ప్రజాపోరాటాలే నా రచనలకు ప్రేరణ : అల్లం రాజయ్య (2)

(అతడు తెలుగు కథకు చెమట చిత్తడి పరిమళాన్ని అద్దిన ఎన్నెల పిట్ట. నేల తల్లి కడుపులో కండ్లుపెట్టి చూసే ఆరుద్ర పువ్వు. అతని అక్షరాలు జనాన్ని రగుల్కొల్పే నిప్పు కణికలు. నింగిని, నేలను కలిపే సింగిడి పరవళ్లు. తుడుం మోతల యుద్ధ గీతాలు. వెన్నెల జలపాతాలు. తిరగబడకపోతే బతుకు లేదని చెప్పిన వీరులు చిందిన నెత్తుటి కథలు. అతని మాట మానేరు. మనసు కోనేరు. ధిక్కారమే అతని జీవధాతువు. విప్లవోద్యమం తన అక్షరాలకు కొత్త చూపునిచ్చిందని చెప్పే ఎర్ర జెండా రెపరెపల స్వేచ్ఛా గీతిక అతడు. వసంత మేఘ గర్జనల్లో నిలువెల్లా తడిసి మొలకెత్తిన రగల్ జెండా రెపరెపల సృజనశీలి అతడు. యాభై ఏళ్లుగా మట్టి మనుషుల జీవితాలను, చరిత్రను, పోరాటాల్ని కథలల్లుతున్న మన కాలపు పోరాట సాహిత్య సృజనకారుడు అల్లం రాజయ్యతో ‘కొలిమి’ సంభాషణ…)

(రెండో భాగం…)

‘ఎదురు తిరిగితే’ (మొట్టమొదటి దళిత కథ) కు నేపథ్యం?

పల్లెలో పుట్టినవాళ్లకు గ్రామాల్లో గల భూస్వామిక కుల సంబంధాలు ఎవరు చెప్పకుండానే అర్థమౌతాయి. భూస్వామిక సమాజంలో అగ్రకులాలు రకరకాలుగా శ్రామికులైన దళితులను, ఆశ్రిత కులాలను దోపిడీ చేసి సంపద, భూమి పోగేస్తారు. క్రమంగా సొంతాస్తి యావలో శ్రమతో, ప్రకృతితో, పనితో దూరమౌతారు. గ్రామీణ వ్యవసాయ ఉత్పత్తిలో మాల, మాదిగలు కీలకమైనవారు. వారికి ప్రకృతి గురించి, పంట గురించి, నీటి పారుదల గురించి, పశువుల పెంపకం గురించి అద్భుతమైన అభినివేశం, జ్ఞానం ఉంటాయి. సమాజం పట్ల, మనుషుల పట్ల ప్రేమగా, దయగా ఉంటారు. మాట తీరు, కంఠ స్వరం స్వచ్ఛంగా ఉంటుంది. నా తొలి గురువు మాదిగ గడ్డం రాజాలు. మా పాలేరు. అతను అతని దృష్టికోణం నుండి మా ఊరిని అర్థం చేయించాడు. అతని ద్వారా పల్లెకు ఎడంగా ఉన్న మాదిగ గూడేనికి రాకపోకలు షురువయ్యాయి. అట్లా అప్పటి మాదిగ గూడెంలోని అందరూ నాకు దగ్గరగా తెలిశారు. ఆత్మీయులయ్యారు.

పుస్తకాలు చదివి, రకరకాలుగా ఇంత దోపిడీ, పీడన జరుగుతుంటే వీళ్లంతా తిరగబడకుండా ఎందుకుంటున్నారు? అనేకునేవాన్ని. కానీ నాకర్థమయ్యిందేమంటే మాదిగలు యుద్ధవీరులు. చిన్న చిన్న రాజ్యాలు, జమీందారులు యుద్ధాలు చేస్తే డబ్బు దస్కంతో పాటు స్త్రీలను, పశువులను, యుద్ధవీరులను తెచ్చి వెలివాడలనే కాన్‌సంట్రేషన్‌ క్యాంపుల్లో ఉంచేవారు. మాదిగ మాలలు అలాంటి యుద్ధవీరులు. కులం, బ్రాహ్మణీయ భూస్వామ్యం క్రూరంగా, హింసాత్మకంగా అమలు చేసిన వికృత చర్య. చాలామంది మేధావులు మాయలు చేయడానికి వృత్తులు, కులాలుగా మారాయని సన్నాయి నొక్కు నొక్కుతారు. కావాలని ఎవరూ అంటరాని కులాలను, వృత్తులను ఎంచుకోరు. 1972లో పీవీ నర్సింహారావు పెట్టిన పెద్ద ఎన్నిక సభలో మా వూరి బత్త కొంరయ్య వేలాది మందిలో నిలబడి ‘‘అయ్యా… కరంటు వూళ్లె పెట్టిండ్లు గని మా మాదిగ వాడకు ఒక్క కరంటు బుగ్గ వెట్టలేదు’’ అని నిలదీశాడు.

ఊరికి మాదిగిండ్లకు మధ్యనున్న వ్యత్యాసం నా లోపల గూడు కట్టుకున్నది. బత్త కొంరయ్య బద్ధలయ్యాడు. ‘బద్‌లా’ సంకలనం కోసం కరీంనగర్‌ విజయకుమార్‌ కథ అడుగగానే బత్త కొంరయ్య కథ రాశాను. కనీసం పాత్రల పేర్లు కూడా మార్చకుండా ‘ఎదురు తిరిగితే’ కథ రాశాను. తర్వాత 1977లో ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత అచ్చయ్యింది.

ఇవాళ మనం మాట్లాడుతున్న అంశాలన్నీ, ఆర్థిక, సాంఘిక, రాజకీయ విషయాలన్నీ ఆ కథలో చర్చించాను.

ప్రస్తుతం తెలుగు కథ ఎట్లా ఉన్నది?

తెలుగులో ప్రజా వ్యతిరేకమైన కథలు రాయడానికి సాహసించని వాతావరణం ఉన్నది. అన్ని కులాలకు, రంగాలకు విస్తరించింది. ఒకప్పుడు ఊహాత్మక, కల్పిత, తీరిక వర్గాలకు, కులాలకే పరిమితమైన తెలుగు కథ కీలకమైన ఉత్పత్తి శక్తులతో మమేకమైంది. ఇది గొప్ప పరిణామం. ఇందులో అనేక అస్తిత్వ పాయలున్నాయి. అయితే విమర్శించడానికో, విశ్లేషించడానికో తెలుగు కథలు ఎక్కువగా కేంద్రీకరిస్తున్నారు. కానీ దీన్ని మార్చాలి. మార్పు క్రమానికి చరిత్ర ఉన్నది. మార్పు క్రమం సాహిత్యంలో రావాలి. అంతిమంగా చూస్తే రకరకాల కారణాలతో తెలుగు ప్రజలు అనేక సంఘర్షణల్లో, పోరాటాల్లో ఆరితేరి ఉన్నారు. తెలుగు కథ ప్రజలతో పాటు నడవడానికి ఇంకా వేగం పెంచాలి.

అస్తిత్వ ఉద్యమాల్లో ప్రజల కోపతాపాలు, ఉద్వేగాలు, ఆవేదనలు విస్ఫోటనంగా బయటకొస్తున్నది. ఇది సాహిత్యంలో… ముఖ్యంగా కథల్లో రావడం లేదు. అయితే మూలమేమిటి? వైరుధ్యం ఏమిటి? పరిష్కారానికి ఎత్తుగడలేమిటి? అందుకు తగిన నిర్మాణం, ఎత్తుగడల్లో దళిత, ఆదివాసీ, మహిళా, మత మైనార్టీ నాయకత్వం ముందుకువచ్చి విప్లవోద్యమ శక్తులుగా ఎదిగి వ్యూహంలో భాగంగా ప్రజలకు రాజ్యాధికారం దిశగా పురోగమించాలి. విస్ఫోటనాలకు ప్రతిగా స్పందన ఉన్నట్టు నిర్మాణం ఏర్పడలేదు. ఇది తెలుగు కథ అధిగమించాల్సిన స్థితి.

మనకన్నా ముందుగా కులాన్ని పునాదిగా గుర్తించి పోరాటం చేసిన కన్నడ, తమిళ, మరాఠీ కథలు మనకన్నా కొంత ముందున్నాయి. అయితే ఒక ఉద్యమంగా వంద మంది యువ రచయితలు, రచయిత్రులు ఎక్కువ సంఖ్యలో కథలు రాయడం శ్రామిక కులాల నుండి ఎక్కువ మంది రచయితలు రావడం గొప్ప పరిణామం. వాళ్లు యుద్ధరంగంలో నిలబడ్డారు గనుక యుద్ధంతో పాటు అన్నీ నేర్చుకుంటారు. నాయకత్వం వహిస్తారు. అప్పుడు విప్లవోద్యమ విస్తృతి, వేగం పెరుగుతాయి. ఎత్తుగడల్లో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి.

మార్క్సిజం వెలుగులో అస్తిత్వ ఉద్యమాలను ఎట్లా అర్థం చేసుకోవాలి?

విప్లవోద్యమం అభివృద్ధి నిరోధకమైన సమాజాన్ని పోరాటం ద్వారా ఎప్పుడైతే మార్చాలనుకుంటుందో అలాంటి కార్యకలాపాలు మొదలై ముందుకు సాగినకొద్దీ సమాజంలోని అన్ని రంగాలు, వైరుధ్యాలు కదలబారుతాయి. కరీంనగర్‌, ఆదిలాబాదు రైతాంగ పోరాటాలు, నక్సల్బరీ, శ్రీకాకుళం, అంతకుముందటి తెలంగాణ సాయుధ పోరాట అనుభవాలతో ఆరంభమై నిలదొక్కుకున్నది. గ్రామాల్లో నుండి దొరలను తరిమేసింది. దున్నేవారికి భూమి ప్రాతిపదికన గ్రామీణ ఉత్పత్తి వనరులను ప్రజలకు పంచాల్సి ఉన్నది. దోపిడీ, హింసాత్మక దొరతనం కూలిపోవడంతో విప్లవ శక్తుల నూతన ప్రజాస్వామిక ఉత్పత్తి సంబంధాలు నెలకొల్పవలసి ఉన్నది. కానీ అర్ధ భూస్వామ్య, అర్ధ వలస ప్రభుత్వం భూస్వాముల తరఫున గ్రామాల మీద ఉక్కుపాదం మోపింది. గ్రామాల్లో వర్గ, కుల, మత, లింగ వ్యత్యాసాలను పరిష్కరించాల్సిన, రాజకీయంగా ముందుకు తీసుకుపోవాల్సిన కర్తవ్యం విప్లవోద్యమం మీద పడింది.

గ్రామీణ ప్రాంతంలోని దళిత, బహుజన, మహిళా శక్తులను చైతన్య పరిచి విప్లవోద్యమంలో సమీకరించడం జరిగింది. ఇప్పుడు ఇంకో దశకు పరివర్తన చెందాలి. సరిగ్గా అలాంటి సమయంలోనే తెలుగుదేశం నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తెంగాణను ఆక్రమించి కొత్తగా వలస అధికారాన్ని, ఈ అవకాశాన్ని తీసుకొని తీవ్రతరం చేసి తెలంగాణ గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. నాయకులను ఎన్‌కౌంటర్లు, మిస్సింగుల్లో పెద్ద ఎత్తున ఏరివేతకు పూనుకున్నది. ఈ నిర్బంధ వాతావరణంలో కొత్తగా ఏర్పడిన నాయకులను, లొంగిపోయిన వారిని చేరదీసి నాయకత్వంలోకి తెచ్చింది.

జాతీయ, అంతర్జాతీయంగా జరిగిన పెట్టుబడి, సామ్రాజ్యవాద సంక్షోభంతో ప్రపంచ మార్కెట్టుకు, పెట్టుబడిదారులకు గ్లోబలైజేషన్‌ పేర తలుపులు బార్లా తెరిచింది. ఈ నేపథ్యంలో 1990 తర్వాత అస్తిత్వ ఉద్యమాలు ముందుకు వచ్చి బలపడ్డాయి.

మార్క్సిజం అన్ని రకాల అస్తిత్వ ఉద్యమాలను ప్రజలు ప్రజాస్వామిక ఆకాంక్షలుగా అర్థం చేసుకుంటుంది. అస్తిత్వ ఉద్యమాల ఉద్విగ్నతను, ఆవేదనను ఆత్మీయంగా అర్థం చేసుకుంటుంది. అదే సమయంలో అస్తిత్వ ఉద్యమాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి అందులోని అంతర్గత వైరుధ్యాలను అర్థం చేసుకుంటుంది.

అయితే అస్తిత్వ ఉద్యమాలు స్థల కాలాల్లో తక్షణ డిమాండ్‌నే సాధారణంగా ప్రముఖంగా ముందుకు తెస్తాయి. తగిన నిర్మాణాలు లేక ఒక్కోసారి విస్ఫోటనగా ముందుకు వస్తాయి. అవి అనివార్యంగా తగిన ఎత్తుగడతో పరిష్కరిస్తూనే అలాంటి వైరుధ్యాలకు మూలమైన రాజ్యాధికారాన్ని మార్చడానికి తగిన నిర్మాణంలో ఇలాంటి జాతి, కుల, మత, మహిళా, స్థానిక, ప్రాంతీయ ఉద్యమాలను ఊహాత్మకంగా కార్మిక వర్గ నాయకత్వంలో ప్రజల ప్రమేయంతో అభివృద్ధి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో తగిన సమయంలో కార్మికవర్గ నాయకత్వం వహించజాలకుంటే ఇలాంటి ఉద్యమాలను బూర్జువా నాయకత్వం వహించి తాత్కాలికంగా విజయం పొందుతారు. ప్రత్యేక తెంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని గమనించవచ్చు. అంతేకాకుండా విప్లవ శక్తులను రకరకాలుగా మభ్యపెట్టి, చీలదీసి ప్రజలకు దూరం చేస్తారు. సాంకేతికంగా సాయుధ బలగాలను ఆధునికీకరించి, ప్రజలు సాధించిన విజయాలను నాశనంచేసి, తిరిగి అగ్రకుల భూస్వామ్య ఆధిపత్యాన్ని, దోపిడీని కొత్త పద్ధతిలో స్థిరీకరించుకుంటారు. ఈ అవకాశాన్ని దళారీ బడా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు వాడుకొని తమ పెట్టుబడిని, పట్టును బిగిస్తారు.

దళిత, బహుజన, మహిళా, అస్తిత్వ ఉద్యమాల గురించి మార్క్సిజం చాలా చర్చ చేసింది. ముఖ్యంగా రాజ్యాంగ పరిధిలోనే అస్తిత్వ ఉద్యమాలు లేవనెత్తిన అంశాలు పరిష్కారం కాగలవనే ధోరణి ఆ వ్యూహంలో భాగంగా జరిగే ఎత్తుగడ, పోరాటాలు, దళిత, బహుజన మహిళలను మభ్యపెట్టగలవు. విప్లవోద్యమాలను దాటవేయగవు. ఇలాంటి వైరుధ్యాలకు మూలమైన సమాజాన్ని, దాన్ని నిలబెట్టే రాజ్యాధికారాన్ని మార్చకుండా సాధ్యం కాదు.

మార్క్సిజం, విప్లవోద్యమం ఎదుర్కొంటున్న వైరుధ్యం ఏమంటే పెద్ద ఎత్తున పెల్లుబుకుతున్న రాజ్యాధికారం దిశగా తగిన ఎత్తుగడతో నాయకత్వం వహించి సమీకరించడం. ప్రస్తుత దశలో ఈ వైరుధ్యాన్ని దళారీ ప్రభుత్వం, సామ్రాజ్యవాదం సకల విధాలుగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి ఉద్యమాలను సమీకరించి రాజకీయ ఉద్యమాలుగా అభివృద్ధి చేయడానికి కృషిచేస్తున్నది.

సీపీఎంతో పాటు అన్ని రకాల విప్లవ పార్టీలు భారతీయ సమాజంలో ‘కులం’ పునాదిగా గుర్తించడం ఒక ముందంజ. ఇది అతి పురాతన బ్రాహ్మణీయ భూస్వామ్యానికి, దళారులకు కలవరపాటు. తగిన ఎత్తుగడలు రూపొంది ఆచరణలోకి దిగితే భారత విప్లవోద్యమంలో ప్రతిష్ఠంభన తొలిగి వేగవంతమౌతుంది. అంతిమంగా అస్తిత్వ ఉద్యమాలన్నీ ఉత్పత్తి సంబంధాలను ప్రజాస్వామికీకరించడానికి సంబంధించిన అతి పురాతన పోరాటాలు. అన్ని అస్తిత్వ శక్తులు ఉమ్మడిగా చేయాల్సి రావడం. భారతీయ సమాజంలో అనివార్యంగా ఉత్పత్తి వనరులు, ఉత్పత్తి శక్తుల్లో కదలిక మొదలై ఉత్పత్తి పెంచడానికి దోహదపడింది. కానీ క్రూరమైన బ్రాహ్మణీయ భూస్వామ్యం, వలస పెట్టుబడి మిలాఖతయ్యి అందుకు తగిన ఉత్పత్తి సంబంధాల్లో మార్పును క్రూరంగా అణచివేశారు. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ అందుకు దోహదపడ్డది.

ఉత్పత్తి కులాల్లోకి విప్లవోద్యమం ఎట్లా విస్తరించాలంటరు?

విప్లవోద్యమం ముఖ్యంగా కరీంనగర్‌, ఆదిలాబాదు రైతాంగ పోరాటాలు ఉత్పత్తి కులాల నుండే ఆరంభమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో వంద సంవత్సరాలుగా కొనసాగుతున్న భూస్వామిక దొరల ఉత్పత్తి విధానానికి వ్యతిరేకంగా `దున్నేవారికి భూమి, కూలి రేట్ల పెంపు, ఆశ్రిత కులాల వెట్టి బందు లాంటి అనేక అసమానతలకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటాలు చేసింది. భూస్వామ్య ఉత్పత్తి సంబంధాలను ఎదిరించి మధ్య యుగాల నాటి చీకటి పల్లెల్లో ప్రజాస్వామిక సంబంధాలు నెలకొల్పడానికి రైతుకూలీ సంఘాలు, ప్రజా పంచాయితీలు కృషిచేశాయి. అలాంటి మౌలికమైన అట్టడుగు ఉత్పత్తి కులాలను భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను దొరలను ఎదుర్కొనే, నిలువరించే తాత్విక, భౌతిక పునాది లేక పల్లెల్ని ఖాళీ చేసి పట్నాలు పట్టారు. అలాంటి పల్లెలను విప్లవ శక్తులు చుట్టుముడితే ఢిల్లీ అర్ధ వలస అర్ధ భూస్వామిక అధికారం కదులుతుందని నేరుగా ఒక్క తెలంగాణలోనే కాదు… బీహార్‌, దండకారణ్యం దాకా ఉక్కుపాదం మోపుతున్నారు. దాదాపు ముప్ఫై వేల మంది విప్లవకారులను చంపారు. మరోపక్క గ్రామ సీమల్లో సామ్రాజ్యవాద చెత్త సరుకు నింపి రకరకాల మాయోపాయాలతో ప్రజలను చీలదీస్తున్నారు.

అయితే విప్లవోద్యమాలు తొలి రోజుల్లో తమ ఎత్తుగడల్లో ‘కులం’ పునాదిగా గుర్తించలేదు. దాని వలన మైదాన ప్రాంతాల్లో ఆలస్యం జరిగి ఉన్నత రూపమైన గ్రామరాజ్య కమిటీల నిర్మాణం అనుకున్నట్టు సాగలేదు. 90 శాతం భూమిలేని దళితులు నాయకత్వ స్థానంలోకి తగినంతగా రాలేదు. ప్రభుత్వ దమనకాండ, ఏరివేత ప్రభుత్వాలకు ప్రాతిపదికనే చేశాయి. కిందిస్థాయి దళిత కులాల కార్యకర్తలు ఎక్కువగా చంపబడ్డారు. ఎక్కువ భాగం ఉత్పత్తి కులాలే అయినా బహుజనులు దొరలు ఖాళీచేసిన గ్రామాల్లో నాయకత్వంలోకి వచ్చారు. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కులానికి కులానికి మధ్య ఏర్పడ్డ వైరుధ్యం` ఘర్షణ సమీప కులాలు, ఉప కులాల మధ్య ఐక్యత సాధించడానికి సంబంధించిన పోరాటాలు రాజకీయ చైతన్యం ఏర్పాటులో అతివాదానికి, ఆర్థిక వాదానికి లోనైనట్టు విప్లవోద్యమం తన నివేదికల్లో పేర్కొన్నది.

ఈ సందర్భంలోనే 1999 డిసెంబర్‌లో నాయకత్వాన్ని(నల్లా ఆదిరెడ్డి, సంతోష్‌రెడ్డి, శీలం నరేష్‌)చంపడం ద్వారా ప్రభుత్వానిది పై చెయ్యి అయింది. విప్లవోద్యమం తమ శ్రేణుల్ని సమీకరించి పుంజుకోవడానికి ఆలస్యం జరిగింది. విప్లవోద్యమాలు సమీక్ష చేసుకున్న విషయాలు జనతన రాజ్యం పుస్తకంలో నమోదయ్యాయి.

ప్రజలు ఆ భీతావహ వాతావరణంలోనే ప్రత్యేక రాష్ట్రసాధన ఉద్యమంలో పెద్ద ఎత్తున కదిలారు. ప్రతిష్టంభన తొలగడానికి తగిన నిర్మాణమే అవసరం. నాకు తెలిసి తెలంగాణలో బీహార్ ప్రజలు లోతైన పోరాట అనుభవం కలిగినవారు. వారు తగిన నిర్మాణాలు రూపొందించుకొని ఎప్పటిలాగే విప్లవోద్యమంలో తమ వంతు కర్తవ్యాన్ని కొనసాగిస్తారని రాష్ట్ర, కేంద్ర, సామ్రాజ్యవాద ప్రభుత్వాలు గుర్తించాయి. అందుకే ఒకపక్క సమస్తం దోస్తూ మరో పక్క లబ్ధిదారులను చేస్తున్నారు.

ఒక్క నెల రోజులు విప్లవ ప్రజానీకం మీద అన్ని రకాల నిర్భంధాలు, నిషేధాలు ఎత్తివేసి చూడగలరా? లక్షలాది మంది తమ నెత్తురు పీల్చి నిర్మించుకున్న మాయ మహా నగరాలను చుట్టుముట్టరా? ఎవరి మార్గాలు, తయారీలు వారికుంటాయి. దీర్ఘకాలం బ్రాహ్మణీయ కరుడుగట్టిన భూస్వామ్యంలో మగ్గిన భారతదేశంలో సుదీర్ఘ కాలంగా ఉత్పత్తి కులాలైన దళితులు, ఆదివాసీలు, మహిళలు పోరాడుతూనే ఉన్నారు. అలాంటి పోరాటాలు గతితార్కిక పోరాటాల చరిత్ర నిర్మించబడలేదు కనుకనే అనేక సందేహాలు. నికృష్టమైన అతి పురాతన అభివృద్ధి నిరోధకమైన బ్రాహ్మణీయ వ్యవస్థను ప్రజలు ఎంతో కాలం భరించజారు. సామ్రాజ్యవాదులు సంతగా మార్చిన దళారులను తుదముట్టించగరు.

తెలుగు నేలపై విప్లవోద్యమ సాహిత్య ప్రభావమేమి?

పురాణాలకు, కట్టుకథకు ఫ్యూడల్‌ కంపు గొట్టే మానవ సంబంధాలకు, అంతిమంగా హేతువిరుద్ధమైన భావవాద సాహిత్యం స్థానంలో శాస్త్రీయ వివేచనను విప్లవ సాహిత్యోద్యమం ప్రవేశపెట్టింది. సమాజంలో కూలిపోవాల్సిన దాన్ని, నశించవల్సిందాన్ని పసిగట్టి రూపొందుతున్నదాన్ని వెలికితీసింది. సమాజంలోని వైరుధ్యాలను, వాటి గతి క్రమాన్ని అది మార్చడానికి జరిగిన పోరాటాలను ఎప్పటికప్పుడు చిత్రించింది. శ్రామిక జనం దగ్గరికి, ఉత్పత్తి కులాల దగ్గరికి వెళ్లి వాళ్ల నుండి నేర్చుకొని ప్రగతిశీలమైన దాన్ని వారికి అందించింది. ఇవాళ ప్రజా వ్యతిరేకమైన సాహిత్యం రాయడానికి సాహసించనంత విప్లవోద్యమ సాహిత్యం తెలుగు సాహిత్యంలో గుణాత్మకమైన మార్పు తెచ్చింది.

వస్తువులో ఉత్పత్తి శక్తులు శిల్పంలో తరతరాలుగా ప్రజలు అభివృద్ధి చేసుకున్న తమవైన కళారూపాలను స్వీకరించింది. భాషలో పండిత భాష నుండి ప్రలజ భాషను అన్ని రంగాల్లో తీసుకవచ్చింది. పాట, ఆట, కవిత్వం, కథ, నవల, ఉపన్యాసం, నాటకం, బ్యాలే, విమర్శ, అనేక సంగీత వాద్యాల మేళవింపు, ఆహార్యం… అన్ని రంగాల్లో ముఖ్యంగా భావజాల రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. కుల, మత, పితృస్వామిక, వర్గ వ్యత్యాసాలతో సాగిన సాహిత్యంలో ప్రజాస్వామిక, శాస్త్రీయ దృక్పథాన్ని తీసుకవచ్చింది.

పత్రికలు, ప్రసార మాధ్యమాలు, సినిమాలు అనివార్యంగా విప్లవ సాహిత్యోద్యమం తెచ్చిన మార్పును అంగీకరించక తప్పనిసరి పరిస్థితి. కళా, సాహిత్య రంగాల్లో విప్లవ సాహిత్య ప్రభావం లేని రచయితలు అరుదు. అనేక పాయలుగా ప్రాంతీయ, దళిత, బహుజన, మహిళ, మత మైనార్టీ ప్రజలు లోలోపలి వైఫల్యాలను, దు:ఖాలను, పోరాటాలను వెలికి తీసింది.

భారతదేశ ఆర్థిక, సాంఘిక, రాజకీయ, తాత్విక రంగాల్లోని డొల్లతనాన్ని, అభివృద్ధి నిరోధకత్వాన్ని, దోపిడీ, హింసను ముఖ్యంగా బ్రాహ్మణీయ కట్టుకథ, పురాణాల సుదీర్ఘ కాలపు కల్పిత గాథ నుండి విముక్తి చేసి తలకిందుల సాహిత్యాన్ని సీదా నిబెట్టింది.

విప్లవ కథలో వస్తు రూప వైవిధ్యం గురించి చెప్పండి.

విప్లవ కథలో ఎక్కువ భాగం కట్టు కథలు కావు. పుట్టు కథలు. వైయక్తిక అనుబంధ పరిధి లాంటిది. సమిష్టి జీవితపు చలన స్థితులను చిత్రించినవి. విప్లవోద్యమం యాభై ఏండ్లుగా మూడు తరాలుగా అనేక దశల గుండా ప్రయాణం చేసింది. ప్రపంచ విప్లవాలు విఫలమైన నేపథ్యంలో భారతదేశంలో కుల, వర్గ సంక్లిష్ట సామాజిక ఆవరణలో విప్లవోద్యమం అనేక ప్రయోగాలు చేసింది.

ఈ విప్లవానుభవం నేపథ్యంలో విప్లవ కథలో వైవిధ్యం, ప్రయోగం, వ్యక్తీకరణల్లో, అన్వేషణలో కొత్త మార్గం అనుసరించాయి. విప్లవ కథలు రాసిన చాలా మంది రచయితలు భూషణం నుండి నేటి దాకా ప్రత్యక్ష, పరోక్ష ఈ విప్లవాచరణలో తమ కాలపు ప్రజందరి లాగే భాగస్వాములయ్యారు. ‘అడివంటుకున్నది’, ‘పులుసు’ నుండి ‘ఇద్దరు శస్త్రకారుల’ దాకా వందల కథలు వచ్చాయి. సుమారు వెయ్యికి పైనే వచ్చి ఉంటాయి. ఒకప్పుడు దైనందిన పోరాటాలు, అందులో కలసివస్తున్న శక్తుల పోరాట నిర్మాణం గురించి ప్రచారం చేయడానికి ‘సంఘం’లాంటి కథలు వచ్చాయి. వాటిని సంఘటితం చేయడానికి, ఉన్నత రూపంలోకి తీసుకుపోవడానికి ‘సృష్టికర్తలు’, ‘సత్యం’ లాంటి కథలు వచ్చాయి. భారతీయ సమాజపు ఉత్పత్తి సంక్లిష్ట స్వభావం, దాని వల్ల వర్గాలు, కులాల నేపథ్యంలో మనుషులు, సమాజం తీరుతెన్నులు అనగా… భారతీయ సమాజపు విధ్వంసకర హేతు విరుద్ధం, భావ వాద, బ్రాహ్మణీయ తాత్వికతను అధ్యయనం చేయడంలో భాగంగా ‘మహాదేవుని కల’, ‘మధ్యవర్తులు’, ‘మనిషి లోపలి విధ్వంసం’, ‘కమల’, ‘ప్రత్యర్థులు’, ‘అతడు’ లాంటి కథలు వచ్చాయి.

పోరాటాలు కార్మిక రంగంలోకి విస్తరించడంలో సింగరేణి నేపథ్యంలో ‘బొగ్గు పొరల్లో’, ‘సమ్మె’ లాంటి కథలు వచ్చాయి. ఆదివాసీ ప్రాంతాలకు పోరాటాలు విస్తరించడంలో ‘తుడుం’, ‘రక్త పింజర’, ‘మరట్‌ తుడుం’, ‘పాయానా’ లాంటి ఎన్నో కథలు వచ్చాయి. ఒకే కథలో పొరలు పొరలుగా అనేక వైరుధ్యాల చలనం చిత్రించడం చాలా కథల్లో చూస్తాం. ‘చావు విందు’, ‘పని పిల్ల’ లాంటి అనేక కథలు. విప్లవ కథలు తడిమిన, చిత్రించిన వస్తువు ఇంతకుముందు సాహిత్యంలో లేదు. విప్లవోద్యమాలతో పాటే సాహిత్యం అన్ని మలుపులు చిత్రించడం వైవిధ్యం.

మీరు తెలంగాణాలో విప్లవోద్యమం ఉన్నంత కాలమే కథలు రాసి, తర్వాత ఆగిపోయారనే విమర్శపై మీ కామెంట్?

నిజమే. నేను ముందే చెప్పినట్లుగా సమాజాన్ని విశ్లేషించడానికో, విమర్శించడానికో రాయలేదు. వృత్తి రీత్యా రచయితను కాదు. విప్లవోద్యమాల నేపథ్యంలో అనివార్యంగా రాయాల్సి వచ్చింది. విప్లవోద్యమం తీసుకొచ్చిన మార్పుల క్రమాన్ని నా శక్తి మేరకు రాయడానికి ప్రయత్నం చేశాను. ‘ప్రేరకాలు’ 2000నాటికి ఆఖరు కథ. 2015 దాకా కథలు, నవలలు రాయలేదు.

విప్లవోద్యమాలల్లో జరిగిన ఒడిదుడుకులన్నీ నా వ్యక్తిగత జీవితంలో సంభవించాయి. అయితే ఈ కాలంలో ఎక్కువగా తిరిగాను. ఎక్కువగా చదివాను. ఊపిరి సలపనివ్వని విషాధాలు చూశాను. ఈ కాలంలో నా సహచరులు చాలామంది చనిపోయారు. మా అబ్బాయి కిరణ్ చనిపోయాడు. ఉద్యోగంలో, వ్యక్తిగత జీవితంలో నిలబడడానికి ఊపిరి తీసుకోవడానికి కష్టమైన రోజులు. అన్నింటికన్నా ముఖ్యంగా చాలా వరకు నేను రాసిన సాహిత్యమంతా ప్రజల నేపథ్యంలో రాసిందే. కానీ, ఈ కాలంలో జరిగిన నిర్మాణం, అందులో పాల్గొన్న విప్లవకారుల గురించి ఇదివరకు శకలాలు శకలాలుగా మాత్రమే రాశాను. సమగ్రంగా రాయాలనుకున్నాను. దీర్ఘ కాలిక అనుభవంలో జరిగే మహోధృతంగా సాగిన విప్లవోద్యమ ఉద్విగ్న స్థితులను సమన్వయం చేసుకొని చిత్రించడానికి దాదాపు 15 సంవత్సరాల కాలం పట్టింది. ఒక నవల రాయడానికి ప్రయత్నంలో కథలు రాయలేదు. నవలకు సంబంధించిన సమాచారం కోసం తిరగడం, అధ్యయనం చేయడం జరిగింది. కానీ, ఇంకా మొదలు పెట్టలేదు. కథలు రాస్తే నవల ప్రయత్నం పలుచన కాగలదని రాయలేదు. పైగా విస్తరించిన విప్లవోద్యమంలో చాలా మంది రచయితలు రాస్తున్నారు.

ఇదే కాలంలో స్వయంగా కథలు రాయడం కన్నా… విప్లవోద్యమం, సాహిత్యోద్యమం ముందుకు సాగడానికి కొంత వెసులుబాటు కూడా దొరికింది కనుక అనేక వర్కు షాపులు పెట్టాం. విరసం బయట ఉన్న రచయితలందర్నీ ప్రత్యక్షంగా కలిశాం. అనేక పుస్తకాలు ప్రచురించాం. నేను స్వయంగా అనేక పుస్తకాలు ఏర్చి కూర్చాను. ఒకప్పుడు పది మంది లోపు రచయితలు మాత్రమే ఉంటే వందల సంఖ్యలో రచయితలు రాయడం ఆరంభించారు. అవన్నీ నా లాంటి రచయితలు రాసిన విప్లవోద్యమ కథలే.

అవసరమైన సందర్భంలో అనేక సమీక్షలు, ముందు మాటలు, ఇంటర్వ్యూలు, వ్యాసాలు, అనువాదాలు ఇట్లా ఎప్పట్లాగే సాహిత్యంతో, రచయితలతో ఉన్నాను. పైగా తెలంగాణాలో విప్లవోద్యమం తెచ్చిన గుణాత్మక మలుపులు, మార్పులు రాశాను. 2000నాటి స్థితిలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సాగింది. అలాంటి కథలు నా కన్నా ఎక్కువగా చాలామంది రాశారు. గ్రామరాజ్య కమిటీల ఏర్పాటు దగ్గర నుండి మొదలు కావాలి. నూతన ప్రజాస్వామిక ఉత్పత్తి సంబంధాల ప్రాథమిక ఆచరణకు సంబంధించిన నిర్మాణం మొదలు కావాలి. అది పూర్తిగా నిర్బంధం ఆవరించి ఉన్న నేపథ్యంలో. ఈ తయారీలో ఇంత కాలం గడిచింది.

2015 నుండి మళ్లీ రాయడం ఆరంభించాను. ‘టైగర్ జోన్’ నవల, ‘వెలుతురు నది’, ‘రియల్ స్టేట్’, ‘చూపు’ లాంటి కథలు రాశాను.

విప్లవ రచయితలు భావజాల వ్యాప్తిలో ఎట్లా పనిచేస్తే ప్రజలకు దగ్గరవుతారు?

విప్లవానికి సంబంధించి భావజాల వ్యాప్తి, విప్లవోద్యమం విడివిడిగా ఉండవు. జ్ఞానం, ఆచరణ విడివిడి అంశాలు కాదు. విప్లవోద్యమం ఏ నిర్మాణాల ద్వారా ప్రజలల్లో స్థల కాలాల్లో ఎప్పటికప్పుడు ఎత్తుగడలు మార్చుకుంటూ వ్యూహం అయిన కార్మిక, కర్షక రాజ్యాధికారం సాధించే దిశలో అన్ని కార్యకలాపాలుంటాయి. ప్రజలను నడిపే పార్టీ – ప్రజా సైన్యం – ఐక్య సంఘటన విప్లవోద్యమాలకు కీలకమైనవని విప్లవోద్యమాలు భావిస్తాయి. ఈ మొత్తం కార్యకలాపాల్లో భౌతిక, భౌద్ధిక స్థితులను తగిన భావోద్వేగాలతో తగిన రూపాల్లో చిత్రించినపుడే విప్లవ రచనలు ప్రజలకు దగ్గరవుతాయి. ప్రజలకు వెనుకనో, ముందో నడిచే విప్లవోద్యమాలు, సాహిత్యం ప్రజలు స్వీకరించరు. విప్లవోద్యమాలకు ఏ గతి తార్కిక చలన సూత్రాలు వర్తిస్తాయో విప్లవ రచయితలకూ అలాంటివే వర్తిస్తాయి.

విప్లవ కథ సౌందర్యాన్ని, సామాజికతలను ఎట్లా అర్థం చేసుకోవాలి?

విప్లవోద్యమం నడుస్తున్న, నడిచిన స్థల కాలాల నేపథ్యంలో గతి తార్కికంగా అర్థం చేసుకోవాలి. విప్లవోద్యమాలు తలపడిన, పరిష్కరించిన వైరుధ్యాల నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. లుంగలు చుట్టుకపోయిన సమాజాన్ని, మృతప్రాయమైన సమాజాన్ని, అదనపు విలువను దోపిడీ చేసి పోగేసి బలిసి, కుళ్లిపోయిన సమాజాన్ని నిర్మూలించి దాని స్థానంలో మానవుని సకల ఇంద్రియాలు సహజంగా పనిచేసే – మనిషి వేరొక మనిషి దోపిడీ చేయని మహాద్భుతమైన సమాజాన్ని నిర్మించడమే కదా విప్లవ లక్ష్యం. ఈ నిర్మాణ కళ వ్యవసాయం కన్నా, పారిశ్రామిక ఉత్పత్తి కన్నాకళాత్మకమైంది. సకల ఉత్పత్తి ప్రక్రియల సృజనాత్మక మేళవింపు. వ్యక్తీకరణ. సకల ఉత్పత్తి సారాంశం తెలిసి, నియంత్రించి – మనిషి కోసం, మనుగడ కోసం ఉత్పత్తిగా పునర్నిర్మించే సృజనాత్మక కళ.

అందుకే ఈ లక్ష్యాన్ని నిర్ధేశించిన, రూపు కట్టిన కమ్యూనిస్టు ప్రణాళిక గొప్ప సౌందర్యాత్మకత సామాజిక కావ్యంగా అది మానవాళి కలలు సాకారం చేసే కళగా ఎంచుతారు. ప్రపంచ సృష్టికర్తల దగా పడిన కలలకు రెక్కలు తొడిగింది. ఊపిరిలూదింది.

విప్లవ కథ వికాసం ఎట్లా జరిగింది?

సౌలభ్యం కోసం కాలక్రమంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.

శ్రీకాకుళ పోరాటం (1967–70):
సమాజంలోని వైరుధ్యాలు, వాటి పరిష్కారం కోసం ఆరంభమైన విప్లవ పోరాటాలు, ఆచరణ, స్థల కాలాల నేపథ్యంలో తగిన భావోద్వేగాలతో సృజనాత్మకంగా చిత్రించాలనే లక్ష్యంతో శ్రీకాకుళ విప్లవోద్యమంతో పాటు తెలుగులో విప్లవ కథ ఆరంభమయింది. పీడిత ప్రజలు, పోరాడే ప్రజలు వస్తువు, శిల్పం, భాష తీసుకోవాల్సి వచ్చింది. అంతవరదాకా కల్పిత, ఊహాత్మక, భావ ధోరణుల సాహిత్యానికి భిన్నంగా విప్లవాచరణ నుంచి ఒక పరంపరగా భూషణం కథలు ‘తీర్పు’, ‘అడివంటుకున్నది’, ‘పులుసు’, ‘ఇదే దారి’, ‘ఉద్దరింపు’ లాంటి కథలు రాశారు.
(ఇటీవల అరుణతారకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలు)

ప్రజా పోరాటాల సమీక్ష సమన్వయం (1971-1976) :
విప్లవ కథ గిరిజన ప్రాంతాల నేపథ్యమే కాక, మిగతా రైతాంగ, కార్మిక ప్రాంతాలకు విస్తరించడానికి దారులు వెతుక్కున్న కాలం అది. దేశంలో అత్యయిక పరిస్థితి, తీవ్ర నిర్బంధం సుమారు పదహారు వేల మందిని ఊచకోత కోసి, ముప్పై వేల మందిని నిర్బంధించడం జరిగింది. విప్లవ పార్టీల్లో చీలికలు, పాత కొత్త సమాజాల మధ్య తీవ్ర ఘర్షణ ఎదుర్కున్న కాలం. అప్పుడే రివిజనిజం నుండి బయట పడటం వలన, నాయకత్వం ఇంకా కింది కులాల నుండి ముఖ్యంగా గ్రామీణ రైతాంగం, ఆదివాసీ, కార్మికవర్గ పోరాటాల నుండి ఎదుగనందు వలన, పై నుండి ఉద్యమాలకు అగ్రకుల నాయకత్వమే రూపకల్పన చేసే స్థితి ఉన్నందు వలన, మొత్తంగానే దీర్ఘకాలిక విప్లవంలో ప్రజా పంథాపట్ల స్పష్టత లేనందు వలన అతివాద, దుందుడుకు, భావవాద, హింసాత్మక లక్షణాలతో ఈ దశలో ఉద్యమాలు కొనసాగాయి.

విప్లవ కథలు సారంలో రూపంలో, భాషలో ప్రజా పంథా లక్షణాలు సంతరించుకోలేకపోయాయి. ప్రజాపంథాలో నిర్మాణం కాని కోపోద్రిక్తత దారులు వెతుకుతున్న కాలం అది. నిషేధానికి గురైన ‘బయ్’, ‘ఇప్పుడు వీస్తున్న గాలి’ కథా సంకలనాలు, ‘న్యాయం’, ‘ఎర్రబుట్ట’, ‘బ్లాక్ అండ్ వైట్’, ‘కుట్ర’, ‘చావు’, ‘వీరుడు’, ‘శాంతి’, ‘శోకు పిల్లి’, ‘శివసత్తి శక్తి’, ‘ఎదురు తిరిగితే’ లాంటి అనేక కథలు ఈ కాలంలో వచ్చాయి.

ప్రజాపంథాలో కరీంనగర్, ఆదిలాబాదు రైతాంగ పోరాటాల ఆరంభం -విస్తరణ(1977-83):
కొందరు వీరులే చరిత్ర నిర్మాతలు కాదు. భూస్వామ్య దోపిడి ప్రత్యక్షంగా గురయ్యే వ్యవసాయ కూలీలు, పేద రైతులు వ్యవసాయ విప్లవంలో చోదకశక్తులు అనే అవగాహనతో సీవోసీ (విప్లవకారుల సమైక్యతా కేంద్రం) మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీ నాయకత్వంలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో రైతుకూలీ సంఘాల నేతృత్వంలో పెద్ద ఎత్తున రైతాంగ పోరాటాలు ఉవ్వెత్తున లేచాయి. దున్నేవానికి భూమి నినాదంతో శిఖం, అటవీ, బంజరు, ప్రభుత్వ భూములు, అక్రమంగా దొరలు ఆక్రమించిన భూములు ప్రజలు అక్రమించుకున్నారు. పాలేర్ల జీతాలు, కూలిరేట్ల పెంపు, ఆశ్రిత కులాల వెట్టి పనుల రద్దు, ప్రజా పంచాయితులు రంగం మీదికి వచ్చాయి. సమ్మెల నుంచి దొరల సాంఘిక బహిష్కరణ దాకా అనేక పోరాటాల తరువాత దొరలు పల్లెల నుండి పట్నాలకు పారిపోయారు.

ఈ పోరాట గ్రామీణ ప్రాంతాలు ఆవరించి ఉన్న సింగరేణిలో రైతాంగ పోరాటాల స్ఫూర్తితో పెద్ద ఎత్తున కార్మిక పోరాటాలు గనుల ప్రాంతంలోని అన్ని రకాల దోపిడీకి వ్యతిరేకంగా చెలరేగాయి. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లోకి పోరాటాలు వ్యూహాత్మకంగా విస్తరించాయి. ఈ విధంగా మైదాన రైతాంగ, కార్మిక, అడవిలో ఆదివాసీ పోరాటాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పోరాటాల్లో పాల్గొన్నారు.

సెప్టెంబర్ 8, 1978 ‘జగిత్యాల జైత్రయాత్ర’, ఏప్రిల్ 22, 1980 భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) ‘పీపుల్స్ వార్’ ఏర్పాటు, ఏప్రిల్ 20, 1981 ఇంద్రవెల్లి ఆదివాసీల మీద కాల్పుల్లో పదిహేను మంది చనిపోవడం, మూడువందల మంది గాయపడడం, బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు వ్యతిరేకంగా సింగరేణి బొగ్గుగని కార్మికుల చారిత్రాత్మక 56 రోజుల సమ్మె (18-4-1981 నుంచి 12-6-1981 దాకా)లాంటి ఘటనలు దేశవ్యాపితంగా ప్రభావం చూపాయి. విప్లవ పోరాటాలు సంవత్సరాల నిలదొక్కుకోవడం, కొత్త ప్రాంతాలకు విస్తరించడం భారత విప్లవోద్యమంలో కొత్త అధ్యాయం. ఈ కాలంలో కథా సాహిత్యం ప్రజా పోరాటాల నేపథ్యంలో అనేక మలుపులు తిరిగింది. స్థల కాలాలు భావ, భౌతిక స్థితుల సంఘర్షణను విరివిగా చిత్రించాయి.

ప్రపంచ పోరాటాలల్లో విప్లవ కథా సాహిత్యం ఆయా పోరాటాలు కొత్త రూపంలోకి మారినప్పుడో, చల్లారినప్పుడో వచ్చాయి. కానీ తెలుగులో ఈ కాలమంతా విప్లవ పోరాటంలో భాగంగా పోరాటాలతో పాటే విప్లవకారులు కథలు రాసారు. వస్తువుతో పాటు శిల్పం, భాష, ఉత్పత్తి సంబంధాల నేపథ్యంలో అధ్యయనం చేయడం ఈ కాలంలో కథ సాధించిన పరిణతి. ‘సంఘం’, ‘కుంపటి’, ‘ఎత్తుండ్లి పిడికిళ్లు’, ‘సృష్టికర్తలు’, ‘గంగజిమ్మ’, ‘భూమి’, ‘మార్పు’, ‘సత్యం’, ‘దొంగ గొడ్డుకు లొటారం’, ‘గంగా జలం’ లాంటి చాలా కథలు గ్రామీణ నేపథ్యంలో వచ్చాయి. ‘బొగ్గులు’, ‘రాజీ’, ‘నీళ్ళ తగువు’, ‘బొగ్గు పొరల్లో’, ‘లీడర్’.. కార్మిక నేపథ్యంలో వచ్చాయి. ‘రక్తపింజెర’, ‘అనామతు ఖాతా’, ‘నీతి కథ కన్నీటి కథ’, ‘తుడుం’, ‘సెంట్రీ’ ఆదివాసీల నేపథ్యంలో వచ్చాయి. ‘సృజన’, ‘నూతన’, ‘అరుణతార’ పత్రికల నిండా ఈ కథలే. ఇలాంటి వందలాది కథలతో ‘నాగేటి చాళ్ళలో’, ‘భూమి’, ‘సృష్టికర్తలు’, ‘బొగ్గు పొరల్లో’, ‘అడవిలో వెన్నెల’ లాంటి అనేక సంకలనాలు వెలువడ్డాయి. కరీంనగర్ బుక్ ట్రస్టు, అబంపి, సృజన, యుగ, పీస్ బుక్ సెంటర్ లాంటి ప్రచురణ సంస్థలు ఇలాంటి కథలను ప్రచురించాయి.

నిర్బంధం విస్తరణ (1984-89):
ఈ కాలంలో ఆట, పాట, మాట బందు చేసి ప్రభుత్వం ఫాసిస్టు నిర్బంధకాండ అమలు చేసింది. చిత్రహింసలు, కార్యకర్తలను మాయం చేయడం, ప్రజల ఇండ్లు, ఆస్తుల లూటీలు, గృహ దహనం, ప్రజల ఆస్తుల ధ్వంసం, ఎన్కౌంటర్ హత్యల్లాంటి అనేక అకృత్యాలు రాజ్యం చేస్తూ ప్రైవేటు గూండా గ్యాంగులను రాజ్యమే తయారు చేసి ప్రజాస్వామిక వాదులను చంపించడం మొదలు పెట్టింది. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలల్లో ఇంత తీవ్ర నిర్బంధంలో కూడా పోరాటాలు కదంతొక్కాయి.

పోరాట ప్రాంతాల నుండి వందలాది కార్యకర్తలు నల్లమల ఆరణ్యంలో, దండకారణ్యంలోకి, ఇతర రాష్ట్రాలకు విస్తరించిన దాదాపుగా పాత తరపు నాయకత్వం పోరాటాలకు నాయకత్వం వహించలేక ఆగిపోతే పోరాటంలో రాటుదేలిన కార్యకర్తలు నాయకత్వంలోకి వచ్చారు. ఇది ఒక గొప్ప మలుపు. ‘రగల్ రాఱం మైసీవాకట్’, ‘ఆకలి మంటలు’, ‘రాజన్న మార్గం’, ‘కావలసినవారు’, ‘మేము అజేయులం’, ‘తల్లిచేప’, ‘మనిషి లోపలి విధ్వంసం’, ‘ఇంధనం’, ‘నెలవు’, ‘చావు విందు’, ‘జాడ’, ‘పనిపిల్ల’, ‘బొగ్గు దొంగ’, ‘సమ్మె’, ‘పద్మ’… ఇలా వందలాది కథలు ఈ కాలంలో ఈ నేపథ్యంలో వచ్చాయి. భారతదేశంలోని సంక్లిష్ట ఉత్పత్తి సంబంధాలను, మానవ సంబంధాలను పోరాట నేపథ్యంలో పొరలు పొరలుగా, లోతుగా అత్యంత నేర్పుతో కథలోని అంగాలను కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయిలో చిత్రించే నేర్పు కనిపిస్తుంది. లాటిన్ అమెరిన్ కథలతో పోల్చదగిన కథలు ఈ కాలంలో వచ్చాయి.

ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం, విప్లవశక్తుల ఏకీకరణ, మావోయిస్టు పార్టీ ఏర్పాటు (1990-2004):
రైతాంగ పోరాటాలను ఉన్నత రూపంలోకి తీసుకపోయే లక్ష్యంతో తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలల్లో ప్రజారాజ్యం కమిటీలు ఏర్పాటు జరిగింది. దండకారణ్యంలో 2000 సంవత్సరంలో ‘ప్రజా విముక్తి సైన్యం’ ఏర్పడింది. భిన్న జాతులు, ప్రాంతాలు గల భారతదేశంలో ప్రజా పోరాటాలు భిన్నంగా ఉంటాయి. అనే అవగాహనతో సుమారు ముప్పయ్యేడు సంవత్సరాల సుదీర్ఘ విప్లవానుభవంతో బూటకపు ఎన్నికలను బహిష్కరించే విప్లవ పార్టీల కలయికతో 2004 నాటికి దేశంలో అతి పెద్ద పార్టీగా ‘మావోయిస్టు పార్టీ’ ఏర్పడింది. నిర్మాణం, పోరాటం ఏకకాలంలో చేయాలనే లక్ష్యంతో దండకారణ్యంలో ‘జనతన రాజ్య నిర్మాణం’ జరిగింది.

పోరాట ప్రాంతంలో తలెత్తిన అన్ని రకాల భౌతిక, తాత్విక వైరుధ్యాలను చిత్రిస్తూ వందలాది కథలు వచ్చాయి. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర నుంచి విప్లవోద్యమ నేపథ్యంలో అనేక కథలు వచ్చాయి. వీటిలో కొన్ని ‘ఒక తండ్రి’, ‘ప్రత్యర్థులు’, ‘అతడు’, ‘భూ నిర్వాసితులు’, ‘గీతలకావల’, ‘మెట్ల మీద’, ‘తాయమ్మ’ మొదలైనవి.

పోరాట ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణలో ప్రజారాజ్య కమిటీలు అతివాద, ఆర్థికవాద ధోరణులతో పాటు మంద్రస్థాయి యుద్ధంలో భాగంగా స్థానిక జాతీయ అంతర్జాతీయ దోపిడీ ప్రభుత్వం ఏకమై ఒక పక్క సంస్కరణలు, మరో పక్క చుట్టుముట్టి అణచివేతలాంటి తీవ్ర నిర్బంధం అనే ద్విముఖ వ్యూహం వలన, ఒకేసారి నల్లా ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి, శీలం నరేశ్ లాంటి అగ్ర నాయకత్వాన్ని కోల్పోవడంతో ప్రజా పోరాటాలు ప్రతిష్ఠంభనకు లోనయ్యాయి. శత్రువు వ్యూహాన్ని గుర్తుపట్టి తగిన ఎత్తుగడలు రూపొందించుకోవడంలో ఆలస్యం జరిగింది.

అగ్ర నాయకత్వాన్ని రాజ్యం కుట్రపూరితంగా చంపటం వలన ఉద్యమంలో ప్రతిష్టంభన ఏర్పడింది. పోరాట ప్రాంతాలు తాత్కాలికంగా ఖాళీ చేయాల్సి వచ్చింది. తీవ్రమైన శత్రు నిర్బంధంలో ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధన ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదే కాలంలో మహిళ, దళిత, బహుజన, ప్రాంతీయ ముస్లిం లాంటి అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్నాయి. విప్లవోద్యమం, విప్లవకథ ఇలాంటి అస్తిత్వ ఉద్యమాలతో మమేకమై భారతీయ బ్రాహ్మణీయ, అర్ధ భూస్వామ్య, అర్ధ వలస వ్యవస్థ వైరుధ్యాల సారాంశాన్ని అర్థం చేసుకొని విప్లవోద్యమాన్నిమలుచుకోవడానికి కృషి చేస్తోంది.

అనేక సమూహాలుగా ఉన్న ప్రజా రాశుల కోసం తుడుం దెబ్బలాంటి లాంటి ప్రజా సంఘాలు ఎప్పటికప్పుడు ప్రజలు ఏర్పాటు చేసుకొని పోరాడుతున్నారు. తమ ఉనికిని తెలుపుతూ ఈ నేపథ్యంలో బలమైన కథలు వచ్చాయి. ఈ కాలంలోనే కథలు, దానిలోని అంగాలను వివిధ ప్రాంతాల, భాషల, దేశాల కథలు అధ్యయనం చేయడం ఆరంభమైంది. శ్రీకాకుళంలోని ‘కథానిలయం’ ఏర్పడి మొత్తం తెలుగు కథలను సేకరించడం ఆరంభించింది. ఇంకా అనేక సంస్థలు కథ కోసమే ఏర్పడి ప్రతియేటా కథా సంకలనాలు ప్రచురించాయి. ప్రతి జిల్లాలో ఆయా సామాజిక నేపథ్యంలో వచ్చిన కథల సేకరణ, అధ్యయనం, బేరీజు పెరిగింది. విరసంతో పాటు ఇతర అనేక ప్రగతి కాముకులైన రచయితలు కథ మీదనే అనేక వర్క్ షాపులు జరిపారు. తెలుగు కథలేగాక ప్రపంచ కథల గురించిన అధ్యయనం జరిగింది. అధ్యయనం, శిక్షణ వలన అనేక మంది యువ కథకులు ఎదిగి వచ్చారు. ఇలాంటి అన్నిరకాల కార్యకలాపాలల్లో విప్లవ రచయితలు పాల్గొని పరస్పరం నేర్చుకున్నారు. ఫలితంగా ఏమేరకైనా ప్రగతిశీలమైన కథ తప్ప అభివృద్ధి నిరోధకం కథలు రాయడానికి సాహసించనంతగా కథ ఎదిగింది. ఈ కాలంలోనే అనేక కథలు, వందలాది సంకలనాలు వచ్చాయి.

మైదాన ప్రాంతాల్లో రైతాంగ, కార్మిక ఉద్యమం వెనుకంజ – ఆదివాసీ ప్రాంతాల్లో జనతన సర్కారు (2005-2017):
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విప్లవ పోరాటాల నుండి ఎదిగిన చాలా మంది ప్రత్యేక రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న టక్కరి, జిత్తులమారి, వేషం, భాష మార్చిన కొత్త దొరలను ఆశ్రయించారు. విప్లవోద్యమాలు ఊళ్లనుండి తరిమేసిన దొరల జిత్తులమారి ఎత్తుగడలను అంచనా కట్టలేకపోయినవారు, ఆగిపోయినవారు, అటుయిటూ తేల్చుకోనివారు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే అవకాశవాదులు మొత్తంగా సరైన నాయకత్వం, సరైన సమయంలో అందక తెలంగాణ ప్రభుత్వంలో కలిసిపోవడం ప్రతిష్టంభనకు గురికావడమో జరిగింది.

రాష్ట్రం విడిపోవడంతో రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో కొత్త వైరుధ్యాలు తలెత్తాయి. మహిళా, దళిత, ముస్లిం ఉద్యమాలు స్పష్టమైన వ్యూహం, అందుకు తగిన ఎత్తుగడలు రూపొందించుకోలేక, సమస్యలను, వాటి మూలాలను ప్రతిబింబించడానికి, ఆగ్రహావేశాలు ప్రకటించడానికి మాత్రమే పరిమితమయ్యే మమేకమౌతూనే ఉద్యమాల పరిమితులను – అని చేరాల్సిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు విప్లవోద్యమం స్పష్టం చేస్తున్నది.

కులం పునాదిగా గల దోపిడీ, పీడనలు గల సమాజానికి కీలకమైన అర్ధ భూస్వామ్య, అర్ధ వలస రాజ్యా ధికారాన్ని తొలగించి, అందరికీ సమాన అవకాశాలు కల్పించగల నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయడం దళిత, ఆదివాసీ, మహిళలు, మత మైనారిటీ, పీడిత జాతులు అనే నాలుగు ప్రజాస్వామిక ప్రజలను విప్లవోద్యమంలో సమీకరించే వ్యూహంలో భాగంగా ఎప్పటికప్పుడు తగిన ఎత్తుగడలు రూపొందించడానికి కార్మిక వర్గ పార్టీ కృషి చేస్తోంది. భారతదేశంలోని అరణ్య ప్రాంతాల్లో నేడు ఆదివాసులు తీవ్రమైన పోరాటంలో ఉన్నారు. మైదాన గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో దళిత బహుజనులు కోట్లాది మంది విప్లవ నిర్మాణానికి ఆవల తగిన నిర్మాణాలు రూపొందక, నాయకత్వం లేక కదం తొక్కుతున్నారు.

కొత్త సీసాలో పాత సారాలాగా మోసపూరిత సంస్కరణల ప్రభుత్వ విధానాలతోపాటు, నిర్బంధం కారణంగా పోరాట ప్రాంతాల్లో ఉద్యమం మరో దశకు ఎదగడానికి పెనుగులాడుతున్న సమయంలో నాయకత్వం అందక రైతులు, యువకులు, మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్థానిక సమస్యల మీద ఎక్కడికక్కడ పోరాటాలు అనివార్యంగానే బద్దలౌతున్నాయి. వాటికి కార్మిక వర్గ దృక్పథం కలిగించి ప్రజా రాజ్యాధికారం దేశంలో నడిపించడం అగ్రగామి పార్టీ లక్ష్యం. ఈ కర్తవ్యంలో విప్లవ సాహిత్యం, విప్లవ కథ వికాసం ఉన్నది. రైతులు, కార్మికులు పాత విప్లవ పోరాటాలను కొనసాగింపును కోరుకుంటున్నారు. – లెనిన్ ‘తక్షణ, వ్యూహాత్మక పోరాటాల గురించి ఏమి చేయాలి?’ అనే పుస్తకంలో వివరించినట్లుగా – వివిధ సెక్షన్ల ప్రజలు చేస్తున్న తమ తక్షణ డిమాండ్ పోరాటాలను నిర్వహిస్తూనే – ఇలాంటి అన్ని రకాల వ్యత్యాసాలకు మూలమైన దోపిడీ రాజ్యాన్ని కూల్చి కార్మిక, కర్షక రాజ్యాధికారం స్థాపించే లక్ష్యం కోసం ప్రజలను తర్ఫీదు చేయాలి.

అతివాద మితవాద ధోరుణుల వలన ప్రజా సంఘాలు ఈ అవగాహన, పని విధానం పూర్తిగా అలవడలేదు. ఈ కాలంలో అటు దండకారణ్య ఉద్యమం గురించీ, బైటి సంక్షోభాల గురించి ‘కథల పంట’ మూడు సంకలనాలు, ‘దండకారణ్య కథలు’ రెండు సంకలనాలు, ‘జాజిపూల పరిమళం’, ‘సామాన్యుల సాహసం’, ‘కాంత పున్నం వెన్నెల’, ‘దోసెడు పల్లీలు’, ‘బచ్చేదానీ’, ‘ఏది నేరం?’, ‘పాల్గుణ’ లాంటి అనేక కథల సంకలనాలు వచ్చాయి.

‘రచయితలారా… మీరెటు వైపు?’ ఎన్నో ఏళ్లుగా పునరావృతమౌతున్న ఈ ప్రశ్నపై మీ స్పందన?

సామాజిక, విప్లవోద్యమాల నేపథ్యంలో అనివార్యంగా సృష్టికర్తలైన ప్రజల పోరాటాలు, చరిత్ర రాయాల్సిన అవసరం రీత్యా అలాంటి పల్లె నుండి వచ్చిన నా లాంటి వాడికి ఎప్పుడూ అన్ని రకాలుగా ప్రజల వేపే. అన్ని రకాలుగా విధ్వంసమైన మానవులు మానవులుగా బతకనివ్వని, సొంతాస్తి కేంద్రం కాగల దోపిడీ, హింసాత్మక సమాజాన్ని మార్చే క్రమంలో ప్రజలు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. దోపిడీ ప్రభుత్వాలు, పత్రికలు విదిల్చే శాలువాల కన్నా, అవార్డుల కన్నా స్థల కాలాల్లో జరిగే పరిణామ క్రమాల్లో భాగం కావడం, తప్పనిసరిగా ప్రజల పక్షం వహించడం, కలిసి నడవడం, రచయితల బాధ్యత. కర్తవ్యం. రచయితలకు తిండి, బట్ట, అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చేది ప్రజలే. కనుక అలాంటి సామాజిక రుణం అవసరం రీత్యా కూడా ఇది అనివార్యమైన విషయం. ఒక్క రచయితలకే కాదు, ఇలాంటి అసమ, విషమ సమాజాన్ని మార్చడం, అందుకోసం పోరాడడం అందరి కర్తవ్యం.

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

3 thoughts on “ప్రజాపోరాటాలే నా రచనలకు ప్రేరణ : అల్లం రాజయ్య (2)

  1. Very instresting information… Nice views expressed

Leave a Reply