ఆక్సిజన్ దొరకని ఆత్మ నిర్బర భారతం

దేశాన్ని కరోనా రెండవ కెరటం ముంచెత్తుతుంది. ఆసుపత్రులను కరోనా రోగులు ముంచెత్తుతుంటే స్మశాన వాటికల ముందు పొడవాటి బారులు కనిపిస్తున్నాయి. కరోనా లక్షణాలు తీవ్రమైన వెంటనే ఆసుపత్రుల కోసం జనం హాహాకారాలు పెడుతూ పరుగెడుతున్నారు. ఏ పైరవీతోనో, పెద్ద మొత్తం చెల్లించడానికి సిద్ధపడితేనో ఏదో ఓ ఆసుపత్రి దొరికినా మళ్లీ బెడ్స్ కోసం కాళ్ళా వేళ్ళా పడి మరీ చేరిపోతున్నారు. మొదటి వేవ్ లో కరోనా రోగులను దరిచేరనివ్వని కార్పొరేట్ ఆసుపత్రులు ఈ దఫా మంచి తరుణం మించినా దొరకదు అన్నట్టు కోవిడ్ రోగం చికిత్సలో అవగాహన, అనుభవం లేకున్నా కోట్లు పోగేసే రోగం కాబట్టి కుప్పలు తెప్పలుగా చేర్చుకున్నారు. బతికుంటే బలుసాకైనా తినొచ్చు అన్నట్టు ఉన్నది అమ్ముకొనైనా ప్రాణాలు నిలుపుకోవాలని ప్రజలు దేనికైనా సిద్ధపడుతున్నారు. ప్రజల ప్రాణ భయం ప్రైవేటు ఆసుపత్రులకు సిరులు కురిపిస్తున్నది. నిజానికి ఇంట్లోనే ఉండి చికిత్సకు అవకాశం ఉన్నా చాలా కేసుల విషయంలో అనేక మంది డాక్టర్ల తప్పుడు సూచనతో ఆసుపత్రుల పాలవుతున్నారు జనాలు. పరిస్థితి చేయిదాటిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. వ్యాధి ముదిరిన దశలో ఎక్కడ చేరినా ప్రయోజనం లేకుండా ఉంటుంది. అలా అని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంతా బాగుంది అనుకుంటే పెద్ద పొరబాటే! ఇంతలో మళ్లీ లాక్ డౌన్ లు, కట్టడి చేయడాలు మొదలవడంతో జనజీవనం స్తంభించిపోయింది. రోగంతో ప్రాణాలు పోవడం ఒకటైతే జీవనోపాధి పోయి జీవి పోతున్నది. మొదటి వేవ్ తో పోలిస్తే రెండవ దఫా ప్రాణ నష్టం పెద్ద ఎత్తున ఉన్నది.

పరిశోధకులు, శాస్త్రజ్ఞులు ఏ వేరియెంట్, వైరస్ ఏ తరహా రూపం మార్చుకున్నది అనే తర్జన భర్జన లో తలమునకలై ఉన్నారు. రెమిడిసివిర్ ముందు వేవ్ లో గొప్పగా పని చేసింది అన్నారు ఇప్పుడు ప్రయోజనం లేదని వద్దంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో అతి భయానకంగా విరుచుకుపడుతుంటే మరికొన్ని రాష్ట్రాల్లో కాస్త తీవ్రత తక్కువగా కనిపిస్తుంది. ఆ వయసు, ఈ వయసు, అప్పటికే ఉన్న ఇంకేవో రోగాల వల్ల చనిపోవడం అనేకాకుండా అందరూ ఎండిన ఆకుల్లా రాలుతున్నారు. మరణాల తీవ్రత ఎంత ఉన్నదంటే స్మశానాల్లో స్థలం దొరకడం లేదు కాల్చేందుకు కట్టె కూడా లభించడం లేదు.

