ఆకాశం, అతను

తల పైకెత్తి చూస్తే
నేనున్నాననే భరోసాతో
ఆకాశం కనిపిస్తుంది

ఎన్ని ఏళ్లనాటి ఎంత పురాతన ఆకాశం

ఆకాశం కింద నిల్చొని
ఆకాశాన్ని నమస్కరిస్తున్నాను

***

కొందరు ఆకాశానికి ప్రతిరూపాలు

వాళ్ల ముందు
నిల్చున్నా, కళ్లు విప్పార్చి
ఆరాధనగా చూసినా
పనిలో అలసి
కాసింత సమయం
పక్కకి చేరగిల్లినా
మేఘాల హృదయమున్నవాళ్లు
అంతే అంతే
చిన్న చిర్నవ్వుతో
ఆకాశంలోని వెలుగునంతటిని
ప్రసరిస్తారు

వాళ్ల‌నెలా మరువను

***

అతన్నే తలచుకుంటున్నాను

***

అతనూ
తడి ఆరని మనిషే
నెర్రెలు చీలిన
నేలగొంతును
ఆర్తితో తడిపి
మెత్తని తూగుటుయ్యాల
నేలగర్భంలోంచి
రెండు ఆకుల చేతులను
బయటకు పెట్టి
మొలిచే మొలకల తలలను
ప్రేమతో నిమిరే
దయాళువు

దయాళువు
చేతులను ప్రేమిస్తున్నాను

***

తల పైకెత్తి
ఆకాశం ముందు మోకరిల్లి
ఆకాశం వైపే చూస్తున్నాను

ఆకాశం వంగి
నా భుజంపై తన చేయినుంచింది

పోరాం, విజయనగరం జిల్లా. ఉపాధ్యాయుడు. బడన్నా పిల్లలన్నా కవిత్వమన్నా ఇష్టం. బతుకును బతుకులా ప్రేమించటమంటే ఇంకా ఇష్టం. 'ఎగ‌రాల్సిన స‌మ‌యం'(2014), 'ఆకు క‌ద‌ల‌ని చోట'(2016) క‌వితా సంక‌ల‌నాలు ప్ర‌చురించారు.

3 thoughts on “ఆకాశం, అతను

  1. బాగుంది, మౌళీ.
    నిజమే. కొందరు ఆకాశానికి పర్యాయపదాలు. ఆ ధైర్యంతో వంద యుద్ధాలు చేసే స్థైర్యం వస్తుంది.

  2. మరో సంకలనం … నీళ్ళలోని చేప – 2018

Leave a Reply