అతని చరిత్రెప్పుడూ
ఓ దుఃఖ సముద్రమే …!
అతని గురించి చెప్పాలనుకొని
నా లోలోతుల్లోని భావాలను
తవ్వి తీయాలనుకుంటాను !
కానీ…
అక్షరాలు,పదాలు,వాక్యాలు ఏవీ సరిపోవు
ఓపికకు రూపమైన అతని తలరాత
అరచేతిలోని ఓ వంకర గీతలా ఉంటుంది.
రాత్రి దుప్పటిని కప్పుకున్న సూర్యునికి
అతనొక అలారంగా మారుతుంటాడు.
చిన్నబోయిన మట్టి రేణువులను
అతని పాదస్పర్శతో నవ్విస్తుంటాడు.
కండ్ల నిండా…
గుండెల నిండా…
ఎడారులు మొలిచినప్పటికీ
ఆకుపచ్చని పువ్వుగా పూస్తుంటాడు
అతని వెన్ను నెలవంకైపోతున్నప్పటికీ
ముఖములో పూర్ణ చంద్రున్నే చూపెడుతుంటాడు.
ఆశల కావడిని భుజాలపై మోస్తు
రేపటి కోసం ఈ రోజు చస్తూ పుడుతుంటాడు
ఆకలి కడుపుతో రాజ్యానికి తిండిగా మారి
ఆరోవేలిగా మిగిలిపోతుంటాడు.