ఆరు త‌ప్పులు

“కొంచెపు ముండా… ”

”ఏదైనా మీ ఊర్ల జరిగిన కథ జెప్పు బాలరాజు” అంటే రచయిత్రినని కూడా చూడకుండా ఇంత మాట అనేసాడేందబ్బా? బిక్కముఖమేసి దిక్కులు చూస్తున్నాను.

నా ఏడుపు ముఖం చూసి జాలేసిందేమో! “అయ్యో. . . మిమ్ములను అంత మాట అంటానా తల్లీ. . . ! అన్నది నేను మీకు చెప్పబోయే కథలో ప్రధాన పాత్రయిన మా ఊరి లేడి సర్పంచి రేణుకను…” అనగానే మనసు కాస్త తేలికపడ్డా, రేణుకనైనా అలా అనొచ్చా? అని లోపలెక్కడో అబ్ నార్మల్గా ఉంది.

“ఆ రేణుక ఉంది కదమ్మా… అది ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది. పెద్ద కులపు పిలగాడని కూడా చూడకుండా మా రాజేందర్రెడ్డి దొరనే చెప్పు తీసుకు కొడ్తుందా?”

“వావ్. . . చెప్పు తీసుకుని కొట్టిందా? ఎప్పుడు? ఎందుకు? ఎలా? చెప్పు చెప్పు. కథ ఆసక్తిగా ఉందని తొందరపెట్టే సరికి బాలరాజు నాకేసి అదోలా చూసి చెప్పడం మొదలెట్టాడు.

“అయినా అదంతలా రెచ్చిపోడానికి ఏమన్నాడని చినదొర! పెద్ద కులపు మీసం తిరిగిన మొగోళ్ళంతా ఆఫీసుల నిలబడి ఉంటే, ఆడదై ఉండి, అందులోనూ తక్కువ కులపు ముండై ఉండి… దర్జాగా కుర్చీలో కూర్చోని మాట్లాడుతదా?పైగా ఆఫీసుల వాడుకునే గిలాసలల్లనే చాయలు తెప్పిస్తదా? ఇంగా దొరోళ్ళకు కోపం రాకుండా ఎట్లుంటది!?”

“అప్పటికీ ఆయన ఎంత ఓపికగా ఉన్నాడో… కానీ అజాకారిది కొత్త బిచ్చపోడు పొద్దు గుర్తెరుగడన్న రీతిలనే సర్పంచినయినన్న రిమ్మతో పాత లెక్కలు, బొక్కలు అనుకుంటా తాతలనాటి ఫైళ్ళను ఒక్కొక్కటి ఆరాదీస్తుంటే… ఏదో ఆవేశంలో చేయి పైకేత్తిండంతే… కొట్టిండా? కోసిండా? కాకపోతే అనుకోకుండా వేలి కొసకు చీర కొంగు తగులుకుని, అప్పుడే కిటికీలో నుండి వచ్చిన గాలికి కొంగుజారి దొరగారి చేతిలకొచ్చిందంతే… దానికే సివంగిలా ఇంతెత్తు లేచి దొరగారినే చెప్పుదీస్క కొడ్తుందా? కొట్టిందే కాక పోలీస్ టౌన్ల కేసు పెడ్తుందా? ఈ మజ్జన అయినదానికి, కానిదానికి మాల, మాదిగల కేసులు రాయించి ఇరికించుడొకటి నేర్చిండ్రు గుడిసెటి లంజలు”.

“నాకు తెల్వకడ్గుతానమ్మా… ఈ తక్కువ కులపు ఆడళ్ళకు మానమెందీ? శీలమేందీ? నిన్నటిదాంక వంగి వంగి దండాలెట్టి కుంచెడు బియ్యానికి, పావులా నాణానికి పక్కలకొచ్చిన లంజలే ఇంత బిరిమీదుంటే, జమానాలకెంచి రాజరికం చేసే దొరలకెంతుండాలే… “

“ఇట్లా చెప్పి, చెప్పనట్టు తలా, తోకా లేకుండా నడిమధ్యలో నుండి మొదలెడ్తే నాకే అర్థం కాలేదు. ఇక నా పాఠకులకేం అర్థమయితది బాలరాజా… “అనగానే…

“అమ్మా నేను రెడ్డిగోరి రాజకీయ అనుచరుణ్ణి మాత్రమే. మా బోటి బోడిలింగం గాళ్ళకు ముచ్చట్లన్నీ ఇట్లాగే తలాతోక లేకుండా తెలుసుంటాయి. విషయం రూఢీగా తెలియాలంటే కథ ఆళ్ళు, ఈళ్ళు చెప్పుడు కాదు. ఎవరి కథ ఆళ్ళే చెప్పుకోవాలి”.

విషయం రూఢీగా తెలియనప్పుడు “తప్పంతా రేణుకదే అని ఎట్లా నిర్ధారించినవ్ బాలరాజు…

“దొరగారి ఉప్పు తిని బలిసిన శరీరాలమ్మా మావి. ఆయన ఎప్పటికీ తప్పు చేయడమ్మా!”

జరంత‌ తిప్పి చెప్పు బాలరాజు!

“దొరగారు ఏది చేసినా తప్పు కాదమ్మా”

ఇగ నన్ను వాళ్ళ దగ్గరికి తీస్కపో ఎవరేం చెప్తారో విందామన్నాను… నవ్వుతూ. . .

“ముందుగాల పెద్ద కులపాయన రాజేందర్రెడ్డి దొర ఏం జెప్తడో ఇని, అటేన్క ఆ కొంచెపుది ఏం జెప్తుందో ఇందాం… పదండమ్మా… అంటూ ముందుకు నడిచిండు బాలరాజు”.

***

రాజేందర్ రెడ్డి గారు మిమ్మల్ని రేణుక ఎందుకు చెప్పుతో కొట్టిందండీ… !?

“మీరెవరు? నా విషయాలు మీకెందుకు? అన్నాడు కోపంగా రాజేందర్ రెడ్డి”.

నేనో రచయిత్రినండీ. మీ కథనే నా కథగా రాద్దామనుకుంటున్నాను. ప్లీజ్ ఐ రిక్వెస్టింగ్ యూ… మీ కథేమిటో నాకు చెప్పరూ….

నేను అడిగిన విధానం నచ్చిందో, లేదంటే తనకే చెప్పుకోవాలనిపించిందో “అలాగే చెప్తి కానీ,ఈ కథలో నన్నే హీరోగా చూపించాలి” అన్నాడు.

ఎవరు హీరోనో, ఎవరు విలనో నిర్ణయించడానికి నాకేం హక్కుందని మనసులో అనుకుని పైకి “సరేనన్నట్లు తలాడించాను”.

… నవ్వి చెప్పడం మొదలెట్టాడు. “నా పేరు రాజేందర్ రెడ్డి. తాతలనాటికేంచి ఈ ఊరు పెద్దిర్కమంతా మాదే. నిజాం కాలంల మా వంశం కీర్తిప్రతిష్టలు ఒక రేంజిలో ఎలిగేయంటా మా తాత బతికున్నప్పుడు రోజు కథలు కథలుగా చెప్పేటోడు. ఇప్పుడంటే చిన్నిర్కం,పెద్దిర్కం లేకుండా చెడుపు కాలం దాపురించింది. కానీ మా నాయ్నాగారి హాయంల గూడ్కా ఊర్ల జనాలు చిన్నపెద్ద మంచి మన్ననలెరిగి మసులుకునేటోళ్ళు పుణ్యాత్ములు!”

“మా నాయ్నా ఎండ్లబండి పాటకీలోంచి బయటికొచ్చుడే ఆలస్యం ఎక్కడోళ్ళక్కడే తొలిగి నిలవడి తొవ్విచ్చేటోళ్ళు”.

“… రానురాను రాజు గుర్రం గాడిదైనట్టూ మన రాజ్యాంగం రాసినోడు అసలు తెలివిలేని తలకుమాసినోడు. ఏవేవో చట్టాలు చేసి అధములను అందెలమెక్కిచ్చిండు. ఆ అండ చూసుకుని అంటరానోళ్ళంతా రాజకీయాలు చేసి ఊర్లేలుతుంటే, పెద్దకులపోళ్ళంతా చేతులుకట్టుకు నిలవడాల్సిన ఖర్మం పట్టింది. అందుకే కాలం కాక కరువులెళ్ళదీస్తూ ఊర్లుడిసి వలసలు పోతుండ్రు కొంచెపు ముండా కొడుకులు”.

“కానీ… మన పెద్దోళ్ళు అంతా తెలివిలేనోళ్ళేం కాదు కదా! అందుకే అన్ని అనుభవించే నాలుగు వర్ణాలు ఏర్పాటుచేసి, ధర్మాన్ని నాలుగు పాదాల మీద నిలబెట్టిండ్రు. ఓయబ్బా ఆళ్ళే గనుక లేకపోతే వర్ణవ్యవస్థ సంకరమై ఎప్పుడో ధర్మం సంకనాకిపోయేది”.

“పతోడు కులవ్యవస్థను తిట్టేటోడేగాని అసలైతే ఈ వర్ణవ్యవస్థ వలన ఎన్ని ఉపయోగాలో ఎవడైనా ఆలోచించాడా?”

“ఎవడుబడితే ఆడు వేదం చదివి, మంత్రోఛ్చరణ చేస్తానంటే ఎట్లా!? దానికో పవిత్రత ఉంది. ఏడేడు జన్మాలు వరసబెట్టి పుణ్యం తప్ప అన్యమెరుగని మహాత్ములే బ్రామ్మలుగా పుడుతారు. లకాయిలు కాయిగాళ్ళంతా మహాత్ములెట్లయితరు!? ఇగ బ్రామ్మలుగా పుట్టాక చెప్పులు కుడతా, చర్మమొలుస్తా అంటే దేవుడొప్పుతడా? పూజలు- పునస్కారాలు, యజ్ఞాలు – యాగాలు, అర్చనలు – అభిషేకాలు, బారసాల మొదలు తద్దినాల వ‌రకంతా వాళ్ళ సెక్షనే!”

“అవన్నీ అంతా లాభసాటి యవ్వారాలు కావనుకుంటే టీవి ఛానళ్ళలో ప్రవచనాలు చెప్పుకోవచ్చు. ఫీఠాధిపతులు, మఠాధిపతులు, ఆశ్రమాలు, బాబాలు, హిందు ధర్మోద్ధరణగాళ్ళు… పాపం-పుణ్యం, స్వర్గం – నరకమని జనాలను భయపెట్టి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి లక్షలార్జించవచ్చు. ఎన్నారైల నుండి ఫండ్స్ క్రౌడింగ్ చేయొచ్చు. అట్లా కూడా కుదరకపోతే అధమంలో అధమం పెద్దపెద్ద హోదా కలిగిన ఉద్యోగాలో, వ్యాపారాలో, రాజకీయాలో చేసుకోవచ్చనుకో. . . “

“ఎవడైనా ఏందీ ఆధిపత్య కుల దౌర్జన్యమంటే (పాప భీతితో ఎవడు ప్రశ్నించే సాహసం చేయరనుకో…. ఒకవేళ చేస్తే) వెంటనే పత్రికలలో సంపాదకీయాలు వేయించి మొహం వాచిపోయేంత వరకు దూషించవచ్చు. బస్సుల్లో,సినిమా హాల్లో కలిసే కూసుంటున్నం,హోటెల్లలో ఒగరు తిన్న చిప్పల్లోనే మరొగరం భోజనం చేస్తున్నం. మీ పోరలు, మా పోరలన్న తేడా లేకుండా అందరు బళ్ళలో రాసుకపూసుక కూసుంటనేఉండ్రయే, అన్ని కులాలోళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటిమయే, ఆ మాటకొస్తే రిజర్వేషన్ల పుణ్యాన వెనకబడిన కులాల వాళ్ళకే అగ్రతాంబూలమాయే…. ” అంటూ కులగజ్జి తుప్పాస్ న్యూస్ ఛానెల్లలో డిబేట్లుబెట్టి, సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్లుబెట్టి ఇంగా ఈ రోజుల్లో కులమెక్కడుందిరా. . . “సంకరజాతి కొడుక్కుల్లారా అని దబాయించనూవచ్చు.

“ఇగ రెడ్డి, వెలమ, కరణం, కాపులంతా రాజకీయాలు చేసుకుంటా రాజ్యాలేలవచ్చు. మమ్ములని కాదని ఎవడో రాజరికం చేయబోతే ఏమైతది ఇంతే అయితది. అదునుకు వానలుపడవు, అకాల వానలుకురిసి చేతికొచ్చిన పంటలు నోట్లకురావు”.

“అయినా రాజరికం, పౌరుషం, ఠీవి, ఆ దర్జా నడిమజ్జెన నేరుస్తే వచ్చేటివికాదు. ఆ పొగరు పుట్టుకతోని వచ్చి రక్తం కలిసుండాలి. బలుపుతో ఏ నరానికానరం గిజగిజకొట్టుకొని మెలికలు తిరిగుండాలి”.

“ఎవడికాడే సంపాదించుకుని బతికితే రాజులెందుకు? దొరలెందుకు? అసలీ రాజకీయాలెందుకు? అందరు సంపాదించినది ఏదో ఒక రూపంలో మా చేతుల్లకి రావాలి. ఒకవేళ అలా రాకపోతే దౌర్జన్యంగానైనా దోచుకునే నేర్పుండాలి. భూములన్నీ మా ముడ్డికిందే ఉండాలి. ఎవడికైనా ఉచ్చవోసేంత గుంటెడు భూముంటే ఎట్లా లాగి మన కమతాలలో కలుపుకోవాలెనో తెలిసుండాలి. అట్లా ఊరంతటినీ ఒక్కతాటి మీద నిలబెట్టనీకే ఎంత ఓర్పుండాలి?ఎంత సహనముండాలి? ఊరి బాగుకోసం నెలకోసారైనా ఊరికొచ్చి, సీటిలలో సంపాదించే డబ్బును వదులుకోవాలంటే ఎంత త్యాగగుణముండాలి?ఇంతా చేస్తే ఈ ఊరు మాది. . ఆ భూమి మాది. . రాజ్యం మాది. . రాజకీయం మాది. . అంటుంటే ఒళ్ళంతా గొడ్డుకారం పూసినట్లు మండదా?”

“ఎప్పటికైనా మేము పెట్టాలి. వాళ్ళు జోలెలు పట్టాలి. మేము తన్నాలి. వాళ్ళు మరోసారి తన్నుండయ్యా… అని మా కాళ్ళకందేంత దూరంలోనే నడ్డి నిలిపి వంగాలి. మేము ఉమ్మాలి. వాళ్ళ జన్మలన్నీ మా ఉమ్మి తుప్పిర్లుబడి తరించాలి. మా పోరలంతా ఊరికిడిసిన దున్నపోతుల్లా వాళ్ళ ఆడోళ్ళెంట పడాలి. వాళ్ళ ఆడపొల్లలంతా మీరు ముట్టుకుంటే సాలు రాయిలాంటి మా జన్మకు ప్రాణాలొస్తయంటూ. . బట్టలిప్పుకొని బరిబత్తెల మా పక్కల పండాలి”.

“వైష్యుడిగా పుడితే వ్యాపారాలు చేసి ఐశ్వర్యానంతా మడిచి సంకనచుట్టేయొచ్చు. హీనపక్షం శూద్రుడిగానైనా పుడితే బట్టలుతకడానికో,మూతిగొరకడానికో,పాచి కడగడానికో, పాలేరు పనిచేయడానికో ఏదో ఒక రకంగా పై కులాలోళ్ళతో కలిసి తిరిగే అవకాశం దొరికేది”.

“కానీ దళితుడుగా పుట్టాక నేను వేదం చదువుతా, రాజ్యాలేలుతా, వ్యాపారాలు చేస్తా, మీ ఇంట్లో చొరబడి మీ కాళ్ళొత్తుతానంటే ఎట్లా వీలైతది. మనదసలే ధర్మం నాలుగు వర్ణాల ముందు వంగి సాగిలబడిన రామరాజ్యమాయే…. రాముడు భారతీయ సంస్కృతికి బ్రాండ్ అంబాసిడరాయే. . . వేదం చదివిన పాపానికి ఒక దళితుడి తలతీసి మొలేసిన రామ”యిజ”మాయే. చూండూరు, కారంచేడు, పాదిరికుప్పం, గరగపర్రు, గుజరాత్ నరమేధం సాక్షిగా మనదిప్పటికీ రామ రాజ్యమేనాయే. . . “

“రామ రాజ్యం ప్రకారం నాలుగే వర్ణాలయినప్పుడు మరీ ఐదో వర్ణం కథాకమీషేమిటష అంటారేమో. . . అదే నేను చెప్పబోయేదసలు. త్రేతాయుగంలో, ద్వాపర, కృత ఇలా వరసబెట్టి మూడు యుగాలలో రాక్షసులుగా, అసురులుగా. . . పేరొందిన మూకంతా కలియుగంలో ఐదో వర్ణమై ఆవిర్భవించిందంటా. . . అందుకే మన పెద్దోళ్ళంతా వారిని ఊరికి ఆమడదూరంలో వెలివాడల్లో ఉంచి, బడి, గుడి, బావి, శెలక. . . అన్నింటికీ దూరం బెట్టి, అసహ్యమైన పనులన్నింటిని వారికప్పగించారు. కానీ ఈ తొత్తు నా కొడుకులకు నీతినియమాలుంటే కదా సమానత్వం సమానత్వమనుకుంటా ఒక్కో నియమాన్ని ఎగేసుకుంటా ఇగో ఇప్పటికీ రాజ్యాలేలే కాడికి అచ్చిండ్రు”.

“రాజకీయాల గురించి వీళ్ళకేం తెలుసని రాజమేలడమంటే చెప్పులు కొట్టడమనుకుంటున్నారేమో తాశిలి కొడుకులు. ముఖ్యమంత్రిగానో, ప్రధానమంత్రిగానో ఉండడమంటే ఎంత కష్టమసలు? దానికి ఎంత తెలివుండాలి. ఎంత నేర్పుండాలి”.

“పోనిలే పాపమని బతకనిస్తే, చదవనిస్తే, మంచి బట్టకట్టనిస్తే. . . మా వేలితో మా కళ్ళలోనే పొడుస్తారా?”

