ముస్లిం మహిళల స్వేచ్ఛా గీతిక అయాన్ హిర్సీ అలీ

అయాన్ హిర్సీ అలీ రాసిన నోమాడ్ పుస్తకం తెలుగు అనువాదం “సంచారి”. 2011లో ప్రచురితమైన ఈ నవల ముస్లిం సమాజం నుండి బైటపడి ముస్లిం స్త్రీల స్వేచ్ఛకోసం పోరాడుతున్న అయాన్ హిర్సీ అలీ ఆత్మను ఆవిష్కరిస్తుంది. సోమాలియాలో పుట్టిన అయాన్ హిర్సీ అలీ ఒక సంచారి గానే చాలా సంవత్సరాలు బ్రతకవలసి వచ్చింది. తండ్రి సోమాలియా ప్రజా ఉద్యమాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నా ఇస్లాంలోని కొన్ని మతాచారాలతో విబేధించినా ఇస్లాంను వీడి ఉండలేదు. కాని ఒక స్త్రీగా తమ జీవితాలపై మతం చేస్తున్న అన్యాయాలను ప్రతిఘటించి, చిన్న తనంలో ఇష్టం లేని వివాహం చేసుకోలేక నెదర్లాండ్స్ పారిపోయి వచ్చి, అక్కడే చదువుకుంటూ సమాజాన్ని గమనిస్తూ తమ జీవితాలలో మార్పు రావాలంటే మతాన్ని విడనాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఇస్లాం మత గురువుల కోపానికి గురి అయిన వ్యక్తి అయాన్. ఆమెను చంపడానికి ఇస్లాం మతతత్వ గ్రూపులు నిర్ణయించుకున్నాయి. నెధర్లాండ్స్ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర వహించి తరువాత ఆమెరికా వెళ్ళారు ఆమె. అక్కడే పౌరసత్వం స్వీకరించి స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్నారు.

సంచారీలో తన సంచార జీవితం, దాని అనుభవాలను విపులంగా రాసుకున్నారు అయాన్. సోమాలియాలో పుట్టి తరువాత ఇధియోపియా, కెన్యా దేశాలలో కుటుంబంతో ఆమె నివసించారు. తండ్రి ఆమెకు వివాహం చేసి కెనడా పంపించాలనుకున్నప్పుడు జర్మనీ తప్పించుకుని హాలండ్ పారిపోయారు. హాలేండ్ లో జీవితం తన జీవన పంథానే మార్చివేసింది అని చెప్తారు రచయిత్రి. అక్కడ డచ్ సోషల్ సర్వీసెస్ లో అనువాదకురాలిగా పని చేస్తూ ఆ దేశానికి వలస వచ్చిన ముస్లింల జీవితాలను పరిశీలించారు ఆమె. మతం ఆడవారి జీవితాలను అణిచివేయడం, ఆ జీవితమే సరి అయినది అనే భ్రమలో స్త్రీలు ఉండిపోవడం, పేదరికం, నిరక్షరాస్యత, పురుషాధిపత్యం కారణంగా హీనమైన జీవితాలను స్త్రీలు అనుభవించడం చూసి ఇస్లామ్ ను త్యజిస్తేనే స్త్రీల అభివృద్ది సాద్యం అనే అభిప్రాయానికి వచ్చారు. ఈ పుస్తకంలో ఇస్లాంలోని లోపాలను నిర్మూలించడం సాధ్యం కాదని ఆమె చెప్పుకొచ్చారు. ఇస్లాం పునాది పై ఆమెకు చాలా అపనమ్మకాలు ఇన్నాయి. అయితే ఈ పుస్తకం రాసిన కొన్ని సంవత్సరాల తరువాత ఆమె ఇందులో ప్రస్తావించిన కొన్ని అభిప్రాయాలను మార్చుకున్నా మతం స్త్రీలపై చెస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇస్లాంను విడనాడిందని ఆమె కుటుంబం ఆమెను బహిష్కరించింది. తండ్రి చనిపోతున్నప్పుడు అతన్ని చూడడానికి అంగరక్షకులతో వెళ్లవలసిన పరిస్థితి. అయినా ఆమె మతాన్ని విమర్శించడం మానలేదు. కురాన్ లోనే స్త్రీ మాట వినకపోతే ఆమెను కొట్టే అధికారం పురుషునికి ఉందన్న సూక్తిని ప్రస్తావిస్తూ, అది ఎందరి స్త్రీలనో బానిసలుగా మార్చిన వైనాన్ని ప్రశ్నిస్తారామె.

