విదేశీ, స్వదేశీ శక్తుల దోపిడీ, పీడన, ఆధిపత్యం అంతం కాకుండా ప్రజలకు విముక్తి దొరకదు, దున్నే వారికి భూమి హక్కు దఖలు పడదు. ప్రజల ఆదాయాలు, కొనుగోలు శక్తి పెరుగకుండా పారిశ్రామిక అభివృద్ధి జరుగదు. ప్రపంచమంతా అన్ని దేశాలలో పాలక వర్గాలు ప్రతీపశక్తులకే సేవ చేస్తున్నాయి. అందువల్ల సంక్షోభాలను కొనసాగిస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నారు. ఆర్థిక మాంద్యం, సంక్షోభం పెట్టుబడిదారీ విధానానికి సహజమైన, స్వభావికమైన ప్రతిఫలణాలు గనుక వీటి అంతిమ పరిష్కారం పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాన్ని అంటే ఇవాళ సామ్రాజ్యవాదాన్ని, దాని వ్యక్తీకరణలైన బహుళ జాతి సంస్థలను కూలదోయడంలో మాత్రమే ఉంటుంది. ఆ అంతిమ పరిష్కారం దిశగా ప్రజా చైతన్యాన్ని మేల్కొల్పడం, ప్రజా సమీకరణ జరపడం, ఒక సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించడం మాత్రమే ఆర్థిక సంక్షోభానికి నిజమైన ప్రజా స్పందన అవుతుంది. భారత్‌లో ఈ పోరాటాన్ని భూస్వామ్య వ్యతిరేకతతో జోడించని సామ్రాజ్యవాద వ్యతిరేకతకు అర్థం లేదు. భూస్వామ్య వ్యక్తీకరణలైన కులం, పురుషాధిక్యత, మతతత్వాల మీద, ప్రధాన ఉత్పత్తి వనరైన భూమిని, మొత్తంగా సమాజాన్ని, సంస్కృతిని భూస్వామ్య బంధనాల నుంచి విడిపించడం మీద పోరాటాన్ని ఎక్కు పెట్టాలి. 

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply