ఆది ఆంధ్ర ఉద్యమం సంవాదాలు – సాహిత్యం

1906లో ఆంధ్ర దేశంలో ఆది ఆంధ్ర ఉద్యమాన్ని భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించేనాటికి పంచముల ఉద్ధరణకు సంబంధించిన సామాజిక భావ సంఘర్షణ రాజకీయ పదునును సంతరించుకొనటం మొదలైంది. అందులో భాగంగా జరిగిన సంవాదాలు, వచ్చిన సృజన సాహిత్యం కలిపి అధ్యయనం చేయవలసినవి.


1910 నాటికి ఆంధ్రదేశంలోనే కాక భారతదేశమంతటా వర్ణభేదాలను వ్యవస్థీకరించి, ప్రజలను నియంత్రిస్తూ, నిలువునా చీలుస్తూ వచ్చిన సనాతన ధర్మ శాస్త్రాలను, సంప్రదాయాలను ప్రశ్నించే ఆధునిక దృష్టి ప్రబలింది. వర్ణ సమానతను ప్రభోదించే ఆచరణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే 1910లో బరంపురంలో వర్ణాంతర సహపంక్తి భోజనాలు జరిగాయి. ఆ కార్యక్రమంలో ఉప్పల లక్ష్మణరావు గారి మాతామహులైన దిగుమర్తి వారి కుటుంసభ్యులు, ఆయన పినతల్లి పెనిమిటి అయిన సూర్యనారాయణ మూర్తి మొదలైన వాళ్ళు పాల్గొన్నారు. అప్పటికి ఇరవై ఏళ్లుగా విజయనగర సంస్థాన ఉద్యోగిగా ఉంటూ కన్యాశుల్కం నాటకం రాసి ప్రసిద్ధుడైన గురజాడ అప్పారావు ఆ వర్ణాంతర సహపంక్తి భోజన కార్యక్రమానికి హాజరయ్యారో లేదో తెలియదు. కానీ తక్షణ అనుకూల ప్రతిస్పందనగా ‘ముత్యాల సరాలు’ గేయకవిత రాసి(1910 జులై, ఆంధ్రభారతి) చరిత్రలో చిరస్థాయిగా నిలిపాడు.(డాక్టర్ ఉప్పల లక్ష్మణరావు, బతుకు పుస్తకం, 1983 & 2016 )

‘కార్యశమున పోయి’ పట్టమున పదినాళులు’ వుండి ‘అచ్చట/ సంఘసంస్కరణ ప్రవీణుల /సంగతుల మెలగి’ ఇల్లుజేరిన నాటి వేకువన ఒక భర్తకు భార్యకు మధ్య జరిగిన సంవాదం రూపంలో ఉంటుంది కవిత. ఇందులో రెండు విషయాలు వున్నాయి. ఒకటి ఆ సంవత్సరం వచ్చిన హేలీ తోకచుక్కను నెపంగా తీసుకొని తోకచుక్క కనపడటం వినాశ సూచన అన్న సంప్రదాయ విశ్వాసాన్ని తోసిరాజనటం. రెండవది వర్ణభేదాలను అభావం చేసే ప్రయత్నాలు సహపంక్తి భోజనాల రూపంలో ప్రారంభమైన సమాజ చైతన్యాన్ని సానుకూలదృష్టితో వ్యాఖ్యానించటం. రెండవది ప్రధానం. సంఘ సంస్కరణ ప్రవీణులతో మెలగి వచ్చి ఆ ఉత్సాహాన్ని భార్యతో పంచుకొనటానికి తహతహ లాడుతున్న భర్త కవిత ప్రారంభంలోనే కనబడతాడు. ‘వెఱ్ఱి పురాణగాధల్ నమ్మజెల్లునె’ అని ప్రశ్నించి “తెగులు కిరవని కతల పన్నుచు /దిగులు జెందు టదేటికార్యము?/ తలతు నేనిది సంఘసంస్కర / ణప్రయాణ పతాకగాన్” అని ఒక కొత్తభావన చేసాడు. అది ప్రాతిపదికగా “ యెల్ల లోకము వొక్కయిల్లై/ వర్ణభేదము లెల్లకల్లై / వేలనెరుగని ప్రేమబంధము /వేడుకలు కురియు” రోజు గురించి కలగన్నాడు కవి. “ మొన్న పట్టమునందు ప్రాజ్ఞులు /మొట్టమొదటిది మొట్టు యిదియని/ పెట్టినారొక విందు జాతుల/ జేర్చి ; వినవైతో ?” అని భార్యకు సహపంక్తి భోజనాల సంబరం గురించి చెప్పబోయాడు. భర్త అందులో పాల్గొనటం గురించి ఇంటా బయటా అప్పటికే ప్రారంభమైన రభస గురించి ఆందోళన పడుతున్న భార్య పలికిన నిష్ఠుర వాక్యాలకు పరాకాష్ఠ “ కలసి మెసగిన యంత మాత్రనె /కలుగబోదీ యైకమత్యము;/ మాలమాదిగ కన్నె నెవతెనో / మరులు కొనరాదొ” అన్న పంక్తులే. ఆ లోకసహజ నిష్ఠుర స్వరం వర్ణాంతర వివాహాలే వర్ణఅసమానతల పరిష్కారమని సూచిస్తున్నదేమో !? ( డాక్టర్ పిల్లి శాంసన్ ,దళిత సాహిత్య చరిత్ర,2000 ) గురజాడ లవణరాజు కల (1910 డిసెంబర్, ఆంధ్రభారతి) అనే కథాకావ్యంలో ‘మలినదేహుల మాలలనుచును / మలినచిత్తుల కధికకులముల /నెలవొసంగిన వర్ణధర్మం ..’ అధర్మధర్మమే నని నిర్ధారణగా చెప్పాడు. మలిన వృత్తులు మానుకొంటూ వ్యవసాయ పశుపోషణ వృత్తులకు మాలలను ప్రోత్సహిస్తున్న గురువుల ప్రస్తావన, ఎంత శుభ్రం ,ఎంత భూతదయ, ఎంత గౌరవ కర వృత్తి జీవితాన్ని ఏర్పరచుకొన్నాకులాన్ని హీనంచేసి మాట్లాడే అవమానకరమైన సందర్భాలను ఎదుర్కొంటూ ‘ఓరిమి యేటికైనను మందు’ అన్న సంస్కారంతో కలుగు భావి సౌఖ్యాలకోసం ఎదురు చూస్తున్న మాలల ప్రస్తావన గురజాడ కాలానికి పరిణమిస్తున్న పంచముల చైతన్య స్థాయిని ప్రతిఫలిస్తాయి. ఆ చైతన్య వికాసం కంటగింపై ఒక వర్గం మొత్తంగా పంచమోద్ధరణ ఉద్యమం పైనా , దాని పక్షాన నిలబడ్డ ప్రతిఒక్కరి మీదా ఎలా విరుచుకు పడిందో తెలిస్తే ఆ కర్కశత్వానికి ఆందోళన కలుగక మానదు.

1911 లోవచ్చిన ‘వర్ణావశ్యకత’ అనే పుస్తకంఅందుకు నిదర్శనం. The necessity of caste అనే ఆంగ్ల శీర్షిక కూడా వుంది. కాకినాడ వాస్తవ్యులైన గో. స. హరిశ్చంద్రరావు దీని రచయిత. “.. హిందూ దేశమునకు ప్రాచీనములై ముఖ్యావశ్యకములైన వర్ణాశ్రమములను గూర్చి హిందువులలో ననేకులు దురభిప్రాయులై యుండుట జూచి – హిందువులెల్లరకు నుపయోగించుటకై యనేక సద్గ్రంధముల ననుసరించి రచింపబడినది.” అని చిన్న పరిచయం వుంది. ప్రశ్న – జవాబు – సందేహం- సమాధానం అనే పద్ధతిలో వర్ణ విభాగం గురించి ఉనికిలో ఉన్న సిద్దాంతాలను పూర్వపక్షం చేస్తూ తన వాదాన్ని వినిపించాడాయన. గుణాన్ని బట్టి కులం, వృత్తిని బట్టి కులం అనే వాదనలను కొట్టి పారేసాడు. జాతిభేద పద్ధతి సాంఘిక పద్ధతి, మత సంబంధమైనది కాదు అనే వాదాన్ని తిరస్కరించాడు. చాతుర్వర్ణ వ్యవస్థ గురించి చెప్పిన చోట దానికి కొన సాగింపుగా ‘నాస్తి పంచమః’ అని పేర్కొనబడిన స్మృతి వాక్యాన్ని ప్రస్తావిస్తూ పంచములనే వాళ్ళు ప్రాచీన కాలంలో లేరు అది కూట సృష్టి అన్న సంస్కర్తల వాదాన్ని ఖండించాడు. “మూత్రామేధ్యాది నిలయంబులైన గోతులు పట్టణ నికటంబున నున్నప్పటికి నుపేక్షణీయములైన తెరంగున -బ్రాహ్మణాది జాతివ్యతిరిక్త జాతులున్నను లేనట్లే” అని పంచములను నీచము, హీనమూ చేసి మాట్లాడే అగ్రకుల అహంకారవర్గానికి ప్రతినిధిగా దానిని వ్యాఖ్యానించాడు. జాతిభేదాలు సహజమని, వర్ణ వ్యవస్థ ధర్మ వ్యవస్థ అని అంత పూనికతో నిర్ధారించి చెప్పిన ఈ పుస్తకాన్ని ఆత్మగౌరవ చేతనతో ఒక జాతిగా హిందూ వర్ణవ్యవస్థతో తలపడటానికి సిద్ధమవుతున్న పంచములను ఎదుర్కొనే హిందూత్వ రాజకీయాలలో భాగంగానే చూడాలి.

అదే 1911 ఏప్రిల్ ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచికలో వచ్చిన ‘నిమ్నజాత్యుద్ధరణ సాధనము’ అనే వ్యాసం అందుకు పూర్తిగా వ్యతిరేకమైనది. ఈ వ్యాస రచయిత దుగ్గిరాల సూర్య ప్రకాశరావు పంచమోద్ధరణకు శక్తిని, ప్రజ్ఞను ఉపయోగిస్తున్న బ్రహ్మసమాజ దివ్యజ్ఞాన సమాజ నాయకులను ప్రస్తావిస్తూ పంచములకు ‘సాంఘిక రాజకీయ విషయాలలో సమాన స్వాతంత్రములను ఒసంగుటకు మనము సంసిద్ధులము కావలెను’ అని పిలుపు ఇయ్యటం గమనించవచ్చు. పంచముల ఆత్మగౌరవ ఉద్యమానికి బయటినుండి మద్దతుగా నిలబడటం ఇది. తదభిముఖంగా ప్రజా చైతన్యాన్ని కూడగట్టడంలో భాగంగానే ‘తామునూ మానవులే యనియు నితరులకు గల సర్వ స్వాతంత్ర్యములన నుభవించుటకు తమకు అర్హత గలదనియు గ్రహించునంతటి జ్ఞానమును మనము వారియందంకురింప జేసితిమేని మనము చరితార్థులమై వారిని ధన్యులను చేయగలుగుదుము.’ అని చెప్పగలిగాడు. పంచముల పట్ల విముఖతకు ఆహరం, అపరిశుభ్రత, త్రాగుబోతుతనం కారణమన్న ఆనాటి ఒకానొక సామాజిక అభిప్రాయానికి ప్రతినిధ్యం వహించటం దుగ్గిరాల సూర్యప్రకాశరావు పరిమితే అయినప్పటికీ నిమ్నజాతి ఉద్ధరణకు విద్య ఒక్కటే తరుణోపాయం అనిచెప్పటం, వారి సాంఘిక అభివృద్ధిని గురించే కాక ఆర్ధిక అభివృద్ధిని గురించి కూడా ఆలోచించటం ఆయన ముందు చూపుకు నిదర్శనం.

ఈ వ్యాసంలో ఆయన పేర్కొన్న ఒక ఉదంతం చాలా ఆసక్తికరమైనది. కడచిన డిసెంబరు లో (అంటే 1910 డిసెంబర్ ) కాకినాడలో భగవద్గీతా ఉపన్యాసం జరుగుతుంటే వైదికొత్తముల మధ్య ఊర్ధ్వపుండ్రములను, పరిశుభ్ర వస్త్రములను ధరించిన కొందరిని కూర్చోబెట్టామని వారందరూ రేచుపేట పంచములు పంచమ బాలల పాఠశాల ఉపాధ్యాయులు అని సభ ముగిసేవరకు వాళ్ళ గురించి అక్కడవారికెవ్వరికీ ఏ సందేహమూ కలగలేదని చెప్పారు. అంటరానితనాన్ని నిరాకరించే వ్యూహాలు ఎలా నిర్మించబడుతూ వచ్చాయో సూచించే చారిత్రిక ఆధారం ఇది. అట్లాగే వేషభాషా సంస్కరాలలో సమత్వం సమకూడేకొద్దీ కులం అనేది చెప్తేగానీ తెలియని విషయం అయిపోతుందని, కంటికి కనబడే శరీరాన్ని అంటిపెట్టుకొన్న అవయవం లాంటిది కానీ కులం మనుషులమధ్య భేదభావ కారణం అనటం కన్నా అసంబద్ధ వ్యవహారం మరొకటి లేదని సూచించినట్లు అయింది.

ఆ విధంగానే నిమ్నజాతి సముద్ధరణకు మద్దతుగా కలం పట్టి కవిత్వం రాసాడు మంగిపూడి వేంకట శర్మ. 1912 ఏప్రిల్ నెలలో వచ్చిన ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక లో ‘నిమ్నజాతి సముద్ధరణము’ అనే శీర్షిక కింద 22 పద్యాలు ఆయనవి ఉన్నాయి. మనుధర్మ శాస్త్రాన్ని, శ్రీకృష్ణుడి గీతాబోధను ఆధారంగా చూపిస్తూ పంచమ కులమనేదే లేదు అని నిర్ధారించాడు. ఒక సీస పద్యంలో నిమ్నజాతి సముద్ధరణకు పూనుకొన్న ఆర్యసామాజికులు, బ్రహ్మసామాజికులు,దివ్యజ్ఞాన సామాజికులు, రామకృష్ణ వివేకానందులు, బరోడా మహారాజు , పిఠాపురం జమిందార్ మొదలైన వాళ్ళ గురించి చెప్పాడు. పంచమ పరివేదనం అనే ఉప శీర్షికతో రాసిన పద్యాలు పంచములే ఉత్తమపురుషలో తమ వేదనను వినిపిస్తున్నట్లుగా ఉంటాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూ ద్రులను సంబోధిస్తూ “ దీనజనులము మేము మీ దేశ జనుల / మాదివారము మీకు మీ సోదరులము/ …. ……… / జ్ఞానధనమిచ్చి మము బ్రోవ బూనరయ్య ” అని వేడుకొనటం కనిపిస్తుంది. మరొక పద్యంలో “ మేము మీ సోదరులమన్నమేలి మాట / చిత్తమున దోచలేదె దేశీయులారా” అని నిలదీయటం ఉంది. “ కుక్కలకంటె దక్కువ వారమైతిమా
మమ్ము మీ వాడలన్ మసలనీరు
కాకులకంటె జుల్కదనంబె యైతిమా
మమ్ము మీ దవ్వులన్ మసలనీరు
మార్జాలములకంటె మరి హీనమైతిమా
మమ్ము మీ యిండ్లలో మసలనీరు
అరయ దున్నలకంటె నధముల మైతిమా
మమ్ము మీ వాకిండ్ల మసలనీరు
లేళ్ళకంటెను గోళ్ళ పొట్టేళ్లకంటె
మీకు గొర గాకపోతిమా తాకనీరు
సుగుణమణులార న్యాయంబు జూడరయ్య
మేము మీ సోదరులము మమ్మోరయ్య !”
అని సాటి మనుషులను పశుపక్ష్యాదులకంటే కూడా పరాయిగా చూసే కుల సంస్కృతిని పంచముల కోణం నుండి విమర్శకు పెట్టిన మంగిపూడి పక్షపాతములేని సృష్టి ధర్మం తెలిసి మసలుకోవలసిందిగా శిష్టులకు విజ్ఞప్తి చేశారు మరొక పద్యంలో.
“మోయకున్నదె మిమ్ము మోయునట్టులు మమ్ము
భూమ క్షమకు దీవి భూదేవి
మీకు వెన్నెలగాచి మాకు గాయుటలేదె
చలువలపరసీమ చందమామ
మీ మీదనేగాని మా మీద వీవడే
సరస సౌరభశాలి చల్లగాలి
వెల్గు వేడియు మీకు గల్గించి మాకీడే
భవ్య సౌఖ్యకరుండు భాస్కరుండు
కురిసి మీపైని మా పైన కురవకున్నె
సకల సస్యావన సుకీర్తి జలదమూర్తి
దైవదృష్టికి బక్షపాతంబు లేదు
సృష్టి వీక్షించి వెలయుడీ !శిష్టులారా!” ప్రకృతి సహజ సమానతను తలకిందులు చేసిన మానవ వికృతికి జాలిపడిన కవి ఉద్బోధ ఇది. ఈ విధంగా మంగిపూడి వేంకట శర్మ పంచమోద్యమం వైపు నిలిచి రాసిన కవిత్వమే 1915 లో ‘నిరుద్ధభారతము’ అనే పేరుతో ఖండకావ్యంగా ప్రచురించాడు. ఆ తరువాత కూడా ఆయన పంచమోద్యమం వైపే ఉన్నాడు. తన సృజన విమర్శ శక్తులను దానికే వినియోగించాడు.

నిమ్నజాతి సముద్ధరణము అనే వ్యాసం ఒకటి మంగిపూడి రాసాడు ( ఆంధ్రపత్రిక, 1919 మే) ఇందులో అస్పృశ్యతా నివారణకు తీసుకోవలసిన చర్యల గురించి విస్తృతంగా చర్చించాడు. పాఠశాలలో ప్రవేశం కల్పించాలని, పంచమ బాలబాలికలను చేర్చుకోని పాఠశాలలకు గ్రాంటు నిలిపివేయాలని, నాటక ప్రదర్శనశాలలు, సభలు, సమావేశాలు మొదలైనచోట్ల వాళ్ళకు ప్రవేశం కల్పించాలని, గ్రామాలలోని నూతుల చెరువుల నీటిని వాడుకొనే స్వాతంత్య్రం కల్పించాలని , చర్మపరిశ్రమ, నేత మొదలైన వృత్తులు నేర్పి ఆర్ధికంగా వాళ్ళను వృద్ధిలోకి తీసుకురావాలని, ఆత్మవివేకం కలిగించి గౌరవాపేక్షను, స్వాతంత్ర్య కాంక్షను పురికొల్పగల విద్య నిమ్నజాతిని ఉన్నత స్థితికి తీసుకువస్తుందని ఆయన పేర్కొన్నాడు. మాలమాదిగలపై మోపబడిన యంటు సమస్య మిక్కిలి కఠినమైనది అంటాడాయన. మడ్డితనం,మురికితనం కారణాలు అనుకొనటానికి వీలు లేదు అని ఆయన అభిప్రాయం. నిమ్నజాతులుగా పరిగణింపబడే ఉప్పర ఎరుకల యానాది చెంచు దొమ్మర తదితర జాతుల యొద్దకంటే మాలమాదిగల యొద్దనేమి యంటు కలదు అన్నది ఆయన ప్రశ్న. నిమ్నుల అభివృద్ధికి నిరంతర ప్రయత్నాలు చేయటానికి శాసనసభలలో వాళ్ళ ప్రతినిధులు ఉండాలని కూడా భావించాడు. “ఎవరి కష్ట నిష్ఠురములు వారికేగాని యితరులకు బాగుగా తెలిసియుండవు. ఇతర కులములవారెంత భూతదయావంతులైనను వారి సంతాపమును, వారి హృదయాందోళనములను సరిగా గుర్తించి ప్రకటింపజాలరు” అనగలిగిన ఆయన నిజాయితీ, చిత్తశుద్ధి గమనించదగినవి. మాలా పంచరత్నాలు (ఆంధ్రపత్రిక 1924) , సనాతనాంధ్రులు ( ఆంధ్రపత్రిక 1925) మొదలైన పద్యరచనలు కూడా ఆయన రాసినవే.