‘బ్లాక్’ లో మందులు కొన్నట్టే మరణించిన వారి అంత్యక్రియలు బ్లాక్ లో చేయాల్సిన దుస్థితి. అంతర్జాతీయ పత్రికల్లో భారత దేశపు కరోనా మృతుల చితిమంటలు పతాక శీర్షికలవుతున్నాయి. దేశమంతా వల్లకాడు దృశ్యాలే. ఆప్తుల్ని పోగొట్టుకున్న వారి ఆర్తనాదాలే. ఇంతటి విషాదాలకు, మృత్యుఘోషకు పాలకుల నేరపూరిత నిర్లక్ష్యం తప్ప మరో కారణం కనిపించటం లేదు. ఈ దేశంలో ఉన్న వైద్య సదూపాయాలు అరకొరనే అనే అనుభవం ఈ దేశ కోటానుకోట్ల ప్రజల అనుభవాల్లో ఉన్నదే. కానీ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా, మన దేశాన్ని ముంచెత్తినా ఈ దేశ పాలకులు పిడేలు వాయిస్తూనే ఉన్నారు. మొదటి విడత, నెలల్లో నమోదైన మొత్తం కేసులు, మరణాలు ఈ సారి వారాల్లోనే నమోదవుతూ కళ్ళ ముందు మృత్యుకేళి కనిపిస్తున్నా ఓట్లు, సీట్లు అధికార వ్యామోహo, ఆధిపత్య వాంఛలు తప్ప దిక్కూమొక్క లేని జనుల దీనగాధలు వినేవారెవ్వరు? కన్నీటి కాల్వల మీద దృష్టి సారించే వారెవరు? దేశమంతా మా గుప్పిట్లోనే ఉండాలి, రాష్ట్రాలన్ని మా ఖాతాలోకే రావాలి, జనం ఏ రోగంతో ఏమయిపోతేనేం అనే దుర్మార్గ వైఖరి మూలంగానే ఇవ్వాళ ఇన్ని దుఃఖ సముద్రాలీదేశంలో. అధికారికంగా మాస్కులు పెట్టుకోండి, బయటికి రాకండి అని ఫర్మానాలు జనాలకు ఇస్తూనే తాము మాత్రం ఏ మాస్కులు లేకుండా లక్షలాది మందిని పోగు చేసి అయ్యో నా జీవితంలో ఇంత మందిని చూడలేదే ఆహా ఎటు చూసినా జనమే, చూపు సారినంత మేరా జనమే అని ఉబ్బి తబ్బిబ్బయిన ప్రధాని ప్రవర్తన ఏ కోవకు చెందుతుందో…?

గత సంవత్సరం ఢిల్లీ తబ్లీగీ మీటింగ్ వల్లనే దేశమంతా కరోనా ప్రాకిపోయిందని, దేశంలో కరోనా జిహాద్ నడుస్తుందని తెగ ప్రచారం చేసిన సంఘ్ భక్త పరివారం హరిద్వార్ కుంభమేళాకు మార్చ్, ఏప్రిల్ నెలలో వచ్చిన 90 లక్షల మంది వల్లనే ఉత్తర భారతదేశంలో కరోనా చావు కేకలను వేయిస్తున్నదని ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఆ రోజు తబ్లీగీ నిర్వాహకుల పైన, అధికారికంగానే ఆ సమ్మేళనానికి వచ్చిన విదేశీయుల పైన అనేక కేసులు పెట్టి వేధించిన వాళ్ళు ఈ కుంభమేళాకు అనుమతి ఇచ్చి దేశాన్ని మృత్యుముఖంలోకి నెట్టేసిన దుర్మార్గాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు. శవాలను దహనం చేసే ఆర్థిక స్థితి లేని దయనీయ పరిస్థితుల్లో వాటిని గంగా నదిలో పడెయ్యడానికి ఉత్తరప్రదేశ్ లో ఎవరు కారకులు? మీరు పవిత్రంగా భావించే, మీరే శుధ్ది చేస్తున్న గంగా నది ఇవ్వాళ ప్రవహిస్తున్న చితిలా మారడానికి ఏ ఉన్మాదం కారణమో? దేశమంతా గుజరాత్ అభివృద్ధి నమూనా అని చంకలు గుద్దుకుంటున్న మీ గుజరాత్ లోనే శవాల లెక్కలు చెప్పకుండా, అంతా బాగుంది అని అబద్దాలు చెబుతున్నదెవరు? మన్ కీ బాత్ తప్ప జన్ కీ బాత్ ను, జనం గుండె చప్పుళ్లను ఏనాడు వినని ప్రధాని ధర్మ సూక్తులు వల్లించడాన్నేమనాలి?

