మరపురాని ఫ్రెంచ్ ప్రేమ కావ్యం: ‘ఆమొర్’ సినిమా

“ప్రేమ”. ప్రపంచంలో ఈ భావానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అసలు మనిషి జీవితమంతా ప్రేమ అనే భావాన్ని అనుభవించాలని, ఆస్వాదించాలనే కోరిక చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సాహిత్యంలో కాని సినిమాలలో కాని ప్రేమ వ్యక్తీకరణ అనే కథాంశం ఆధారంగా తీసుకుని చాలా పరిశోధనాత్మకంగా ప్రయోగాలు జరిగాయి. ఒక రచయిత అన్నట్లు అసలు ఈ ప్రేమ గురించి ఇంత వినకపోయినట్లయితే ప్రేమ కోసం అన్వేషణ ఇంత ఎక్కువగా ప్రపంచంలో జరగకపోయుండును. సినిమాలో ప్రేమ కథలు చాలా ఉత్సాహవంతగా, అందంగా, ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఎన్ని సార్లు ఎన్ని కథలు చూసినా, విన్నా ప్రేమ దాహం తీరదు. చాలా మంది జీవితాలలో ఆ అనుభవాలు దొరకకపోయినా వాటి కోసం నిరీక్షణ మాత్రం సాగుతూనే ఉంటుంది. గొప్ప ప్రేమ కథాంశంతో వచ్చిన సినిమాలు జనం మెచ్చి ఆదరిస్తూనే ఉంటారు. ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ ప్రేమ దాహం ఇలా నిరంతరం ఒక తరం నుండి మరొక తరానికి సాగుతూనే ఉంటుంది.

సాధారణంగా ప్రేమ కథ అంటే ఒక హీరో ఒక హీరోయిన్. హీరో పెద్ద వీరుడు, అసహాయ శూరుడు, హీరోయిన్ గొప్ప అందగత్తె. ఇక వారిద్దరి మధ్య బంధం ఎన్ని అడ్డంకులైనా అధిగమించేలా ప్రేరేపిస్తుంది. అసలు ఒకరికొకరున్నారన్న భావనే జీవితానికి గొప్ప ఆలంబన. దాన్ని ఎన్నో కథలు గొప్పగా చిత్రీకరించాయి. కాని ఈ ప్రేమ ఆ వ్యక్తులు జీవితంలో అసహాయ స్థితిలో పడ్డప్పుడు, వారి అందం ఆరోగ్యం తగ్గిపోయిన వృద్ధాప్య స్థితిలోకి ప్రయాణించినప్పుడు ఏం అవుతుంది? అసలు ఈ ఆలోచన చాలా ప్రేమ కథలలో రాదు. చాలా ప్రేమ కథలు వ్యక్తుల కలయికతో అంతమవుతాయి. వృద్ధాప్యంలో ప్రేమ పట్ల మనకు ఒక హేళన భావం ఉంటుంది. ఎందుకంటే ప్రేమ అనే భావంలో శరీరానికి గొప్పప్రాధాన్యత ఉంది. సెక్స్ కు ప్రాధాన్యత అధికం. మనసులు కలవడం అనే మాట చెప్పుకుంటున్నా ఇక్కడ శరీరానికి ప్రాధాన్యత అధికం. అందుకే అందమైన వ్యక్తుల మధ్య, అందమైన పరిస్థితుల మధ్య ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఒక జంట కలిసి జీవిస్తున్నప్పుడు వారి మధ్య దైనిక జీవనంలో ఈ అందమైన పరిస్థితులు కలకాలం ఉండవు. పరిస్థితులు మారతాయి. సెస్క్ ను ఆనందించే స్థితి దాటిపోయే పరిస్థితులు వస్తాయి. వారి శరీరాలలో మార్పు చోటు చేసుకుంటుంది. ఒకరికొకరు అలవాటయి జీవితంలో కొత్త నశించి జీవితం బోరు కొడుతూ ఉంటుంది. మనసు కొత్త అనుభవాల కోసం, అనుభూతుల కోసం పరిగెడుతుంది. అన్ని రకాల ఆకర్షణలు తగ్గుతాయి. జీవితంలోని ప్రాక్టికాలిటి మొత్తం భవిష్యత్తును ఆక్రమించుకుంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఒక జంట మనసుల్లో ఒకరి పట్ల మరొకరికి ఉండే భావనే నిజంగా అన్ని ఆకర్షణలకు అతీతమైన పవిత్ర భావన. అదే ప్రేమంటే. ఈ కాన్సెప్ట్ మీద వచ్చిన చిత్రమే ఆమోర్ అనే ఈ ఫ్రెంచ్ సినిమా…