మంగిపూడి వేంకటశర్మ మార్గంలో అస్పృశ్య అమానవీయతను నిరసిస్తూ కవిత్వం రాసిన వాళ్ళు అనేకులు ఉన్నారు. బ్రహ్మభట్ల పట్టాభిరామశర్మ వారిలో ఒకరు. ‘ మాలలు’ అనే శీర్షిక కింద ఆయన రాసిన నాలుగు పద్యాలలో ఒకటి – “ పొలములు దున్ను టాలగుమి( బోషణ జేయుట మంచి దుక్కిటె / ద్దుల సమకూర్చుటల్, తరిని తోరపు విత్తులు జల్లి పైరుపం/ టల నొగి పెంపు సేయుట హుటాహుటి నూరిచి ధాన్యమెల్లగాసులుగా నొనర్చి జీవనము సూపేడి మాలలు నోలి నూరికిన్ / వెలుపల నుండఁజేయుట వివేకమే?హైందవ ధర్మమే” ( ఆంధ్రపత్రిక ,1920 మే ) మాలల శ్రమమీద సంపదలు సమకూర్చుకొని సుఖ జీవనం సాగిస్తూ సంపద సృష్టికర్తలను ‘అంటరానివాళ్ళు’ అని ఊరివెలుపలకు నెట్టిన హైందవ ధర్మం లోని అధర్మ స్వభావాన్ని బయటపెట్టిన పద్యం ఇది.

చెర్ల నారాయణ శాస్త్రి మరొక కవి. పారిశుధ్యం లేదు కనుక వాళ్ళు అస్పృశ్యులు అనే వాదాన్ని తిరస్కరిస్తూ ఆయనఆదిమాంధ్రులు అనే శీర్షిక కింద రాసిన కవిత్వంలో ‘పారిశుధ్యము లేదని పరిఢవింత్రో / బాగు,చాబాసు, భళిరె యాలాగురండు / దారికినివచ్చినారాలీ మాఱు కొంత /లేనివారును గూడ మనలోనే లేరె / వారు మనలన బహిష్కరింపంగ బడిరె’ అని ఒక లోక వాస్తవాన్ని ముందుకుతెచ్చి తర్కించాడు. “ సాగినది కొంతకాలము సాగినంత /తెగిన దాకను లాగుట తగవు గాదు / తెలిసికొన్నారు వారును గలనిజంబు/ కనులు మూసియు గనుల గంత గట్టు/ కాలమది మారిపోయే నాగరాకులార!/ మొఱయుచున్నవి భేరులు బోరు కలుగఁ / గట్టనున్నారు క్రైస్తవకవచములను /వలదు కలహంబు మన కుటుంబంబు లోన …..” అని చెప్తూ వాస్తవానికి కళ్ళువిప్పమని ( ఆది మాంధ్రులు, ఆంధ్రపత్రిక 1921) సవర్ణ హిందువులను హెచ్చరించాడు. ఎన్ శాస్త్రి (అస్పృశ్యులా ? 2 పద్యాలు, ఆంధ్రపత్రిక 1922), సోమంచి సూర్యనారాయణ శర్మ ( అస్పృ శ్యుల ఆలాపము, 3 సీసపద్యాలు,అంధ్రపత్రిక 1923) పురిపండా అప్పలస్వామి (పంచమ విలాపము, 3 సీసపద్యాలు, ఆంధ్రపత్రిక 1925), దోమా వెంకటస్వామిగుప్తా( మాలపిల్ల , ఆంధ్రపత్రిక ) వంటి వారెందరో పీడిత బాధిత పంచమ ప్రజావళి పక్షం వహించి కవిత్వం రాశారు.

