ఆకుపచ్చని కావ్యం

తరచుగా
సప్తవర్ణ ఆలోచనలతో చిక్కుబడి
కలతల్లో మునిగిపోతాను

సువర్ణ స్వప్నాలకు
ప్రేమ రెక్కలు అతికించి
ఆకాశవీధుల్లోకి ఎగురవేస్తాను

వెన్నెల జలపాతం పక్కనే
మేఘానికి ఊయలకట్టి
భూభ్రమణాన్ని లెక్కిస్తుంటాను

విహంగాల దౌత్యంతో
బహూకరించిన కావ్యానికి నర్తించాలని
మయూరానికో అర్జీ పెడతాను

మోడు వారిన జీవితాలకు
ఆకుపచ్చని సంతకాలీయమని
ప్రకృతితో కరచాలనం చేస్తాను

బీడు వారిన నేలల్లో
నదీ స్మృతుల ఆనవాళ్ళకు
వరుణుడిని పలకరిస్తాను

ఎందుకంటే
రాతి హృదయాల్లో నీటి ఊటలు
వినగలిగే నేనో జీవన వాక్యం

ఎప్పటికో
ఆవహించిన నిశ్శబ్దానికి
భంగం కలుగుతుంది

ఆలాపనల
కలగాపులగపు స్వరఝరులు
చెవిని సోకుతుంటాయి

మెదడు మేల్కొంటుంది
వెలుతురు పువ్వు
కంటి పాపను స్పృశిస్తుంది

ఇంతలో…
కోరికలన్నీ అదృశ్యమౌతాయి
ఆవలింతల పరదాలు తప్పించి
రోజు తలుపులు తెరిచేస్తాను

నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతానికి చెందినవారు. నివాసం హైదరాబాద్. జర్నలిజంలో పి.జి. చేశారు. వివిధ ప్రముఖ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం 'తెలంగాణ పవర్' అనే దినపత్రికకు, 'సమీక్ష' అనే మాసపత్రికకు ఎడిటర్ గా పని చేస్తున్నారు. 'ౙఖ్మీ' కవితా సంపుటి ప్రచురించారు. ముస్లిం జీవితాల్లోని ‌సంఘర్షణలను ఆవిష్కరించేలా కథలు రాస్తున్నారు.

One thought on “ఆకుపచ్చని కావ్యం

Leave a Reply