ఆఫ్ లైన్ బోధనకు ఆన్ లైన్ ప్రత్యామ్నాయమా!

నిత్యం ఆవిష్కృతమయ్యే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మానవాళి వికాసాన్ని మునుపెన్నడూ లేనంతగా పరుగులు పెట్టిస్తుంది. ఆధునిక జీవితం మరింత సౌకర్యవంతం, సుఖవంతం కావడానికి దోహదపడుతుంది. పరిష్కారం కాని అనేకానేక క్లిష్టమైన సమస్యలను చిటికెలో తేల్చి పారేస్తుంది. ఇవాల్టి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యేకించి ఇంటర్నెట్, ప్రపంచంలోని ప్రతి పౌరుడి జీవితంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావంతమైన పాత్ర పోషిస్తూ ఉన్నది. ఇంటర్నెట్ ను ఉపయోగించుకోని, ప్రభావితం కాని ప్రజా జీవన రంగం లేదంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ప్రపంచ గతిని మార్చి వేసే పాత్ర పోషిస్తున్న అత్యాధునిక ఆవిష్కరణకు సైతం చీకటి వైపులు లేకపోలేదు. ఆ మాటకొస్తే ఏ అభివృద్ధికరమైన సాంకేతిక పరిజ్ఞానానికి అయినా దీపం చుట్టూ అలుముకునే చీకటి లాగా, వ్యాధి నుంచి నయం చేసే ఔషధం వల్ల కలిగే దుష్పరిణామాల లాగా అది ఒక అనివార్యతేమో! ప్రకృతి ప్రకోపంతో విపత్తులు సంభవించిన ప్రతి సందర్భంలోనూ సాంకేతిక పరిజ్ఞానం పాత్ర సాధారణమైనదేమి కాదు. మానవాళి మనుగడనే ప్రమాదంలోకి నెట్టి వేసిన కరోనా లాంటి మహా విపత్తు సమయాల్లోనూ ఈ పరిజ్ఞానమే దారి దీపం. మనుషుల్ని మనుషులు తాకకూడదనే ఒక భయానక స్థితిలో కూడా ‘వర్చువల్’ గా అందరికీ అందరూ అతి సన్నిహితంగానే ఉంటున్నారు. అనేక దేశాల ప్రభుత్వాధినేతలు టెలీ కాన్ఫరెన్స్ లో కలుసుకుంటున్నారు. మన దేశ ప్రధాని అనేకసార్లు ముఖ్యమంత్రులతో దృశ్య మాధ్యమ సమావేశాలు జరుపుతున్నారు. కార్పొరేట్ వాళ్లకైతే ఇది ఒక మామూలు విషయం. డాక్టర్లు నాడీ పట్టకుండానే ఇ- పద్ధతిలోనే రోగులను పరీక్షిస్తున్నారు. అనేక వ్యాపార లావాదేవీలు నిరంతరం ఏదో ఒక స్థాయిలో కొనసాగుతూనే ఉన్నాయి.