ఆమొర్ 2012 లో వచ్చిన సినిమా. ఎన్నో అవార్డులు ఈ చిత్రాన్ని వరించాయి. ముఖ్య పాత్రలలో నటీంచిన జీన్ లూయిస్ ట్రిన్తిగ్నెంట్, ఎమ్మాన్యులె రివా మనలను మరో ప్రపంచంలోకి తీసుకు వెళతారు. ఇద్దరూ ఎనభై దాటిన వారే. ఈ సినిమాలో పాత్రలు కూడా ఎనభై దాటిన వ్యక్తులే అవడం వల్ల వీరిని ఆ పాత్రలకు ఎన్నుకోవడం అత్యంత సముచితమైన నిర్ణయమని అర్ధం అవుతుంది ఈ సినిమా సాంతం చూస్తే. వారి నటన మనలను ఎంతగా ఆకట్టుకుంటుందంటే మనం వారి జీవితంలోని ఆన్ని పార్శ్వాలను స్వయంగా అనుభవిస్తాం. అందుకే ఈ చిత్రం 21వ శతాబ్దపు గొప్ప సినిమాలలో 42వ స్థానం దక్కించుకోగలిగింది.

పియానో టిచర్ల అయిన ఆనీ, జార్జెస్ ఇద్దరూ రిటైరయి ప్రశాంత జీవితం గడుపుతుంటారు. వీరికి ఒక్కతే కూతురు. పెళ్ళి అయి తన జీవితాన్ని తాను తల్లి తండ్రులకు దూరంగా గడుపుతుంటుంది. అన్ని సౌకర్యాలతో ఉన్న ఇల్లు, అర్ధికంగా ఏ సమస్యా లేని జోవితం వారిది. ఒక రోజు ఈ భార్యా భర్తలిద్దరూ వారి శిష్యుడు అలెగ్జాండ్రే నిర్వహించిన ఒక కంసర్ట్ కు వెళ్ళి వస్తారు. వారి ఇంటి తాళం పగులగొట్టీ ఎవరో ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేసారని అర్ధం అవుతుంది. మరుసటిరోజు బ్రేక్ఫాస్ట్ సమయంలో మొదటి సారి జార్జెజ్ భార్యలో మార్పు కనిపెడతాడు. కొంత సేపు భర్త పిలుస్తున్నా ఆనీ ఈ లోకంతో సంబంధం లేనట్లు మౌనంగా ఉండిపోతుంది. భర్తను గుర్తుపట్టదు. భర్త ప్రశ్నలకు జవాబివ్వదు. కళ్ళలో ఏ భావం లేకుండా నిర్వికారంగా ఉండిపోతుంది. జార్జెస్ భయపడి ఆమెను హాస్పిటల్ కు తీసుకువెళ్ళడానికి తయారయినప్పుడు ఆమె మళ్ళీ యధా స్థితికి వస్తుంది. అంతకు ముందు ఏం జరిగిందో ఆమెకు గుర్తు ఉండదు. కాని అది ఆమె మెదడుకు వచ్చిన ఒక స్ట్రోక్ అని తరువాత జార్జెస్ తెలుసుకుంటాడు. అలా ఆమె వైద్యం మొదలవుతుంది.

తరువాత ఆమెకు జరిగిన సర్జరీ వికటించి ఆమెకు పక్షపాతం వచ్చి శరీరంలో కుడి భాగం పనిచేయకుండా అయిపోతుంది. ఆమె శాశ్వతంగా వీల్ చేర్ కు పరిమితమవుతుంది. ఆమె భాధ్యత జార్జెస్ పై పడుతుంది. ఆమెకు అతనే అన్నీ అయి చూసుకుంటాడు. ఆమెకు తిండి పెట్టడం నుంఛి పడుకోబెట్టడం దాకా అన్ని పనులు అతను చాలా ప్రేమతో చేస్తాడు. అమె సౌకర్యం కోసం నర్సులను నియమిస్తాడు. కాని తను చూసుకున్నట్లు ఆమెను వారు చూడడం లేదని తెలిసి ఒక నర్సును మానిపిస్తాడు కూడా. తన భార్యను చులకన దృష్టితో ఎవరు చూసినా భరించలేక ఆమె భాద్యతను పూర్తిగా తన మీద వేసుకుంటాడు. అతను కూడా వయసు రీత్యా పూర్తిగా అలసిపోతున్నా, డబ్బు నీళ్ళలా ఖర్చుఅవుతున్నా భార్య కు ఏ విషయంలో తక్కువ జరగకుండా నిత్యం కనిపెట్టూకుంటూ ఉంటాడు. వీరి దైనిక దినచర్యను చిత్రించిన విధం కళ్ళలో నీరు తెప్పిస్తుంది. మంచానికి పరిమితమైన జీవితంలో ఎన్ని కష్టాలుంటాయో, ఆ భార్యను అంత వయసులో చూసుకోవల్సి రావడం ఎంత ఎమోషనల్ గా శారీరికంగా మనిషిని పీల్చి వేస్తుందో ఆ ఇద్దరి నటులు తమ నటనలో జీవించి చూపారు. గొప్పగా బ్రతికిన తన జీవితం ఇలా అవడం సహించలేననీ ఒక సారి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. కాని ఆమె శారీరిక స్థితి దానికి కూడా సహకరించదు. తను ఇలా బ్రతకలేకపోతున్నానని భర్తకు చెబుతుంది.

ఒక రోజు ఆనీ ప్రియ శిష్యుడు అలెగ్జాండ్రె వీరిని కలవడానికి వస్తాడు. ఆనీ ఎంతో ఉత్సాహంగా అతన్ని కలిసి అతనితో మాట్లాడుతుంది. భార్యను ఆ స్థితిలో చూసి జార్జెస్ సంతోషిస్తాడు. కోలుకుంటుందని ఆనందిస్తాడు. కాని అంతలోనే మరో సారి స్ట్రోక్ వచ్చి ఆమె పరిస్థితి ఇంకా దిగజారుతుంది. ఈ సారి ఆమె మాట కూడా పడిపోతుంది. ఇంకా బలహీనపడిపోతుంది. జార్జెజ్ ఆమెను ఇప్పుడు అన్నీ తానే అయి చూసుకుంటూ ఉంటాడు. కాని ఈ స్థితిలో ఆమెకు అన్ని పనులు చేయడం అతన్ని విపరీతమైన ఒత్తిడికి గురి చేస్తుంది. నర్సుల సహాయంతో ఆమెకు అన్నీ తానయి చూసుకుంటూ ఉంటాడు. వారి కూతురు తల్లిని అలాంటి స్థితిలో ఉన్న పేషంట్లను చూసే కేర్ సెంటర్ లో చేర్పించాలని సూచిస్తుంది. తండ్రి పడే బాధ, తల్లి ని ఆ స్థితిలో చూడలేని బేలతనంతో తండ్రితో ఒక సారి పోట్లాడుతుంది. ఇంటిలో తల్లిని ఉంచడం సరైన నిర్ణయం కాదని వాదిస్తుంది. కాని జార్జెస్ వినడు. ఆనీ కి తాను మాట ఇచ్చానని, ఎట్టి పరిస్థితులలో ఆమెను ఇంటినుండి దూరంగా, తనకు దూరంగా పరాయివారి మధ్య ఒంటరిగా ఉంచనని గట్టిగా చెపుతాడు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు భార్యను ఆ స్థితిలో చూసి వారి మొహంలోని బాధ, ఆశ్చర్యం, విస్మయం భార్యను కలవరపెడుతాయని జార్జెస్ పడే బాధ, దానికి అతను తీసుకునే జాగ్రత్తలు వీటన్నిటీని దర్శకుడూ చూపీంచిన విధానం బావుంది. ఎంతో సున్నితమైన భావాలను ఆ వృద్ధ నటులు పలికించిన తీరు మర్చిపోలేం.

క్షీణిస్తున్న భార్య స్థితి జార్జెస్ తట్టుకోలేకపోతాడు. ఒక రోజు భార్య మంచం దగ్గర కూర్చుని ఆమెకు తన చిన్నతనం గురించి చెప్తాడు. ఆనీ విపరీతమైన ఒత్తిడిలో ఉంటుంది. భర్త చెప్పే కథ విని కొంచెం ఆమెలో ఒత్తిడి తగ్గి కాస్త ప్రశాంతత కనిపిస్తుంది. ఆ స్థితిలో ఆమెను ఉంచి జార్జెస్ పక్కన ఉన్న మరో దిండు తీసుకుని ఆమె మొఖం పై ఒత్తిపెట్టి ఆమె శరీరాన్ని ఆ భాధనుండి శాశ్వతంగా విముక్తి కలిగిస్తాడు. తరువాత అతను బజారుకు వెళ్ళి ఆమె కు చాలా ఇష్టమైన పూలు తీసుకువచ్చి ఆమెను వధువుగా తయారు చేస్తాడు. ఆ ఇంట్లో ఒక పావురం పొరపాటున కిటికీ గుండా వస్తుంది. దానికి బైటికివెళ్ళే దారి కనపడదు. జార్జెస్ ఆ పావురాన్ని బైటికి పంపించి తన భార్య పడకగది తలుపులను పూర్తిగా టేపుతో మూసేస్తాడు. అంతకు ముందు ఒక ఉత్తరం వ్రాసి ఉంచుతాడు. అండులో పక్షిని పంజరం నుండి విముక్తురాలిని చేసానని ప్రస్తావిస్తాడు.

సినిమా చివర్లో అతనికి ఆనా వంటగదిలో గిన్నెలు కడుగుతూ కనిపిస్తుంది. తరువాత కోటు తీసుకుని బైటికి వెల్తూ ఆమె అతన్ని రమ్మని పిలవడం, జార్జెస్ ఆమెను అనుసరించడం కనిపిస్తుంది. అతను ఎలా మరణించాడు అన్న విషయంలో స్పష్టత ఉండదు కాని భార్యను అనుసరించాడు అన్న అర్ధం వచ్చేలా ఈ సినిమాను ముగించారు దర్శకులు. ఆఖరున ఒంటరిగా ఇంట్లో తల్లిదండ్రుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అన్నీ గదులు పర్యవేక్షిస్తున్న అతని కూతురు పై చివరి షాట్ తో సినిమా ముగుస్తుంది. సినిమా చాలా స్లోగా నడుస్తుంది. ఎనభైలు దాటిన వృద్ధుల జీవితాలలో వేగం ఉండదు. వారి నడక కాని వారి పనులు కానీ ఎంత మెల్లగా నడుస్తాయో సినిమా అదే టేక్ లో చివరి దాకా సాగుతుంది. అందువల్ల మనం ఆ వృద్దుల జీవితంలోని కష్టాన్ని అర్ధం చెసుకోగలుగుతాం. భార్య ను బాత్రూమ్ కి తీసుకువెళూతూ ఆమెను ప్రతి నిత్యం మోస్తూ భరిస్తూ, కుర్చీ నుండి మంచం పైకి మారుస్తూ ఆ భర్త పడే శారీరిక శ్రమ మనం అనుభవిస్తాం. భర్తతో అన్ని పనులు చేయించుకుంటూ అసహాయమైన చూపులతో ఎమాన్యులే ఆనీ గా అత్యద్బుతంగా నటించింది. ఒకప్పడు గొప్ప పియానో టీచర్ ఎందరినో ప్రభావితం చేయగల ఆమె చేతులు పడిపోయి కనీసం వాటిని కదల్చలేని స్థితిలో అన్నిటికీ భర్త మీద ఆధారపడుతూ గడపవల్సిన ఆమె స్థితి దానిలో బాధను అనుభవిస్తూనే భర్త కోసం అన్ని బాగున్నట్లు నటించవల్సి రావడం దీని వలన అదనంగా ఆమె అనుభవించే ఒత్తిడి ని ఆ నటి తన ముఖ కవళికతో ప్రదర్శించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రేమ అంటే అన్నీ బాగున్నప్పుడు, అందంగా ఉన్నప్పుడు అనుభవించే ఆనందమైన స్థితి కాదు. ఆ ఆనందం ఈ దంపుతుల ప్రేమ ముందు నిరర్ధకంగా కనిపిస్తుంది. భార్యను బాత్రూమ్ లో కూర్చోపెడుతూ సున్నితంగా ఆమెను హాండిల్ చెసే ఆ ముసలి వ్యక్తిలోని ప్రేమ ఆ టచ్ లోని కమ్యూనికేషన్ ఎన్ని భావాలను పలికిస్తాయో.

ముడతలు పడ్డ ఆ ముఖాలలో ఒకరితోడును మరొకరు ఆస్వాదిస్తున్నప్పుడు కనిపించిన ఆనందం, సరిగ్గా నడవలేని పరిస్థితులలో ఒకరి చేతి నుండి మరొకరి చేతికి అందే సాంత్వన, ఒకరి సాంగత్యంలో మరొకరు పొందే ఓదార్పు ఈ జంట మధ్య ప్రేమను గొప్పగా వివరిస్తాయి. అబద్దపు వర్ణనలు, అసంబద్ద ప్రేలాపనలు, ప్రతిజ్ఞలు లేకుండా కేవలం ఒక మనిషికి మరో మనిషి ఇవ్వగలిగే తోడు, సాంత్వనను ఈ సినిమా చూపిస్తుంది. మైఖిల్ హనీకే దర్శకత్వం, నటుల నటన, అద్భుతమైన స్క్రీన్ ప్లే, ఈ చిత్రాన్ని మరపురాని కావ్యంగా మలచడానికి దోహదం చేసాయి. గొప్ప ప్రేమ కథలతో వచ్చిన సినిమాల లిస్టులో ఇది తప్పక ఉండవలసిన చిత్రం.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply