అమర సత్యం ‘పునరంకితం’

ఇది… గాయాలపాలైన నేల గురించి తండ్లాడిన మనిషి పరిచయం. రక్తసిక్తమైన పల్లెల గుండెకోతల్లో తల్లడిల్లిన మనిషి కథ. బుక్కెడు బువ్వకోసం వలస పక్షులైన మనుషుల కథ. విధ్వంసమైన బతుకుల్ని కవిత్వంగా అల్లిన కలనేత కలల కథ. దగాపడ్డ తెలంగాణను కైగట్టిన కవి కథ. ఈ దగాపడ్డ నేలంతా ఎంత గోస! ఎన్ని కన్నీళ్లు! చరిత్ర పొడవునా గాయాలే. మానని గాయాలు. నెత్తుటి గాయాలు. తెలంగాణ అంతటా. వేల ఏళ్లుగా రక్తసిక్తమైన నేల. వల్లకాడైన తెలంగాణ. చెరబడ్డ నేలన చెదరని తెలంగాణ. దిక్కులు పిక్కటిల్లే రణన్నినాదాల తెలంగాణ. కల్లోల కరీంనగర్. రాజ్యహింసల్లో పొక్కిలైన సింగరేణి. అట్లాంటి నేలన ఊపిరిపోసుకున్నడు సత్యం. రెక్కలు తప్ప ఏ ఆస్తీ లేని నిరుపేద కుటుంబం. చివరి ఊపిరి దాకా జనం కోసమే బతికిన యుద్ధకవి గురించిన పరిచయమిది.

అతడో ఎగసే సంద్రం. కల్లోల కడలి కెరటం. భావుకుడు. కవి. కథకుడు. విమర్శకుడు. అమ్మను ప్రేమించిండు. అమ్మలాంటి భూమిని ప్రేమించిండు. భూమిని చెరబట్టే దోపిడీని ద్వేషించిండు. భూమి పోరులో నేలకొరిగిన వీరుల గాధలు విన్నడు. లోలోపల మత్తడి దుంకిన వీరగాధలు అల్లుకున్నడు. పోరుదారిని ఎంచుకున్నడు. అతడు సత్యనారాయణ. పుట్టింది (2 అక్టోబర్, 1971) కరీంనగర్ జిల్లా మందమర్రి. చేనేత కార్మిక కుటుంబం. పుస్తకాలంటే ఇష్టం. పేదలంటే ప్రేమ. బాల్యం నుంచే కార్మిక వాడల్లో కష్టాలు కలవరపెట్టినై. వాళ్ల కన్నీళ్లు కల్లోలం రేపినై. చితికిపోయిన బతుకుల్ని చూసిండు. దోపిడీ, అన్యాయం అర్థమైంది. ఆధిపత్యంపై మర్లబడే తత్వమేదో లోలోపల అగ్గిరాజేసింది. అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల సమ్మె జరిగింది. అప్పుడు సత్యం పదో తరగతి విద్యార్థి. ఆ సమ్మెకు సంఘీభావంగా మందమర్రిలో తరగతులు బహిష్కరించి, ఆందోళనకు నాయకత్వం వహించిండు. అట్లా చిన్నప్పట్నించే పోరాట దారిని ఎంచుకున్నడు. విప్లవోద్యమం పరిచయమైంది. సింగరేణి కార్మిక సమాఖ్యలో పనిచేస్తున్న వీరయ్య, రేణికుంట రాజం ప్రభావంతో విప్లవోద్యమాన్ని ప్రేమించిండు. ప్రత్యామ్నాయ రాజకీయాలను అర్థంచేసుకున్నడు.

హైదరాబాద్ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియెట్, సైఫాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో బీఎస్సీ చదివిండు. అప్పటికే తెలుగు నేలంతా విప్లవోద్యమ ప్రభంజనమైంది. విద్యార్థి, రైతాంగ, కార్మిక ఉద్యమాలు రగులుతున్నై. సముద్రుడి పరిచయం అతనిపై తీవ్ర ప్రభావం వేసింది. దీంతో పూర్తికాలం విప్లవోద్యమానికే అంకితమైండు. దక్షిణ తెలంగాణ విప్లవోద్యమానికి కొరియర్ గా పనిచేసిండు. ఒకవైపు బొగ్గు గని కార్మికులతో సావాసం. మరోవైపు అడవిలో ఆదివాసీలను సంఘటితం చేసిండు. ఈ క్రమంలో 1993 ఫిబ్రవరి 2న అరెస్టయిండు. 1993 నుంచీ 1996దాకా జైల్లో ఉన్నడు. 1994-95లో ముషీరాబాద్ జైలులో రాజకీయ ఖైదీల హక్కుల కోసం పోరాటం మొదలైంది. ఈ పోరాటం తెలుగు నేలన ప్రభంజనమైంది. జైల్లోంచే ‘బందీకాని గొంతుక’ అనే పత్రిక నడిన సాహసి సత్యం. నిర్బంధ కాలాన అతని కలం పేరు ‘సముద్రం’. నిజంగా హోరెత్తే సంద్రమే. అతని రాతల్నిండా జనసంద్రమే. అట్లా అధ్యయనం, ఆచరణ అతణ్ని తీర్చిదిద్దినై. నిరుపేద జీవితం నుంచి ఆర్గానిక్ ఇంటెలెక్చువల్ గా ఎదిగిండు.

