అస్తిత్వవాద వుద్యమాలు – యాభై ఏళ్ల విప్లవ సాహిత్యం

యీ పుష్యమాసపు ప్రభాతాన పుస్తకాల బీరువాల ముందు నిలబడి చూస్తున్నా… తెరచి వున్న కిటికీల నుంచి యేటవాలు పుస్తకాలని చదువుతోన్న తొలి కాంతిరేఖలు మీటుతోన్న వాక్యాలు యెన్నో యెన్నెన్నో… చదవటం యెప్పుడు మొదలయిందో… యేమో… కానీ చదవటం వొక తీరని దాహం. సాహితీజ్ఞానం యెప్పటికీ సంతృప్తినివ్వని దప్పిక. యెనెన్ని పుస్తకాలు… చూపులకి హత్తుకొంటోన్న పుస్తకాలు వొకటా రెండా… యేబై యేళ్ళ వసంత మేఘఘర్జనని చెవి వొగ్గి వినమనుకొన్న వాళ్ళని సైతం నిలువెల్లా వొక్క కుదుపు కుదిపి ఆలకించటం నుంచి తప్పించుకోలేకుండా చేసిన ఆ మేఘఘర్జన యిప్పటి యీ పరాయికరణ సమాజంలో సాహిత్యలోకాన్ని కుదుపుతూనే వుంది. ఆ దేదీప్యమానమైన ఆ శక్తి ఆ సాహిత్యానికి యెలా వచ్చింది. యెక్కడ నుంచి వచ్చింది.

యే భావజాలపు మనుగడైనా వొక్క సమస్యలని యెత్తి పట్టి చూపించడంలో మాత్రమే వుంటే ఆ భావజాలం పదేపదే యీ సమాజం వివిధ సమూహాల మీద కుమ్మరిస్తోన్న హింసని ఆ హింస తాలూక దుఃఖాన్ని స్పష్టంగా పట్టి యిస్తుంది. కానీ యీ హింసకి దుఃఖానికి మూలం యెక్కడుందనే అన్వేషణ చేసినప్పుడు అనేక భావజాలాల వల్ల అని చెపుతాం.

స్త్రీవాదులైతే పురుషాధిక్య భావజాలమని, దళితవాదులైతే అగ్రవర్ణ ఆధిపత్యమని మనం యిలా కొన్ని కారణాలని చెపుతాం. అస్తిత్వవాద వుద్యమ సాహిత్యకారులం వీటిని స్పష్టంగానే పట్టుకొని గట్టిగా మాటాడటం మొదలైనప్పుడు, వర్గపోరాటం అన్నింటికి మూలం అన్న విరసం కూడా ఆ మేరకి వాటి గురించి ఆలోచించి యెక్కడైతే ఖాళీలు వున్నాయో ఆ ఖాళీలని గుర్తించటం మాత్రమే కాకుండా వాటిని పూడ్చుకోవటం వెంటనే మొదలు పెట్టింది. సమాజం అన్ని విధాలా ఆరోగ్యకరంగా ముందుకు సాగాలి అనుకొన్నప్పుడు యే సాహితీసంస్థ అయినా చెయ్యాల్సిన విలువైన పూరింత యిది.

కలుపుకుపోవటం సామూహిక మానవీయ లక్షణమే… కానీ యే అభివృద్ధికి యే అవసరమైన మానవీయ లక్షణాలని స్వీకరిస్తామూ, వేటిని దూరంగా పెడతామూ అన్నది ఆయా సంస్థలకి సంబంధించిన అంతర్గత విషయం. అయినప్పటికీ సీరియస్ కమిట్మెంట్ వున్న సాహితీ ప్రపంచం వాటిని గమనిస్తుంది. ప్రశ్నిస్తూనే వుంటుంది.

తెలుగు సాహిత్య సమాజంలో విరసం వొక ప్రధానమైన విలువైన సాహితీసంస్థగా గత యేభై యేళ్ళుగా పాఠకులకి విలువైన సాహిత్యాన్ని అందిస్తూ విషయాలని అర్ధం చేసుకునే మనో చూపుని యిస్తూనే వుంది.

విముక్తి పలు రకాలు. యెవరు యెందులోంచి విముక్తిని ఆశిస్తున్నారు… ఆ విముక్తి సామూహికమా… వ్యక్తిగతమా…. యెలా అర్ధం చేసుకొంటాం యిదంతా…

సాహిత్యం సమాజంలోని తారతమ్యాలని తగ్గించడానికి, హింసని తగ్గించడానికి, అర్ధవంతమైన జీవనం కోసం కొంత పాత్రని పోషిస్తుందని అందరికీ తెలిసిన విషయమే.

స్త్రీల విముక్తి కోసం పలవరిస్తూ కలవరిస్తూ స్వప్నిస్తూ స్త్రీవాద సాహిత్యం రాస్తోన్న కాలంలోనే ప్రపంచీకరణ ప్రవేశించి వొక్క సంతకంతోనే స్త్రీల పని సమయాల్ని, కొత్త రంగాల్లోకి, పని కోసం యెల్లలు దాటి చేసే ప్రయాణాలకి అవకాశం కల్పించటమే కాదు. కంజర్వేటీవ్ మనస్తత్వాలలో కూడా వో ఆమోదముద్రని వేయించగలిగింది. అప్పటికి సమాజంలో వీటి పట్ల కొంత మేర అవగాహన సాహిత్యాన్ని చదువుకొంటున్నవాళ్లకి వుండటంతో, సమాజంలో యీ మార్పుకి వో క్రిటికల్ మాస్ సంసిద్ధంగా వుండటం అన్నది అస్తిత్వ సాహిత్యం చేసిన పని.

అయితే యీ గ్లోబలైజేషన్ వల్ల యెలాంటి సమస్యలు, సంఘర్షణ, భయబ్రాంతపు సన్నివేశాలని యీ సమాజం చూడవలసి వస్తుందోనన్నది పట్టుకోడానికి ఆర్ధిక, నైతిక, తాత్విక, భౌతిక సంస్కృతి విచ్ఛిన్నత వుంటుందా… వుంటే యెలా వుంటుందీ అన్నది అంచనావేసే చూపునిచ్చింది మాత్రం విరసం కుదురుల్లోంచి వచ్చిన సాహిత్యమే.

ఆ సాహిత్యకారుల్లో కొందరు విరసం ఆవిర్భావంకి ముందు నుంచీ రాస్తున్నప్పటికీ వారి దార్శనీయతే విరసంలోకి మమేకతనిచ్చింది.

నేనింతకు ముందు నించున్న పుస్తకాల అల్మారాల్లోని సాహిత్యమే కనుల ముందు మెదిలింది. వారి స్ఫూర్తిదాయకమైన సాహిత్యం పదేపదే నెమరేసిన సాహిత్యం… అనేకానేక వొడిదుడుకుల్లో, సంఘర్షణల్లో, వెలివేతల్లో మనోదీపమై నిలిచిన వారి సాహిత్యం విరసం కుదురులోనిదే అనే యెరుకని హృదయం చెవొగ్గి వింటూనే వుంటుంది.

తెలుగు సాహిత్యంలో మార్క్సిస్ట్ స్పృహతోటి రాసే వ్యక్తులు ఆ నాటి వుద్యమాల స్ఫూర్తితోటి, వుద్యమాలల్లోంచి రాసిన రచయితలు ప్రతి తరంలోనూ వున్నారు.

వసంత మేఘ ఘర్జనకి ముందు తరంలో కొడవటిగంటి కుటుంబరావుగారు రాసిన పొరలుపొరలుగా అక్షరాలంతటా అందించిన మధ్యతరగతి జీవితాన్ని చదువుతున్నప్పుడు మనమే కాదు మన కుటుంబ సభ్యులు, యిరుగుపొరుగువారు, మన రోజువారి జీవితంలో యెదురయ్యే వ్యక్తులు అందులో తారసపడతారు. అలానే నిత్య జీవితంలో యెదురయ్యే మానవ మనస్తత్వంని చూస్తున్నప్పుడు మనలో మనకి వారి పాత్రలు గుర్తొస్తాయి. మధ్యతరగతిని రెండు దోసిళ్ళల్లో యింతలా పట్టుకున్న కొకు గారిని చదువుతున్నప్పుడు మనకి యెదురయిన వ్యక్తులూ, సమస్యలు, సంఘర్షణలూ, సందిగ్ధాలకి వో పరిష్కారం లేదా వో చిన్ని కాంతివంతమైన స్పురన్నో వో అర్ధవంతమైన పరిష్కారమో మనకి అందుతుంది. పాఠకుని మానసిక స్థితిని వెలుగునీడల్లో వూయలూపే యీ సాహిత్యం మధ్యతరగతి ఆలోచనలకి ఆచరణకి నడుమనున్న దైదీభావాన్ని తేటతెల్లం చేస్తూ తేల్చుకోవలసిన వాటిని తేల్చుకోడానికి కావలసిన పరికరాన్ని యివ్వగలిగినన భరోసానిచ్చే సాహిత్యం కొకు గారిది.

ఆ తరువాతి తరంలో రాసిన కారా మాస్టారు గారి మొత్తం సాహిత్య సంకలనం రెండు చేతులతో యిమిడిపోదు. ఆ బరువైన సంకలనం గ్రామీణ రైతు నలిగిపోతోన్న హృదయపు పెనుకేక. భారతీయ గ్రామీణ రైతాంగపు సమస్యలు సమసిపోయేవరకూ మాస్టార్ గారి సాహిత్యం మనకి సమస్యని, సమస్య మూలాన్ని, పరిష్కారాన్ని సూచిస్తూనే వుంటుంది. యెన్నో తరాలుగా చదువుతోన్న యీ సాహిత్యం రైతాంగపు లాంగ్ మార్చ్ లో పాదాల పగుళ్ళల్లోంచి చిందిన రక్తాన్ని చూసినప్పుడు, తెగిపడిన శిరస్సు చిందిన రుధిరంలా మన మనోచూపుల్లోకి కారా మాస్టారి గారి సాహిత్యం వచ్చేస్తుంది.

సంఘర్షణాత్మక సమయంలో శ్రీశ్రీ గారిచ్చిన లోచూపు అత్యంత పవర్ఫుల్. మనం యెక్కడ నుంచి యే యెరుకతో సమాజాన్ని చూస్తున్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకొనేటప్పుడు రాజకీయరంగాల్లో వస్తోన్న పెను మార్పులు విడిపోతోన్న చిక్కులూ, పెనవేసుకొంటోన్న చిక్కుముడులూ, వేగవంతంగా కదులుతోన్న మన పాదాల కింద నేల, గతితప్పిన వాతావరణం, క్రిమిసంహారం మానవ ఆరోగ్యాన్నే కబళిస్తోన్న ఆహారమే తప్పా మరో గతిలేని సమాజపు అరగు అంచున నిలబడి మనల్ని మనం సంభాళించుకొంటూ యెలాంటి ప్రశ్నలు వేస్తాం… యెలాంటి యెరుక కావాలి అనుకున్నప్పుడు యీ ప్రతిభావంతమైన సాహిత్యం వైపే చూస్తాం.. యిప్పుడు అంతటా అలుముకొన్న మందమైన చీకటి చూస్తున్నప్పుడు మరోప్రపంచపు కలనిచ్చిన శ్రీశ్రీ గారు మన హృదయంతరాళ్ళ నుంచి చప్పున మనకో బలమైన గొంతుకవుతారు వాక్యాలు వాక్యాలుగా… కవిత్వపు కవాతుగా… మనలోకి వచ్చి వో బలమైన గొంతుకవుతారు.

రావిశాస్త్రి గారు పట్టణ అట్టడుగు వర్గాలని యెలా వ్యవస్థ అనేక రూపాల్లో యెలా అన్యాయం చేస్తుందో చేసిందో కళ్ళకు కట్టిన్నట్టు వేలవేల కళ్ళతో మనకి చూపిస్తారు. ప్రపంచపు రూపురేఖల్ని సమూలంగా మార్చి వేసిన రాజకీయ, సాంఘీక, ఆర్ధిక సంస్కరణల తరువాత మరింతగా పలు ధోరణులుగా పెరుగుతోన్న హింస రూపాన్ని సమాజంలో చూస్తున్నప్పుడు రావిశాస్త్రి గారి సాహిత్యం మనకి తేటతెల్లం చేసే న్యాయాన్యాలు మన ముందుకి వచ్చినప్పుడు యీ మార్పులోని డొల్లతనం అర్థమవుతుంది.

విరసంలోని యెందరో సాహిత్యకారులు యెంతో విలువైన సాహిత్యాన్ని యీ సమాజానికి అందిస్తూనే వున్నారు. వివి గారి కవిత్వం దండకారణ్య సాహితీకారులకి యెంత అపురూపమో మైదాన ప్రాంత రచయితలకీ అంతే అపురూపం. స్ఫూర్తిదాయకం.

కళ్యాణరావు గారి నవల చూపించిన ప్రభావం, జరిగిన చర్చలూ మనందరికి తెలుసు.

వుద్యమంలో వున్నప్పుడూ రాసిన కవిత్వం వెన్నెలంత మృదువుగా కనిపిస్తూనే మనసులని వెచ్చని రశ్మిలా కమ్ముకొంటూ వుద్వేగానికి లోను చేసే లిరికల్ బ్యూటీతో జలజల్లాడే కవిత్వం శివసాగర్ గారిది. వారు వెలుపలికి వచ్చాక దళిత కవిత్వానికి యిచ్చిన లోతైన చూపు, అందించిన యీస్థటిక్స్ యెంతో విలువైనవి. దారులు వేసినవి.

సాహిత్యానికి మట్టిపరిమాళాన్ని అద్దిన రాజయ్య గారు సాహితీలోకానికి అందించిన కథలు వారి సమకాలీనులకెంతో వుత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగించాయి.

దండకారణ్య రచయితలు అందించిన రచనలు సాహిత్య ప్రపంచంలోనే అద్భుతమైనవి. మనకి తెలియని అనేక జీవితపు కోణాలని, పోరాట పటిమని, సాధించిన సమభావాన్ని, ప్రకృతి పట్ల వున్న బాధ్యతని గౌరవాన్ని, జీవనం పట్ల వున్న మైత్రీ భావాలని సాహిత్యంగా అందించిన ఆ రచయితలూ అత్యంత అపురూమైన వారు.

యిలా విరసం యెంతో సాహిత్యాన్ని అందించింది.

స్త్రీవాద సాహిత్యంలో స్త్రీలు అనేక రాజకీయ ప్రశ్నలని అడగటం అనేది అలా వున్నట్టుండి లేవనెత్తినవి కావు… విరసంలో యేర్పడ్డ ఖాళీల్లోంచి స్త్రీల ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ ప్రశ్నల నుంచి విప్లవోద్యమం కూడా ఖాళీలని వెతకటం మొదలు పెట్టింది. దళిత ప్రశ్న వచ్చినప్పుడు దళితోద్యమం వచ్చింది. అలా అనేక అస్తిత్వవాద వుద్యమాలు అస్తిత్వ వుద్యమాలు వచ్చాయి. యివన్నీ కూడా విరసం కుదుర్లుంచి వచ్చినవి. విరసంలో యేర్పడ్డ ఖాళీల నుంచి వచ్చిన విమర్శ, ప్రశ్నలు ముందుకు వచ్చినప్పుడు స్త్రీపురుషుల నడుమ వైరుధ్యాలు మిత్ర వైరుధ్యాలే కాదు. శత్రు వైరుధ్యాలు అనే స్పష్టత వచ్చింది. సీరియస్ గా పరిగణించాలి. కులం అన్నది కేవలం భూసమస్య పరిష్కారం కాదు ప్రత్యేకంగా చూడాల్సిన ఖాళీలని విరసం గుర్తించి అ ఖాళీలని పూరించుకొనే ప్రయత్నం చేసింది.

మనం అర్ధం లేని ఆరాటాలకూ, అనుభవాలకు యీ సాహిత్య జీవనచిత్రాలు, ఆ కవిసమయాలు, ఆ వెలుగునీడల జీవితానుభవాలని భయభ్రాంత సంవేదన ఆలపిస్తోన్న జీవన గీతాన్ని వింటూనే అనేక పర్యాయాలు మనం ముందుకు వెళ్ళుతున్నామో వెనక్కి వెళ్ళుతున్నామో మనకే అర్ధం కాని యీ అవస్థలకి కారణం మనదైన మన సొంత గొంతుని మనం మర్చిపోవడమే. మన ఆత్మని మనం అణుచుకోవటం చేస్తోన్న ప్రతిసారీ, మనం సాహిత్యం వైపు చూస్తున్న ప్రతిసారీ, 50 యేళ్ళ తెలుగు సాహిత్యంలోని యే ప్రకియ కూడా విరసం ప్రభావం నుంచి బయటకు పడలేదని చెప్పటం అతిశయోక్తి కాదు. దాదాపు 1970 నుంచి రెండు దశాబ్దాల తెలుగు సాహితి చరిత్రంతా విరసం చరిత్రే. విరసం ప్రభావం నుంచి వైదొలిగిన కవులు, కళాకారులూ దాదాపుగా యెవరూ లేరనినో చెప్పావచ్చు.

80 వ దశాబ్దం చివరిలో ముందు కొచ్చిన అస్తిత్వవాద వుద్యమాలు సైతం విరసం కుదురుల్లోంచి వచ్చినవే. యీ అస్తిత్వవాద వుద్యమాలు, వాటి వుద్యమ రూపాలు బలంగా వుండి సమాజాన్నిఆకర్షించినప్పటికి అవి కేవలం వ్యక్తివాద వైయ్యక్తిక సమస్యలే ప్రధాన రూపాలుగా వుండటంతో అవి సమస్యల తాలూకు ప్రకటనలుగా మిగిలిపోయాయి తప్ప పరిష్కారాలని సూచించలేకపోయాయి.

యిప్పుడు ప్రపంచమంతటా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆవరించి యింకా యింకా దట్టంగా మనల్ని కమ్ముకొంటున్న యీ సందర్భంలో నిలబడి మనం వో హింసాశోకాన్ని వ్యక్తపర్చటానికి మాటల కోసం తడుముకుంటూ వున్నప్పుడు, టెక్నాలజీ ఆసరాగా యేనిమేషన్ చిత్రాల నుంచి యిప్పటి ఆధునిక యువతరం పవర్ ఫుల్ యిమేజేస్తో తమదైన వో ధిక్కార ప్రకటనని మన ముందుకు తీసుకురావటం చూస్తున్నాం. మరో వైపు తమ సమస్యల పరిష్కారానికి సాయుధ పోరాటాన్ని యెంచుకొన్న యువతనీ చూస్తున్నాం . యీ పోరాట రూపాలని, యెంతటి త్యాగానికైనా సంసిద్ధులు కావటాన్ని విస్మయంగా చూస్తూ యీ మొతాన్ని సాహిత్యంలోకి తీసుకువస్తున్నప్పుడు యే దృక్పథం నుంచి రాస్తాం. యే అస్తిత్వం నుంచి రికార్డ్ చేస్తాం సాహిత్యాన్ని. యేదో వొక్క అస్తిత్వవాదంతో యీ ఆధునిక జీవితాన్ని వొడిసి పట్టుకోగలమనే ఆలోచనలు రేగుతున్నప్పుడు యీ సమాజం తాలూకు సమస్యల పరిష్కారాల పట్ల స్పష్టమైన వర్గ నిర్మూలన పరిష్కారం అజెండాగా వున్న విరసం కుదుర్లోకే యీ అస్తిత్వవాద వుద్యమాలన్నీ చేరుకోక తప్పదనిపిస్తోంది. దీని బట్టి విరసానికి, విప్లవ సాహిత్యోద్యమానికి స్పష్టమైన మనుగడ కొనసాగింపు వుండి తీరుతుందనిపిస్తోంది.

యేబై వసంతాల మేఘ గర్జన స్వప్నం చిగురిస్తోనే వుంటుంది యీ సమస్యలకి వో పరిష్కారం దొరికేవరకు.

కవయిత్రి, కథా రచయిత్రి. నగర జీవనంలో స్త్రీల సంఘర్షణల్ని కథల్లోకి తీసుకువచ్చారు. తొమ్మిది కథల సంపుటాలు, మూడు నవలలు, ప్రేమ లేఖలు, మ్యూజింగ్స్ వెలువరించారు. 'వార్త' దినపత్రికలో దశాబ్దకాలం పాటు 'మైదానం' కాలమ్ నిర్వహించారు. రచనలు: మనసుకో దాహం, సాలభంజిక, మంచుపూల వాన, వాన చెప్పిన రహస్యం, 'మసిగుడ్డ', 'ముక్త', 'ఇన్స్టంట్ లైఫ్', ద లాస్ ఆఫ్ యిన్నోసెన్స్, కుప్పిలి పద్మ కథలు, ముక్త, మంత్రనగరి సరిహద్దుల్లో, పొగమంచు అడివి, 'నెమలీకలు పూసే కాలం' (కవిత్వం), 'మంత్రనగరి సరిహద్దుల్లో (ప్రేమ కథలు), 'పొగమంచు అడవి', 'మోహనదీ తీరంలో నీలి పడవ' (కవిత్వం) సంకలనాలుగా వచ్చాయి.

Leave a Reply