అరుణాక్షరావిష్కారం – దిగంబర కవులు

(అరుణాక్షర అద్భుతం – 04)

కవుల సంఖ్య, వాళ్లు రాసిన కవితల సంఖ్య, వాళ్లు ప్రచురించిన సంపుటాల సంఖ్య, వాళ్లు ఉనికిలో ఉన్న కాలవ్యవధి, తెలుగు కవితా సంప్రదాయంలో వాళ్లు ప్రవేశపెట్టిన గణనీయమైన మార్పులు – ఏ ప్రమాణం ప్రకారం చూసినా పరిమాణం రీత్యా దిగంబర కవుల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. కవులుగా వాళ్లు ఆరుగురు. అప్పటికి తెలుగు సాహిత్య లోకంలో రూపొందిన ఎన్నో సమూహాలలో అంతకంటె ఎక్కువమంది కవులున్నారు. దిగంబర కవులు ఉద్యమంలో భాగంగా రాసిన కవితలు 93. ఆధునిక తెలుగు కవితాలోకంలోనే ఈ సంఖ్య ఏమంత పెద్దది కాదు. 1965 మే 6 న మొదటి సంపుటం ఆవిష్కరణతో ప్రారంభించి 1968 సెప్టెంబర్ 14న మూడో సంపుటం ఆవిష్కరణ వరకు వాళ్ల కవిత్వం వెలువడినది మూడున్నర సంవత్సరాల కాలంలో మూడు సంపుటాలు మాత్రమే. ఆ తర్వాత 1970 జూలై వరకు మరొక ఏడాదిన్నర మాత్రమే వాళ్లు ఒక బృందంగా ఉనికిలో ఉన్నారు. అంతకన్న ఎక్కువ కాలం బతికిన, ఎక్కువ సంపుటాలు వెలువరించిన సాహిత్య బృందాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. కాని కవితాసమితి, నవ్య సాహిత్య పరిషత్తు, సాహిత్య సమితి, అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం వంటి అంతకు ముందు ఆయాకాలాల్లో బలంగా ఎక్కువకాలం పనిచేసిన సాహిత్య బృందాలలో ఏ ఒక్కదానికన్న ఎక్కువ ప్రభావాన్ని దిగంబర కవులు సాధించారు. తమ కాలాన్ని వాళ్లు ప్రతిఫలించిన సునిశితత్వం వల్ల, వాళ్లు సమకాలీనంగానూ ఆ తర్వాతా వేసిన ప్రభావం వల్ల, అన్నిటికన్న ముఖ్యంగా తెలుగునాట విప్లవ సాహిత్యోద్యమానికి వాళ్లు చేసిన దోహదం వల్ల వాళ్ల శక్తి సామర్థ్యాలు అసాధారణమైనవి.

దిగంబర కవితా ఉద్యమం ప్రారంభమయ్యే సమయానికి ఆ ఆరుగురు కవులూ (ఆకారం వీరవెల్లి రాఘవాచారి – జ్వాలాముఖి (1938-2008), మానేపల్లి హృషీకేశవరావు – నగ్నముని (1939), కె యాదవరెడ్డి – నిఖిలేశ్వర్ (1939?), కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు – మహాస్వప్న (1940-2019), మన్మోహన్ సహాయ్ – భైరవయ్య (1942), బద్దం భాస్కరరెడ్డి – చెరబండరాజు (1944-82) ఆ నాటి కోపోద్రిక్త యువతరానికి ప్రతినిధులు. వయసులో అందరిలోకీ పెద్దవాడైన జ్వాలాముఖికి అప్పటికి ఇరవై ఏడేళ్లు కాగా, అందరిలోకీ చిన్నవాడైన చెరబండరాజుకు ఇరవై ఒక్క సంవత్సరాలు. వలస పాలన ముగిసి పద్దెనిమిది సంవత్సరాలు గడిచి, పాలకులు అల్లిన మాయాజాలం క్రమక్రమంగా విడిపోతూ దేశంలోని వివిధ ప్రజాసమూహాలు అసంతృప్తి ప్రకటన దశకు చేరుకుంటున్న సమయం అది. సరిగ్గా ఆ అసంతృప్తి పెరుగుదల వీళ్ల జీవిత క్రమాలతో, వ్యక్తీకరణ క్రమాలతో ముడిబడి ఉన్నది. తామూ తమ కుటుంబాలూ పరిసరాలూ అనుభవించిన, చూసిన, విన్న, చదువుతున్న సామాజిక అసంతృప్తినే వాళ్లు వ్యక్తీకరించారు.

ఇది తెలుగు నేలకు, తెలుగు సాహిత్యానికి మాత్రమే కూడ పరిమితం కాదు. అంతర్జాతీయంగానే ఆ కాలాన్ని గురించి వివరంగా పరిశీలించి ‘నైంటీన్ సిక్స్టీయైట్, ది ఇయర్ ఆఫ్ ది బారికేడ్స్’ అని పుస్తకం రాసిన డేవిడ్ కాట్ మాటల్లో అది ఒక ప్రతి సంస్కృతి. ఆ ప్రతి సంస్కృతిలో “విభిన్న చలనాలెన్నో కలగలిసి సాగాయి. సమాజాన్ని తోసివేసిన హిప్పీ జీవిత శైలి, అశ్లీల భాష, మాదకద్రవ్యాల వినియోగం, అజ్ఞాత వార్తాపత్రికలు, సినిమాలు, ప్రత్యామ్నాయ రంగస్థలం, అప్పటికప్పుడు సన్నివేశాల కల్పన, ప్రతి విశ్వవిద్యాలయాలు, సర్రియలిస్టు వీథి రాజకీయాలు, స్వయం సహాయ సామూహిక జీవన బృందాలు, ప్రామాణిక సంగీతశైలి అలవాటైన చెవులకు పరాయిగా వినిపించే జానపద, రాక్ సంగీతం, నిగూఢ ఆరాధనా పద్ధతులు, లైంగికతలో దౌర్జన్యం, ప్రయోగాలు, కొట్టవచ్చినట్టు కనిపించే ఆహార్యం, పర్యావరణ స్పృహ, పైకి ఎదగాలనే, భద్రజీవితం గడపాలనే కోరికల తిరస్కరణ” వంటివెన్నో ఆ ప్రతి సంస్కృతిలో వెలికివచ్చాయని కాట్ అన్నాడు.

ఆ దశకంలో అమెరికాలో, యూరప్ లో వ్యక్తమైన ఈ ధోరణులు ఆనాటి తెలుగు సమాజానికి అందాయా లేదా కచ్చితంగా చెప్పలేం గాని, భిన్న మార్గాలు వెతుకుతున్న, ప్రయోగాలు సాగిస్తున్న కోపోద్రిక్త యువతరపు ప్రపంచవ్యాప్త యుగస్వభావాన్ని అసంకల్పితంగానో, చైతన్యయుతంగానో దిగంబరకవులు ప్రతిఫలించారు. ప్రత్యేకించి కవిత్వ సందర్భంలో చెప్పాలంటే అమెరికాలో బీట్ కవుల, బ్లాక్ పాంథర్ల, ఫ్రాన్స్ లో త్యల్ క్వెల్, బెంగాల్ లో భూకీపీడీ, హిందీలో అకవిత, అనామా కవుల, కన్నడంలో బండాయ కవుల ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు దిగంబర కవుల మీద ఉన్నాయి.

ఆ రకంగా చూసినప్పుడు దిగంబరకవులు పాడినవి ఒంటరి పాటలు కావు. వాళ్లు చేసిందల్లా తమ సమకాలీన సమాజపు నిరాశకూ అసంతృప్తికీ ఆక్రోశానికీ ఆవేదనకూ మాటలు తొడగడం మాత్రమే. ఆ అసంతృప్తే నాటి యువతరంలో, ఆలోచనాపరులలో వ్యాపించి ఉన్నది గనుక, వ్యాపిస్తూ ఉన్నది గనుక వాళ్ల కవిత్వం ప్రతి గొంతులోనూ పలికింది, ప్రతిధ్వనించింది. ప్రతి ఒక్కరూ ఆ కవిత్వంతో మమేకమయ్యారు. ఆ కవిత్వాన్ని ప్రతి ఒక్కరూ తమ హృదయగతమైనదనే భావించారు. దిగంబర కవులకు అందిన అపారమైన ఆదరణకు కారణమదే.

అయితే ఇప్పుడు ఐదున్నర దశాబ్దాల తర్వాత, ఎన్నెన్నో వివరమైన విశ్లేషణల తర్వాత, మూడు సంపుటాలనూ ఒక్కచోట ప్రచురించిన ఎమెస్కో ప్రయత్నం (మార్చ్ 1971 – విజయవాడ సాహితీమిత్రుల పునర్ముద్రణ ఆగస్ట్ 2016) తర్వాత దిగంబరకవుల కవిత్వాన్ని ఒకే ముద్దగా చూస్తున్నాం గాని, నిశితంగా చూస్తే 1965లో, 1966లో, 1968లో వెలువడిన ఆ మూడు సంపుటాలూ వేటికవే ప్రత్యేకమైనవి, విశిష్టమైనవి. ఆ సంపుటాలలో వ్యక్తమైన దృక్పథంలో, కవితాశైలులలో, కవుల వ్యక్తిత్వాలలో వైవిధ్యం, క్రమ పరిణామం కనబడతాయి. దశాబ్దాలలో జరిగే చరిత్ర పరిణామాలు ఒక్కోసారి సంవత్సరాల్లోనే జరుగుతాయి అని మరొక సందర్భంలో లెనిన్ అన్నట్టు, ఆ కోపోద్రిక్త దశాబ్దం ప్రతిరోజూ మానవచైతన్యంలో మార్పులు తెచ్చింది. క్రమ పరిణామాన్ని సాధించింది. మూడున్నరేళ్ల కాలక్రమంలో వెలువడిన మూడు దిగంబర కవుల సంపుటాలు కూడ ఆ క్రమ పరిణామాన్ని ప్రతిబింబించాయి. దిగంబర కవుల సంపుటాలలోని ఒక్కొక్క కవి మీద, ఒక్కొక్క కవిత మీద, వాటి క్రమ పరిణామం మీద జరగవలసినంత సాహిత్య విమర్శ, విశ్లేషణ ఇంకా జరగలేదు గాని, ఆ పని చేస్తే 1960ల సామాజిక చరిత్ర పరిణామానికి సమాంతర కవితా అభివ్యక్తి తేటతెల్లమవుతుంది.

దిగంబర కవుల ఆవిర్భావం కన్న ముందు నుంచే వారిలో కవిత్వం రాస్తున్నవారు నలుగురున్నారు. ఇద్దరు అప్పటికే తమ సొంత కవితా సంపుటాలు (కేశవరావు – ఉదయించని ఉదయాలు 1962, కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు – అగ్నిశిఖలు – మంచు జడులు 1964) కూడ వెలువరించారు. దిగంబర కవులలో ముగ్గురు ‘రాత్రి’ కవితా సంకలనంలో ఉన్నారు. వీళ్లందరి దిగంబరకవితకు ముందరి కవిత్వాన్నీ, దిగంబరకవిత్వాన్నీ తులనాత్మకంగా పరిశీలించడం కూడ ఆసక్తికరంగా ఉంటుంది. అలా దిగంబర కవుల పూర్వ కవిత్వానికీ, దిగంబర కవిత్వానికీ తారతమ్యాలను పరిశీలించడానికి ఇది సందర్భం కాదు గాని, దిగంబరకవుల ఆవిర్భావానికి మూడు సంవత్సరాల ముందు ‘ఎవడి కన్నీళ్లు వాడి సొంత ఆస్తి’ అని రాసిన కవే, దిగంబరకవిగా మారి ఎవరి కన్నీళ్లకైనా వ్యవస్థ బాధ్యత వహించాలనే అవగాహనకు, ఆ వ్యవస్థ కుష్ఠు వ్యవస్థ అనే అవగాహనకు మారారని గుర్తించడం అవసరం. వ్యవస్థ అవ్యవస్థ వల్లనే వ్యక్తులకు కన్నీళ్లు కలుగుతున్నాయని వ్యవస్థ మీద తీవ్రమైన కోపాన్ని, అసహనాన్ని, అసహ్యాన్ని, దూషణను, నిరాకరణను, సర్వ విధ్వంసాన్ని వ్యక్తీకరించిన తొలి సంపుటం నుంచి మూడో సంపుటం నాటికి ఆ ఆగ్రహాన్ని సంఘటితం చేయాలనీ, వ్యవస్థను కూలదోయాలనీ, విధ్వంసం నిర్మాణాత్మకం కావాలనీ అనుకునే దశకు పరిణితి సాధించారు. ఇవాళ వెనక్కి తిరిగి చూస్తే ఈ క్రమపరిణామమే సహజంగా, అనివార్యంగా విప్లవ సాహిత్యోద్యమంలోకి ప్రవహించిందని తేటతెల్లమవుతుంది.

