ఇరవైయ్యవ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో మొదలైన ఆధునిక తెలుగుభాషా సంస్కరణోద్యమం (వచనభాషా సంస్కరణోద్యమం) రెండవ దశాబ్దికి చేరుకునేసరికి తెలుగు వాడుకభాషా వివాద రూపంలో తారాస్థాయికి చేరుకుంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో గంజాం, విశాఖపట్నం, గోదావరి జిల్లాల పరిధిలోని స్కూళ్ల తనిఖీ అధికారిగా నియమింపడిన జే. ఏ. యేట్స్ అదివరకే తెలుగు బోధనలో నూతన, హేతువాద పద్ధతులను ప్రవేశపెట్టాడు. ఆయన అప్పట్లో ప్రజలు వ్యవహరించేభాషకూ, పుస్తకాల భాషకూ మధ్య ఉన్న తారతమ్యాన్ని గుర్తించాడు. ఈ సమస్య గురించి ఆయన మిసెస్ ఏ. వీ. ఎన్. కాలేజీ ప్రిన్సిపాల్ ఐన పీ. టీ. శ్రీనివాస అయ్యంగార్ ను సంప్రదించాడు. (చ రిత్రకారుడూ, విద్యావేత్తా ఐన అయ్యంగార్ తెలుగును వాడుక భాషగా ప్రచారం చేయడానికి 1909 లో “తెలుగు టీచింగ్ రిఫార్మ్ సొసైటీ” (తెలుగు బోధనా సంస్కరణ సంఘం) ని ప్రారంభించాడు. 1911 లో ఆయన లాంగ్మాన్స్ అరిథ్మెటిక్కులు అనే పేరుతో అంకగణితం మీద ఒక పాఠ్య పుస్తకాన్ని ప్రచురించాడు. అదే సంవత్సరంలో ఆయన సంప్రదాయవాదుల అభిప్రాయాలను విమర్శిస్తూ ఇంగ్లీష్ లో డెత్ ఆర్ లైఫ్: ఎ ప్లీ ఫర్ ద వెర్నాక్యూలర్స్, అనే కరపత్రాన్ని ప్రకటించాడు.) యేట్స్ అయ్యంగార్ ను ఈ విషయం గురించి గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తిలతో చర్చించమన్నాడు. (అప్పారావు తన కన్యాశుల్కం నాటకానికి రాసిన ముందుమాటలో కావ్యభాషకున్న “మితిమీరిన, వాడుకలోలేని మరియు సంస్కృత భాషా లక్షణాలను” తొలగించి, మాట్లాడే భాషకు దగ్గరగా ఉండే మాండలికాన్ని వాడాలని వాదించాడు. రామమూర్తి శాస్త్రబద్ధంగా అభివృద్ధి చెందుతున్న భాషాశాస్త్రం, ధ్వనిశాస్త్రాలను అభ్యసించి, అప్పారావుకు తోడుగా భాషా సంస్కరణ విషయంలో కృషి చేశాడు.) ఇదే సమస్య గురించి యేట్స్ ఆ కాలేజీలోనే లెక్చరర్ గా ఉన్న చెట్టి లక్ష్మీనరసింహంతో కూడా చర్చించాడు. ఇందుకు స్పందించి ఆయన గ్రీకు పురాణ కథలు (గ్రీక్ మిత్స్) అన్న పుస్తకాన్ని సులభ తెలుగు శైలిలో తిరగరాశాడు. స్కూల్ తనిఖీ అధికారిగా తన హోదాను ఉపయోగించి యేట్స్ ఆ పుస్తకాన్ని స్కూల్ ఫైనల్ పరీక్షలకోసం ఉపవాచకంగా పాఠ్య ప్రణాళికలో చేర్చాడు. సంప్రదాయవాదులు దీన్ని తీవ్రంగా వెతిరేకించారు. జయంతి రామయ్య పంతులు నాయకత్వంలో వాళ్ళు ఇందులోని వాడుక భాషా శైలిని గ్రామ్యంగా (అనాగరికంగా) పరిగణించి విమర్శించారు. (రామయ్య పంతులు లా చదివి, గవర్నమెంట్లో పనిచేసి డిప్యూటీ కలెక్టర్ గా రిటైర్ అయ్యాడు. ఆయన తెలుగు వ్యాప్తికోసం 1911లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు (ఆంధ్ర లిటరరీ సొసైటీ/అకాడమీ ) అనే సంఘాన్ని ప్రారంభించాడు. గ్రాంథికానికి (కావ్య శైలికి) గట్టి మద్దతుదారుడుగా ఆయన ఎ డిఫెన్స్ అఫ్ లిటరరీ తెలుగు తోబాటు సంఘం ప్రచురించే పత్రికలో ఎన్నో వ్యాసాలను రాశాడు.) రామమూర్తి ఆధునికుల వైపు నిలబడి తెలుగులోనూ, ఇంగ్లీష్ లోనూ ఎన్నో వ్యాసాలేకాక 1913లో ఈ విషయంపై ఎ మెమొరాండం ఆన్ మాడర్న్ తెలుగు అన్న ఒక పుస్తకాన్నిఇంగ్లీష్ లో రాశాడు. సంప్రదాయవాదులు “ప్రాచీన” తెలుగు గొప్పదనాన్ని గురించి మాట్లాడారు. వాళ్ళు తమకు తామే “ఆధునికత”కు ఛాంపియన్లుగా ప్రకటించుకున్న ఈ నలుగురిని మహాభారతంలోని “దుష్టచతుష్టయం”గా పేర్కొన్నారు. జయంతి రామయ్య పంతులు ఇంకా ముందుకెళ్లి ఎ డిఫెన్స్ అఫ్ లిటరరీ తెలుగు (1913) అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో రాశాడు. సంప్రదాయవాదులు ఇంతటితో ఊరుకోలేదు. వాళ్ళు స్కూల్ ప్రణాళికలో పొందుపరచిన పుస్తకానికి వెతిరేకంగా పదివేల సంతకాలను సేకరించి బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక అభ్యర్థనను సమర్పించి దాన్ని 1914 లో తొలగించేట్లు చేశారు. గురజాడ అప్పారావు కూడా రామయ్య పంతులు వాదనలను ఖండిస్తూ, సంభాషణాపరమైన భాషను ఉపయోగించడాన్ని సమర్థిస్తూ 1914 లో మినిట్ అఫ్ డిసెంట్ అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో రచించాడు. తెలుగు పుస్తకాల్లో వాడవలసిన భాష గురించి వాదప్రతివాదాలు ఇంగ్లీష్ లో జరగడం, వారి వారి వాదనలకు మద్దతుగా ఇంగ్లీష్, ఇతర పాశ్చాత్య భాషలనుండి ఎన్నో ఆధారాలు చూపెట్టడం, ఇవన్నీ ఇంగ్లీష్ లో పుస్తకాలుగా ప్రచురించబడడం ఆసక్తిని కలిగించకమానవు. [ నేను ఈ వ్యాసంలో ఈ మూడు పుస్తకాలనే చర్చిస్తున్నప్పటికీ, దాదాపు ఇదే కాలంలో ఇంగ్లీష్ లో రాయబడిన పీ. టీ. శ్రీనివాస అయ్యంగార్ రాసిన లైఫ్ అండ్ డెత్—ఎ ప్లీ ఫర్ ద వెర్నాక్యూలర్స్, సూరి శాస్త్రి సంకలనం చేసిన ద గ్రామ్య కాంట్రవర్సీ, కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు రాసిన ఎ మెమొరాండం ఆన్ తెలుగు ప్రోజ్, స్కేప్ అండ్ కంపెనీ, కాకినాడ వారు ప్రచురించిన ఆర్గ్యుమెంట్స్ ఫర్ అండ్ ఎగైనెస్ట్ మాడర్న్ తెలుగు వంటి ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయి.]
ఆధునిక తెలుగుభాషా సంస్కరణోద్యమంలో భాగంగా గురజాడ అప్పారావు సంకలనం చేసి, ఆయన చనిపోయిన తరువాత 1916లోనూ, 1920లోనూ ప్రచురింపబడిన టేల్స్ అఫ్ తాతాచార్యులు మరియు ఆనల్స్ అఫ్ హండె అనంతపురం లను ఈ సందర్భంలో ప్రస్తావించాలి. ఈ రెండూ నిజంగా అప్పుడు కొత్తగా ప్రచురింపబడిన పుస్తకాలు కావు. ఈ స్థానిక గాథలూ, స్థానిక చరిత్రలను బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలనా శాఖలో పనిచేసిన సీ. పీ. బ్రౌన్ 1853, 1855 లలోనే వాడుక భాషను ఆమోదించే క్రమంలో ప్రచురించాడు. ( బ్రౌన్, “మన స్థానిక ఉపాధ్యాయులు వాడుకలో ఉండే తెలుగును ఇష్టానుసారం తిరస్కరించి, రోజూ తామే ఉపయోగించలేని కావ్య భాషను మాత్రమే మనకు బోధిస్తారు” అంటాడు. ఆయన తెలుగు భాషను ఆధునీకరించే పనిలో వసుచరిత్ర వంటి ప్రాచీన రచనలను పండితులచేత వాడుకభాషలో వ్యాఖ్యానాలతో పునర్ముద్రించటంలో కృషి చేశాడు.) మొదట్లో సంప్రదాయవాదులు నెగ్గినప్పటికీ, గిడుగు రామమూర్తి యొక్క అలుపెరుగని కృషి ఫలించి, వాడుక భాషను యూనివర్సిటీల పాఠ్య పుస్తకాల్లోనూ, ప్రచార మాధ్యమాల్లోనూ ఉపయోగించేట్లు చేయాలనే ఆధునికుల అంతిమ గమ్యం చేరుకోవడానికి ఇంకా 70 సంవత్సరాలు పట్టింది. బ్రౌన్ భారతదేశానికి పంపబడిన అధికారుల్లో ఈ ప్రాంతానికి పంపబడిన వాళ్ళు తెలుగును నేర్చుకోవాలని భావించాడు. అందుచేత ఆ అధికారులకు బోధించడానికి సహజంగానే వ్యవహారికంలో చెప్పబడిన ఈ కథలను, సులభమైన భాషలో రాయబడిన స్థానిక రికార్డులను ఎంచుకున్నాడు. ఈ కథలు ఆధునికవాదులకు బాగా పనికివస్తాయి.
వలసపాలన పరోక్షంగా రాబర్ట్ కాల్డ్వెల్, ఏ. డీ. క్యాంబెల్, ఏ. హెచ్. గార్డెన్, సీ. పీ. బ్రౌన్ వంటి పండితులు కొన్ని తొలి నిఘంటువులూ, వ్యాకరణాలూ రాయటంలో సహకరించింది. అది పాశ్చాత్య పండితులనూ, భారతదేశపు పండితులనూ దగ్గరకు చేర్చడమేకాక, చదువుకున్న భారతీయులను పాశ్చాత్య ఆలోచనల, వ్యక్తీకరణలవల్ల వచ్చే ప్రయోజనాలను గుర్తించేట్లు చేసింది. జ్ఞానాన్ని నలుగురితో పంచుకునేందుకు, విశ్వజనీనమైన సంస్కృతిని పెంపొందించేందుకు ముద్రణా యంత్రం వంటి సాధనాల ఉపయోగమూ వీటికి తోడైంది. భారతీయ భాషల్లో వచన ప్రక్రియలు అభివృద్ధి కావడం ఈ పాశ్చాత్య సంపర్కంవల్ల కలిగిన మరో ప్రయోజనం. బూదరాజు రాధాకృష్ణ ఈ సందర్భంలో అప్పట్లో పాఠ్యపుస్తకాలుగా ఉపయోగించిన విక్రమార్కుని కథలు (1819), గురుమూర్తి శాస్త్రి పంచతంత్ర కథలు, (1834) ఏనుగుల వీరాస్వామి దినచర్య రూపంలో రాసిన కాశీయాత్రాచరిత్ర (1838) వంటి వచనంలో వచ్చిన పుస్తకాలను పేర్కొంటాడు. కానీ ఈ ధోరణి 1848లో స్థానికులకోసం ఉపయోగపడే పుస్తకాలను ప్రచురించడానికి ఏర్పాటుచేసిన సంఘానికి పరవస్తు చిన్నయ సూరి అధ్యక్షుడవడంతో పూర్తిగా మారిపోయింది. ప్రెసిడెన్సీ కాలేజీలో మొదటి పండిట్ గా నియమింపబడిన ఆయన ప్రభావం వ్యావహారిక భాష అభివృద్ధిని నిరోధించడంలో చాలా పనిచేసింది. ఆయన విష్ణుశర్మ సంస్కృతంలో రాసిన పంచతంత్ర తో సహా ఎన్నో గ్రంథాలను పాండిత్యపు శైలిలో అనువదించాడు. ఇందుకు భిన్నంగా విద్యావకాశాలు ఎక్కువమంది ప్రజలకు అందుబాటులో ఉండడంవల్ల వాళ్లకు శాస్త్ర సంబంధమైన విజ్ఞానాన్ని అందించడానికి తెలుగు కావ్యాలలో ఉపయోగించే సాహిత్య లేదా కవిత్వ భాష అనువైనదికాదని గిడుగు రామమూర్తి భావించాడు. శిష్టులు మాట్లాడే భాష ఇందుకు సరైనది అంటాడాయన. కవిత్వ భాష ఉపయోగించే వాళ్ళు కూడా తమ దైనందిన వ్యవహారాల్లో, వారి వ్యక్తిగత ఉత్తర ప్రత్యుత్తరాలలో మాట్లాడే భాషనే ఉపయోగిస్తారనీ, వాళ్ళు కావ్యాల్లో ఉపయోగించే భాష అసహజంగా, ఉద్దేశపూర్వకంగా, కృత్రిమంగా ఉంటుందని నిరూపించే ప్రయత్నం చేశాడు. పలు వ్యాసాల్లో, ప్రసంగాల్లో ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు చివరకు ఎ మెమొరాండం ఆన్ మాడర్న్ తెలుగు అనే పుస్తక రూపంలో 1913లో వెలువడ్డాయి. ఆయన అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలుపుతూ మెమొరాండం ఈ కింది విధంగా మొదలౌతుంది:
ఇప్పటి తెలుగు ప్రజానీకంలో చదువుకున్న వర్గంవారు మాట్లాడే ఆధునిక భాషనే ప్రామాణిక భాషగా గుర్తించడంలో ఉండే ప్రయోజనాన్ని మీ దృష్టికి తీసుకురావడానికీ; అలాగే దాన్ని విద్యార్థుల మాతృభాషలో చదువు చెప్పవలసిన ప్రాధమిక, మాధ్యమిక స్థాయిలలో అధికారికంగా ఉపయోగించడానికీ; ఇంకా ప్రభుత్వమూ, దాని అధికారూలూ తెలుగు ప్రజలకు ఇచ్చే ఉత్తర్వులలో, సమాచారాల్లో వాడడానికీ; ఇంకా సామాన్య ప్రజల మేలు కోసం వ్యవసాయం, వాణిజ్యం, పారిశుధ్యం, ఇతర విషయాల గురించి ప్రకటించే పుస్తకాల్లో, కరపత్రాల్లో, ఇతర ప్రచురణల్లో ఉపయోగించడం కోసం, ఈ మెమొరాండంను సమర్పిస్తున్నాను. (రామమూర్తి 1)
ప్రాచీన సాహిత్యంలో వచన ప్రక్రియలో చెప్పుకోదగ్గ రచనలేవీ లేవనీ, బ్రిటిషువారు ప్రజోపయోగమైన సూచనలనిచ్చే ఒక కొత్త వ్యవస్థను (the new system of Public Instruction) ఏర్పరచిన తరువాతనే అటువంటి ప్రయత్నాలు జరిగాయని అంటాడు. అటుపిమ్మట ప్రజలకు విజ్ఞానాన్ని కలిగించడంలో కొంత అభివృద్ధిజరిగినప్పటికీ, ఆ పని ఎంత అర్థం కాకుండా ఉండే విధంగా రాయడానికి వీలయితే అలా రాయగలిగే పండితుల చేతుల్లోకి వెళ్ళింది. ఇట్టి ప్రయత్నాలు చేసినవాళ్లలో ఒక్క వీరేశలింగం మాత్రమే మినహాయింపని అంటాడాయన. వీరేశలింగం కూడా తాను తర్ఫీదు పొందినటువంటి కవిత్వ సంప్రదాయాన్నుంచి తనను తాను పూర్తిగా విడిపించుకోలేకపోయాడని రామమూర్తి అంటాడు. ఆ కారణంగా వీరేశలింగం భాషను ఎంత తక్కువ అసహజంగానూ, అర్థమయ్యేట్టుగానూ సులభతరం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, దాని నిర్మాణంలోనూ, వ్యాకరణంలోనూ అది ఒక తెలుగు పండితుని కృత్రిమత్వాన్ని సంతరించుకుందని అంటాడు. పండితులు కూడా "వ్యవహారంలోని ఏ పదంగానీ, రూపంగానీ ఏదో ఒక ప్రాచీన రచయిత ఉపయోగించినట్టు ఉండకపోతే అది మంచి తెలుగుగా పరిగణించలేమ"ని నిర్ధారించారు (రామమూర్తి 4). భాషను ఆధునికరించే ప్రయత్నాలు ఇతర భారతీయ భాషల్లోనూ జరిగాయని, ఈ సందర్భంలో బెంగాలీ, హిందీ భాషలను పేర్కొన్నాడు.
తన వాదనను బలపరచుకోవడానికి రామమూర్తి ఇంగ్లీష్ భాషనుండి ఎన్నో ఉదాహరణాలిస్తాడు. ఈ విషయంపై ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోవలసింది గవర్నమెంట్ కాబట్టి వారిని ఒప్పించడం మంచి వ్యూహంగా ఆయన భావించి ఉండవచ్చు. రామమూర్తి చాలా భారతీయ భాషల్లో రోజువారీ వ్యవహారాల్లో ఉపయోగించే భాష, కావ్యభాష విభజనకు గురిఅయ్యాయని చెప్పిన గ్రియర్సన్ మాటలను ఉటంకించాడు. రామమూర్తి "డిస్పాచ్ అఫ్ 1854" సలహా మేరకు పాశ్చాత్య విజ్ఞానాన్ని భారతీయులకు అందించడానికి స్థానిక భాషలను ఉపయోగించాలని గవర్నర్ జనరల్ ఇన్ కౌన్సిల్ 1903లో చేసిన తీర్మానాన్ని కూడా పేర్కొన్నాడు. బ్రిటిష్ పరిపాలనాధికారీ, సుప్రసిద్ధ తెలుగు పండితుడూ ఐన బ్రౌన్ "వ్యావహారికానికీ, కావ్య భాషకూ ఉన్న తేడా సాక్సన్ కూ, ఇంగ్లీషుకూ ఉన్న తేడా వంటిది; పండితుడేమో పాండిత్య శైలినే కష్టపడి సాధన చేస్తుంటాడు; ఎంత అస్పష్టంగా, అర్థంకాకుండా ఉన్నా దాన్నే అందరూ మెచ్చుకుంటుంటారని అతని భావన" అన్న మాటలను ఉటంకించాడు (రామమూర్తి 3). ఇంకా ఆయన "మినిట్ అఫ్ 1822" లో తెలుగు, కన్నడ భాషలలోని స్కూల్ పుస్తకాలు కవిత్వ భాషతోబాటు సంభాషణ, వ్యాపార సరళిలో ఉండడాన్ని, దాన్ని మార్చవలసిన అవసరాన్ని గురించి సర్ థామస్ మన్రో చెప్పడాన్ని పేర్కొంటాడు (రామమూర్తి 6). మన్రో బట్టీ కొట్టే పద్దతిని నిరసించటాన్నీ, "సామాన్య ప్రజలలో ఉపయోగపడే జ్ఞానాన్ని వ్యాప్తిచేయడానికి స్థానిక భాషల విషయంలో" అవసరమైన చర్యలను తీసుకోవాలని విద్యాధికారులను కోరడాన్ని పేర్కొంటాడు (రామమూర్తి 6). అయినా స్థానిక భాషలను బోధించడానికి సంబంధించిన విద్యా విలువలు మన్రో కాలం నాటికీ, తాను రాసేనాటికీ ఏమాత్రమూ మారకపోవడాన్ని రామమూర్తి తప్పు పడతాడు (రామమూర్తి 6). ఇంకా ముందుకెళ్లి ఆయన ఇంగ్లీషు చదువుల సందర్భంలో మెకాలే మాటలను గుర్తుకు తెచ్చే శైలిలో స్థానిక భాషల గురించి తన ప్రణాళికను గురించి ఇలా అంటాడు:
స్థానిక భాషలకు సంబంధించిన భాషావేత్తలను తయారుచేసి, వాళ్లకు వారి వారి భాషలపైగల విమర్శనాత్మక విజ్ఞానం ద్వారా వాళ్ళను స్కూళ్లలో బోధకులుగానూ, లేదా రచయితలూ, ఉపయోగకరమైన పుస్తకాల అనువాదకులుగానూ, వాళ్ళ దేశప్రజల అవసరాలను తీర్చగలవారుగానూ, ఇంకా కోర్ట్ అఫ్ డైరెక్టర్స్ మాటలలో 'స్థానిక సాహిత్యాల, స్థానిక ప్రజల మానసిక వికాసానికీ ఆవసరమైన మెరుగైన ఉత్సుకతను కలిగించి, వారికి వారుగా యూరోపియన్ ఆలోచనలనూ, భావాలనూ అందుకునేట్లుగా' వాళ్ళను తీర్చిదిద్దడమే గవర్నమెంట్ ప్రధాన ఉద్దేశ్యం. (రామమూర్తి 6; ఉల్లేఖించిన భాగం ఎస్. సత్యనాదన్ రాసిన హిస్టరీ అఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ది మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి తీసుకోబడింది.)
ఐతే పై ఉద్దేశ్యం నెరవేరలేదని రామమూర్తి తన నిరసనను వ్యక్తం చేశాడు. అర్థ శతాబ్దానికి పైన విద్యాధికారులు పాటించిన “జోక్యంచేసుకోకూడద”న్న విధానాన్ని తప్పుపడతాడు. తమ వివేచనను పాశ్చాత్య శాస్త్రాల్లోని “అనైతిక ధోరణులను,” ఎత్తిచూపడానికీ, అలాంటి శాస్త్రాల బోధన ఆర్యులయొక్క “నైతిక స్వభావానికి” ఎంత విరుద్ధమైనదో తెలియజేయడానికి మాత్రమే ఉపయోగించిన ఇంగ్లీష్ చదువుకున్న పండితుడిలను కూడా రామమూర్తి విమర్శిస్తాడు (రామమూర్తి 7). ఈ వైఖరి తనకు అమితమైన ఆశ్చర్యాన్నిస్తుంది; ఎందుకంటే పండితుడు బోధించే పాఠాలలో శృంగారవంతమైనవి, చిన్న పిల్లల మనసులకు అనుచితమైనవి ఉండడం అంటాడాయన. ప్రభుత్వం ప్రయోజనకరమైన విద్యను అందించడంలో జరిగిన వైఫల్యానికి ప్రధాన కారణం పండితులు ప్రజలకు వ్యావహారికమైన/ స్థానిక భాషలో బోధించడాన్ని వ్యతిరేకించడమే అంటాడు (రామమూర్తి 8). ఇంకా “సజీవమైన మాట్లాడే భాషకు బదులుగా, ప్రాచీన పండితుల కవిత్వంలో ఉండే, మూఢ విశ్వాసం కలవారు మెచ్చే, మృతభాషే విద్య విషయంలో అభివృద్ధి నిరోధకంగా పనిచేసిందని” అంటాడు. నిమ్న వర్గాల పిల్లలు మాట్లాడే భాషకూ, ఉన్నత వర్గాల పిల్లలు మాట్లాడే భాషకూ తేడా ఉంటుందని గుర్తిస్తూనే, చదువుకున్న వర్గాలవారు మాట్లాడే భాషను పాఠ్యపుస్తకాలలోనూ, బోధనలోనూ ఉపయోగించాలని రామమూర్తి సలహానిచ్చాడు. ఇంకా
ఆయన అప్పారావు రచనలను “సమస్యాత్మకమైనవి”గానూ, అతనెటువైపున ఉన్నాడో తెలపమని గట్టిగా ఎవరైనా అడిగినప్పుడు తాను ప్రాచీన మరియు ఆధునిక శైలులు కలిసి పక్క పక్కనే ఉండాలని భావిస్తాననీ, పాఠ్యపుస్తక బృందంలో సభ్యుడుగా తాను “ఆమోదించబడిన వాడుకలోని మరియు వ్యాకరణబద్దమైన పుస్తకాలనూ, ఆ సూత్రాలను అతిక్రమించే వాటినీ” కూడా ఆమోదిస్తాననీ, స్కూల్ ఫైనల్, ఇంటర్మీడియట్ పరీక్షలలో వ్యాసం రాసేటప్పుడు “వ్యాకరణాన్ని అనుసరించి రాయడమా, లేక అనుసరించకపోవడమా” విద్యార్థికి వదిలేస్తాననీ అంటాడని చెబుతాడు. అప్పారావైతే “కొత్త బల్లపై కూర్చోవడానికి ఇష్టపడతాడనీ, పాత బల్లను తన్ని పడేసేవరకే సహిస్తాడనీ” అంటాడు (పంతులు 7). రామయ్య పంతులు ఎ మెమొరాండం ఆన్ మాడర్న్ తెలుగు (A Memorandum on Modern Telugu) అన్న పుస్తకంలోనూ, అంతకుముందే తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ రాసిన వ్యాసాల్లోనూ తన భావాలను స్పష్టంగా వ్యక్తం చేసిన రామమూర్తిని ఒక్కడినే “అతనెటువైపు నిలిచి ఉన్నాడో మనకు తెలియడంలో ఏ సమస్యాలేదని” ఉత్తిగా వదిలిపెడతాడు (పంతులు 6-7). ఆయన గురించి చెబుతూ రామమూర్తి చాలా స్పష్టంగా చెబుతాడు. “అతని పథకంలో ‘ఆధునిక తెలుగు’ స్కూళ్లలో తప్పక బోధింపబడుతుంది. కావ్య భాషవంటి తెలుగు కానీ, సాహిత్యంగానీ ఐచ్చికంగా ఉంటుంది. అంతేకాక, లాటిన్, గ్రీక్ భాషల విషయంలో యూరోపియన్ స్కూళ్లలో వలే, ఇక్కడి పండితుడు కావ్య భాషలోని సాహిత్యాన్నీ, వ్యాకరణాన్నీబోధించటాన్ని, కావ్య భాషలో వ్యాసం రాయడానికి, రామమూర్తి ప్రస్తుతానికి మాత్రం, ఏ అభ్యంతరమూ చెప్పడు,” (పంతులు 8) అంటాడు. ఆయన రామమూర్తిని ఉటంకిస్తూ “ఆధునిక తెలుగు” అంటే “చదువుకున్న తెలుగు వర్గాల ఆధునిక భాష” (పంతులు 9), అంటే “చదువుకున్న వర్గాలు మాట్లాడే భాష,” అని చెబుతూనే, అది వీరేశలింగం పంతులు తన ప్రహసనాల్లో వాడే “చాలా శ్రేష్టమైన, శక్తివంతమైన, ఇడియమాటిక్ తెలుగు” అంటాడని చెబుతాడు (పంతులు 9). కానీ నిజానికి రామమూర్తి వీరేశలింగం తీర్చిదిద్దిన భాషను మెమొరాండంకు రాసిన “ప్రారంభ వాక్యాల్లో”నే విమర్శించాడు.
రామయ్య పంతులు ఆధునిక భాషావాదులు భాషను ప్రాచీన వ్యాకరణం మరియు కావ్య భాషల ఆధారంగా సంస్కరించడంతో తృప్తిచెందరు; వాళ్ళు ఇప్పుడున్న, శతాబ్దాలపాటు అభివృద్ధిచెందిన కావ్యభాషను తొలగించి దాని స్థానంలో పలు స్థానిక మాండలికాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తారు అని అంటాడు (పంతులు 10). గ్రామ్యవాదానీకీ, గ్రాంథికవాదానికీ మధ్య వివాదమంతా "వ్యాకరణబద్ధమూ మరియు సాహిత్యంలో వాడుక (grammar and literary usage)"కు సంబంధించిందనీ, ఇక "శైలీ, కవిత్వశాస్త్రమూ, అలంకారశాస్త్రమూ, సాహిత్య ఇతివృత్తాల వంటి విషయాలు ఈ వివాదానికి వెలుపల ఉండేవని, అందుచేత ఈ రెండింటినీ కలపడానికి ఎలాంటి అవకాశమూ లేదు" అని అంటాడాయన (పంతులు 10-11). "సమస్య అంతా ఇప్పుడు వస్తున్న సాహిత్యంపై ఆధారపడిన వ్యాకరణాన్ని అనుసరించాలా, వద్దా అన్న ఒక్క విషయంలోనే ఉంద"ని చెబుతారాయన. కానీ కొంతమంది వ్యావహారికవాదులు, శైలి, శృంగారం, మూఢనమ్మకం, మానవజాతి శాస్త్రం, ఇంకా ఏవేవో అనవసర విషయాలను పేర్చి, ఈ ముఖ్యమైన విషయాన్ని మరుగునపరచే ప్రయత్నం చేయడంలోనే ఉంది" అంటాడాయన (పంతులు 12). పండితులను నిందించడమే తమ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఆధునిక తెలుగు భక్తులను ఆయన, పొద్దున్నే లేచినతోడనే 'బ్రాహ్మణ నాశనా'న్ని జ్ఞాపకం చేసుకొనే జైనులతో పోలుస్తాడు (పంతులు 13). రామమూర్తి పండితుల సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకుంటే, అతని మిత్రుడు అప్పారావేమో శృంగారరసం విషయంపై అదే సమావేశంలో తీసుకున్న తీర్మానాలను సమర్థించినవాడని రామయ్య పంతులు అంటాడు. "ఇప్పటి కావ్య భాష పురాతనమైనదనీ, కృత్రిమమైనదనీ, ఆ కారణంగా ప్రజలకది అర్థంకానిదనీ" వాళ్ళ వాదన అంటాడాయన. (పంతులు 15). కృత్రిమమైన పద్యాలుగా ఆధునికులు పేర్కొనే ప్రబంధాలు వీధి ప్రజలకోసం రాయబడినవి కావు అంటాడాయన. ఈ పుస్తకాల్లోని వ్యాకరణం లో తప్పేమీలేదు (పంతులు 17-18). ఇంగ్లాండులో 15వ శతాబ్దంనుండి అందరికీ చెందిన ఒకే విధమైన ఉమ్మడి కావ్య భాష పుట్టుకొచ్చింది; అదే భాషను ప్రపంచంలోని అన్ని ఇంగ్లీషు మాట్లాడే ప్రాంతాలూ ఇప్పటికీ ఉపయోగిస్తున్నాయి. "ఎన్నో విభిన్న స్థానిక భాషల నుండి ఒక ఉమ్మడిదీ, అందరికీ చెందినదీ ఐన కావ్య భాషగా" శతాబ్దాలపాటు అభివృద్ధిచెందిన కావ్య మరియు భాషాపరమైన తెలుగు సంప్రదాయాన్ని ఆధునిక తెలుగు ఛాంపియన్లు వెతిరేకిస్తున్నారని రామయ్య పంతులు అంటాడు (పంతులు 19). ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మన్ భాషల చరిత్రా ఇదే విధంగా కొనసాగింది అంటాడు. ఈ సందర్భంలో ఆయన వ్యవహారికవాదులు ఉంటంకించేందుకు సంతోషించే హెచ్. సి. వైల్డ్ ను ప్రస్తావిస్తాడు. ఐతే, ఆయన ఉటంకించిన వైల్డ్ మాటలు మాత్రం మెల్లగా అభివృద్ధిచెందిన ఉమ్మడి భాషకు సంబంధించినవి కావు; అవి ప్రింటింగ్ కనుగొనబడిన తరువాత భాషలోకి వచ్చిన ప్రామాణికతకు సంబంధించినవి అని వైల్డ్ రాసిన ద హిస్టారికల్ స్టడీ అఫ్ ది మదర్ టంగ్ (The Historical Study of the Mother Tongue) ను చదివితే తెలుస్తుంది. ఐతే పై మాటలను పేర్కొన్నరామయ్య పంతులు ఈ విధంగా నిర్ధారిస్తాడు: "ఇంగ్లీష్ ఒక కావ్య భాషనేకాక, కావ్య భాషను దగ్గరగా పోలిన ఒక ప్రామాణికమైన మాట్లాడే భాషను అభివృద్ధిపరచుకుంది" (పంతులు 20). లాటిన్ భాషకు ఇటాలియన్ తో ఉన్న అనుబంధాన్ని చెప్పిన తరువాత, "లాటిన్ పతనం తీవ్రమయిన రాజకీయ మరియు సాంఘిక ఉపద్రవాలవల్ల జరిగిందనీ, అటుపిమ్మట ఇటాలియన్ మళ్ళీ మాట్లాడే రూపాలకు భిన్నమైన తనదైన కావ్యభాషను అభివృద్ధి చేసుకుంది" అంటాడు (పంతులు 22). చివరకు రామయ్య పంతులు "భాష ఎక్కడైనా ఒక ఉమ్మడి కావ్యభాషను ఏర్పరుచుకునే స్వభావాన్ని" కలిగిఉంటుంది నిర్ధారిస్తాడు (పంతులు 23). ఇటాలియన్ కు లాటిన్ వలే వ్యావహారిక భాషకు కావ్యభాషతో సంబంధం ఉంటుదనే రామమూర్తి ఆలోచన సరైనదికాదని చెబుతూ రామయ్య పంతులు ఈ విధంగా వ్యాఖ్యానిస్తాడు:
లాటిన్ చావుకు ఇంచుమించు ఒక సామ్రాజ్యం విఛ్చిన్నమై, ఒక సాహిత్యపరమైన, సంస్కారవంతమైన వర్గం అదృశ్యమైపోవడం అవసరమైంది. ఇప్పుడలాంటి మార్పును తీసుకురావల్సిన అవసరమేముంది? ఒక దాని తరువాత మరొకటిగా ఎన్నో రాజకీయ మార్పులు మన భూభాగంపై చెలరేగినా అవేవీ తెలుగుభాష యొక్క క్రమమైన అభివృద్ధిని ప్రభావితంచేయలేక పోయాయి. అదీగాక, బ్రిటిష్ పాలనవల్ల దేశంలో ఇప్పుడు ముందెన్నడూ అనుభవించని ప్రశాంతమైన జీవనం సాధ్యమౌతుంది, అన్ని వైపులా సంస్కృతి విస్తరిస్తోంది. అలాంటప్పుడు సాహిత్యపరమైన విప్లవాలను పొదగాల్సిన అవసరమేముంది? (పంతులు 23)
హిస్టరీ అఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ (1894) నుండి లూన్స్బరీను ఉటంకిస్తూ, ఇంగ్లీష్ విషయంలో [నార్మన్ కాంక్వెస్ట్ వంటి] ప్రత్యేకమైన రాజకీయ, చారిత్రక పరిస్థితులవల్ల రాజదర్బారులో నార్మన్-ఫ్రెంచ్, జీవితంలో సాక్సన్ ఉపయోగించబడడం లాంటి ఆ భాషకు చెందిన పరిణామాలను తెలుగులో జరిగిన పరిణామాలతో పోల్చడానికి వీలులేదంటాడు. బ్రాడ్లీ ను పేర్కొంటూ 14 వ శతాబ్దినుంచి ఇంగ్లీషు లో జరిగిన అభివృద్ధి ఆ భాషాకొక స్థిరత్వాన్నిచ్చిందనీ, దాని వ్యాకరణం అప్పటినుంచీ దాదాపు ఏ మార్పులకీ లోనుకాకుండా కొనసాగిందని అంటాడు (పంతులు 28-29). రామయ్య పంతులు "ఆ భాషలో వచ్చిన అన్ని మార్పులూ ఆ భాషకు మాత్రమే వర్తిస్తాయం"టూ ముగిస్తాడు (పంతులు 29). ఇక్కడ ఆయన ఒక వైపు ఒక్కో భాషకూ, దాని అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేకమైన చరిత్రఉంటుందని చెబుతూనే, మరో వైపు అన్ని భాషలూ ఒకసారి స్థిరత్వాన్ని పొందిన తరువాత ఒక ఉమ్మడి కావ్య భాషను పెంపొందించుకునే ధోరణి కలిగివుంటాయనడం ఆసక్తికరం.
ఆ తరువాత రామయ్య పంతులు ఆదికవిగా పరిగణింపబడిన నన్నయ తరువాత "తెలుగు కావ్యభాష నిశ్చలంగా ఉండక, మెల్లగా, ఒక క్రమ పద్దతిలో అభివృద్ధిచెందిందని" చెబుతాడు (పంతులు 37). మధ్య యుగపు ఇంగ్లీషు గురించి లూన్స్బరీ మాటలను ఉటంకిస్తూ, చదువరుల సంఖ్య ఎల్లప్పుడూ పెరుగుతూ ఉండే సాహిత్యం మామూలు వ్యవహారంలోని భాషయొక్క ప్రభావాన్ని నిరోధిస్తుంది. ఇదంతా తెలుగులో సాహిత్య భాష మెల్లగా "కొన్ని స్పష్టంగా నిర్వచింపబడిన పరిమితులకు లోబడి" మార్పుచెందినదనీ, అది తెలుగు ప్రజలకు గ్రీకు భాషవంటిదనీ (వ్యవహారికవాదులు చెప్పడం) ఒక అసంబద్ధమైన ప్రతిపాదన అనీ, మితిమీరిన అతిశయోక్తి అనీ నిరూపించడంలో భాగంగా అంటాడు (పంతులు 42). తెలుగు కావ్యభాష అభివృద్ధి క్రమం "ఆధునిక" భాషావేత్తల వాదనను పూర్తిగా కొట్టివేస్తుందని, అందుచేత వాళ్ళు ప్రయత్నిస్తున్న తీవ్రమైన మార్పుల అవసరమేలేదనీ రామయ్య పంతులు వాదన. (పంతులు 43). ఇంకా ఆయన కావ్యభాషలో ప్రచురించిన పుస్తకాల ప్రాచుర్యాన్ని ఆ పుస్తకాల అమ్మకానికి సంబంధించిన లెక్కల సహాయంతో పేర్కొంటూ తెలుగు కావ్యభాష అర్థంకాదనడానికి ఏమాత్రం వీలులేదని ఇవి నిరూపిస్తాయని అంటాడు (పంతులు 43).
పైన వివరించినట్లు ఇంగ్లీషు ఆధారాలను ఉదహరిస్తూ తెలుగులో కావ్యభాష అభివృద్ధి గురించి తన వాదనను బలపరచుకున్న తరువాత "ఆధునికుల" వాదనవైపు తన దృష్టి సారిస్తాడు. ఆధునిక తెలుగు భాష, అంటే చదువుకున్న వర్గంవారు మాట్లాడే భాష, ఇప్పుడు చదువుకున్న ప్రజానీకంలో వాడకంలో ఉంది. ఆసక్తికరంగా, ఈ కింది మాటల్లో రామయ్య పంతులు ఇంగ్లీషు ఉదాహరణలకు భిన్నంగా వాదిస్తాడు:
"ఆధునిక" పండితులు ప్రామాణిక-మాట్లాడే భాష గురించి ఆ ఆలోచనను ఇంగ్లీషు భాషనుంచి గ్రహించి, అలాంటి పరిస్థితులే తెలుగుకు కూడా వర్తిస్తాయని తమను తాము ఒప్పించుకుంటారు. నిజానికి అంతకంటే సత్యదూరమైంది మరొకటిలేదు. ప్రామాణిక-మాట్లాడే భాష అన్నది ఇంగ్లీషు భాషకున్న ప్రత్యేక లక్షణమనీ, దాన్ని కలిగి ఉండడం ఆ భాషకే ఉన్న ప్రత్యేక కారణాలవల్ల జరిగిందనీ మన మిత్రులకు తెలియాలి. యూరోపులోని ఏ ఇతర ప్రధాన భాషకూ ఇలాంటి లక్షణం ఉన్నట్లు లేదు...(పంతులు 44) అని చెప్పి "ఇప్పుడు చదువుకున్న వర్గాలలో ఉన్న ఆధునిక తెలుగు" యొక్క ఆచరణీయతను ప్రశ్నిస్తాడు (పంతులు 44). అన్ని తెలుగు ప్రాంతాల్లో ఒకే మాట్లాడే భాష వాడబడుతుందనే ఆధునికుల భావన నిరాధారమైనదనీ (పంతులు 44), అది ఇంగ్లీష్ భాషకే ప్రత్యేకమైనటువంటి, మరి ఏ ఇతర ప్రధానమైన యూరప్ భాషలకుకూడా లేని, లక్షణమైన 'ప్రామాణిక మాట్లేడే భాష' తో చేసిన తప్పుడు సారూప్యత వల్ల జరిగిందనీ, ఒక సజీవమైన భాషను కృత్రిమంగా తయారుచేయడాన్ని నిరసించడం జర్మన్ విషయంలో జరిగిందనీ అంటాడు (పంతులు 44-45). ప్రామాణిక భాషగా ఇంగ్లీష్ పరిణామం చాలా కాలం జరిగిందనీ, అది ఏ ఒక్క ప్రాంతానికిగానీ, ఒక ఉన్నత వర్గంనుండి ఉద్భవించినప్పటికీ, చదువు అందరికీ అందుబాటులో ఉండడంవల్లనూ, ప్రామాణిక భాషలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంవల్లనూ అది ఏ ఒక్క సామాజిక వర్గానికీ పరిమితమవలేదు. ఈ సందర్భాల్లో ఆయన హెచ్. సీ. వైల్డ్ యొక్క ద గ్రోత్ అఫ్ ఇంగ్లీష్ (The Growth of English) (1892) నుండి విస్తృతంగా ఉటంకిస్తాడు. కోస్తా జిల్లాలైన గోదావరి, గుంటూరు మరియు కృష్ణలలో మాట్లాడే భాష ఈ ఆదరించబడిన జిల్లాలకు ఆవల ఉండే సీడెడ్ జిల్లాల ప్రజలకూ, తమిళ్ జిల్లాలలోని వారికీ, కన్నడ ప్రాంతంలోని వారికీ, హైదరాబాద్ ప్రాంతంలోని లక్షలాది తెలుగు వారికీ ఎలా ఆమోదయోగ్యమౌతుంది అని ప్రశ్నిస్తాడు. వాళ్ళు పదవీచ్యుతి పొందిన కావ్యభాషకు బదులుగా అప్పుడు ఆ భాషకు ఎలా విధేయులుగా ఉన్నారో అదేవిధంగా ఇప్పుడు దాని స్థానంలో ఏదోఒక స్థానిక భాషను సింహాసనమెక్కించడాన్ని వాళ్ళు ఒప్పుకుంటారా? చాలవరకూ అది అసంభవం (పంతులు 47-48).
