ప్రజాపోరాటాలే నా రచనలకు ప్రేరణ : అల్లం రాజయ్య

(అతడు తెలుగు కథకు చెమట చిత్తడి పరిమళాన్ని అద్దిన ఎన్నెల పిట్ట. నేల తల్లి కడుపులో కండ్లుపెట్టి చూసే ఆరుద్ర పువ్వు. అతని అక్షరాలు జనాన్ని రగుల్కొల్పే నిప్పు కణికలు. నింగిని, నేలను కలిపే సింగిడి పరవళ్లు. తుడుం మోతల యుద్ధ గీతాలు. వెన్నెల జలపాతాలు. తిరగబడకపోతే బతుకు లేదని చెప్పిన వీరులు చిందిన నెత్తుటి కథలు. అతని మాట మానేరు. మనసు కోనేరు. ధిక్కారమే అతని జీవధాతువు. విప్లవోద్యమం తన అక్షరాలకు కొత్త చూపునిచ్చిందని చెప్పే ఎర్ర జెండా రెపరెపల స్వేచ్ఛా గీతిక అతడు. వసంత మేఘ గర్జనల్లో నిలువెల్లా తడిసి మొలకెత్తిన రగల్ జెండా రెపరెపల సృజనశీలి అతడు. యాభై ఏళ్లుగా మట్టి మనుషుల జీవితాలను, చరిత్రను, పోరాటాల్ని కథలల్లుతున్న మన కాలపు పోరాట సాహిత్య సృజనకారుడు అల్లం రాజయ్యతో ‘కొలిమి’ సంభాషణ…)

మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి.

నా బాల్యం గాజులపల్లి ఒక్కప్పటి కరీంనగర్‌ జిల్లా (ఇప్పుడు పెద్దపల్లి) మంథని తాలూకాకు ఆరు కిలోమీటర్ల దూరంలో గల పల్లెలో గడిచింది. సుమారు యాభై కుటుంబాలు గల ఊరు. అడివంచు పల్లె. పక్కన ఎప్పుడూ పారే బురుకవాగు. మాది పేదరైతు కుటుంబం, పెరుక కులం బహుజన. నా బాల్యంలో మూడో నాలుగో పెంకుటిండ్లు ఊళ్లో. మిగతావన్ని గడ్డి గుడిసెలే. బ్రాహ్మణ అగ్రహారం. చాలా వరకు భూములన్ని మంథని బ్రాహ్మణ కుటుంబాలవే. ఒకటి అర మా కుంటుంబాలకు ‘బీసీ కుటుంబాల’కు కొద్దిగా భూములుండేవి.

మా తరంతో పాటే ప్రభుత్వ పాఠశాల వచ్చింది. మంథెన నుంచి బ్రాహ్మణ టీచర్‌ వచ్చేవాడు. సుద్దర్లోల్లు (శూద్రులమని) మమ్ముల్ని ముట్టుకునే వారుకాదు. మాల, మాదిగలు స్కూలుకు వచ్చేవారు కాదు. మూడో తరగతి దాకా గాజులపల్లిలో. నాలుగు, అయిదు తరగతులు మా అమ్మమ్మ ఊరు వెన్నపల్లిలో. ఈ ఊరు చాలా పెద్దది. అన్ని వృత్తులవారు, దొరలు, పెద్దపెద్ద చెరువులు, కూరగాయలు, మిర్చి లాంటి పంటలు.
నా మీద బాగా ప్రభావం చూపిన ఊరు.

ఆరో తరగతికి మా వూరికి మంథనికి కాలినడకన ఆరు కిలోమీటర్లు నడిచి పోయేవాళ్లం. మా ఆకారం, భాష, బట్టలు చూసి ఉన్న బ్రాహ్మణ పిల్లలు ఆట పట్టించేవారు. ఎచ్ఎస్సీ దాకా మంథనిలో, ప్రత్యేక తెంగాణ ఉద్యమంలో (1969) పాల్గొనడం. అప్పుడు నేను హైస్కూలు విద్యార్థి సంఘానికి నాయకుణ్ని. పీయూసీ, బీఎస్సీ హన్మకొండ ఆర్ట్సు కాలేజీలో చదివాను.

సాహిత్య ప్రపంచంలోకి ఎట్లా వచ్చిన్రు?

లిఖిత సాహిత్య ప్రపంచంలోకి రావడమన్నమాట. పల్లెల పని పాటలు చేసుకునేటోల్లకు అడుగుదీసి అడుగేస్తే ఆ కులుకు, ఆ హోయలు వాళ్ల కదలికల్లో కన్పిస్తయి. నోరు తెరిస్తే సాహిత్యమే. పల్లె సామెతలు, రిథమిక్‌ లేకుండా ఎవరు మాట్లాడరు. ఆటలు, ఎడ్ల కాసేకాడ, నాట్లకాడ, పంజలు గొట్టేకాడ, నెగల్లకాడ, మంచెకాడ, పంచాదులు, పెండ్లిల్లు, పండుగలు అన్ని కథతోని, పాటలతోని నిండి ఉంటయి. కథ లేకుండా ముచ్చెటబెట్టరు. ఇయ్యన్నిగాకుంట పాండవులోల్లు, మాట్లోల్లు, బుడిగ జంగాలు, చిందోళ్లు, ఒగ్గోల్లు, పంబాలోల్లు, ఏడాది పొడుగుతా ప్రదర్శనలు ఇస్తనే ఉంటరు. పల్లె బతుకులో, పనితో పాటు సాహిత్యం ఒక భాగం. కైతికాలోళ్లు కానోళ్లు పల్లెల ఉండరు.

చదువు ద్వారా ‘మధ్యవర్తిగా’ మారే క్రమంలో ఊళ్లు తిర్గడం. పల్లె నుండి మంథెనకు రావడం బెంగటీలినట్టుండేది. ఆ దిక్కు మాలిన చదువు వచ్చేది కాదు. ఎనిమిది తరగతులు సున్నాలే వచ్చాయి. చదువుకనిపోయి లైబ్రరీల కూసుండి పుస్తకాలు చదువుకునేవాన్ని. గమ్మతుగా, బోలెడు పుస్తకాలు చదివిన. ప్రేమ్‌చందును సదివినంక నిమ్మలమనిపిచ్చింది. ‘గోదాన్‌’ రైతు కథే కదా! ఆ తరువాత మా మేనమామ నాకు చదువు రానందుకు తిట్టడం. వ్యవసాయంలో బతకలేమని తేలడం. ఈ గడబిడలో ఆత్మహత్య చేసుకుందామనుకొని మానేసి గప్పుడు సదువెట్లరాదో అదేవన్నాదున్నుడా? దోకుడా? అనుకొని సదవడం… తొమ్మిదిల క్లెవరునైన, అదో పెద్దకత. పదకొండుల విద్యార్థి సంఘానికి ప్రధాన కార్యదర్శి. ప్రత్యేక తెంగాణ ఉద్యమం, ఉపన్యాసాలు, కరపత్రాలు రాయడం అవసరమయింది. గాయిగాయి తిరుగుడు. లైబ్రరీల సదివిన గద. మా దోస్తుల్లో నాలుగు వాక్యాలు రాయగల్గింది నేనే. పెద్ద దోస్తులకు వాళ్ల లవర్లకు ప్రేమలేఖలు రాసిచ్చుడు నావంతే అయ్యింది. మొత్తానికి మా ఆవారా బృందానికి ఆస్థాన లేఖకుడి పనైంది. మల్ల హన్మకొండ సాహితీ మిత్రులు, కాళోజీ, వరవరరావు ఆళ్ల దోస్తానీ… డైరీలసొంటివి రాసేటోన్ని. కవిత్వం ఫుల్‌. ఏదివడితె అది. కని పల్లె మీదికి మనసు పీకేది. గాయిగాయున్న పల్లె బాగు చెయ్యాలె. ఎట్ల? బోలెడు ఇసారాలు. గాంధీ తీర్గ ఏదన్న చెయ్యాలె. గట్లె ఇప్పుడు అన్నారం బ్యారేజీ కట్టిన కాడ మా దోస్తు చందుపట్ల క్రిష్ణారెడ్డి ఊరు. బగ్గ నచ్చింది. అప్పటికి టాగోరు, శరత్‌, చలం, యద్ధనపూడి, బుచ్చిబాబు, కొ.కు, గోపీచందులను చదివి చదివి నెరివడిపోయిన గని. కథలు, నవలలు రాయాలన్పియ్యలేదు. గట్ల బ్యారేజీ గట్టితే పల్లెలు బాగుపడ్తయని ముగింపులు ముందడుగులు నవల రాసిన. హిందీ సినిమాలు చూస్తుండె. ఆనంద్‌, గీత్‌ లాంటివి. ఆ పోవడి ఆ నవల అచ్చు కాలేదు. ఏడనో పోయింది. అగో గట్ల అచ్చు కాకముందు ఒకటి గాదు రెండు గాదు. కొన్ని వేల పేజీల రాసిపారేసిన. ఏడివడితె అది. ఎట్లవడితె గట్ల. మంటర మంటర. కని ఏది అచ్చుకియ్యలే. ఇయ్యాలన్పియ్యలే. అవ్వన్ని ఆదర్శ కల్పితాలు. నా చుట్టున్న బతుకులు వేరు. కొట్లాటలు వేరు. నా రంది వేరు. రాస్తున్న సరే. అగో గసొంటి టయిము శ్రీకాకుళం చిచ్చు. నక్సల్బరీ మంట, పాణిగ్రాహి, శ్రీశ్రీ, కాళోజీ, దాశరథి… అగో వాళ్లు పూనిండ్లు.

