‘ఎత్తినాం విరసం జెండా’ పాట బతికున్నంతకాలం మూడు దశాబ్దాలపాటు చలసాని ప్రసాద్ నోటనే విన్న విరసం అభిమానులకు ఆ పాట రెండు దశాబ్దాల పాటు విరసం ప్రకాశం జిల్లా యూనిట్లో సభ్యుడు, కవి, నాటక కర్త, నాటక ప్రయోక్త, గాయకుడు అయిన రుద్రజ్వాల (వెలుగు వెంకట సుబ్బారావు) రాశాడని తెలియకపోవచ్చు. ఆ పాట 1978 చీరాల విరసం మహాసభల కాలం నుంచి కూడా ప్రతి విరసం మహాసభలోను, సాహిత్య పాఠశాలల్లోనూ విరసం జెండా ఆవిష్కరణ తర్వాత పాడుతుంటారు.
విరసం ఆవిర్భావ కాలం కన్నా, ఏడు, ఎనిమిది, తొమ్మిది దశాబ్దాల కన్నా గత రెండు దశాబ్దాలుగా 21వ శతాబ్దంలో బహుశా వందల సంఖ్యలో వెలువడిన విరసం సంస్థ ప్రచురణలు, విరసం సభ్యుల పుస్తకాల మీద, ముఖ్యంగా ముప్పై ఏళ్లకు పైగా వెలువడుతున్న విరసం సాహిత్య పత్రిక ‘అరుణతార’, వెబ్ మ్యాగజైన్లు విరసం.ఆర్గ్ వంటి ఎన్నో విరసం వ్యక్తీకరణల్లో తన ముద్రను ప్రకటించే విరసం లోగో వేసింది ఇటీవల తన 75వ ఏట మరణించిన ఆర్టిస్టు చంద్ర అని తెలియకపోవచ్చు. గత శతాబ్ది, రెండు తొలి దశాబ్దాలు, ముఖ్యంగా తొలి దశాబ్దామంతా ఆయన విరసం కార్యవర్గంలోనూ, ఏకైక చిత్రకారుడుగా విరసం నాయకత్వంలోను కూడ వున్నాడని తెలియక పోవచ్చు.
ఆయన తండ్రి నాటికి ఆయన గ్రామం కేసముద్రం అయినా, ఆయన తండ్రి చేనేత కార్మికుడుగా ఆజంజాహీ మిల్లులో చేరి వరంగల్లో ఉంటున్న రోజుల్లో చంద్ర పుట్టాడు. చంద్ర బాల్యం వరంగల్లోనే గడిచింది. ఆజంజాహీ మిల్లులో యంత్రంపై నేతలో కూడా నైపుణ్యం పొందినాక ఆయన తండ్రి హైదరాబాదులో అప్కోలో పదోన్నతిలో చేరాడు. చంద్ర నవయవ్వనం అక్కడ ప్రారంభమైంది. జులై 4న విరసం ఏర్పడి అక్టోబర్లో ఖమ్మం పాణిగ్రాహినగర్లో మహాసభలు జరుపుకున్న మధ్యకాలంలో విరసం నాయకత్వం అంతటితోటీ ఆయనకు అనుబంధం ఏర్పడింది. అంతకు ముందే దిగంబర కవులు, వారిలోనూ ఇంచుమించు సమవయస్కుడైన, చంద్రకన్నా రెండేళ్లు పెద్ద చెరబండరాజుతోనూ, శ్రీపతితోనూ, వరంగల్‌లో ‘తిరగబడు’కవులతోనూ చంద్రకు స్నేహమనదగిన పరిచయం, అనుబంధం వుంది. హైదరాబాదులో దిగంబరకవులు, నక్సల్బరీలతో సాహిత్య, రాజకీయ ఉత్తేజం పొందిన సాహిత్య జీవులకు, బుద్ధిజీవులకు ఎక్కువగా నారాయణగూడ ఆర్‌బివిఆర్ కాలేజీ ఎదురు సందులో వీరశైవ హాస్టల్ పక్కన వుండే శ్రీపతి ఒక కూడలిగా ఉండేవాడు. పాత నగరం వెంకట్రావు మెమోరియల్ హైస్కూల్లో పని చేసేవాడు. సృజనకు హైదరాబాదులో అప్రకటిత పంపిణీదారు, చలం సంచిక తర్వాత ‘సాహితీమిత్రుల’కు హైదరాబాదు చిరునామాగా ఉండేవాడు. దిగంబర కవులు మూడవ సంపుటి, తిరుగబడుకవులు వెలువడినాక తర్వాత కర్తవ్యం ఏమిటి, కలిసి నక్సల్బరీ వెలుగులో చేపట్టదగిన సాహిత్య, సాంస్కృతికోద్యమం రూపు రేఖలు ఎలా ఉండాలి అనే చర్చలక్కడ సాగేవి. బహుశా ఒక కారణం శ్రీపతి స్వయంగా శ్రీకాకుళం జిల్లా వాడు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్‌లో కథకుడు భూషణం, ఉపాధ్యాయులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, రమణమూర్తిలతో కొంత కాలం పనిచేసి అరవైల తృతీయార్ధంలో ఉద్యోగార్ధం హైదరాబాదుకు వచ్చాడు. పాణిగ్రాహి పాటలు పరిచయం చేసి, శ్రీకాకుళ ఉద్యమం గురించి జనం, నర్తోడు వంటి కథలు రాశాడు.
అదే రోజుల్లో హైదరాబాదు సికిందరాబాదు రోడ్డు మీద దీపక్ మహల్ ఎదురు సందులో, ఆర్‌విబిఆర్ మహిళా కళాశాల కాంపౌండును ఆ సందును విభజించే రోడ్డుకు ఇటు పక్కన చివరి ఇంట్లో చంద్ర తన తలితండ్రులతో, కుటుంబంతో వుండేవాడు. అంటే శ్రీపతి ఇంటికి నాలుగడుగుల దూరంలో, ఆ ఇంటి పక్కనే ‘ఊరుమ్మడి బతుకులు’ కథ, నాటకం, సినిమా ద్వారా ప్రసిద్ధుడైన నాటకకర్త, ప్రయోక్త సి.ఎస్.రావు వుండేవాడు. ఆకాశవాణిలో వార్తలు చదివే, కథకుడు, డి.వెంకట్రామయ్య అక్కడే కలిసేవాడు. కథకుడు వి.రాజా రామమోహనరావు అక్కడికి వచ్చేవాడు.ఈ యువ రచయితల్లో ఆ సందులో అంటే చంద్ర ఇంటికి ఎదురుగా కొంచెం ఎడంగా ఆకాశవాణిలో పని చేసే సుప్రసిద్ధ కథా, నవలా రచయిత, మేధావి, తత్వవేత్త, త్రిపురనేని గోపీచంద్ వుండేవాడు. ఆయన కొడుకు డాక్టర్ రమేశ్ గాంధీ వైద్యకళాశాల సీనియర్ విద్యార్థి, మార్క్సిస్టు. చంద్ర కన్నా వయసులో పెద్దవాడు.స్నేహితులుగా చంద్ర వయసుగల అందరి పైనా రమేశ్ ప్రభావం వుండేది. కవులు, కథకులు, రచయితలే కాకుండా శ్రీపతి, చంద్ర దగ్గర కలిసే సాహిత్య కళాజీవుల్లో ఆల్వాల్ నుంచి వచ్చే ఆర్ట్ లవర్స్ బి. నరసింగరావు ఉండేవాడు. ఫైన్ ఆర్ట్స్ కాలేజీ విద్యార్ధులుగా చంద్ర, మనోహర్ దత్, నర్సింగరావులు అదే వరుసలో చిత్రకారులు, చంద్ర దగ్గరికి తరచూ వెళ్ళేవాళ్లలో చెరబండరాజు ఒకడు.
జులైలో విరసం ఏర్పడి అక్టోబర్‌లో ఖమ్మంలో సభలు తలపెట్టడానికి ముందు మూడు నెలల సంరంభంలో, ఏర్పాట్లలో శ్రీపతి, చంద్ర, సి ఎస్ రావులు తలమునకలుగా పాల్గొన్నారు. వీరిలో విరసం గురించిన చిత్రకళా ప్రదర్శన కార్యభారమంతా చంద్ర మీద పడింది. చంద్ర ఆయనే చెప్పుకున్నట్లు గండ్రగొడ్డలి వంటి కుంచెతోనే పుట్టి వుంటాడు. దళిత, వృత్తి కులాల నుంచి వచ్చినవాళ్లు (చాకలి, మంగలి, కమ్మరి, కంసాలి, కుమ్మరి, వడ్రంగి, పద్మశాలి) కళాకారులు కావడం విశేషం కాదు. చెరబండరాజు అన్నట్లు ‘నరాలే పేగులుగా’ బట్టలు నేసే కుటుంబం నుంచి వచ్చిన చంద్ర చిత్రకారుడుగా మాత్రం బాపు అక్షరంతో, బాపు బొమ్మతో ప్రభావితుడైన చంద్ర ఆర్టిస్టు చంద్రగా లబ్ది ప్రతిష్ఠుడు కావడానికి పనిచేసిన వర్క్‌షాప్ మాత్రం విరసం అనే చెప్పాలి.
ఖమ్మం వర్తక సంఘం హాలుకు పాణిగ్రాహినగర్ అని పేరు పెట్టి సభలు జరిపిన రెండు రోజులు ఆ హాల్లో చంద్ర చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి ప్రేరణ మాత్రం ఈ మహాసభలకు నువ్వు బొమ్మలు వేయాలని ఆయనను చెరబండరాజు ఆదేశించడమే. ముందుగా విరసం లోగో వెయ్యి, అట్లాగే పాణిగ్రాహి బొమ్మ వెయ్యి అని చెర చెప్పనక్కర లేకుండానే జులై 4న జరిగిన నిర్ణయం ప్రకారం సుత్తీ కొడవలితో కలం అనే శ్రీశ్రీ ఆలోచననే (‘సుత్తీ కొడవలి తోకలం కాదు’ అనే శ్రీశ్రీ హెచ్చరిక చంద్ర జీవితమంతా గుర్తు పెట్టుకున్నాడు) విరసం లోగోగా వేసాడు. అభ్యుదయ వేదికను బహిష్కరించి, కాలం చెల్లిన అరసం నిర్మాణం నుంచి, భావాల నుంచి బయటకు వచ్చి నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలను బలపరచే రచయితల సంఘం పేరు పెట్టాలనుకున్నపుడు పేరు విషయంలో శ్రీశ్రీ లావా (లాక్షణికవాద)రసం (రచయితల సంఘం) దృక్పథం పై చర్చ కాసేపు సాగవచ్చు. సుత్తీకొడవలితో కలం మాట వినగానే చంద్ర మనసులో తలపుకు వచ్చిన బొమ్మ క్షణాలలో కాగితం మీదికి దిగింది. అట్లే జముకు వాయిస్తున్న సుబ్బారావు పాణిగ్రాహి బొమ్మ పైజామా-జుబ్బా మీద వున్న కళాకారుడు. అప్పటికే 1969 డిసెంబర్ 21 న రంగమటియా కొండల్లో అమరుడైన ‘ఒక చేత పెన్ను, ఒక చేత గన్ను పట్టిన’ పోరాట యోధుడు.
ఇంకా – భవిష్యత్ సూచనగా అన్నట్లు తన సృజనాత్మక బొమ్మలెన్నో స్కెచ్‍లు వేసుకొని ఆ తర్వాత ఆర్ట్ పేపర్స్ పైన కుంచెతో, ఇండియన్ ఇంక్‍తో వేసి తానే అన్నిటికి ఫ్రేములు రూపొందించి ఖమ్మం తీసుకు వచ్చాడు. ఖమ్మం, శ్రీకాకుళ ఆదివాసీ రైతాంగ పోరాట సహాయార్ధం, సంఘీభావం కోసం ఆంధ్ర దేశమంతా తిరుగుతూ అజ్ఞాత జీవితానికి వెళ్ళే ముందు పాణిగ్రాహి ఆఖరున వచ్చిన పట్టణం. 1967 అక్టోబర్ 31న మొండెంఖల్లు గిరిజన మహాసభకు వెళ్తున్న ఆదివాసీలు కోరన్న, మంగన్నలను లేవిడి దగ్గర చంపిన సందర్భంగా అక్టోబర్ 31 జముకుల కథ చెప్తూ పాణిగ్రాహి సుడిగాలివాలె తిరిగిన ఆఖరి మజిలీ.
ఖమ్మంలో శ్రీకాకుళ ఉద్యమానికి సంఘీభావ పర్యటన జరిపిన పాణిగ్రాహిని చూసినవాళ్లు, పాణిగ్రాహినగర్‌లో విరసం సభలను చూసినవాళ్లు, ఆ తరం వాళ్ళు, ఆ విరసం ప్రథమ మహాసభలకు హాజరైన వాళ్ళు వర్తక సంఘం హాలును పాణిగ్రాహినగర్‌గానే గుర్తుపెట్టుకుంటారు. ఆ ఆవరణను ఏభై ఏళ్ల కిందటి ఆ ఉత్తేజంతోనే గుర్తు చేసుకుంటారు. ఇపుడు హైదరాబాదు నగరంలో ఆర్ట్ గ్యాలరీలలో చిత్రకారుల ప్రదర్శన వలె కాకుండా పాణిగ్రాహి నగర్ హాల్లో చంద్ర బొమ్మలను ఒక చిత్రకారుడు వేసిన బొమ్మల వలె కాకుండా ఒక ఉద్యమ సంకేతాలుగా, ప్రతీకలుగా, ఒరిగిన పోరాట యోధుల చేతి నుంచి ఒక కాగడాను అందుకుంటున్న సాంస్కృతిక సంచలనంగానే చూశారు. ఆ సంచలనంలో ఆ నాటి విరసం సంస్థాపక ప్రముఖ రచయితలతో పాటు, శ్రీ శ్రీ, కొకు, రావిశాస్త్రి, కెవిఆర్, కృష్ణాబాయి, చలసాని, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, నగ్నముని, చెరబండరాజు, తిరుగబడు కవులు, ఎంటి ఖాన్, నాజర్, సి.విజయలక్ష్మితో పాటు వారందరిలో చిన్నవాడైన ఒక ఆర్టిస్టు చంద్ర అనే ఒక చిత్రకారుడున్నాడనుకోవడం ఈ తరానికి చంద్రను ఒక కొత్త కోణంలో చూడడమవుతుంది. ఆ సభల్లోనే వెలువడి 70 అక్టోబర్-71 మార్చి మధ్యన మూడుసార్లు అచ్చయిన ‘ఝంఝ’ విరసం కవితా సంకలనానికి రెండు అక్షరాలు, కవర్ డిజైన్ చంద్ర అని, కొ.కు. సంపాదకత్వంలో వెలువడిన ‘ఇపుడు వీస్తున్న గాలి’ కథా సంపుటికి కవర్ డిజైన్ చంద్ర అని చెప్పనక్కర్లేదు కదా. ఆ రెండు కవిత, కథా సంకలనాలు నిషేధానికి గురయినవి. తద్వారా ఎమర్జెన్సీ దాకా, తిరిగి ఎనభై అయిదు దాకా ఒక దశాబ్దన్నర పాటు చంద్ర అక్షరాలు, ముఖ చిత్రాలు, కవర్ డిజైన్ లేకుండా విరసం సంస్థ గానీ, విడిగా సభ్యులు గానీ పుస్తకాలు తేలేదు. ఇంక సృజనకయితే చంద్ర కవర్ డిజైన్లే కాదు, ఆ రోజుల్లో వాటిని బ్లాక్‌లు చేయించే బాధ్యతకూడా చేపట్టాడు. ప్రతి సభకు, అంటే ప్రతి ఏటా, ఒక కొత్త కవితా సంకలనంతో వచ్చే చెరబండరాజు ప్రతి కవితా సంకలనం చంద్ర కవర్ డిజైన్ చేయవలసిందే. అక్షరాలు రాయవలసిందే.
శ్రీకాకుళ ఉద్యమంలో 370 మంది విప్లవకారులు, సానుభూతిపరులు, ప్రజలు అమరులైనారు. వారందరి జీవిత చరిత్రలు సాధ్యమైనంత మేరకు, అట్లాగే ఫోటోలు కూడా కాలికి బలపం కట్టుకొని సేకరించి ఒక రైతాంగ కార్యకర్త రాసిన ‘అమరవీరుల జీవిత చరిత్ర’లో ఆ ఫోటోల ఆధారంగా బొమ్మలు వేసినవాడు…విరసం, సృజన సంచికలకు, అరుణతారలకు అమరవీరుల బొమ్మలు వేసినవాడు చంద్ర. ఆ పుస్తకాన్ని ఎడిట్ చేసి ముద్రించే బాధ్యత చెరబండరాజు చేతిలో పెట్టిన రైతాంగ కార్యకర్త, విప్లవ నాయకుడు కొల్లా వెంకయ్య. పాణిగ్రాహి మాత్రమే కాదు, సత్యం, కైలాసం, పంచాది కృష్ణమూర్తి, నిర్మల, చాగంటి భాస్కరరావు, తామాడ చినబాబు వంటి ఎందరెందరో అమర విప్లవకారులు చంద్ర రేఖల్లో, స్కెచ్‍లలో జీవం పోసుకున్నారు. ఇవ్వాళ మనకు లభ్యమయ్యే శ్రీకాకుళ అమరుల చిత్రాలన్నీ చంద్ర కళానుకరణలే.
ఎమర్జెన్సీ నిర్బంధాన్ని కూడ తట్టుకొని హైదరాబాదులో 1980లో విరసం మహాసభల దాకా చంద్ర విరసంలో క్రియాశీలంగా వున్నాడు. అప్పటికి చెరబండరాజు విపరీతమైన అల్సర్, తలనొప్పి బాధలకు బ్రెయిన్ ట్యూమర్ కారణమని బయటపడింది. 1981, 82లలో రెండుసార్లు, రెండోసారి పధ్నాలుగు గంటలపాటు ఆపరేషన్ చేసారు ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్ రాజారెడ్డి గారు. అపుడు చెరబండరాజు రాసిన రెండు నవలలలో (‘మా పల్లె’ మొదటిది) ‘ప్రస్థానం’ ను చెరబండరాజు డాక్టర్ రాజారెడ్డిగారికి అంకితం చేశాడు. రెండు పుస్తకాల ముఖచిత్రాలు చంద్రవే.
రెండవసారి ఆపరేషన్ తర్వాత చెరబండరాజు ఆరునెలల పాటు కోమాలోనే వున్నాడు. స్పృహతో ఉన్నప్పుడు ఆయన ఉత్తరాల్లో రాసినట్లు చెరబండరాజు, ఏడాదిపాటు సికిందరాబాదు గాంధీ రోగ నిలయం (గాంధీ ఆసుపత్రి)లో ఉన్నాడు. విరసం ఆయన ఆరోగ్యం గురించి, కుటుంబం గురించి ప్రజలకు సహాయనిధి కోసం విజ్ఞప్తి చేసింది. ఆ ప్రచారానికి చంద్ర తన నెత్తుటి కన్నీళ్ళతో చెరబండరాజు పోర్ట్రైట్ రంగుల్లో స్కెచ్ లు చేశాడు. రేఖా చిత్రాలు వేశాడు. 1982 జులై 2న చెరబండరాజు అమరుడయ్యాక జరిగిన ఎన్నో సంస్మరణ సభలు ఆ చిత్రం లేకుండా జరిగేవి కావు. చాలా కాలం దాకా రామంతపుర్ లోని ఆయన ఇంట్లో శ్యామల ఆ చిత్రాన్ని భద్రంగా చూసుకున్నది. కానీ తర్వాత కాలంలో సభలకు తీసుకువెళ్లే సందర్భాల్లో, పోలీసుల దాడుల్లో ఆ చిత్రమే కాదు విరసంకు చంద్ర బోర్డులు కట్టిచ్చి ఇచ్చిన ఖమ్మం సభల చిత్రాలు అన్నీ కూడా పోయాయి. చంద్ర వేసిన చిత్రాల్లో ఆయన హృదయానికి దగ్గరివై, అవి ఎవరి దగ్గరా మిగలనందుకు ఆయన అప్పటి స్నేహితులు ఎవరు కలిసినా తన ఆవేదనను పంచుకునేవాడు. ఆ తర్వాత వంతెన కింద చాలా నీరు, నెత్తురు, ఇండియన్ ఇంక్‌తో రంగులు కలగలసి పోయాయి. ఇంకిపోయాయి.
నిర్ధిష్టంగా చెప్పాలంటే 1985 ఆటా మాటా పాట బంద్ నాటికి చంద్ర విరసం నిర్మాణంలో లేడు. అయితే ఆయన విరసంకు రాజీనామా యివ్వడమో, విరసం ఆశయాలతో విభేదించడమో చేసిన దాఖలాలు ఏమీ లేవు గానీ ఆయన ఆర్టిస్టు చంద్రగా చాలా విశాలమైన కాన్వాసులోకి వెళ్లిపోయాడు.
ఫ్రీ లాన్స్ ఆర్టిస్టుగా వేలకొద్దీ బొమ్మలు వేస్తూ, సినిమాలకు ఆర్ట్ వర్క్ చేస్తూ చంద్ర స్వయంగా ఒక సంస్థ అయ్యాడు.
1975 అనంతపురం విరసం మహాసభల దాకా విరసం హైదరాబాదు యూనిట్ సభలు, సి ఎస్ రావు ఇల్లు చాలా విశాలంగా ఉండేది గనుక అక్కడ జరిగేవి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం ఎ చేస్తున్న గోపు లింగారెడ్డి కన్వీనర్. జమ్మికుంట కాలేజీ నుంచి ‘విద్యుల్లత’ పత్రిక నిర్వహించిన భాగ్యనగర్ విజయకుమార్, ఉమ్మెంతల వెంకటరెడ్డిలతో పాటు లింగారెడ్డి ఉన్నాడు. యూనిట్ ప్రారంభం కావడానికి ముందు, నారాయణగూడ ఇరానీ కేఫ్‌లో చా తాగినాక సభ్యులు మాట్లాడుకోవడానికి వెళ్ళే స్థలం మాత్రం నారాయణగూడలోని ఆయన ఇంట్లో చంద్ర గది.
కొల్లిపర నరసింహారావును మానుకోట అడవుల్లో ఎన్‌కౌంటర్ చేసి చంపిన పోలీసులు ఈ గది మీదనే మర్నాడు తెలవారకుండానే రెయిడ్ చేశారు హైదరాబాదు నగరంలో మరికొందరి ఇండ్లతో పాటు. అమరుని డైరీలో అప్పటి సిపిఐ ఎం.ఎల్ నాయకుడు కె.జి సత్యమూర్తికి సంబంధించిన ఏవో వివరాలు ఉన్నాయని అతడు ఎస్.ఎం యేనని ప్రకటించి ఆ అనుమాన నివృత్తి కోసం ఆ దాడులు చేశారు. ఆ గదిలో అంతకుముందటి రాత్రి కేసముద్రం నుంచి వచ్చిన చంద్ర బాల్య స్నేహితులు కొందరు నిద్ర పోతున్నారు. మనుషుల అలికిడికి చంద్ర లేచాడు. మఫ్టీలో వున్న పోలీసులు ‘కే సముద్రం నుంచి మీ యింటికి నిన్న ఎవరైనా వచ్చారా’ అని అడిగారు. ‘వీళ్ళంతా వాళ్ళే’ అన్నాడు చంద్ర. ‘వారిలో సత్యమూర్తి ఉన్నాడా?’ అని అడిగారు.‘వాడు ఇప్పుడే లేచిపోయాడు’ అన్నాడు చంద్ర. ‘వాడంటావేమిటి? వాడు పెద్ద నక్సలైటు నాయకుడు. వాడెట్లా నీ స్నేహితుడు?’ అని గద్దించారు. ‘వాడు ఆర్టిస్టు. నా మిత్రుడు. అతడు ఖైరతాబాదులో వుంటాడు’ అని చెప్పాడు. ‘మాతో పరిహాసాలాడుతున్నావా? మేం నక్సలైటు నాయకుడు సత్యమూర్తి గురించి అడుగుతున్నాం’ అన్నారు. ‘నిజంగా నా మిత్రుడు సత్యమూర్తి గురించి చెప్తున్నా’ అన్నాడు చంద్ర. ఆయన పుస్తకాల బీరువా నిండా చంద్ర కవర్ బొమ్మలు వేసిన పుస్తకాలు ఒక అరలో, ఆతనే కవర్ డిజైన్ చేసి అక్షరాలు రాసిన విరసం ప్రచురణలు ఒక అరలో వున్నాయి. అతడు చెప్తున్న తీరులో భయం, తొట్రుపాటు కనిపించడం లేదు. నిజాయితీ, అమాయకత్వం కనిపిస్తున్నాయి. మళ్ళీ ఒకసారి ఆయన మిత్రుడు ఆర్టిస్టు సత్యమూర్తి వివరాలు తెలుసుకొని వెళ్ళిపోయారు. అప్పటికే ఆయన మిత్రులు లేచారు.
2013 నవంబరులో విరసం సంస్థ వ్యవస్థాపక సభ్యురాలు టి. కృష్ణాబాయి (కృష్ణక్క) అప్పటి దాకా రాసిన, లభ్యమైన రచనలన్నీ సేకరించి ఒక సమగ్ర సంకలనంగా ‘సాహిత్య సమాలోచన’ పేరుతో ప్రచురించింది. ఆ పుస్తకానికి కృష్ణక్క కోరి చంద్రతో అక్షరాలు రాయించి కవర్ డిజైన్ చేయించింది. సుందరయ్య విజ్ఞాన భవన్‌లో జరిగిన ఆవిష్కరణ సభలో చంద్ర కూడా పాల్గొన్నాడు. ఆయన తనకు విరసం స్థాపన కాలం నుంచి వున్న అనుబంధాన్నీ, స్నేహాలనూ తలచుకుంటూ మళ్ళీ ఒకసారి శ్రీశ్రీ సుత్తీ – కొడవలితో – కలం (తోకలం కాదు) సందర్భాన్ని, అది లోగో అయిన చారిత్రకతను స్మరించుకున్నాడు. బహుశా అదే ఆయన పాల్గొన్న ఆఖరి విరసం సభ.
చంద్ర గారి పరిచయం బావుంది
Thanks for remembering legendary personality SriChandra
సాక్షి గారికి ధన్యవాదాలు, గతచరిత్రను ఒక పాఠంగా చెప్పారు. వరంగల్ జిల్లా నుండి మరొక అద్భుతమైన చిత్రకారుడు ఉండటం చాలా సంతోషం అనిపించింది. అభినందనలు సాక్షి గారు…