ప్రేమ రాహిత్యంలోంచి అవధుల్లేని ప్రేమతో…

అవును, ఒంటరితనం వైయుక్తికం కాదు… సంఘ జీవి, రాజకీయ జీవి అయిన యీ రచయిత ‘అరుణాంక్ లత’కి సంఘంలో, తాను నమ్మే రాజకీయాల్లో వుండే వైరుధ్యాలు అతన్నిబాధించి ఒంటరి(isolate)ని చేశాయి. అయితే, అతడు ఆ ఒంటరితనానికి కుంగిపోలేదు. దానిని తన లేఖల్లో గొప్ప ప్రేమతో, ఆర్తితో వ్యక్తీకరించి వుపశమనం పొందుతాడు. ఆ దుఃఖాన్ని దూరంగా యెక్కడో వున్న ప్రియురాలికి కొండంత విరహాన్ని చొప్పించి రాయడం అరుణ్ ప్రేమలేఖల విశిష్టత. చలం తన ప్రేమలేఖల్లో గొప్ప ప్రేమ భావనతో పాటు సమాజంలో వుండే వైరుధ్యాల వల్ల తాను కలత చెందడాన్ని ప్రేయసితో వుత్తరాల్లో చర్చిస్తే, అరుణాంక్ చలం స్పృశించని కొన్ని అంశాలను తన వుత్తరాల్లో సీరియస్ గా ముచ్చడిస్తాడు. అరుణ్ లేఖల్లో సమకాలీనత ప్రధానమైనది. తనలో పాబ్లో నెరూడా కనిపిస్తాడు, తెలుగువారి నెరూడా శివసాగర్ మెరుస్తాడు. బహుశా! అరుణాంక్ విప్లవాన్ని మనసారా ప్రేమిస్తాడు కాబట్టి తన రాతల్లో విప్లవం, ప్రేమ చేతిలో చెయ్యి వేసుకుని నడుస్తాయి అనిపిస్తుంది. నిజమే కదా! విప్లవకారుడికంటే గొప్ప ప్రేమికుడు యెవరుంటారు? మరి ఆ విప్లవకారుడు స్వాప్నికుడైతే నెరూడా, శివసాగర్అవుతారు. వారి దారిలో అరుణ్ తన ప్రయాణం మొదలుపెట్టాడనిపిస్తుంది.

వడ్డెర తల్లికి, మాదిగ తండ్రికీ కరీంనగర్ లో పుట్టిన అరుణాంక్ ‘మాదిగ’ అస్తిత్వంతోనే చెలామణి అవుతున్నాడు. అమ్మ పేరైన ‘లత’ ని తన పేరు చివర చేర్చుకుని అనార్య సంస్కృతిలోని ఔన్నాత్యాన్ని చాటుతున్నాడు. ‘అరుణాంక్ లత’ కవిగా, రచయితగా, వుద్యమకారుడిగా పరిచయమక్కర్లేని పేరు. ‘మబ్బుల చీల్చుకు వచ్చిన వెన్నెల’ అతని కవితా సంపుటి. వుద్యమకారుడిగా అతడు వామపక్ష ప్రజాసంఘాల్లో క్రియాశీలక కార్యకర్త. తెలంగాణ, ఉస్మానియా విద్యార్ధి సంఘాలలో భాగస్వామి అయ్యే అరుణాంక్ సమకాలీనంగా అన్ని ప్రజా వుద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొంటున్నాడు.

న్యాయశాస్త్రాన్ని చదువుకున్న అరుణ్ బాధితులకు న్యాయపరమైన సహకారాన్ని అందిస్తున్నాడు. దళిత, ఆదివాసీ సమస్యలపైన నిరంతరం రాస్తూ, జనాన్ని సమీకరిస్తూ వుంటాడు అరుణ్. మంధనిలో మధుకర్ కులహత్య నుంచి యిటీవలి ఆర్టికల్ 370 రద్దు పైన, నల్లమలలో యురేనియం తవ్వకాల పైన జరిగే నిరసన కార్యక్రమాలలో అరుణ్ ముందున్నాడు. ‘సేవ్ నల్లమల’ వుద్యమంలో ప్రొఫెసర్. జయధీర్ తిరుమలరావువంటి వారితోపాటు అనేక నిరసన కార్యక్రమాలు యేర్పాటు చెయ్యడమేకాక నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ వచ్చిన రచనల్ని ‘సల్లంగుండవే నల్లమల’ పేరుతో వొక సంకలనాన్ని తన సంపాదకత్వలో వెలువరించాడు అరుణ్. ఫేస్ బుక్ లో అరుణ్ వొక సంచలనం, వొక డైనమిక్ యూత్, వివాదాలను యెలుగెత్తి పిలుస్తాడు. అయినా తన వోటు యెప్పుడూ ప్రజాస్వామిక చర్చకే వేస్తాడు. దళిత, విప్లవ, స్త్రీవాద వుద్యమాలపై విమర్శనాత్మక ధోరణితో రాస్తాడు. వుద్యమపరమైన కార్యక్రమాల కోసం యెక్కువగా పర్యటించడం, ఫీల్డ్ లో స్వయంగా బాధితులతో మమేకమవ్వడం అతని కార్యాచరణ.

అరుణాంక్ ‘ప్రేమలేఖలు’ శీర్షికన ఫేస్ బుక్ లో సీరియల్ గా రాసిన వుత్తరాల సంపుటే యీ ‘ఖ్వాబ్’. సాహిత్యంలో లేఖా సాహిత్యానికి ప్రముఖ స్థానం వుంది. మా తరంలో చలం రాసిన ‘ప్రేమలేఖలు’ చదవని వారుండరు. అయితే సమాకాలీన అంశాలపైన, దేశవ్యాప్తంగా చర్చనీయాంశాల పైన తాజాగా ప్రేయసికి రాసిన ప్రేమలేఖలలో ప్రేమతోపాటు సమాజంతో అతని శతృత్వం, ఘర్షణ, కలలు, కలతలు అన్నీ యీ లేఖలలో పొందుపరిచాడు అరుణాంక్. ‘ఖ్వాబ్’ అంటే వుర్దూలో ‘ప్రేమ’ అనీ ‘కల’ అనీ అర్ధాలున్నాయి. స్వాప్నికుడు అరుణ్ సమాజం పట్ల తన ప్రేమని, అదెలా వుండాలని కలగంటాడో ఆ కలల్ని ఫేస్ బుక్ లో రాస్తున్నప్పుడు చదివిన మిత్రుల నుంచి మంచి స్పందన వొచ్చింది. ఆ లేఖలు యిప్పుడు గుది గుచ్చి వొక సంపుటిగా తీసుకురావడం, అందులో పరిచయ వాక్యాల ద్వారా నేను కూడా పాలుపంచుకోవడం ఆనందంగా వుంది. అరుణ్ ఫోన్ చేసి ‘అక్కా, నా పుస్తకంలో నీమాట ఖచ్చితంగా వుండాలి’ అని డిమాండ్ చెయ్యగలిగే ఆత్మీయత మాది.

గత ఐదారేళ్ళుగా సమాజం యింతకు ముందెన్నడూ లేనంత సంక్షోభాన్ని యెదుర్కుంటుంది. ప్రజలు అతిపెద్ద విధ్వంసాన్ని, హింసని, హక్కుల హననాన్ని చవిచూస్తున్న చెడ్డకాలం కూడా యిదే! యెన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న కొన్ని ఆవిష్కరణలు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా యెదిగివచ్చిన హేతువాద, నాస్తికవాదాలు, ప్రజా వుద్యమాలూ, వాటి ద్వారా ప్రజల్లో పాదుకొల్పిన హక్కుల చైతన్యం, అసమానతల్ని, సామాజిక దురన్యాయాలను ప్రశ్నించే స్పృహ, రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాలలో ప్రజాస్వామ్యం వెల్లివిరియడానికి సాగిన వుద్యమాలు, అణగారిన కులాల ఆత్మగౌరవ పోరాటాలు, స్త్రీలు, మైనారిటీల వునికిని, గుర్తింపునూ చాటే అస్తిత్వ వుద్యమాలు అన్నింటినీ వొక కలం పోటుతో తిరస్కరించే దుర్మార్గమైన ఫాసిస్ట్ ధోరణి వలన సమాజం తీవ్రమైన సంక్షోభాన్ని యెదుర్కుంటుంది. ‘దేశభక్తి’, ‘దేవుడు’ యిప్పుడు సమాజాన్ని పట్టిపీడుస్తున్న రాచపుళ్ళు. హేతువాదం, స్వేచ్ఛ, సమానత్వాల గురించి రాసేవాళ్ళని, మాట్లాడేవాళ్ళని నిర్దాక్షిణ్యంగా హతమార్చి రచయితలను, మేధావులను భయభ్రాంతులకు గురిచేస్తున్న పరిస్థితి నిస్సిగ్గుగా కొనసాగుతుంది. ప్రజల్లో శాస్త్రీయ దృష్టిని పెంచాల్సిందిపోయి వారి కళ్లుమూసే క్రతువులు, మతవిశ్వాసాలు అధికారికంగా వ్యాప్తి చెయ్యడం జరుగుతుంది.

బ్రాహ్మణవాదానికి ‘మంచిరోజు’లొచ్చాయి. దాన్ని వ్యతిరేకించే శక్తులకు పాడుకాలం దాపురించింది. సమాజంలో దళితులూ, ఆదివాసీలు, మైనారిటీలు, స్త్రీలు గతంలో యెప్పుడూ లేనంతగా అభద్రతా భావానికి గురికావల్సి వస్తుంది. స్త్రీలు, బాలికల మీద జరిగే అత్యాచారాలు, హత్యల విషయంలో భారత్ ప్రపంచ దేశాల్లో అగ్రభాగాన నిలిచింది. యీ అంశంపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చెయ్యడం చూశాం. మతతత్వ ప్రభుత్వాలు తమ పౌరులమీద కంటే జంతువులమీద యెక్కువ శ్రద్ధ చూపుతూ మనుషుల్ని కుక్కల కంటే, పిల్లుల కంటే హీనంగా పరిగణిస్తున్నాయి. వీటితో పాటు ‘పరువు’ పేరుతో కులహత్యలు, పెరిగిపోయాయి. దళితులూ, ముస్లింలు తినే తిండి పైన, మాట్లాడే మాట పైన ఆంక్షలు వొచ్చాయి. యీ సంక్షోభాన్ని అరుణాంక్ తన అక్షరాలతో యెత్తిచూపాడు.

సమాజంలో అన్నీ అమరినవారి ద్వేషానికి, శతృత్వానికి, అసహనానికి గురయ్యే అణగారిన కులాలు, ఆ కులాల స్త్రీలు యే ప్రేమకూ నోచుకోరు. నిజానికి ఆ కులాలలో శ్రామిక వర్గపు తల్లిదండ్రులకు బిడ్డలమీద, బిడ్డలకు తల్లిదండ్రులమీద, ప్రేయసీ, ప్రేమికులు పరస్పర ప్రేమను వ్యక్తం చేసుకునే కనీసపు వెసులుబాటు కూడా వుండదు. వారు ఆత్మ న్యూనతకి లోనౌతూవొక్కోసారి తమను తామే ద్వేషించుకుంటారు. అంతటా ద్వేషాన్ని, హైన్యాన్ని చవిచూసే ఆ దౌర్భాగ్యపు బతుకులలో ప్రేమ అనేమాటకు కాసింత జాగా లేక వారు నిత్యం ప్రేమరాహిత్యానికి, ఒంటరితనానికీ లోనౌతూ వుంటారు.

వెలివేతల నుంచి పుట్టుకొచ్చే వంటరితనాన్ని రాయడం సవర్ణ రచయితలకు అంత సులువైన పనేమీ కాదు. వారిని ఆవరించి వుండే వొక నిరంతర ప్రేమ రాహిత్యం గురించి యెవరు రాస్తారు? మళ్ళీ ఆ ప్రేమరాహిత్యానికి బలయ్యేవారే రాయాలి. వెంటాడే ప్రేమరాహిత్యం అరుణ్ వుత్తరాలనిండా పరుచుకుంటుంది. అలాగే వుద్యమాన్ని కలగనడంతో ఆగిపోకుండా దాన్నే జీవిస్తూ వుండే జీవితకాలపు వుద్యమ జీవికి కూడా తాను నమ్మిన సిద్ధాంత ఆచరణలో వైరుధ్యాలు, వాటి నుంచి పుట్టుకొచ్చే వంటరితనం, పరాయీకరణకూడా అరుణ్ వుత్తరాలలో చర్చకు వస్తాయి. వొకే విషయం పైకులం వాళ్ళు చెబితే ఆదర్శం, అణగారిన కులం వాళ్ళు చెబితే కులతత్వం యెందుకు అవుతుందో, దాని వెనక వుండే డైనమిక్స్ యేమిటో కూడా యీ ‘ఖ్వాబ్’ లో తన ప్రేయసితో సంభాషిస్తాడు అరుణాంక్.

యీ సమాజంలో యెంత ప్రేమరాహిత్యం లేకపోతే వొక కంచికచెర్ల కోటేసుని అది సజీవంగా దహిస్తుంది! యిక్కడ యెంత ప్రేమరాహిత్యం లేకపొతే మంధని మధుకర్ అంగాలను చిద్రం చేసిమరీ చంపుతుంది! ప్రణయ్ ని సుపారీ యిచ్చి పట్టపగలు హతమారుస్తుంది! ప్రేమరాహిత్యం ఆఖరికి కులాంతర ప్రేమ వివాహాలను సైతం వెక్కిరించి ఆ పెళ్లిని వొక ‘వొలపోత’ గా మారుస్తుంది. ప్రస్తుత సమాజంలో సరికొత్త రూపాల్లో పెచ్చరిల్లిపోతున్న కులం, మతం, పితృస్వామిక అణచివేతలతో పాటు తనని ప్రభావితం చేసిన కొన్ని పుస్తకాలు, సినిమాలు, చాలాకాలం తర్వాత వూరెళ్ళినప్పుడు ముసురుకునే జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలలో సలపరించే గాయాలు, నల్లమలలో యురేనియం తవ్వకాల వలన ప్రశ్నార్ధకం కాబోతున్న ఆదివాసీల మనుగడ, కాశ్మీర్ సమస్య… వొకటి కాదు… యిప్పటి సందర్భంలో ప్రాసంగికత వున్న ప్రతి అంశాన్ని అరుణాంక్ తన వుత్తరాల్లో లోతైన తాత్వికతతో చర్చించాడు.

రాజ్యం సాగిస్తున్న కుల హత్యలు, మత హింస, స్త్రీలపై సాగిస్తున్న పితృస్వామిక అణచివేత, శబరిమల ఆలయంలో స్త్రీల ప్రవేశంపై ప్రభుత్వం, కోర్టుల రెండు నాల్కల ధోరణి, యీశాన్య రాష్ట్రాల ఆదివాసీ స్త్రీలతో పాటు యిక్కడ వాకపల్లి, భల్లుగూడ వంటి చోట్ల ఆదివాసీ బిడ్డలపై ఖాకీలు సాగించిన అత్యాచార పర్వం, హక్కుల హననం, అక్షరాలపైన, మాట్లాడే మాటలపైన రాజ్యం కురిపిస్తున్న విషం, రంగురంగుల సీతాకోక చిలుకల్ని యెగరనియ్యని క్రూరత్వం, రోడ్ల విస్తరణలో సగం తెగిన దేహాల మాదిరి చిద్రమవుతున్న గుడిసె బతుకులు వంటివి యీ లేఖల్లోని ప్రధానాంశాలు.

ప్రేమరాహిత్యానికీ, వంటరితనానికీ గురైన అబ్బాయి అరుణాంక్ తన దుఃఖానికి కారణాలను సహజంగానే యెగుడు దిగుడు సమాజంలో వెదుకుతూ వెళ్తాడు. అరుణాంక్ రెండవ తరానికి చెందిన విద్యావంతుడు, నగర జీవి. తాత మాదిరి మొలకు చీపురూ, మూతికి ముంతా తనకి వేళ్ళాడకపోయినా తనకి తెల్సిన దళిత జీవితాన్ని నిజాయితీగా ఆవిష్కరించాడు. అరుణ్ తండ్రి చదువు కోసం పల్లెని వొదిలి, పట్నంలో వొక స్కూల్ స్థాపించి నడిపినప్పటికీ ‘మాదిగ సారు’ యెందుకయ్యాడు? అని అడుగుతాడు. తన వర్గం మారినా, కులం తాలూకు వెలి మాటల్ని తానుకూడా మొయ్యవల్సి రావడాన్ని ప్రశ్నిస్తాడు. మనిషిని యేకాకిని చేసే ప్రేమరాహిత్యాన్ని, విద్వేషాన్ని, హింసని, వివక్షని ద్వేషంతో కాకుండా తన అక్షరాలనిండా ప్రేమ నింపుకుని తడమడమే అరుణాంక్ ‘ఖ్వాబ్’ ప్రత్యేకత.

అప్పుడప్పుడూ పాబ్లో నెరూడాని, ఫైజ్ నీ, శివసాగర్ నీ, మగ్దూం నీ, కౌముదినీ, కళ్యాణరావునీ పలవరిస్తాడు. తలత్ గానానికి మురిసిపోతాడు, ప్రకృతి సౌందర్యానికి పరవసిస్తాడు. యీ లేఖా రచనలో మంచి భావుకత, సౌందర్యం వుంది. అయితే భాష విషయంలో తను వొకచోట తెలంగాణా మాండలికాన్ని, మరో చోట కోస్తాంధ్ర మాండలికాన్ని రాయడం చూస్తాం.చలం ప్రేమలేఖలల్ని అప్పట్లో దాచుకు దాచుకు చదివేవాళ్ళం… యిప్పుడు అరుణాంక్ ‘ఖ్వాబ్’లేఖలు రాయడం, అందునా ప్రేమని రాయడం మరిచిపోయిన మనందరిలో మళ్ళీ ప్రేమలేఖలు రాయాలనే వుత్సాహాన్ని తట్టిలేపుతుంది. విప్లవం, ప్రేమ రెండూ వేరుకాదనీ, విప్లవం అంటే మనిషితనంపై రాజీలేని ప్రేమ అని గుర్తుచేస్తుంది.

జ‌న‌నం: గుంటూరు జిల్లా ప్యాప‌ర్రు. నాగార్జున విశ్వ‌విద్యాలయంలో బుద్ధిస్ట్ స్ట‌డీస్‌లో అసోసియేట్ ప్రొఫెస‌ర్ గా ప‌నిచేస్తున్నారు. ర‌చ‌న‌లు: అస్తిత్వ గానం, మంకెనపువ్వు(క‌వితా సంక‌ల‌నాలు), 'Caste, Religion and State in Medieval South India', 'Facets of Gender Discrimination and Violence, 'Tribe- Peasant- Elite Dynamics in Medieval Andhra'.

One thought on “ప్రేమ రాహిత్యంలోంచి అవధుల్లేని ప్రేమతో…

Leave a Reply