మిమ్మల్ని ప్రభావితం చేసిన సాహిత్యమేది?

ఒకటా రెండా? ఆట పాటతో శాత్రాలతో (కథతో) నిండి పోయిన పల్లె బతుకు. అద్భుతమైన మాట తీరు, పని తీరు, కంఠస్వరం గల్గిన మా మాదిగ నోటి సాహిత్యం… తమ బతుకు తము చెప్పే జానపద గాథల్లో లీనమైపోయిన గ్రామీణ కళాకారులు… ఇప్పటికీ మాట్లె వీరయ్య, పంబాల దుర్గయ్య, బుడుగు జంగం పెద్దీరయ్య నాలో కలెగల్సిపోయి ఉన్నారు. వాళ్లు ప్రపంచాన్ని ఆగ్రహంతో, దు:ఖంతో, విశ్లేషణతో, ప్రేమతో, దయతో చూసిండ్లు. నా చుట్టున్న ప్రజలు నిరుపేదలైన ప్రజలు. సమస్తం దోచుకోబడిన ప్రజలు. సర్వ శక్తిమంతులైన ప్రజలు. సృష్టికర్తలైన ప్రజలు. అడవితో, పశుపక్ష్యాదులతో, కొండవాగులతో భూమితో, గాలితో, మబ్బుతో, మండే సూర్యునితో, సక్కని సందమామతో సరసాలాడిన ప్రజల జీవధాతువు కదా సాహిత్యం. వాళ్ల ఊపిరి కదా. ఇంత పీడనలో సాహిత్యమనే జీవధాతువు లేకుంటే బతికేవాళ్లా? అగో గక్కడ గసొంటి తడి నన్ను తాకింది. నన్ను నిలబెట్టింది. పల్లె పొల్లగాని బతుకంటే గాయి గత్తరా రోగాల నుండి, ప్రమాదాల నుండి బతికి బట్టగట్టే సాహసం. ఆ కంఠ స్వరాలు నా లోలోపల ఇప్పటికీ మోగుతుంటాయి. అది నన్ను ప్రభావితం చేసిన పల్లె లొల్లి.

పదకొండవ తరగతి వరకే అందిన భారతీయ సాహిత్యమంత చదివిన. ఎవరో ఒక స్వాతంత్య్ర సమర యోధుడు మా మంథెన లైబ్రరీకి దేశ, విదేశ సాహిత్యం చానా దానం చేసిండు. శరత్‌ ‘గృహ దహనం’ నవలలో కమల,‘శ్రీకాంత్‌’ నవలలోని శ్రీకాంత్‌. చలం పుస్తకాలన్నీ చదివిన. ‘మైదానం,’ ‘జీవితాదర్శం’… యవ్వన కాలంలో చలం పిచ్చిలో తిరిగిన. గోపీచందు ‘మెరుపుల మరకలు’, ‘అసమర్థుడి జీవయాత్ర’, ‘చీకటి గదులు’, ఉన్నవ ‘మాలపల్లి’. ఏదో చెయ్యాలె. కాళీపట్నం రామారావు ‘యజ్ఞం’ లోలోప బీభత్స కల్లోలం. రావిశాస్త్రి పాత్రలు, యద్ధనపూడి, రంగనాయకమ్మ, లత, వందలాది డిటెక్టివ్ లు. మాయామయి, భట్టి విక్రమార్క, వేదాలు, పురాణాలు, ఏది దొరికితే అది. ఇసొంటి పుస్తకాల ప్రభావం.

మా కాలం, మా తరం దారులు వెతుకుతున్న కాలం. తెలంగాణా ఉద్యమంలో రాజకీయాల్లోకి బజాట్టెకచ్చి బరిగీసి నిలబడి, బలిదానాలు జరిగినా ఆస్తులు, బస్సులు కాల్చి, నాయకత్వ విద్రోహంతో భంగపడి- చదువు పోగొట్టుకొని, పారిస్‌లో కోపోద్రిక్త యువకుల్లాగా తిరుగుతున్న తరుణంలో, నిరాశపడి డీలాపడి తిరుగుతున్న సమయంలో, శ్రీశ్రీ మహాప్రస్థానం మంచె కావల్ల దగ్గర బిగ్గరగా పాడుతూ… పాడుతూ ఏడ్చిన కాలం.

సుబ్బారావు పాణిగ్రాహి పాట ‘కమ్యూనిస్టులం… కష్టజీవులం’. అప్పుడు నేను బీఎస్సీ రెండో సంవత్సరం. చీకటిలో తచ్చాడుతున్న సమయంలో మా పక్క రూమ్‌ నర్సింహారెడ్డి నా వెర్రి మొర్రి కవిత్వం, మ్యూజింగ్స్‌ లాంటివి చదివి ఇది కాదోయి సాహిత్యం అని వెంట తిరిగాడు. తెలతెలవారక ముందే నా దగ్గరకొచ్చి ‘సృజన’ను పరిచయం చేశాడు. టావ్‌చెంగ్‌, నా కుటుంబం… అట్లా అనేకానేక పుస్తకాలు, పత్రికలు.

ప్రజల సాహిత్యంలోకి దారి దొరకడమే కాదు. మునిగిపోయాను. అయితే నేను అప్పటికి చాలా ప్రజల సాహిత్యం రాసిన. మా ఊరి సాహిత్యం రాయాలని, రాస్తానని అనుకోలేదు.

నేను చదివిన అనేకమంది రచయితలు, పుస్తకాలు అప్పటి నుండి ఇప్పటి దాకా వేలాది మంది నామీద ఎంతో కొంత ప్రభావం చూపారు. వాళ్ల నుండి నేను ఎంతో నేర్చుకున్న. ప్రతి రచనను నేను నా కాలంతో, స్థలంతో సరిపోల్చుకున్నాను.

అయితే లక్ష చెప్పు. గిది బాగలేదు. మారాలె. ఎట్లా? ఎవరు మారుస్తారు? అగో గాడ ఫ్రెంచి విప్లవం, సాహిత్యం, బాల్జాక్‌, డికెన్సు, గోర్కీ, చెహోవ్‌, తుర్లునేవ్‌, టాల్‌స్టాయ్‌, డాస్టోవిస్కీ, లూసన్‌, అంబేద్కర్‌, కారల్‌ మార్క్స్‌, లెనిన్‌, మావో నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇప్పటి మావోయిస్టు సాహిత్యం దాకా ఇలాంటి విప్లవాలను ఆపడానికి అవతలి పక్షం నిర్ధారణలు. విశ్లేషణలు.

ఆడమ్‌ స్మిత్‌ నుండి అనేకమంది అమెరికన్‌, యూరప్‌ రచయితల దాకా. గూగీ నుండి, నోమ్‌ చామ్‌స్కీ దాకా. ఖలీల్‌ జిబ్రాన్‌ నుండి ఇప్పటి సిరియా, ఈజిప్ట్‌, ఇరాన్‌, కిర్‌స్తోంజీ నుండి మజీదీ మజీదీ దాకా… పుకోకా నుండి పర్యావరణ శాస్త్రవేత్తల దాకా… తీరని దాహం. దేశమే కాదు, ప్రపంచంలో ఉత్పత్తి వనరులు, శక్తులు, సంబంధాలు పూర్తిగా మారి సమస్త శక్తులతో ప్రజలు సమస్త వైరుధ్యాలను పరిష్కరించేదాకా కలలుగన్న, పనిచేసిన వారెందరో. వారందరి అనుభవాలు నన్ను నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉంటాయి.

మార్క్సిజం, లెనినిజం, మావోయిజం వెలుగులో పెరూ, ఫిలిప్పీన్స్‌, నేపాల్‌, లాటిన్‌ అమెరికా దేశాలు, మన దేశంలో, మన కాలంలో ఎన్నెన్నో ప్రయోగాలు. అనుభవాలు. గుణపాఠాలు. భారతదేశ పరిణామ క్రమంలోని ప్రత్యేక అంశం కులం పునాదిగా అంబేద్కర్‌ చేసిన ప్రతిపాదనలు, చర్చోప చర్చలు నామీద ప్రభావం చూపినవి.

మీ తొలి రచన? సమాజంపై దాని ప్రభావం?

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నాయకత్వ ద్రోహంతో ముందుకు సాగడానికి తగిన నిర్మాణం లేక కదం తొక్కుతున్న విద్యార్థులను 1974లో ఏర్పడ్డ రాడికల్‌ విద్యార్థి సంఘంలో సమీకరించారు అప్పటి సీవోసీ (విప్లవకారుల ఐక్యతా కేంద్రం) పార్టీవాళ్లు. నక్సల్బరీ, శ్రీకాకుళాల మీద వాదోపవాదాలు. వ్యవసాయ విప్లవం ఇరుసుగా విప్లవోద్యమం పెల్లుబికడానికి సిద్ధంగా ఉంది. కరీంనగర్‌లో విజయ కుమార్‌, లింగారెడ్డి లాంటివాళ్లు, జమ్మికుంటలో శనిగరం వెంకటేశ్వర్లు, నల్లా సుధాకర్‌రెడ్డి, నల్లా ఆదిరెడ్డి వాళ్లు, పెద్దపల్లిలో మల్లోజుల కోటేశ్వరరావు, మంథనిలో చందుపట్ల క్రిష్ణారెడ్డి, అల్లం నారాయణ, పోరెడ్డి వెంకటరెడ్డి, బయ్యపు దేవేందర్‌రెడ్డి, ఓంకారి లాంటివాళ్లు రాడికల్‌ విద్యార్థి సంఘం నిర్మాణంలో ఉన్నారు.

నాకప్పటికి బీఎస్సీ అయిపోయింది. జమ్మికుంట మిత్రులు, కరీంనగర్‌ మిత్రులు కలిసి ‘విద్యుల్లత’ జమ్మికుంట కాలేజీలో రాతపత్రిక నడిపేవారు. ‘బద్‌లా’ పేరుతో ఒక కథా సంకలనం తేవాలనుకున్నారు. పైన పేర్కొన్నవాళ్లంతా నా మిత్రులు. ఆ నోట ఈ నోట నేను రాస్తానని తెలిసి నన్ను అడిగారు. అప్పటికే గీట్ల జనార్దన్‌రెడ్డి ఒక పత్రిక ‘క్రాంతి’ ఆరంభించాడు. దానికోసం నేను తిరిగేవాన్ని. ప్రెస్‌లో విజయ కుమార్‌ కలిసి నన్నొక కథ అడిగాడు.

ఈ నేపథ్యంలో అగులు బుగులు మొదలయ్యింది. నేను చదివిన వయిలు, ఆ మలుపులు నా వల్ల గాదు. నేను రాసిన కవిత్వం. కాదు కాదు. కానే కాదు. మరేంది? ఈ తండ్లాటలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన, నాకు అన్నీ నేర్పిన మాదిగలు కన్పించారు. ఆ యిండ్లల్లకు రాకపోకలతో నాకు ప్రతి మనిషి, పిల్లా పీచు బగ్గ ఎరుక. అగో గప్పుడు మా వూళ్లెనే బేతాళుని లాగ ఉండే శరీరం, కంచుగంట కొట్టినట్టుండే కంఠస్వరం. దేన్నయిన, ఎవలినైన నడి బజాట్ల నిలబెట్టి నిలదీసి అడిగే మొండితనం. ముఖ్యమంత్రిగ ఉన్న పీవీ నర్సింహారావునే వేల మందిలో నిలబడి మీటింగు ‘నువు సెప్పే మాటలుత్తయి. గయి మా దాక రావు’ అని కడిగి పారేసిన బత్త కొమురయ్య వచ్చి ముందు నిలవడ్డడు. అయిపాయె. బత్త కొమురయ్యంటే మా వూరు మొత్తం… వూరంటే లోలోపలి కుట్రలు కుతంత్రాలు… దోపిడీ, హింస, పంచాయదులు, మెడు విరవడాలు, భూములు కాజేయడాలు, తక్కువ కూల్లు యివ్వడాలు… ఏది మార్చకుండా, మా వూరి మాటలు బెట్టి రాసిపారేసిన. గదే ‘ఎదురు తిరిగితే’. గీ పేరు నేను పెట్టింది కాదు.

కథనో గంగరాయో. మొత్తానికి నేను పుట్టి బుద్దెరిగినకాన్నుంచి నా కడుపుల కక్కకుండా గడ్డకట్టుకపోయిందంతా రాసిపారేసిన. అలుకగయ్యింది. గ కథ ఎవలకు ఏమి నేర్పిందో గని నాకైతే తొవ్వజూపింది. ఊకె ‘కొలువా… కుమ్మరియ్య’. గులుగుడద్దు. తెగించినోనికి తెడ్డే కత్తి. సాప్‌ సీదా. లైన్‌ క్లియరు, ఇగ నాకు అప్పటి నుంచి కప్ప తొక్కుడు లేదు. ఉంటది. గలీజు, కంగాలి ఉంటది. పొలికట్టె బట్టి ఊడ్సుకోవాలి. బరిగీసి నిలబడాలె.

కథ రాయంగనే గది అచ్చుకియ్యాలన్పియ్యలేదు. దెహె. గిదేం కథంటరేమొనని. నా మనుషులంత సెమట ఆసన గొట్టేటోల్లు. సెడుగు పిల్లలు. నేను సదివిన కథల్లోనేమొ మెత్తటి మనుషులు. గమ్మతు సుతిమెత్తటి మాటలాయె. నాయి గొడ్డలి పురాండం. ఇగ విజయ కుమార్‌ వాళ్లు మల్ల అడుగలే. నేను వాళ్లకియ్యలే.

కని కథ పుర్రెల పురుగు మెసిలినట్టు మెసలవట్టె. బత్త కొంరయ్య సెవుల జోరీగ తీర్గ పోరు. ఎట్లయిన మంచిదని మా అత్తగారింటికి బొయ్యే తొవ్వల ఉన్న శ్రామికవర్గ ప్రచురణకు 1975లో యిచ్చి సేతులు దులుపుకున్న. మర్సేపోయిన.

ఆయింక బోలెడు కథ జర్గింది. ఎమర్జెన్సీ ఎత్తేయడం, నేను నౌకరీ కుదురుకోవడం, పల్లెల్ల రైతుకూలీ సంఘాలు ఆరంభం కావడం 1977 సెప్టెంబరు నెలల ఎమర్జెన్సీ ఎత్తేసిన తరువాత ఆరంభమైన ‘సృజన’ పత్రిక వచ్చింది.

మా నాయినమ్మ దినాలకు గాజులపల్లికి పోవుకుంట గోదావరిఖనిల దిగి రివాజు ప్రకారంగా ఆడ పత్రిక షాపు బండారు కిష్టయ్య షాపుకు బోతి. ఏమున్నది ఆడ లైను. ఎవలో ఏదో పుస్తకం సేతుల బట్టుకొని సదువుతుండు. ఇంటున్నోల్లంత వక్కడ వక్కడ నవ్వుడే కాదు. తిడుతండ్లు. లోపల జొరబడి నేను వింటే ఏమున్నది? అయి నా మాటలే. అది బత్త కొంరయ్య కథే. ‘ఎదురు తిరిగితే’ కథే. కండ్లల్లకు నీల్లచ్చినయ్ గుబగుబ. సల్ల సెముటల్ బెట్టినయ్. వయి సంకల బెట్టుకొని ఆడికి కొద్ది దూరం ల పాన్‌షాపులు పెట్టుకున్న మా వూరోల్ల కలిత్తి. ఆడ ‘‘అయ్యో రాజన్న… ఎటు వోతన్నవ్‌? ఊరికేనా? గ కథెందుకు రాస్తివి? మా పజీత్‌ దీసిండని మీ నాయినతోటట్టుగ ఊళ్లె పెద్దమనుషులంత తలో వయి సంకలబెట్టుకొని తిరుగుతండ్లు. ఊరంత పిసపిసలాడుతండ్లు. గిప్పుడు పోకు’’ అన్నరు.

ఇగేం చెప్పాలె? మునుపటి తీర్గ నా అండ్ల నేను పిసపిస రాసుకుంటె ఎవడేమను? పుసుక్కున నిజం రాస్తె గిట్లయిపాయె. మరి కడుపు దాగకపాయె. బస్టాండు దాకా నడిసిపోయి ఎర్రటెండ ఎటు దోసక సాన సేపు వచ్చిపోయె బస్సులు సూసుకుంట కూసున్న. గాలికి పొయ్యే కంప ముడ్డికి తగిలింది. ఆఖరుకు బత్త కొంరయ్య కండ్లల్ల కన్పిచ్చిండు. మా నాయినమ్మ చెంద్రవ్వ గన్పిచ్చి మనుసు కలికలయ్యింది. అది నాకు అనేక శాత్రాలు సెప్పింది.

‘‘దెహె. మానం సేసెటోనికుండాలె. సెప్పెటోనికేంది?’’ బత్త కొంరయ్య అన్నడు కన్పిచ్చి.

సీమిడి సీదిన. కండ్లు తుడుసుకున్న. బస్కెక్కిన. నాకన్న ముందే చేరిన మా చుట్టమామె నాకు కబురు చెప్పింది. అప్పటికే ఊళ్లోల్లందరు మా ఆకిట్ల గడంచల కూసుండి నాకోసం ఎదురు సూత్తండ్లు. మా అవ్వ సేతులు పిసుక్కుంటంది. తలొంచుకొని వాళ్లనెవ్వల్ని సూడకుంట ఇంట్లెకుబోయిన. ‘‘ఏందిర రాజు మా పజీత్‌ దీసి పెంటమీదేత్తివి’’ అన్నది మా అవ్వ.

ఇగట్ల లేచిన అరుగుమీదికచ్చి నిలబడి ‘‘ఔనుల్లా కాలం రాసిన. మీరు గయ్యన్ని కంగాలీ పనులు సెయ్యంగలేంది? ఊళ్లె అందరికీ గీ ముచ్చట్లన్నీ ఎరికే. అందరు సెప్పుకున్నయే నేను రాసిన. ఏం పీక్కుంటరో పీక్కోపోండ్లి’’ అన్న. బొత్త కొంరయ్య తీర్గ.

పెద్ద మనుషులు ఆ కంఠస్వరాన్ని ఊహించలేదు. ఏందేందో గొనిగిండ్లు. మల్ల లోపటికి పోయిన.

‘‘గ పేర్లన్న మార్చనుంటివి. సరే. పెడితే పెట్టినవ్‌. పుండుమీద కారం జల్లినట్టు గిది మా గాజులపల్లి గ్రామం అంట రాస్తివి. గయ్యన్ని మార్పిచ్చు.’’అన్నరు. రాజీకచ్చిండ్లు. వాళ్లు లేసిపొయిండ్లు. గప్పుడు ఎదురు తిరిగితే ఎంతటోడైన తోక ముడుత్తడని సీమకాలంత గోర్జం మింగినట్టయ్యింది. ఆ తరువాత ‘’ఇది కల్పితం’’ అని రాయాల్సి వచ్చింది.

‘ఎదురు తిరిగితే’ కథ నా మీదనే ఎదురు తిరిగింది. కాని నాకు కథ, భాష మౌఖిక పద్ధతిలో రాయడం సుడిగాలిలా సుట్టుకపోగలదని అర్థమయ్యింది. నేను ఎదురు సూస్తున్న పదునైన ఆయుధం దొరికింది. నాకు దారి చూపింది. కొందరు వీరులు చరిత్ర నిర్మాతలు కాదు. బొత్త కొంరయ్యు చరిత్ర నిర్మాతని అర్థమయ్యింది.

మీ కథలు, నవలలకు ప్రేరణ?

నేను పుట్టి పెరిగిన పల్లె బతుకు. ఉద్యోగరీత్యా ముప్పై ఎనిమిది సంవత్సరాలు కార్మికులతో బతికాను. ఆసక్తి రీత్యా ఆదివాసీ ప్రాంతాలతో అనుబంధం. ఆదివాసీ, వ్యవసాయిక, కార్మిక జీవితాలు. ఆ జీవితాల్లోని ఆరాట పోరాటాలు నా జీవితంలో భాగమయ్యాయి.

గ్రామాల్లో క్రూరమైన, మధ్యయుగాల నాటి దొరతనం, దోపిడీ, పీడనతో 90 శాతం ప్రజలను పీల్చి పిప్పిచేశారు. ఊపిరాడని పల్లెలు. నా కాలంలో నక్సల్బరీ, శ్రీకాకుళం, అంతకుముందటి తెంగాణా సాయుధ పోరాట వారసత్వంతో పోరాటాల్లోకి దిగాయి. ఉత్పత్తి వనరులు, సంబంధాలు మార్చడానికి సకల వివక్షతలను రూపుమాపడానికి విప్లవోద్యమాలు నా కాలంలో, ప్రాంతంలో ప్రారంభం కావడం తప్పనిసరైంది.

ముఖ్యంగా రెండువేల ఐదువందల సంవత్సరాల కరుడుగట్టిన భూస్వామ్యాన్ని అది ఆక్రమించిన గ్రామాల్లో నుండి దొరలను తరిమేయడం. విప్లవ రచయితల సంఘం, జన నాట్య మండలి, రాడికల్‌ విద్యార్థి సంఘం, రైతుకూలీ సంఘం, సింగరేణి కార్మిక సంఘం, ఆదివాసీ రైతుకూలీ సంఘాల లాంటివి అప్పటి పీపుల్స్‌వార్‌ నాయకత్వంలో ఏర్పడి పనిచేశాయి.

కరీంనగర్‌, ఆదిలాబాద్‌ గ్రామాల్లో రైతుకూలీ సంఘాలు ఏర్పడి దున్నేవారికి భూమి నినాదంతో వేలాది ఎకరాల భూమి రైతులకు పంచింది. కూలి రేట్లు, పాలేర్ల జీతం, ఆశ్రిత కులాల వెట్టి, వాళ్లకు పెట్టుబడుల పెంపు, ప్రతీ పంచాయితులు క్రమంగా కార్మిక ప్రాంతాలకు, అటవీ ప్రాంతాలకు విస్తరించి కార్మికుల హక్కుల గురించి, ఆదివాసీల భూ సమస్య, అటవీ అధికారుల దౌర్జన్యం ఎదిరించి నిలిచింది. ఎప్పటికప్పుడు ఇసొంటి పోరాటాల్లో అనేక విద్రోహాలు, మలుపులు, వైరుధ్యాల పరిష్కారంలో మార్క్సిజం, లెనినిజం, మావోయిజం వెలుగులో అధ్యయనం, పరిష్కారం మన కాలానికి, దేశానికి సంబంధించిన ఆర్థిక, రాజకీయ, సామాజిక గతి క్రమం అధ్యయనం, పోరాటం, ఆచరణ ద్వారా ప్రజల నుండి నేర్చుకోవడం.

ఒక్క మాటలో చెప్పాలంటే పాత అభివృద్ధి నిరోధకమైన సమాజాన్ని, అందులోని వైరుధ్యాలను పరిష్కరించి కొత్త ప్రపంచాన్ని నిర్మించడం. ఈ క్రమంలో నాకు తెలిసిన ఆచరణాత్మకమైన ప్రతి మలుపును నా వంతు కర్తవ్యంగా ఉద్యమ ఆచరణ, అనుభవాలను చిత్రించడానికి ప్రయత్నం చేశాను. రచయితగా సుదీర్ఘకాలం విప్లవోద్యమ అనుభవంలో ఉండటం నా నవలలు, కథలకు ప్రేరణ. కథలు, నవలలు, వ్యాసాలు, వార్తా కథనాలు, నాటకాలు, ఇంటర్వ్యూలు, పుస్తకాల ప్రచురణలు, రచయితల సంఘాలతో వర్కు షాపుల్లో భాగం పంచుకోవడం… ఇలాంటి సమిష్టి అధ్యయనం, ఆచరణ రాయడానికి పురికొల్పాయి. అనివార్యమైన అవసరం నుండి, ఒత్తిడి నుండి రాయడం జరిగింది. రాసింది నేనే అయినా ఈ మొత్తం రచనకు విప్లవోద్యమం మూలం.

విప్లవ సాహిత్యోద్యమానికి అల్లం సోదరుల కాంట్రిబ్యూషన్?

అందరికీ తెలిసిందే. మా కుటుంబాల్లో నేనే మొదటిసారిగా హైస్కూలు చదువు దాకా వెళ్లింది. ఆ సదువబ్బక, నేను వెతికే సదువు దొరుకక మంథనిలో తిరుగంగ తిరుగంగ లైబ్రరీ దొరికింది. అందులో వందలకొద్ది వయిలు. పల్లెల బుట్టి, చిన్నపాటి పట్నంల గాయిబడ్డ నాకు భారతదేశానికి, ప్రపంచానికి లైబ్రరీ దారులు తెరిసింది. లైబ్రరీలో సభ్యున్నయి పుస్తకాలు ఇంటికి తీసుకపోయేటోన్ని. ప్రభాకర్‌ లైబ్రేరియన్‌ ఉదారంగా ఉండేవారు. ఇంటికి ఎన్నంటే అన్ని పుస్తకాలు ఇచ్చేవారు. అట్లా మా యింట్లకు పుస్తకాలు రావడం ఆరంభమయ్యింది. కాళ్లు రిల్లలు పట్టేదాక సోయి లేకుంట రాత్రి పగలు పుస్తకాలు సదవడం అయ్యి నా తీర్గ సెడిపోతరని మా తమ్ముడు వీరన్న, నారాయణలకు యిచ్చేవాన్ని కాదు. కాని వాళ్లిద్దరు ఆ పుస్తకాలు ఎట్లనో అట్ల దొరికిచ్చుకొని సదివెట్లోల్లు.

ఇగ మా యింట్ల పుస్తకం సొచ్చినంక ఎట్లుంటది? నేను డిగ్రీ కోసం హన్మకొండ పోయిన. మా తమ్ముల్లు మంథెనకచ్చిండ్లు. ప్రత్యేక తెంగాణా ఉద్యమంల నాతోపాటు మా తమ్ముల్లు తిరిగేవారు. మా తిరుగుబాటు దోస్తులు మా తమ్ముళ్లకు దోస్తులే. 1973 వరకు కరీంనగర్‌లో విప్లవోద్యమం. తెంగాణా ఉద్యమంలో పాల్గొన్న. చురుకైన విద్యార్థులతో సంబంధాలు పెట్టుకున్న.

అట్లా మల్లోజుల కోటేశ్వరరావు, చందుపట్ల క్రిష్ణారెడ్డి (నా క్లాస్‌మేట్‌, రూమ్మేట్‌), పేరం ఓంకారి లాంటివాళ్లు విద్యార్థుల్లో పనిచేయడం ఆరంభమయ్యింది. మా తమ్ముల్లతో పాటు రూం మేట్సయిన బయ్యపు దేవేందర్‌రెడ్డి, పోరెడ్డి వెంకటరెడ్డి రూంల్లో అనేక చర్చలు, సమావేశాలు. 1974లో ఏర్పడ్డ రాడికల్‌ విద్యార్థి సంఘం ఏర్పాటు కోసం వీళ్లందరు హైదరాబాదు తరలిపోయారు. 1975 నాటికి నారాయణ పూర్తి కాలపు కార్యకర్తగా పనిచేస్తున్నాడు. మంథెనలో యుద్ధ వాతావరణం నెలకొంది. మంథెనలో పూర్తిగా బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండేది. దాన్ని మొదటి సారిగా ఎదురించి నిలబడడం ఎప్పటి నుండో ఉన్నది. 1970 నాటికే బ్రాహ్మణ విద్యార్థుల మీద పోటీచేసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు, కార్యదర్శులుగా బహుజనులు ఎడ్ల చంద్రయ్య (ప్రసిడెంటు), నేను ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యాం. ఎన్నికల్లో ప్రత్యర్థులను నిలబెట్టి పోరాడుతున్నం. పీవీ నర్సింహారావు అసెంబ్లీ నియోజకవర్గంలో మేము బలమైన ప్రత్యర్థులుగా ఎదుగుతున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్‌ కూడా బ్రాహ్మణుల్లో పనిచేస్తూ మాతో తలపడేది. నేను వరంగల్ వెళ్లిపోయిన తరువాత లోకల్‌ రాజకీయాల్లో బ్రాహ్మణ వ్యతిరేకత ఒక నిర్మాణ రూపం తీసుకున్నది. ఫలితంగా వీధి పోరాటాలు, మీటింగులు, ఈ మధ్యలోనే అత్యయిక పరిస్థితి ప్రకటించబడింది. నారాయణవాళ్లు అరెస్టయ్యారు. నారాయణ కార్యకర్తగా తెలిసింది. రూమ్ మేట్‌ కనుక వీరన్నను కొంతకాం లాకప్‌లో పెట్టారు.

నారాయణ విద్యార్థి రంగంలో పనిచేశాడు. ఎమర్జెన్సీ ఎత్తివేయగానే ‘విప్లవానికి బాట’, ‘వ్యవసాయ విప్లవం’ జయప్రదం చేయడానికి అప్పటి మా ప్రాంతపు జన నాట్య మండలి బాధ్యుడిగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో అనేక ప్రదర్శనలిచ్చారు. నారాయణ ఉపన్యాసకుడుగా, గాయకుడిగా, నటుడిగా పనిచేశాడు. 8 సెప్టెంబర్‌ 1978న జగిత్యాల జైత్రయాత్ర సందర్భంగా జగిత్యాల పట్వారిగా ‘బీదల పాట్లు’లో నటించాడు. నారాయణ నాకు, మా వీరన్నకు విప్లవోద్యమాన్ని పరిచయం చేశాడు. అప్పుడు పుస్తకాలు చదివినవాళ్లం మేం ముగ్గురం సాహిత్యం రాయాల్సి వచ్చింది.

ఉద్యమాల డిమాండ్‌ మేరకు పోరాటంలోంచి పాటలు కావాల్సి వచ్చినవి. వీరయ్య భావుకుడు. ఆయన పాటలు రాశాడు. నారాయణ ఆ పాటలన్నీ మీటింగుల్లో పాడేవాడు. నారాయణ ఉద్యమ అవసరాల రీత్యా పాటలు రాశాడు. కవిత్వం రాశాడు. ఆ తరువాత నారాయణ పూర్తి కాలపు కార్యకర్తగా 1985 దాకా అజ్ఞాత జీవితం. తరువాత బయటకు వచ్చి చదువు కొనసాగించాడు. మళ్లీ ఉస్మానియాలో విద్యార్థి ఉద్యమాలు, పత్రిక విలేఖరిగా, నమస్తే తెలంగాణ సంపాదకుడిగా, తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుగా, ఫోరం అధ్యక్షుడిగా` ‘అల్లం కారం’, ‘ప్రాణహిత’ కాలమ్స్ రాశాడు. అనేక ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అనేక మీటింగులు ఏర్పాటుచేశాడు.

వీరన్న ‘ఎర్రజెండెర్రజెండెన్నియలో’ లాంటి చాలా పాటలు రాశాడు. `పిలగాని ఏడుపు’, ‘రెండు మరణాలు’, ‘వాసన’, ‘ధీరుడు’ లాంటి గుర్తుండే పది కథలు రాశాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు రాశాడు. ఆ కాలంలో కరపత్రాల నుండి మొదలుకొని పత్రికకు రిపోర్టులు, ఉద్యమ రిపోర్టులు, కథలు, నవలలు, ఉద్యమ మలుపులతో సహా అనేకం నేను రాయాల్సి వచ్చింది. మాట్లాడాల్సి వచ్చింది. విశ్లేషించాల్సి వచ్చింది.

ఏది ఏమైనా ఒక చిన్న పల్లెటూరు నుండి, పేద రైతు కుటుంబం నుండి, బహుజన కులం నుండి, చదువు లేని కుటుంబం నుండి అనేకానేక గొడవల మధ్య, పోరాటాల మధ్య మృత్యువుకు మిల్లీమీటర్‌ దూరంలో తెలంగాణ సమాజం అనుభవించినంత ఒత్తిడి, దు:ఖం మేం అనుభవించాం. అయినా సాహిత్యరంగంలోకి రావడం జరిగే పని కాదు. పుస్తకాలు, విప్లవోద్యమం, తెలంగాణలో మా లాగే చాలా మందికి కొత్త, వేగవంతమైన మూడు తరాల, యాభై సంవత్సరాల పోరాట అనుభవాలను నేర్పింది. మాకెప్పుడు అమరులైన మా సహచరులు మార్గదర్శకులుగా నిరంతరం మెదులుతూ ఉంటారు. తెలంగాణ, మా కాలం, విప్లవోద్యమం మమ్ముల్ని మనుషుల్లో కలిపింది. నిలబెట్టింది. సాహిత్యం రాయించింది.

మీ రచనల్లో స్థానికతను ఉద్యమ స్థాయిలోకి ఎట్ల తీసుకొచ్చిన్రు?

విప్లవోద్యమాలు ఎప్పుడైతే నేనున్న స్థల కాలాల్లోని వైరుధ్యాలను మార్చాలనుకున్నాయో గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తి వనరులైన భూమి, అడవి, చెట్టు, పుట్ట, పశు పక్ష్యాదులు- ఉత్పత్తి శక్తులైన రైతు, రైతు కూలీలు, మధ్య తరగతి రైతులు, ధనిక రైతులు, భూస్వాములు, నైసర్గిక స్వరూపం, భౌగోళికాంశాలు, కులాలు, వీటన్నిటి మధ్య వైరుధ్యాలు – నీటి వనరులు, ఉత్పత్తి పరికరాలు, ఉత్పత్తి సంబంధాలు ప్రతి గ్రామానికి అధ్యయనం కొనసాగింది. ప్రచురించిన ‘మాణిక్యాపూర్‌’ సామాజిక సంబంధాల తరహాలో ఈ అధ్యయనంలో అనివార్యంగా భాగస్వామిని కావాల్సి వచ్చింది.

గ్రామాల్లో, పట్టణాల్లో ఉండే సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలు… శత్రువులెవరు? మిత్రులెవరు? ఎక్కడ మొదలు పెట్టాలె? రైతుకూలీ సంఘాలు ఏర్పడి పనిచేయడంతో పరిష్కారానికి సమిష్టి స్వరూపం వచ్చింది. ‘విప్లవానికి బాట’, ‘వ్యవసాయ విప్లవం’ దారిలో ‘దున్నేవారికే భూమి’ ప్రతిపాదికన ఉద్యమాలు నడిచాయి. కూలీ రేట్లు పెంపు, పాలేర్ల జీతాల పెంపు, ఆశ్రిత కులాల వెట్టి రద్దు, పాలేరుకు సరైన పెట్టుబడుల డిమాండ్‌- ఈ సమస్యలన్నీ పరిష్కరించే క్రమంలో ఊరికీ ఇంకో ఊరికీ వ్యత్యాసాలుండేవి. ఇలాంటి పోరాటాలను సమన్వయం చేసి ఆర్థిక పోరాటాలను, రాజకీయ పోరాటాలుగా, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలుగా అభివృద్ధి చేయాల్సిన తరుణంలో, విప్లవోద్యమంలో ఉన్న ప్రజలకు, వారి నాయకులకు ప్రణాళికబద్ధమైన, రాజకీయాలందించడానికి పాట ఎప్పుడో 1970 తరువాతనే స్థానికతను సంతరించుకున్నది. ప్రజల భాషను ఎంచుకున్నది. అంతకన్నా విస్తృతంగా, లోతుగా కార్యక్రమాలు కనిష్ట స్థాయి నుంచి గరిష్ట స్థాయికి సాహిత్య రూపాలు అవసరమయ్యాయి. మొదట కరపత్రాలు ప్రజల భాషలో రాయడం ఆరంభించి కథలు రాయడం అవసరమైంది. అట్లాగే పోరాటాలు ఒక దశ నుండి మరొక దశకు గుణాత్మకంగా మార్పు చెందే క్రమంలో గడిచిన అనుభవాల నేపథ్యంలో వర్తమానం భవిష్యత్‌ దారిలో నవలలు రాయాల్సి వచ్చింది.

అట్లా వస్తువు, శిల్పం, భాష స్థానికతను సంతరించుకున్నవి. విప్లవోద్యమం అన్ని శక్తులను, వనరులను చైతన్యవంతంగా సమన్వయం చేసుకుని ముందుకు సాగే క్రమంలో విప్లవోద్యమ స్థాయిలో సాహిత్యంలో ఉద్యమ స్థాయి పెరుగుతూ, బలపడుతూ వచ్చింది. అందుకే మిగతా సాహిత్యం కన్నా విప్లవోద్యమం నుండి వచ్చిన సాహిత్యం భిన్నమైంది. చారిత్రాత్మకమైంది. సజీవమైంది. వైయక్తిక అనుభవ స్థాయి నుండి సమిష్టి స్థాయికి, ఉత్పత్తి శక్తుల దగ్గరికి సాహిత్యం చేరుకోగలిగింది.

రష్యా, చైనా విప్లవోద్యమాల అనుభవ సారంతో ఇక్కడి విప్లవోద్యమం సాహిత్యాన్ని ఒక ఆయుధంగా పదునైన ఆయుధంగా అభివృద్ధి చేసుకున్నది. అందుకే విప్లవోద్యమ కార్యకర్తలు చాలామంది పాటలు, కవిత్వం, కథలు, నవలలు రాశారు. సాహిత్యం విప్లవోద్యమం వెనుకనో, ముందో నడువకుండా ఉద్యమంతో పాటే నడవడం మన కాలపు ప్రత్యేకత.

‘ఆట, మాట, పాట బంద్‌’ పరిస్థితుల్లో మీలో జరిగిన సంఘర్షణ?

గతితార్కిక, భౌతిక చారిత్రక అంశాలు తెలిసినవారు, ‘మార్క్సిజం, లెనినిజం, మావోయిజం’ తెలిసినవారు, విప్లవోద్యమ ‘ఎత్తుగడలు, వ్యూహాలు’ ఎప్పటికప్పుడు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను అనుభవ నేపథ్యంలో సమీక్షించుకునే క్రమంలో, ఆచరణలో వైరుధ్యాలను పరిష్కరించే క్రమంలో అతివాద, మితవాద ధోరణులకు లోనుకావడం సహజం. ఇది చాలా సంఘర్షణకు ప్రతిష్టంభనకు దారితీస్తుంది. ఇలాంటి స్థితిలోనూ సకల సంపదల మీద అధికారం గల శక్తులు అవకాశంగా తీసుకుంటాయి. విప్లవోద్యమం మీద నిర్బంధం సాధారణంగా విప్లవోద్యమం లోపల జరిగే సంఘర్షణలకు, బయటి నిర్బంధం ప్రతిఫలిస్తుంది.

దీర్ఘకాలిక విప్లవోద్యమంలో ఇవన్నీ సహజం, అనివార్యం, అని అర్థం చేసుకోగల అవగాహన ఉంటే ఆచరణలో క్రమంగా ముందుకు సాగుతాం. ‘యుద్ధరంగంలో శత్రువుకు శత్రు దారులుంటే పోరాడే ప్రజలకు వాళ్ల దారులు, పద్ధతులుంటాయి’ అంటుంది మదర్‌ కరేజీ (బ్రెస్టోల్‌ బ్రెక్ట్‌) నాటకంలో రెండో ప్రపంచ యుద్ధ సైన్యానికి నిత్యావసర సరుకు సరఫరా చేసే అమ్మ. అన్ని సందర్భాల్లో సాహిత్యం వస్తూనే ఉంది. నాకు అది సహజమైనదని, దాటవలసిందనే అవగాహన ఉంది గనుక అలాంటి ఆలోచనలు జరిగాయి. సంఘర్షణ దాటడానికి సంబంధించింది.

కల్లోల కాలాన్ని సాహిత్యంలో ఎట్లా రికార్డు చేశారు?

ప్రత్యేకంగా కల్లోల కాలమంటూ ఏదీ ఉండదు. వైరుధ్యాలను ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవడం, సరైన సమయాల్లో పరిష్కరించడంలో సమస్యలుంటాయి. విప్లవ క్రమాన్ని ఎత్తుగడలను అర్థంచేసుకోవడంలో, ఆచరించడంలో విప్లవ శక్తుల మధ్య అంతరాలుంటాయి. అది లోలోపల సంఘర్షణ. ఎప్పటికప్పుడు విప్లవ శక్తులను ఎదుర్కోవడానికి, నిర్మూలించడానికి సంపద హస్తగతం చేసుకున్న శక్తులు, తమ రాజకీయ అధికారం ద్వారా కొత్త ఎత్తుగడలతో ముందుకు వస్తాయి. ఈ సంఘర్షణను భావోద్వేగాలతో అర్థమైనంత మేరకు, శక్తి మేరకు అన్ని రకాల సాహితీ మాధ్యమాల ద్వారా చిత్రించడానికి మిగతా విప్లవ రచయితల లాగే నేనూ ప్రయత్నం చేశాను. ‘కొలిమంటున్నది’ నుండి ‘టైగర్‌ జోన్‌’ దాకా నవలల్లో దాదాపు 100 కథల్లో ‘సంఘం’ నుండి ‘చూపు’ దాకా ఇంటర్వ్యూలు, ముందు మాటలు, నాటకాలు ఇట్లా ఐదు నవలలు, 93 కథలు కాలక్రమం ననుసరించి ఆరు సంపుటాలుగా పర్‌స్పెక్టివ్స్ హైదరాబాద్‌ వారు ప్రచురించారు. ఆఖరి సంపుటం రాబోతుంది. ఇది యువతరం చదివితే విప్లవోద్యమ సాహిత్యం అర్థమవుతుంది.

మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన రచయితలెవరు?

ముందే చెప్పినట్టుగా మా మేనత్త తిప్పని మీనమ్మ, అమ్మమ్మ కారుకూరి భీమమ్మ, నానమ్మ అల్లం చంద్రమ్మ మౌఖిక కథలు. వందలాది మంది మా వూరి మౌఖిక, జానపద కళాకారులు… నా చుట్టూ విస్తరించి ఉన్న నా జీవితంతో పెనవేసుకున్నవాళ్లెందరో. వాళ్ల అనుభవాలు మౌఖికంగా పంచుకున్నారు. వాళ్లు మౌఖిక కళాకారులు.

తెలుగులో చిలకమర్తి, విశ్వనాథ నుండి ఇప్పటి దాకా అందినకాడికి చదువుతుంటాను. ఇన్ని వైరుధ్యాలతో ఉన్న సమాజంలో ఒక్కొక్కరికీ ఆరాట పోరాటాలు, కులాలు వేర్వేరు. పేరు లేని అనేకమంది రచయితలు నన్ను ప్రభావితం చేశారు. కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్‌, ఉన్నవ, చలం, బుచ్చిబాబు, మా గోఖలే, పి. సత్యవతి, ఓల్గా, రంగనాయకమ్మ, లత, కాళీపట్నం రామారావు, భూషణం, రావిశాస్త్రి, అప్పల్నాయుడు, బీటీ రామానుజం, దాశరథి రంగాచార్య, కాళోజీ, యద్ధనపూడి, వట్టికోట ఆళ్వారుస్వామి, వరవరరావు, షహీదా, సాధన, రఘోత్తమరెడ్డి, పి. చంద్‌, ఖదీర్‌బాబు, నామిని, బండి నారాయణస్వామి, పాణి, దేవపుత్ర, కళ్యాణరావు, మధురాంతకం నరేంద్ర, మహేంద్ర, రాసాని, ఉమామహేశ్వరరావు… నా ముందు తరం, సమకాలికులు, యువకులు… అందరి నుండీ ప్రభావితమయ్యాను. పేర్లు రాస్తే ఎన్నో. ముఖ్యంగా విప్లవ రచనను రాసే వారెవరైనా మార్పు క్రమానికి సంబంధించి ఆ ప్రక్రియలో, ఆ స్థల కాలాల్లో పోరాడిన ప్రజలే అంతిమంగా ప్రభావితం చేస్తారు. అంతిమంగా విప్లవమే అత్యంత ప్రభావితం చేసే అంశం.

‘మధ్యవర్తులు’ కథ రూపొందడానికి నేపథ్యం?

నేనెంతో ప్రేమించిన మా పల్లెలో బతికే పరిస్థితులు లేనందున బయటపడడానికి చదువు అనే దారప్పోసతో ఊరొదలడం లోలోపల గూడు కట్టిన విషాదం. గుడిమెట్టు, బూరుగాకు, టీనేజీ ప్రేమలు, మంచె కావళ్లు, ఎడ్లగాసుడు, ఏ మాయా మర్మం లేని దోస్తులు… ఇప్పటికీ కలలోకొస్తయి. అందరితో పాటు అక్కడే ఉండకుండా ఊరొదిలి రావడం గిల్టీగా ఉండేది. అయితే అనేక అసమానతలతో, వైరుధ్యాలతో, హింస, దోపిడీతో కూడుకుని ఉన్న భూస్వామిక పల్లెనొదలడం అనివార్యమైతే చదువు ద్వారా దోపిడీ, యంత్రాంగంలో భాగమై ఉద్యోగం చేయడం, ఈ రెండు రకాల జీవిత సంఘర్షణ ప్రతినిత్యం వేధించేది. విప్లవోద్యమాలు, మార్క్సిజం, పరాయీకరణ, గోర్కీ వ్యక్తిత్వ విధ్వంసం చదివినా కొద్దీ విప్లవోద్యమాల తక్షణ అవసరాలైన ఆర్థిక, సామాజిక పోరాటాలు చేసి వాటిని పరిష్కరించే వ్యూహంలోని భాగంగా ప్రజలకు రాజకీయ అధికారం సాధించడంలో స్థావర ప్రాంతాల నిర్మాణం జరిగింది.

సింగరేణి కార్మికుల్లో సికాస బలమైన నిర్మాణంగా ఎదిగింది. ఈ దశలో ప్రజలు ప్రత్యక్ష దోపిడీని అంతమొందించారు. దొరలు గ్రామాలు ఖాళీ చేశారు. ఆ స్థానాన్ని బూర్జువా నిర్మాణ రూపాలైన స్థానిక సంస్థలకు ఎక్కువ భాగం బహుజనులు ఎన్నికయ్యారు. విప్లవోద్యమాల్లో పాల్గొన్న రైతుకూలీలైన దళితులు, మహిళలు చాలా భాగం ఈ నిర్మాణాలకు ఆవలే ఉన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చినవాళ్లు మునుపటి దొరలు కాదు. కానీ వీళ్లు రాజ్యం యంత్రాంగానికి ‘మధ్యవర్తులు’. సింగరేణి కార్మికులు అనేక సమ్మెలు, పోరాటాలు చేసి వారి దైనందిన సమస్యలు పరిష్కరించుకొని రాజకీయంగా ఎదిగి నాయకత్వం వహించే విషయంలో తడబడుతున్నారు. అదే క్రమంలో ఎదగాల్సిన ప్రజాసైన్యం, స్థావర ప్రాంతాల డిమాండ్‌ పెద్ద ఎత్తున ఏర్పడింది. అనివార్యంగా ఆదివాసులు అండగా నిలబడ్డారు. ఆర్థిక పోరాటాల్లో వేల సంఖ్యలో కదిలిన ప్రజలు ఆ సమస్యలు పరిష్కారం కాగానే రాజకీయ పోరాటాలు ఉన్నత రూపంలోకి తగినంత రాలేదు.

ఈ స్థితికి కారణమేమిటి? మార్క్సిజం ఏం చెప్పుతోంది? మన పోరాటాల అనుభవమేమిటి? పెద్ద ఎత్తున ఏర్పడుతున్న, రూపొందుతున్న‘మధ్య తరగతి’ గురించి ఆలోచనలు సాగాయి. గోపీచంద్‌ ‘అసమర్థుడి జీవయాత్ర’, కొకు, రావి శాస్త్రి రచనలు అధ్యయనం చేశాను.

భారతదేశ వ్యాపితంగా ఇలాంటి మధ్యవర్తుల గురించి అన్ని భాషల్లో సాహిత్యం వచ్చింది. దాదాపుగా వచ్చిన సాహిత్యమంతా కూడా వైయక్తికంగా మధ్యవర్తులు రూపొంది రాజకీయాధికారపు యంత్రాంగంలో భాగమవడం, కొంత సంఘర్షణ, చివరకు లొంగిపోవడం వరకు మాత్రమే చర్చించాయి. మధ్యతరగతి గోడమీది పిల్లి. విప్లవోద్యమాలు గెలిచే విధంగా ఉంటే అందులో చేరుతాయి. ఓడిపోతే కనుమరుగై పోతే ప్రభుత్వ పక్షం చేరుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రజలను అణచడానికి, దోపిడీ చెయ్యడానికి రాజ్యం వీళ్లను చీలదీసి మధ్యవర్తులుగా యుద్ధరంగంలో నిలబెట్టి ప్రజలతో కొట్లాడే విధంగా తయారు చేస్తుంది.

1967 నుండి 1990 దాకా కొనసాగిన విప్లవోద్యమం దాదాపు 23 సంవత్సరాల కాలంలో అనేకమంది విప్లవం నుండి తప్పుకున్నారు. ప్రమాదం కాని విశ్లేషణలకు, విమర్శలకు మాత్రమే పరిమితమైన అనేక సంఘాల్లో సమీకృతమయ్యారు. ఈ స్థితిని పసిగట్టిన సామ్రాజ్యవాదం, రాజ్యం ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తూ దానికి తగిన తాత్వికతను రూపొందించే ఎత్తుగడను చేపట్టింది. అనేక ఎన్జీవో సంఘాలు ఇతర సంఘాలు ఏర్పడి బలం పుంజుకున్నాయి. అందరి సనుగుడు విప్లవోద్యమం మీదే.

విప్లవోద్యమం ఈ స్థితికి సంబంధించిన భావ, భౌతిక పునాదుల గురించి అలాంటి శక్తులను సమీకరించడానికి సంబంధించి విప్లవీకరించడానికి, రాజకీయ చైతన్యం కలిగించడానికి పూనుకున్న క్రమంలో 1990 నవంబరులో ఈ కథ వచ్చింది. ఆ పునాదుల మీదనే వీళ్లందరిని సమీకరించి ‘సేవ రంగం’గా ముద్దుపేరు పెట్టి దళారీ సామ్రాజ్యవాద దోపిడీకి వాహికగా చేశారు. ఆ తాత్విక నేపథ్యంలోనే ప్రపంచీకరణ 1991లో పీవీ నర్సింహారావు సామ్రాజ్యవాద పెట్టుబడికి, మార్కెట్టుకు తలుపులు బార్లా తెరవడం జరిగింది. అప్పుడు 30శాతం ఉన్న ‘సేవ రంగం’ వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి రంగాలను దాటేసి 65శాతం దాదాపు 35 కోట్ల మందికి విస్తరించింది. దేశీయంగానే కాదు, ప్రపంచ మార్కెట్టుకు, దోపిడీకి ‘మధ్యవర్తులు’ వాహికయ్యారు. యంత్రాంగం అయ్యారు. జాతీయ ఉత్పత్తిలో 73 శాతం ప్రతి యేటా దేశ విదేశాల దోపిడీదార్ల దోపిడీకి వీళ్లే యంత్రాంగం. కానీ తీవ్రమైన ఒత్తిడికి, మోసానికి, లోపలి విధ్వంసానికి గురయ్యారు. మన వేలితో మన కళ్లను పొడవడం ఇది.

విప్లవోద్యమ నేపథ్యంలో స్థల కాలాల్లో పరాయీకరణ క్రమం సంఘర్షణా విడదీయడం, లోబరుచుకోవడం నుండి బయటపడి అంతిమంగా మధ్యతరగతి ప్రజలు విప్లవోద్యమం ద్వారానే తమ విముక్తి సాధించగలరనే ఆశ, అందుకు తగిన ఆచరణ ‘మధ్యవర్తులు’ కథ రూపొందడానికి కారణం.

అభివృద్ధి వెలుగు నీడల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?

సాధారణంగా అర్థ భూస్వామ్య, అర్థ వలస ప్రభుత్వాలు స్థల కాలాల్లో ఉత్పత్తి వనరుల నుంచి, ఉత్పత్తి శక్తుల నుంచి అధిక అదనపు విలువను దోపిడీ చేయడానికి కావాల్సిన మౌలిక వసతులు ప్రజల సొమ్ముతో అనివార్యంగా కల్పించుకుంటుంది. దాన్నే అభివద్ధిగా వర్ణిస్తుంది. ప్రపంచ వ్యాపితంగా సామ్రాజ్యవాద ఉత్పత్తిలో తలెత్తిన సంక్షోభాన్ని దాటవేయడానికి నియంత్రణలేని, ప్రజల కవసరం లేని, చెత్త సరుకులు లాభం కోసం ఉత్పత్తి చేసి ఆయా దేశాల్లోని శ్రామిక ప్రజలకు అలాంటి వస్తువులను కొనుక్కోవడానికి కొనుగోలు శక్తి లేనందున ఇతర దేశాల్లోకి సామ్రాజ్యవాదం మార్కెట్ ను విస్తరించింది. ఈ సరుకుల ద్వారా దేశీయ ఉత్పత్తి రంగం దెబ్బతింటుంది. ప్రజలు చావో రేవో తేల్చుకొనే స్థితికి నెట్టబడుతారు. బడ్జెట్ లో ఎక్కువ భాగం అలాంటి పోరాటాలను అణచడానికి సైన్యం, ఆయుధాలు, రోడ్లు లాంటి వాటికి ఖర్చు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా బహుళ జాతి సంస్థల ఏర్పాటు కోసం ప్రజల సొమ్ముతో, వరల్డ్ బ్యాంకు అప్పులతో వసతులు కల్పించబడుతాయి. ఇదంతా ప్రజల ప్రమేయం లేని, ప్రజల దైనందిన జీవితాన్ని కకావికలు చేసే విధ్వంసం.

అభివృద్ధిని ఉత్పత్తి వనరులు, ఉత్పత్తి శక్తులు, ముఖ్యంగా ఉత్పత్తి సంబంధాల నేపథ్యంలో చూడాలి. ప్రజాస్వామిక ఉత్పత్తి సంబంధాలు నెలకొల్పబడని చోట… ఉత్పత్తి యావత్తు దోపిడీ, పీడనలతో కూడి ఉంటుంది. దాన్ని అభివృద్ధిపేర ప్రచారం చేస్తుంటారు. భారతదేశంలో బ్రాహ్మణీయ భూస్వామ్య ఉత్పత్తి సంబంధాలు సహజంగా పరిణామం చెందకుండా నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను బలవంతంగా, హింసాత్మకంగా భారత ప్రజల మీద మోపారు. ఫలితంగా అదనపు విలువ పెట్టుబడిగా ఎదగలేదు. మధ్యలో వచ్చిన బ్రిటిష్ వలస వాదులు అలాంటి భూస్వామ్యంతో మిలాఖతై బడా బూర్జువాలుగా ఎదిగారు. దేశంలో మౌలిక వసతులకు సంబంధించిన ఉత్పత్తులు చేసి చిన్న పెట్టుబడిదారులు సంఘటితపడి జాతీయ బూర్జువాలుగా ఎదిగి భూస్వామ్యాన్ని తుద ముట్టించే పోరాటంలో విప్లవ శక్తులతో కలిసిరాలేదు. ఎదగనివ్వలేదు. కనుక మన దేశంలో జెండాలు మారినా ఎజెండాలు ఒక్కటే. అన్ని పార్టీలు అర్ధ భూస్వామ్య, అర్ధ వలస స్వభావం గల్గినవే. అదే విధ్వంసం. దాని పేరే అభివృద్ధి. ప్రజానీకం ఆకాంక్షలకు విరుద్ధంగా, బలవంతంగా సహజ వనరులు కొల్లగొట్టడం… దళారులుగా అమ్ముకోవడం దాని పతాక స్థాయి. అభివృద్ధి క్రూరమైన వ్యక్త రూపం విస్తాపన. భారతదేశం అభివృద్ధి పేర బొందల గడ్డగా మార్చారు. దేశం మొత్తం నిర్బంధ క్యాంపుగా మారింది.

కథ నిర్మాణం, శిల్ప వైవిధ్యం ఎట్లా ఉండాలంటరు?

ఉత్పత్తి సంబంధాలతో మనిషికి జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవం కలుగుతుంది. వర్గ, కుల, మత, లింగ, ప్రాంత అసమానతలున్న సమాజంల మన అనుభవం కూడా అసమానతలతో కూడి ఉంటుంది. విప్లవోద్యమ కాలంలో అసమానతల మధ్య వైరుధ్యాల కదలిక, పరిష్కారం ఆరంభమౌతుంది. ఇది పాత అనుభవాలతో కొత్త అనుభవం పడే ఘర్షణ. ఈ సంఘర్షణలోంచి అభివద్ధి నిరోధకమైనది, ఆచరణ యోగ్యం కానిది నశించిపోతుంది. ప్రగతిదాయకమైనది ఆచరణకు పురిగొల్పుతుంది. ఇలాంటి సంఘర్షణ భావోద్వేగాలను రేపుతుంది. ఇలాంటి వైయక్తిక అనుభవ సంఘర్షణ సమిష్టి అనుభవంగా విప్లవోద్యమంలో రూపొందడం ఆరంభమౌతుంది. వర్గ పోరాటాల గతితార్కిక చరిత్ర ఈ సమిష్టి ఆచరణను మెరుగు పెడుతుంది. ఈ ప్రక్రియను ఇతరులతో పంచుకోవాలనుకున్నప్పుడు ఎవరికి, ఎప్పుడు, ఎలా, ఏమిటి, ఎక్కడ, ఎంత అనేవి కథ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అట్లాగే అందుకు తగిన శిల్పం, భాష, వాతావరణం, సన్నివేశాలు, సంఘటనలు, సంభాషణల ఎంపిక మన అనుభవ నేపథ్యంలో రూపొందినవి కథా నిర్మాణంలో పనికి వస్తాయి.

కథలోని అంగాలైన శిల్పం, భాష, సన్నివేశాలు, వాతావరణం, పాత్రలు, సంభాషణలు ఉత్పత్తి సంబంధాల నేపథ్యంలో వర్గపోరాటాలతో పాటు అభివృద్ధి చెందే విషయాలు. కథా రచనలోకి దిగి అభ్యాసం చేసినాకొద్ది కథలోని అంగాల లక్షణాల చిత్రీకరణ కనిష్ట స్థాయి నుండి గరిష్టంగా మనం ఎంచుకున్న వస్తువుననుసరించి కథా అంగాలైన శిల్పం, భాష మారుతూ ఉంటాయి.

‘కొలిమంటుకున్నది’ నవల జనాన్ని ఎట్లా ప్రభావితం చేసింది?

అంతవరకు సమస్యలు, విశ్లేషణలు మధ్యతరగతి వరకే పరిమితమైన సాహిత్యం విప్లవోద్యమంలో భాగంగా గ్రామీణ ప్రాంత రైతాంగ, రైతు కూలీ ఆరాట పోరాటాలను చిత్రించడం ఆరంభించింది. ముఖ్యంగా ప్రజలకు చెప్పడం కన్నా చేతలు కావాలి. చేతలు గాలికన్నా వేగంగా ప్రచారమవుతాయి. రైతుకూలీ సంఘాల ఏర్పాటు అవి గిడసబారిన దొర అణచివేతను ఎదిరించే శక్తిగా ఎదగడం, సంఘాల నిర్మాణం లాంటి విషయాలు ప్రచారమయ్యాయి. అలాంటి నేపథ్యంలో ‘కొలిమంటుకున్నది’ నవల రూపొందింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ గ్రామీణ ప్రజలు, వారి నాయకులు తమ పలుకుబడితో జీవితంతో భాషలో చెప్పే పద్ధతిలో వచ్చిన నవలను తమ జీవితాలకు అన్వయించుకున్నారు. ఆ రోజుల్లో నేను తిరిగిన గ్రామాల్లో రైతులు సంఘటన గురించి దొరతనం గురించి నాతో చర్చించేవారు. భావోద్వేగాలకు లోనయ్యేవారు. కార్యకర్తలు చాలా ఊళ్లల్లో చదివి విన్పించేవాళ్లు. మొట్టమొదటిసారిగా విప్లవోద్యమం పరిమితమే అయినా ఇలాంటి సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది. పురికడుతున్న విప్లవోద్యమానికి ‘కొలిమి’ అంటుకొని మండటానికి ఆ నవల నాంది అయింది. ‘సాహితీ మిత్రులు’, వరవరరావు కలిసి ఆ నవలకు పెట్టిన పేరు అర్థవంతమయ్యింది.

సాహిత్యంలో తెలంగాణ వ్యక్తీకరణ, భాషా జీవితం ఒక అస్తిత్వంతో ముందుకు తోసుకురావడం సాంస్కృతికపరమైన ఉద్యమానికి పునాది వేసింది. 1968లో మొదలై ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన దాకా జరిగిన అనేక ఉద్యమాలకు కూడా ‘కొలిమంటుకున్నది’ నవలే మూలమయ్యింది. అప్పటి నుండి, అక్కడి నుండి గౌరవనీయమైనదిగా చలామణి ఔతున్నది. ఆ నవలలో లేవనెత్తిన ఉత్పత్తిపరమైన అంశాలు పరిష్కరించడానికి, వైరుధ్యాలు పరిష్కరించడానికి మూడు తరాలు పోరాడుతూనే ఉన్నాయి. అలాంటి పోరాట చరిత్రలో ఒకానొక ఆరంభ దశకు సంబంధించిన ప్రజల వ్యక్తీకరణకు ‘కొలిమంటుకున్నది’ ఒక వాహికగా నిలిచింది.

‘కొలిమంటుకున్నది’నవలపై గూగీ ప్రభావం ఏమయినా ఉందా? ‘కొలిమంటుకున్నది’ నవలను ప్రజలు ఎట్లా సొంతం చేసుకున్నరు?

ఆ నవల రాసే సమయానికి నాకు గూగీ తెలియదు. కెన్యా కూడా మనలాగే అర్ధ వలస, అర్ధ భూస్వామిక దేశం. అక్కడ అలాంటి రాజ్యాధికారాన్ని మార్చడానికి వారి వారి స్థల, కాలాల నేపథ్యంలో సాయుధ పోరాటాలు నడిచి విఫలమయ్యాయి. అదొక విషాధ అనుభవం. గూగీ కుటుంబం దాదాపు మా కుటుంబం లాగే అందులో భాగం కాక తప్పలేదు. 1967లో ఆరంభమైన నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు అనేక దశల గుండా ప్రయాణించి 1978, సెప్టెంబర్ 8, 1978 ‘జగిత్యాల జైత్రయాత్ర’ నాటికి సంఘటిత పడ్డాయి. ‘వ్యవసాయ విప్లవం’ ఇరుసుగా జరిగిన పోరాటంలో కరీంనగర్, ఆదిలాబాదు రైతాంగం, రైతు కూలీలు పెద్ద ఎత్తున కదిలారు. విప్లవోద్యమం సాహిత్యాన్ని ఒక ఆయుధంగా ఎంచుకున్నది కనుక, గ్రామ సీమల్లో పనిచేస్తున్నది కనుక ప్రజల భాషలో ఆ నవల రాయాల్సి వచ్చింది. అప్పటికే నిర్మాణాలు ఏర్పడి బలపడుతుండటం వల్ల రెండో దశకు చేరుకున్నాయి. గూగీ గికియూ భాషలో నాటకం రాసి ప్రదర్శించిన సమయానికి కెన్యాలో నియంత పరిపాలను ఉన్నది. సాపేక్షికంగా ఆ నాటకం ప్రత్యక్ష ప్రదర్శన కనుక ఎక్కువ నిర్బంధం చవిచూసింది. తెలంగాణాలో తొలి రోజుల్లో ‘జన నాట్య మండలి’ అనేక వందల ప్రదర్శనలిచ్చిన స్క్రిప్టు లేని ‘బీదల పాట్లు’ నాటకం దాదాపు అలాంటిదే. ఇదివరకే చెప్పినట్లు ప్రజలు ‘కొలిమంటుకున్నది’ నవలను తమ పోరాట అనుభవంగా, జీవితంగా ఆదరించారు.

(మిగతా వచ్చే సంచికలో…)

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

5 thoughts on “ప్రజాపోరాటాలే నా రచనలకు ప్రేరణ : అల్లం రాజయ్య

  1. Congratulations brother… Good work

  2. ఒక గొప్ప ప్రజాసాహీతీకారుడితో మాట కలిపితే జీవితం వరదై పారక ఏంచేస్తుంది. గొప్ప ఇంటర్య్వూ. అత్యంత సునిశితమైన జీవిత దర్శనం సర్ ది. Awaiting for next episode.

  3. Narayana 1985 నాటికి అజ్ఞాతంలో లేడు. ఓయూ లో సలంద్ర రూమ్ లో ఉండేవాడు. నేను 1967లో మంథని లో 8వ తరగతి చదివాను. అంటే మీరు నేనూ క్లాస్మేట్స్ మా? కృష్ణా రెడ్డి నా క్లాస్ మేటే. చాలా .ఏళ్ల తర్వాత లా కాలేజ్ లో ఉండగా వచ్చాడు. మల్లోజుల వేణు రాసిన వ్యాసం ద్వారా కృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి ఏడ్చాను. ఒక న్యాయవాది, ఒక విప్లవకారుడు ఇలా వెళ్ళిపోయాడేమిటి? అని చాలా బాధేసింది.

  4. రాజయ్యగారి సాహిత్య వ్యక్తిత్వాలను నేపద్యాన్ని అర్ధం చేసుకోడానెలాగా ఉంది ఇంటర్వ్యూ. సుధాకర్ చాలా మంచి ప్రశ్నలు అడిగారు.
    మధ్యవర్తులు కధ ప్రాసంగీతను చాలా బాగా చెప్పారు.

Leave a Reply