కొడుకునో, బిడ్డనో ఎందరో కంటారు
పేగు కోసుకొని కొందరు తల్లులు
త్యాగాలను కంటారు.
ఆమె తన గర్భాన్ని …
ఒక ఎముకల గూడుకు గూడు చేసింది.
ఒక అమరత్వానికి ఆయువు పోసింది.
ఉగ్గు పాలలో ఉద్యమ చైతన్యాన్ని
తాపించిన తల్లి కాకపోవచ్చు
పోరు మడిలో కాలం నాట్లేసిన పైరు
పంటై పది మందికి దక్కితే
అందరి ఆకలి తీర్చిన అమ్మ తానే అయినట్లు
ఆమె ఆనందించింది.
సూర్య చంద్రుల్ని మనకిచ్చి
ఆమె చీకటి ఆకాశమయింది.
పేగు కాల్చుకొని ఒకసారి
తల్లి కొంగును ఖాళీ చేసుకొని కడసారి
ఎండిన నారు మడై
ఎక్కెక్కి ఏడ్చింది.
కనురెప్ప వాల్చే లోపు
కంటి పాపను కనాలనుకున్న
కడపటి కోర్కెను
కాడులో తనతో పాటు కాల్చుకుంది.
భగత్ సింగైనా….
ఆ బాట నడిచిన వేల పాదాలెవరివైనా
ఎన్ని గర్భ గుడులో దగ్ధమై
ధరిత్ర ధగ ధగ వెలిగిపోతుంది.
తల్లిని దైవంగా కొలిచే పుణ్య భూమిలో
అమ్మ ఆఖరి కోరిక
చితి మంటల్లో చితా భస్మమయ్యింది.