ఆదివాసీలు… అంటరానితనం

గతంలో ఆ ఊరి ఆదివాసీలు నిర్మించుకున్న శివలింగాన్ని, గుడిని పేల్చివేసింది దళం. ఆ తర్వాత ఇదే మళ్లీ రావడం.

మీటింగ్‌కు రమ్మని చెప్పడానికి, అట్లాగే కూరగాయలు, బియ్యం తీసుకురమ్మని చెప్పడానికి ఊర్లోకి వెళ్లారు ఎస్‌ఏసీ మెంబర్‌ కోసి, కమాండర్‌ రాందేవ్‌, దళసభ్యుడు బుద్రాలు.

ఆ గ్రామానికి రాక దాదాడు ఏడాది అవుతోంది. ఊర్లోకి వెళ్లేసరికి మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి. దీదీ, దాదా బియ్యం తీసుకుని మీటింగ్‌కు రమ్మని రాందేవ్‌ చెప్తున్నాడు. ”ఇంగో” అని వారు అంటున్నప్పటికీ స్వయానా ఆదివాసీ అయిన రాందేవ్‌ వారిలోని తేడాని గుర్తించాడు. వారి పలకరింపు మునుపటిలా లేదు. నిజానికి కమాండర్‌ సాధారణంగా ఊర్లోకి రారు. ఈ ఊరి పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే రాందేవ్‌ వచ్చాడు. ఊరంతా తిరిగి చెప్పకముoదే వెళ్లిపోదామని ఆ ఇద్దరు కామ్రేడ్స్‌ను తీసుకుని దళం దగ్గరికి బయలుదేరాడు రాందేవ్‌.

దళం ఊరి అoచుల్లో మకాం వేసింది. సహజంగా ఎప్పుడైనా ఇలాగే మకాం వేస్తుoది. కిట్లు దించుకోగానే రోల్‌కాల్‌ (కమాండర్‌కు ఎదురుగా అడ్డంగా అంద‌రూ లైన్లో నిలబడటం) ఊర్లోకి ఫలానావాళ్లు వెళ్తారని, యువజన, మహిళా సంఘాల మీటింగులు ఉంటాయని… అట్లా ఆ పూటకు చేయబోయే కార్యక్రమాల గురించి కమాండర్‌ చెప్తాడు. ఊర్లోకి వెళ్లేవాళ్లు వెళ్లిపోతారు.

వంట డ్యూటీ వాళ్లు పొయ్యి, కట్టెలు ఏర్పాటు చేసుకుoటారు. ఒక్క కమాండర్‌ తప్ప స్త్రీ, పురుషులని తేడా లేకుoడా అoదరూ వంతుల వారీగా కిచెన్‌ డ్యూటీ చెయ్యాల్సిందే. వంట డ్యూటీ పడ్డ కామ్రేడ్‌ చాయ్‌ పెట్టే లోపల మిగతా వారంతా వాగు ఒడ్డుకు చేరి కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని వస్తారు. బూట్లు కూడా కడుక్కుంటారు. రబ్బర్‌ బూట్లు కాబట్టి ఏ పూటకాపూట కడుక్కుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో ముండ్ల చెట్లనేవే లేకపోవడం వల్ల ప్లాస్టిక్‌ బూట్లు వాడతారు. ఉత్తర బస్తర్‌, అభూజ్‌మాడ్‌ ప్రాoతాల్లో ఎక్కడ చూసినా నీళ్లుంటాయి. కాలువలు, పిల్లకాలువలు ఊరి చుట్టూ పారుతూ ఉరటాయి.

చాయ్‌ తాగిన తర్వాత అంతా ఒక దగ్గర జమ అవుతారు. సాయంత్రం క్లాసు తీసుకునేవారు రేడియో వార్తలు విని చెప్తారు. రేడియో అంద‌రి దగ్గరా ఉండదు. కమాండర్‌, ఆపైస్థాయి వారి వద్దే ఉంటది. ఒకోసారి కమాండర్‌తో పాటూ మిగతా సభ్యులు కలిసి వింటారు. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ విషయాలో… మార్క్సిజానికి సంబంధించిన విషయాలో… ఏదో ఒక అంశంపై దాదాపు గంటసేపు చెప్తారు. ఈ లోగా ఊరి నుంచి జనం రావడం మొదలవుతుంది. వాళ్లతో మీటింగ్‌ వేసి, భోజనం చేసి కిట్టు భుజానికి వేసుకునే సరికి రాత్రి పదకొండున్నర, పన్నెండు అవుతది. చాలాసార్లు ఆ టైమ్‌ కూడా దాటిపోతటి. మళ్లీ అరగంటో, అంతకంటె ఎక్కువో తక్కువో నడిచి వెళ్లి జిల్లీలు పరుచుకొని పడుకోవడం.

అంత అడవిలో పాములు, తేళ్లు కరిచి చనిపోయిన వాళ్లు ఒకరిద్దరు మినహా లేరు. అది కూడా దళం ఆగి వున్న సందర్భాల్లోనే జరిగింది కానీ, నడుస్తున్నప్పుడూ ఎప్పుడూ జరగలేదు. నడుము వరకు మంచి జాగా ఉంటే చాలు… ఒళ్లు తెలియకురడా నిద్రపోతారు. ఆ చల్లటి రాత్రి చెమట, స్నానం ఏమీ గుర్తుకు రావు. అందుకే కాబోలు నిద్ర సుఖమెరగదు అన్నారు. ఈ శాస్త్రం మొదట్లో అర్థం కాకపోయేది కోసికి. ఒళ్లు తెలియకుండా పడుకుంటే నిద్ర ఎంత హాయిగా ఉన్నదనే విషయం ఎట్లా తెలిస్తుంది?

కోసి బయటి నుంచి వచ్చింది. ఈ అడవిలోకి వచ్చాక పేరు మార్చుకుంది. ఆదివాసీల్లో కలిసిపోయినట్టు ఉండాలని వారి పేరునే పెట్టుకుంది. డిగ్రీ వరకు చదువుకుంది. ఆ తర్వాత చదువును మధ్యలోనే వదిలేసి పూర్తికాలం కార్యకర్తగా వచ్చిన నాలుగేండ్లకు పట్టుబట్టి పంతొమ్మిది వందల తొంబై ఆరు డిసెంబర్‌ ఆరున అడవిలో అడుగుపెట్టింది. 

దళమంతా పడుకోగానే సెంట్రీ మొదలవుతుంది. రాత్రి పన్నెండు గంటలు దాటితే ఒక్కొక్కరు గంటసేపు, పదకొండున్నరకే నిద్రకు ఉపక్రమిస్తే ఒక్కొక్కరు గంటన్నర చెయ్యాలి. అట్లా పొద్దున ఐదు గంటల వరకు ఒకరి తర్వాత ఒకరు సెంట్రీ చేస్తారు. సెంట్రీ డ్యూటీలను డిప్యూటీ కమాండర్‌ వేస్తాడు. తన సెంట్రీ టైమ్‌ అయిపోయిన కామ్రేడ్‌… తర్వాతి సెంట్రీని లేపితే వెంటనే తుపాకీ భుజానికి తగిలించుకుని సెంట్రీ పోస్టులో నిలబడతారు. తమ టైమ్‌ అయిపోగానే తమ తర్వాతి వారిని లేపి పడుకుంటారు. బాగా అలసిపోయిన వారు కొన్ని సందర్భాలో తర్వాత సెంట్రీ చేస్తాననో, ఆఖరి సెంట్రీ చేస్తాననో చెప్పి పడుకుంటారు.

తెల్లవారు జామున ఐదు గంటల ప్రాంతంలో ఆఖరి సెంట్రీ చేసినవారు వేసిన విజిల్‌ వినగానే అందరూ లేస్తారు. రాత్రి లేటయింది, ఇంకాసేపు పడుకుంటా అనడానికి లేదు. అన్నీ టైమ్‌ ప్రకారం జరగాల్సిందే. లేదంటే దళాన్ని నడపడం, నడవడం కష్టం. అర్ధగంటలో కాలకృత్యాలు తీర్చుకుని, కింద పరుచుకున్న జిల్లీ (ప్లాస్టిక్‌), దుప్పటి మడిచి కిట్లో పెట్టుకుంటారు. ఈసారి కమాండర్‌ నుంచి విజిల్‌ రాగానే కిట్టు భుజానికి తగిలించుకుని ఫార్మేషన్‌లో (నిలువుగా ఒకరి వెనకాల ఒకరు) నిలబడతారు. అయితే ఒకరిద్దరు కాలకృత్యాలకు వెళ్లకుండా ఆ పావుగంట, ఇరవై నిమిషాలు కూడా పడుకుని కమాండర్‌ విజిల్‌తో వచ్చి ఫార్మేేషన్‌లో నిలబడతారు. ఇట్లా ప్రతి రోజూ పడుకుంటే కుదరదు. విమర్శలు వస్తాయి.

వన్‌, టూ, త్రీ… దళసభ్యులందరూ వరుసగా చెప్పుకుంటూ వెళతారు. దళానికి ముందు భాగంలో పైలట్‌-1, పైలట్‌-2, డిప్యూటీ కమాండర్‌, దళసభ్యుడు, కమాండర్‌, ఆ తర్వాత మరికొందరు సభ్యులు… ఒకరి వెనకాల ఒకరు నిలబడతారు. ఇక వెనకాల బ్యాక్‌ పైలట్లు ఇద్దరు ఉంటారు. ఫైరింగ్‌ జరిగితే మొదటి ముగ్గురు ఎనీ టైమ్‌ సిద్ధంగా ఉండాలి.

పైలట్‌ – వన్‌ గురించి తప్పక చెప్పుకోవాలి. అడవి దారుల మీద పూర్తి పట్టు ఉన్న వారిని, పోలీసులు ఎదురుపడితే కంగారు పడని వారిని పైలట్‌-వన్‌గా నియమిస్తారు. కన్ను పొడుచుకున్నా కానరాని చీకట్లో సైతం దళాన్ని నడిపిస్తాడు/నడిపిస్తుంది. దారులు లేకున్నా పురుగుబూచీ, క్రూర జంతువులు ఉన్నా… ఆఖరికి పోలీసులు ఎదురుపడినా కమాండర్‌ కాషన్‌తో దళాన్ని ముందుకు నడిపిస్తాడు. కొన్ని సందర్భాల్లో చీకట్లో గుంతలో కూడా పడిపోతారు. అతడు/ఆమె పడిపోయినందుకు వెనకాల వారు ఆగిపోతారు. ధైర్యంగా ముందుకు వెళ్లడమే వారి పని. అందుకే పైలట్‌-వన్‌ దళానికి తలకాయ.

రాందేవ్‌, కోసి, బుద్రాలు ఊరి నుంచి వడివడిగా నడుచుకుంటూ దళం దగ్గరికి వచ్చారు. జిల్లా కమిటీ సభ్యుడు సుఖ్‌దేవ్‌ కూడా దళంతో పాటే ఉన్నాడు. ఊర్లోని పరిస్థితిని జిల్లా కమిటీ సభ్యుడు సుఖ్‌దేవ్‌కు చెప్పాడు రాందేవ్‌.

”అవునా..! అన్నం తిని వెళ్లిపోదాం. మన దగ్గర ఏమైనా సరుకులు ఉన్నాయా?” సుఖదేవ్‌.

”ఉన్నాయి” రాందేవ్‌.

”సరే వాటినే వండండి. ఊరివాళ్లు బియ్యం తీసుకు రావడం లేట్‌ చేయవచ్చు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్లిపోదాం. మీటింగ్‌లో ‘మాలదార్ల’ గురించి ఏమీ మాట్లాడవద్దు.” అన్నాడు. 

”దళాన్ని సమావేశ పరిచి అందరూ అలర్ట్‌గా ఉండమని చెప్పు” రాందేవ్‌కు చెప్పాడు.

”ఊర్లో పరిస్థితి బాగాలేదు. గ్రామస్తులు దాడి చేసినా చేయవచ్చు. అందరూ  అలర్ట్‌గా ఉండండి” దళాన్ని సమావేశపరిచి చెప్పాడు రాందేవ్‌.

”సెంట్రీకి కూడా చెప్తే బాగుంటదేమో” కోసి.

”అవును” అని, ”ఇరకో సెంట్రీని ఊరివైపు పెట్టండి” సుఖ్‌దేవ్‌ సూచించాడు.

”పరిస్థితి బాగాలేనప్పుడు ఇప్పుడే వెళ్లిపోతే అయిపోతది కదా” దళ సభ్యుడు వినోద్‌ తన సందేహాన్ని వెలిబుచ్చాడు.

”వెళ్లిపోవచ్చు. కానీ, దళం భయపడి వెళ్లిపోయిందని అనుకునే అవకాశం ఉంటుంది. అది ప్రమాదం. బెదిరింపులకు దళం భయపడదని వారికి తెలియాలి. అందుకు… అన్నం తిని, వచ్చిన వారికి మీటింగ్‌ వేసి మరీ వెళతాం” వివరించాడు సుఖ్‌దేవ్‌.

