అరుణాక్షరావిష్కారానికి తక్షణ ప్రేరణలు

(అరుణాక్షర అద్భుతం – 03)

దిగంబర కవులు విప్లవ రచయితల సంఘం ఆవిర్భావానికి ఒక కర్టెన్ రెయిజర్ అనే మాట ఇప్పటివరకూ సాహిత్య చరిత్రలో ఒక అలవాటుగా నమోదవుతూ వస్తున్నది గాని నిశితంగా, సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ మాటను కూడ ఇంకా విస్తరించవలసి ఉందని తేలుతుంది. దిగంబరకవుల సంచలనాన్ని విప్లవ రచయితల సంఘ ఆవిర్భావానికి ఉండిన నాలుగైదు తక్షణ ప్రేరణలలో ఒకటిగా మాత్రమే చెప్పవచ్చు. ఆ తక్షణ ప్రేరణలు కాక, దీర్ఘకాలిక, సుదూరమైన ప్రేరణలు, యుగస్వభావంగా మారిపోయిన ప్రేరణలు కూడ ఎన్నో ఉన్నాయి. సూక్ష్మంగా పరిశీలిస్తే 1960 దశకంలో యుగస్వభావంగా మారిన యువతరం అసంతృప్తి, ఆ అసంతృప్తి అనివార్యంగా కోపోద్రిక్తంగా మారడం, వియత్నాం యుద్ధ వ్యతిరేకత, ఫ్రెంచి విద్యార్థి తిరుగుబాటు, అమెరికాలో మెకార్థీ అప్రజాస్వామిక హింసాత్మక దాడుల తర్వాత పౌరసమాజం తేరుకుని వికసింపజేసిన పౌరహక్కుల ఉద్యమం, ప్రపంచవ్యాప్తంగా గడ్డకట్టుకుపోతున్న కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాల మీద ప్రశ్నలు, తిరుగుబాట్లు, చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం వంటి అంతర్జాతీయ సంచలనాలెన్నో విరసం ఏర్పాటుకు వ్యక్తావ్యక్త, స్పష్టాస్పష్ట సుదూర చారిత్రక భూమికలుగా నిలిచాయి. అలాగే, దేశంలోనూ రాష్ట్రంలోనూ తెలుగు సాహిత్యంలోనూ జరిగిన, జరుగుతున్న ఎన్నో పరిణామాలు అటువంటి భూమికనే కల్పించి తక్షణ, సన్నిహిత ప్రేరణలుగా కూడ నిలిచాయి.

వలసానంతర భారతదేశంలో పాలకవర్గాలు, తమ తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న వివిధ సమూహాల ప్రజలు, ఆ ప్రజలకు నాయకత్వం వహించి ఉద్యమాలు నిర్మించగల సామాజిక రాజకీయ శక్తులు అనే మూడు ప్రధాన సమూహాలుగా విభజించి చూస్తే, 1950లు ఈ మూడు సమూహాలకు సంబంధించి మూడు రకాల దృశ్యాలు చూపుతాయి.

అధికారమార్పిడితో కొత్తగా అధికారంలోకి వచ్చిన పాలకవర్గాలు, వారి తరఫున ప్రభుత్వాధికారంలో ఉన్న వర్గాలు తమ వర్గ స్వభావం వల్లా, కుల స్వభావం వల్లా, ప్రాంత స్వభావం వల్లా కూడ పాత బ్రిటిష్ పాలనా విధానాన్ని యథాతథంగా, లేక కొన్ని అతుకులూ మాట్లూ వేసి కొనసాగించడమే తమకు ప్రయోజనకరమని అనుకున్నారు. అలా ప్రభుత్వాధికారంలోకి వచ్చినవాళ్ల రంగు కొంతవరకు మారింది గాని వర్గమూ, స్వభావమూ మారలేదు. పైగా రెండు శతాబ్దాలుగా మరొకరి చేతి కింద అధికారాన్ని, సంపదను, అవకాశాలను అనుభవించవలసి వచ్చిన దళారీ వర్గంగా ఈ వర్గం కొత్త అధికారంతో మరింత అత్యాశకూ దురాశకూ గురై దోపిడీ పీడనలను మరింత పెంచింది. అప్పుడే వలస పాలన తొలగిపోయిందిగదా అనీ, వేచి చూద్దామనీ అనుకుంటున్న ప్రజల మౌనం వల్ల ఈ పాలకవర్గాల ఆటలు విపరీతంగా సాగాయి. కాకపోతే, పాత వలస వ్యతిరేక ఉద్యమ క్రమంలో ఇచ్చిన వాగ్దానాలలో కొన్నిటినైనా నెరవేర్చకపోతే ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటామన్న భయంతో, అలా జరిగితే అసలుకే మోసం వస్తుందన్న ఎరుకతో, అంతర్జాతీయ సమాజంలో వలసానంతర దేశాల అనుభవాల ప్రేరణతో ఆ పాలకవర్గాలు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను కూడ ప్రారంభించాయి. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడ రాజకీయాశ్రిత కాంట్రాక్టర్, పెత్తందారీ వర్గాలు చేజిక్కించుకుని ఆర్థికంగా, రాజకీయంగా లాభపడడం మొదలుపెట్టాయి. చేయవలసిన పనితో పోల్చినప్పుడు ఈ చేసిన పనులు సముద్రంలో కాకిరెట్ట గనుక ఏ ఒక్క ప్రజా సమూహమూ ఈ ప్రభుత్వ విధానాలతో సంతృప్తి పడే అవకాశం లేకపోయింది.

అలా 1950ల చివరికల్లా భారత సమాజంలో అనేక సమూహాలు అసంతృప్తిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి వచ్చింది. అటువంటి సందర్భంలో ఆ ప్రజాసమూహాల అసంతృప్తి తీరే మార్గాలు చూపి, వారిని సంఘటితం చేసి, పాలకవర్గాల మీద నిజమైన పోరాటం సాగించి, ప్రజా విజయం సాధించవలసిన ఉద్యమ శక్తులు, ముఖ్యంగా కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాట ఉపసంహరణతో, పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొనడంతో తమ పోరాట చేవను కోల్పోయారు. 1955 ఆంధ్ర ఉపఎన్నికల పరాజయం, 1957 ఎన్నికల్లో ప్రపంచంలోనే తొలిసారిగా ఎన్నికల్లో గెలిచి కేరళ రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని చేపట్టినప్పటికీ, 1959లో ఆ ప్రభుత్వం బర్తరఫ్ అయి, పదవి కోల్పోవడంతో కమ్యూనిస్టు పార్టీ నిరుత్సాహానికి గురై బలహీనమైపోయింది. వర్గపోరాటానికి నాయకత్వం వహించి, శ్రామికవర్గ విజయం వైపు నడపవలసిన, వ్యవస్థను మార్చే శాస్త్రీయ సిద్ధాంతం కలిగిన పార్టీయే ఇలా బలహీనపడి ఉన్నప్పుడు, వ్యవస్థ మార్పు గురించి ఆలోచనే లేని ఇతర ప్రజాశక్తులు ఇంకా అన్యాయమైన స్థితిలో ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయినా పాలకవర్గ ముఠాలలో ఒకరిని దించి ఒకరిని గద్దె ఎక్కిస్తే ఏమైనా మార్పులు జరుగుతాయేమో అనే ఆశ ప్రజల్లో ఎంతో కొంత ఉండింది. అందువల్లనే ప్రజా అసంతృప్తికి ఒక ప్రతిఫలనంగా 1967 ఎన్నికల్లో ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని పోగొట్టుకుంది. అలా అటు పార్లమెంటరీ రాజకీయాల రంగంలోను, ఇటు ప్రజా రంగంలోను 1960ల మధ్య భాగం నుంచి ఒక పెనుమార్పుకు రంగం సిద్ధమై ఉంది.

ఈ సామాజిక దుస్థితికి స్పందన సహజంగానే విస్ఫోటన రూపంలో వచ్చింది. అది ఒక తలంలో అట్టడుగు వర్గాల తిరుగుబాటు రూపంలో వేర్వేరు చోట్ల పెల్లుబకగా, మరొక తలంలో మధ్యతరగతి విద్యావంతులలో కొత్త ఆలోచనల రూపంలో పెల్లుబికింది. అప్పటివరకూ భారత సమాజానికి ఉండిన సమస్యలన్నీ బ్రిటిష్ వలసవాదం వల్లనే వచ్చాయనీ, వలస పాలన తొలగిపోగానే ఇక దేశంలో పాలూ తేనే ప్రవహిస్తాయని వలసవ్యతిరేక ఉద్యమం, ప్రధానంగా భారత జాతీయ కాంగ్రెస్, ఒక భ్రమా బీజాన్ని అప్పటికి ఐదారు దశాబ్దాలుగా మధ్యతరగతి మెదళ్లలో నాటి ఉంది. ఆ బీజం అధికారమార్పిడి నాటికి వృక్షంగా ఎదిగింది గాని ఆశించిన పుష్పాలూ ఫలాలూ లేక అసలు బీజమే భ్రమ అనే అభిప్రాయం ప్రబలడం తొలిదశకంలోనే ప్రారంభమై, రెండో దశకానికల్లా విస్తరించింది. అలా సమాజం గురించీ, వర్తమానం గురించీ భవిష్యత్తు గురించీ ఆలోచించగలిగిన, వ్యక్తీకరించగలిగిన, సమాజచలనాన్ని వ్యాఖ్యానించగలిగిన, నాయకత్వం అందించగలిగిన మధ్యతరగతి విద్యావంతుల వర్గం ఒకటి 1960ల నాటికి దేశవ్యాప్తంగా విస్తారంగా తయారై ఉంది.

ఈ దేశవ్యాపిత పూర్వరంగంలోనే తెలుగుసీమ ప్రత్యేకతలను అధ్యయనం చేయాలి. ఆధునిక తెలుగు సామాజిక, సాహిత్య రంగాల చరిత్ర వల్ల ఇక్కడ కూడ అటువంటి మధ్యతరగతి విద్యావంతుల వర్గం గణనీయంగానే ఏర్పడి ఉండింది. సమాజ చరిత్రలో, సామూహిక జ్ఞాపకంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, జమీందారీ వ్యతిరేక పోరాటాలు, వలసవాద వ్యతిరేక పోరాటాలు, బలమైన కమ్యూనిస్టు ఉద్యమ సంప్రదాయం ఉన్నాయి. అలాగే, సాహిత్య చరిత్రలో తొలినుంచీ సమాజ సాహిత్య సంబంధాలను సజీవంగా, క్రియాశీలంగా ఉంచుకున్న ఆధునిక తెలుగు సాహిత్య సంప్రదాయం ఉంది. అలా తెలుగు మధ్యతరగతికి స్థూలంగా ప్రగతిశీల, వ్యవస్థా ధిక్కార, యథాస్థితి వ్యతిరేక భావజాల పునాది ఏర్పడి ఉంది. అందువల్ల 1960 దశకంలో ప్రపంచవ్యాప్తంగానూ, దేశవ్యాప్తంగానూ యుగస్వభావంగా మారిన అసంతృప్తికీ, కోపోద్రేకాలకూ, ప్రత్యామ్నాయాల అన్వేషణకూ తెలుగు మధ్యతరగతి, అందులోనూ సాహిత్యకారులు సహజంగానే స్పందించారు. ఒకరకంగా అగ్గిపుల్ల పడితే అంటుకునే ఎండుగడ్డి లాంటి స్థితికి 1960ల మధ్యభాగానికి భారత సమాజమూ, తెలుగు సమాజమూ, ప్రత్యేకంగా తెలుగు సాహిత్య సమాజమూ చేరుకున్నాయి.

ఇక్కడ చెపుతున్న అన్ని పరిణామాలూ ఒకదానితో ఒకటి కలిసి సమన్వయంతో సాగాయని గాని, ఒకదాని గురించి మరొకటి తెలుసుకుని సాగాయని గాని, ఒక సరళరేఖలో సాగాయని గాని అనుకోవడానికి వీలులేదు. సామాజిక పరిణామాలలో అటువంటి ప్రణాళికాబద్ధతకు, పథకరచనకు, సరళరేఖలకు అవకాశమేమీ లేదు. వేరువేరు స్థలాలలో, వేరువేరు కాలాల్లో ఒకే రకమైన పరిణామాలు సంక్లిష్టంగా, ముందువెనుకలుగా, అల్లిబిల్లిగా జరగవచ్చు. ఒకచోట ఒక నిప్పురవ్వ దావానలంగా మారవచ్చు. మరొకచోట ఆ నిప్పురవ్వకు అనుకూలమైన పరిస్థితులు లేక మిణుకుమిణుకుమని మలిగిపోవచ్చు. ఒకచోట అది జ్వాలగా ఎగసి కూడ చప్పున చల్లారిపోవచ్చు. ఒక జ్వాల మరొక జ్వాలను రగిలించవచ్చు, రగిలించలేకపోవచ్చు. సమాజ పరిణామాలు స్థూలంగా రసాయనిక సంయోజనం వంటివే గాని, ఇక్కడ రక్తమాంసాల, ఉద్వేగాల మనుషులు, వాళ్ల చైతన్య పూర్వక ప్రవర్తన, వాళ్ల మీద తప్పుడు భావజాల ప్రభావం, అనూహ్య అవరోధాలు వంటి అనేక వ్యక్త, అవ్యక్త కారకాల సంక్లిష్ట సమ్మేళనం ఉంటుంది. అందువల్ల ఈ పరిస్థితులు ఇలాగే పర్యవసిస్తాయి అని సమీకరణం చెప్పడం సాధ్యం కాదు. ఆ పరిణామాలు జరిగిపోయిన తర్వాత వెనక్కి వెళ్లి ఏ కారకాలు ఆ పరిణామాలకు దారి తీసి ఉంటాయో, ప్రత్యేకంగా ఏ కారకం ఎంత పాత్ర వహించిందో విశ్లేషించగలం గాని, ఆ కారకాలన్నిటి మధ్య పరస్పర సంబంధం, ఏకరూపత, నిరంతరాయత ఉన్నదని చూపలేం.

అలా 1960 దశకం చివర విప్లవ సాహిత్య ఆవిర్భావానికి కారకాలను సమాజ చరిత్రలో, సాహిత్య చరిత్రలో ఎంత లోతుగా అన్వేషిస్తే అంతగా వాస్తవ చరిత్ర సమీపానికి చేరగలం. సమాజ చరిత్రలో విస్తరించిన అసంతృప్తి, ప్రత్యామ్నాయాల అన్వేషణ ప్రక్రియలు 1967 నాటికి నక్సల్బరీ పోరాటానికి దారితీశాయి. తెలుగు సీమ వరకే వస్తే, శ్రీకాకుళం అటవీ ప్రాంతాలలో, ముఖ్యంగా సవర, జాతాపు ఆదివాసులలో 1950ల చివరి నుంచీ రగులుతున్న ఉద్యమ జ్వాలలు నక్సల్బరీ దారి చేపట్టి గుణాత్మకంగా కొత్త దశకు ఎదిగాయి. ఆ ఉద్యమంలో పాల్గొన్న సుబ్బారావు పాణిగ్రాహి స్వయంగా కవీ, కళాకారుడూ కావడం వల్ల 1967 చివరి నాటికే పోరాటాన్ని సమర్థిస్తూ, ప్రచారం చేస్తూ, పోరాటం వైపు పాఠకులను ఆకర్షించడానికీ, పోరాటంలో పాల్గొంటున్నవారికి ప్రేరణ ఇవ్వడానికీ సాహిత్య సృజన ప్రారంభించాడు. అదే కాలంలో విప్లవోద్యమ నాయకుడు వెంపటాపు సత్యనారాయణ కూడ పోరాట ప్రచార అవసరాల కోసం కవిత్వం రాశాడు. అయితే విప్లవ రచయితల సంఘం ఏర్పడే నాటికి ఏడు నెలల ముందే సుబ్బారావు పాణిగ్రాహి, ఏర్పడిన తర్వాత సరిగ్గా వారం రోజులకు వెంపటాపు సత్యం బూటకపు ఎన్‌కౌంటర్ లలో హత్యకు గురయ్యారు.

అలా విప్లవ సాహిత్యం శ్రీకాకుళం కొండల్లో 1968 నుంచే వికసిస్తుండగా, మైదాన ప్రాంతాల మధ్యతరగతి సాహిత్యలోకంలో విప్లవ సాహిత్యావిర్భావానికి సన్నాహాలు, తొలి ప్రేరణల గురించి అన్వేషిస్తే అవి 1964 నాటికి ప్రారంభమయ్యాయని అనుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 1964 మే లో వెలువడిన ‘రాత్రి’ కవితా సంకలనం ఒకవైపు అప్పటికి నెలకొని ఉన్న రాత్రి చీకటిని వర్ణిస్తూనే, ఆ రాత్రి తొలగిపోవాలని ఆకాంక్షను వ్యక్తం చేసింది. అమరసాహితి ప్రచురణగా అడపా శివాజి నాయుడు సంపాదకులుగా వెలువడిన ‘రాత్రి’ కవితా సంకలనంలో కేశవరావు, మురళీమోహన్, ముదిగొండ శివప్రసాద్, కైవల్య (మన్మోహన్ సహాయ్), కె. యాదవరెడ్డి, పి. మహానంద్, వరవర రావు, విసి మౌళి, సి విజయలక్ష్మి, పరిగి రాధాకృష్ణ, చిత్రభాను (?), మాల్యశ్రీ (?), వేగుంట మోహనప్రసాద్, అద్దేపల్లి రామమోహనరావు, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు అనే పదిహేను మంది కవుల ముప్పై కవితలు ఉన్నాయి. ఈ పదిహేను మందీ అప్పటికి ఇరవైల్లో ఉన్నవారే. వారే చెప్పుకున్నట్టు “నవయువకవులు”. అందులో కేశవరావు కవితాసంపుటం ‘ఉదయించని ఉదయాలు’ అప్పటికి రెండు సంవత్సరాల కిందనే వెలువడింది. కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు కవితాసంపుటం ‘అగ్నిశిఖలు – మంచుజడులు’ దీనితోపాటే వెలువడింది.

ఈ పదిహేను మందిలో ముగ్గురు మాత్రమే విప్లవ రచయితల సంఘ నిర్మాణంలో భాగమయ్యారు. తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భావజాల నాయకుడుగా కూడ మారిన ముదిగొండ శివప్రసాద్ తో సహా ఎవరెవరు ఏ మార్గంలో పయనించారో చరిత్ర నమోదు చేసింది. అది ఇక్కడ అనవసరం గాని అప్పుడు మాత్రం అందరికందరూ తరతమభేదాలతో చుట్టూ ఉన్న చీకటి గురించి పాడారు. విషయసూచిక లేని ఈ కవితా సంకలనంలో మొదటి ఐదు పేజీలలో ఒక్కొక్క కవికీ ప్రాతినిధ్య పాదాలుగా నాలుగు నుంచి ఐదారు పాదాలు ప్రచురించారు. అందులో వరవరరావు, సి విజయలక్ష్మి, మాల్యశ్రీ ముగ్గురు మినహా మిగిలిన వారందరి ప్రాతినిధ్య పాదాలలోనూ ఆ చీకటి గురించి నిరాశే ప్రధానంగా పలికింది.

“ఇంకా పొద్దు కాస్త పోవాలి సూర్యుడు మిట్టమింటికి రావాలి
ఈ చలితెరలు, ఆకలిచారలు కలిగీరల క్రిందపడి నలిగిపోవాలి
మంచివాని కంఠం కంచయి మ్రోగాలి
మంచివాని కష్టం కనకమై పండాలి” అని వరవర రావు,

“జీవితం క్రూర మృగ సంకులితమైన బృహదరణ్యంగా మారింది
మతవాద మితవాద ప్రతీపశక్తుల వెయ్యిపడగల నాగులు కాలకూట విషం క్రక్కుతున్నాయి
స్వాతంత్ర్యభానుణ్ని ఫ్యూడల్ శక్తుల రాహు కేతువులు మ్రింగేశాయి
దేశానికి గ్రహణం పట్టింది; జాతి వెన్నెముకన అవినీతి రాచపుండు పుట్టింది
దారుణమైన ఆపరేషన్ జరగాలి” అని సి. విజయలక్ష్మి,

“చూస్తున్నాను…పరిశీలిస్తున్నాను
అవినీతుల్ని…పాలక నీతుల్ని
ప్రవర్ధమానమవుతున్న కాలుష్యాల రాచకురుపుల్ని
చూస్తున్నాను శస్త్రచికిత్సకై యోచిస్తున్నాను” అని మాల్యశ్రీ ఆనాటికి విస్తరిస్తున్న యుగస్వభావాన్ని, ప్రత్యామ్నాయ అన్వేషణను పట్టుకున్నారు.

బహుశా వీరిలో సి విజయలక్ష్మి (సి.వి.) పేరుతో రాస్తున్న చిత్తజల్లు వరహాలరావు ఒక్కరికే అప్పటికి ఎంతో కొంత కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం, పరిచయం ఉంది. అప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చి, కొత్తగా ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) వర్గపోరాటాన్ని ముందుకు తీసుకుపోతుందనే ఆశా, తీసుకుపోవాలనే కోరికా, తీసుకుపోదేమోననే అనుమానమూ సమాజంలో ఉన్నాయి. ఆ డోలాయమాన స్థితిని సివి ఆనాటి రచనలు ప్రతిఫలించాయి. ఆయన కావ్యం ‘విషాద భారతం’ 1965 జూలై లో, కవితా సంపుటం ‘కారుచీకటిలో కాంతిరేఖ’ 1966 అక్టోబర్ లో వెలువడ్డాయి. ఈ రెండు సంపుటాలనూ విప్లవ సాహిత్యానికి ముడిసరుకుగా, ముందస్తు సూచనగా పరిగణించవచ్చు.

“వొఖ్ఖ రక్తం బొట్టుగూడా చిందకుండా
అహింసామంత్రజపం వల్లనే అమాంతం జాతికి స్వాతంత్ర్యం రాగా
తెల్లదొరల సీట్లో నల్లదొర భేషుగ్గా ఆసీనుడయ్యాడు” అని ప్రారంభమై,

“దేశాన్ని అమావాస్య ఆవహించింది
అధికారం అవినీతికి దోవ తీసింది
హద్దూపద్దూ లేని నిరంకుశాధికారం
అంతూ పంతూ లేని అవినీతికి మార్గం వేసింది
పాలించే దుస్థితి దాపరించింది
ఇదే నేటి డెమోక్రటిక్ భారతం యొక్క విషాద భారతం” అంటూ సాగి,

“ఎవరు ప్రజాసేవకుడో ఎవరు దారిదోపిడిగాడో గుర్తించి ఓటు వేయండి” అని ఆ నాటి కమ్యూనిస్టు పార్టీలకు ఉండిన పార్లమెంటరీ ఎన్నికల భ్రమలను కూడ కలిపి,
“ఈ పర్మిట్ దార్ల కంట్రాక్టర్ల లిటిగెంట్ల కుక్షింభరుల
పొద్దుతిరుగుడు పువ్వుల రాజకీయ ఊసరవెల్లుల
విదేశీ సామ్రాజ్యవాదానికి అడుగులకి మడుగులొత్తుతూ
దేశాన్ని అమ్మేయ ప్రయత్నిస్తూ
దేశభక్తి భోగం వేషాలు దాల్చి ప్రజల్ని కుక్కలుగా
ప్రజాసేవకుల్ని దేశద్రోహులుగా పరిగణించే
పయోముఖ విషకుంభాల ఆటలు ఠక్కున కట్టిననాడు
ఆనాడు బాగుపడుతుంది నాడు” అని ఆశావహ దృక్పథంతో ముగుస్తుంది ‘విషాద భారతం’.

“పదిహేడు సంక్రాంతులు గడిచినా జీవితంలో క్రాంతిరేఖ పొడమదేం?” అనే ప్రశ్నను సంధించిన ‘కారుచీకటిలో కాంతిరేఖ’ సంపుటంలోనే,
“ఆధునిక మానవునికి బదులు ఆపస్తంబుని నాటి ద్విపాద పశువు
మళ్లీ విజృంభించే అపాయం మున్నెన్నడూ లేనంతగా నేడుంది
కళ్లు తెరవండి కవులూ వొళ్ళు విరవండి రచయితలూ
బహుపరాక్ పొయట్స్! బీ కేర్ ఫుల్ రైటర్స్!” అని కర్తవ్యబోధ కూడ చేశారు.

చుట్టూ ఉన్న స్థితి పట్ల అసహనం, నిరాశ, ఏదో చేయాలనే తపన, ఏమి చేయాలో స్పష్టతలేనితనం, ప్రజాజీవితంలో నెలకొన్న మందకొడితనం ప్రభావం, రానున్న మహత్తర మార్పు ఎట్లా వస్తుందో, దానికి నాయకత్వం వహించి నడిపే శక్తి ఎవరికి ఉందో తెలియని అయోమయం నాటి తెలుగు సాహిత్య లోకంలో వ్యాపించి ఉన్నాయని చూపడానికి ఆ కాలపు కవిత్వంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. రూపం గురించి చర్చిస్తే చాలునని, వస్తువు విషయం పట్టించుకోనక్కర లేదని రూపం మీద పూనికతో వచనకవితా ఉద్యమం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఏర్పడి కవులనూ రచయితలనూ పాలకవర్గ గుమ్మి కింద కమ్మడానికి ఏర్పాట్లు చేస్తున్నది. మరొకవైపు స్వయంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వమే కవులనూ రచయితలనూ సినిమా రంగానికి వెళ్లి బతుకుతెరువు చూసుకొమ్మని చెప్పింది. అలా వెళ్లినవాళ్లలో తమ ఉద్యమ నేపథ్యాన్నీ విలువలనూ కాపాడుకుని నిలబడినవాళ్లు అతి కొద్ది మంది మాత్రమే. ఈలోగా వ్యాపార పత్రికారంగం విస్తరించి సాహిత్యకారులను సామాజిక బాధ్యతనుంచి దూరం చేయడానికి గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆధునిక తెలుగు సాహిత్యం అప్పటికి ఏడెనిమిది దశాబ్దాలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న ప్రగతిశీల ధార కొడిగట్టడం ప్రారంభమైంది.

అందువల్లనే ఈ కాలాన్ని, మరీ ముఖ్యంగా ఆంధ్రా ఉపఎన్నికల్లో కమ్యూనిస్టులు ఘోరపరాజయం పాలై, అభ్యుదయ రచయితల సంఘ పునరుద్ధరణ ప్రయత్నాలు కూడ విఫలమై సాహిత్యరంగంలో నిరాశ వ్యాపించిన 1955-65 కాలాన్ని స్తబ్దతా కాలంగా గుర్తించడం సాహిత్య చరిత్రలో అలవాటయింది. నిజానికి అది ప్రజారాజకీయాలు వెనుకపట్టు పట్టిన, ఆ వెనుకంజ సాహిత్యంలో ప్రతిఫలించిన కాలమే గాని మొత్తంగా సాహిత్య స్తబ్దత అనడానికి వీలులేదు. అది ఎక్కువలో ఎక్కువ కవిత్వ సృజనకు స్తబ్దతాకాలం అనవచ్చు. మరొకవైపు సరిగ్గా ఆకాలంలోనే తెలుగు కథా, నవలా సాహిత్యంలో ఎన్నదగిన రచనలెన్నో వచ్చాయి. ఇవాళ్టికీ ప్రభావశీలంగా ఉన్న కథకులు, నవలాకారులు ఆ దశాబ్దిలో రచన ప్రారంభించినవారే, లేదా ప్రఖ్యాతి పొందినవారే. విద్యావకాశాల పెరుగుదల వల్ల, వ్యాపారపత్రికల విజృంభణ వల్ల పాఠకుల సంఖ్యా, రచయితల సంఖ్యా విపరీతంగా పెరిగి, వస్తువు సమస్య ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున సాహిత్య విస్తరణ జరిగిన కాలమదే. కాని తెలుగు సాహిత్యంలో కవిత్వానిదే అగ్రాసనం గనుక కవిత్వ స్తబ్దతనే మొత్తంగా సాహిత్య స్తబ్దతగా భావించడం జరుగుతున్నది. ఈ కవిత్వ స్తబ్దతను బద్దలు గొడుతూ ఒక షాక్ ట్రీట్ మెంట్ లాగ, ఒక విస్ఫోటనం లాగ శక్తిమంతంగా దూసుకువచ్చింది దిగంబర కవితా ఉద్యమం. దాని అపారమైన శక్తి వల్ల, అది ఆనాటి కోపోద్రిక్త యువతరానికి అనన్య సాధ్యమైన పద్ధతిలో స్వరం ఇచ్చినందువల్ల, చరిత్రలో నిలిచిపోవడం మాత్రమే కాదు, విప్లవ రచయితల సంఘం ఆవిర్భావానికి తక్షణ ప్రేరణల్లో ఒక బలమైన శక్తిగా కూడ నిలిచింది.

(మిగతా వచ్చే సంచికలో)

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

Leave a Reply