మొదటి సంపుటంలో కవిత్వమైనా, ‘దిగంబర శకంలోకి’ అని రాసుకున్న ముందుమాట అయినా, కవిత్వానికి, రోజులకు, సంవత్సరాలకు కొత్త పేర్లు పెట్టడమైనా, సంచలనాత్మక వినూత్న పద్ధతి ఆవిష్కరణ అయినా అసంతృప్తినీ నిరాశనూ ఆగ్రహాన్నీ సంచలనాత్మకతనూ సూచిస్తాయి. “ఇది సెక్స్ గ్రంథం కాదు. రాజకీయ నినాదాల కోసం ఉద్దేశించినది అంతకంటే కాదు. ఈ దేశంలో, ఈ గోళంలో ఊపిరిపీల్చే ప్రతి మనిషి ఉనికి కోసం తపన పడి, అతడి భావిని చూసి వెక్కి వెక్కి ఏడ్చి, పిచ్చెక్కి ప్రవచించిన కవిత” అనే ముందుమాటలోని ప్రారంభ వాక్యాలే వారి అస్పష్టతకు, గందరగోళానికి అద్దం పడతాయి.

ఎటువంటి పుస్తకమైనా సరే, దానికది ఇది సెక్స్ గ్రంథం కాదు అని చెప్పుకోవడం సంచలనాన్ని తప్ప మరి దేన్నీ సూచించదు. అది పాఠకుల ఆసక్తిని పెంచే ఒక ఎత్తుగడ మాత్రమే. అది ఒక చాపల్యం అనుకుని వదిలివేసినా, రెండో వాక్యం మధ్యతరగతిలో సహజంగా ఉండే రాజకీయాల పట్ల వ్యతిరేకతను సూచిస్తున్నది గాని ఆధిపత్య రాజకీయాలకూ ప్రజా రాజకీయాలకూ మధ్య తేడాను చూడడం లేదు. నిజానికి మూడో వాక్యంలో చెప్పిన తపన సరైన రాజకీయాలను అన్వేషించే దిశగా సాగాలి. మొదటి సంపుటం నాటికి ఆ స్పష్టత లేదు. ఈ ముందుమాట అంతా ఇలాగే సాగుతుంది.

ఈ సంపుటంలోని ఇరవై ఒక్క కవితల్లో కూడ సమస్య, అసంతృప్తి, విమర్శ, దూషణ, తిరస్కారభావం, విధ్వంసక దృష్టి ఉన్నంతగా, పరిష్కారాల వైపు అన్వేషణ లేదు. అయితే ఆనాటి తెలుగు సమాజంలో కమ్యూనిస్టు పార్టీలని పేరు పెట్టుకున్న పార్టీలకే పరిష్కారాల ఆలోచన లేదనే వాస్తవాన్ని గుర్తిస్తే, ఈ కవితాభివ్యక్తిని దాని స్థలకాల పరిధిలో గుర్తిస్తే దాని ఔచిత్యం అర్థమవుతుంది. భాషా వినియోగంలో సంచలనాత్మకత, మొరటుదనం, పుస్తకావిష్కరణకు ఆనవాయితీగా ఉన్న సాయంకాలం సభను కాకుండా అర్ధరాత్రిని, సభావేదికను కాకుండా హైదరాబాదు నడిబొడ్డున ఆబిద్స్ చౌరస్తాను, లబ్ధప్రతిష్టుడైన కవిని కాకుండా ఒక రిక్షా కార్మికుడిని ఎంచుకోవడం కూడ నాటి స్థల కాల పరిధిలోనే గుర్తించవలసి ఉంటుంది. వ్యవస్థా నిర్వాహకులకు, సాహిత్య వ్యవస్థా నిర్వాహకులకు ఈ పద్ధతులు రుచించకపోయినప్పటికీ, యువతరం దిగంబర కవులను ఆదరించింది. కవిసమ్మేళనాలలో, సభలలో దిగంబర కవులు ఒక ఆకర్షణగా నిలవడం మొదలైంది.