ఇవన్నీ ఒక ఎత్తైతే గత సంవత్సర కాలంగా కరోనా కల్లోలం నుంచి ఏమి నేర్చుకోని, ఏ ముందస్తు ప్రణాళిక తో సిద్ధంగా లేని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే అసంఖ్యాక మరణాలకు, ఆగని దుఃఖాలకు జవాబుదారి. మొదటి వేవ్ కంటే ఈ రెండవ వేవ్ లోనే అపారమైన ప్రాణ నష్టం జరగడానికి ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు లేకపోవడమే. ఏ టీవీ ఛానల్లో చూసినా ఆక్సిజన్ కోసం జనం ఆర్తనాదాలే కనిపించాయి, వినిపించాయి. ఏ ఆసుపత్రికైనా అయినా అత్యంత మౌళిక అవసరమైన ఆక్సీజన్ నిల్వలను చాలినంత పరిమాణంలో పెట్టుకోవడం యధాలాపంగా చేయాల్సినది. ఏప్రిల్ వరకు కేంద్రం ఆక్సీజన్ ఎగుమతులను ప్రోత్సహించింది. దేశ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసినట్టే ఆక్సీజన్ నిల్వలను కూడా విదేశాలకు పంపించి దేశ ప్రజలు ప్రాణవాయువు మహాప్రభో అంటూ ఉంటే, నల్ల బజారుల్లో వేలాది రూపాయలకు కొంటూ ఆర్తనాదాలు చేస్తే గాని మొద్దు నిద్రనుండి లేచి రాలేదు మోడీ గారు. అప్పటి వరకు భక్తులంతా ధూప దీపాలు వెలిగిస్తూ గల్లి గలినా పొగలు వదులుతున్నారు. గాలి ఎందుకండి గో మూత్రం కడుపు నిండా తాగండి, గోవు పేడను ఒంటి నిండా రుద్దుకోండి కరోనా ఖతం అవుతుందని గో కరోనా బ్యాచ్ ఘోషిస్తూ వస్తున్నది కదా…గో మూత్రమున్నాక మళ్లీ గీ ప్రాణ వాయువు ఏంటో అనుకున్నారేమో ఆ జ్ఞానవంతులు..?

దేశంలో ఏ నగరం, పట్టణం ప్రాంతం అని కాకుండా ప్రతి చోటా ఆక్సీజన్ కోసం అల్లాడుతూనే ప్రాణాలొదిలారు ఆమాయక ప్రజలు. అసలు అనేక ఆసుపత్రులు కేవలం ఆక్సిజన్ లేదన్న ఒకే ఒక్క కారణoతోనే రోగులను చేర్చుకోలేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నాలుగు ఐదు వేలుండే సిలండర్లు 30 నుండి 40 వేల రూపాయలు పెట్టి కొనాల్సిన స్థితి దేశమంతటా నెలకొన్నది. ఆసుపత్రుల కోసం, బెడ్స్ కోసం వెతకడం ఒక భయానక అనుభవం అయితే అంతకంటే భయానకంగా ఆక్సీజన్ సిలిండర్ల కోసం వెదుకులాట. నిజానికి ప్రతి ఆసుపత్రికి కనీస అవసరమైన ఆక్సీజన్ ఉత్పత్తి, నిల్వల అవసరాలను ఫిబ్రవరి నెలలోనే నిపుణులు నొక్కి చెప్పినా అసలు కరోనా పైన వేసిన టాస్క్ ఫోర్స్ ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. అదే ఫిబ్రవరి నెలలో బిజెపి కేంద్ర కార్యవర్గం కరోనాను సమర్థవంతంగా కట్టడి చేసినందుకు ఒకే ఒక్కరిని అభినందిస్తూ తీర్మానం చేసింది. ఆ ఒక్కరు ఎవరో తెలియడానికి పెద్దగా కష్టపడాల్సింది లేదు! దేశంలో కోవిడ్ కష్ట కాలానికి 9 వేల మెట్రిక్ టన్నుల ఆక్సీజన్ అవసరమైతే మే నెలలో ఉన్న ఉత్పత్తి సామర్ధ్యం కేవలం 7 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే. విచిత్రమైన విషయం ఏమిటంటే పారిశ్రామిక, ఆరోగ్య రంగానికి అవసరమైన ఆక్సీజన్ తయారీ మొత్తం దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతంలో జరుగుతున్నది. దాని అవసరం మొత్తం దక్షిణ, ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకు ఎక్కువగా ఉన్నది. దాని ఉత్పత్తినే తక్కువ ఉన్నదనుకుంటే అది అవసరమైన చోటకు చేరవేయడం, నిల్వ చేయడం అసలైన పని కానీ మనవాళ్ళు గత సంవత్సర కాలంగా అనుభవం ఉన్నప్పటికీ ఏ ప్రత్యమ్నాయ చర్యలు తీసుకునే తీరిక లేకుండా ఓట్ల, సీట్ల వేటలో నిమగ్నమయ్యారు. ఆత్మనిర్బర ఏమో గాని ఇవ్వాళ ఏ దేశమింత ప్రాణ వాయువును దానం చేస్తదా అని దీనంగా చూడాల్సిన స్థితి. మన దగ్గర ఉత్పత్తి చాలినంత లేదు చేసినా అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిలువ చేసుకునేoదుకు అవసరమైన క్రయోజినిక్ ట్యాoకర్లు లేవు. వ్యాక్సిన్లను ఎగుమతి చేసి శభాష్ అనిపించుకున్న మోడీ ప్రాణవాయువు కోసం దేబురించాల్సిన దయనీయ స్థితి.

అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు పంపించిన ఆక్సీజన్ సిలిండర్లు, జెనరేటర్లను వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేయడంలో కూడా ఉన్నతాధికార అలసత్వం, నిర్లక్ష్యం మూలంగా కూడా రాష్ట్రాల మధ్య తీవ్ర బిభేదాలు పొడసూపాయి. మరోవైపు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో బిజెపి నాయకులు వచ్చిన ఆక్సీజన్ ట్యాంక్ లను ఆసుపత్రులకు చేర్చకుండా కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేసి ఫోటోలు దిగి తీరుబడిగా పంపడంతో రోగులు ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరోచోట నాయకులు తమ వాళ్ళ కోసం ఆక్సీజన్ ట్యాంక్ లను దాచుకున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాధ్ సామాజిక మాధ్యమాలల్లో ఆక్సీజన్ లేదని ఫిర్యాదు చేసిన పాపానికి జాతీయ భద్రతా చట్టం కింద ఎన్ ఐ ఏ తో కేసు పెట్టించాడు. త్రిపుర లో గో మూత్రం, గోవు పెండ కరోనాకు మందు కాజాలవని అన్నందుకు జర్నలిస్టు ల పై అదే చట్టం కింద కేసు పెట్టారు. ఆసుపత్రిలో చేరిన రోగుల్లో దాదాపు 54.5% పైగా రోగులకు రక్తంలో ఆక్సీజన్ శాతం పడిపోవడంతో హైపోక్సేమియా కి గురయినపుడు ఆక్సీజన్ థెరపీ అనివార్యం అవుతుంది ఇంతటి అత్యవసర ఆక్సీజన్ నిల్వలను అందించకుండా అలసత్వం ప్రదర్శించిన ప్రధాని జన్ కీ బాత్ ని వినకపోతే పీఠం కదిలిపోయేది ఖాయం.

పుట్టింది పూర్వపు నల్లగొండ(సూర్యాపేట) జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామం. అధ్యాపకుడు, సామాజిక కార్యకర్త. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కాలేజీలో ఆంగ్ల విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. విద్యార్థి ఉద్యమాల నుండి తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేపథ్యం. వివిధ పత్రికల్లో సామాజిక, రాజకీయ, అంతర్జాతీయ అంశాల పై వ్యాసాలు రాస్తున్నారు. "తెలంగాణా సమగ్ర చరిత్ర" సహ రచయిత. "వీక్షణం" మాస పత్రిక ఎడిటోరియల్ కలెక్టివ్ సభ్యుడు.

Leave a Reply