”దళం మీద దాడి చేసేంత ధైర్యం చేస్తారా?” కోసీ సందేహంగా అడిగింది.

”పరిస్థితి మీద ఆధారపడి ఉంటది” సుఖ్‌దేవ్‌. 

వంట డ్యూటీ వారు వంట మొదలుపెట్టారు. అప్పటికే పప్పు ఒక పొయ్యి మీద, అన్నం ఒక పొయ్యి మీద వండుతున్నాడు మంగ్డు.

ఆలస్యంగా బియ్యం తెస్తారనుకుంటే వెంటనే, వెలుతురు ఉండగానే తీసుకుని వచ్చారు. అయితే బాణం, విల్లు, గొడ్డలి… ఏదో ఒక ఆయుధాన్ని పట్టుకుని ఒకరి వెనకాల ఒకరు వరుసగా వచ్చారు. ఒక్క మహిళ కూడా రాలేదు. దళ సభ్యులంతా అలర్ట్‌ అయ్యారు.

వారికి ఎదురెళ్లి ”లాల్‌సలామ్‌” దాదా అంటూ రామ్‌దేవ్‌ చెయ్యి కలిపాడు. వారూ రాందేవ్‌కు చెయ్యి కలిపి, దళసభ్యులందరికీ కూడా లాల్‌సలామ్‌ చెప్పారు. ఆ తర్వాత వచ్చి రాందేవ్‌ దగ్గర కూచున్నారు. 

పిచ్చా పాటీ వారితో మాట్లాడుతూనే రాందేవ్‌ వారిని పరిశీలిస్తున్నాడు. కోసీ కూడా వారితో మాట్లాడుతోంది. కానీ వారి యాస, భాష ఇంకా అలవాటు కాలేదు. దక్షిణబస్తర్‌ గోండీకి, ఉత్తర బస్తర్‌ గోండీకి చాలానే తేడా ఉంటది. దక్షిణబస్తర్‌ నుంచి ఈ మధ్యనే కొండగావ్‌ దళానికి వచ్చింది కోసి. అందుకే ఇక్కడి భాష మీద ఇంకా పట్టు రాలేదు.

ఈ లోపల వంట కూడా అయ్యింది. అందరూ ఒక్కసారే భోజనానికి వెళ్లకుండా కొంత మంది వెళ్లి తిని వచ్చిన తర్వాత మరికొంత మంది తిన్నారు.

ఆదివాసీ ప్రాంతాల్లో దళం రాకముందు ఫారెస్టు అధికార్లు, సిబ్బంది పెట్టిన తిప్పల గురించి మాట్లాడాడు రాందేవ్‌. 

‘మాల’ గురించి మాట్లాడితే దాడి చేయడానికి సిద్ధపడే వచ్చారు వారు. ‘మాల’ ఎందుకు ధరించారని కానీ, ధరించ వద్దనీ కానీ అనలేదు. అసలు ‘మాల’ సంగతే ఎత్తకపోయే సరికి మీటింగ్‌ విన్నారు. కోసీ వాళ్ళనే గమనిస్తోంది. కానీ వారి ముఖ కవళికల్లో ఏ మాత్రం మార్పు కనిపెట్టలేకపోయింది. మీటింగ్‌ అయిపోయిన తర్వాత వాళ్లందరికీ చెయ్యి కలిపి లాల్‌సలామ్‌ చెప్పి దళం బయలుదేరింది.

లోతట్టు అడవిలోకి ఆదివాసీల్లోకి బాబాల మనుషులమంటూ కొందరు వచ్చారు. ఆదివాసీలతో మీటింగ్‌లు వేసారు. సహజంగా ఆదివాసీలు బయటి వారిని తొందరగా నమ్మరు. పంతొమ్మిది వందల ఎనభై ల్లో   దండకారణ్యంలోకి ప్రవేశించిన దళాన్నీ ఆదివాసీలు నమ్మలేదు. అమ్మాయిలను ఎత్తుకుపోతారని, మాయలు చేస్తారని, ఇన్ని ఊర్లు ఎట్లా తిరుగుతారు – మాయలు రాకపోతే అని, మన ఊర్లో  మాయమై ఇంకో ఊర్లో తేలుతారని, గాల్లో ఎగురుతారని, వారి గోర్గ చెట్ల కల్లు తాగుతారని రకరకాలుగా అనుకునేవారు. దళం మీటింగ్‌ చెప్పినంత సేపు విని వెళ్లిపోయేవారు తప్ప విశ్వసించేవారు కాదు. వాళ్ల ప్రధాన సమస్య… ఆకు తెంపినా కొత్త గుడిసె వేసుకున్నా దండగలు వేసి ముప్పుతిప్పలు పెడుతున్న, వెదురుకూపులు కోయడానికి వచ్చిన ఆదివాసీ యువతులు, మహిళలపై వరుసపెట్టి అత్యాచారం చేస్తున్న ఫారెస్టు సిబ్బందిలో ఒకడిని దళం చంపేసింది. అప్పుడు దళాన్ని సొంతం చేసుకున్నారు ఆదివాసీలు.

బాబా భక్తులను కూడా నమ్మలేదు వారు. కానీ ప్రతీ గ్రామానికి ఉండే ‘వడ్డె’ (పూజారి)ని, మరి కొందరిని తమవైపు తిప్పుకున్నారు బాబా భక్తులు.

‘వడ్డె’ చెప్పిందే ఊర్లో శాసనం. తమకు తెలియని ప్రకృతిని గురించి ‘వడ్డె’ తెలిసినట్టుగా చెప్తుంటే భయపడేవారు. జ్వరం వస్తె యంత్రం కట్టేవాడు. ఏవో మంత్రాలు చదివేవాడు. దేవుడంటూ భయపెట్టేవాడు. మొత్తానికి గ్రామాన్నంతా తన గుప్పిట్లో పెట్టుకునేవాడు. ఆదివాసీ గ్రామాల్లో కష్టం చేయని వ్యక్తి అంటే ‘వడ్డె’ మాత్రమే. అంతేకాదు, ఇతడికి మిగతా వారికంటే కొంత ఎక్కువ భూమి, మంచి భూమీ ఉండేది. ఆస్తి కూడబెట్టడం కన్నా ఊరిని తన పట్టులో ఉంచుకోవడమే ప్రధానంగా భావించేవాడు. పండుగ చెయ్యాలన్నా, పనులు మొదలుపెట్టాలన్నా ‘వడ్డె’ ఆమోదం తప్పనిసరి. అమ్మాయిలు బహిష్టులో ఉన్నప్పుడు ‘వడ్డె’కు కనిపిస్తే దండగ వేస్తాడు. దళం వచ్చిన తర్వాత ‘వడ్డె’ పెత్తనం నడవలేదు. విధిలేని స్థితిలో అణిగి మణిగి ఉంటున్నారు వడ్డెలు.