పందొమ్మిది నెలల విరామం తర్వాత 1966 డిసెంబర్ లో విడుదలైన రెండో సంపుటంలో కూడ సంచలనాత్మకత కొనసాగినప్పటికీ (విజయవాడలో గవర్నర్ పేట సెంటర్ లో రోడ్డు మీద అర్ధరాత్రి ఒక హోటల్ క్లీనర్ చేత ఆవిష్కరణ), కొన్ని కవితల్లో పాత ధోరణులే కొనసాగినప్పటికీ, ఒకరకంగా ఈ సంపుటం పరిణామదిశను సూచిస్తుంది. “ఈనాటి రాజకీయాలకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించే ప్రయత్నం జరగాలి. రాజకీయవేత్తల గుడ్డివేటు పోటీ ముగిసి వ్యక్తి మంచికోసం పాటుపడే వ్యవస్థను నిర్మించాలి. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యక్తిని శాసిస్తున్న రాజకీయాల మంత్రదండం విరిగిపోయి, అసలు విలువల కోసం నిలిచే, బ్రతికే జీవితం కోసం సంఘర్షణ జరగాలి” అనే విధ్వంసానంతర నిర్మాణం గురించి ఆలోచన మొదలైంది. కొన్ని కవితల్లో కూడ ఈ మార్పు కనబడుతుంది. ఒకవంక భాషలో, వ్యక్తీకరణలో, అవసరం ఉన్నా లేకపోయినా పాఠకులను రెచ్చగొట్టే మాటలు వాడడంలో తొలి సంపుటపు ఛాయలు కనబడుతూనే, “సిద్ధాంతాల ఊబి” అని అన్ని సిద్ధాంతాలనూ వ్యతిరేకించాలనే ప్రతికూల వైఖరి కనబడుతూనే, మరొక వంక వియత్నాం యుద్ధాన్ని ప్రస్తావించే అంతర్జాతీయ దృక్పథం, “నీ ఆశయం సూర్యుణ్ణి మాత్రం/ పిడికిట్లోంచి జారవిడువకు/ ప్రాణాన్ని పణం పెట్టయినా/ ఈ జగతికి మానవతా భిక్ష పెట్టు” అనే ఆశయ స్పర్శ కూడ కనబడతాయి. వియత్నాం ప్రజలు చేస్తున్నది ఒక సామ్రాజ్యవాద వ్యతిరేక జాతి విముక్తి పోరాటమనీ, జగతికి మానవతా భిక్ష పెట్టడం ఒక సిద్ధాంత-ఆచరణ రహిత శుష్క నినాదం కాదనీ స్పష్టత ఉందో లేదో తెలియదు.

అప్పుడప్పుడే అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో గ్రేట్ డిబేట్ ముగిసి, చైనాలో మహత్తర శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం ప్రారంభమై దేశదేశాల పీడితవర్గ ఉద్యమాలకు స్పష్టత వస్తున్నది. ఇంకా ఆ స్పష్టత సంఘటిత నిర్మాణ రూపం ధరించలేదు. భారత సమాజంలో చారు మజుందార్ వంటి ద్రష్టలు తెరాయి లేఖలు రాయడం ప్రారంభించి భారత ప్రజా ఉద్యమాలకు ఆ స్పష్టతను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుగుసీమ రాజకీయాలలో, రెండు కమ్యూనిస్టు పార్టీలలో ఉన్న శ్రేణులలో ఆలోచనలు రగులుతున్నాయి గాని స్పష్టత రూపొందిందని చెప్పే అవకాశం లేదు. ఇక తెలుగు కవులకు ఆ స్పష్టత అప్పటికే అందిందని చెప్పడానికి వీలే లేదు. దిగంబర కవులను మాత్రమే కాదు, ఏ సామాజిక చైతన్య, సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాన్నయినా కాలం కన్నబిడ్డగా చూసినప్పుడు, ఆ బిడ్డకు ఆ కాలం ఇచ్చే అవకాశాలూ ఉంటాయి, ఆ కాలమే విధించే పరిమితులూ ఉంటాయి.

మరొక పద్దెనిమిది నెలలకు 1968 జూన్ లో ప్రచురణ జరిగి, సెప్టెంబర్ 14 న ఆవిష్కరణ అయిన మూడో సంపుటం నాటికి దిగంబర కవులకు సమాజం పట్ల, సమాజ గమనం పట్ల, భవిష్యత్తు పట్ల స్పష్టత మరింత పెరిగింది. మొదటి సంపుటానికి ‘దిగంబరశకంలోకి’ అని, రెండో సంపుటానికి ‘దిక్ లు 30’ అని మామూలు శీర్షికలు పెట్టినవాళ్లు, మూడో సంపుటం వచ్చేసరికి, ‘నేటి కుష్ఠు వ్యవస్థపై దిగంబర కవులు’ అని స్పష్టమైన వైఖరి ప్రకటించారు. మొదటి రెండు సంపుటాలను ఎవరికీ అంకితం చేస్తున్నట్టు ప్రకటించని వాళ్లు, మూడో సంపుటిని “ఈ దేశంలో, ఈ ఇరవయ్యేళ్ల స్వాతంత్ర్యంలో, భయంకరంగా విజృంభించిన కులమత దురహంకారానికి, ధనమదంతో యధేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని వాడుకుంటున్న గూండాయిజానికి, సినిమా రొంపిలో ఈదులాడుతున్న యువతరం బలహీనతకి, స్తోత్రపాఠాల కుడితిలో పడిపోయిన పత్రికా లోకం పడుపు జీవనానికి, అతీత జీవనంతో తప్పించుకు బతుకుతున్న మేధావుల అనాసక్తతకి, నాయకుల ఊసరవెల్లి ఆదర్శాలకి, పదవీ వ్యాపారాలకి, నేటి ఈ కుష్ఠు వ్యవస్థకి క్రూరంగా బలైన కంచికచెర్ల కోటేశు స్మృతిలో’ అంకితం చేస్తూ తమ మేధా హృదయమూ ఎక్కడ ఉన్నాయో స్పష్టంగా చెప్పుకున్నారు.

“ఈ కుష్ఠు వ్యవస్థని పోషిస్తున్నవాళ్లనీ, ఈ వ్యవస్థనీ సర్వనాశనం చెయ్యడానికి దిగంబర కవులు పూనుకున్నారు… నిజాలు చెప్పనివ్వకుండా గొంతులు నొక్కేసే పరిస్థితుల్ని ప్రోత్సహించే, విషవలయాన్ని సృష్టిస్తున్న వీళ్లందర్నీ, వీళ్లు పెంచి పోషిస్తున్న ఈ కుష్ఠువ్యవస్థనీ దుర్గంధ సంస్కృతినీ నాశనం చెయ్యడానికి నిజమైన మనుషులు కావాలి. దిగంబర కవులు యువరక్తాన్ని ఇప్పటికైనా మేల్కొనవలసిందిగా కోరుతున్నారు” అని ముందుమాటలో పిలుపు ఇచ్చారు. ఈ సంపుటం ఆవిష్కరణ కూడ విశాఖపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్ లో అర్ధరాత్రి ఒక వేశ్య చేత చేయించడంలో సంచలనాత్మకత కొనసాగింది. ఇప్పటికీ భాషలో, వ్యక్తీకరణలో, కావాలని ప్రత్యేకమైన మాటలు వాడడంలో సంచలనాత్మకత పోయిందని చెప్పలేం. గాని చాలవరకు తగ్గింది. విధ్వంసం విధ్వంసం కోసం మాత్రమే కాదనీ, మరొక కొత్త నిర్మాణం జరగాలనీ ఆలోచన ప్రారంభమైంది. అప్పటికి నక్సల్బరీ ప్రజ్వలన జరిగింది. నక్సల్బరీ వెలుగులో దేశవ్యాప్తంగా చిన్నా పెద్దా పోరాటాలు ప్రారంభమై, ఒక సంఘటిత నిర్మాణ రూపం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో అప్పటికి పది సంవత్సరాలుగా సాగుతున్న గిరిజనోద్యమం నక్సల్బరీ వైపు చూసి, నక్సల్బరీతో సంబంధాలు పెట్టుకోవడం మొదలయింది. తెలుగుసీమలో కూడ మధ్యతరగతి విద్యావంతులలో నక్సల్బరీ సంఘీభావ ఆలోచనలు పురివిప్పుతున్నాయి.

అందుకే ఈ సంపుటంలో మొదటి కవిత ‘వందేమాతరం’లో చెరబండరాజు, “అమ్మా భారతీ, నీ గమ్యం ఏమిటి తల్లీ?” అని ప్రశ్నార్థకంలో ముగించినట్టు కనిపించినప్పటికీ దానికంటె ముందరి పాదాలలో దేశస్థితిని బలంగా వివరించడమూ, ఆ స్థితిని మార్చే ప్రయత్నం ప్రారంభం కావాలని సూచించడమూ ఉన్నాయి. మరొక కవితలో చెరబండరాజే “యాబై కోట్ల కంఠాలు తిరుగుబాటు మంటలుగా మారాలి” అని ఆశించారు. “చావుకు ఎరగా మారిన/ ఈ వానపాము మనుషుల మధ్య/ రగులుతున్న విప్లవాన్ని” నిఖిలేశ్వర్ గుర్తించారు. తల్లి వంటి విప్లవ భావాల్ని, ఎదురీతను చంపి పెద్దవాడైపోయిన మిత్రుణ్ని (విప్లవోద్యమ ప్రతీకను) “తిరిగి/ పోరాటం ఊపిరితో/ ధైర్యం కవచంతో” బతకడానికి రమ్మని నగ్నముని పిలిచారు. “తూర్పు పేలి పగులుతూన్న చప్పుడు/ ఎరుపై దగ్గరలో వినబడుతున్నది/ భరతవాక్యం బలంగా కనబడుతున్నది” అని జ్వాలాముఖి ఓటమి తిరుగుబాటు ప్రకటించారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ నాటి నుంచి, అభ్యుదయ రచయితల సంఘం అస్త్ర సన్యాసం నుంచి, ఆంధ్రా ఉపఎన్నికల పరాజయం నుంచి, సోవియట్ కమ్యూనిస్టు పార్టీ ఇరవయో కాంగ్రెస్ ‘శాంతియుత సహజీవనం, శాంతియుత పోటీ, శాంతియుత పరివర్తన’ అనే వర్గ సామరస్య సిద్ధాంతం ప్రకటించిన నాటి నుంచి, అభ్యుదయ రచయితల సంఘ పునర్నిర్మాణ ప్రయత్నం విఫలమైన నాటి నుంచి, కేరళలో కమ్యూనిస్టుల ఎన్నికల విజయం మూడు నాళ్ల ముచ్చట అయిన నాటి నుంచి విస్మరణకు గురైన వర్గపోరాటం మళ్లీ వేదిక మీదికి వస్తున్నది. దాదాపు ఇరవై ఏళ్లుగా విసిరిపారేసిన ఆయుధమూ కలమూ గళమూ మళ్లీ ప్రజారాజకీయాలతో పదునెక్కుతున్నాయి. దిగంబర కవుల మూడో సంపుటంలో కనబడిన, వినబడిన ఛాయలు అవే.