“సర్పంచి హరిజన కులానికి,అందులోనూ ఆడోళ్ళకే రాబట్టి కదూ చింతకింది బాలడితో అన్నిమాట్లాడుకుని చదువుకున్నదని ఆడి పెళ్ళం రేణుకను నా మాటమీద ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. ఆ లంజకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండనక్కరలేదా… కుర్చీల కూసోంగనే డిల్లికీ రాణైనంతా ఇదిగా నీల్గుతుంది”.

“ఇప్పుడు దాని చీరబట్టి లాగిననని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టింది. మా ఊరి రాములోరి మీదొట్టు నేను కావాలని దాని చీర గుంజలే, ఏదో కోపంల కొప్పట్టి కొడ్తామని చూసిన కానీ చేతిలకు కొప్పుకు బదులు కొంగూడొచ్చింది. వచ్చింది ఏదైతేనేం అని ఒక్క గుంజు గుంజిన దొమ్మరిది ఆయింతదానికి లొల్లి లొల్లి చేస్తుంది”.

“అసలు దీన్ని కాదు దీని ఎనకాల నిలబడి చేయిస్తున్న మాదిగ లమ్డికెల బొక్కలిరగదీయాలి. ఇంతింత రమ్మంటే ఇళ్ళంతా నాదేనన్నట్లుగా చేస్తున్నరు. ఏదో పాపమని ఊరి రాజకీయాలలోకి రానిచ్చినమన్న ఇది గూడా లేకండా ఏకుమేకై కూసున్నరు”.

“నేను చూస్తా కేసులు పెట్టి ఏం పీకుతరో. . . ఉన్న ఎనబై ఎకరాల్లో ఒక్కటి నాది కాదనుకున్నా ఒక్కొక్కడి అడ్రస్సులు గల్లంతు చేస్తా కొడుకులు ఏమనుకుంటుండ్రో….”

అంతా విన్నారు కదా!ఇప్పుడు చెప్పుండ్రమ్మా “నేను మీ కథకు హీరోనా?విలన్నా?”అన్నాడు. . .

హ్మ్. . . రేణుక చెప్పేది కూడా విననీయండి. ఆ తరువాత చెప్తా. . . అని బయటికి వచ్చేసాను.


రేణుక గారు రాజేందర్ రెడ్డిని ఎందుకు చెప్పుతో కొట్టారండీ… ?

ఫైళ్ళ నుండి తలెత్తి తీక్షణంగా ఒకసారి నాకేసి చూసి “మీరు పత్రిక విలేకరులా?” అంది.

“కాదు. రచయిత్రిని” అనగానే నిరసనగా ఒక చూపు విసిరి తన పని తను చేసుకోవడం మొదలెట్టింది.

‘హలో’నేను మీ కోసమే వచ్చానండీ. . . అన్నాను అసహనంగా. . .

“హ్మ్. . . నా కథ నేనే చెప్పుకుంటే తప్పా అసలు కథేమిటో మీకు తెలియదన్నమాట. . . అంది ఎగతాళిగా. . . “

ఎవరైనా చెప్పుకుంటేనే కదా వారి సమస్య లోకానికి తెలిసేది. . . అన్నాను.

“ఒక్కొక్కరికీ కొలుప్పెట్టి చెప్పడానికి నాది తలుపు చాటు సమస్యేం కాదు. మాదంతా బహిరంగ రహస్యమే. . . “అంది.

ఆ బహిరంగ రహస్యాన్నే మరోసారి బట్టబయలు చేయండంటున్నాను. . . అన్నాను

“ఆ రెడ్డినే అడగకపోయారా. . . “అంది

ఆయన చెప్పిందంతా పొల్లుపోకుండా చెప్పి. . . ఆయన దగ్గరి నుండే మీ దగ్గరికొచ్చా. . అని చెప్పి ఆమె రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నాను

పేపర్ వెయిట్ తో ఆడుతూ. . . కాసేపేదో ఆలోచించి. . . ఒక దీర్ఘ శ్వాస తీసుకుని “వాల్మీకి,వ్యాసుడి నుండి కాళిదాసు,భవభూతి వరకు,కృష్ణశాస్త్రి,విశ్వనాథ మొదలు గుడిపాటి,శ్రీరంగమోళ్ళ వరకు,మొల్లా,మోహనాంగి మొదలు ఓల్గా రంగనాయకమ్మల వరకు. . . ఎవ్వరికీ మా కథ రాయాలని కదా కనీసం వినాలని కూడా అనిపించలేదు”.

“ఇన్నాళ్ళకో రచయిత్రి పనిగట్టుకుని నా కథ విని, రాస్తానంటుంటే చెప్పకుండా ఎట్లుంటాను”.

అయితే ఒక్క షరతు “నీళ్ళను నీళ్ళు,పాలను పాలంతా స్వచ్చంగా కథ రాస్తానని నాకు మాటియ్యాలి ముందు. . . “అంది.

సరేనన్నట్లు తలాడించాక చెప్పడం మొదలెట్టింది. “రెడ్డిగాడు(మీరు విన్నది నిజమే వాడు రెడ్డిగాడే) చెప్పిందంతా బండలపోశమ్మ సాక్షిగా నిజమనమ్మా. . . పోశమ్మనే సాక్షిగా ఎందుకు తీసుకున్నానంటే ఏ రాముడు మా తరుపున మాట్లాడలేదమ్మా. . . పోనీ ఏ కవైనా మా గురించి రాసాడా అంటే అది గూడ్కలేదు. ఏ చరిత్ర చూసినా రాజుల కౌర్యక్రమాలు. రాణుల రంకు పురాణాలు. ఉంచుకున్నోళ్ళకు శతకాభిషేకాలే. . . మరి ఆ చరిత్రలు రాసేటియాల మా హరిజన, గిరిజన, బహుజనులు ఏడ దాగున్నరో, ఎవడికి దాస్యం చేస్తూ. . . కాళ్ళకాడి కుక్కల్లా పడిన్నరో రాసిన ఆళ్ళకే ఎర్కుండాలి”.

“మా ముత్తాతవ్వలు మూతికి ముంత,ముడ్డికి తాటిమట్ట కట్టుకుని తిరిగిండ్రు. ఎందుకంటే మేము అంటరానోళ్ళం కదా మా అడుగుల గుర్తులు నుండి ఉమ్మి వరకు ఏది నేలమీద పడిన నేల మైలపడిపోతది”.

“మేము అంటరానోళ్ళమే అయినా హిందువులమేనంటమ్మా. దొడ్డ గుణం దొరలు ఇందులోనైనా కలుపుకున్నరు. అనీ సంతోషించే లోపే మతం కన్నా కులమదం ఎక్కువని ఎప్పటికప్పుడు నిరూపిస్తుంటరు. . మతానికి లౌక్యమద్ది తొంగలదొక్కి కులానికి పెద్ద పీఠలేస్తరు”.

“దినదినాభివృద్ది చెందుతున్నా ఈ నా దేశంలో ఇప్పటికీ నాది అస్తిత్వ పోరటమేనమ్మా. మా తాతలు మతం మారితేనన్న బతుకు మారుతుందని తుర్కోళ్ళ ఏలుబడిలో తుర్కమతం తీసుకుని అటు తుర్కోళ్ళ మెప్పు పొందలేక,ఇటు పెద్దకులపోళ్ళ సూటిపోటి చేష్టలు భరించలేక రెంటికి చెడ్డ రేవడయిండ్రు. పోనీ కిరస్తానీ తీసుకుందామంటే, ఆళ్ళేమో పెట్టుకున్న బొట్టునుండి,పేరు వరకు అన్నీ మార్చుకోండ్రంటరు. అయినా బతుకులే చిధ్రమవుతుంటే బొట్టు,పేరుకొచ్చిన తిప్పలెందుకులే అనుకుందామంటే,కిరస్తానీలమైన దళితులమేనైతిమి. ఇంగెక్కడి మర్యాద, ఇంగెక్కడి మన్ననమ్మా!”

“వ్యక్తి ఆరాధన అనుకోకుంటే అంబేద్కర్ మా దేవుడు. అతిశయోక్తి అనుకోకుంటే ఆ యేసు ప్రభువు మా మార్యద. హిందువులుగా మాకు దక్కని గౌరవం కిరస్తానీలుగా మారి కొంతవరకు పొందగలిగాం”.

“దశమవంతు పాపభారం మోయడానికి మతం మార్చుకున్నామనే ఎదవలకెప్పటికీ అర్థం కాదు. నాది పొట్టబాధ కాదు ఆత్మగౌరవ ప్రకటన అని. . . “

“భూమ్మీద మనుషులుగా పుట్టినోళ్ళంతా ఒకే రకమైన మనుషులు కాకుండా ఎట్లా పొయ్యారో నాకర్థం కాదు. మేము మాత్రమే అంటరానోళ్ళమెట్లా అయినమో అసలే అర్థం కాదు. మా పూర్వీకులు భారత, భాగవత, రామాయణాలలో రాక్షసులు, అసురులు, తాటకీ, సుర్పనఖలైండ్రు. . . మా తాతలు రాజుల పల్లకీలు మోసేటోళ్ళు, చర్మాలొలిచి చెప్పులుకుట్టేటోలైండ్రు. మా అవ్వలు ఆడబాపలు, మాతాంగిలు, జోగినులు, భోగినిలైండ్రు. మా అమ్మయ్యలు మైసి, మైసడై ఊరంతటికి కడగొట్టు ఊగిపోళ్ళైండ్రు. వారి వారసులం మేము ఆడదైతే కొంచెపు ముండా, మొగోడైతే కొంచెపు ముండా కొడుకుమైతిమి”.

“ఒకడు మా యాసను వెక్కిరిస్తే, మరొకడు మా రూపురేఖలను వేళాకోలమాడుత‌డు. మరొకడు ఆడబ్బా పాత రేకుపెట్టల దాచిపెట్టిన ముళ్ళెను దోచిచ్చినట్లు నేను దళితులతో కలిసి తిరుగుతా, తింటా, పంటానని టముకేస్తుంటడు. అదేదో ఎత్తుకెగరేసి మరీ తన్నినట్టు . . . ఎప్పుడైతే నన్ను గౌరవించడం ప్రత్యేకతను సంతరించుకుంటుందో అక్కడే నన్ను అగౌరవ పరచడానికి కావాల్సిన కారణం దాగుందని అర్థం”.

“రాజకీయ నాయకులు గెలవడానికి మా ఓట్లు కావాలమ్మా, కానీ ఓటేయ్యడానికి పనికొచ్చే మేము నాయకులుగా నిలబడడానికి వీల్లేదు”.

“అయినా నిలబడినమంటే, మా కులానికి తప్ప‌ ఎవడికి నిలబడే అవకాశం లేదని అర్థం”.

“గెలిచాక పెద్దగా పీకేది కూడా ఏముండదమ్మో. . అయితే పెద్దదొరో, కాకుంటే చిన్నదొరో. పాపం మాకేమీ తెలియదన్న జాలితో ఏమేం చేయాలో, ఏమేం చేయకూడదో,ఎక్కడెక్కడ సంతకాలెట్టాలో, ఎవరి ముందు ఎట్లా తలాడించాల్నో అంతా ట్రెయినింగిస్తరు. మేము జస్ట్ సర్కస్లో బ ఫూన్ లెక్క ఫీట్లు చేస్తే చాలు. అంతా కల్లాస్!”

“ఇందులో చెప్పకోవాల్సింది మరొకటుందమ్మా. గెలిచింది ఆడదైతే ఆమె మొగుడే ఊరంతటికీ మొగుడు. అందులోనూ ఆ ఆడది నిమ్నకులస్తురాలైతే దానికి దాని మొగుడితో పాటు ఊరి దొరవారితో సహా నాలగున్నర కులాల మొగోళ్ళాంతా మొగుళ్ళే. . . “

“ఊరి లెవెలి రాజకీయాలలోనే మా బతికిట్లా ఉంటే, రాష్ట్ర, కేంద్ర రాజకీయాలలో మా బతుకులు తామరాకు మీద నీటిబొట్లే”.

“అమ్మా-మా సాంఘిక హోదా పెంచడానికే రిజర్వేషన్లు కదా! భూమ్మీద పావుంతు పట్టా, పట్టులేని మా బతుకులకెందుకు రిజర్వేషన్లు లేదమ్మా. . . ముడ్డికింద వందలెకరాలు దండుకున్న దొరగాడికి నాకు పోటేంటయ్యా!”

“బర్రెల, గొర్రెల మంత్రులుగా, ఎంఎల్ఏలుగా పనికొచ్చే మేము హోమ్, ఇరిగేషన్లకు ఎందుకు పనికొస్తలేమమ్మా. అసలైతే డెబ్భై ఏళ్ళ స్వాతంత్ర్య భారతంలో ఒక్క ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కావడానికి ఏ రిజర్వేషన్లు పనిచేయకపాయేను కదమ్మా!?”

“రిజర్వేషన్లు, రిజర్వేషన్లు అని మా మీద పడి ఏడ్చేవాళ్ళకో బంపర్ ఆఫర్ “మా రిజర్వేషన్లు మీకే ఇచ్చేస్తాం మీ ముడ్డికింది భూములు, మీ స్విస్ బ్యాంకుల నగదు, మీ చర్మం కింద పొరలు పొరలుగా పెరిగిపోయిన ఆధిపత్యాహంకారాన్ని. . . మాకిచ్చేయండంటే. . . ఎట్లా రియాక్టవుతారో వీలైతే మీ కథలో రాయండమ్మా. . . “

“ఈ రోజుల్లో కులాలెక్కడివి. . ఎక్కడివి. . ఎక్కడివి” అంటుంటే విన్న మా పోరగాళ్ళు ఆళ్ళ పిల్లల మీద మనసుపడి మనువాడితే, ఉత్తి పుణ్యానికి నరికి, కోసి, కొట్టి, కాల్చి చంపేసిండ్రు కదమ్మా. . . ఇంగా కులాలెక్కడివమ్మా?

“ఆళ్ళ ఆడపిల్లలను పెళ్ళాడి కాపురం జేస్తే తప్పువడ్తిరి. మా ఆడివిల్లలను ఒంటరిగా దొరికితే గొరగొర గుంజుకపోయి చెర్పితే గూడ్క ఒప్పంటిరి.

ఎవరు ఏమనుకోనంటే ఒకమాటమ్మా”ఆళ్ళ ఆడపిల్లలను మా పొరలు పెళ్ళాడితే పోయే పరువు మా ఆడపిల్లలను ఆళ్ళమొగోళ్ళు చెరిస్తే పోదా?”అంటే పరువనిది గుణాన్ని కాకుండా కులాన్ని ఆశ్రయించి ఉంటుదన్నమాట!”

“నేనీ ఊరికి సర్పంచినమ్మా. సర్పంచినయిన కదానని నాకేం స్పేషల్ మార్యదలు దక్కలేదమ్మా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ. . . నేను ‘ఓసేయ్ రేణుక’నేనమ్మా. . . “

“. . . అసలు నేను చేసిన తప్పు ఏంటంటేనమ్మా కులరాహిత్యమై సర్వసమానత్వం సిద్ధించిన మా ఊరి ఆఫీసులో పర్యావరణ కాలుష్యం దృష్ట్యా డిస్పోజల్ గ్లాసులు వాడకపోవడం నా మొదటి తప్పమ్మా. డజన్ స్టీలు గ్లాసులు తెప్పించి, ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగించి అందరికీ అవే గ్లాసుల్లో టీలు ఇప్పించడం నా రెండో తప్పమ్మా. నేను చదువుకొని ఉండడం మూడో తప్పమ్మా. పాత లెక్కలన్నీ తప్పుల తడకలా రాసిండ్రేంటని అడగడం నాలుగో తప్పమ్మా. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అవమానకరంగా మాట్లాడినప్పుడిన మొదటి రోజే ఆ రాజేందర్ రెడ్డిగాడిని చెప్పుదీస్క కొట్టకొట్టి,పదిమందిల పంచాయతీ పెట్టకపోవడం నా ఐదో తప్పమ్మా. మా అంటరాని ఆడోళ్ళు కనిపడ్తే చాలు వావివరస, ముసలి ముతక, పిల్లా జెల్లా. . అన్న తేడా లేకుండా మదమెక్కిన ఆంబోతులా చూసేటోడిని, పదిమంది ఎదుట నా కొంగుపట్టి లాగి,నా ఎదమీద చెయ్యేసి వెనక్కి తోసి, బలిసి కొట్టుకుంటున్నావే లం… అని తిట్టినోడి మీద ఏదో పిచ్చావేశంలో ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసేట్టడం ఆరో తప్పమ్మా!”

“ఆరో తప్పు తప్పెట్లాగయ్యిందా అని ఆలోచిస్తున్నారా? అందులో అంత ఆలోచించడానికి ఏముందమ్మా.? తరతరాలుగా బాగా బలిసిన కులపోళ్లాయె. కులం బలిసినాక, బలం, మదం. . చేరకుండా ఎట్లుంటయ్యి. ఇన్ని చేరినాక ఐశ్వర్యం మాత్రం వారిని వీడి ఎక్కడికి పోగలదు. ఐశ్వర్య ఆళ్ళ ఇంట్లో తిష్ట వేసాక ఆవిడ కరుణ, కటాక్షవీక్షణాల కోసం ఎస్సై, జడ్జీలేం ఖర్మ మైసూర్ మహారాజు, అమెరికా ప్రెసిడెంట్ గూడా ఈ దినం రాతిరి వేళ దొరగాడి ఫాంహౌజుల కళ్ళాబేరానికి, చేతులబేరానికి, ఇంకా ఏమేం బేరమాడగలిగితే ఆ బేరాలన్నింటికీ వస్తారమ్మా!”

“ఇన్ని బేరాలయ్యాక నా కేసెక్క‌డ‌ నిలుస్తుందమ్మా. . . !!”

జననం: రంగారెడ్డి జిల్లా. సాహిత్య విద్యార్థిని, కథా రచయిత్రి.  'శ‌త‌పత్ర మంజ‌రి' అనే క‌లం పేరుతో ర‌చ‌న‌లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎనిమిది కథలు రాశారు. బీబీసీలో ఫ్రీలాన్సర్. ప‌రిశోధ‌న: 'నవల - కథానిక' అనే అంశంపై. తెలుగు లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

Leave a Reply