ప్రపంచానికే తాళం పడింది. కాలు బయట పెడితే కరోనా కాటుకు బలవుతామనే భయం అంతటా ఆవరించి ఉన్నది. సమస్తం స్తంభించి పోయింది. సమూహంగా ఉండే ఏ ఒక్క కార్యకలాపం జరిగే వీలు లేదు. ప్రధానంగా వాటిలో ముందు వరుసలో ఉండే విద్యా సంస్థలు అన్ని స్థాయిల్లోనూ మూతపడ్డాయి. పాఠశాలలు విద్యా సంవత్సరం ముగింపున కరోనా సెలవులు రావడంతో మిగిలిపోయిన పాఠ్యాంశాలు పెద్దగా ఉండే అవకాశము లేదు. ఇంజనీరింగ్, వైద్య, మేనేజ్మెంట్, విశ్వ విద్యాలయాల విద్యా రంగంతో పాటు సాధారణ డిగ్రీ స్థాయిలో బోధించాల్సిన అంశాలు ఎంతో కొంత మిగిలిపోయి ఉన్నాయి. వాటిని పూర్తి చేసే పనితో అంతటా ఆన్ లైన్ బిజీ అయిపోయారు. నెల రోజులకు పైగా విద్యార్థులు ఖాళీగా ఉండటం వల్ల అభ్యసన ప్రక్రియకు అంతరాయం ఏర్పడుతుందేమోనన్న ఆందోళన అంతటా నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్ తరగతులు, ఆన్లైన్ బోధన ఊపందుకున్నది. కేజీ నుండి పిజి వరకు ఇదే వరస. సాధారణంగా ఇటువంటి కార్యకలాపాల్లో ప్రైవేటు రంగంలో ఒకరికి మించి ఒకరు పోటీలు పడి మరీ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. రోజువారీ తరగతిగది అనుభవం, అనుభూతి కంటే ఆన్ లైన్ అనుభవం భిన్నంగా ఉంటుంది. అసాధారణమైన పరిస్థితుల్లో సంప్రదాయేతర పద్ధతుల్లో విద్యాబోధన జరగటం అవసరమైనది, ఆహ్వానించదగినది. నిజానికి అనేక దేశాల్లోనూ మనదేశంలోనూ ఆన్ లైన్ పరీక్షల విధానం మొదలయ్యి చాలా కాలమే అవుతున్నది. సాంకేతిక హంగులతో బోధన కొనసాగించడం వల్ల విద్యా సంవత్సరం నష్టపోకుండా బోధనాంశాలు పరిపూర్తి చేయడానికి ఎంతో దోహదపడతాయి. ఈ సంక్షుభిత సమయంలో అనియతమైన పద్ధతిలో బోధన నెరపడం తాత్కాలిక ప్రత్యామ్నాయంగా బాగా ఉపయోగపడుతుంది. కానీ, నేడు చర్చంతా ఈ పద్ధతిని, విధానాన్ని శాశ్వతీకరించవచ్చు, వాస్తవ, భౌతిక తరగతి గది బోధనా వాతావరణం ఇక గతం అనుకునేలా చర్చలు ఊపందుకున్నాయి.

ఏ రంగ పురోభివృద్ధి కైనా శాస్త్ర, సాంకేతిక తోడ్పాటు, వినియోగం నేడు అనివార్యం. విద్యారంగానికి అది మరింత ఉపయుక్తంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతంలో ఇంట్లో కూర్చుని దేశ రాజధాని ఢిల్లీలో జరిగే బోధనను వినే అవకాశం ఉన్నది. ఏక కాలంలో వేలాది, లక్షలాది విద్యార్థులకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అయితే ఇవి ఇప్పటికిప్పుడు సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా రూపొంది ఫలితాత్మకంగా ఉంటాయా? విద్యా లక్ష్యాలను నెరవేర్చే ఉన్నతమైన ఉపకరణాలుగా రూపు తీసుకుంటాయా? లాంటి ప్రశ్నలు అనేకం తలెత్తుతున్నాయి. విస్తృతార్థంలో చూసినప్పుడు విద్యా బోధన ధృవ పత్రాలను అందిపుచ్చుకోవడానికి మాత్రమే సంబంధించినది కాదు. అదొక ఉన్నతమైన మనిషిని, సమాజాన్ని ఆవిష్కరింప చేసే ఉదాత్తమైన లక్ష్యానికి సంబంధించింది. భారతీయ సమాజం తీవ్రమైన అసమానతలతో కూడుకున్నది. అన్ని రంగాల్లో ఆ అసమానతలు రాజ్యమేలుతున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో కూడా అవి ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. డిజిటల్ డివైడ్ ఒక వర్తమాన వాస్తవం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండటం మాత్రమే అన్ని ఆన్ లైన్ సేవలను అందిపుచ్చుకునే అవకాశం ఇవ్వకపోవచ్చు. ఆన్ లైన్ సేవలను అంది ఇవ్వగలిగే వ్యవస్థీకృత యంత్రాంగం ఉండాలి అందుకో గలిగే స్థితిలో విద్యార్థిలోకం ఉండాలి. కరానా కల్లోలం, దాని ఫలితంగా వచ్చిన లాక్ డౌన్ సమయంలో ఒక తాత్కాలిక ఏర్పాటుగా ఆన్లైన్ తరగతుల బోధన ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రయోజనకరమైనవే! ఈ సందర్భంలోనే 2030 వరకు దేశమంతా ఆన్లైన్ విద్యకు మారిపోతుందని, తరగతి గదులే మాయమవుతాయన్న స్థాయిలో చర్చ జరుగుతున్నది. నిజంగా అది సాధ్యమా? వాంఛనీయమా? బడీడు పిల్లలు బడిలో ఒకచోట కూర్చొని అమాయకంగా ప్రపంచాన్ని అప్పుడప్పుడే తెలుసుకునే ప్రక్రియ ఆన్లైన్లో సాధ్యమవుతుందా?