వారిని బాబా ఆశ్రమానికి తీసుకెళ్లారు. తమ గ్రామం దాటి దగ్గర్లో ఉన్న చిన్న పట్టణంలోని సంతకు మాత్రమే వెళ్లే ఆదివాసీలు వందల ఎకరాల వ్యవసాయం, పెద్ద పెద్ద కుటీరాలను చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఆదివాసీలను చాలా మర్యాదగా, గౌరవంగా చూశారు. చాలా ప్రాధాన్యత కూడా ఇచ్చారు. తమ వ్యవసాయ క్షేత్రాలను తిప్పి చూపారు. ”మీరు కూడా ఇట్లా వ్యవసాయం చెయ్యవచ్చు. ఆశ్రమంలో కొంత కాలం ఉండండి. వ్యవసాయం నేర్పుతాం” అని ఆశ చూపారు. పది, పదిహేను రోజులు ఆశ్రమంలో ఉంచుకుని వారిని వారి గ్రామాల్లో వదిలివెళ్లారు. పూజారి, పూజారితో వెళ్లినవారు తాము చూసిన విషయాలన్నిటినీ గ్రామస్తులతో పంచుకున్నారు. తమకు మంచి తిండి పెట్టారని, మాంసం అస్సలు తినరని, అందరితోపాటు తమను గౌరవంగా చూశారని, అక్కడ దేవుళ్లు వేరుగా ఉన్నారని, పచ్చటి పొలాలు ఉన్నాయని, చాలా పంట పండిస్తున్నారని చెప్తుంటే అందరూ ఆశ్చర్యంగా విన్నారు. 

పది, పదిహేను రోజులకు మళ్లీ వచ్చారు బాబా భక్తులు. ‘వడ్డె’ వారిని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించాడు. ఈసారి మళ్లీ మొదట వెళ్లిన వారిని తీసుకెళ్లారు. అరదరితో పాటు పొద్దుటే సబ్బుతో బాత్‌రూముల్లో స్నానం చెయ్యడం, సూర్య నమస్కారం, ధ్యానం, దేవుడి వద్ద పూజ, టిఫిన్‌, వ్యవసాయ క్షేత్రం తిరగడం, మళ్లీ మధ్యాహ్న భోజనం, కొద్దిసేపు నిద్ర. లంచ్‌ తర్వాత వ్యవసాయ క్షేత్రం గురించి వివరించడం, మొత్తంగా సాగు పద్ధతులను, పంట దిగుబడి పెంచడం గురించి వివరించేవారు. సాయంత్రం టీ, స్నాక్స్‌, భజన. సాంస్కృతిక కార్యక్రమాలు,  దేవుడి గురించిన ఉద్బోధ, భోజనం, తమకు కేటాయించిన గదుల్లో పడుకోవడం. వారికి ఇదంతా చాలా బాగుంది. పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఇన్ని వంటకాలు తినడం, ఈ విధమైన జీవన విధానం ఎప్పుడూ చూడనిది, అనుభవించనిది. మళ్లీ గ్రామంలో దించి వెళ్లిపోయారు. 

ఈసారి వారం రోజులకు మళ్లీ వచ్చారు బాబా భక్తులు. గ్రామంలో మీటింగ్‌ వేశారు. మద్యం తాగడం, మాంసం తినడం వల్ల దేవుడికి కోపం వస్తుందని, వాటిని మానేస్తే బాగుపడతారని, అట్లాగే నిత్యం దేవుడి పూజ చేయాలని చెప్పారు. మద్యం సేవించేవారితో, మాంసం తినేవారితో, ఆదివాసీ దేవుళ్లను పూజించే వారితో మాట్లాడవద్దని, వారు అపవిత్రులని, వారిని తాకవద్దని, తాకితే మైల అంటుతుందని, అపవిత్రులు అవుతారని చెప్పారు. రాముడు ఎంత గొప్ప దేవుడో వివరించారు. భాగవతం ఎంత అద్భుతమైనదో బోధించారు.

ఆ తర్వాత ఆశ్రమానికి వచ్చేవారెవరో చెప్పండని అడిగారు. పాత ఐదుగురితో కలిపి మరో ఐదుగురు… మొత్తం పది మంది వారివెంట చాలా సంతోషంగా వెళ్లారు. నిజానికి ఆ మీటింగుకు వచ్చిన వాళ్లంతా ఆశ్రమానికి వెళ్లి వచ్చిన వారిని చూసే ఉత్సుకతతో వచ్చారు.

ఆదివాసీలు కుదుర్లను దేవుళ్లుగా చెప్పుకుంటారు. కుదుర్లను బట్టే మడావి, నైతాం తదితర ఇంటి పేర్లు వచ్చాయి. రెండు కుదుర్లు, మూడు కుదుర్లు, ఐదు కుదుర్ల, ఏడు కుదుర్ల దేవుళ్లు ఉంటారు. బుడాల్‌ పేను, లింగో పేను వంటి మగ దేవుండ్లు, తల్లుర్‌ ముత్తే వంటి ఆడ దేవుళ్లు ఆదివాసీలకు ఉన్నారు. ఈ దేవుళ్ల విగ్రహాలు చెక్కలతో చేసినవి. ఒకే కుదురులో పెళ్లిళ్లు జరగవు. 

ప్రతి పది, పదిహేను రోజులకు ఒకసారి రావడం, మీటింగ్‌ పెట్టడం. పాత వారికి తోడు కొత్త వారిని ఆశ్రమానికి తీసుకెళ్లడం. వారికి సాగులో నూతన పద్ధతులతో  పాటు పూజా, పునస్కారాలు నేర్పారు. ‘పవిత్రులను’ చేశారు.

వరిని కుంటల కిందనో (ఏటవాలుగా ఉన్నచోట కట్ట పోయడం వల్ల నీరు ఆగి నిలిచి ఉండే ప్రారతాన్ని కుంట అరటారు), చదునుగా ఉన్న ప్రాంతాల్లోనో దున్ని పండిస్తారు. కలుపు తీసేవారు కాదు. 

కొహల (కొర్రలు)ను పోడు ద్వారానే పండిస్తారు. గుట్టల మీద ఉన్న చెట్లను నరికి ఎండిన తర్వాత వాటిని తగలబెడ్తారు. వర్షాలు పడగానే కొర్రలు చల్లుతారు. కొర్రల మొక్కలతో పాటు బోలెడంత కలుపు పెరుగుతుంది. అందువల్ల కొర్రల మొక్కలను ఏరుకుంటూ కోస్తారు. ఇట్లా నాలుగైదు ఏండ్లు సాగు చేస్తారు. సారం తగ్గుతుంది కాబట్టి మరోచోట అడవిని నరుకుతారు. పాత చోట చెట్ల మొదళ్లు మళ్లీ చిగురించి, కొన్ని కొత్త మొక్కలు పెరిగి అడవి తయారవుతుంది. ఒక్కో ప్రాంతానికి తేడా ఉన్నప్పటికీ సాధారణంగా అన్నిచోట్లా వర్షాధారపు సాగు చేస్తారు. బావులు తవ్వడం తెలియదు.

నిజానికి అడవి ప్రతి ఏటా తగలబడుతది. అది సహజమైన ప్రక్రియగానే చూస్తారు. అడవి తగలబడుతుందని బెంబేలెత్తి పోరు. రాలిపడిన ఆకులన్నీ కాలిపోతాయి, చెట్ల కొమ్మలు కూడా కొన్ని కాలుతాయి. కాలినా వర్షానికి మళ్లీ చిగురుస్తాయి. నిజానికి అడవి తగలబడకపోతే రాలిన ఆకుల మీదనే మళ్లీ ఆకులు రాలి బహుశా కుళ్లిన ఒకలారటి వాసన వ్యాపిస్తది.

కొర్రలు ఎక్కువ, వరి తక్కువగా పండిస్తారు. కలుపు తీయకపోవడం వల్ల, నీటి సౌకర్యం లేకపోవడం వల్ల దిగుబడి అంతగా రాదు. వీటికి తోడు ఆవాలు ఎక్కువగా పండిస్తారు. ఆకుపచ్చటి ఆవాల మొక్కలకు పూసే పసుపుపచ్చని పువ్వులతో పరిచినట్టు ఉండే ఆ భూములను చూసి అడవికి వచ్చిన మొదట్లో కోసి చాలా అబ్బురపడింది. అడవి నుంచి బయటికి వచ్చే వరకు ఆ దృశ్యం కనిపించినప్పుడల్లా అపురూపంగానే చూసేది.

ఆశ్రమంలో నెలల తరబడి ఉండి వచ్చిన వారి జీవన విధానమే మారిపోయింది. ఇంటిని శుభ్రంగా ఉంచుకునేవారు. అందరి ఇండ్లల్లో శివుడు, రాముడు, కృష్ణుడి ఫొటోలు. వాటికి నిత్య పూజలు. మెడలో రుద్రాక్ష, కాషాయ దారంతో చేసిన దండలు. జాకెట్‌ వేసుకునేవారు. ముఖ్యంగా సాగు పద్ధతులను నేర్చుకున్నారు. మద్యం, మాంసం మానేశారు.

ఒకే తల్లి కడుపులో పుట్టిన అన్నా తమ్ముళ్లలో ఆశ్రమానికి పొయ్యి వచ్చిన తమ్ముడు ‘మాలదారు’ అయ్యారు. ఒక రకంగా బ్రాహ్మడు అయ్యారు. ‘మాల’ ధరించనివారు ఆశ్రమానికి వెళ్లని వారు అంటే మద్యం, మాంసం అలవాటున్న ఆదివాసీలు అంటరానివారు అయ్యారు. ‘మాలదారు’ సొంత సోదరున్ని ఇంట్లోకి రానిచ్చేవాడు కాదు. వస్తే పసుపు నీళ్లు చల్లుకునేవారు. గొడవలయ్యేవి. ఆదివాసీల్లో ఈ మార్పు రావడానికి నాలుగైదు సంవత్సరాలు అంతకు మించిన కాలమే పట్టింది. బాబా భక్తులు చాలా ఓపిగ్గా, పకడ్బందీగా ఆర్గనైజ్‌ చేశారు.

అయితే, ఆశ్రమానికి వెళ్లే కొత్తవారి సంఖ్య ఆగిపోయింది. తాము పుట్టి పెరిగిన పద్ధతుల్లో ఉంటామని భావించిన వారు ఆశ్రమానికి వెళ్లడానికి నిరాకరించారు. మంచి మాటతో వినని ఆదివాసీల మీద బాబా భక్తులు దాడులు మొదలుపెట్టారు. వీరికి ‘మాలదారు’లు తోడయ్యారు. అంతేకాదు, ఆదివాసులు కాసుకునే ఇప్పసారా బట్టీలను పగలగొట్టారు. అడ్డొచ్చిన వారిని చితకబాదారు. మాంసం తినొద్దని హుకుం జారీ చేశారు. దీంతో ఆదివాసీలు బెంబేలెత్తి పోయారు.

దళం ఆ గ్రామాలకు వెళ్లినప్పుడు… తమ మీద జరిగిన దాడులను  చెప్పుకున్నారు. సొంత సోదరులు తమను ఇండ్లల్లోకి రానివ్వడం లేదని, తమను తాకడం లేదని, తమ పండుగలను చెయ్యడం లేదని, వేరే దేవుళ్లను పూజిస్తున్నారని, దేవుడి గుడులను కడుతున్నారని, ఫారెస్టు వాళ్లు పొయ్యారనుకుంటే బాబా భక్తులు వచ్చారని బాధపడ్డారు. కొత్తగా కమాండర్‌ అయిన రామ్‌దేవ్‌ తక్షణమే ఏమి చేయవచ్చనే విషయాన్ని సాక్‌ (ఎస్‌ఏసీ – స్క్వాడ్‌ ఏరియా కమిటీ)తో చర్చించాడు. సాక్‌ నిర్ణయంతో దళం శివలింగాన్ని పేల్చివేసింది.

‘మాలదారు’లు కక్ష పెంచుకున్నారు. తాము నమ్మిన దేవుడి లింగాన్ని పేల్చివేయడం తమను కొట్టిన దానికంటే కూడా నొప్పికలిగించింది వారికి. దానికితోడు వారికి ఎక్కించి చెప్పడానికి బాబా భక్తులు ఉండనే ఉన్నారు. 

దాని ఫలితమే ఈ రోజు ఆయుధాలు పట్టుకుని దళం దగ్గరికి రావడం. 