ఇక్కడకూడా రామయ్య పంతులు తనకు మద్దతునివ్వడానికి వైల్డ్ ను ఉపయోగించుకుంటాడు. తెలుగు భాష సందర్భంలో ఇంగ్లీష్ లో ఉండేట్లు తెలుగు ప్రామాణిక భాష అనేటటువంటి ప్రామాణిక మాట్లాడే భాష ఏదీ లేదని నిర్ద్వంద్వంగా చెబుతూ, ఆధునిక భాషోద్యమకారులు ఉపయోగించే "శిష్ట-వ్యావహారికులు మాట్లాడే" భాష, చదువుకున్నవర్గం భాషలు అన్న పదాలను "ముచ్చటైన అస్పష్టతలు"గా పేర్కొంటాడు (పంతులు 48). ఇంకా:
ఈ శిష్టులెవరు, ఈ చదువుకున్న వర్గాలు ఎవరు? అంటే వీళ్ళు బ్రాహ్మణులు మాత్రమేనా? ఐతే, వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళా? [...] ఈ చదువుకున్నవాళ్ళు అన్న తరగతిని విస్తరిస్తే, బ్రాహ్మణులుకాని చదువుకున్నవాళ్ళు కూడా చదువుకున్న బ్రాహ్మణులు మాట్లాడేటటువంటి భాషనే వాడుతారా? [...] రామమూర్తిగారైతే అందరూ ఎలాగోలా ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారంటాడు. ఒక బ్రాహ్మణ భూస్వామీ, ఒక దళిత సేవకుడూ కూడాను! ఇంకెవ్వరూ వీరంతా ఒకే భాష మాట్లాడతారని చెప్పరు (పంతులు 48-49).
పండిత వర్గానికి మాత్రమే పరిమితమైన “తెలుగు కావ్యభాష”ను సమర్థించే రామయ్య పంతులు ఇక్కడ అణగారిన ప్రజల పక్షం వహించి మాట్లాడుతున్నట్లు కనిపించడం గమనించాలి. అలాగే సర్కార్ జిల్లాలవారు మాట్లాడే భాషను ఆధునిక తెలుగు ఉద్యమకారులు ప్రామాణిక భాషగానూ, పాఠ్యపుస్తకాల్లో ఉపయోగింపదగిన భాషగాను గుర్తించడాన్నికూడా ఆయన తిరస్కరించాడు.
ఆయన కావ్యభాషలో కూడా వైవిధ్యాలుండవచ్చని రామమూర్తి లేవనెత్తబోయే అభ్యంతరాన్ని ముందుగానే ఊహిస్తాడు. ఐతే తన వాదాన్ని సమర్థించుకుంటూ కావ్యభాషలో వైవిధ్యాలుంటాయని మనకు తెలుసనీ, అవి ఎంతో కాలంపాటు ఉపయోగంలో ఉన్నందువల్ల ప్రామాణికతను పొందాయని అంటాడు. కావ్యభాష ఒకేలా, స్థిరంగా ఉంటూ, "కొన్ని ప్రత్యేక పరిమితులకు లోబడి తప్ప" ఒక ప్రాంతానికీ ఇంకో ప్రాంతానికీ మారుతూ ఉండదని చెబుతాడు (పంతులు 49). అటువంటి కావ్యభాషకు భిన్నంగా "ఆధునిక తెలుగు" ఒకేలా ఉండదనీ, భవిష్యత్తులో దాని స్వభావాన్ని "స్థిరం" చేసే ప్రయత్నాలవల్ల, అది క్రమక్రమంగా తన "జీవాన్ని కోల్పోయి, చివరకు నశించిపోతుందనీ" అంటాడు (పంతులు 50). చివరకు ఈ "సంస్కరణ ప్రణాళిక చాలా అసంబద్దమైనదనీ, ఏమాత్రం పట్టించుకోతగినదికాదనీ" అంటాడు (పంతులు 50). ఈ పరిస్థితుల్లో కావ్యభాషను సులభతరంచేసి, దాన్ని ఆధునీకరించడమే" మంచిదనీ సలహా ఇస్తాడు. (పంతులు 50).
ప్రధానంగా గిడుగు రామమూర్తికి, జయంతి రామయ్య పంతులుకు మధ్య మొదలైన ఈ వివాదం కొనసాగి, చివరకు మద్రాస్ యూనివర్సిటీ ఒక కమిటీని ఏర్పరచితీరవలసి వచ్చినప్పుడు, రామయ్య పంతులూ, గురజాడ అప్పారావూ అందులో సభ్యులుగా నియమింపబడ్డారు. మొదట్లో ఆ కమిటీలో రెండు వర్గాలకూ చెందిన సభ్యులు సమాన సంఖ్యలోనూ, ఇద్దరు తటస్థంగానూ, మొత్తం సభ్యులు పది మంది ఉన్నారు. ఆ కమిటీ అంతకు ముందున్న ఎఫ్. ఏ. కు బదులుగా వచ్చిన ఇంటర్మీడియట్ కోర్స్ లో తెలుగు వ్యాసం రాయడానికి వాడవలసిన భాషా శైలి గురించి యూనివర్సిటీకి సలహానివ్వడానికి ఏర్పాటు చేయబడినది.
కమిటీలో వారికి ప్రాతినిధ్యం లేదని రాయలసీమ ప్రాంతపు పండితులు వత్తిడి చేయడంతో మరో నలుగురు సభ్యులను అందులో చేర్చుకోవడం, వారంతా సంప్రదాయవాదులకు మద్దతుదారులు కావడం జరిగింది. ఈ విధంగా సంప్రదాయ దృక్పథం బలపడి, సంప్రదాయవాదులకు అనుకూలంగా కమిటీ నిర్ణయించడంతో తెలుగు వ్యాసం రాయడంలో ఆధునిక రూపాలను ప్రవేశపెట్టాలనే ప్రయత్నం విఫలమైంది. యూనివర్సిటీ సిండికేట్ 11 ఆగష్టు 1914న ఆధునిక భాషను గుర్తించడంలేదని నిర్ణయం తీసుకుంది. ఐతే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయమేంటంటే, ఇదంతా జరిగేటప్పటికి సంప్రదాయవాదులు కూడా తమ దృఢమైన పట్టును కొంతవరకు సడలించి, వ్యాకరణ సూత్రాలను పాటించే విషయంలో కొంతవరకు తమ పట్టుదలను వదులుకొని "శుద్ధమైన" తెలుగును వాడితే చాలునని ప్రతిపాదించారు. గురజాడ అప్పారావు కమిటీ నిర్ణయాన్ని వెతిరేకిస్తూ తన నిరసనను ద తెలుగు కాంపోజిషన్ కాంట్రవర్సీ (The Telugu Composition Controversy) అనే పేరుతో 1914లో ప్రకటించాడు. (గవర్నమెంట్ కూడా స్కూల్ ఫైనల్ పరీక్షలో రాసే భాషా శైలికి సంబంధించిన స్వేచ్ఛను ఉపసంహరిస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసింది.) ఇందుకు తన అసమ్మతిని తెలుపుతూ గురజాడఅప్పారావు తన డిసెంట్ పత్రాన్ని ఈ విధంగా మొదలు పెడతాడు:
నేను [ప్రాచీన, వర్తమాన పదరూపాల పట్టికను తయారుచేయడానికి ఏర్పాటైన] సబ్-కమిటీ లోని వెంకటరాయ శాస్త్రియార్, కే. వీ. లక్ష్మణ రావులతో కూడిన మెజారిటీ సభ్యుల అభిప్రాయాలపై నా అసమ్మతిని తెలియజేస్తున్నాను. వాళ్ళు ఎప్పటినుంచో ఉన్న వారి అభిప్రాయాన్నే గట్టిగా పట్టుకొని, వారు ఆధునికుల అభిప్రాయంతో కలసిరావడానికి ఏమాత్రం సుముఖంగాలేరు. (అప్పారావు 5)
అప్పారావు ఎంతో వివరంగా వివిధ రకాల వాచకాలనుండి పదాలూ, భాషారూపాలూ ఉదహరిస్తూ "[వాటిలో ఉపయోగింపబడిన] వ్రాత భాష 'కావ్య' భాషగానీ, పద్య భాషకాని కాదని" నిరూపించే ప్రయత్నం చేస్తాడు. వాటిలో ఉండే భాష వచన భాష; అలాంటి భాష ఉనికికి సంబంధించి కనీసం ఏడు శతాబ్దాల రికార్డుచేసిన ఆధారాలున్నాయి. అది కొన్ని ఇప్పుడు వాడుకలో లేని , ఇప్పుడు ఇంకా వాడబడుతున్న రూపాల కలయిక. [...] అలాంటి రూపాలు అసభ్యకరమైనవనిగానీ, అగౌరవపరచేవనిగానీ, వచనంలో వాటికి స్థానం లేదనికానీ వారనుకోలేదు (అప్పారావు 33). ఈ వాడుకలో, సజీవ భాషలో ఉండే రూపాలు, ఎంత ప్రాచుర్యంలో, ఎంత కాలంనుంచి ఉన్నప్పటికీ, అవి సబ్-కమిటీ వర్గీకరించిన రూపాలను ప్రభావితం చేయలేక పోయాయని ఆయన చూపెట్టాడు. (అప్పారావు 37).