పంచములకోసం కవిత్వం రాసిన పంచముల ప్రతినిధిగా ప్రత్యేకం చెప్పుకోవలసిన కవి గొల్లపల్లి శామ్యూల్. ‘పంచముల విజ్ఞప్తి’ పేరిట ఆయన రాసినవి నాలుగు సీసపద్యాలు.( ఆంధ్రపత్రిక 1921) ‘మా చాకిరీలేక కొంచమున్నెగ్గని వారె వీడంగ మాకు దారియెద్ది’ అని ప్రశ్నిస్తూనే “కుదుపునొందిన రొమ్ముపై గృద్దనగునె /తరుణఫలముల దిని చెట్టు నఱుక నగునె /తీసుకొనిపాలు పొదుగు చేధింపనగునె / ఏలనయ్య? నిట్టివిచేత లిద్దరిత్రి” అని అగ్రజాతుల అనైతికను ఎత్తిచూపాడు. ఊరికి దూరంగా ఉంచారు, ముట్టరాదని పట్టుబట్టారు, పెద్దకులమని పీకులాడారు, అంటరాదని ఆర్భాటం చేశారు… మీ అసూయ, ద్వేషం ,కోపం ఏమైనా తగ్గాయా అని ప్రశ్నించి .. “తగ్గేనని మీరలోకవేళ దలచియున్న/ హెచ్చదే ?మాకు మీపైని యెన్నోరెట్లు ,/ద్వేషబుద్ధి ద్వేషంబునే పెంచుగాని/ యైకమత్యంబు గూర్చి సహాయపడునె” అని పరిణామాల గురించిన వాస్తవిక సత్యాన్ని ఆలోచించమని హెచ్చరించాడు. “ ఆదిమాంధ్రులమగు మా యస్పృశ్యత,నవలద్రోయుడో బుధులార” అని పిలుపునిచ్చి “సాదారమొప్పగ మీరును మేమును సహజన్ములమో ద్విజులారా!” అంటూ నచ్చచెపుతూ “అంధకులై మము విడిచి స్వరాజ్యంబందు టసాధ్యము గాదా” అని హెచ్చరించిన తిరునగరి వెంకట సూరి ( 1922, దళితకవిత్వం-2 , డా. కె. లక్ష్మీనారాయణ, 2003) ఈ కోవలో వాడే. “ నాయాభాగ్య దేశంపు సంతానమైన / ఓ! సవర్ణ గర్విష్ఠి! పేరాస వీడి/దులిపివేయుము నీ గొప్పకులపు నీటు /ఎవరిపైన నిందా తిరస్కృతుల పేర/ బెఱగుచుంటివొ ఆ నిప్పు కరడు లెల్ల / కుప్పలై వచ్చి నీ తల కూలునోయి!మానవుడనంచు తలయెత్తి మసలకుండ /పొదిగితివి గాదె కడజాతి బండకొయ్య” అంటూ అస్పృశ్యత, అణచివేత లతో అప్రతిష్టను మూటకట్టుకొన్న సవర్ణులు అందుకు మూల్యం చెల్లించాల్సే ఉందంటూ సవాల్ చేసిన కవి ఊటుకూరు సత్యనారాయణరావు ను కూడా ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. (దళితకవిత్వం- 1, 2002)

ఇలాంటిసంస్కరణ భావప్రచార ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాసిన పత్రిక ‘అభినవ సరస్వతి’. గుంటూజిల్లాలోని గురజాల తాలూకాకు చెందిన జానపాడు గ్రామం నుండి 1908 నుండి పదిహేను సంవత్సరాలకు పైగా వచ్చిన ఈ పత్రికకు సంపాదకుడు జానపాటి పట్టాభి రామశాస్త్రి ( పొత్తూరి వెంకటేశ్వర రావు ,తెలుగు పత్రికలు 2004). ఆయన ఉద్దేశాలుఏమైనా ఈ నాడు దళిత ఉద్యమం ఎంత వ్యతిరేకతమధ్య ఎట్లా రాటుదేలుతూ వచ్చిందో తెలుసుకొనటానికి ఉపయోగపడే చారిత్రక శకలాలను ఇందులోనుండి ఏరుకోవచ్చు. రాజమహేంద్రవరంలో నిమ్న జాత్యుద్ధరణ సంఘం ఒకటి ఉంది. దాని పక్షాన పాలకోడేటి గురుమూర్తి, తల్లాప్రగడ ప్రకాశరాయడు ‘అంటరానివాళ్ళా’ అనే శీర్షిక తో ఒక కరపత్రం ప్రచురించి పంచారు. 1922 మార్చ్ 8 ఆంధ్రపత్రికలో శివరాత్రి రోజులలో కోటిలింగాల శివాలయానికి జాతీయగీతాలు పాడుతూ పంచములు పెద్ద సంఖ్యలో వచ్చారని, నిరభ్యంతరంగా లోపలికి వెళ్లారని, పూజారి శఠగోపం పెట్టాడని, అక్కడ చేరిన వేలకొలది యాత్రికులు, బ్రాహ్మణులు అందుకు అంగీకరించారనిఇతర ప్రాంతాలలో ఇదేవిధంగా పంచముల దేవాలయ ప్రవేశం జరుగుతుందని నమ్మకం కలుగుతుందని వార్త వచ్చింది. ఈ రెండికీ వ్యతిరేకంగా స్పందిస్తూ జానపాటి పట్టాభిరామ శాస్త్రి ‘అంటరానివాళ్ళు’ అనే శీర్షిక కింద 1922 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఐదుసంచికలలో సుదీర్ఘ వాదన చేసాడు.

అంటరానివాళ్ళా అన్న కరపత్రపు శీర్షిక లోనే భాషాదోషం ఉందని ,వాళ్ళా ?వాండ్రా ఇందులో ఏది సరైనదంటూ కరపత్ర రచయితలను ఎద్దేవా చేయటం దగ్గర మొదలు పెట్టి ‘ అస్పృశ్యతా దోషం ఉండబట్టే అస్వతంత్రులమై స్వరాజ్యము పొందలేక పోతున్నాం అన్నవారి వాదాన్ని అపహాస్యం చేస్తూ స్వరాజ్య సంపాదనకు అంటరానితనం అడుగంటించటం సాధనం కాదని వర్ణధర్మభేదములు ఉండవలసినవే అని పేర్కొన్నాడు. అవి భగవంతుడి ఆజ్ఞ అని, స్పర్శ, సహపంక్తి భోజన నిషేధాలు పరమార్ధ సాధనకు ఏర్పడ్డాయని, స్వరాజ్య సుఖం కన్నా పరమార్ధ సుఖం అత్యుత్తమమని వాదించాడు. “ మమ్ములను దక్కువగా జేసినారని తక్కువజాతి వారెక్కువ జాతివారిని నిండించగూడదని, తమతమ తక్కువతనమునకు తమతమ కర్మయే కారణము కానీ ద్వేషముతో ఇతరులచేత ఏర్పరచబడినది కాదు” అని చెప్పటానికి కూడా జంకని కరుడుగట్టిన సంప్రదాయ బ్రాహ్మణవాదం అది. పంచములను అంటరాని వారని బాధపెట్టటం హిందూ ధర్మాలలో ఒకటి అంటే నేను హిందూ మతమునకే ప్రబల విరోధిని అని చెప్పిన గాంధీ దగ్గర నుండి అంటరానితనమేమిటని అసహ్యపడిన బరోడా మహారాజు, బాలగంగాధర తిలక్ మొదలైన అందరినీ నిరసించాడు ఈ శాస్త్రి.

1922 అక్టోబర్ సంచికలో ఈయన పంచమ వ్యతిరేకత ను బయలు పరిచే రచన ఒకటి ఉంది. ఆదిమాంధ్రులు చేయతలపెట్టిన గోరక్షణ సభకు సంబంధించి సుండ్రు వెంకయ్య, కుండజోగయ్య చేసిన విజ్ఞాపన కరపత్రం ప్రచురించాడు. అంతవరకు బాగానే ఉంది. వెనువెంటనే గూడూరి రామచంద్రరావు గుడివాడలో ఏర్పరచిన సేవాశ్రమం నుండి 7- 6- 22 న నిమ్నజాతుల ఉద్ధరణకు పాటుపడుతున్న కుసుమ వెంకట్రామయ్య, కుసుమ ధర్మన్న, శెట్టిబత్తుల వీరన్న, రాయడు గంగయ్య, కె. నారాయణ దాసు, కె. జోగయ్య, కె. నాగూరు, కనుపర్తి రంగయ్య, సుండ్రు వెంకయ్య సమిష్టిగా అభినవ సరస్వతి సంపాదకులకు తమ ఆశ్రమానికి ఉచితంగా పత్రిక కాపీ పంపమని, తమ సంఘాభ్యుదయానికి సంబంధించిన రచనలను ప్రచురించమనీ కోరుతూ రాసిన ఒక ఉత్తరం కూడా ప్రచురించి ఇక ఆ రెండింటి మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాసుకొంటూ పోయాడు.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply