అవాస్తు…

తీరొక్క పువ్వుగానో తీరం దొరకని నదిగానో
ఆమె నవ్వులెప్పుడూ మనసులు ఎదిగీ ఎదగని
ఇరుకు గదుల్లో ఇమడలేవని తెలిసీ
ఎంతో ఒద్దికగా ఇమిడిపోతూ ఉంటాయి

ఈశాన్యం విశాలం అవునో కాదో కానీ
తన చెయ్యి తనకే అందనంత దూరం
ఆగ్నేయం నర్మగర్భంగా ఆకర్షిస్తుంటే ఆమె
నిలువునా కాలిపోతూ ఉంటుంది…

ఉత్తరమో పడమరో అజమాయిషీలకు
భయపడుతూనే ఆ పక్కగా ఒద్దిగిల్లమని
ఆమెపై కాసిన్ని జాలి చూపులు విసురుతుంటాయి
సొమ్మసిల్లటంలోనూ విశ్రాంతిని వెతుక్కుంటుంది ఆమె

భూదేవి ధైర్యం చెబుతుందనుకుంటే..
ముగ్గులు కళాత్మకంగా ఆమె మేథో సమయాన్ని హత్య చేస్తాయి

చీర కొంగుతో చెమటలు తుడుచుకున్న
వంట గది కాసింత దాహం తీరుస్తుందనుకుంటే
అదో వంటకాల కొలిమిలా సెగలు కక్కుతుంటుంది

గొంతు నిర్దయగా ఆమె నాలుకను లాక్కుపోతున్నా
తన వాళ్ల కోసమని
ఏ అంగిలి పక్కగానో
కాస్త ఓపికని దాచే ఉంచుతుంది…

కన్నీటిని చిలకరించగా పరిమళాలతో విచ్చుకున్న పూతోటైనా
పెద్దమనసు చేసుకుంటుందేమో అనుకుంటే
ఈ మూడు రోజుల్నీ పరదా చాటునే
దాచేయమంటూ సూదంటి ముళ్లతో గుండెల్ని గుచ్చుతుంది
ఏ విష గాలులూ సోకని ఆమె మాత్రం
పగబట్టిన రాత్రులకు ఇంకా ప్రేమను పంచుతూనే ఉంది…
నిస్త్రాణగా… అమలినగా…

ఆడపిల్లగా ఎందుకు పుట్టావంటూ ఇక్కడ కూడా నేరం ఆమె పైనే…
రోజుకో చితి పేర్చుతున్నా ఈ లోకం ఇంకా
జోలపాడుతూనే ఉంది…

ఎప్పుడో చేజారిపోయిన అస్తిత్వమొక్కటే
చేతులు చాచి పిలుస్తూ ఉంది…
గొంతు పిడచకట్టుకు పోతున్నా
ప్రాణాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా
అటుగానే పరుగులు తీస్తూ తీరొక్కపువ్వు…

తల్లీ! రేపటి రోజున న్యాయదేవత ఆకలితో
గుక్కపెట్టి ఏడ్చినా పాలు మాత్రం పట్టకు…
స్కిన్ టు స్కిన్ టచ్ లోపాయికారీ తీర్పుల్లో
టచ్ మీ నాట్ లా ముడుచుకుపోవాలంతే..

నివాసం విజయవాడ. కవయిత్రి, అధ్యాపకురాలు, జర్నలిస్టు. 2015 నుంచి కవిత్వం రాస్తున్నారు. 2019 లో ' ఏడవ రుతువు' కవితా సంపుటి వచ్చింది.

6 thoughts on “అవాస్తు…

  1. టైటిల్ చాలా ఆకర్షించింది.

  2. చాలా బాగా రాసారు వైష్ణవీ….స్త్రీ అస్థిత్వ పోరాటం ఎన్ని రాసినా, ఎంత ఘోషించినా తరగనిది…

Leave a Reply