పరస్పరం ప్రత్యక్షంగా మనుషులు ఒకచోట సాన్నిహిత్యంగా కూర్చొని దేన్నయినా బోధించటం, నేర్చుకోవడం ఒక సజీవ సంబంధాన్ని నిర్మించడానికి దోహదపడుతుంది. పరస్పర భావోద్వేగాల ప్రసారంతో బోధకులకు విద్యార్థులకు మధ్య మానవీయ వారధి ఏర్పడుతుంది. బోధనలో యంత్రాలను, వివిధ రకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించడం బోధనా ప్రక్రియ మరింత ఫలప్రదం కావడానికి దారితీస్తుంది. కానీ మొత్తంగా బోధనే యాంత్రికీకరణ జరిగితే మానవ సంబంధాల్లో ఉండాల్సిన సున్నితమైన అంశ దెబ్బతిని మానవీయమైన వ్యక్తులుగా కాకుండా హృదయం లేని జ్ఞాన జీవులుగా ఎదిగే ప్రమాదం ఉంది. సామాజిక స్పృహ, బాధ్యత లేని జ్ఞానం సమాజానికి నష్టదాయకమే కాకుండా మనుషులు స్వార్థ జీవులుగా, వ్యాపార జీవులుగా మాత్రమే మారిపోతారు. భిన్నమైన నేపథ్యాల నుండి వచ్చి ఒక చోట చేరే వేదికను తరగతి గది కల్పిస్తుంది. ఇప్పటికే భిన్నత్వం పట్ల అసహనం, అగౌరవం పెరిగిపోతున్న కాలంలో తరగతి గదితో సంబంధంలేని ఏకాంత అభ్యాసం ఎటువైపు దారి తీస్తుంది? విద్యకు ఉండే ప్రధాన లక్ష్యాల్లో మానవ సంబంధాల్ని మరింత ఉన్నతీకరించడం కూడా ఒకటి కదా! మరి మనుషులు అసలు కలుసుకోకుండా ఎవరి ఏకాంతంలో వారు నేర్చుకోవడం అంటే స్నేహాలు ఎక్కడ జనిస్తాయి, బంధాలు ఎలా బలపడతాయి? ఆలోచనల ప్రసారం లేకుండా, భిన్నమైన కోణాన్ని దర్శించకుండా, నేర్చుకునే క్రమంలో అనేక రకాల ప్రశ్నల పరంపర లేకుండా సాదాసీదా సంశయ నివృత్తితోనే జ్ఞానం ఒనగూరుతుందా? విద్యాసంస్థ అంటే బ్లాక్ బోర్డు, గ్రీన్ బోర్డు, ప్రయోగశాలలు, డిజిటల్ క్లాస్ రూమ్ లకు మించిన ప్రపంచం. ఆటలు, పాటలు, ఊహలు, ఊసులు అనేక అంశాలతో కూడిన ఆత్మీయ సమ్మేళనం. బాల్య, యవ్వన లతలన్నీ బడి, కళాశాల పందిళ్ళ మీద నుండి పారుతూ విస్తరిస్తాయి కదా! ఆ వాకిళ్ల నుండే నడిచి వస్తూ ప్రధాన స్రవంతిలోకి సాగిపోతాయి కదా! ఎవరు ఎవరితో కలవకుండానే, బడిబాటలో కలిసి నడవకుండానే, కలలు కలబోసుకోకుండానే కలిగే జ్ఞానం ఎటువంటిది? మనిషి తనపు తడి అంటకుండానే జ్ఞాన సమాజాన్ని ఎలా నిర్మించుకోగలం? ఎంతకాలం నిలుపుకోగలం?

కరోనా కాలాన్ని సాకుగా చూపెట్టి ప్రభుత్వాలు అనేక మౌలికమైన, దీర్ఘకాలిక ప్రభావితం వేసే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అంతా మార్కెట్ కు అప్పగించే విధాన మార్పులు చకచకా జరిగిపోతున్నాయి. 2030 వరకల్లా ఉన్నత విద్య బోధనా రంగం అంతా ఆన్ లైన్ వైపుగా దూసుకెళ్తున్నదనే ప్రచారం బాగా జరుగుతున్నది. విద్యారంగ మౌలిక సదుపాయాలు లేకుండానే ఆన్ లైన్ చదువులే ప్రత్యామ్నాయం అని ప్రచారం జరుగుతున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యారంగంలో ఖాళీగా ఉన్న పోస్టులు ప్రధానంగా బోధనా ఖాళీలను భర్తీ చేయకుండానే ఉద్దేశపూర్వకంగానే పక్కకు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో గత పదేళ్లకు పైగా కేజీ నుంచి పీజీ వరకు ఉండే బోధనా సిబ్బంది నియామకాలు వద్దనుకున్నవి ప్రభుత్వాలు. శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన స్థానంలో ఒప్పంద ఉద్యోగాలను తీసుకొచ్చారు. గత మూడేళ్లుగా అతిధి అధ్యాపకుల పేరుతో అయిందనిపిస్తున్నారు. జూనియర్, డిగ్రీ, యూనివర్సిటీ స్థాయిలో టీచింగ్ ఫ్యాకల్టీ సంఖ్య మొత్తం ఉండాల్సిన సంఖ్యలో 30 శాతం మించి కూడా లేదు. ఈ ప్రభుత్వాలకు విద్యారంగo ప్రాధాన్యతా క్రమంలో కూడా చివరిది కూడా కాకుండా పోయింది. దీనికితోడు ఆన్లైన్, దూర విద్య వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం ఏమీ లేకుండా పోతుంది కాబట్టి ఆ పద్ధతిని మరింత ప్రోత్సహించి ఏ ప్రైవేట్, కార్పోరేట్ సంస్థలకో ఆన్లైన్ పాఠాలను చెప్పమని పనుల్ని అప్పగించవచ్చు. అప్పుడు విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా ఇవ్వడం తప్పుతుంది! ఇప్పటికే డిగ్రీ స్థాయిలో అనేక కోర్సులను, తెలుగు మీడియంను ఎత్తివేశారు. అనేక వాటిని ‘మూక్స్’ ( MOOCS- మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కొర్సెస్)లోకి నెట్టి వేయడంతో ఆయా కోర్సులకు అధ్యాపక పోస్టుల రద్దయిపోతాయి. ఇంటర్నెట్ ఆధారిత చదువు ఏదైనా ప్రధాన స్రవంతి విద్యార్జనకు సప్లిమెంట్ మాత్రమే గాని సబ్స్టిట్యూట్ మాత్రం కాదు. ఆసాధారణ సమయాల్లో తాత్కాలిక ప్రత్యామ్నాయంగా ఆన్ లైన్ తరగతుల నిర్వహణ, అంతేగాని అదే శాశ్వతం చేసే ప్రయత్నాలు సమాజంలో మరిన్ని కొత్త వైరుధ్యాలను తీసుకొస్తాయి.