ఇస్లాం నుండి స్త్రీలను రక్షించాలంటే పాశ్చాత్య ప్రభుత్వాలు పూనుకోవాలి అని ఆమె బలంగా నమ్ముతారు. విద్య ముస్లింలకు అవసరం అని. వలస వచ్చిన ముస్లింల పట్ల మెతక వైఖరి విడనాడి ఆ దేశాలు వారి మూఢత్వానికి వారిని వదిలేయక వారికి ప్రత్యేక పాఠశాలను వారు నిర్మించుకుంటుంటే ప్రొత్సహించక తమ పాఠశాలలొనే వారికి విద్యాభ్యాసం కొనసాగించే నియమాలను పెట్టాలన్నది ఆమె వాదన. తమ కోసం ప్రత్యేక పాఠశాలను, మదరసాలు నిర్మించుకుంటూ వారు అభివృద్ధిలోకి ప్రయాణించకుండా తమ మూఢత్వాన్ని వదలకుండా ముందుకు సాగకుండా మిగిలిపోతున్నారని అందువలనే యూరోప్, అమెరికా దేశాలలోకుడా ముస్లిం స్త్రీల పరిస్థితి అంత గొప్పగా లేదని, అక్కడ కూడా చిన్నతనంలోనే బలవంతపు పెళ్ళిల్లు, పరువు హత్యలు, ఆడపిల్లల సున్తీలు జరుగుతున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

అలాగే ఆ దేశాలలో ఫెమినిస్టులు ముస్లిం స్త్రీల బాగోగులకు పని చేయటం తమ కర్తవ్యంగా భావించాలని అంటారామె. వారిని వారి మతానికి వదిలివేయడం వల్ల వారి జీవితాలలోమార్పు ఎప్పటికీ రాదు. వారి సమస్యలను గృహ హింసగా వర్ణించి కొట్టి పారేయకూడదు. ముస్లిం అభివృద్ధికి, ఆమె క్రిస్టియన్ చర్చీల సహాయం కావాలంటారు. క్రిస్టియన్ ఏజంట్లు ద్వేషం బోధించరు. సైన్స్ ను వ్యతిరేకిస్తూ బోధించరు అన్నది ఆమె ఆభిప్రాయం. ఈ మూడు విషయాలపై తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా ఈ పుస్తకంలో రాసారు. ఆమె అభిప్రాయాలన్నిటితో ఏకీభవించకపోయినా ఆమె అనుభవాలు, ముస్లిం స్త్రీల వెతలు మతంలో ఉన్న అణచివేతను ఒప్పుకొని తీరవలసిందే.

తన కుటుంబంలోని వ్యక్తుల ప్రస్తావన తీసుకొస్తూ అయాన్ ఒక చోట, తన మారుటి చెల్లెలు సహ్రీ గురించి చెబుతూ ఇస్లాంను అంటిపెట్టుకుని ఉన్న సహ్రా జీవితాన్ని ఒక్క మాటలో ఇలా చెబుతుంది. “నా వ్యక్తిత్వంతో నేను ఒంటరినయ్యాను. సహ్రా లొంగుబాటుతో మందిలో బ్రతుకుతున్నది” మతానికి లొంగిపోయిన స్త్రీ మందిలో బ్రతకడం కోసం మతాన్ని విస్మరించదు. అంతగా లొంగిపోయినా వారి జీవితాలలో ఉన్నతి కనిపించదని అయినా కూడా సంఘాన్ని వీడవలసి ఒంటరిగా ఉండవలసి వస్తుందనే భయంతో మతానికి లొంగి స్త్రీలు జీవిస్తున్నారని అయాన్ చెప్తారు. ముస్లిం ఇళ్ళల్లో పురుషాధిక్యత ఎక్కువ. తండ్రి తరువాత మగబిడ్డ ఆ పాత్ర పోషిస్తాడు. మగపిల్లలను అహంకారులుగా మారుస్తూ అదే పురుష నైజంతో పిల్లలను పెంచుతారు. మగపిల్లలు ఇంట్లో సోదరులపై తమ అధికారాన్ని చూపిస్తూ ఉంటారు. ఇది ప్రతి ముస్లిం కుటుంబంలో కనిపించే నిజమే. హైదరాబాదీ ముస్లిం కుటుంబాలలో ఈ విషయాన్ని గమనిస్తూనే ఉండడం వలన రచయిత్రి చెప్పిన విషయాలు నిజమైనవని అంగీకరించాను.

సోమాలియాలో ముసిం స్త్రీల పరిస్థితి మరింత ఘోరం. పెళ్ళి చేసుకున్నాక ఆమెకు విడాకులివ్వడానికి పురుషుడికి పెద్ద కారణాలు అక్కరలేదు. రచయిత్రి సోదరుడు మహద్ తన భార్యనుండి విడిపోవాలనుకోవడానికి కారణం “ఆమె గర్భం దాల్చనని ఒట్టు వేసి గర్భవతి అయ్యిందని” ఇస్లాం లోని బహు భార్యాతత్వం కారణంగా ఒకోసారి కుటుంబంలో పదులు యాభైలలో పిల్లలుంటారు. కుటుంబంలో బాధ్యత ఎరిగిన ఒక సోదరుడు ఉంటే ఆ పిల్లలందరి బాధ్యత అతనిపై పడుతుంది. తండి పిల్లలను కంటూ పోతే వారి పోషణ చూస్తూ జీవితాలను కరిగించుకున్న కొందరు మంచి కొడుకులు అతి పేదరికంలో మగ్గి అలానే చనిపోతున్నారు. సోమాలియా తెగలలో స్త్రీ ఏదన్నా తప్పు చేసిందని భావిస్తే ఆమెను చంపివేయడమే పరిష్కారంగా ఈ నాటికీ జరుగుతున్నది. ఇలాంటి కారణాలతో తెగల మధ్య తర తరాల పగలు నడుస్తూ ఉంటాయి. ముస్లింలు తమకు ఎయిడ్స్ రానే రాదని నమ్ముతారు. అందువలన ఎట్టి పరిస్థితులలో పరీక్షలు చేయించుకోరు. పాపాలు చేయడం వల్ల అల్లా ఎయిడ్స్ శిక్షగా పంపించాడని నమ్ముతారు. మందులు వాడి అల్లాను యింకా కోపగ్రస్తుడిని చేయకూడదని మందులు వాడరు.

హాలండ్ లో అభివృద్ధి అక్కడి వ్యవసాయ పద్ధతులు చూసి సైన్సుని నమ్మి ఆ దేశం ఎంత అభివృద్ది చెందిందో అర్ధం చేసుకుని తమ దేశంలో కాల్వలు తవ్వుకుని, పచ్చిక, పంట పండించుకునే విధానం పాటించలేని తమ వెనుకబాటు తనం గురించి అయాన్ బాధపడుతుంది. అమెరికాలోని గోస్ట్ టౌన్ ని చూసి. అక్కడ అమెరికన్స్ వదిలేసిన ఆ నగరంలో కనిపించిన ఆధునిక పరికరాలను చూసి ఆమె అబ్బురపడింది. తన తల్లి ఇంటితో పోలిస్తే ఈ ఘోస్ట్ టౌన్లోని ఇళ్ళల్లో ఆధునిక పరికరాలు ఉండడం చూసి తమ వెనుకబాటు తనం ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోగలిగింది. అమెరికన్ సంస్కృతి గురించి ఒక్క మాటలో ఆమె ఇలా చెబుతుంది. “అమెరికన్లు పర్ఫెక్ట్ గా ఉండాలనే కన్నా సంతోషంగా ఉండాలనే ఎక్కువ పాటుపడతారు. వారు చేస్తున్న ఉద్యోగాలు సరిగ్గా లేవనుకున్నా, వారి పెళ్ళిళ్ళూ సజావుగా నడవటం లేదనిపించినా, వదిలి ముందుకు సాగిపోవటం ఆమెరికన్ల లక్షణం.”

ఇస్లాం ను వదిలినవారిని చంపాలని ఆ మతమే బోధిస్తుంది. కొందరు ఇస్లాంను విమర్శించటం ఉగ్రవాదం మీద యుద్ధం చేయటానికి ఒక సాకుగా అమెరికా వాడుతుందంటున్నారు అయాన్. దీనికి కలోనియల్ ఫెమినిజం అని పేరు కూడా పెట్టారు. ఖురాన్ ప్రకారం భర్త తన భార్యను కొట్టవచ్చు. ఇంటి నుండి బయటకి పోవాలంటే అతను అనుమతించాలి. అప్పటికే ఉన్న భార్య అనుమతి లేకుండా వేరే పెళ్ళిళ్ళూ చేసుకోవచ్చు. ఆమెకు విడాకులివ్వదలిస్తే ఆమె అభిప్రాయంతో పని వుండదు. కన్న పిల్లల్ని కూడా ఆమె నుండి దూరం చేయవచ్చు. ఖురాన్ లో ఛాప్టర్ 3, 34వ సురా – ఆడవారు అణకువగా లేరని అనిపిస్తే మగవారు కొట్టవచ్చన్నది. ఖురాన్ షరియా చట్ట ప్రకారం స్త్రీలు మగవారికి సమమైన వారు కారు. వారు మగవాళ్ల కంటే తెలివి తక్కువ వాళ్ళూ. బలహీనులు. లీగల్గా వారికి హక్కులు దాదాపుగా లేవనే చెప్పాలి. కొడుక్కిచ్చే వాటాలో సగమే కూతురికి ఉంటుంది. ఖురాన్ (4.11) కోర్టులో ఆడవారి సాక్ష్యం మగవారి సాక్ష్యంతో పోలిస్తే సగం విలువే కలిగి ఉంది. రేప్ కేసులో రేప్ చేసిన వాడి మాట్లకే తూకం ఎక్కువ. పెళ్ళికి ఆమె అంగీకరించాలని ఖురాన్, ప్రవక్త సూక్తుల్లో ఎక్కడా లేదు. ఆమె సంరక్షకుడు ఒప్పుకుంటే చాలు. కొరాన్ ప్రకారం భార్యను (ఆమె చనిపోయేదాకా) ఇంటిలో బంధించే అధికారం భర్తకున్నది. తప్పు చేసిందనిపిస్తే నలుగురు పెద్దలు కూర్చుని తీర్మానిస్తారు. అల్లా రక్షిస్తే తప్ప చనిపోయే దాకా ఆమెకు శిక్ష ఉంతుంది. ఇస్లాం చట్ట ప్రకారం స్త్రీ ఒంటరిగా ప్రయాణం చేయరాదు. చదువుకోకూడదు. ఉద్యోగం చేయకూడదు. లీగల్ డాక్యుమెంట్లు ఆస్తి సంబంధమైన పేపర్ల మీద ఆమె సంతకం చేయ కూడదు.

ఇస్లాం లో స్త్రీల పరిస్థితి వివరిస్తూ ఆమె చెప్పిన విషయాలు భయానకంగా ఉన్నాయి. “ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130 మిలియన్ల ఆడవారు సున్తీకి గురయ్యారు. రోజూ 6 వేల మంది పసి పిల్లలకు సున్తీ జరుగుతున్నది. సోమాలీలలో 98%, 95% మాలీలోనూ, 90% సూడాన్లోనూ అమ్మాయిలు సున్తీకి గురవుతున్నారు. 97% ఈజిప్టు అమ్మాయిలకు సున్తీ చేస్తున్నారు. సోమాలీలు ఏ దేశంలో నివసించినా ఈ పద్ధతి విడనాడరు. అలా చేయకపోతే అమ్మాయి అపవిత్రురాలని, ఎవరూ పెళ్ళాడరని వారి నమ్మకం. ఆడపిల్లలకు అది మాన రక్షణ అని నమ్ముతారు. ఈజిప్టు, సూడాన్, సోమాలియా మొదలైన 26 మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, పసఫిక్ దేసాలలో ఆడపిల్లగా బ్రతకడం ఊహించలేరు. మర్మాంగాలు కోసి కుట్టేస్తారు. ఖురాన్ లో ఆ క్రతువు ప్రస్తావించకపోయినా ఇది మతం పేరుతో జరుగుతూనే ఉంది.

అమెరికాలోనూ ముస్లిం స్కూళ్ళలో ఆడపిల్ల అణిగిమణిగి ఉండాలని, నేల చూపులు చూడాలనీ శరీరభాగాలన్నిటిని బురఖాలో దాయాలని బోధిస్తారు. స్వేచ్ఛా దేశం అని చెప్పుకుంటున్న అమెరికాలో కూడా ఇస్లాం ద్వారా ఈ వికృత సంస్కృతి జొరబడింది. వలస వచ్చిన మిగతా వారి కంటే ముస్లింలే తమ దేశపు ఆచారాలను అమెరికాలో గట్టిగా పాటిస్తున్నారు. ఇలా ఇస్లాంను పెరగనీయటం అమెరికా వాళ్ళు చేస్తున్న తప్పు అని వాదిస్తారు రచయిత్రి. మోస్క్ స్టడి ప్రాజెక్ట్ సర్వే (2000) ప్రకారం 1994 నుండి 2000 వరకు మసీదుకు వచ్చే వారి సంఖ్య ఇనుమడించింది. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు ఇస్లాంను తమ తల్లితండ్రుల కంటే ఎక్కువ పాటిస్తున్నారు. 50% 18 నుండి 29 మధ్య వయసున్న వారు ప్రతివారం మసీదుకు వెళుతున్నారు. ఇస్లాంను సంరక్షించుకోవటానికి సూయీసైడ్ బాంబింగ్ పద్ధతి మంచి పద్ధతి అని 26% మంది ముస్లింలు చెప్పుకుంటారు. మదరసాలలో, మసీదులలో సెర్మన్ల భాష కూడా మారింది. ఒకప్పుడు అవి ప్రశాంతంగా మంద్రస్వరంతో నడిచేవి. ఇప్పుడు పెద్దగా విద్వేషం చిమ్ముతున్నాయి. వాటి సారాంశం రాజకీయ ఎత్తుగడే. యహూద్(జ్యూ), కాఫిర్(నమ్మసక్తులు కానివారు), మునాఫర్ (హిపోక్రిట్లు) వంటి పదాలను ఇమామ్లు ఎక్కువగా వాడుతారు. ఆడవారికి చిన్న, పెద్ద జిహాదుల్లో పాల్గోనేందుకు తర్ఫీదు ఇస్తున్నారు. ప్రార్ధనల పేరుతో ఆదవాళ్ళు మసీదుల్లో గుమికూడారంటే అనుమానించవలసిన విషయమే.

కొరాన్ పఠనం రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు. కాన్సర్ లాంటి రోగాలతో బాధపడుతున్న వారి దగ్గర ఖురాన్ సూక్తులు చదివి చివరకు వారి మీద ఉమ్మేస్తారు. అలా చేస్తే వారు బాగవుతారని నమ్మకం. ఖురాన్ బోధించే స్కూళ్లలో విడమరచి ఏదీ చెప్పరు. వారిని ప్రశ్నించకూడదు. అర్థం కాకపోతే “అది పవిత్రమైన భాషలో రాయబడింది. భక్తిశ్రద్ధలతో చదువు” అని బెదిరించి ఆ సూక్తులను బట్టీ పట్టిస్తారు.

ముస్లింలందరూ ఏకతాటి మీద నడవాలంటే వారికొక కామన్ శత్రువు కావాలి, వాళ్ళే యూదులు. యూదులు ప్రపంచాన్ని శాసిస్తున్నరని ముస్లింల దుగ్ద. హాలండ్లో ఒక మత విద్యాబోధకుడు మనుష్యుల మనుగడకు శాపం యూదులంటాడు. కమ్యూనిజం, కేపిటలిజం, ఇండివిడ్యువలిజం శాపాలంటాడాయన. కార్ల్ మార్క్స్, మిల్టన్ ఫీడ్మన్, సిగ్మండ్ ఫ్రాయిడ్ ముగ్గురూ యూదులని అతను ఎత్తి చూపుతాడు. మార్క్సిజం నాస్తిక దృక్పథం కలది గనుక ఇస్లాంకి శత్రువు. ఫీ ఎంటర్ప్రైజ్ భౌతిక వస్తువులు సంపాదించుకునేలా పరుగులు పెట్టిస్తుంది. ప్రార్ధనలకు టైము ఇవ్వదు. అందులో అప్పులివ్వటం, పుచ్చుకోవటం ఉంటుంది. వడ్డీ ఉంటుంది. ఇస్లాం దాన్ని ఒప్పుకోదు. ఆ విధంగా కేపిటలిజం ఇస్లాంకు శత్రువు.

ఆల్ ఖైదా ఏజెంట్లు బోధించేవన్నీ ఖురాన్లో ఉన్నమాట వాస్తవమే. చారిత్రిక ఖురాన్ స్వరూప స్వభావాన్ని కనుగొనే బృహత్తర ప్రయత్నం జరుగుతుంది. ప్రవక్త చనిపోయిన తరువాత రెండు వందల ఏళ్ళ కాలంలో ఖురాన్ను రాయటం జరిగిందని నిరూపిస్తే ముస్లిం మైండ్స్ తెరుచుకోవటానికి ఈ అధ్యయనం బాగా ఉపకరిస్తుంది. ఇస్లాంను ప్రశ్నించే వారికి ఇస్లామోఫోబియా ఉన్నదని ముస్లిం సంస్థలు చెబుతాయి. ఇస్లామీయులు పరాయి దేశాలకు వలస వచ్చి వారు బాధిత వర్గమని, వారికి ప్రత్యేక ఎర్పాట్లు, సహాయం అందాలని అనుకుంటారు. ఆఖరికి వారికి విడిగా చట్టం కావాలని అంటారు. దీన్ని ఆస్ట్రేలియన్ ఆంథ్రోపాలజిస్ట్ రోజర్ సాందల్ డిజైనర్ ట్రైబలిజం అన్నారు. రచయిత్రి రోమాంటిక్ ప్రెమిటివిజం” అంటారు. వికాసం పొందగోరని అణచివేసే పద్ధతి, అజ్ఞానం తప్పు తోవలో ఆలోచించి ప్రవర్తించటం ఆచారంగాగల సంస్కృతిని మత సహనం పేరుతో దేశాలు భరించరాదని రచయిత్రి వాదన. ఆడవారు తక్కువ అనే సూత్రం మీద ఆధారపడిన ఇస్లాం అందవిహీనమైనది రాక్షసత్వంతో కూడినది అన్నది ఆమె ఆభిప్రాయం.

రచయిత్రి లేవనెత్తిన ప్రశ్నను, ఆమె ధైర్యాన్ని అభిమానించకుండా ఉండలేకపోతున్నాను. ఈ పుస్తకంలో ఒక చోట ఆమె ఇలా అంటారు “ ముస్లిం మైండ్ వికసించగలదనే నమ్ముతున్నాను, వికాసోద్యమకారులు బైబుల్ని విమర్శించినట్లు, నేను ఖురానును విమర్శిస్తే అపచారం చేశానంటున్నారు. ప్రవక్త భార్యను కొట్టవచ్చన్నాడు. మగవారి విలువలో సగం చేస్తానంటాడు. ప్రవక్త నన్ను అవమానించినట్లా, నేను ఆయన్ను అవమానించినట్లా? … గొప్ప ప్రశ్న. ఇస్లాంలో లోపం ఉందని ఒప్పుకోనంతవరకు ప్రగతి సాధ్యం కాదని బలంగా నమ్ముతారు రచయిత్రి. స్వేచ్ఛా సమాజానికి పునాది వాక్ స్వాతంత్ర్యం. అది లేని సమాజం ఎన్నడూ అభివృద్ధి సాధించలేదని బలంగా చెప్తారు ఆమె. ఫెమినిస్టులు స్త్రీల సమస్యలపై పెద్ద స్థాయిలో పని చేయవలసిన అవసరం ఉంది.

ముస్లిం స్త్రీలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 113 నుండి 200 మిలియన్ల స్త్రీలు కనిపించకుండా ( మిస్సింగ్) పోతున్నారు. 1.5 నుండి 3 మిలియన్ల అమ్మాయులు వారి మీద దౌర్జన్యాలు వల్ల చనిపోతున్నారు. ప్రతి ఏడాదీ దాదాపు 6,00,000 మంది స్త్రీలు ప్రసవంలో చనిపోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గృహ హింసలో మరణించేవారి సంఖ్య అతి పెద్దది. స్త్రీల చావులకు కారణాలనేకం ఉన్నా, పేదరికం ప్రధమ సమస్యగా ఉంటున్నది. వీటి పై దృష్టి పెట్టవలసిన అవసరం ఆధునిక ఫెమినిస్టులకు ఉందని అయాన్ చెబుతారు. ముస్లిం స్త్రీలనాకర్షించగల కొత్త స్త్రీ వాదం మనకు అవసరం. ఫెమినిస్టులు అనుసరించే మగ వ్యతిరేకత ఎబ్బెట్టుగా ఉంటుందని వారి పంథా మార్చుకోవాలని ఆమె స్పష్టం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా స్వేచ్ఛా ఆలోచనాపరులైన స్త్రీలందరూ ఏకమయి పని చేయాలని, ఇస్లాంలోని స్త్రీల స్థితిగతుల మార్పుకు కృషి చేయాలని వాదిస్తారు.

గ్లోబలైజేషన్ అంటే ధనిక దేశాలు పేద దేశాలలో తక్కువ ఖర్చుతో వస్తువులు తయారు చేయించి తమ దేశాలకు తరలించే ఆర్ధిక విధానమే కాకుండా మనుషుల గురించి కూడ విధానాలు అవలంబించాలి. అది చేయని కారణంగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ముస్లిం దేశాల నుండి జనాన్ని చాలా వేగంగా యూరప్లోకి ఆహ్వానించి వారితో వచ్చిన మధ్య యుగాలవారి సంస్క్రుతి వల్ల యూరప్ ఇప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటుందని, మత సహనం పేరుతో వారిని సంస్కరించే చర్యలు జరగకపోవడం ఇక్కడి రాడికల్ ఇస్లామిక్ మూమెంట్లకు కారణమని వివరిస్తారు. క్రిస్టియానిటి పట్ల వీరికి ఎక్కువ నమ్మకం ఉన్నట్లు కనిపిస్తుంది. క్రిస్టియన్లు, పోప్ సహాయంతో తమ మతాన్నిఆధునీకరించుకున్న పద్ధతిలో ప్రచారాలు జరపాలని అదే ఇస్లాం పై ఆయుధం కాగలదని ఆమె విశ్వసిస్తున్నారు.

రచయిత్రి భావాలన్నిటితో ఏకీభవించలేకపోవచ్చు మనం. కాని వారి మాటల వెనక ముస్లిం స్త్రీల బాధలు, వెతలు, మతం వారిపై సాగిస్తున్న దారుణాలలోని వాస్తవికతను విస్మరించలేం. తమ జాతి స్త్రీలను ఎలా బాగుచేయాలో తన అనుభవాలతో ఆలోచిస్తూ పోతున్న ఒక స్త్రీ అయాన్. ఇంకా ఈ విషయాలపై సమగ్రమైన చర్చ చేయవలసిన అవసరం ఉంది. ఈ విషయాలను నిర్భయంగా చర్చించే వారి సంఖ్య పెరగాలి. రచయిత్రి సూచించిన ప్రతిపాదనలు ఎంత మేరకు పని చేస్తాయి. అసలు అవి నిజంగా పని చేస్తాయా అన్న వాటిపై నిష్పక్ష పాత చర్చ అవసరం. ఎన్నో పెద్ద సామాజిక ప్రయోగాలు కొన్ని సార్లు విఫలమవడం చూస్తాం. అంత మాత్రాన సమస్య లేదని, అ సమస్య నిర్మూలనకు పని చేయవద్దని కాదు. ముందు సమస్య ఉన్నదని గుర్తించవలసిన అవసరం ఉంది. కొన్ని అనుభవాలు, మేధావుల చర్చల ఆధారంగా సమస్య పరిష్కారాల కోసం పని చేయాలి. వాటి వలన మంచి జరగకపోతే ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలి. సమాజ పురోగతి ఇలానే జరుగుతుంది. అందువలన రచయిత్రి ప్రస్తావించిన సూచనలన్నీ సహేతుకాలే అన్న మూఢత్వంలో కూడా పడకుండా, ఆమె సూచించిన సమస్యల పట్ల ఆలోచించవలసిన అవసరం ఉంది. నిజాలను విస్మరించలేం. ఇస్లాం గురించి మాట్లాడాలంటె భయపడే వాతావరణంలో రచయిత్రి లేవనెత్తిన ఈ చర్చ చాలా మందిలో ఆలోచనలను రేకెత్తిస్తుంది. ప్రపంచంలో అందరూ బావుండాలి అని కోరుకునే వారిగా “అందరూ అంటే తోటి ఇస్లామీయ సోదరీ సోదరీమణులు కూడా” అన్నది ఒప్పుకుంటాం కదా. మరి వారి పేదరికానికి, వారి అభివృద్ధి నిరోధకానికి కారణాల పట్ల ఆలోచించవలసిన మానవీయ ప్రయత్నం కూడా మనం చేయలేకపోతే వసుధైక కుటుంబం అని మనం నమ్మే సిద్ధాంతం అబద్దమేనా. ఆలోచించే మనసులు, మార్పు అంగీకరించే వ్యక్తులు చదవవలసిన పుస్తకం ఇది.

నోమాడ్ ఆంగ్లంలో ప్రచురితమైన పుస్తకం. దాన్ని తెలుగులోకి వెనిగళ్ళ కోమల గారు అనువదించారు. అనువాదంలో కొన్ని భాగాలు తగ్గించారనిపించింది. ఇంగ్లీషు పుస్తకం సుమారు 350 పేజీలు ఉంటుంది. దాన్ని తెలుగులో 200 పేజీలకు తగ్గించారు. కాని విషయంలో ఎక్కడా ఈ లోటు కనిపించదు. మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

Leave a Reply