అరిగోస

మట్టిలో
తారాడే చేతులు
మట్టి అంటక పోతే మారాం చేసే చేతులు

బురద మళ్ళల్లో నాట్యమాడే కాళ్ళు
కల్లాల్లో కలియ దున్నే కాళ్ళు
బస్తాలు తొక్కే కాళ్ళు
కాటిలోకి పోయేదాకా విశ్రమించని కాళ్ళు

గింజతో పాటు మట్టిలోకి వేళ్ళు
గింజ వేళ్ళూనుకుని మట్టిపెళ్ళల తన్నుకుని
బైట పడుతుంటే మెరిసే కళ్ళు

మట్టి సారం ఎరుకయ్యే అనుభవం
తరాల విద్య
దృశ్య శ్రవణ యంత్ర వీక్షణతో
ఎవుసం సాగదు
పుస్తకాలు రాక మునుపే ఎవుసం
ఎవ్వడు జెప్పలే గా యాల
నా నేర్పే నా మొక్కకి ఊపిరి

ఇంటిముందో వెనుకో
బర్రో గొడ్డో మేకో గొర్రో నాకు తోడుగా
మలమూత్రవిసర్జన కసుపు తో సహా ఊడ్చి ఎత్తి
ఊరి చివర దిబ్బ
పోగు ఏడాదంతా
ఎండాకాలం దిబ్బెరువు తోలి
చెరువుమట్టి కలిపి చల్లి
సారం పెంచే జ్ఞానం నా సొంతం

ఊరంతా దేశవాళి పంటల హోయలతో
ఊగుతుంటే
ఇచ్చిపుచ్చుకునే ధాన్య మార్పిడితో
తిండికి లోటే లేక విరాజిల్లిన
ఊరూరా సంక్రాంతి

మొలకెత్తే గింజ పరిజ్ఞానం
నానుండి దూరం జేసి
బిటి బోటి అంటూ
బహుళ జాతులకు అంటగట్టి
నా ఉరితాళ్ళ పేన పేటెంట్ అప్ప జెప్పి
నా ఉనికినే ప్రశ్నార్థకం జేసిన ఘనతెవ్వడిది!!

వాణిజ్య పంటల ఉసి గొల్పి
రసాయనిక ఎరువుల ఎగ దోసి
సారాన్ని పిప్పి చేసి
అదికాదు ఇదికాదంటూ లోప భూయిష్ట
ప్రయత్న ఫలితాల హోరులో
నిష్ఫల ఎవుసం నేడు

కురిసిన మబ్బు
కురిసిన కార్తె
కురిసిన చినుకు పరిణామం
చినుకు రాలిన నేల
నల్లదో ఎర్రదో దుబ్బదో ఇసుకదో రాతిదో
ఇన్ని జూసి బేరీజు వేసి
ఏ గింజ
ఎన్నాళ్ళకు పండుతదో పరీక్షించి
వేసే నేను మొగులు రాకమునుపే
రాత పత్రాల ఖరారెలా జేసుకోవాలే సన్నాసి?!!

పండే పంట
అమ్మబోతే ఆంక్షల వెల్లువ
బండి నిండని పంట
బొంబాయి బొమ్మంటే బోయేదెట్ట నరుడా!!
ఊరిపక్కన తెచ్చిన
గింజ ఎరువు మందు అరువు అరిగోస తీరేదెలా?!

పొట్ట గోస్తే ఎవుసక్షరం ఎరగనోడు
ఎగాదిగా నాపైకి దూసుకొస్తుంటే
ఆంబోతుల్లా కుమ్మటమే నాకు తెల్సు

పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేశారు. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని  కవిత్వం రాస్తున్నారు.  వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

Leave a Reply