ఆత్మ‌గ‌ల్ల మ‌నీషి చెర‌బండ‌రాజు

‘కొలిమి’ నన్ను చెరబండరాజు గురించి నా జ్ఞాపకాలు రాయమన్నప్పుడు ఒక పక్క సంతోషం, మరో పక్క భయం కలిగింది. అంత గొప్ప కవి గురించి రాయడానికి నా భాష సరిపోతుందా అనిపించింది. భాషనే ముఖ్యం కాదు కాబట్టి ఆయనతో ఉన్నకొన్ని జ్ఞాపకాలు మీతో పంచుకుంటున్నాను.

వెల్దండ గ్రామంలో మే 19, 1974 లో జననాట్యమండలి ప్రోగ్రాం నిర్ణయించి, నన్ను ఆ కార్యక్రమానికి పిలవడానికి లక్ష్మయ్య, ప్రతాపన్న మా వూరికి వచ్చి నన్ను తీసుకొని జనగామకు వచ్చారు. జనగామలో న్యూస్ పేపర్ చూసి “అయ్యో కా. వరవరరావు, కా.చెరబండరాజును పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కూడా వెల్దండ ప్రోగ్రాంకి వచ్చేదుండే’ అని అన్నప్పుడే నేను మొదటి సారి కా. వి‌వి, కా. చెరబండరాజు పేర్లు విన్నాను. అప్పుడు నా వయస్సు 16 సంవత్సరాలు. అదినా మొదటి ప్రోగ్రాం. నెల రోజుల తర్వాత జననాట్యమండలిలో చేరాను.

1974 జూలై- ఆగస్ట్ అనుకుంటా కా.చెరబండరాజు, కా.వరవరరావులను సికింద్రాబాద్ కుట్ర కేసులో కోర్టు వాయిదాకు కోర్టుకు తీసుకొస్తున్నారు. జనాట్యమండలి సభ్యులం కూడా అక్కడికి వెళ్లాము. కా. చెర, కా.వి‌వి తప్ప నాకు ఎవరెవర్ని తీసుకవచ్చారో గుర్తు లేదు. అప్పటికి నాకు అంతా కొత్త. విప్లవ రచయితలు పోలీస్ వ్యాన్ దిగుతూనే నినాదాలతో మొదలయ్యింది. అక్కడంతా ఉద్వేగభరిత వాతావరణం. కోర్ట్ ఆవరణంతా విద్యార్థులు, యువకులు, బంధుమిత్రులతో నిండి వుంది. చెరబండరాజు చేతులకు వేసిన బేడీలతో తాళం వేస్తూ “పాడుతాం పాడుతాం ప్రజలే మా నేతలనీ, ప్రజాశక్తి నిలుచునని” అనే తన పాట పాడుతున్నాడు. తల ఎగరేస్తూ, రాజ్యానికి సవాల్ చేస్తున్నట్టు, ఎవరికి మేము తలవంచం అన్నట్టు పాడుతూ తను నడుస్తుంటే మేమంతా కోరస్ పాడుతూ వాళ్ళ వెనకే కోర్ట్ హాల్ వరకు వెళ్లాము. అది నా కళ్ళకొక అద్భుతం. ఎంతో ఆశ్చర్యం. అక్కడున్న వాళ్ళందరికీ ధైర్యం, ఎంతో స్ఫూర్తి, ఎంతో ఉత్సాహం కలిగింది. నాకైతే “ఏంటి వీళ్ళకింత భయం లేకుండా కోర్ట్ కి వెళ్తున్నారు” అనిపించింది. మళ్ళీ వెంటనే తెలియని ఆనందం. నేను కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొంటున్నానని. ప్రతి వాయిదాకు ఇదే సందడి. ఇదే ఉత్సాహం.

జననాట్యమండలి ప్రతీ ప్రదర్శనలో కా. చెరబండరాజు రాసిన “కొండలు పగిలేసినం – బండలను పిండినం- మా నెత్తురే కంకరగా ప్రాజెక్టులు కట్టినం” పాటపై బ్యాలే ప్రదర్శించేవాళ్లం. ప్రతీ ప్రోగ్రాంలో ఆ పాట మీద బ్యాలే హైలైట్!