నిజానికి భౌతికంగా తరగతి గదిలో జరిగే జ్ఞాన బదలాయింపు ప్రక్రియ అంతర్జాలం ద్వారా అంత సమర్థవంతంగా జరిగే అవకాశాలు లేనేలేవు. ఇప్పటికే అనేక సర్వేలు ఆఫ్ లైన్ విద్యాబోధన ప్రక్రియంత సమర్థవంతంగా, ఫలితాత్మకంగా ఆన్లైన్ బోధన ఉండలేకపోతున్నది అని తేల్చాయి. దూర విద్యా విధానం ద్వారా విద్యనభ్యసించే వాళ్ళు, అనేక వృత్తులలో స్థిరపడి సమయ పరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రెగ్యులర్ కోర్సుల వారికి ఆన్లైన్ ద్వారా తరగతి గదిలో అందుకునే చదువుకు అదనంగా నేర్చుకోవడానికి, అనేక వనరులను అన్వేషించడానికి ఉపయోగపడే పద్ధతి మాత్రమే. సాంకేతిక వనరులు చాలినంత లేని ప్రత్యేకించి బహుజన సామాజిక శ్రేణులను అననుకూల పరిస్థితుల్లోకి నెట్టివేసి ఉద్యోగ నైపుణ్యాలను నిర్వీర్య పరిచే ప్రమాదమున్నది. అయితే ఒక్కటి మాత్రం నిజం అసలే చదువు సాగని పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా ఎంతోకొంత సాగే అవకాశం అయితే ఉన్నది. ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్లో నేటి అనివార్య (కరోనా కాలం) పరిస్థితుల్లో ఆన్లైన్ తరగతులు నడిపించడం హర్షించదగినది, ఆహ్వానించ దగినది. నెలల తరబడి విద్యార్థులు పుస్తకాలను మూసి ఉంచే పరిస్థితిని తప్పించి క్రమం తప్పకుండా ఏదో ఒకటి చదవాల్సిన, వినాల్సిన స్థితికి రావడం నిజంగా ప్రయోజనకరమే! సమస్యల్లా ఈ సాకుతో ప్రభుత్వాలు విద్యా రంగానికి సంబంధించిన మౌలిక అంశాలపై దృష్టి పెట్టకుండా, నియామకాలను మొత్తంగా నిలిపివేస్తే ప్రభుత్వ విద్యా రంగం మరింతగా కుదేలవడమే కాకుండా కనుమరుగవుతుంది కూడా! సాంకేతిక పరిజ్ఞానం విద్యా వ్యవస్థను మరింత పరిపుష్టి చేయడానికి ఉపయోగపడాలి తప్ప ప్రభుత్వాలు తమ చేతులు దులుపుకోవడం కోసం మాత్రం కాదు! అయినా లెర్నింగ్ ఫ్రమ్ హోమ్, వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఏ నవ్య సమాజాన్ని ఆవిష్కరిస్తుందో మరీ!?

పుట్టింది పూర్వపు నల్లగొండ(సూర్యాపేట) జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామం. అధ్యాపకుడు, సామాజిక కార్యకర్త. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కాలేజీలో ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. విద్యార్థి ఉద్యమాల నుండి తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేపథ్యం. వివిధ పత్రికల్లో సామాజిక, రాజకీయ, అంతర్జాతీయ అంశాల పై వ్యాసాలు రాస్తున్నారు. "తెలంగాణా సమగ్ర చరిత్ర" సహ రచయిత. "వీక్షణం" మాస పత్రిక ఎడిటోరియల్ కలెక్టివ్ సభ్యుడు.

Leave a Reply