దళం వేరే ఊరు దారి పట్టింది కానీ అందరి మనసుల్లో దాదాలు ఆయుధాలు పట్టుకుని రావడమే మెదులుతోంది. ఏ విధంగా వీరిని మళ్లీ మామూలు మనుషులను చెయ్యవచ్చు? దేవుడి రూపంలో బాబా భక్తులు పెట్టిన చిచ్చును ఎట్లా తొలగించడం సుఖ్‌దేవ్‌ ఆలోచిస్తున్నాడు. మతమనే విశ్వాసం చాలా బలమైనది కదా. దళం గుడిని పేల్చివేయకుండా ఉండాల్సింది కోసీ మనసులో ఆలోచించుకుంటోంది. 

దాదాపు పదిహేను రోజులు కావచ్చింది. రాష్ట్రకమిటీ సభ్యుడు మహేశ్‌ దళంతో పాటు కొన్ని రోజులు తిరగడానికి వచ్చాడు. అప్పటికే ‘సాక్‌’ మీటింగ్‌ జరిగి రెండు నెలలు దాటింది. దాంతో మొదట మీటింగ్‌ కోసం రెండు రోజులు క్యాంపు వేశారు. ‘సాక్‌’ (స్క్వాడ్‌ ఏరియా కమిటీ) మీటింగ్‌లో రాందేవ్‌, కోసీ, మంగ్డు, నిర్మల, సుభాష్‌ కూచున్నారు. ఈ రెండు నెలల కాలంలో దళం చేసిన కార్యక్రమాలపై చర్చించారు. దళం వల్ల జరిగిన పొరపాట్లను, ప్రజల నుంచి వచ్చిన సమస్యలను చర్చించారు. దళ సభ్యుల సమస్యలు, విమర్శ-ఆత్మవిమర్శ జరిగాయి. ఈ ఘటన కూడా చర్చకు వచ్చింది.

”వాళ్ల విశ్వాసం తప్పని వివరించి, అర్థం చేయించాలి కానీ శివలింగాన్ని పేల్చి వేసి వారి మనస్సుల్లో ముద్రించుకుని పోయిన నమ్మకాన్ని దూరం చెయ్యలేము కదా. నిజానికి ఆశ్రమానికి వెళ్లి వచ్చినవారు నూతన సాగు పద్ధతులు వంటి కొన్ని మంచి విషయాలు నేర్చుకున్నారు. మద్యాన్ని మాన్పించడం దళం వల్ల కాలేకపోయింది కానీ భగవంతుడి పేరుతో వాళ్లలో ఆ మార్పును తీసుకురాగలిగారు బాబా భక్తులు.” సమస్య విన్న మహేశ్‌ మాట్లాడాడు.

”అంటే బాబా భక్తులు మంచివారనా?” చాలా షార్ప్‌గా వచ్చింది రాందేవ్‌ నుంచి.

”మంచి ఎవరు చేసినా మంచే కదా” కోసీ అందుకుంది.

”వాళ్లు ఆదివాసీల మీద దాడులు చేశారు. అందుకే లింగాన్ని పేల్చి వేయాల్సి వచ్చింది.” తాము చేసినది తప్పు కాదంటూ సుభాష్‌.

”బాబా భక్తులను తక్కువ అంచనా వెయ్యొద్దు” మీరు బయటి నుంచి వచ్చిన వారు, ఇక్కడి పరిస్థితి మీకు తెలియదన్నట్టుగా రామ్‌దేమ్‌ అన్నాడు. కోసీ మీద కోపం కూడా వచ్చింది రామ్‌దేవ్‌కు – నిన్న మొన్న వచ్చిన ఈమెకేం తెలుసు అని. పుస్తకాల్లో చదువుకున్న నీతులను చెప్తుంది అనుకున్నాడు.

”ఏ పేరుతో తెచ్చినా మార్పు మంచిది అయినప్పుడు తప్పకుండా ఒప్పుకోవాలి. అయితే ఆ మార్పును ఏ ఉద్దేశంతో తెచ్చారు అనేది కూడా పరిశీలించాల్సిన అంశమే.  వాళ్లు అనుసరించిన పద్ధతులేమిటో తెలుసుకోవాలి? ఉద్యమకారులకు ఇందులో ఇంకా ఎక్కువ నిజాయితీ ఉండాలి.  ” రామ్‌దేవ్‌ మనసులోని మాటను గ్రహించినట్టుగా నెమ్మదిగా ఒత్తిపలుకుతూ వివరించాడు మహేశ్‌.

సుఖ్‌దేవ్‌ వింటూ కూర్చున్నాడు.

”అవును” కోసీ.

”అలాగే మాంసం తినడాన్ని మాన్పించడం సరైనది కాదు. అది ఆరోగ్యానికి, అందునా అడవిలో శారీరక కష్టం ఎక్కువ చేసేవారికి చాలా అవసరం. అట్లనే మద్యం తాగడం తప్పే కానీ, తాగొద్దని దాడులు చేస్తే ఊర్కోవద్దు.  ‘మాలదారు’ బ్రాహ్మలు అయినట్టు, మాల ధరించనివారు అంటరానివారు అయినట్టు ప్రవర్తిస్తున్న తీరు తప్పని,  మీరు పాటించే విషయాలు కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవని మాలదార్లకు వివరించాలి. మాలధరించని వారిని దూరం పెట్టడం సరికాదని బోధించాలి. రాముడు, కృష్ణుడు, శివుడితో పాటు ఆదివాసీ పండగలను కూడా జరుపుకొమ్మని చెప్పాలి.”

”వీళ్లు మాంసం తింటారు కాబట్టి ఆదివాసీ పండగల దగ్గరకు రామని ‘మాలదార్లు’ అంటున్నారు.” రాందేవ్‌.

”మాంసం తినేవాళ్లు, తిననివారు ఎవరి వంట వారు వేర్వేరుగా చేసుకొమ్మని చెప్పొచ్చు కదా” కోసి.

రామ్‌దేవ్‌ కోసి వైపు కోపంగా చూసి ఊకున్నాడు. నిన్న మొన్న ఈ దళంలోకి వచ్చిన కోసి పేద్ద తెలిసినట్టుగా మాట్లాడటమే రామ్‌దేవ్‌కు నచ్చడం లేదు.

సుఖ్‌దేవ్‌కు రామ్‌దేవ్‌ వ్యవహారం అర్థమవుతూనే ఉన్నది. దళంలోకి వచ్చినప్పటి నుంచి రామ్‌దేవ్‌ను ఆర్గనైజ్‌ చేస్తున్నాడు సుఖ్‌దేవ్‌.

”అవును. కోసీ చెప్పింది కరక్టే. వేర్వేరుగా వండుకున్నా పండగ మాత్రం అందరూ ఒక్కచోటనే చెయ్యాలని అర్థం చేయించాలి.” మహేశ్‌.

”దేవుండ్లు, దయ్యాలు లేరని చెప్పే మనమే పండగలు చేసుకొమ్మని చెప్పాల్నా?” ఇంతసేపు కన్విన్స్‌ అవుతూ వస్తున్న సుభాష్‌ ఆశ్చర్యంగా అడిగాడు.

‘దేవుడూ దయ్యం లేడని చెప్పే పార్టీనే పండుగలు చేసుకొమ్మని చెప్పాల్సి రావడం చిత్రమే కదా. వారు నమ్ముతున్న దేవుళ్లను ఏ మాత్రం తూలనాడినా తిరగబడే స్థితిలో ఉన్న ‘మాలదార్ల’కు ఇంకే విధంగా చెప్పినా వినక పోవచ్చు’ మనసులో అనుకుంది కోసి.

”వాళ్ల విశ్వాసాలను కించపరుస్తూ వారి మనస్సులను గాయపర్చవద్దు. పండగలు వారి సంస్కృతి. హానికరం కానప్పుడు వాటిని ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. వాళ్లు నమ్మిన దేవున్ని మంచి పనులకు ఉపయోగించుకోవడంలో తప్పులేదు.” వివరించాడు మహేశ్‌.

మళ్లీ తనే ”ఈ విషయాలన్నిటితో పాంప్లెట్‌ వెయ్యండి. మాలదార్లు అధికంగా ఉన్న గ్రామాల్లో పంచండి. శివలింగాన్ని పేల్చివేయడం మనవైపు నుంచి జరిగిన తప్పని ఒప్పుకోవడం మాత్రం మరిచిపోకండి.” మహేశ్‌ మళ్లీ గుర్తు చేశాడు.

* * *
”దాదాలోర్‌, దీదీలోర్‌” సుఖ్‌దేవ్‌ మీటింగ్‌ను ప్రారంభించాడు.

”ఇంగో”

”శివలింగాన్ని పేల్చివేయడం మా వైపునుంచి జరిగిన పొరపాటు. అట్లా చేయకుండా ఉండాల్సింది. తొందరపడ్డాం. అందుకు మమ్మల్ని మన్నించండి.” దళం తరఫున ఆత్మవిమర్శ చేసుకుంటూ మీటింగ్‌ ప్రారంభించాడు సుఖ్‌దేవ్‌.

”అయ్యో! అదేం లేదు దాదా” మాలదార్లు గుసగుసగా అన్నారు. 

వాళ్లకు చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది, దళం తన తప్పును ఒప్పుకోవడం. దాదాలు పిల్చారు కాబట్టి మీటింగ్‌కు వచ్చారు కానీ, చాలా మందికి రావడమే ఇష్టం లేకుండే. కానీ సుఖ్‌దేవ్‌ మాట్లాడిన మొదటి వాక్యంతోనే అరదరూ శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు.

”ఆశ్రమానికి వెళ్లి మీరు కొన్ని మంచి విషయాలు నేర్చుకుని వచ్చారు. ముఖ్యంగా వ్యవసాయంలో కొత్త పద్ధతులు నేర్చుకున్నారు. దిగుబడి పెంచుకున్నారు. గ్రామంలోని మిగతావారికి ఆ విషయాలను మీరు ముందుండి నేర్పాలి.”

”ఇంగో” చాలా సంతోషంతో అన్నారు.

”అట్లాగే మిగతా దాదలు కూడా వాళ్ల నుంచి సాగు పద్ధతులను నేర్చుకోవాలి. ఇట్లాగే వ్యవసాయం చేస్తే భవిష్యత్తులో మనకు తినడానికి తిండి దొరకదు. ఏంటి దాదాలోర్‌, దీదీలోర్‌ నేర్చుకుంటారా?”

”ఇంగో దాదా. కానీ వీళ్లు మమ్ముల్ని ముట్టుకోవడం లేదు. వాళ్లు మా ఇండ్లళ్లకు రావడం లేదు. మేము వాళ్ల ఇండ్లళ్లకు పోతె గొడవ పెడుతున్నరు రావద్దని. పసుపు నీళ్లు చల్లుకుంటున్నరు.” గుంపు లోంచి ఒక దీదీ చెప్పింది.

నిజానికి ఇక్కడ కూడా మాలదార్‌ దీదీలు, దాదాలు ఒకవైపు; ఆదివాసీలంతా ఓపక్కకు… మధ్యలో కొంత జాగా వదిలి రెండు గుంపులుగా కూర్చున్నారు.

”మాల వేసుకున్నంత మాత్రాన తోడబుట్టిన వారిని కూడా దూరంగా పెట్టడం మంచిదేనా? తోటి మనుషులను తాకవద్దని ఏ దేవుడూ చెప్పడు. అట్లా చెప్పిన దేవుడు దేవుడే కాదు. ఇంతకాలం అరదరిని కలిపి ఉంచిన ఆదివాసీ దేవురడ్లు, దేవతలు మంచివాళ్లా? విడదీస్తున్న రాముడు, కృష్ణుడు మంచివారా? ఏమంటారు?” సుఖ్‌దేవ్‌.

సభ అంతా పిన్‌డ్రాప్‌ సైలెన్స్‌. నిజానికి ఈ మాటలు మాలదార్లకు ఇంతకుముందు ఎక్కక పోవును. దళం చేసుకున్న ఆత్మవిమర్శతో వాళ్లల్లో సగం కోపం పోయింది. అందుకే సుఖ్‌దేవ్‌ చెప్తున్న మాటలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఆలోచిస్తున్నారు.

అందరినీ గమనిస్తూ సుఖ్‌దేవ్‌ మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టాడు.

”గతంలో మీరంతా ఎంత కలిసి మెలిసి ఉన్నారో గుర్తు చేసుకోండి. ఎంత ఆనందంగా ఉండేవారో గుర్తు చేసుకోండి. ఇప్పుడు సొంత అన్నను చూస్తేనే మీ మనస్సు ముడుచుకుపోవడాన్ని గమనించారా? దాదాలోర్‌, దీదీలోర్‌ మనమంతా కష్టం చేసుకుని బతికేవాళ్ళం. మనని విడదీయడానికి చాలా రకాలుగా చెప్తారు. మంచివి నేర్చుకోండి. మిగతావి వదిలేయండి. గతంలో లాగా అందరూ కలిసి మెలిసి ఉండాలి. ఏమంటారు?”

”వాళ్లు శుభ్రంగా ఉండరు?” గుణిగాడు ఒక మాలదార్‌ దాదా.

”శుభ్రంగా ఎట్లా ఉండాలో నేర్పండి. అంతేకానీ దూరం పెట్టొద్దు. నిజానికి మన దాదలు, దీదీలు కూడా రోజూ స్నానం చేస్తారు కదా. కాకపోతే సబ్బులు వాడరు. ఇతరత్రా శుభ్రత గురించి నేర్పించండి.” అని మాలదార్లకు చెప్పాడు. 

”ఏమంటారు ? నేర్పిస్తారు కదా.” సుఖ్‌దేవ్‌. 

చెప్పాల్సిన విషయాలు మర్చిపోయాడని అర్థమైన కోసి ”మద్యం గురించి” అందించింది.

”మద్యం మానేయడాన్ని మాలదార్లను చూసి మన దాదలు నేర్చుకోవాలి. ముత్తికైనా విడ్సకోం మతి గోర్గతున్‌ విడ్స పర్వోం (భార్యనైనా వదిలిపెడతాం కానీ గోర్గ కల్లును విడవలేం) అంటారు కదా. మరి మీవాళ్లే అయిన మాలదార్లు గోర్గ కల్లును, లందను, ఇప్పసారాను వదిలిపెట్టి మీ కండ్ల ముందరనే మంచిగనే ఉంటున్నరు కదా.” ఆదివాసీల నుద్దేశించి అన్నాడు సుఖ్‌దేవ్‌.

ఈ మాటలతో మాలదార్ల మొఖాలు వెలిగాయి.

”అవునూ…” అంటూ నసిగారు ఆదివాసీలు.

”ఒక్కసారే వదిలిపెట్టకపోయినా. సారాను నెమ్మది నెమ్మదిగా బందు పెట్టండి. సారా తాగితే మత్తు వస్తది. నిద్రపోతరు. అందుకని వ్యవసాయానికి ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. సారాను బందు చేస్తేనే సాగు బాగా చేస్తాం. మాలదార్ల నుంచి సాగు మెళకువలు నేర్చుకోండి.

”మన ఆదివాసీ పండగలు, మన మూలవాసుల పండుగలు కూడా మాలదార్లు జరపాలి. నిన్న మొన్న వచ్చిన వేరే దేవుళ్లకు పూజలు చేసి, మన దేవుండ్లను వదిలేస్తే మన దేవుండ్లకు కూడా కోపం వస్తది కదా. అందరినీ కలిపి ఉంచే మన దేవుండ్లే మంచివారు. ఏమంటారు దాదాలోర్‌? మన పండగలు జరుపుతారా?”

”మీరు చెప్పింది నిజమే దాదా.  పండగలు చేస్తము కానీ మేము మాంసం తినము కదా.” గుంపులోంచి ఒక దాదా అడిగాడు.

”మీరు కూరగాయలతో పండుగ చేస్తే.. వాళ్లు మాంసంతో చేస్తరు. కానీ అందరూ ఒక్కదగ్గరే పండుగ చెయ్యాలి. మన రివాజుల ఉన్న మంచి విషయాలను వదిలెయ్య కూడదు. ఏమంటరు?”

”ఇంగో దాదా” ఈసారి ముక్త కంఠంతో మాలదార్లు మనస్ఫూర్తిగా అన్నారు.

”మీరేమంటరు దాదాలోర్‌, దీదీలోర్‌?”

”ఇంగో దాదా” తేలికపడ్డ మనసుతో ఆదివాసీలు.

మీటింగ్‌ అయిపోయింది. రాత్రి పన్నెండున్నర కావస్తుంది. అందరూ ఊరి దారిపట్టారు. దళంలో భోజనాలు చెయ్యని వారు చేస్తున్నారు. చేసినవారు కిట్లు సర్దుకుంటున్నారు.

అంతసేపు జనాన్ని గమనిస్తూనే ఉన్నాడు మహేశ్‌. బాబా భక్తులు వచ్చి మళ్లీ వీరికి చెప్పకపోరు. అయితే, ఇంతకుముందులా అన్నిటిని వీరు నమ్మకపోవచ్చు. ఏమైనా ఇదీ విజయమే భోజనం చేస్తూ ఆలోచిస్తున్నాడు మహేశ్‌.

బహుశా కులాలు ఇట్లాగే పురుడు పోసుకున్నాయేమో కిట్టు సర్దుతూ మనసులో అనుకుంది కోసి.

జనం స్పందన చూశాక తేలిక పడిన మనసుతో,  ”ఇప్పటికే బాగ లేటయింది. తొందరగ సర్దుకోండి”  కొత్త విషయాన్ని నేర్చుకున్న ఆనందంతో రామ్‌దేవ్‌.

(నోట్: ఇది అబూజ్‌మాడ్ ఏరియాలో 1997 నాటి పరిస్థితి)

జ‌న‌నం: న‌ల్ల‌గొండ జిల్లా. అస‌లు పేరు ప‌ద్మ మిర్యాల‌. బీఎస్సీ(B.Z.C), PG Diploma in Journalism. వృత్తి: జ‌ర్న‌లిస్టు. మొద‌ట్లో 'క‌రుణ' పేరుతో క‌థ‌లు రాశారు. 23ఏండ్ల వ‌య‌సులో 'తాయ‌మ్మ' క‌థ రాశారు. ఇది క‌రుణ‌ మొట్ట‌మొద‌టి క‌థ . రాసిన మూడేండ్ల త‌ర్వాత 1996లో 'మ‌హిళా మార్గం'లో అచ్చ‌యింది. ఈ క‌థ పేరుతో 'కరుణ' '- 'తాయ‌మ్మ క‌రుణ‌'గా మారింది. ఆంధ్రప్రభ, సాక్షి, ప్రస్తుతం 'నవతెలంగాణ'లో.  మొదటి కథల సంపుటి 'తాయమ్మ మరికొన్ని కథలు' 2009లో, 2వ కథల సంపుటి 'జీవితం' 2018లో ప్రచురితమయ్యాయి. కవితలు, వ్యాసాలు అచ్చయ్యాయి. 13 ఏండ్లు విప్లవోద్యమంలో ప్రజా సమస్యల పరిష్కారానికి పని చేశారు.

One thought on “ఆదివాసీలు… అంటరానితనం

  1. చాలా ఆసక్తికరంగా సాగింది. ఆదివాసీల గురించి తెలియని విషయాలెన్నో తెలిసాయి. అయితే దళాల సంచారానికి సంబంధించిన సాంకేతిక విషయాలు వివరించటం సరైనదేనా?

Leave a Reply