సాహిత్యంలో వర్గపోరాటం ఉధృతం కావడానికి, అరుణాక్షర ఆవిష్కరణ జరగడానికి ఇంక ఒక్క అడుగే దూరం. నీరు తొంబై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరింది, ఇంక గుణాత్మక మార్పుకు ఒక్క డిగ్రీ చాలు.
ఆ అడుగు వేసి, ఆ డిగ్రీ ఉష్ణోగ్రతను జోడించి తెలుగు సాహిత్యాన్ని గుణాత్మక పరివర్తనకు గురిచేయడానికి దోహదం చేసినవి మరి రెండు పరిణామాలు. దిగంబర కవుల మూడో సంపుటం తర్వాత ఏడాదికి వరంగల్ నుంచి వెలువడిన ‘తిరుగబడు’ కవితా సంకలనం, తర్వాత ఒకటి రెండు నెలల్లోనే విశాఖపట్నంలో మహాకవి శ్రీశ్రీ షష్ఠిపూర్తి సందర్భంగా ‘రచయితలారా, మీరెటువైపు?’ అని విశాఖ విద్యార్థులు విసిరిన సవాల్.

పుట్టింది వరంగల్ జిల్లా రాజారం. కవి, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, పత్రికా రచయిత, వక్త, రాజకీయార్థిక శాస్త్ర విద్యార్థి, తెలుగు రాజకీయార్థిక, సామాజిక మాసపత్రిక వీక్షణం సంపాదకుడు.
ర‌చ‌న‌లు: 'స‌మాచార సామ్రాజ్య‌వాదం', 'క‌ల్లోల కాలంలో మేధావులు - బాల‌గోపాల్ ఉదాహ‌ర‌ణ‌', 'అమ్మ‌కానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌', 'క‌థా సంద‌ర్భం', 'క‌డ‌లి త‌ర‌గ‌', 'పావురం', తెలంగాణ నుండి తెలంగాణ దాకా, విచ్ఛిన‌మ‌వుతున్న వ్య‌క్తిత్వం, 'పోస్ట్‌మాడ‌ర్నిజం', 'న‌వ‌లా స‌మ‌యం', 'రాబందు నీడ‌', 'క‌ళ్ల‌ముంద‌టి చ‌రిత్ర‌', 'ప‌రిచ‌యాలు', 'తెలంగాణ‌ - స‌మైక్యాంధ్ర భ్ర‌మ‌లు, అబ‌ద్ధాలు, వాస్త‌వాలు', 'శ్రీశ్రీ అన్వేష‌ణ‌', 'లేచి నిలిచిన తెలంగాణ‌', 'ప్ర‌తి అక్ష‌రం ప్ర‌జాద్రోహం - శ్రీకృష్ణ క‌మిటీ నివేదిక‌', 'రాబందు వాలిన నేల‌', 'ఊరి దారి- గ్రామ అధ్య‌య‌న ప‌రిచ‌యం', 'విద్వేష‌మే ధ్యేయంగా విశాలాంధ్ర మ‌హార‌భ‌స‌', 'క‌విత్వంతో ములాఖాత్‌', 'సమాజ చలనపు సవ్వడి', 'కాషాయ సారం', 'విద్వేషాపు విశ్వగురు', 20కి పైగా అనువాదాలు.
సంపాద‌క‌త్వం: 'Fifty Years of Andhrapradesh 1956-2006', 'Telangana, The State of Affairs', '24గంట‌లు', 'హైద‌రాబాద్ స్వాతంత్య్ర సంరంభం', 'జ‌న హృద‌యం జ‌నార్ద‌న్‌', 'స‌మ‌గ్ర తెలంగాణ' పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

2 thoughts on “అరుణాక్షరావిష్కారం – దిగంబర కవులు

  1. చాలా పరిశీలనాత్మక వ్యాసం.
    దిగంబర కవిత్వం గురించి
    కిందటివారం ఢిల్లీలోని ఆంధ్రా సంఘం వారు ఆయనకు చేసిన అభినందన సమావేశం లో మాట్లాడుతూ నిఖిలేశ్వర్ గారూ దిగంబర కవితా ప్రస్థానాన్ని కొంచెం ఇంచుమించు వేణు చెప్పినట్టే చెప్పారు

    వేణు చక్కగా వారి కవిత్వాన్ని విశ్లేషంచారు

  2. దిగంబర కవులు వ్రాసిన రచనలు చదవటం ఈ తరం జనాలకు ఎంత వరకు లాభాకరం లేదా చేటు? వారి రచనలు ఎక్కడ లభ్యమవుతాయి? It’ll be very helpful if you can give me links to free PDFs thank you

Leave a Reply