జననాట్యమండలి 1975 జూన్ నెలలో పార్టీ ప్రచారానికి గుంటూరు జిల్లా వెళ్లినప్పుడు, ముఖ్యంగా ఆ ప్రోగ్రాం లో పోలీసోని పాట ఉండడం వల్ల కోపోద్రిక్తులైన పోలీసు JNM మీద దాడి చేసి మా అందరినీ చితకబాదారు. ముఖ్యంగా పోలీసు పాటపాడిన నన్ను, భూపాల్ ను, C.S.R ప్రసాద్ ను విపరీతంగా కొట్టడం వలన, వొల్లంత కమిలి తెల్లవారే వరకు చీములుపోశాయి. తెల్లవారి మమ్మల్ని కలవడానికి కా. చెరబండరాజు, K.V .రమణారెడ్డి వచ్చారు. వాళ్ళను చూడగానే మాకు కొండంత ధైర్యం. ఆగమైన కోడి పిల్లల్లాగా పరిగెత్తుకు పోయి వాళ్ళ చేతుల్లో చేతులు కలిపాము. “బాగా కొట్టిండ్రా?” అని కమిలిపోయిన మా శరీరాలు చూసి ఆ ఇద్దరు కామ్రేడ్స్ గొల్లున ఏడ్చేసిండ్రు. కా. చెరది ఎంత సున్నితమైన మనసో చెప్పడానికి ఈ సంఘటన చాలు. ప్రతి విషయానికి తొందరగా స్పందించే మనసు కనిపించేది. కామ్రేడ్స్ కి తోటి కామ్రేడ్స్ ప‌ట్ల‌ ఇంత ఆదరణ, ప్రేమ‌లుంటాయా అనిపించింది.

నేను గుంటూరులో దెబ్బలు తిని హైద్రాబాద్ తిరిగి వచ్చేసరికి నా సహచరుడు లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ క్యాంపుల్లో తిప్పుతున్నారు. మా రూములో బియ్యం లేవు. కనీసం నీళ్ళు కాగబెట్టుకొని స్నానం చేయడానికి యింత గ్యాస్ నూనె కూడా లేదు. చాలా నీరసంగా ఉన్న నేను అంబర్ పేటలో ఉన్న చెరబండరాజు వాళ్ల ఇంటికి వెళ్లాను. నన్ను చూసి చెరబండరాజు సహచరి శ్యామలక్క “అయ్యో సంధ్య! ఎట్లయిపోయినవ్?” అని నన్ను ఎంతో ఆప్యాయంగా ఇంట్లోకి తీసుకెళ్లింది. వెంటనే నీళ్లు వేడిచేసి స్నానం చేయించి, వేసుకోడానికి తన బట్టలిచ్చింది. ఆమె ప్రేమాదరణలు నేనెప్పుడూ మరవలేను. చెరబండరాజుతో పాటు ఆయన ఉద్యమ సహచరులను కూడా అక్క తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకునేది.

‘మా భూమి’ సినిమా విడుదలైన 200 రోజుల ఉత్సవాన్ని త్యాగరాయ గానసభ హాల్లో ఏర్పాటు చేశారు. కార్యక్రమం మధ్యలో నర్సింగన్న “పాలబుగ్గల జీతగాడా” పాట పాడు సంధ్య అని చెప్పగానే పాడడానికి నిలబడిన. అంతే ఎక్కడ కూర్చున్నాడో ఏమో హాల్ మధ్య నుండి కా. చెరబండరాజు బిర బిరా వేదిక వద్దకు వచ్చి నన్ను పిలిచి పాటలోని చివరి రెండు చరణాలు కూడా పాడుమని చెప్పి, సరే అనగానే మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు. ఆ పాటలోని ఆ రెండు చరణాలు :

జనవరి ఇరువది ఆరు ప్రజాతంత్ర నినాదాలు
కోటీశ్వరుల నాటకమంటావా అంతా వట్టి భూటకమంటావా… ఓ… పాలబుగ్గలా…

కష్టజీవుల కడుపునిండ కనికరించే ఎర్ర జండా
ఎర్ర కోటపై ఎగురాలంటావా… ఓ… పాలబుగ్గలా…

ఈ రెండు చ‌రణాలు సినిమాలో లేవు. కానీ అవే పాటకు ప్రాణమని, ప్రజలకు చేరవలిసిన సందేశమని కా.చెర ఉద్దేశం.

1977 లో కా.చెరబండరాజు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ జరిగి గాంధీ ఆసుపత్రిలో ఉన్న రోజులు. అదే సమయంలో మాచుట్టాలావిడను గాంధీ హాస్పిటల్లో చేర్పించారు. ఆమె దగ్గర నేనే ఉండవలసి వచ్చింది. ఆమెకు సపర్యలన్నీ చేసి ప్రతిరోజు కా. చెరబండరాజు వద్దకు వెళ్ళి కూర్చునేదాన్ని. నేను వెళ్ళగానే అక్కడున్న నర్సులను ఎంతో అప్యాయంగా పిలిచి వాళ్ళను నాకు, నన్ను వాళ్ళకు పరిచయం చేసి, మా సంధ్య మంచి గాయని అని చెప్పి, వాళ్ళను కూర్చోబెట్టి నాతోపాటలు పాడించేవాడు. ఎక్కడ అవకాశం వచ్చినా తన చుట్టూ ఉన్న మనుషులను చైతన్యపర్చాలనే తహతహ చెరలోకనిపించేది. “సంధ్యా… నీవు పాట పాడకుంటే నేను తిన్న తిండి తిన్నట్టుండదుర” అని చాలా ఆత్మీయంగా అడిగేవాడు. ఇట్లా 13 రోజులు హాస్పిటల్లో చెరతో ఉండే అవకాశం దొరికింది.

ఆయన మనుషుల పట్ల ఆత్మ గల్లోడు. అలాంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం అందరి వల్ల కాదు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని ప్రతి క్షణం తహతహ లాడిన ప్రభాత భాస్కరుడు. భారత విప్లవోద్యమంలో అతనొక వేగుచుక్క. ఆయన తొణకని నిండుకుండ. కళాసాహిత్య రంగానికి ఆయనొక దిక్సూచి. చెరకు చిన్న పెద్దా తారతమ్యం ఉండదు. ప్రతి వ్యక్తిని గౌరవించే గొప్ప వ్యక్తిత్వతం. అంత గొప్ప నిబద్ధత, స్నేహశీలత, నెనరున్న స్వచ్ఛ‌మైన మనుషుల మధ్య జీవించడం, పనిచేయడం, సమాజం లో మౌలిక మార్పుకై ఇలాంటి మనుషులు వుంటారనే నమ్మకమే భవిష్యత్తు పై భరోసా కలిగిస్తుంది. ఇంత మహోన్నతమైన మనుషుల మధ్య నేనూ ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను.

నా ప్రియమైన కామ్రేడ్, నా ప్రియమైన ప్రజాకవి చెరబండరాజుకు హృదయపూర్వక విప్లవాభి వందనాలు. విప్లవ జోహార్లు.

పుట్టింది దేవరుప్పుల, వరంగల్ జిల్లా. చదివింది ఎం. ఏ, బి. ఎడ్. జననాట్య మండలిలో పని చేసింది. ప్రస్తుతం విరసం సభ్యురాలు. 'మాభూమి' సినిమాలో 'పల్లెటూరి పిల్లగాడా' పాటతో ఆమె పేరు 'మాభూమి సంధ్య'గా మారింది. నిజామాబాద్ జిల్లాలో హాస్టల్ సంక్షేమాధికారిగా పని చేసి రిటైర్ అయింది.

4 thoughts on “ఆత్మ‌గ‌ల్ల మ‌నీషి చెర‌బండ‌రాజు

  1. Sandhyakka mallokkasaarini cherabandarajunu guru chesukovadam kotta spoortini nimputundi.manchiga raasinav.

  2. చెరబండరాజు గారి గురించి పుస్తకాల్లో చదవడమే గానీ నువ్వు రాసిన “ఆత్మ గల మనీషి ” ద్వారా మాకు తెలియని విషయాలు తెలిశాయి. చక్కగా నీ భావాలు రాశావు. చాలా బాగుంది సంధ్యా

Leave a Reply