అమానవం

మనసు తెర మీద
ఏ దృశ్యము నిలువదు
పిడికిట్లోంచి జారిపోయే ఇసుక లాగ-

అట్లా, చందమామ వస్తుందో లేదో
వెన్నెలకు చీడ తగులుతది
వసంతం వసంతోత్సాహంతో
కోకిలకి కొత్తపాట నేర్పుతుందా,
ప్రకృతి కంటికొక బాణం గుచ్చుకుంటది
సముద్రపు టలల మీద
గాలి పురివిప్పి ఆడుకోవడమే ఆలస్యం
కుండపోత వానకు కుళ్లు మొదలైతది
భూమి బోడిగుండుమీద
ఆలోచనా ధారలేవో అల్లుకుంటుంటే,
స్వాప్నిక మొలకలేవో పుట్టుకొస్తుంటే
చూడలేనితనం అగ్గి రాజేస్తది

ఏమీ అనిపించదు
అటువైపు రెప్పైనా ఎత్తం

కాశ్మీర సౌందర్యము మౌన మ్లానమయింది
నీకొక నది వుండాలె
జాతీయవాదం తన ఖాతాలో జమ చేసుకుంటది
పంటగంప తలకెత్తుకోగానే
పన్ను పెరిగి, నడ్డి మీద వాలుతది
ప్రాంతీయ వార్తల్లో, ప్రపంచం మిరుమిట్లు గొలుపుతుంటది
ఆక్సిజన్ లు, ప్రాణాలు నేలపాలైతయి
లాక్ డౌన్లు, మౌత్ మాస్క్ లు, కరోనా కబుర్లు
బఫూనరీ గిరిగా తలపిస్తయి
గోడ మీద బల్లి, మిడిగుడ్లేసుకొని, కాసుల వడ్డాణం కోసం కల గంటుంటది
కాలిబొబ్బల ఆర్తనాదాలకు
కవితా పాదాలే లేపనమైన
ఒక చరిత్ర మాత్రమే బతికుంటది

దేనికీ చలించం
సమయం మించే కాలంలో
బాహా బాహీల సాహోలం మనమే అని రుజువు చేసుకుంటం

వాన రాకడ, పానం పోకడ
ఎవ్వరూ ఎరుగరు
నిజమే
అట్లే, నటిద్దాం!

జననం: సిద్ధిపేట. విశ్రాంత ఉపాధ్యాయుడు. రచనలు: 'గోరుకొయ్యలు', 'పట్టు కుచ్చుల పువ్వు', 'విరమించని వాక్యం' (కవితా సంపుటాలు). మంజీరా రచయితల సంఘం సభ్యుడు.

Leave a Reply