త్యాగాలను ఎత్తిపట్టిన ‘అమ్ముల పొది’ నవల

ఆధునిక యుగంలో కల్పనా సాహిత్యానికి సంబంధించిన ప్రధాన పక్రియలలో నవల ఒకటి. వైవిధ్యం, విస్తృతి, సంక్షిష్టత ఆధునిక యుగ స్వభావం. మధ్యతరగతి జీవితం, సమస్యలు వస్తువుగా తెలుగులో నవల ప్రారంభం అయింది. మొత్తం మీద సంక్షిష్ట జీవిత ఘర్షణలను నవల చిత్రిస్తూ అభివృద్ది పొందింది. ఆగష్టు-2018న భారతి రాసిన ‘అమ్ముల పొది’ లో ఏ కాల్పనికత లేకుండా వాస్తవ ఘటనలను చిత్రించింది. దీన్ని నవల అనే కంటే, సోమనర్సమ్మ జ్ఞాపకాల పొరల పరంపరలో త్యాగమూర్తుల ఆశయాలను పొందరుపరిచినారు. కాబట్టి దీన్ని కథనంగా లేదా ఒక డాక్యుమెంటరీగా చెప్పవచ్చు.

నక్సల్బరీ, శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటాలు భారతదేశపు విప్లవానికి వేగుచుక్కలైనాయి. అలాంటి సాయుధ పోరాట రాజకీయాలను అప్పటినుండి ఇప్పటివరకూ ఎలాంటి సడలింపు, రాజీ లేకుండా ముందుకు తీసుకుపోయే క్రమంలో వేలాది మంది పార్టీ సభ్యులు, ప్రజాయుద్ధ వీరులు, ప్రజలు అమరులైనారు. తమ తరువాతి తరం విప్లవకారులకు, ప్రజలకు వారు వేగు చుక్కలుగా నిలిచిపోయారు. నక్సల్బరీ నుండి నేటి దాకా విప్లవోద్యమంలో వస్తున్న మార్పులకనుగుణంగానే శతృవు నిర్భంధాన్ని అమలు చేస్తున్నాడు. శత్రువు ప్రయోగించే నిర్భంధం నుండి గుణపాఠాలు తీసుకుంటూ విప్లవోద్యమం మునుముందుకు సాగిపోతున్నది. చిరునవ్వుతో తమ ప్రాణాలను త్యాగం చేస్తూ పార్టీ నాయకత్వాన సాగే నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని చేస్తూ పార్టీ నాయకత్వాన సాగే నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో తమవంతు బాధ్యత నెరవేర్చిన వందలాది, వేలాది అమరులైన విప్లవ ప్రజానీకం, పార్టీ కార్యకర్తలు, నాయకులు విప్లవోద్యమానికి మరింత వెన్నె తెచ్చారు. (ఉత్తర తెలంగాణ విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరుల జీవిత చరిత్రలు 3వ భాగం 1990-1994).

ఆ విధంగా లక్షలాది మంది విప్లవోద్యమంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తూ అమరులైన వాళ్ళను, ఆ సంఘటనలను సోమనర్సమ్మ, ఆమె కుటుంబ సభ్యులు, స్థితిగతులు దైనందిన జీవితం, ఆలోచనలు, అభిరుచులు ఇవన్నీ సన్నిహితంగా సంబంధం ఉండటం వల్ల రచయిత్రి భారతి, అమ్మ జ్ఞాపకాలలో కథను నడిపించింది. ఈ అమ్ములపొది నవలకు వరవరరావు గారు రాయబడని కావ్యాలెన్నో అంటూ సుదీర్ఘమైన అమరుల జీవిత చరిత్రను వివరించారు.

రచయిత్రి, తనూజ, ఊర్మిళ వీళ్ళు ఒక రోజు సోమనర్సమ్మ ఇంటికెళ్లారు. ప్రారంభ కథ నేను అని చెప్పటం ఉత్తమ పురుషలో కొనసాగుతుంది. అమ్మ (సోమ నర్సమ్మ) రచయిత్రి, మరికొందరి మధ్య హన్మకొండ ఆర్‍.టి.సి. బస్టాండు దగ్గర సోమనర్సమ్మ ఇంట్లో రాజ్యం బలితీసుకున్న అమరవీరుల గురించి చర్చకు వస్తుంది. ఆ విధంగా సోమనర్సమ్మ గతం గుర్తు చేసుకుంటూ తన కడుపులో వున్న బాధను మనసులో ఉన్న మాటల్ని చెబుతుంది. ఆ క్రమంలోనే కొనసాగిన కథ కాదు వ్యధ, అలలు అలలుగా తన్నుకొస్తున్న దు:ఖంతో, పేగు బంధాన్ని మరిచిపోలేకపోతుంది. వేల మందికి అన్నం పెట్టి సాధిన ఆ అమ్మ వందల మందితో ‘‘అమ్మ’’ అనిపించుకున్నది సోమనర్సమ్మ.

సోమనర్సమ్మ ఇల్లు విప్లవానికి కేంద్రంగా మారింది. విప్లవ పాఠశాలగా మారి నిత్యం సమావేశాలతో ఒక రహస్య ప్రదేశంగా మారింది. అలా సోమనర్సమ్మ ఇంటికి వచ్చే విప్లవకారులు ప్రజల కోసం పనిచేయడం, ప్రభుత్వ కుట్రకు బలికావటం. కొందరైతే కళ్ళ ముందే మాయం కావటం. విప్లవ వీరులందరూ ఎప్పుడు ఎలా అమరత్వం పొందిన సంఘటనల కూర్పుగా కూడా ఈ నవలను మనం చూడవచ్చు. సోమనర్సమ్మ రాజ్యంతో ఎదుర్కొన్న నిర్భంధం, ఆ తల్లిలాగే మరెందరో తల్లుల, అక్కల హృదయ ఘోషకూడా ఈ నవలలో కనబడుతుంది.

ఏ తల్లి కన్నబిడ్డలో ఒక చోట చేరి, వాళ్ళంతా ఒక లక్ష్యం కోసం పనిచేస్తూ, అమ్మా, అయ్యా, అక్కా, అన్న, చెల్లె, తమ్ముడు అని వాళ్ళకు తెలిసిన పలకరింపుల ఆత్మీయ అనుబంధం ఏర్పర్చుకొని ఒకే కుటుంబంలాగ మెదలటం కనిపిస్తుంది. నాకు తెలిసి సమాజంలో ఏ ఒక్క కుటుంబంలోని నల్గురు వ్యక్తులు ఇంత అనుబంధం కలిగి ఉండరు. వాళ్ళే అలా ఉండటానికి కారణం ప్రజల కోసం, ప్రజా క్షేమం కోసం పనిచేయటం. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని వమ్ము చేయకుండా కట్టుబడి ఉండటమే అనిపిస్తుంది.

మిలటరీ సుభాష్‍ చంద్రబోస్‍తో పనిచేసిన అయ్య లక్ష్మయ్య పనికి అంకితమైన వ్యక్తి. అతని పేరుతో వాళ్ళవాడ లక్ష్మిపురం అయిందంటే అతని చుట్టూ చైతన్యంతో కూడిన రాజకీయ వాతావరణం ఏర్పడిందని గమనించాలి.

సోమనర్సమ్మ ఇంటికి ప్రతిరోజు పదుల సంఖ్యలో రావడం, తినడం అందరూ కలిసి ప్రజాస్వామిక విప్లవం కోసం విషయాలు చర్చించడం బయటికి వెళ్ళడం నిత్యం ఆ ఇంట్లో జరుగుతుండేవి. అలా అంజయ్యతో మొదలై ఒక్కొక్కరు ఐలయ్య, రామకృష్ణ, నాగేశ్వర్‍, కొడవటి సుదర్శన్‍, లింగమూర్తి, శ్యాంబాబు చాలామందికి ఆ ఇంటితో సంబంధం ఏర్పడింది.

కార్మికుల, రైతుల సమస్మలని స్త్రీల సమస్యలు, విద్యాపరమైనవి ఇలా ఎన్నో మాట్లాడేవారు. ప్రకాశ్‍ అరెస్ట్ అయ్యేనాటికీ విద్యార్థి నాయకులను ఎదురు కాల్పుల పేరుమీద బూటకపు ఎన్‍కౌంటర్‍లలో నిర్ధాక్షిణ్యంగా చంపుతున్నారు. 1988లో ప్రకాశ్‍కి బెయిల్‍ ఇచ్చినట్టే ఇచ్చి రాజ్యం మాయం చేసింది.

పులి అంజన్న, ఐలన్న, యాకన్న, క్రాంతిరణదేవ్‍, రామకృష్ణ, నాగేశ్వర్‍ రావు వంటి వాళ్ళ ద్వారా జరుగుతున్న పోరాటాలు, విజయాలు, నిర్భందాలు, లాకప్‍డెత్‍లు, మాయం చేయడాలు, బూటకపు ఎన్‍కౌంటర్లు, హక్కుల సంఘాల పనితీరు, ఇలా ఎన్నో విషయాలు బోధించినట్టు అమ్మ చెప్పటం చూస్తే ఆమెకి కలిగిన అవగాహన మనకు తెలుస్తుంది. అందుకే ప్రకాశ్‍ అమరుడయ్యాక ఇంటికి వచ్చే ప్రతివాళ్ళలో అతన్నె చూసుకోగల్గింది. తన కుటుంబం నుండే పిల్లలందరూ పార్టీ పనులు చేయటాన్ని ఆహ్వానించగలిగింది. ఆకలింపు చేసుకున్నది.

వాళ్ళందరిలో ఒక్కతై పనిచేయటం, ఎలాంటి రక్తసంబంధీకులు కాదు కాని రక్త సంబంధం కన్న వర్గ సంబంధం గొప్పదని నిరూపించింది. అందుకే 1990 సం।।లో వరంగల్‍లో రైతు కూలీ సంఘం సభలు జరిగినప్పుడు అమ్మ ఇల్లే ఆఫీస్‍ అయింది. నెల రోజులు పెద్ద జాతరగా మారింది. లక్షల్లో ఇసుకపోత్తే రాలని జనం హాజరు కాగలిగారు. ప్రజలకు నగరంలో తాగడానికి నల్లాలు వేయించారు. ఆ తర్వాత వాటికి అన్నల నల్లాలనే పేరు వచ్చింది.

జిల్లాల్లో పల్లెపల్లెన అంతా పండుగ వాతావరణం ఏర్పడింది. మొత్తం సమాజానికే ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ఈ సభల ద్వారా అన్నలు మంచివాళ్ళని, పేదోళ్ళ కోసం పని చేస్తారు అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి ఈ సభలు కలిగించాయి.

విప్లవకారుల రోజువారీ జీవితం ఎంతో కష్టంతో కూడుకున్నది. జీవితాలను తృణప్రాయంగా భావించి త్యాగబుద్ధితో వాళ్ళు చేసే విప్లవాచరణకు అవ్వమాటలే కాదు ఎవరి మాటలు సరిపోవు.

రోజులు గడుస్తున్న కొద్తీ నిర్బంధం పెరిగింది. నిర్బంధం పెరుగుతున్న కొద్దీ బూటకపు ఎన్‍కౌంటర్లు పెరిగినవి. అందులో భాగంగానే గోపగాని ఐలన్న, డాక్టరు రామనాథం, బండి యాదగిరి, పులి అంజన్న, పోలం సుదర్శన్‍ రెడ్డి, భాగ్య, శ్రీను, సత్తు మధు, రామకృష్ణ, నాగేశ్వరావు, శ్యాంబాబు, యాకయ్య, భట్టుపల్లి పెద్దరామన్న, అక్కంపేట భద్రన్న, తిప్పారావు రాములు (తాత), పోలం సుదర్శన్‍ రెడ్డి (ఆర్‍.కె.) పటేల్‍ సుధాకర్‍ రెడ్డి, శాఖమూరి అప్పారావు, బండి ఆశాలు, జన్ను చిన్నాలు, శ్రీమన్నారాయణ (సూర్యం), ఎర్రం రెడ్డి సంతోష్‍ రెడ్డి, క్రాంతి రణదేవ్‍, జనార్దన్‍, కౌముది. ఒక్కరా ఇద్దరా వందల సంఖ్యల్లో అమరులయ్యారు. అమ్మ ఇంటికొచ్చి కొడుకులవలె మెదిలి, చేతివంట తిని, కుటుంబ సభ్యుల్లాగ మెదిలిన వాళ్ళు ఒక్కొక్కరు అమరత్వం పొందుతుంటే అమ్మ గుండె బరువెక్కింది. బాధను దిగమింగింది.

తెల్లవారితే ఏ వార్త వినాల్సి వస్తుందో, పేపర్‍లో ఎవరి పేరు వస్తదో అని కలవరపాటు కలిగింది అమ్మకి. అయినా కొడుకులందరు ‘‘అన్నలై’’ పోయిండ్లు అమ్మ ప్రపంచం కూడా అన్నల ప్రపంచమే అయిపోయింది. అలా విప్లవం అనేది ఆ కుటుంబం వాళ్ళ జీవితంలో రోజువారి పనిగా మారింది.

సోమనర్సమ్మ లాంటి తల్లిని వదులుకొని, ఈ సమాజంలో అసమానతలను తొలగించడానికి అందరూ సమానంగా బతకాలని, పేదల కోసం పనిచేయాలని ప్రాణాలను లెక్కచేయక తిరుగుతున్నారనే విషయం అర్థం చేసుకోగలిగింది.

పోరాడే వాళ్ళను పాశవికంగా చంపడం ఏ చట్టంలో రాసి ఉండదు. కాని ప్రజల కోసం బ్రతికే వాళ్ళను, ప్రశ్నించే వాళ్ళను రాజ్యం సహించదు. మనుషులను మాయం చేసినంత మాత్రాన వారి ఆశయాలను మాయం చేయలేమని అధికార గణం ఎందుకు గ్రహించలేకపోతుంది. మానవత్వం మంట గలిసిందని మనం అర్థం చేసుకోవాలి.

చెడును మార్చడం లేదా తీసివేయడం. రాత్రింబవళ్ళు వాళ్ళ కుటుంబాలను వదులుకొని, ప్రజలందరూ సుఖంగా ఉండాలని ప్రాణాలకు తెగించి పనిచేయడం వాళ్ళ చదువులు, స్వంత ఆస్తులు వదులుకొని ప్రజల కోసం జీవితాలనే త్యాగం చేస్తున్నారు. అందుకే సోమనర్సమ్మ బిడ్డలందరూ ప్రజల కోసం అమరులయ్యారని గర్వంగా చెప్పుకున్నది.

సమాజంలో జరిగే అవినీతిని, అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేశారు. 1980 ఆ ప్రాంతంలో రాడికల్స్తోనే ప్రజలు ప్రశాంతంగా జీవిచారని, ప్రజలకి ఏ సమస్య వచ్చినా రాడికల్సు అక్కడ ఉండేవాళ్ళు. విప్లవం అంటే ఏంటో కండ్లలో మెరుస్తాంది. వరంగల్లు జిల్లాలో నేనే ఒక సజీవ సాక్ష్యాన్ని అని సోమనర్సవ్వ ప్రకటించగలిగింది.

పాలకులు మారుతున్నారు. ప్రజల బతుకులు మారటం లేదు. గ్రామాల్లో కులవృత్తులు దెబ్బతిన్నాయి. దాంతో పొట్ట చేతబట్టుకొని నగరాలకు వలస. అక్కడ సరైన పనులు ఉండవు. రైతుల ఆత్మహత్యలు, చేతివృత్తుల వాళ్ళకు బతుకు దెరువు లేక ఆత్మహత్యలు. ఇన్నేండ్ల చరిత్రలో ప్రజలు బాగుపడ్డది లేదు. అందుకే ప్రజలు విప్లవం గురించి ఆలోచించటమే కాకుండా అసంతృప్తితో ఉన్న యువత ఈ వ్యవస్థ మార్పు కోసం బందూకులు పడుతున్నారని సోమనర్సమ్మ గట్టిగా చెప్పగలిగింది.

రచయిత్రి సందర్బాన్ని బట్టి అనేక సామెతలను రాసింది. సామెతలు జీవితానుబవాల నుండి వచ్చి, తిరిగి జీవితాలను ప్రభావితం చేస్తాయి.

పాపయ్యపేట, మండలం చెన్నారావుపేట, వరంగల్ జిల్లా. కవయిత్రి, విమర్శకురాలు, అధ్యాపకురాలు. ఎం.ఏ., పి. హెచ్.డి, ఎం.ఏ, సంస్కృతం చదివారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' (2012)పై పరిశోధన చేశారు. రచనలు: 'తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు' (వ్యాస సంపుటి)-2015, 'వ్యాస శోభిత' (వ్యాస సంపుటి) - 2015, 'తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి' - 2018. కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మహిళా కళాశాల, వరంగల్ లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.

Leave a Reply