ఫ్యూడల్ సాహిత్య సమాజపు ధిక్కార పతాక: తొలి పంజాబ్ మహిళా రచయిత్రి అమృతా ప్రీతం

“సాహిత్య కాడమీ పురస్కారం అమృతా ప్రీతం అందగత్తె అవడం వలన వచ్చింది, అమృత రచనల వలన మాత్రం కాదు.” — ఒక పురుష సాహితీ కారుడు

1) “చరిత్రలో ఎన్నో కథలు కాగితాల మీద కనపడవు. ఎందుకంటే, అవి స్త్రీల శరీరాల మీద, మనసు మీద రాయబడతాయి.”
2) “మళ్ళీ నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను, మళ్లీ నేను నిప్పుని ముద్దాడాను. పాత్రలోని ప్రేమ విషమే కావచ్చు ప్రియా. అయినా సరే నేను దాన్ని నోటినిండుగా కోరుకున్నాను.”
3) “స్త్రీల శక్తిని, సృజనాత్మకతను వప్పుకోని పురుషుడు, తన అంతరాత్మని మోసం చేసుకోవడం తప్ప ఇంకేమీ కాదు. భారతీయ పురుషుడు ఇప్పటికీ సాంప్రదాయక స్రీలని చూడ్డానికి మాత్రమే అలవాటు పడి ఉన్నాడు. అతనికి మేధోవంతమైన స్త్రీల స్నేహం, సాంగత్యం కావాలి కానీ, పెళ్ళికి మాత్రం పనికి రారు. గొప్ప వ్యక్తిత్వమున్న స్రీలని గౌరవించడం అనే సౌజన్యం ఎప్పటికీ ఈ పురుషులకు రాదు”
4) “నిన్ను మళ్ళీ తప్పక కలుస్తాను,
ఎప్పుడో, మరి ఎక్కడో నాకైతే తెలియదు.
కానీ, నీ వూహల్లో ప్రేరణనై,
నీ కాన్వాస్ మీద నువ్వు గీసే ఒక రేఖగా మారిపోయి,
నిన్నే చూస్తుంటాను.”
5) “నిన్నటి రొట్టె ముక్క మిగలనే లేదు.,
రేపటి కోసం అసలే లేదు.
ఎప్పటికప్పుడు సంపాదించింది తినడమే!”
6) “జీవితం నీలో ఏది ఉందో.,
దాన్నే పరీక్షిస్తుంది.
ప్రియా., నాలో నీపై ప్రేమ ఉంది”
7) “కవీ., వారిష్ షా నేను అడుగుతున్నాను,
నీ సమాధిలోనించి మాట్లాడు.
ఒక పంజాబ్ అమ్మాయి హీర్,
తన ప్రియుడు రాంఝా
ప్రేమ కోసం తపిస్తూ దుఃఖిస్తేనే
సుదీర్ఘమైన కవిత్వం రాశావు
ఈ రోజు ఎందరో పంజాబీ బిడ్డలు దుఃఖిస్తున్నారు
నీ పంజాబ్ ఎలా ఉందో చూడు ఒక్కసారి!
పంజాబ్ నేల అంతా విషం నిండిపోయింది
చావిడీలన్నీ శవాల గుట్టలు పేరుకు పోయినాయి
చేనాబ్ నది నిండా రక్తం ఏరులై పారుతున్నది” (దేశవిభజన సమయంలో చెలరేగిన హింస,దౌర్జన్యాల మీద రాసినది.)

ఈ కవితా వాక్యాలు కవయిత్రి అమృతా ప్రీతం వ్యక్తిత్వాన్ని, ఆమె సాహిత్య, సామాజిక దృక్పథాన్ని పట్టిస్తాయి. ఆమెను జీవిత పర్యంతమూ వెంటాడినవి దేశ విభాజానంతరం జరిగిన మానవ హననం, హింస, స్త్రీలపైన ఇంటా బయటా జరిగే అణిచివేతలు, దారిద్య్రంలో కునారిల్లే పీడిత ప్రజల బాధలు, సాహిత్య రంగంలో తన రచనలపైన సమకాలీన పురుష రచయితల ఆధిపత్యం, తన మొదటి వివాహం భర్త వలన విఛిన్నం అవడం, ఒంటరితనంలో తరువాత ప్రముఖకళాకారుడు, రచయిత ఇమ్రోజ్ తో కలిసి సహజీవనం, అప్పటి సమకాలీన కవి సాహిర్ లుథియాన్వి ప్రేమలో పడడం, ఎప్పటికీ అందుకోలేని ఆ ప్రేమలో దుఃఖపడుతూ పుంఖాను పుంఖాలుగా ప్రేమ కవితలు రాయడం, ఇద్దరు పురుషుల ప్రేమల మధ్య తీవ్రమైన మానసిక వత్తిడికి లోనవడం చూస్తాము.

అమృతా ప్రీతమ్ భారతదేశం గర్వించదగ్గ దగ్గర సుప్రసిద్ధ రచయిత్రి మరియు కవయిత్రి. అమృత పంజాబ్ లో, ఇరవయ్యో శతాబ్దపు తొలి రాజకీయ, స్త్రీవాద రచయిత్రిగా,కవయత్రిగా, నవలాకారిణిగా గుర్తించబడింది. దేశ విభజన తరువాత అమృత పాకిస్థాన్ నుంచి భారత దేశానికి శరణార్థిగా వచ్చి స్థిరపడింది. అయినా అమృత రచనలను అటు పాకిస్థాన్, ఇటు భారత దేశ ప్రజలు ఎంతో ఇష్టపడ్డారు. అమృత కూడా భారత్, పాకిస్థాన్ సరిహద్దులను, ప్రజలను అంతే సమానంగా ప్రేమించింది. తన అరవై సంవత్సరాల సుదీర్ఘమైన సాహిత్య జీవితంలో అమృత వందలాది రచనలు చేసింది. అందులో కవిత్వం, నవలలు, కథలు, ఆత్మకథ, జీవిత చరిత్రలు, వ్యాసాలు, పంజాబ్ జానపద పాటల సేకరణ ఉన్నాయి. అమృత సాహిత్యం అనేక భారతీయ భాషల్లోకి, పాశ్చాత్య భాషల్లోకి అనువదించబడింది. సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి భారతీయ రచయిత్రి అమృతా ప్రీతం.

అమృతా ప్రీతం నేపథ్యం

అమృతా ప్రీతమ్ దేశ విభజన పూర్వపు బ్రిటిష్ ఇండియాలోని, పాకిస్థాన్ లోని సిక్కు కుటుంబానికి చెందినది. దేశ విభజన సమయంలో గూడు చెదిరిన చాలామంది శరణార్ధుల్లాగా పశ్చిమ పంజాబ్ నుంచి అమృత కూడా తన రెండవ ఇల్లైన న్యూ ఢిల్లీకి వచ్చింది. ఆమె తన పదహారవ ఏట నుంచీ మొదలుపెట్టిన రచనావ్యాసంగాన్ని జీవితమంతా కొనసాగించి విస్తృతంగా రాసింది. అమృత ప్రీతం రచనల్లో భావం ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే, ‘అమృత తన అక్షరాలను, రక్తంలో ముంచి రాసింది’ అని విశ్లేషకులు అభిప్రాయపడతారు. తన విప్లవాత్మకమైన రచనలతో, అమృత పాఠకులను ఆలోచనల్లో పడేస్తుంది. ఈ విప్లవాత్మకమైన రచనా ధోరణితో, అమృత అప్పటి కాలంలో స్రీలు రాయ సాహసించని, శృంగారం, ప్రేమ, విరహం లాంటి వస్తువుల్లో కూడా, కవితాత్మకంగా, సౌందర్యాత్మకంగా ప్రదర్శించి స్తబ్ద సాహిత్య లోకాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ప్రేమలో, వియోగంలో నిండా మునిగిపోయిన స్త్రీల హృదయాల్ని అమృత తన కవితల్లో, అత్యంత సౌందర్యాత్మకంగా ఆవిష్కరించింది. అమృత కూడా స్వయానా తనకు అందని తన సమకాలీన కవి సాహిర్ లథియాన్వి ప్రేమకోసం జీవితమంతా ఎదురుచూసింది, విరహపడింది, వియోగ బాధనంతా కవిత్వంలోకి గుప్పించింది. ఏ రకమైన మానసిక అవరోధాలు, సెల్ఫ్ సెన్సారింగ్ కు లోను కాకుండా చాల నిర్భయంగా తన భావాల్ని సృజనాత్మకంగా వ్యక్తపరిచింది. అలాగే కవిత్వానికి సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న మొట్టమొదటి పంజాబీ రచయత్రి అమృత. అయితే పంజాబ్, భారత్, పాకిస్థాన్ సాహితీ ప్రేమికులు ఆమె ధిక్కార సాహిత్య ధోరణులను ప్రేమతో అంగీకరించారు. మొదట్లో పంజాబ్, ఉర్దూ భాషల్లో రాసినప్పటికి, హిందీ భాషకి ఉన్న ఆదరణ గమనించి హిందీలోనే తన సాహిత్య సృజన కొనసాగించింది. అమృత నవలలు, కవిత్వం, కథలు, వ్యాసాలు, జీవిత చరిత్రలు, ఆత్మకథ ప్రాంతీయ భాషల్లోకి, ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్, డేనిష్, జాపనీస్, మాండ్రీన్ లాంటి అంతర్జాతీయ భాషల్లోకి అనువదించబడినాయి. అందులో రా షీద్ టికెట్, బ్లాక్ రోజ్ అనే ఆత్మకథలు కూడా ఉన్నాయి. అమృత సాహిత్యాన్ని జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో సాహితీ ప్రేమికులు అధ్యయనం చేసారు, చేస్తున్నారు కూడా. అమృత దేశవిభజన సమయంలో జరిగిన ఊచకోతలు, హింసాకాండల మీద కవిత్వం, నవల, కథలు రాసిన తొలి పంజాబీ రచయిత్రి. అదీ ఆ దారుణాలు చూసిన సాక్షిగా అలాగే బాధితురాలిగా, శరణార్థిగా కూడా అత్యంత బాధాకరమైన మానవ విషాదాన్ని చాల సున్నితమైన భాషలో గుండెను తొలిచే విధంగా రాయటం అమృత స్వంతం. అలాగే అమృత రచనల్లో మనల్ని ఆకర్షిచేది పారదర్శకత, సున్నితత్వం, సృజనాత్మక ధోరణి. స్త్రీల జీవితాల్లోని పురుషాధిక్యత వలన వచ్చిన దయనీయతను, ఆర్ధిక పరాధీనత వల్ల, వాళ్ళు అనుభవించే దుర్భరత్వం, లైంగిక, పునరుత్పత్తి, విద్యాహక్కుల అణిచివేత, గృహహింసల పట్ల, కుటుంబంలో, సమాజంలో, స్త్రీల మీద జరుగుతున్న లైంగిక అత్యాచారాలు, కదిలించే కథలు రాసింది అమృత.

అమృతా ప్రీతం దేశ విభజన పూర్వపు బ్రిటిష్ ఇండియాలో పంజాబ్ లోని గుజ్రన్ వాలాలో ఆగస్టు 31, 1919 న జన్మించింది. ఇది ఇప్పుడు పాకిస్థాన్ లో ఉన్నది. ఆమె అసలు పేరు అమృత కౌర్. ఆమె తండ్రి కర్తార్ సింగ్ హిత్కరి. ఆయన పాఠశాల ఉపాధ్యాయుడు, కవి, బ్రజ్ భాషా పండితుడు. అలాగే సాహితీ పత్రికకు సంపాదకుడు కూడా. సిక్కు విశ్వాస ప్రచారకుడిగా ఉండేవాడు. తల్లి రాజ్ బీబీ, స్కూల్ టీచర్ గా పని చేసేది. బాల్యంలో ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఎక్కువగా ఉండేది. అమృత చిన్న తనంలోనే చాలా తిరుగుబాటు స్వభావంతో ఉండేది. సామాజిక కట్టుబాట్లను, మతపరమైన మూఢ విశ్వాశాలను తిరస్కరించేది లేదా ప్రశ్నించేది. దేవుణ్ణి పూర్తిగా నమ్మేది కాదు. వాళ్ళ నాయనమ్మతో ఎప్పుడూ వాదులాడేది. ఇంటికి వచ్చే అతిథుల్లో హిందువులకు, ముస్లింలకు విడి విడిగా చాయ్ కప్పులు, ఇతర పాత్రలు పెట్టటం గమనించి ఎందుకలా చేస్తున్నావని గొడవ పడేది. చాలా చిన్న వయసులోనే ఊర్లో అటు ముస్లిమ్స్ నీళ్లు, ఇటు హిందువులకు నీళ్లు అని తాగు నీటి ప్రాంతాల విభజన ఉండేది. అమృత చాల ఆశ్చర్యపోతూ తల్లిని అడిగేది ”హిందూ, ముస్లింలకు వేరు, వేరు నీళ్లు ఏంటమ్మా?” అని. ”ఇవి ఇంతే, పెద్దవాళ్ళు సృష్టించిన అర్థం లేని విషయాలు” అని అమృత తల్లి సముదాయించేది. అమృత తల్లి రాజ్ బీబీ ఆమె పదకొండవ ఏట అనారోగ్యంతో చనిపోయింది. తనకు అన్ని విధాలుగా తల్లి తోడుగా ఉండేది. సలహాదారుగా, మంచి స్నేహితురాలిగా, దిశా నిర్దేశం చేసేదిగా తను అడిగే ప్రశ్నలకు చాలా తాత్వికంగా, లోతుగా సమాధానాలు చెప్పే తల్లి చనిపోవడంతో అమృత హృదయంలో, జీవితంలో ఒక ఖాళీ ఏర్పడింది. తల్లిదండ్రులకు అమృత ఏకైక సంతానం. తల్లి మరణశయ్య మీద ఉన్నప్పుడు, అమృత భగవంతుణ్ణి తల్లిని రక్షించమని దుఃఖిస్తూ ప్రార్థిస్తుంది కానీ తల్లి చనిపోయాక ఆమె దైవ ప్రార్థన మానేస్తుంది. తాను ప్రార్థించాక కూడా రక్షించని దేవుడి మీద అమృతకు నమ్మకం పోతుంది. అంత చిన్న వయసులోనే, దేవుడులేడు అన్న విషయం అనుభవంతో, తార్కికంగా, శాస్త్రీయంగా, అర్థం చేసుకుంటుంది. అక్కడ్నించి తండ్రితో ఆమె లాహోర్ కి వెళ్తుంది. 1947 లో భారత దేశానికి వలస వచ్చిన తర్వాత అమృత ఇక ఇక్కడే ఉండిపోయింది. లాహోర్ లో చిన్నప్పటినుంచే ఇంటి పని, వంట పనుల బాధ్యతలతో సతమతమయ్యేది అమృత. తండ్రి అసలు పట్టించుకునేవాడు కాదు. చిన్న వయసులో పెద్ద బాధ్యతలకు తోడు ఒంటరితనంతో బాధ పడేది, పైగా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఎవరు లేరు. తండ్రి రచయిత కావడంతో ఆయన ప్రభావం అమృత మీద పడి రచనలు చెయ్యడం మొదలు పెట్టింది. అలా వంటరి తనం నుంచి బయటపడడం అలవాటు చేసుకుంది. కవితలతో మొదలు అయ్యింది అమృత సాహితీ ప్రయాణం. ”అమృత లెహెరే” (అమృతపు అలలు) అనే తన మొదటి కవితా సంపుటిని పదహారవ ఏట, 1936 లో ప్రచురితమయ్యింది. అదే సంవత్సరం అమృతకి వివాహం అయ్యింది. లాహోర్ లోని అనార్కలి బజార్ లోని ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు, పత్రికా సంపాదకుడు ప్రీతం సింగ్ తో అమృత వివాహం అయ్యింది. వివాహానంతరం అమృతా కౌర్ కాస్తా అమృతా ప్రీతంగా మారిపోయింది. వాళ్లకి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి.

“అమృతా ప్రీతం విఫల వైవాహిక జీవితం”

అమృత దాదాపు తన వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక అంశాలను కనీసం తన ఆత్మ కథ ‘రెవెన్యూ స్టాంప్’ లో కూడా రాకుండా జాగ్రత్త పడింది. పరిశీలకుల అధ్యయనం ప్రకారం ఆమె అంతగా తన భర్తతో కలిసి గడిపిన జీవితాన్ని తన రచనల్లో కూడా గుర్తుకు చేసుకో దల్చుకోలేదు. అంతగా అయిష్టపడింది. భర్తతో సరిపడని అమృత 1960లో విడాకులు తీసుకున్నది. తన ఆత్మ కథలో తన తండ్రి తనకి పెళ్లి సంబంధం చూసినప్పుడు, పెళ్లిరోజు డాబా మీదకు వెళ్లి బాగా ఏడ్చాననీ, ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని పదే పదే చెపుతూ ఏడుస్తూనే ఉన్నాననీ, అప్పటికే పెళ్ళికొడుకు వాళ్లు వచ్చేసారనీ, ఆ క్షణాల్లో చచ్చిపోవాలని అనిపించిందని రాసుకుంది. పెళ్లి అయిపోతుంది, భర్తతో మనసు లేని కాపురం చేస్తుంది. కానీ 1960 లో ఆమె భర్త ప్రీతం సింగ్ నుంచి చట్టబద్దంగా విడిపోతుంది.

1947లో పూర్వపు బ్రిటిష్ ఇండియా భారత దేశం, పాకిస్థాన్ అనే రెండు స్వతంత్ర దేశాలుగా విడిపోయినప్పుడు, అమృత భారత దేశానికి శరణార్థిగా వలస వచ్చింది. భారత విభజన తరువాత, ఇరు దేశాల సరిహద్దుల్లో భయంకరమైన హింసాకాండ జరిగింది. అనేక మంది హిందువులు, ముస్లింలు, సిక్కులు మరణించారు, స్త్రీల మీద విచక్షణా రహితంగా లైంగిక అత్యాచారాలు జరిగాయి. అమృతా ప్రీతం 1948లో లాహోర్ నుండి ఢిల్లీకి తన భర్త, అత్త వత్తిడి వలన వలస వెళ్లాలని అనుకొంది. అప్పుడు అమృతకి 28 సంవత్సరాలు. పైగా తన చిన్న చిన్న ఇద్దరు పిల్లలు. డెహ్రాడూన్ నుంచి ఢీల్లీకి ట్రైన్ లో ప్రయాణం అయింది. ఆ చీకటిరాత్రి దీర్ఘమైన టన్నెల్ గుండా ప్రయాణిస్తూ, కనీసం టన్నెల్ చివర్లో అయినా వెలుతురు కనిపిస్తుందా, లేదా రాత్రి అంతా కూడా ఆ గాఢాంధకారంలోనే ప్రయాణం చేయాలా అని భయ పడింది అమృత. ఆగస్టు మాసంలో చెలరేగిన మతఘర్షణల నడుమ వీధులన్నీ రక్తమోడుతుంటే, బట్టలు మార్చుకునే సమయం కూడా లేకుండా ఆమె కట్టుబట్టలతో ప్రాణాలు రక్షించుకోవడానికి బయలుదేరుతుంది. కళ్ళముందు ప్రాణభయంతో వలసలు పోతున్న జనం మీద చెలరేగిన హింసా దౌర్జన్యాలు చూసి చలించిపోతుంది ఆ హింసాకాండను, వూచకోతను ప్రశ్నిస్తూ అప్పటికప్పుడు ఆమె మనసులో వేదనాభరితమైన ”ఆజ్ అఖాన్ వారిష్ షాను” (నేను వారిష్ షా ను ఈ రోజు అడుగుతున్నాను”) అనే కవిత రూపుదిద్దుకుంది. ఈ కవిత ఆమె 18 దవ శతాబ్దానికి చెందిన సూఫీ కవి వారిష్ షా స్మృతిలో ఆయనను సంబోధిస్తూ రాసింది లేదా ప్రశ్నించింది. అప్పటిదాకా ఆమె అనేక కవితలు రాసింది, కవితా సంపుటాలు కూడా వెలువరించింది కానీ ‘వారిష్ షా ని అడుగుతున్నాను’ అనే కవిత అమృతను ప్రపంచ సాహితీ లోకంలో అందునా కవితా విభాగంలో అగ్రగామిని చేసింది. దేశవిభజన తరువాత ఏర్పడిన భయానక వాతావరణాన్ని అత్యంత వాస్తవికంగా దుఃఖభరితమైన మనసుతో రాసిన జ్ఞాపకంగా అమృత సాహితీ ప్రస్థానంలో నిలిచిపోయింది ఈ కవిత. 1950లో దేశవిభాజానంతర ఊచకోతను తన”పింజర్” (అస్థిపంజరం) నవలలో చిత్రీకరించింది. ముఖ్యముగా స్త్రీల మీద హద్దులేకుండా అమానవీయంగా జరిగిన లైంగిక దాడులు, అవి స్త్రీల జీవితాలను ధ్వంసం చేసి, మానసిక స్థితుల మీద వేసిన ప్రభావాలను ”పురో” అనే స్త్రీ పాత్ర ద్వారా విస్తృతంగా చర్చించింది. 2003 లో పింజర్ నవలను హిందీలో అదే పేరుతో సినిమాగా తీశారు. దీనికి అవార్డు కూడా వచ్చింది. మొదట్లో అమృత భావకవిత్వం, తండ్రిని సంతృప్తి పరచడానికి భక్తి కవిత్వం రాసినప్పటికీ, తర్వాత విభేదిస్తూ వచ్చింది. వివాహం తరువాత ఆమెకు ప్రగతిశీల అభ్యుదయ రచయితల సంఘంతో పరిచయం ఏర్పడిన తర్వాత ఆమె భావజాలంలో, రచనల్లో ఆ ప్రగతిశీలత విస్తృతంగా కనిపిస్తుంది. అమృత ‘నాగమణి’ అనే సాహిత్య మాస పత్రికకు నాలుగు దశాబ్దాలు సంపాదకురాలిగా ఉన్నది.

“అమృతా ప్రీతం సాహిత్యం”

అమృతా ప్రీతం తన జీవిత కాలంలో 28 నవలలు, 18 కవితా సంపుటాలు, 3 కథా సంకలనాలు, ఆత్మకథలు, జీవిత చరిత్రలు రాసింది.
1) నవలలు -పింజర్, డాక్టర్ దేవ్, కోరే కాగజ్, ఉంచాస్ దిన్, ధర్తీ, సాగర్ ఔర్ సేపియన్, రంగ్ కా పట్టా, ఢిల్లీ కి గలియా, తెరవాన్ సూరజ్, యాత్రి, జీలవాటన్, హదత్ కా జిందాజీనామా.
2) కథల సంకలనాలు -కహానియా జో కహానియా నహీ, కహానియోంకే ఆంగన్ మే, స్టాంచ్ అఫ్ కిరోసిన్.
3) కవితా సంకలనాలు -అమృత లహరే,(1936), జీయుందా జీవన్, ట్రెల్ ధోతే ఫూల్, ఓ గీతన్ వాలియా, బదలామ్ దే లాలి, సంజ్ దే లాలి, లోక్ పీర్, పథర్ గీతే, పంజాబ్ దీ ఆవాజ్, సునహారే (1955, సాహిత్య అకాడమీ పురస్కారం), అశోకా చేటీ, కస్తూరి, నాగమని, ఈక్ సి అనిత, చక్ నెంబర్ చట్టీ, ఉనిజా దిన్, కాగజ్ తే కాన్వాస్ (1981భారతీయ ఙ్ఞానపీట్), చునీ హుయీ కవితాయే, ఏక్ బాత్.

అమృత సాహిత్యం మీద, జీవితం, వ్యక్తిత్వం మీద జరిగిన పరిశోధనలు

 1. అమృతా ప్రీతం వచన సాహిత్యం దేవనగిరి లిపిలో. 2. అమృత ప్రీతం -ది బ్లాక్ రోజ్ బై విజయకుమార్ సున్వాని. 3. అమృతా ప్రీతం -ఓబీట్యుఅరి-ది గార్డియన్ 4. పంజాబీ సాహిత్యంలో పదాల శిల్పకారిణి అమృతా ప్రీతమ్.
 2. ఆల్వేస్ అమృత -అల్వేస్ ప్రీతం బై గుల్జార్సింగ్ సంగ్
 3. పింజర్. ఇంటర్నెట్ మూవీ డేటా
 4. అమృత ప్రీతం ఆధునిక భారతీయ సాహిత్యం -ఆన్ ఆంథోలోజి, కే ఎం జార్జి.
 5. సాహిత్య అకాడమీ ఫెలో షిప్ ఫర్ అమృత ప్రితం అనంత మూర్తి
 6. న్యూ పంజాబీ పోయెట్రీ -అమృత ప్రితం (1935-1947)
 7. అమృత ప్రీతం -క్వీన్ అఫ్ పంజాబ్ లిటరేచర్, ది సిఖ్ టైంస్, కుశ్వంత్ సింఘ్
 8. సాహిర్ జీవిత చరిత్ర
 9. అమృత ప్రితం ఇమ్రోజ్ -ఏ లవ్ స్టోరీ అఫ్ ఏ పోయెట్ అండ్ ఎన్ ఆర్టిస్ట్ -ఏ వే బ్యాక్ మెషిన్
 10. అమృత ప్రితం – ఏ లవ్ లెజెండ్ అఫ్ అవర్ టైమ్స్ – నిరుపమ దత్.

అమృత ప్రీతం అవార్డులు

అమృత ప్రీతం భారతీయ సాహిత్య సమాజంలో నే కాదు, అంతర్జాతీయంగా కూడా సుప్రసిద్ధ రచయిత్రి. అమృత ప్రతిభకు ఆమెకు అనేక ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు లభించాయి
1) సనేహాడ్ అనే కవితకు 1956 లో సాహిత్య అకాడమీ పురస్కారం, అది కూడా ఈ అవార్డు అందుకున్న మొదటి పంజాబీ రచయిత్రిగా గుర్తింపు పొందింది
2) 1969 లో పద్మశ్రీ పురస్కారం
3) 1982 లో ”కాగజ్ తే కాన్వాస్” కు “భారతీయ జ్ఞానపీఠ” అవార్డు
4) 2004 లో పద్మ విభూషణ్ పురస్కారం
5) 2004లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ -”ఇమ్మోర్టల్స్ అఫ్ లిటరేచర్” రచనకు అందుకున్నది
6) పంజాబ్ రతన్ అవార్డు -అప్పటి పంజాబ్ ముఖ్య మంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ నుంచి స్వీకరించారు
7) “ఏక్ థీ అమృత” రంగస్థల ప్రదర్శన -ప్రఖ్యాత రంగస్థల కళాకారుడు దేశవిభజన పైన నిర్మించిన గరం హవా చిత్ర దర్శకుడు ఎం. ఎస్. సత్యు చేత
8) డి లిట్, గౌరవ డిగ్రీలు: (1) ఢిల్లీ విశ్వవిద్యాలయం -1973 (2) జబల్పూర్ విశ్వవిద్యాలయం-1973 (3) విశ్వభారతి -1987 (4) ఇంకా అనేక విశ్వవిద్యాలయాల నుండి డి లిట్, గౌరవ డిగ్రీలు లభించాయి
9) “అంతర్జాతీయ వాప్ట్ సరోవ్ పురస్కారం”-రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా -1979
10) “డిగ్రీ అఫ్ ఆఫీసర్ డెన్స్”, ”ఆడ్రె డేస్, ఆర్ట్స్ ఎట్ డేస్ లెటర్స్” పురస్కారాలు -ఫ్రెంచ్ ప్రభుత్వం
11) రాజ్య సభ సభ్యురాలుగా నామినేషన్ -1986-92
12) జీవిత చరమాంకంలో -పాకిస్థాన్ పంజాబీ అకాడమీ పురస్కారం

అమృతా ప్రీతం వ్యక్తిగత జీవితం :

అమృతా ప్రీతం శృంగారం, ప్రేమ, మోహం, వియోగ దుఃఖం లాంటి వస్తువులతో అనేక కవితలు రాసింది. ఆమె కవయత్రిగా తన ప్రయాణాన్ని అలాగే ప్రారంభించినప్పటికీ, ప్రగతిశీల రచయితల సంఘం లో భాగం అయినాక తన భావజాలం లో పూర్తి మార్పు వచ్చింది. అమృత అభ్యుదయ, ప్రగతిశీల, వామపక్ష, స్త్రీవాద రచయిత్రి, కవయిత్రిగా మారిపోయింది. ఈ ప్రభావంతోనే 1944లో ”లోక్ పీడ్” (ప్రజల వేదన) అనే రచనా సంపుటిని వెలువరించింది. దీనిలో 1943లో బెంగాల్ కరువు, యుద్ధం తర్వాత వచ్చిన ఆర్ధిక సంక్షోభాన్ని, దాని రాజకీయ కారణాలను నిర్భయంగా విమర్శిస్తూ రాసింది. తరువాత అనేక సంఘ సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నది. 1947 భారత విభజనకు ముందు పాకిస్థాన్ లోని లాహోర్ రేడియో స్టేషన్ లో పని చేసింది దేశవిభజన తరువాత, భారత దేశానికి వలస వచ్చాక సామాజిక ఉద్యమకారుడు గురు రాధాకృష్ణ ఢిల్లీలో ప్రారంభించిన ”జనతా గ్రంధాలయం”లో పని చేసింది. అమృత ఈ అధ్యయన కేంద్రాన్ని బలరాజ్ సహాని, అరుణ్ అసాఫ్ అలీ లు ప్రారంభించారు ఇది ఇప్పటికీ ఢిల్లీ లోని క్లాక్ టవర్ దగ్గర చురుకుగా నడుస్తూనే ఉన్నది. దేశవిభజన తరువాత భారత దేశం లో ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో 1961 వరకు పంజాబ్ సర్వీస్ లో భాగంగా పని చేసింది.

అమృతాప్రీతం సాహిత్యం –సినిమాలు

1) “ధర్తి, సాగర్, సేపిఎన్” 1965 లో ”కాదంబరి”
2) ”ఉనా ది కహానీ”- 1976లో ”డక్కు”-బసు భట్టాచార్య దర్శకత్వం
3) ”పింజర్” -1970 -చంద్రప్రకాశ్ ద్వివేది -2005
4) ”అమృత రిసైటెడ్ బై గుల్జార్” ఆడియో ఆల్బమ్ – గుల్జార్ అమృత రాసిన కవితలు చదివి వినిపించాడు.

అమృతా ప్రీతం – ఇమ్రోజ్
అమృత – సాహిర్ లుథియాన్విల ఫలించని ప్రేమ

1936 నుంచి 1959 వరకు అమృత ప్రీతం, తన భర్త ప్రీతం సింగ్ తో కలిసి ఉంది. ఇష్టం లేని పెళ్లి, ఏ మాత్రమూ ప్రేమ, ఆకర్షణ, భావ సారూప్యత లేని భర్తతో సరిపడక అమృత 1960 లో విడాకులు తీసుకొని విడిపోయింది.

భర్తతో విడిపోకముందే ఆమె 1944లో పరిచయం అయిన, అప్పుడప్పుడే సినీ రంగంలో కవితలు, పాటలు, మాటలు రాస్తున్న కవి సాహిర్ లుథియాన్వితో ప్రేమలో పడింది. సాహిర్ కూడా ఆమెను ప్రేమించాడు. వీళ్లిద్దరి మధ్యన ఉన్న అవ్యక్త సంబంధంలో, విశ్వమంతటి ప్రేమ, బాధ, అంగీకారం, పశ్చాత్తాపం, సున్నితత్వం, శృంగార భావనలు ఉండేవి. సాహిర్ ని తలచుకుంటూ, కేవలం అతని కోసమే అమృత బాధ, దుఃఖం, విరహం, వియోగం, మోహభావనలు ముప్పిరిగొనే ప్రేమ కవితలు పుంఖాను పుంఖాలుగా రాసింది. అందుకే, అమృత మొదట్లో శృంగార, ప్రేమ కవితలు రాసే కవయత్రిగా పేరు పొందింది.

అయితే ప్రగతిశీల రచయితల సంఘం ప్రభావంతో అమృత అనేక సామాజిక సమస్యల మీద సాహిత్య సృజన చేస్తూనే సీరియస్ ప్రజల కోసం రాసే ప్రగతిశీల రచయిత్రిగా పేరు తెచుకొన్నప్పటికీ ఆమె ప్రేమ, శృంగారం, విరహం లాంటి సహజమైన మానవసంవేదనలకు, అనుభూతులకు సంబంధించిన భావనలను సాహిత్యంలో వ్యక్త పరచడానికి ఏనాడూ సందేహించలేదు. విమర్శలను, సెన్సార్షిప్లను, అంగీకరించలేదు. తన జీవితంలో భర్త ఉన్నప్పటికీ, సాహిర్ మీద ప్రేమ కలగడం ఆమెలో ఎప్పుడూ ఖంగారు కానీ, భయం కానీ, పశ్చాత్తాపం కానీ కలిగించలేదు. ఆ ప్రేమను సాహిర్ కి ప్రకటించటానికి కూడా ఆమె వెరవలేదు. అలా భర్త మీద కాకుండా ఇంకో పురుషుడి మీద అంత ప్రేమా, మోహము ఏర్పడ్డము తప్పని కూడా అమృత భావించలేదు. పైగా ఏమీ తెలియని ఆ పదహారు ఏళ్ల లేత కౌమార దశలో, అప్పుడప్పుడే యవ్వనం చిగురిస్తూన్న ఆమె జీవితంలోకి ప్రవేశించిన తొలి పురుషుడు భర్త ప్రీతం సింగ్ అయినప్పటికీ, అది ఆమెకు ఏమాత్రమూ ఇష్టం లేని పెళ్లి. తరువాత, ఇష్టం లేని, భయం కలిగించే, అర్థం కాని మోటు శృంగారం, ఆ తర్వాత వరుసగా ఇద్దరు పిల్లలు పుట్టటం, ఇంటి చాకిరి, అత్త, ఆడబిడ్డలతో విబేధాలు, అవి కలిగించిన మానసిక వత్తిళ్ల మధ్య అమృత సంసార జీవితం కొనసాగింది. ఈ కారణాలన్నీ ఉండడం మూలంగా ఆమె ప్రేమరాహిత్యం లోనుంచి, ప్రేమని వెతుక్కొంటూ సాహిర్ ప్రేమలో పడిందా అంటే అలా ఎప్పుడూ అనుకోలేదు ఆమె. సాహిర్ కంటే ముందు ఆమె జీవితంలోకి అమృత సౌందర్యాన్ని, మేధస్సును పొగుడుతూనో, ఆకర్షింపబడుతూనో చాలామంది పురుషులు వచ్చారు. కానీ అమృత మాత్రం సాహిర్ ని ప్రేమించింది ఒక విధంగా సాహిర్ అమృత తొలి ప్రేమ అనుకోవచ్చు. అందులో ఆమె పూర్తిగా మునిగి పోయింది. కానీ సాహిర్ అమృతకు ఎప్పటికీ దక్కలేదు. ఒకరికోసం ఒకరు తపన పడి, నిరీక్షించి, వియోగపడి, దూరమైపోయి, విడిపోయాక కూడా జీవితమంతా దుఃఖపడి బాధను అనుభవిస్తూనే ఉండింది ఈ విఫల ప్రేమ జంట. అమృత కంటే, సాహిర్ చాల తొందరగా 1980లో గుండెపోటు వచ్చి మరణించాడు. అమృత 2005 లో నిద్రలోనే గుండెపోటుతో తన 86వ ఏట మరణించింది.

వీళ్ళ ప్రేమ కథ 1944లో వీళ్ళిద్దరూ లాహోరుకి, ఢిల్లీకి మధ్యలో ఉన్న ప్రీతినగర్ అనే గ్రామంలో జరిగిన ముషాయిరాలో కలుసుకున్నప్పుడు మొదలు అయ్యింది. అమృత అప్పటికే వివాహిత. ఆ సంగతి సాహిర్ కి తెలుసు. అమృత సౌందర్యం, సాహిత్యంలో ఉన్న అపరిమితమైన జ్ఞానం, అభ్యుదయ భావాలు, కవితలను చాల భావయుక్తంగా చదివే పద్ధతి సాహిర్ ని, అలాగే అతని ప్రగతిశీల భావజాలం, అభిరుచులు, అన్నింటికీ మించి అతనిలోని భావావేశం అమృతను ఆకర్షించాయి. ఇద్దరిలో ఆకర్షణకు, ప్రేమకి దారితీసింది. వీళ్ళిద్దరూ అనేకమైన సభల్లో, అనేకసార్లు కలుసుకున్నప్పటికీ, వారు తమ ప్రేమను ఉత్తరాల్లో, చిన్న, చిన్న మాటల్లో, నిశ్శబ్దమైన చూపుల్లో వ్యక్తపరుచుకునేవారు. వారి చూపుల భాష, ఒకరినొకరు చేసుకోవాలన్న తపన వారిచుట్టు ఉండే సాహితీ మిత్రులకు స్పష్టంగా తెలిసిపోయేది. సాహిర్ లాహోర్ లో ఉంటె, అమృత ఢిల్లీ లో ఉండేది. ఇద్దరూ, తమ మధ్య పదాలతో, కవితలతో, ప్రేమ వంతెన కట్టుకున్నారు. సాహిర్ ని అమృత ”మేరా షాయర్” అని, మేరా మెహెబూబ్ అని, మేరె ఖుదా, మేరె దేవతా (నా కవీ, నా ప్రియుడా, నా దేవుడా) అని సంబోధిస్తూ ప్రేమ లేఖలు రాసేది. కొన్ని సార్లు రహస్యంగా కలుసుకునే వారు కానీ ఏమీ మాట్లాడుకోకుండా మూగగా ఉండిపోయేవారు. ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకొంటూ ఉండిపోయేవారు. సాహిర్ సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతూ ఉండిపోయేవాడు. అతను వెళ్ళిపోయాక, సగం కాలిన సిగరెట్టు ముక్కలను ఏరి, ఆ ముక్కల పైన కనిపించని సాహిర్ వేలి ముద్రలను ఆర్తిగా తన పెదాలతో స్పర్శించేది అమృత. తరువాత తను ఆ సిగరెట్ ను పీల్చి వదిలేది అమృత. ఇదంతా అమృత తన ఆత్మకథ అయిన ”రాశిదీ టికెట్” లో రాసుకున్నది. సాహిర్ సిగరెట్ మీద అమృత ఇలా ప్రేమ కవిత రాస్తుంది.

“సిగరెట్”

ఇది నిప్పుకు సంబంధించిన విషయం,
నీవే ఈ మాటని నాకు చెప్పావు గుర్తుందా?
నువ్వు నాలోని దేన్నైతే వెలిగించావో
ఆ జీవితానికి చెందిన సిగరెట్టు ఇది.
నా వేళ్ళ మధ్య
అగ్ని రేపింది నువ్వే!
నా హృదయం దహించుకుపోతూనే ఉంది ఇంకా
కాలపు కలాన్ని పట్టుకొని లెక్కలు రాస్తూనే ఉంది.

పధ్నాలుగు నిముషాల్లాగా గడిచిపోయాయి
దీని లెక్కేంటో చూడు ఒకసారి.
పద్నాలుగు సంవత్సరాలు నీ ఎదురుచూపులో గడిచిపోయాయి
ఈ కలాన్ని అడుగు కావలిస్తే!
నేను పోయాక కూడా
నా ఈ దేహంలో నీ శ్వాస ప్రవహిస్తూనే ఉన్నది
ఈ భూమి సాక్ష్యం ఇస్తుంది
చూడు పొగ లేస్తుంది భూమి పొరలలో నుంచి.

యవ్వనపు సిగరెట్ కాలిపోయింది
నా ప్రణయపు పరిమళం
కొంత నీ శ్వాసలో,
మరికొంత గాలిలో కలిసిపోయింది.

చూడు ఇది ఆఖరి ముక్క
వేళ్ళ మధ్యలోనించి వదిలెయ్యి
నా ప్రణయపు అగ్ని వాటికి అంటుకుంటుందేమో ?

జీవితం గురించి ఇప్పుడు బాధ లేదు
ప్రియా,
ఈ అగ్నిని కాపాడుకో
నీ చేతుల క్షేమాన్ని కోరుతున్నా
ఇంకొన్ని సిగరెట్లు వెలిగించి పో !

ఇలా సాహిర్ మీద ఎన్నో కవితలు రాసింది అమృత.

సాహిర్ ఒకసారి తన ఇంటికి వచ్చిన అమృత వెళ్ళిపోయాక, తల్లితో ”ఈ అమృత అనే అమ్మాయే నీకు కోడలిగా కావలసింది” అని అంటాడు కూడా. అమృత సాహిర్ తో ఎంత గాఢమైన ప్రేమలో పడిపోయింది అంటే, ఆమె తన అసంతృప్త వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి, సాహిర్ తో కలిసి జీవించాలని అనుకుంది. సాహిర్ ని అడుగుతుంది కూడా బయటకు వచ్చేసి నీతో కలిసి జీవిస్తాను అని కానీ సాహిర్ పిరికివాడు అందుకు ఒప్పుకోడు. పద్నాలుగేళ్ళు సాహిర్ కోసం ఎడతెగకుండా ఆశతో నిరీక్షిస్తుంది. “సాహిర్ నేను నిన్ను ప్రేమిస్తున్నంత గాఢంగా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అసలు?” అని అడిగి, అడిగి విసిగి పోతుంది అమృత. సాహిర్ మీద తల్లి ఆధిపత్యం చాలా ఉండేది. నిత్యం హింసించే తండ్రిని వదిలిపెట్టి తనని కష్ట పడి పెంచిన తల్లి పైన సాహిర్ కి అలవిమాలిన ప్రేమ. తల్లి అంగీకరించదేమో అన్న భయంతో సాహిర్ అమృతను దూరం పెడతాడు. సాహిర్ తన తల్లి మీద ఇడిపశ్ కాంప్లెక్స్ అనే మానసిక స్థితితో ఉన్నాడని (తల్లి మీద బాల్యం నుంచీ అలవిమాలిన ప్రేమ), అందువల్ల అతను ఏ స్త్రీనీ తన జీవితంలోకి ఆహ్వానించలేకపోయాడని, అయితే అతని తల్లి తర్వాత ఆమెని ప్రేమించినంతగా అమృతని మాత్రమే ప్రేమించగలిగాడని అతని స్నేహితులు జయదేవ్, శుక్లా అంటారు. సాహిర్ సుధా మల్హోత్రా అనే నేపథ్య గాయనితో సహజీవనం చేయడం మొదలు పెడతాడు, అమృత హృదయం భగ్నమవుతుంది.

ఇమ్రోజ్, అమృతల ప్రేమ – జీవితపర్యంతపు సహజీవనం

సాహిర్ నింపిన వెలితిని ప్రఖ్యాత కళాకారుడు, పెయింటర్ ఇమ్రోజ్ భర్తీ చేస్తాడు. అమృత ఇమ్రోజ్ నలభై సంవత్సరాల వరకు, చనిపోయే వరకు కలిసే ఉంటారు. అమృత కన్నా వయసులో ఆరు సంవత్సరాల చిన్న అయిన ఇమ్రోజ్, అమృతకి సాహిర్ తో ఉన్న ప్రేమను అంగీకరిస్తూనే ఆమెని గొప్పగా ప్రేమించగలుగుతాడు. సాహిర్ తో అమృత ప్రణయం భ్రమాన్వితమైనదని, తనతో ప్రేమ మాత్రమే వాస్తవమైనదని చెప్తాడు ఇమ్రోజ్. సాహిర్, ఇమ్రోజ్ లతో పాటు అమృతకి సాజిద్ హైదర్ అనే ప్రాణ స్నేహితుడు ఉండేవాడని, అతని మీద కూడా అమృతకు అంతులేని మమకారం ఉండేదని అయితే అది స్నేహం వరకే పరిమితమని, సాజిద్ స్నేహాం కోసం కూడా అమృత కవితలు రాసేది అని, సాజిద్ దేశవిభజన తర్వాత పాకిస్థాన్ వెళ్ళిపోయాడు అని చెప్తాడు ఇమ్రోజ్ ఒక స్నేహితునితో. అమృత ప్రేమించిన మనుషులు అందరిని ఇమ్రోజ్ కూడా ప్రేమిస్తాడు. నిజానికి అమృత జీవితంలోకి ఇమ్రోజ్ చాలా ఆలస్యంగా వస్తాడు. ”అపరిచితుడా నా జీవితం లోకి సాయం సంధ్యా సమయానికి ఎందుకు వచ్చావు? కలిసే వాడివి కాస్తా మధ్యాహ్నపు సమయంలో కలవకపోయావా” అని అమృత ఇమ్రోజ్ తో పదే, పదే అనేది. ఇమ్రోజ్ నిష్కల్మషమైన, పరిపక్వత చెందిన, సంస్కార పూరితమైన ప్రేమలో తడిసి ముద్ద అయిన అమృత ఇమ్రోజ్ కోసం ఒక కవిత రాస్తుంది.”

“నేను నిన్ను మళ్ళీ కలుసుకుంటాను!”

నేను నిన్ను మళ్ళీ కలుసుకుంటాను
ఎక్కడో, ఎప్పుడో చెప్పలేను కానీ
నిన్ను తప్పక కలుసుకుంటాను
బహుశా నీ ఊహల్లో ప్రేరణగా మారి,
నీ కాన్వాస్ లోకి ఒదిగిపోతాను.,
లేదా నీ కాన్వాస్ మీద ఒక రహస్యమైన గీతగా మారిపోయి,
నిశ్శబ్దంగా నిన్ను చూసుకుంటూ ఉంటాను
నేను నిన్ను మళ్ళీ కలుస్తాను
ఎక్కడో, ఎప్పుడో మాత్రం చెప్పలేను
ఈ సూర్యుని వెలుగునై
బహుశా, నీ కుంచెలోని రంగుల్లో కలిసిపోతూ ఉంటాను
లేదా రంగుల కౌగిలిలో కూర్చుని
నీ కాగితాలమీద పరుచుకుంటాను
తెలియదు కానీ, ఎప్పుడో, ఎక్కడో
కానీ నిన్ను మళ్ళీ తప్పక కలుసుకుంటాను
లేదా ఒక జలపాతం గా మారిపోయి,
నీటి తుంపర్లు నీ దేహం మీద పరుస్తాను
తరువాత, ఒక శీతల పవనమై
నీ దేహాన్ని అలుముకుంటాను
నాకు తెలిసింది ఒక్కటే,
కాలం ఏమైనా చేయనీ గాక… నీ జన్మ మాత్రం నాతో కలిసి నడుస్తుంది
ఈ దేహం అంతమైతే నీకు నాకూ మధ్య కూడా అంతా ముగుస్తుంది.
కానీ జ్ఞాపకాల దారపు పోగులు,
ఈ విశ్వపు క్షణాలలాగా ఉంటాయి.
నేను ఆ క్షణాలను ఎన్నుకుంటాను
ఆ జ్ఞాపకాల పోగులను భద్రపరుచుకుంటాను
ప్రియా, నేను నిన్ను కలుసుకుంటాను,
ఎక్కడో, ఎప్పుడో చెప్పలేను
కానీ నిన్ను మళ్ళీ తప్పక కలుసుకుంటాను.

అమృతను విడిచి ఉండలేని ఇమ్రోజ్ వేడుకుంటాడు. “నీతో కలిసి ఉండాలని ఉంది అమృతా” అని ఇమ్రోజ్ అన్నప్పుడు “వెళ్ళు లోకం అంతా ఒక చుట్టు తిరిగి రా అప్పటికి నీకు నాతో ఉండాలి అనిపిస్తే ఉందువు గాని” అంటుంది. ఇమ్రోజ్ మేడపైన ఉన్న ఇద్దరి గదుల మధ్య తిరగేసి, ”చూడు తిరిగేసాను, నీతోనే ఉండాలనిపిస్తున్నది” అంటాడు నవ్వుతూ. అప్పటినుంచి వాళ్లిద్దరూ నలభై ఏళ్ల దాకా, అమృత మరణం వరకు కలిసే ఉన్నారు. ఇమ్రోజ్ స్వయానా కళాకారుడు అయినప్పటికీ అమృతను ఎంతో బాధ్యతగా ప్రేమగా చూసుకునేవాడు. అమృత ఎక్కువగా రాత్రుళ్ళు ప్రశాంతంగా కూర్చుని రాసేది. ఇమ్రోజ్ అమృతకు చాయ్ చేసి ఆమె టేబుల్ మీద పెట్టేవాడు. నిశ్శబ్దంగా ఏళ్ల తరబడి ఇలాగే సాగింది వాళ్ళ సహజీవన ప్రయాణం. వాళ్లిద్దరూ స్కూటర్ మీద బయటకు వెళ్ళినప్పుడు, అమృత ఇమ్రోజ్ వీపు మీద వేళ్ళతో ఏవో అక్షరాలు రాసేది. ఇమ్రోజ్ కి అమృత రాసేది కవిత్వం అని అర్థం అయిపోయేది. రాజ్యసభకు అమృత ఎన్నికైనప్పుడు ఇమ్రోజ్ అమృత ని స్కూటర్ మీద తీసుకెళ్లి సభ అయిపోయేదాక గంటల తరబడి వేచి చూస్తూ కూర్చునేవాడు. అది చూసి, చాలామంది ఇమ్రోజ్ అమృత డ్రైవర్ అనుకునేవాళ్ళు. అమృత చివరి రోజుల్లో చాలా అనారోగ్యం పాలు అయింది. దాదాపు మంచాన పడింది. ఆమెకు స్నానం చేయించి బట్టలు వేయడం, తిండి తినిపించడం లాంటివి చేస్తూ పసిపాప లాగా చూసుకున్నాడు ఇమ్రోజ్. 31 అక్టోబర్ 2005 లో అమృత నిద్రలోనే గుండెపోటుతో మరణించింది. అమృత మరణాన్ని ఇమ్రోజ్ జీర్ణించుకోలేక పోయాడు. ”ఆమె నన్ను విడిచి ఎలా వెళ్ళిపోతుంది? వెళ్ళలేదు” అని దుఃఖిస్తూ ఇలా అమృత మరణం గురించి రాసుకుంటాడు.

“ఆమె నా తోనే ఉంది”

ఆమె దేహం మాత్రమే విడిచి పెట్టింది, నా తోడుని కాదు
తను ఇప్పటికీ ఒకసారి నక్షత్రాల నీడల్లో, మరోసారి మబ్బుల చాటున ఒకసారి సూర్యకిరణాల కాంతిలో, చాలాసార్లు జ్ఞాపకాల ఉషోదయాల్లో నన్ను కలుసుకుంటూ ఉంటుంది.
మేము ఇద్దరం అలా కలుసుకుంటూ నిశ్శబ్దంగా నడిచిపోతూ ఉంటాము,
అలా నడుస్తూ ఉన్న మమ్మల్ని పువ్వులు చూసి తమ దగ్గరికి పిలుచుకుంటాయి
పూల ఛాయల్లో కూర్చుని మేం ఇద్దరం
ఒకరికి ఒకరం కవితలు వినిపించుకుంటాము
వినండి, ఆమె దేహం వదిలిపెట్టింది కానీ నన్ను కాదు”
అంత గాఢంగా ప్రేమిస్తాడు ఇమ్రోజ్ అమృతని. సాహిర్ కంటే, ఇమ్రోజ్ ప్రేమ ఉన్నతమైనది.

సాహిర్ మరణం

సుధా మల్హోత్రా తో సంబంధంలో ఉన్నప్పటికీ సాహిర్ అమృతను మర్చిపోలేక పోతాడు. ఒకసారి సాహిర్ ఇంటికి వచ్చిన అమృత టీ తాగుతుంది. ఆమె వెళ్ళిపోయాక కూడా చాలా కాలం ఆ టీ కప్పును కడగకుండా ఆమె జ్ఞాపకంగా అలాగే ఉంచుకుంటాడు. సాహిర్ ఇమ్రోజ్ పక్కన అమృతను చూసి తట్టుకోలేక కుమిలిపోతాడు. ఆమెను ఉద్యేశించి ఇలా రాస్తాడు, ,”మెహెఫిల్ నుంచి దయ లేకుండా వెళ్లిపోయే దానా., నిన్ను ఏమని నిందించాలి? నువ్వు భద్రమైన ఇంటినుంచి వచ్చావు నేనేమో బద్నాం అయిపోయి ఆవారాగా తిరిగేవాడిని!” అదే మానసిక వేదనతో కుమిలిపోతాడు. 1980 లో సాహిర్ తీవ్రమైన గుండెపోటుతో తన స్నేహితుడైన ప్రముఖ కవి జావేద్ అఖ్తర్ సమక్షంలో చనిపోతాడు. చైన్ స్మోకర్ అయిన సాహిర్ వూపిరితిత్తులని సిగరెట్లు నాశనం చేశాయి. భారత ప్రభుత్వం సాహిర్ బొమ్మతో ఒక స్టాంపుని అతని గౌరవార్థం విడుదల చేసింది.

అమృత సాహిత్యంలో ఫెమినిజం, సెక్సువల్ పాలిటిక్స్, అణిచివేత
అమృతా ప్రీతం అందగత్తె కాబట్టి ఆమెకు సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిందా?
అమృతా ప్రీతం కవిత్వ విశ్లేషణ!

1940 సంవత్సర కాలాల్లో అమృతాప్రీతం భారత దేశంలోనే చాలా ప్రసిద్ధి పొందిన తొలి పంజాబ్ రాజకీయ, స్త్రీవాద రచయిత్రి. తొలుత పంజాబీ భాషలో, ఉర్దూలో రాసినా తరువాత హిందీలో విస్తృతంగా రాసింది. త్వరలోనే అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. 1950 కల్లా సైమన్ డి బొవేర్, అలాగే పడమరలో బెట్టీ ఫ్రైడాన్ లాగా అమృత భారత దేశంలోని ఆధిపత్య బ్రాహ్మణీయ ఫ్యూడల్ వ్యవస్థ వలన, కుటుంబాల్లో, సమాజంలో వేళ్లు వూనుకుని ఉన్న పితృస్వామ్యాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టింది. స్త్రీలకు నిర్దేశించబడిన మూస పోసిన జెండర్ పాత్రలను తన స్వంత జీవితంలోనే కాకుండా, సాహిత్యంలోనూ తిరస్కరించి, స్త్రీలను తన సాహిత్యంలో గౌరవ నీయమైన, బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా పునర్ నిర్వచించే ప్రయత్నం చేసింది. అలాగే సాధారణ, సాంప్రదాయక స్త్రీ పురుష సంబంధాలున్న కుటుంబాల్లో ఉండే అసహజ లైంగిక & ఆధిపత్య రాజకీయాలను సవాలు చేసింది (heteronormative sexual politics). ఈ రకమైన తిరుగుబాటు ధోరణితో ఉండే స్త్రీవాద సాహిత్యాన్ని ఉప్పెనలాగా సృష్టించింది. ఈ క్రమంలో 20వ శతాబ్దపు మధ్య కాలంలో భారతదేశంలోని సాంప్రదాయక, ప్రగతిశీల సాహిత్య లోకం నుంచి అమృత విపరీతమైన విమర్శలను ఎదుర్కొంది. ముఖ్యంగా పురుషుల నుంచి. ఇంకా విచిత్రం ఏమిటంటే పంజాబీ, హిందీ, ఉర్దూ, దక్షిణాసియా పబ్లిషింగ్ వ్యాపార సంస్థల నుంచి కూడా, అమృత తన నిర్భయమైన రచనలకు సంబంధించి విమర్శలను, ఆంక్షలను ఎదుర్కొంది కానీ, అమృత పట్టించుకోలేదు ధైర్యంగా నిలబడింది. అమృత చిన్నప్పుడే, వాళ్ళ నాన్న మీరా బాయీ లాగా భక్తివాద కవిత్వం మాత్రమే రాయమని ఆంక్షలు విధించినప్పుడే ధిక్కరించి, రాజన్ అనే ఉహాత్మక పురుషుడి మీద ప్రేమ కవిత రాసి చూపించింది. దేశవిభజన సమయంలో వలస పోతున్న శరణార్ధుల మీద జరిగిన అత్యాచారాలను, దాడులను చూసి చలించిపోయిన అమృత, ఆనాటి ఆ రాజకీయ పరిస్థితుల మీద విమర్శనాత్మక మైన ”ఆజ్ ఆఖా వారిష్ షా ను” అనే కవితను రాస్తుంది. అది సాహిత్యలోకంలో ప్రకంపనలు సృష్టించింది. అట్లానే”పింజర్”అనే నవల లో కూడా దేశవిభజన సమయంలో జరిగిన హింస, దోపిడీ, స్త్రీలపైన, పిల్లల పైన జరిగిన లైంగిక అత్యాచారాలను, నిస్సహాయ స్రీలు అత్యాచారాలను తప్పించుకోవడానికి బావుల్లో దుంకి ప్రాణత్యాగాలు చేయడాన్ని, వారిని ఎత్తుకుపోయి లైంగిక అత్యాచారాలు చేసి హత్యలు చేయడాన్ని, వాళ్ళను వ్యభిచార వృతిలోకి బలవంతంగా నెట్టడాన్ని, వాటిని ఆపలేని పాలకవర్గ వైఫల్యాలను చిత్రించి, సామాజిక బాధ్యత ఉన్న ప్రగతిశీల రాజకీయాలున్న రచయిత్రిగా గుర్తింపు పొందింది. అదే సమయంలో స్త్రీల సమస్యలను విస్తృతంగా చర్చించే స్త్రీవాద రచయిత్రిగా కూడా అమృత గుర్తించబడింది. స్త్రీల లైంగికతకు సంబందించిన భిన్నమైన సమస్యలు, స్రీలుగా వాళ్ళు కుటుంబంలో, సమాజంలో, కోల్పోయిన వ్యక్తిత్వాలు, పెళ్లి అయ్యాక ఏ ఇంటికీ చెందనితనంతో, ద్విసంవేగ స్థితుల్లో ఉండడం, స్వంత ఇళ్ళు, ఆస్థి లేకుండా పరాధీన స్థితిలో బ్రతికే స్త్రీల సమస్యలు అమృత సాహిత్యంలో చర్చించబడతాయి. అమృత కవిత్వంలో అణిచివేతల నుంచి విముక్త మవ్వాలన్న తపన, స్వీయ అస్తిత్వ చైతన్యం, రెండూ కూడా ఒకదానికొకటి పెనవేస్కోని పోయి, స్త్రీగా ఆమె లైంగికతను, వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తాయి. ఉదాహరణకి, ”వర్జిన్” అనే కవితలో అమృత స్త్రీల జీవితాలలోని లైంగిక హింసను చెబుతుంది. అదే సమయంలో స్త్రీ పురుషుడికి లైంగిక బానిసగా ఉండడం నుంచి స్వేచ్ఛని కోరుకొంటుంది.

“వర్జిన్”

నీ శోభనం గదిలోకి నేను ప్రవేశించినప్పుడు,
నేను ఒకేసారి ఇద్దరిని.
కన్యని, వివాహితని కూడా!

నిన్ను సంతృప్తి పరచడానికి, నాలోని కన్యను నేను చంపెయ్యాలి
తప్పదు చంపాల్సిందే, చంపేసాను కూడా!
అటువంటి హత్యలను న్యాయస్థానమే సమ్మతిస్తుంది మరి…
ఆ హత్యల వల్ల కలిగే అవమానాలు, నొప్పి మాత్రం చట్ట విరుద్ధం కానే కావు సుమా!
అందుకే ఆ అన్యాయపు విషాన్ని తాగేసాను!

తెల్లవారి,
నా చేతులకి అంటిన రక్తాన్ని
నా దేహానికి అంటిన దుర్గంధాన్ని కడుక్కున్నట్లే
కడుక్కున్నాను.

కానీ ఎప్పుడైతే అద్దంలో నా ప్రతిబింబాన్ని చూస్కున్నానో
ఆమె నా ముందు నిలబడి కనిపించింది
ఎవరినైతే రాత్రి హత్య చేశానో,
ఆమెనే నా ముందు నిలబడింది.

ఒహ్హ్ భగవంతుడా., ఈ శోభనపు గది ఇంత గాఢాంధకారంతో ఎందుకు ఉండాలి?
అసలు నేను ఎవరిని చంపాలనుకున్నాను?
కానీ ఇంకెవరినో చంపేసాను!

ఈ కవితలో అమృత వివాహం తరువాత ఆమె ప్రమేయం లేకుండా జరిగే శృంగారం స్త్రీ అస్థిత్వాన్ని, ఆమె శరీరం మీద స్వీయ నియంత్రణను ఎట్లా కోల్పోయేలా చేస్తుందో ఆ అనుభవం ఎంత అవమానకరంగా ఉంటుందో చెప్తుంది. అట్లనే పురుష రచయితలు మాత్రమే స్వేచ్ఛగా ప్రకటించుకునే శృంగార భావనలను, అనుభూతులను, కోరికలను తాను కూడా ఏ మానసిక ఆటంకాలు లేకుండా నిర్భయంగా కవిత్వంలో వ్యక్తీకరించేది. అట్లానే, అణిచివేతలకు గురి అయ్యే స్త్రీలు కేంద్రంగా ఎన్నో కవితలు రాసింది అమృత.

స్రీలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్రీలుగా ఎలా మార్చబడతారో అని బాధపడుతుంది. వీటితో పాటు ముఖ్యంగా శృంగారానికి సంబంధించిన భావనలు వ్యక్తం చేయడంలో ఏ మాత్రం రాజీ లేని దృష్టి, భావోద్వేగాలతో కూడిన మానసిక సంవేదనల నగ్నత్వం, సున్నితత్వం, స్వీయ వ్యంగ్యాత్మకత, అపరిమిత జ్ఞానం ఇవన్నీ అమృత రాసే కవితల్లో అత్యంత సహజంగానూ అంతే తీవ్రతతోనూ కనిపిస్తాయి. అమృత రాసిన ”ఫస్ట్ బుక్” కవితలో స్త్రీ, పురుషుల మధ్య కలయిక సమయంలో వెల్లువ అయ్యే శృంగార భావనలను కవితలో వ్యక్తీకరించడానికి అమృత ఏ మాత్రము సందేహించలేదు. విపరీతమైన ఆకర్షణ, మొహం, ప్రేమలో నుంచి మొదలైన తొలి శృంగార కలయికలో ఏ రకంగా అపవిత్రత, పవిత్రత అనే సామాజిక కట్టుబాట్లు అదృశ్యమవుతాయో రాస్తుంది. సాహిర్ సామీప్యతలో తను పొందిన మోహపు భావోద్వేగాన్ని తన ‘రశీదీ టికెట్’ ఆత్మ కథలో నిర్మొహమాటంగా రాసుకుంటుంది కూడా. ఒకసారి, సాహిర్ కి బాగా నిమ్ము చేసి, ఆరోగ్యం బాగోలేక పోతే అమృత చూడ్డానికి వెళ్తుంది. అతని పక్కనే కూర్చుని అతని ఛాతీ మీద తన వేళ్ళతో శ్వాస బాగా ఆడడానికి అమృతాంజనం లాంటి మందుతో రాస్తూ ఉంటుంది. ఆ మధురమైన ఇద్దరి ఆ సామీప్యపు క్షణాలు అలా శాశ్వతంగా ఉండిపోతే, కాలం అలా తమ మధ్య ఆగిపోతే బాగుంటుంది కదా” అని అనిపించింది అని రాసుకుంటుంది. చాలా సార్లు తన స్వంత అస్తిత్వాన్ని పురాణ పాత్రలలో, ఆధునిక స్త్రీ నమునాల్లో కూడా వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది. అదీ బాధితురాలిగా మాత్రమే. ఉదాహరణకు “నొప్పిని -సిగరెట్లాగే పీల్చుకున్నాను, అట్లానే బూడిద పొగలాగే గాల్లోకి వదిలేసాను” అంటుంది.

(ఇంకా వుంది…)

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

4 thoughts on “ఫ్యూడల్ సాహిత్య సమాజపు ధిక్కార పతాక: తొలి పంజాబ్ మహిళా రచయిత్రి అమృతా ప్రీతం

 1. రచయిత్రి గారు ఒక మంచి వ్యక్తిత్వాన్ని పరిచయం చేశారు మీకు కృతజ్ఞతలు

 2. చాలా మందికి తెలియని మహొన్నతమైన రచయిత్రి, కవియిత్రి,నుంచి పరిచయం చేసిన భారతి గారికి అభినందనలు

 3. Wonderful analysis of Preetam. Tau madam . Introducing Amrutha Preetham to Telugu readers especially present generation.

Leave a Reply