అరిమేని కుండలు

“కిష్టయ్యా! కిష్టయ్యా! నిన్ను ఎర్రగుంట పల్లి జగన్నాద రెడ్డి వొచ్చి పొమ్మనాడు” అని పిలిసిన పలుపుకి ఏదో ఆలోసెనలో ఉండే నేను ఈ లోకంలో కొచ్చి తిరిగి సూస్తే మకరందుడు. అప్పుడడిగినాను “ఏం పనంటా” జగన్నాద రెడ్డి కని.

వాడు “అయ్యా! ఆయని కొడుక్కి పెండ్లి పెట్టుకున్నాడంట, దానికి అరిమేని కుండలు కావాలి గదా! ఆ సంగతి మాట్లాడే దానికి రమ్మన్నాడు” అని సెప్పి ఎళ్ళి పొయ్యినాడు.

అరిమేని కుండలనే కొద్దికి నాకు పోతా ఉండే పేణాలు లేసొచ్చి నట్టయ్యింది.ఎందుకంటే ముందు మాదిరిగా సట్లు కుండలు అడిగేవోళ్ళు లేదు గదా! మట్టితో జేసిన సట్లు కుండలు అమ్మి పొట్ట బోసుకుంటా ఉండిన మా బతుకుల్ని సత్తు ఇత్తళి రూపంలో వొచ్చి మమ్మల్ని మట్టి పాల్జేసి నాయనే సంగతి తెల్సిందే.

నెలకో రెండు నెల్లకో ఒక పెండ్లి గిరాకి వొస్తింది.ఇంగ సావు లంటారా యాడాది పొడగన సూసుకొన్నా మహ అంటే అయిదు పదికి మించవు.ఇట్టా వాటికి తప్పించి మట్టి కుండ కావాలనే వోళ్ళ ఎవురుండారు.

అందుకే నేను ఇంట్లోకి పొయ్యి, దండెం మీదుండే సొక్కాయి తీసి తగిలించుకొని పైగుడ్డ తీసి బుజం మిందేసుకొంటా ఉంటే, మా ఇంట్లోది వొచ్చి “ఏందే ఈ పొద్దు బలే తెంపుగా ఉండావు” అని అడిగింది.

దానికి నేను “అదేనే ఆ ఎర్ర గుంటుపల్లి జగన్నాథ రెడ్డి కొడిక్కు పెండ్లంట. అరిమేని కుండలు మాట్లడే దానికి రమ్మన్నాడని తెల్సింది. ఆయన ఈ పాయకట్టు కంతా పెద్ద మత్తేపనే సంగతి అందరికి వెల్సిందే గదా!పెండ్లి గూడా దానికి తగినట్టు బలంగానే చేస్తాడు. మనకు ఇనాములు గినాములు బాగనే వొస్తాయి” అనేసి కుండ్ల పెడికల్ల పొయ్యి సపార్లో తొంగి సూస్తే కుమ్మర సాన కనబడింది

దాని మింద దుమ్ము ధూళి చెత్తా చేదారం పేరుకోనుండాది. ముందు మాదిరిగా దానికి పనుంటే, ఇట్ట మూలన పడుండాల్సిన ఖర్మ దానికి పట్ట లేదు. అది ఎప్పుడైతే తిరిగేది మంద గించిందో అప్పుడే మా కష్టాలు కడగండ్లు మొదలైనాయి.

***

నేను మూడు మైళ్ళ దూరం నడిసి జగన్నాద రెడ్డి దగ్గిరికి పోతిని. ఆయన మొత్త ఇరవై ఉరువులు నాలుగు అరిమేని కుండలు, నాలుగు దత్తలు, వాటి మింద మూసే దానికి సానికలు, కర్పూరం సాంబ్రాణి ఎలిగించే వైరాళ్ళు, దీపపు పమిదలు, మొత్తం గలిపి ఎంత? అడగతావో అడుగు అన్నాడు.

మొదట్లో నేను కొంచెం ఎక్కువగానే అడగాలను కుంటిని. అట్టడిగితే లేక లేక వొచ్చిన గిరాకి చెయ్యి జారి పోవచ్చు.యట్టంటే? ఈ ఇలాకాలో నేనొక్కణ్ణె కుమ్మరోణ్ణి కాదుగదా శానామందే ఉండారు. వాళ్ళు నాకంటే తక్కవ ధరకే ఇస్తానని రావచ్చు. అందుకని దర్మంగానే అడిగి నాను మున్నూరు రూపాయలని.

ఈ సావుకార్లంతా ఎట్టా టోళ్ళంటే, నగరు కన్నా నాలుగు రూకలు కడతారు గాని, మా బోటోళ్ళకు దమ్మిడీ ఇదల్స నంటారు. అవసరం లేని దాని క్కూడా లెక్క లేకుండా ఖరుసు పెడతారు సాకలా, మంగలా, మా బోటోళ్ళ దగ్గరి కొచ్చే కొద్దికి తొక్కి తొక్కి బేరమాడతారు. లెక్కేసు కొంటే,మా కిచ్చేది వాళ్ళు తాగి ఉచ్చబోసినంత ఉండదు.వాళ్ళ కంటికి మా బోటోళ్ళె గదా అలుసు.

ఆయన నూటా యాబై కాడొచ్చి నిల్సి పొయ్యి దాని మింద ఒక్క దమ్మిడీ ఎక్కవ ఇయ్యనన్నాడు. ఏరే వోళ్ళు ఇదే రేటుకు అన్ని ఉరువులు తెచ్చిస్తానన్నారు, ఏదో నువ్వు పాటుకు సేటుకు పని కొస్తావని నీకు సెప్పతా ఉండాను, అని కొసురు మాట గూడా అనేసి నాడు.ఆయన ఆ మాటన్నాక నేనింక ఏమడిగేది.

అందుకే నేను “అయ్యా తమరు మా కష్టం జూసన్నా ఇంకొక్క యాబై రూపాయలేసి ఇన్నూరన్నా ఇయ్యండి “అని అడుక్కుంటే, సరే నని నిక్కరు జోబీలోంచి తీసి అడ్మాసంగా పది రూపాయలు నా చేతిలో పెట్టి నాడు.

అరిమేని కుండలంటే మాటలా? చెరువుల్లో కుంటల్లో పొయ్యి మంచి పేరుడు మట్టి జూసి తెచ్చుకోవాల.దాంట్లో రాళ్ళు గీళ్ళు లేకుండా ఏరి నీళ్ళు బోసి నాన బెట్టి రెండు మూడు దినాలు మగ్గ నియ్యాల. మల్లీ తొక్కి కుండలు జేసి పెట్టు కొని, ఎండనిచ్చి కాల్సి రంగు లేసి ఇంత పనుండాది.

***

ఈ పని గూడా ఎవురంటే వాళ్ళు సెయ్యలేరు సేతిలో పని తన ముండాల. మా కుమ్మరోళ్ళ కంటే ఈ ఇద్దె పుట్టుకతోనే వొచ్చిందే గాబట్టి సేస్తా. నీళ్ళల్లో సేప పిల్లకి ఈత నేర్పించాల్నా?

పెండ్లి నాడు మద్దేనాళ్ళ కంతా పెద్ద కడవల్ని దుత్తల్ని రెండు మోపులుగా కట్టి, చిన్న ఉరువులంతా రెండు గోతాల్లో రెండు మూటలు కట్టి, పెద్ద మోపులు నేను మా ఇంట్లోది ఎత్తుకుంటే, సిన్న మూటలు పిలకాయల దగ్గర ఎత్తించుకొని, యలబార్తిమి.పిలకాయలు గూడా కాదు గీదు అన్నోళ్ళు గాదు. కుశాలగానే మాతో వొచ్చినారు. ఎందు కంటే వాళ్ళుకూ ఆశ. పోయేది పెండ్లికి కదా!కూడూ కూరలు పలహారాలు పెడ తారు తినొచ్చని.

మేము బరువులు నెత్తిన బెట్టుకొని ముక్కతా మూల్గతా పోతా ఉండాము. మడి కయ్యల గుండా గెనాల మింద పొయ్యి పైటాళ్ళకే ఎర్రగుంట పల్లి కాడికి ఎళ్ళిపోతిమి.

అప్పిటికే రెండు మూడు బస్సులు నాలుగైదు కార్లు వొచ్చి పెండ్లింటి ముందు నిల్సి పొయ్యుండాయి.ఆడ పరిచ్చితిని బట్టి సూస్తే,పెండ్లి ఆడ కానట్టుంది. బయటెక్కడో సత్రంలో జరిగేటిగా ఉంది. అయితే అరిమేని కుండలు మాట్లాడే టప్పుడు పెండ్లెక్కడని నేనూ అడగ లేదు ఆయనా సెప్పినోడు గాదు. అయితే ఒప్పుకున్నప్పు యాడయినా తప్పదు గదా! సేర్సేద్దాంలే అనుకుంటి.

పెండ్లింటి కాడ సుట్టాలు ఈదిలోకి ఇంట్లోకి తిరగతా ఉండారు జగన్నాథ రెడ్డి ని గురించి అడగితే, తెల్లార్తోనే సిత్తానూరు సత్రం కాడికి ఎళ్ళి పొయ్యినాడని సెప్పినారు.

ఊర్లో పెండ్లంటే మా పని కొంచెం సుళువు. వీటన్నింటినీ సత్రం కాడికి చేర్సాలంటే బేజారయి పోతింది.సిత్తానూరంటే దగ్గిరా దావాదం కాదు.అయినా సేర్సాల్సిందే గదా అని బస్సులో ఒక మూలన సర్దేద్దామని పోతిని. డైవోరు కిలీనరు కాదంటే కాదనేసి నారు.

***

సరేలే వీళ్ళనేంది అడిగేది పెండ్లోళ్ళు వొచ్చి సెప్పితే ఎక్కించు కొంటారులే అని పెండ్లింటికి పోతే, పెండ్లి కొడుకే కనబడినాడు. ఆయన్తో ఈ సంగతి సెప్పినాను ఆయన ఏమన్నాడో తెలుసా?”అరిమేణి కుండలు ఎవురు తెమ్మన్నారు” నిన్ను అని అడిగినాడు.

అందుకు నేను “తమరి నాయనే తెమ్మన్నాడండి పది రూపాయలు అడ్మాసం గూడా ఇచ్చినాడు బస్సులో ఎక్కిద్దామని పోతే వాళ్ళు ఎక్కించనంటా ఉంటారు మీరు కొంసెం సెప్పితే ఎక్కించు కొచ్చేస్తాను”అంటిని.

అందుకాయన ఈ ముసలోళ్ళతో ఇదే బాద ఏది ముందు సెప్ప నంటారు. వాళ్ళంతట వాళ్ళే పెత్తనం జెయ్యాలంటారు. ఇదే మన్నా ఊళ్ళో పెండ్లా సట్లు కుండలు ముందు పెట్టుకొని పెండ్లి సేసు కొనే దానికి, సత్రంలో పెండ్లి పైగా అక్కడికి పెద్ద పెద్దోళ్ళంతా వొస్తారు.వీటిని జూసి ఇదేమి? ఆచారమని గేళి సెయ్యరూ. ఒద్దంటే వొద్దు అనేసి, తిరిగి మల్లి సూడకుండా పోతా ఉంటే, నేను అయ్యా! అయ్యా! అని ఆయన ఎనకమ్మిటా పొయ్యి అడుక్కున్నా ఆయన మనస్సు మాత్రం కరగ లేదు వొద్దంటే వొద్దనే సెప్పేసి నాడు. మల్లా అక్కడుండిన అందర్ని అడుక్కున్నాను మీ రన్నా సెప్పండని, ఒకరి నోట్లో నుంచి గూడా సరే ననే మాట రాలేదు.

అరిమేని కుండలు వొద్దన్నారు సరే పిలకాయలు ఆకిల్తో ఉండారు గదా! అని అక్కడుండే వోళ్ళను “మేము కుమ్మరోళ్ళం పిలకాయలు పస్తు అన్నముంటే పెట్టండ”ని అడిగితే, వాళ్ళు “పెండ్లి ఈడ గాదు సిత్తానూరు సత్రం కాడ, ఏదో సుట్టాలకని కొంచెం వొండి నాము అయ్యి పొయ్యింది” అనేసి నారు. కాని తినేవోళ్ళు తింటానే ఉండారు కడిగే వోళ్ళు కడగతానే ఉండారు. అరిమేని కుండలు వద్దన్న దాని కంటే సిన్న పిలకాయకి ఇంత తిండి పెట్టించ లేక పోయామనే బాద నాకు ఎక్కవయ్యి పొయ్యింది.

దాంతో నాకు అగుమానంతో తల తీసేసినట్టయ్యింది. మా ఇంట్లోది అయితే దించిన తల పైకెత్త లేదు. ఆమె కండ్లల్లో నీళ్ళు తొంగి సూస్తా ఉండాయి, పలకరిస్తే సాలు దూకేద్దామని. ఇంగ పిలకాయల సంగతి సెప్పాల్సిన పనే లేదు వాళ్ళ మొఖాల కల్ల సూస్తే నాకే ఏడుపొస్తా ఉంది కాని ఏం సెయ్య గలను.

అప్పిటికే పిలకాయలు మొఖాలు ఆకిల్తో వాడు పుట్టి పొయ్యుండాయి మాకూ ఆకిలిగానే ఉంది మద్దేణాల సంగటే సాలి సాలకుండ తింటిమి పెండ్లింటి కాడ తినొచ్చని. ఎంతో ఆశతో వొచ్చి నారు ఇప్పుడు వాళ్ళనేం జెయ్యాలి అనుకుంటా ఉంటే.కార్లు బస్సులు జనాన్ని ఎక్కించుకొని మా కండ్ల ముందే దుమ్ము లేపుకుంటా ఎళ్ళి పొయ్యి నాయి. ఆ దుమ్ము మా కండ్లల్లో పడి నీళ్ళు బొట్లు బొట్లుగా రాలి నాయి.

***

కుండలు మల్లీ నెత్తన బెట్టుకొని ఇక్కడ మన బాదలు సెప్పు కున్నా ఇనే వోడు లేదని ఇంటికి ఎలబారి నాము. గాని వచ్చేటప్పుడు ఉండే మునాసు తిరిగి పోయేటప్పుడు లేదు. పోను పోను ఈ ఆచారం గూడా పోయేటట్టుగా ఉందనే బాదొక పక్క ఆకిల్తో ఉండే పిలకాయలకు పిడికెడు మెతుకులు పెట్టించ లేక పొయ్యినామనే బాద ఇంగొక పక్క. పోతా ఉండామే గాని కుండలు మొయ్యంగా బారమని పిస్తా ఉండాయి. మా బతుకులు మాదిరిగానే, ఒకటే ఆలోసెన.

తిరిగి మోసక పోతాం ఏం? జేసుకోను ఎవురి? కియ్యాల ఎవురు? తీసుకొంటారు ఒక పెండ్లి కని జేసినవి ఇంగొక పెండ్లికి తీసుకోరు కొత్తవే సేసియ్య మంటారు. ఎవురూ తీసుకోనప్పుడు ఇంత దూరం ఎందుకు? మొసక పోవాల. అందుకే పగలగొట్టేద్దామా అనేంత కోపమొచ్చింది.అయితే ఆ పని సెయ్యలేదు ఎందుకంటే? ఇయ్యి జగన్నాదరెడ్డి కొడుకు పెండ్లికని సేసినవి మనం పగలగొట్టేస్తే వాళ్ళకు సెడ్డ జరగొచ్చు.అందుకనే పగలగొట్ట లేదు ఎందుకంటే వాళ్ళ వొళ్ళ మాకు బాద కలిగి ఉండచ్చు,కాని మన వల్ల మాత్రం వాళ్ళకు సెడ్డ జరక్కూడదు. అందు వల్ల మోసుకొని పోతానే ఉండాము.

పొద్దంతా తిరిగి తిరిగి అలిసి పొయ్యిన సూర్యుడు పరంట కొండ కొండలెనక్కి పొయ్యి జారుపోతా ఉండాడు, అలుపు తీర్సుకొనే దానికని. సీగటి ఆవరిస్తా ఉంది. అప్పటికే మా ఉచ్చిన గుంతలు మంటెగిరి పొయ్యుండాయి. యాడన్నా? దించి అలుపు తీర్సుకొని పోదామంటే దించే మడిసి కనబడలేదు.మా నెత్తి బరువు మేం దించుకో లేము కదా దోవలోనే బొమ్మలదొడ్డి మాల పల్లి కాడికి పోతే, ఆడ మడుసులు కనబడుతే దించమని దించినాము.

అప్పుడనంగానే ఆ ఊరి జనాలు మేళ తాళాలతో మేముండే సోటికే వొచ్చినారు. ఆ గుంపులో కుప్పయ్యని ఒక దపా సర్పంచి గూడా, ఆయన నాకు బాగ తెల్సినోడే,వొచ్చి”ఏం కిష్టయ్యా! ఇట్టా వొచ్చినారు ఇక్కడ పెండ్లి నా కొడుక్కె, అని. అరిమేని కుండక కల్ల జూసి ఇయ్యి ఎవురికి ఎత్తక పోతా ఉండారు” అని అడిగినాడు.

నేను జరిందంతా సెప్పి, ఇంటికి తిరుక్కొని పోతా ఉండాము అని సెప్పినాను. దానికాయన నొచ్చుకొంటా “దొరల సిత్తం మాకుల నీడ ఒకటని ఈ పెద్దోళ్ళ మాటలంతా ఇట్టనే ఉంటాయి గాని. మీరేమీ అనుకో మంటే, ఒక మాట సెప్పతాను. మీరు మా ఇండ్లల్లో తినరని నాకు తెలుసు. అంకనే మేము వంట బాపనోళ్ళను పిల్సకొచ్చే వొండించి నాము. ఎందు కంటే? సుట్టు పక్కూర్లల్లో మన రైతులు గూడా వొచ్చి తింటారని మీరూ తినేసి పోండి”అని బతిమలాడి నాడు.

అప్పుడు నా కనిపించింది దీంట్లో కొలంతో పనే ముండాది ఆకిలికి అన్నం పెట్టనోళ్ళు గొప్ప కులపోళ్ళు అయితే మాత్రం దేనికి కూటికి కొలమా గోత్రమా మడిసి మంచోడా కాదా అనేదే ముక్కెం అని పొయ్యి తినేస్తిమి.

***

తినేసినాక ఆయన్తో ఒక మాట సెప్పి పోదాని సూస్తే ఆయన వాళ్ళ కొల పెద్దలతో మాట్లడతా కనబడినాడు. ఆయన నన్ను సూస్తానే మాట్లాడేది నిలిపేసి వొచ్చి, నా రెండు సేతులూ పట్టుకొని “అయ్యా శానా సంతోషం మీరొచ్చి బోంసేసి నందుకు ఇంగొక మాట ఇంత వరకూ మా కొలంలో ఎవురూ అరిమేని కుండలు పెట్టుకొని పెండ్లి జేసుకొనింది లేదు.

ఇప్పుడే మా కొల పెద్దలతో మాట్లాడినాను వాళ్ళు గూడా సరే మన్నారు యట్టా తెచ్చి నారు మల్లా వాటిని యాడ మోసక పోతారు గాని మీ సేతల్తో తెచ్చి పెండ్లి పందిట్లో దించేయండి. మీకు ఏమేమి ఇనాములు సేరాల్నో సెప్పండి ఇచ్చేస్తాము అన్నాడు. వాటినెత్తక పొయ్యి పెండ్లి పందిట్లో దించేస్తిమి.

మేము సెప్పిందంతా వాళ్ళ ఇచ్చినారు. మేము, మీరు కొత్త కుండలో నీళ్ళు మాదిగా పది కాలాలు పాటు సల్లంగా ఉండాలని దీవించి వొస్తా ఉంటే, కుప్పయ్య కూడా ఊరు గెవిని దాకా వచ్చి సాగనంపి పొయ్యి నాడు. మేమూ సంతోసంతో తిగిగొచ్చేస్తిమి.

పుట్టింది చిత్తూరు జిల్లా వెదురు కుప్పం మండలం. బతుకుదెరువు కోసం కార్వేటినగర్ మండలానికి వలసవెళ్లారు. పేదరికం వల్ల ఎక్కువగా చదువుకోలేదు. చిన్న చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేశారు. పదవ తరగతి పాసైన తరువాత యస్ వీ ఓరియంటల్ కాలేజీలో తెలుగు ప్రీ డిగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశారు. తరువాత ఎస్వీ యూనివర్శిటీ(ఓపన్ యూనివర్సిటీ)లో చేరి మధ్యలోనే ఆపేశారు. ఇద్దరు పిల్లలు చదివి పెద్ద ఉద్యోగస్తులయ్యారు. ఇప్పుడు రచనలు చేయటానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువ చదవడం, నిమ్నకులాలతో కలసి తిరిగి వారి కష్ట సుఖాలను, వారి జీవన విధానాన్ని ఆకళింపు చేసుకున్నారు. రచనలు : చాకిరేవు కతలు(2017), మావూరి మంగలి కతలు(2018), ప్రకృతి వికృతి(2019). మట్టి పూలు(కుమ్మరి కతలు), బాపూజీ ఓకల, వెలివాడ కతలు త్వరలో రానున్నాయి.

Leave a Reply