అప్పారావు అభ్యంతరమేమిటంటే "అటు కావ్యభాషలోనూ, ఇటు మాట్లాడే భాషలోనూ కూడా ఉండే పదాలూ, రూపాలను" కమిటీవారు చేర్చుకున్నప్పటికీ, వారు "ఆ ప్రాచీన కావ్య రూపాలకు సంబంధించిన శిష్ట వ్యావహారిక రూపాలను, అవి వాఙ్మయంలో వాడుక అయిఉన్నా, లేకపోయినా, వాళ్ళ జాబితాలలో చేర్చవలిసి ఉన్నప్పటికీ, వాటిని చేర్చుకోలేదు (Apparow 37). ప్రాచీన (పురాతన) మరియు ఇప్పుడు వాడకంలో ఉండే (వర్తమాన) రూపాలు అన్న పదాలను వాటి మామూలు అర్థంలో తాను వాడలేదని వెంకటరాయశాస్త్రి తనకు వివరించాడనీ, ఆయన దృష్టిలో ప్రాచీన (పురాతన) రూపాలంటే, సబ్-కమిటీ వారి దృష్టిలో వచన రచనలో వాడకూడనివి, అలాగే వాడకంలో ఉండే (వర్తమాన) రూపాలు అంటే సబ్ కమిటీ ఉపయోగించదగినవిగా ఆమోదించినవి అని అంటాడు. ఐతే నిజానికి వాడకంలో ఉండే (వర్తమాన) రూపాలు అని నిర్ణయించి, వాళ్ళు జాబితాలో ఇచ్చిన 256 వేర్వేరు రూపాలలో సగానికి పైగా ప్రాచీనమైన (పురాతనమైన) రూపాలు, ఒకటి, రెండు తప్ప మిగిలినవన్నీ 'సాంప్రదాయక వ్యాకరణం'చే అంగీకరింపబడినవి అని అంటాడు (అప్పారావు 37). ఈ విషయాన్ని వివరిస్తూ అప్పారావు, "వాడకంలో ఉండే రూపాలు" అంటే, అవి ఏ భాషారూపాలైనప్పటికీ, ప్రస్తుతం ఉపయోగింపబడుతున్నవి అనీ, "ప్రాచీనమైనవి" అంటే ప్రస్తుతం ఉపయోగంలో లేనివనీ అంటాడు. కానీ కాంపోజిషన్ కమిటీ ఈ పదాలను ఈ అర్థంలో ఉపయోగించలేదని, ఐతే అవి "సాంకేతిక పదాలనీ," ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి సంబంధించిన ఇంగ్లీష్ అర్థాలను దాటి వాటిని వాడటానికి వీలులేదని" అంటాడు (అప్పారావు 38). "శిష్ట వ్యావహారికాన్ని కాదనడమనేది సంప్రదాయవాదుల విశ్వాసానికి సంబంధించిన మూలసూత్రమ"ని అంటాడాయన (అప్పారావు 38-39).
సంప్రదాయవాదులు కృష్ణ, గోదావరి జిల్లాల శిష్ట వ్యవహారికానికి అభ్యంతరం చెప్పడానికి కారణం ఆ ప్రాంతలో అన్ని చోట్ల అది ఒకేరకంగా లేదన్న వాదన. తన వాదనను బలపరచుకోవడానికి అప్పారావు స్వీట్ ను ఉటంకిస్తూ ప్రామాణికమైన ఇంగ్లీష్ భాష అంటే "లండన్లోనూ, దాని పరిసర మండలాలలో" మాట్లాడే, మరియు సాహిత్యంలో వాడే భాషగా గుర్తించిందని చెబుతాడు. డా. గ్రియర్సన్, డా. స్టెన్ కొనో, వీ. వెంకయ్యలు ఉత్తర సర్కారు ప్రాంతాల తెలుగును ప్రామాణిక భాషగా గుర్తించారని అప్పారావు తెలిపాడు. విలియం బ్రౌన్ కూడా ఉత్తర సర్కారు ప్రాంతాల ఉన్నత వర్గాలు మాట్లాడే భాషను శుద్ధమైన భాషగా గుర్తించాడు. అతనూ ఆర్డెన్ ను ఉటంకిస్తూ "కృష్ణ, గోదావరి జిల్లాలలో మాట్లాడే భాషే అత్యంత శుద్ధమైనదనీ, చాలా ఎక్కువమంది వాడేదనీ, ప్రామాణిక భాషగా గుర్తించబడినదనీ" చెప్పాడనీ అంటాడు (అప్పారావు 43). ఇంకా బ్రాహ్మణులు సంస్కృతిని పరిరక్షిస్తుండేవారనీ, వాళ్ళే శిష్ట వ్యావహారికాన్ని సృష్టించి, దాన్ని అంతటా ప్రచారం చేశారనీ అంటాడు (అప్పారావు 44). తెలుగులో రెండే ప్రధాన భాషారూపాలనీ, ఒకటి ప్రాచీనమైనదీ, కృత్రిమమైనదీ ఐన కావ్యభాష అనీ, మరొకటి సజీవమైన శిష్ట వ్యావహారికభాష అనీ అంటాడు (అప్పారావు 47). రెండింటికీ వేరువేరు వ్యాకరణాలున్నాయని అంటాడు. కావ్యభాష వ్యాకరణపరంగా ఎన్నో వందల సంవత్సరాల కిందే స్థిరీకరింపబడిందని అంటాడు. అది జీవభాషలో వచ్చే మార్పులకు అనుగుణంగా మారలేదంటాడు (అప్పారావు 48). ఐతే అప్పారావు ఇంగ్లీష్ రచయితలు నిర్ధారించిన వాడకానికి సంబంధించిన ప్రమాణాలను అవసరమైన మార్పుల గురించి ఆలోచించకుండా గుడ్డిగా తెలుగుకు అన్వయించడాన్ని వెతిరేకిస్తాడు: "ఇంగ్లీషులో ప్రామాణికభాష అంటే గొప్పగా మాట్లాడే, గొప్పగా రాసే వారు ఉపయోగించిన భాష. అలా పరిగణించబడడానికి కారణం ఇంగ్లీష్ సాహిత్యం ప్రజలు మాట్లాడే ప్రామాణిక భాషను అనుసరించి నడవడం. 'ప్రాచీన ప్రాచ్య భాషలవలె అది ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకోలేదు. మరోలా చెప్పాలంటే, ఇంగ్లీషులో తెలుగులోవలే, మాట్లాడే, రాసే రూపాల మధ్య చీలిక లేదు. అందుచేత తెలుగులో ప్రముఖ రచయితలు రాసిన కావ్యభాష ఆ రూపానికిమాత్రమే ప్రామాణికతను నిర్ణయించగలదు (అప్పారావు 49). కావ్యభాష యొక్క వ్యాకరణమే భాషలోని వివిధ రూపాలకూ వర్తిస్తుందని, దాని సూత్రాలే ఏది భాషయొక్క సరైన వాడకమా, కాదా అని నిర్ణయిస్తుందనే ఒక అవ్యక్తమైన ఆలోచన పనిచేస్తుందని ఆయన అంటాడు (అప్పారావు 50). కానీ రాబర్ట్ కాల్డ్వెల్ రచించిన, ఇదివరకే ఉటంకించబడిన ఎ కంపారెటివ్ గ్రామర్ అఫ్ ద ద్రవిడియన్ ఆర్ సౌత్ ఇండియన్ ఫామిలీ అఫ్ లాంగ్వేజస్ (A Comparative Grammar of the Dravidian or South Indian Family of Languages) (1856) ప్రకారం ఆ భాషల కావ్య శైలి, సజీవ భాషకు దూరమౌతూ భిన్నమైన, ప్రత్యేకమైన వ్యాకరణాన్నీ, పదజాలాన్నీ ఏర్పరచుకుంటాయని చెబుతాడు. విట్నీని ఉటంకిస్తూ, కావ్య భాషలు ప్రజారంజకత్వాన్ని కోల్పోయి, ప్రత్యేక లక్షణాలను ఏర్పరచుకుంటాయని చెబుతాడు: "ప్రజారంజకత్వాన్ని కోల్పోయిన కావ్యభాష క్రమంగా దాని సజీవత్వాన్ని పోగొట్టుకుంటుంది; ఎందుకంటే, సమాజంలోని ప్రజల అవసరాలకు, సంభవిస్తున్న మార్పులకు అనుగుణంగా మారలేకపొతే ఏ భాషా సజీవంగా ఉండజాలదు" [...] (Apparow 54). విట్నీ లాంగ్వేజ్ అండ్ ద స్టడీ అఫ్ లాంగ్వేజ్ (Language and the Study of Language) (1867) ను ఉటంకిస్తూ ఈ విధంగా వాదిస్తాడు:
సాహిత్య సంస్కృతిలో అంశమైన ప్రతి మాండలికానికీ లాటిన్ కు పట్టిన గతే పడుతుంది; ధనిక వర్గమూ, దాని ప్రత్యేకతా, భాషాపరంగానూ, రాజకీయంలోనూ అంతిమంగా కూలిపోయే లక్షణాన్ని కలిగిఉంటాయి; అనేకుల అవసరాలూ, ఆకాంక్షలూ కొద్దిమంది అవసరాలూ, ఆకాంక్షలకంటే ప్రధానమైనవీ, అంతిమంగా నిలిచిఉండవలసినవీ. నిజమైన భాషా సంప్రదాయవాదం విద్యావంతమైన, ధర్మబద్ధమైన ప్రజాస్వామ్యంతో కూడి, మొత్తం సమాజాన్ని సంపూర్ణమైన, సర్వత్రా విస్తరించిన విద్య ద్వారా, సరైన, ఆరోగ్యవంతమైన, అందరికీ ఆమోదయోగ్యమై మాట్లాడే భాషను సంరక్షించడంలోనూ, రాబోయే, తప్పక వచ్చే మార్పులను స్వీకరిస్తూ సాగడంలో తనతో కలుపుకుంటుంది (అప్పారావు 55).
ఇలా దాని అందరినీ కలుపుకోగలిగే, ప్రజాస్వామిక శక్తితోకూడిన అప్పటి శిష్ట వ్యావహారికాన్ని సమర్థించడానికి అప్పారావు ప్రయత్నిస్తాడు. తెలుగులో కావ్యభాషకూ, శిష్ట వ్యావహారికానికీ మధ్య ఒక స్పష్టమైన చీలిక ఉందన్న తన వాదనను బలపరచుకోవడానికి ఆయన గ్రియర్సన్ కు లింగ్విస్టిక్ సర్వే అఫ్ ఇండియా తెలుగు సంపుటాన్ని తయారుచేయడంలో సహకరించిన స్టెన్ కోనో, ఎ గ్రామర్ అఫ్ ద తెలుగు లాంగ్వేజ్(A Grammar of the Telugu Language) (1816) ను రాసిన ఏ. డీ. క్యాంబెల్, ఎ ప్రోగ్రెసివ్ గ్రామర్ అఫ్ ద తెలుగు లాంగ్వేజ్ (A Progressive Grammar of the Telugu Language) (1873) ను రాసిన ఏ. హెచ్. ఆర్డెన్ వంటి సిధ్ధాంతకర్తల సహాయాన్ని తీసుకుంటాడు. “అతి ప్రాచీనమైన భాగాలతో సహా, భాషలోని ఏ భాగమూ నిరుపయోగంగా మారలేదు” అన్న సి. పీ. బ్రౌన్ మాటలను రామయ్య పంతులు ఉటంకించినపుడు ఆయన వాటి సందర్భాన్నుంచి విడదీసి ప్రస్తావిస్తాడని అంటాడాయన (అప్పారావు 58). ఆ మాటలు బ్రౌన్ యూరోపియన్ విద్యార్థులను ప్రజారంజకమైన తెలుగు కవిత్వాన్ని చదవమని సలహా ఇచ్చిన సందర్భంలో అన్నవి; ఐతే బ్రౌన్ తన వ్యాకరణాన్ని ప్రచురించినపుడు ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని రామయ్య పంతులుకు తెలియనట్టుంది అంటాడు. బ్రౌన్ ను ఉటంకిస్తూ ఆయన “మనం మాట్లాడేది ఇతరులకు అర్థంకావాలంటే మనం ఉమ్మడి భాషను వాడాలి. ఆ రెండు భాషా రూపాల మధ్య ప్రాచీన, ఆధునిక గ్రీకు భాషల మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది (అప్పారావు 58). అంతేకాక గ్రామ్యం అన్నది ఒక సాంకేతికపదమనీ, తెలుగు వ్యాకరణకర్తలు దాన్ని మాట్లాడే తెలుగును గురించి చెప్పేటప్పుడు వాడుతారనీ, దానికి సంస్కృత భాషలోవలే అసభ్యమనే అర్థంలేదనీ చెబుతాడు. దాని అర్థం తరువాతి కాలంలో “వ్యాకరణ విరుద్ధం”గా అని కూడా పొడిగింపబడింది. సాహిత్యం ఇకపై కొందరు వ్యక్తుల సమూహానికి పరిమితం కాబోదనీ, తెలుగులో ఇంగ్లీష్ భాషలోవలే ఆధునిక వచనం అభివృద్ధి కావాలనీ, ఎందుకంటే “బ్రిటిష్ పాలన ఇచ్చిన గొప్ప వరమైన సామూహిక విద్య”ను పొందడానికి అది అవసరమనీ అప్పారావు అంటాడు. ఇంగ్లీషుతో పోలికను విస్తరిస్తూ, ఆధునిక వచనానికి అనువైన భాష శిష్ట వ్యావహారికమని అంటాడు. ఈ సందర్భంలో ఆయన తమిళ్ కాంపోజిషన్ కమిటీ సిఫారసును ఉటంకిస్తూ “లిఖిత (వచన) భాష వీలైనంతవరకూ వాడుక భాషకు దగ్గరగా ఉండేలా చూడడం లక్యంగా ఉంచుకోవాలి” అని చెబుతాడు ( అప్పారావు 63).
తెలుగులో వచనం ఆధునీకరించబడిన వైనాన్ని వివరిస్తూ అప్పారావు విద్య విషయంలో బ్రిటిష్ పాలన యొక్క విశాలమైన ఆదర్శాలు ఆధునిక వచనం అవసరాన్ని సృష్టించిన సమయంలో, ప్రాథమిక విద్యకోసం పండితులు రాసిన పాఠ్యపుస్తకాలు కవిత్వభాషలో రాయబడ్డాయి అంటాడు. ఈ నవ్య-కావ్యవాదులలో లక్ష్మణ రావు, వీరేశలింగం, ఇంకా చెట్టి లక్ష్మి నరసింహం ఉన్నారంటాడు. వీరు వ్రాత భాష మాట్లాడే భాషకు దగ్గరగా ఉండడానికోసం సంధి సూత్రాలను ఉల్లంఘించడానికి వెనుకాడలేదు. తెలుగును వచనంలో రాయడానికి కావ్యభాషను ఉపయోగించినప్పటికీ, అది ఆధునిక తెలుగు ధ్వనిశాస్త్రాన్ని అనుసరించి ఉండవచ్చని వాళ్ళు భావించారు. నవ్య-కావ్యవాదులే మొట్టమొదట సంప్రదాయాన్నుంచి తెగతెంపులు చేసుకున్నవాళ్ళని ఆయన వాదన. చిన్నయ సూరి ప్రతినిధిగా ఉన్న అసలు కావ్యభాషా వాదులను ఈ నవ్య-కావ్యవాదులతో కలపడం చాలా అన్యాయమంటాడాయన. పైపెచ్చు వీరేశలింగం నీతిచంద్రికలో రాసిన శైలిని వదిలివేయడమేకాక, తరువాతి రోజుల్లో అలాంటి శైలిని గట్టిగా నిరసించాడని చెప్పాడు. కానీ పాఠ్యప్రణాళిక సభ్యులు మాత్రం మెట్రిక్యులేషన్ ఎస్. ఎస్. ఎల్. సి. పరీక్ష రాయడానికి దాన్నే (సులభ గ్రాంథికాన్నే) ఉపయోగించారని అంటాడు. తెలుగు వచన చరిత్రలో లేఖనాలు, ప్రజారంజకమైన కథలు, స్థానిక గాధలు, శాసనాలవంటి రచనలతోకూడిన ఒక సుదీర్ఘమైన, అవిచ్ఛిన్నమైన సంప్రదాయం ఉందని వాదిస్తాడు. ఇందుకు ఉదాహరణలుగా ఏనుగుల వీరాస్వామి కాశీయాత్రాచరిత్ర, ఎర్రమిల్లి మల్లికార్జున కవి చార్దర్వీష్ లను చెబుతాడు. ఆధునికవాదులు ఇలాంటి వచన రచనలని స్కూలు మరియు కాలేజీ పుస్తకాలలో వ్యాసం రాయడానికి వాడాలని సూచించారని అంటాడు. రామయ్య పంతులు లూన్స్బరీను తనకు మద్దతుగా తీసుకురావడాన్ని ఆయన ఖండించాడు. ఎందుకంటే లూన్స్బరీ ఇంగ్లీష్ భాష గురించి చెప్పినపుడు ఆయన, మాట్లాడే ప్రామాణిక భాష, కావ్య భాష, ఆ రెండింటి గురించి చెప్పాడనీ, రామయ్య పంతులేమో అది "కావ్యభాష" గురించి మాత్రమే చెప్పినట్లు అర్థం చేసుకున్నాడని అంటాడు (అప్పారావు 112). క్లుప్తంగా చెప్పాలంటే, సంప్రదాయవాదులకూ, ఆధునికులకూ మధ్య అసలు వివాదం వాళ్ళు ఒక నిరంతర, అవిచ్ఛిన్నమైన, జీవన సంప్రదాయాన్ని సాహిత్యంలో చూస్తున్నారా, లేక సజీవమైన మాట్లాడే భాషలోనా అన్న దానిపై ఆధారపడిఉంది.
"అస్సౌల్ట్ అఫ్ ద గ్రంథ గేజ్ ఆన్ దళిత్ బహుజన్ గ్రామ్య లాంగ్వేజ్" (దళిత బహుజన గ్రామ్య భాషపై గ్రాంథిక చూపుల దాడి) అనే వ్యాసంలో ఎన్. మనోహర్ రెడ్డి భాషా సమస్యను ఒక విభిన్నమైన కోణంనుంచి, ముఖ్యంగా గ్రామ్య (మోటైన) భాషను దళిత బహుజన దృక్పథంనుంచి, చూస్తాడు. భాష పైన రామమూర్తి యొక్క సమానత్వ సూత్రాన్ని, ఆయన నిజాయతీని ప్రశంసిస్తూనే, ఆయన ఆలోచనలను ప్రసారం చేసే వాహికగా శిష్ట జన వ్యావహారికాన్ని ఎంచుకోవడంపట్ల తన అభ్యంతరాన్ని తెలియజేస్తాడు. ఆయన పుస్తకం సవర రీడర్ కు తెలుగు అనువాదం మొదటి భాగం నుంచి రామమూర్తి అన్న "ఇదెందుకు మంచి భాష కాదు? గ్రామ్యమనడానికి ఇదేమైనా మాల, మాదిగల భాషనా?" అనడాన్ని ఉటంకిస్తాడు (రెడ్డి 45). రామమూర్తి రాసిన చివరి వ్యాసం నుండి కూడా ఈ వాక్యాలను ఉటంకిస్తాడు: "ఏ ప్రమాణాలనుంచి చూసినా వ్యావహారిక భాషను (రోజువారీ భాషను) గ్రామ్యంగా పరిగణించలేము. ఎందుకంటే నేను గడచిన మూడు దశాబ్దాలుగా ప్రచారంచేసినది శిష్టజన వ్యావహారిక భాష; అది గొర్రెకాపరుల లేక మిగతా నిరక్షరాస్యుల భాష కాదు (రెడ్డి 45). ఐతే గంజాం జిల్లాలోని సోరా (లేదా సవర) తెగ వారి భాష, సంస్కృతులపై విస్తృత పరిశోధనలు చేసి, ఆ భాషలో పుస్తకాలు రాసి, తన సొంత డబ్బుతో వారికోసం స్కూళ్ళు పెట్టి, ఉపాధ్యాయుల జీతాలు కూడా చెల్లించిన రామమూర్తి, మాలల, మాదిగల, గొర్రెలకాపరుల, నిరక్షరాస్యుల భాషపై ఇలాంటి వైఖరిని ప్రదర్శించడం దిగ్బ్రాంతిని కలిగించకమానదు. ఇంతేకాక రామమూర్తి సబరల (సవరలకు మరో పేరు) గురించి చెబుతూ "వారు అడవులలోనికీ, పర్వతాలపైకి తరిమివేయబడే వరకు వారికి వారే ప్రభువులు, వారివే ఐన రాజకీయ, సాంఘిక, మతసంబంధమైన సంస్థలు కలిగి, వారిదే ఐన నాగరికత కలవారు" అని చెప్పి ఉన్నాడు (రామమూర్తి: సోర-ఇంగ్లీష్ డిక్షనరీ xii). సవర భాషకు లిపిని ఇవ్వడమేకాక, రామమూర్తి ఎ మాన్యువల్ అఫ్ ద సోర లాంగ్వేజ్ (A Manual of the Sora or Savara Language), ద సోర-ఇంగ్లీష్ డిక్షనరీ (The Sora-English Dictionary) లను కూడా రాశాడు.
ఈ అంశంపై కొత్తగా (2019 లో) వచ్చిన వ్యాసం గౌతమ్ రెడ్డి రాసిన "ద ఆంధ్ర సాహిత్య పరిషత్: లాంగ్వేజ్, నేషన్ అండ్ ఎంపైర్ ఇన్ కలోనియల్ సౌత్ ఇండియా (1911-1915)”. ఇందులో రెడ్డి ఆంధ్ర సాహిత్య పరిషత్ లో ప్రధాన పాత్ర వహించిన జయంతి రామయ్యను "గిడుగు రామమూర్తి (1863– 1940) పరిషత్ విషయంలో బాగా ఆలోచించి కాక, రాజకీయంతో కూడి చేసిన పరిశీలనల ఆధారంగా వేసిన మూస అంచనాలను" పక్కకు పెట్టి, ఆయనను సమర్థించే ప్రయత్నం చేస్తాడు. ఈ సందర్భంలో ఆయన కృష్ణమూర్తి, రమా మంతెన, లీసా మిట్చెల్, వేణుగోపాల్ ల పరిశోధనలను పేర్కొంటాడు. పరిషత్ ను ఆయన ఇరవైయ్యవ శతాబ్దం మొదట్లో స్థానిక భాషను, దాని సాహిత్యాన్ని పునరుద్ధరించే, మెరుగుపరచే ప్రయత్నంలోనూ, భారతదేశ స్వాతంత్ర సమరం నేపథ్యంలోనూ, తెలుగువారు వారి ఆశయాలను, గుర్తింపును భాషాపరంగా వారు చాటుకుంటున్న సమయంలో ఇంగ్లీష్ చదువుకున్న తెలుగు పట్టభద్రులనూ, పండితులనూ దగ్గరకు తీసుకువచ్చిన సంస్థగా చూస్తాడు. […] ఆయన "పరిషత్తు చేసిన భాషాపరమైన పరిశోధనలను తెలుగువారి గురించి ఒక జాతీయ చరిత్రను నిర్మించే ప్రయత్నంలో సేకరించిన విలువైన సమాచారంగానూ, వివిధ విభాగాల విజ్ఞాన సంపదను తెలుగులో తయారుచేసే పనిలో ఇంగ్లీషు వచన శైలులు మరియు రూపాలను సమ్మిళితంచేసే ప్రయత్నంలో భాగంగా చూడడం జరిగింది" అంటాడు. తెలుగు ప్రాచీనత, ఆంగ్లీకరణలను విభేదించే ధృవాలుగా కాక, బ్రిటిష్ సామ్రాజ్యవాదం నేపథ్యంలో ఉద్భవించిన సాంస్కృతిక జాతీయవాదం సందర్భంలో ఒకదానిని మరొకటి పూరించేవిగా చూడాలంటాడు (296). ఇంకా ముందుకెళ్లి, పరిషత్ పై ఉన్న ప్రాచీన అశ్లీల కావ్యాలను ప్రచురించిన ఆరోపణనుకూడా సమర్థిస్తూ అది "పరిషత్ యొక్క అరుదైన, నాశనమైపోయే అవకాశముండే రాతప్రతులను పరిరక్షించే జాతీయవాద ప్రాజెక్ట్ లో భాగంగా" చూస్తాడు. "విక్టోరియన్ సామ్రాజ్యవాద నేపథ్యంలో, పాశ్చాత్య నాగరికత గొప్పదనాన్నీ, అసాధారణతనూ నొక్కిచెప్పడానికోసం ప్రాచీన యూరోపియన్ సాహిత్య చర్చలు విస్తృతంగా జరుగుతున్నప్పుడు, ఈ ప్రాచీన గ్రాంధిక పదజాలమూ, సాహిత్య సంస్కరణ (ఆంగ్లీకరణ) అన్నపేరుతో జాతీయవాద ప్రాజెక్టుకు అది ఇచ్చిన సామ్రాజవాదపు తొడుగూ, సార్వత్రిక విద్యా (స్థానికీకారణా) రెండు భాషల్లో ప్రావీణ్యత పొందుతున్న పట్టభద్రుల మనస్సులో తమదైన సాధికారతనిచ్చాయి" అని వాదిస్తాడు (304). ఈ వ్యాసం సంప్రదాయవాదుల దృష్టికోణంనుంచి సమస్యను చూపించే లక్ష్యాన్ని సాధించినప్పటికీ, అది తెలుగు కాంపోజిషన్ వివాదంపై "ఆధునికులు" చేసిన ఏ వాదనలనూ చర్చకుపెట్టే ప్రయత్నంకానీ, వాళ్ళు తప్పుపట్టిన పండితుల వాదనలను తిప్పికొట్టటంకానీ చేయలేదు.
వివాదంపై ఇప్పటివరకూ జరిగిన వాద, ప్రతివాదనలను పరిగణలోకి తీసుకున్నప్పుడు, నేను పరిశీలించిన ముగ్గురు రచయితలూ, వాళ్ళు పైకి చెప్పినా, చెప్పకపోయినా, ఇరవైయ్యవ శతాబ్ది తొలి సంవత్సరాల్లో తెలుగు భాష ఒక స్థాయి ఆధునికతను సంతరించుకుందనీ, అది ఇంగ్లీషు ప్రభావంలో క్రమంగా ఒక "జ్ఞాన సముపార్జనకు వీలైన భాష"గా రూపొందుతూ ఉండిందనీ అంగీకరిస్తున్నారని చెప్పవచ్చు. తెలుగుభాషా సంస్కరణోద్యమంలో చురుకుగా పాల్గొన్న సంప్రదాయవాదులూ, ఆధునికవాదులూ ఇంగ్లీష్ మరియు ఇతర పాశ్చాత్య భాషలకు సంబంధించిన పరిణామాలను ఇంగ్లీష్, యూరోపియన్ వ్యాకరణ కర్తల, భాషావేత్తల రచనలను ఎలా వారి వారి దృక్పథాలను సమర్థించుకునే విధంగా అర్థం చేసుకున్న, అన్వయించుకున్న, ఉపయోగించుకున్న తీరు మనకు పై చర్చలవల్ల బోధపడుతుంది. ఐతే సంప్రదాయవాదులకూ, ఆధునికవాదులకూ పాఠ్యపుస్తకాల్లో వాడవలసిన భాష గురించి జరిగిన ఈ వివాదంలోఅప్పటి ఇంగ్లీష్ అధికారులు అసలు ఏ వైపు ఉన్నారాన్నది మాత్రం అంతుపట్టడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో, సమస్యను ముట్టించిన ఒక్క యేట్స్ తప్ప, ఏ ఇంగ్లీష్ అధికారులూ ప్రత్యక్షంగా జోక్యం కలిగించుకున్న దాఖలా కనపడటం లేదు. అలాంటప్పుడు నిప్పును ముట్టించేసి, ఇంగ్లీష్ అధికారులు సరదాగా చోద్యం చూడాలనుకున్నారనుకోవాలా? లేదా 1813 చార్టర్ తో మొదలైన భారతదేశానికి సంబంధించిన మతసంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదనే బ్రిటిష్ విధానాన్ని వాళ్ళు భారతీయ భాషలకు సంబంధించిన విషయాలకూ విస్తరించినట్టు అనుకోవాలా? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు దొరకవేమోననిపిస్తుంది!
---
ఉపయుక్త రచనలు:
అప్పారావు, గురజాడ. ద తెలుగు కాంపోజిషన్ కాంట్రవర్సీ: మినిట్ అఫ్ డిసెంట్: మద్రాస్: ప్రచురణకర్త తెలియదు., 1914.
మంతెన, రమా సుందరి. “వెర్నాకులర్ పబ్లిక్స్ అండ్ పొలిటికల్ మాడర్నిటీ: లాంగ్వేజ్ అండ్ ప్రోగ్రెస్ ఇన్ కలోనియల్ సౌత్ ఇండియా.” మాడర్న్ ఏషియన్ స్టడీస్ 47.5 (2013). 1678-1705.
పంతులు, జయంతి రామయ్య. ఎ డిఫెన్స్ అఫ్ లిటరరీ తెలుగు. మద్రాస్; అడిసన్ అండ్ కో., 1913.
రామమూర్తి, గిడుగు వెంకట. ఎ మెమొరాండం ఆన్ మాడర్న్ తెలుగు. 1913. టైపు చేసిన ప్రతి.
రామమూర్తి, జీ. వీ. సం. సోరా-ఇంగ్లీష్ డిక్షనరీ. https: //ia601608. us.archive.org/ 13/items/in.ernet.dli.2015.98075/2015.98075.Sora–English-Dictionary.pdf.
17 December 2018న సంప్రదించబడినది.
రెడ్డి, గౌతమ్. “ద ఆంధ్ర సాహిత్య పరిషత్: లాంగ్వేజ్, నేషన్ అండ్ ఎంపైర్ ఇన్ కలోనియల్ సౌత్ ఇండియా (1911-1915),” ది ఇండియన్ ఎకనామిక్ అండ్ సోషల్ హిస్టరీ రివ్యూ, 56, 3 (2019): 283–310.
రెడ్డి, ఎన్. మనోహర్. “లాంగ్వేజ్, రీజియన్ అండ్ కమ్యూనిటీ.” అన్వేషి బ్రాడ్షీట్ ఆన్ కంటెంపరరీ పాలిటిక్స్. (2. 4&5: December 2014). 44-45.