కల్లోల ప్రపంచపు కాంతిరేఖ… “అమ్మ అరియన్”

సినిమా అనేది ప్రజలకు వినోదంతో పాటు జ్ఞానాన్ని ఇవ్వాలన్నది చాలా తక్కువ మంది నమ్మే సిద్దాంతం. కళ మనసును రంజింపచేయడానికే కాదు, మేధస్సును పదును పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడాలి అని చాలా తక్కువ ఫిలిం మేకర్లు నమ్ముతారు. అలా నమ్మిన కొందరే ప్రయోగాత్మకమైన సినిమాలు తీయగలిగారు. వీరి నిజ జీవితం కూడా వారు నమ్మిన సిద్ధాంతాల కారణంగా సంఘర్షణమయంగానే ఉంటుంది. కమర్షియల్ గా వెలుగిపోయే సినీ ప్రపంచంలో ప్రజల కోసం, ప్రజలతో సినిమా తీయడం అన్నది చాలా మందికి అర్దం కాని సూత్రం. మన దేశంలో ప్రజా నేపథ్యంలో ప్రజల కొరకు మాత్రమే సినిమాలు తీయబడ్డాయి అంటే బహుశా ఎవరూ నమ్మరేమో. కొందరు దర్శకులు నిజంగానే ఈ బాణీలోనే సినిమాలు తీసారు. వాటిని అర్ధం చేసుకోవడమే ఒక పరీక్ష. అయితే ఇలాంటి సినిమాలు తీసిన దర్శకులు మన దేశంలో ఎక్కువగా లెఫ్టిస్ట్ భావజాలంతో ముడిపడి ఉన్నట్లు గమనించవచ్చు.

ఒడిస్సా ఫిలిం కో ఆపరేటివ్ అనే పేరుతో ఒక సహకార సంస్థను స్థాపించి ప్రజలకు చాలా విషయాలు తెలియజెప్పటానికి సినిమాను వారి వద్దకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేసారు కేరళ లో జన్మించిన జాన్ అబ్రహాం. సినిమా ప్రజలను సమాజానికి చేరువ చేయాలని నమ్మిన వ్యక్తి ఆయన. మళయాళంలో తీసిన “అమ్మ అరియన్” సినిమా British film institute Top Ten Indian film list లో చేర్చబడిన ఏకైక దక్షిణ భారత సినిమా. దీన్ని బట్టి ఈ సినిమా కున్నప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా నిర్మాణానికి కావలసిన డబ్బును చిన్న సంస్థలు, వ్యక్తుల నుండి సేకరించి సినిమాను కేరళలో ఊర్లకు ప్రజల మధ్యకు తీసుకువచ్చి, చిన్న గుంపులుగా మధ్య కూడా చూపించారు.

పురుషణ్ అనే ఒక యువకుడు ఉద్యోగం కోసం ఢిల్లీ ప్రయాణం అవుతున్నాడు. వాయనాడ్ జిల్లా నుండి అతని ప్రయాణం మొదలవుతుంది. తల్లికి తరచుగా ఉత్తరాలు రాస్తానని ప్రమాణం చేసి అతను ఊరు దాటి వస్తాడు. ఒక జీప్ లో జిల్లా దాటే సమయంలో పోలీసులు ఆ జీపు ను మధ్యలో ఆపుతారు. అక్కడకి దగ్గరలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని అతని శవాన్ని తీసుకెళ్ళవలసి ఉందని జీపును మధ్యలో ఆపి ప్రయాణికులను దించుతారు. ఆ శవాన్ని చూడగానే పురుషన్ కి అది తనకు తెలిసిన వ్యక్తే అనిపిస్తుంది. కాని ఆ వ్యక్తి ని ఎక్కడ కలిసాడో గుర్తుకు రాదు. ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకుని ఆ వ్యక్తి గురించి కనుక్కోవాలని నిశ్చయించుకుంటాడు. మధ్యలో తనను కలిసిన తన స్నేహితురాలికి కూడా తన నిర్ణయన్ని తెలియజేస్తాడు. నచ్చజెప్పబోయిన ఆమె మాటలు వినక ఒంటరిగా ఆమెను వదిలి ఆ చనిపోయిన వ్యక్తి ని గుర్తించే పనిలో పడతాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, అక్కడ నుండి మార్చురీ కి వెళ్ళి తనకు తెలిసిన ఒక స్నేహితుడితో కలిసి ఆ వ్యక్తి శవాన్ని మళ్లీ చూస్తాడు. అతను తబలా వాయించే హరి అని తెలుస్తుంది. ఇక అక్కడి నుండి హరిని తెలిసిన వారిని కలిస్తూ వారందరిని తీసుకుని కొచీ లో ఉన్న అతని తల్లి వద్దకు వెళ్ళి కొడుకు మరణ సమాచారం ఈ యువకులంతా ఇవ్వడం సినిమా కథ.

అప్పట్లో కేరళ లో లెఫ్టిస్ట్ ఉద్యమం మంచి ఊపులో ఉంది. హరిని పోలీసులు నక్సలైట్ అని గుర్తిస్తారు. తబలా వాయించే అతని చెయ్యి నజ్జు నజ్జయి ఉంటుంది. హరి స్నేహితులని గుర్తించే క్రమంలో ముందు పురుషన్ అతని స్నేహితుడు అంగమలైలోని వైద్య కళాశాల వద్దకు వస్తారు. ఇక్కడ విద్యార్ధుల స్ట్రైక్ ను దర్శకులు చూపిస్తారు. పైవేటీకరణకు విరుద్దంగా వైద్య విద్యార్ధులు నడిపిన ఉద్యమం అది. ఈ ప్రయాణంలో దర్శకులు వాయనాడ్ నుండి కొచ్చి దాకా ఉన్నఊర్లలో నిజ జీవితంలోని సంఘర్షనాత్మకమైన ప్రజా ఉద్యమాలను, వాటికి సంబంధించిన పరిస్థితులను చూపించే ప్రయత్నం చేసారు. అందుకే ఇది పూర్తిగా వాస్తవ పరిస్థితులను, ఆ కాలంలో కేరళ లోని ప్రముఖ ప్రజా ఉద్యమ సామాజిక అంశాలను డాక్యుమెంట్ చేసిన సినిమా. అలా వెళ్తూనే కొట్టాపురం లోని మిల్లు వర్కర్ల స్ట్రైక్ కుడా చూపిస్తారు జాన్. ఈ సినిమా తీయడానికి రెండు సంవత్సరాల ముందు ఆ స్ట్రైక్ జరిగింది. అందులో పాల్గొన్న వ్యక్తులను కలిసి విషయాలు తెలిసుకుని ఆ దృశ్యాలను యధావిధిగా చిత్రించారు దర్శకులు. మరో చోట ప్రజా నాటకాన్ని రిహార్సల్ చేస్తున్న యువకులు FREE FREE NELSON MANDELA అంటూ తమ నినాదాన్ని నృత్య నాటకం రూపంలో ప్రదర్శించడానికి చేస్తున్న ప్రయత్నం చూస్తాం. మత్స్యకారుల నుండి కార్మికుల దాకా జీవిన పోరాటంలో దిక్కుతోచని స్థితిలో గడపడం చూస్తాం.

సినిమాలో మర్చిపోలేని ఒక సన్నివేశం ఒక స్నేహితుని ఇంట్లోని ఫోటో ఆల్బంలో ప్రపంచ కల్లోల స్థితిగతులను సూచించే ఫోటోలు. ఇంటి వెనుక ఒక సోది చెప్పే స్త్రీ, అందమైన భవిష్యత్తుని ఆ ఇంటి యజమానురాలికి చూపిస్తుంటే అక్కడ ఫోటోలు చూసున్న యువకుడు భయంకరమైన ప్రపంచ నిజాలను చూస్తూ ఉంటాడు. ఆ వైరుద్యంలో ఆశలకు, కలలకు, వాస్తవానికి ఉన్న అతి విషాదకరమైన తేడా మనసును కలిచి వేస్తుంది. సినిమాలోఈ ఒక్క సీన్ లో జాన్ చెప్పాలనుకున్నదంతా చెప్పేసారు. బహుశా ఇలాంటి భావవ్యక్తీకరణ కోసమే కావచ్చు డైరెక్టర్ సినిమా మొత్తం డాక్యుమెంటరీ పద్దతిలో తీసారు.

పురుషన్ హరి శవాన్ని చూసినప్పుడు కళ్ళు తెరుచుకుని తనని ఏదో ప్రశ్నిస్తున్నట్లున్న అ ముఖం నుండి అతను తప్పించుకోలేక పోతాడు. మన సమాజాన్ని ఆ స్థితి లోజాన్ చూసారా అనిపిస్తుంది. అయితే చనిపోయిన సమాజం వేస్తున్న ప్రశ్నలకు జవాబులు వెతకాలనే తపన ఉన్న పురుషన్ లాంటి యువకుల అవసరం మనకు ఉంది. తమ వ్యక్తిగత సౌఖ్యాలను పక్కన పెట్టీ చస్తున్న సమాజం అరుస్తున్న అరుపులని విని, అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి సంసిద్దం కావలసిన తరం ఈ దేశానికి అవసరం. ఒకరి కొకరుగా పరిస్థితి వివరించుకుంటూ ఒక వ్యక్తి సమూహంగా, దళంగా మారి భవిష్య నిర్మాణానికి పునాదిని నిర్మించవలసిన అవసరం ఇప్పటి తరానిది. ఈ క్రమంలో మానవుని జీవిత పరిణామాన్ని అధ్యయనం చేస్తూ ఆ సామాజిక ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను విశ్లేషించి మన చూట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చడానికి చేయూత ఇవ్వవలసిన మేధావులు స్పందించక పోవడం ఇప్పటి తరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సామాజిక దారుణం.
సినిమాలో పురుషన్ హరి స్నేహితులని కలిసి హరి మరణం గురించి చెప్తూ వారితో కొచికి చేస్తున్న ప్రయాణంలో ఉద్యమ స్ఫూర్తి తో సాహిత్య సృజన చేసిన రచయితలు, నాయకుల ప్రసక్తి వస్తూ ఉంటుంది. పాబ్లో నెరుడా కవిత NOTHING BUT DEATH ని పురుషన్ గుర్తు చేసుకోవడం చూస్తాం. మరణం గురించి, మరణాన్ని అనుభవిస్తున్న సమాజం గురించి ఆలోచనతో పుట్టీన కవిత అది.

I do not know, I am ignorant, I hardly see
but it seems to me that its song has the colour of wet violets,
violets well used to the earth,
since the face of death is green,
and the gaze of death green
with the etched moisture of a violet’s leaf
and its grave colour of exasperated winter.
But death goes about the earth also, riding a broom
lapping the ground in search of the dead –
death is in the broom,
it is the tongue of death looking for the dead,
the needle of death looking for the thread.

చావుని సామూహికంగా అనుభవిస్తున్న సమాజాన్ని చూస్తూ మన కర్తవ్యం ఏంటి అన్న ఆలోచన కలిగించడానికి జాన్ ఆ పై పంక్తులను చాలా బాగా వాడుకున్నారు.
అలాగే ఈ ప్రయాణంలో చే గువేరా డైరీను చదువుతున్న వ్యక్తి ని కలుస్తాం. చే, కార్ల్ మార్క్స్, మావోల పోస్టర్ల క్రింద భవితను ఊహించుకుంటున్న యువకులను గమనిస్తాం. నిత్య జీవితంలో ఎదో సాధించాలనే తపన ఉన్న యువత, నిరాశపూరిత జీవితాలతో సతమతమవుతున్న యువత సినిమా అంతా కనిపిస్తారు. కరాటే నేర్చుకుంటున్న కొందరు, రేషన్ షాపుల మూందు క్యూలలో నుంచున్న కొందరు, ఉద్యమకారుల ర్యాలీలు వీటన్నిటికి మధ్య కేరళలో సామాన్య మానవుని జీవన సంఘర్షణను చిత్రించే జాన్ ప్రయత్నం కనిపిస్తుంది. అంతే కాకుండా మూడు ప్రధాన మత విశ్వాసాల జీవనాన్ని కూడా ప్రజా జీవితంలో భాగంగా చూపించారు దర్శకులు.

ఇక సినిమాలో ప్రతి ఇంట్లో ఒక అమ్మ కనిపిస్తుంది. పురుషన్ ఇంట్లో అమ్మకు ఉత్తరం రాస్తానని చెప్పినప్పుడు నిర్వికారంగా చూసే ఆ తల్లి ముఖంలో కనిపించే ఆ ప్రశ్నార్ధకమే ప్రతి ఇంట తల్లిలో కనిపిస్తుంది. ఇక్కడ అ తల్లి ని దర్శకులు దేశమాతతో పోల్చారా? తమ బిడ్డల భవిష్యత్తు ఏంటో అర్ధం కాని స్థితిలో దేశం ఉందని చెప్తున్నారా అని కూడా అనిపిస్తుంది. ఇల్లు వదిలి వెళ్ళవద్దని వేడుకుంటున్న తల్లులు, తమ మాట వినక గడప దాటుతున్న పిల్లలకు ఉత్తరాలు రాయమని చెప్పే తల్లులు, బిడ్డల పతనాన్ని చూడడం తప్ప ఏం చేయలేకపోతున్న నిస్సహాయ మాతలు సినిమా అంతా కనిపిస్తారు. అన్ని జిల్లాల నుండి ఈ యువకులు చేసే ప్రయాణంలో అక్కడి పరిస్థితులు ప్రజల స్థితిగతులు చూస్తూ హరి మరణానికి వెనుక కారణం తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. నక్సలైట్ ఉద్యమం పెరగడం వెనుక ఉన్న సామాజిక పరిస్థితులు, తమ ఉనికి ని కాపాడుకోవాలనుకునే బలమైన కోరిక యువతలో పెరగడం వెనుక ఉన్న కారణాలను ఈ ప్రయాణం చూపిస్తుంది.
జాన్ అబ్రహామ్ ఒక చోట గ్వాటమాల కవి ఆటొ రెనె కాస్తిల్లొ మాటలను వినిపిస్తారు “ ఒక రోజు రాజకీయాలకు అతీతులైన నా దేశ మేధావులను సామాన్య జనులు ప్రశ్నిస్తారు. మీ దేశం మెల్లగా మరణిస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారని వారు ఆ మేధావులని నిలదీస్తారు.” ఈ వాక్యాం ద్వారా దేశ పరిస్థితులను చూస్తూ నిస్సహాయ ప్రజలకు చేయూత ఇవ్వగల మేధస్సు, శక్తి ఉండి కూడా మానవజాతి వినాశనాన్ని మౌనంగా చూస్తూ ఉండి పోయిన దేశ మేధావుల బాధ్యతను ప్రశ్నించే పెద్ద ప్రయత్నం ఈ సినిమా చేసింది.

యువకులంతా తమ తల్లికి జవాబుదారిగా కనిపిస్తారు. అందరూ హరి తల్లి దగ్గరకు కలిసి సమూహంగా వెళ్ళే క్రమంలో వారి తల్లులకు హరి మరణం గురించి వివరిస్తారు. ఆ తల్లుల కళ్లల్లో తమ బిడ్డల భవిష్యత్తు పట్ల భయం కనిపిస్తుంది. కలిసి కట్టుగా ఏదో చేయాలని ఒక తాటిమీద నిలవాలని, ఒక పద్దతిలో పరిస్థితిని అర్ధం చేసుకోవాలనే తపనే ఈ యువకులందరిని ఈ ప్రయాణం కోసం ఏకం చేస్తుంది. హరి జీవితాన్ని వారికి తెలిసిన సంఘటనలతో అర్దం చేసుకునే క్రమంలో అసలు హరి జీవితం ఆత్మహత్య తో ఎందుకు ముగిసిందన్న ప్రశ్న అందరిలో కలుగుతుంది. ఇందులో యువకులు అంతా తమ చుట్టూ ఉన్న సమాజంలో తమ స్థానం ఏంటో తెలియని అయోమయం లో ఉన్నట్లు కనిపిస్తారు. హరి ఆత్మహత్యలో వారికి తమ భవిష్యత్తు, జీవిత వైఫల్యాలు కనిపిస్తాయి.

ఆత్మహత్య దిశగా సమాజం వెళ్తునా ఏమీ చేయలేకపోతున్న సామాన్యులు, చెయగల సత్తా ఉన్నా మౌనంగా ఉండి పోతున్న మేధావులు ఎలాంటి వాతావరణాన్ని భవిష్య తరాలకు ఇస్తున్నారో ఈ యువతలోని నశిస్తున్న జీవితేచ్ఛను చూస్తే అర్ధం అవుతుంది. చాలా మెటఫరికల్ గా ఈ వాతవరణాన్ని ఈ సినిమాలో చూపుతారు జాన్. చివర్లో హరి తల్లి యువకులను చూడగానే ఆత్మహత్యా వాడిది అని అడగడం లో ఈ ముగింపు ఆమె ఊహించినదే అని అర్ధం అవుతుంది. అన్ని ముగింపులు ఊహంచగలుగుతున్నా ఆపలేని నిస్సహాయ స్థితులలో మానవ జీవితాలుండడం వెనుక కారణాలలో నిర్వీర్యంగా, నిస్సారంగా జీవిస్తున్న కుహనా మేధావుల పాత్ర గురించి ఆలోచింపజేసే సినిమా ఇది. తమ బిడ్డల భవిష్యత్తుకు బాధపదే దేశానికి ప్రతిబింబం హరి తల్లి. తమ నియమాల నుండి రక్షణ నుండి దూరం అయిపోయిన ఈ ఉద్యమకారుల జీవన ముగింపు తెలిసినదే అయినా వాటిని మనం ఆపలేకపోతున్నాం అంటే మానవులుగా ఎంత అర్ధరహిత జీవితాలను మనం అనుభవిస్తున్నట్లు? ఈ ప్రశ్న కలిగించాలనే కాబోలు సినిమాలో చివర్లో హరి తల్లి కెమెరా వైపుకు చూస్తూ ఉంటే ఆమెను సినిమాలో చూస్తున్న పురుషన్ తల్లి మరో కొందరు కనిపిస్తారు. అమ్మ అరియన్ అంటే అమ్మకు ఏం తెలియజేయాలి అని అర్ధం.. దేశం అనేది మాతృమూర్తి అయితే ఏం చెబుతాం ఆ తల్లికి ఇలా అంతరిస్తున్న కుమారుల సంగతి. కనీసం వారి మృత సమాచారం చెప్పేటప్పుడయినా ఆలోచించగల స్థాయి మనకి ఉందా? ఉంటే రోహిత్ వేముల లాంటి యువకులను ఉద్యమాల బాటలో బలి అయిపోతున్న కుమారులను రక్షించుకోలేమా? అది అసాధ్యం కాదు. కాని ఆ దిశగా మన మేధావి వర్గం ఆలోచించదెందుకని?? ఇలాంటి ఎన్నో ఆలోచనలను రేకెత్తించగల సినిమా జాన్ అబ్రహాం 1986 లో తీసిన “అమ్మ అరియన్”.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

One thought on “కల్లోల ప్రపంచపు కాంతిరేఖ… “అమ్మ అరియన్”

  1. చక్కటి విశ్లేషణ జ్యోతి గారూ! సాహిత్య విమర్శ సంవిధానాన్ని సినిమాకు అన్వయం చేయడం వల్ల మీ సినిమా సమీక్షలు కూడా నిండుగా ఉంటున్నాయి.

Leave a Reply