సత్యం జైల్లో ఉన్నపుడు ప్రతీ సామాజిక, రాజకీయ సందర్భానికి స్పందించిండు. కవిత్వమల్లిండు. కథలల్లిండు. సాహిత్య విమర్శ రాసిండు. అజ్ఞాత జీవితంలో ఎన్ని రచనలు చేసిండో. ఏయే అడవుల్లో, ఏయే చెట్ల ఆకులపై ఏయే పసరు పద్యాలు రాసుకున్నడో తెల్వదు. ఏయే కొండల్లో సత్యం గుండెలెంత ధ్వనించినయో తెల్వదు. అజ్ఞాత జీవితంలో చేసిన రచనలేవీ దొరకలేదు. వీవీ రాసినట్టు “సత్యానారాయణ కవిత్వమంతా జైలు జీవితం. జైల్లో ఆయన అనుభవించిన సమూహంలోని ఒంటరితనం, ఒంటరితననాన్ని దూరంచేసిన సమష్టి జీవితం. తీవ్రమైన సంఘర్షణ. ఎప్పుడూ ఈ సంఘర్షణ నుంచి పులుగడిగిన ముత్యంలా, పుటం పెట్టిన బంగారంలా విశ్వాసంతో, స్థైర్యంతో, చైతన్యంతో అధిగమించి ముందడుగేసిన స్థితి.” అట్లా సత్యనారాయణ సవాళ్లను ఎదుర్కొన్నడు. వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నడు. జీవితాన్ని జనం కోసమే అంకితం చేసిండు. జైలు జీవితం కార్యశాలగా మారింది. అధ్యయనం, రాతే లోకమైంది. ఎంతకీ నిద్రపట్టని జైలు రాత్రుల్ని కవిత్వం చేసిండు. మనసంతా అమరుల జ్ఞాపకాలే. ‘భూమి నా తల వెల నిర్ణయించు’ అన్న సముద్రుడి సింహగర్జనను ఆవాహన చేసుకున్నడు. ‘కాగడాగా వెలిగిన క్షణం’గా ఎం.ఎస్.ఆర్ ను మదిలో నింపుకున్నడు.
“మహోన్నతమైన మీ ఆశయాన్ని
మునుముందుకు తీసుకెళ్లడం కోసం
‘ధరిత్రి’ దాస్య శంకలాల్ని
దగ్ధంచేసే రోజు కోసం
జైల్లోనే జవసత్వాలు నింపుకుంటున్నాం
మీ అమరత్వం ఆనగా చెబ్తున్నాం (పునరంకితం; 2004, పు. 2)
మీ స్వాప్నికాల్ని నిజం చేస్తాం…” అని వాగ్దానం చేసిండు. 1993 జులై 27 రాత్రి రాసుకున్న కవిత ఇది. అతడు జైలు నిర్బంధంలో కుమిలి పోలేదు. కుంగిపోలేదు. ‘నిర్బంధంలోనూ నాదే విజయం’ అని ప్రకటించిన సాహసి సత్యం. వెన్నెల రాత్రుల్లో అడవి మదిలో మెదిలింది. అడవిలో స్నేహాన్ని పంచిన వెన్నెల. పాటల్ని నేర్పిన వెన్నెల.

“శత్రువు సెల్ లోంచి
అనంతమైన గాఢాంధకారంలోకి
వూచల్లోంచి కనబడే ఆకాశంలోకి (అదే; పు. 3)
నిస్తేజంగా చూస్తుంటాను” అంటూ ఒక మూడ్ లోంచి మరో భావచిత్రం మెరిపిస్తాడు. ఇది వియత్నాం యుద్ధకవి హోచిమిన్ కవితను గుర్తుచేస్తది. అడవిని గుర్తుచేస్తూ…
“పచ్చని చెట్టు వూచల్లోంచి వూగుతూ కన్పిస్తుంది
ఎందరో వీరులు విప్లవోద్యమానికి సెంట్రీ చేస్తుంటారు” అంటడు. జైలులోనూ విప్లవమే. మనసంతా అడవే. అడవిలో రగిలే రేలా పాటలే. అడవిని రాజేసే వెన్నెల పాటలే. కారుచీకట్లోనూ వెలిగే విప్లవాన్ని చూసిండు. అందుకే…
“అంతిమ విజయం నా ఆలోచనది
విప్లవోద్యమంలో విలీనం కావడానికి
ఎన్ని రోజులైనా కానీ…
కదిలే రోజుల్లో కదన రంగాన్ని ఊహిస్తూ (అదే)
క్రాలింగ్ ప్రాక్టీస్ చేస్తుంటాను…” అంటూ అంతిమ విజయం కోసం ఆలోచించిండు. సత్యం స్పందనలున్న మనిషినే కలగన్నడు. ఆ మనిషి కోసమే తపించిండు. సిద్ధాంతాలు మాట్లాడుతూ కాలుకదపని మేధావితనమంటే అసహ్యం అతనికి. రాత, రీతి, ఆచరణ ఒక్కటిగా ఉండే విప్లవాన్ని కలగన్నడు. పోరాటాలను చెప్తూ… ‘జడత్వానికిక్కడ స్థానం లేదు’ అని స్పష్టం చేసిండు. నిర్వేదంగా, నిస్తేజంగా నిలబడేవాళ్లను ఖాతరుచేయనన్నడు. చరిత్ర సష్టించే శక్తులే కావాలన్నడు.
“చరిత్ర, సాహిత్య, సిద్ధాంత పుస్తకాల్ని
చీకటి గదుల్లో కూర్చుని చదువుతున్నవాళ్లు
‘యుద్ధం’ జరుగుతూవుంటే
యుద్ధంలో వీరులు ఒరుగుతూవుంటే
స్పందించని వాళ్లు
ఉన్మాద మత్తులో ఊగిపోతున్నవాళ్లు (పునరంకితం; 2004, పు. 8)
ఒక్కరూ నాకక్కరలేదు” అన్నడు. రికామీ తనాలకు విలువనీయలేదు. నిలువ నీటి మడుగుల్ని ద్వేషించిండు. ప్రవాహమై విస్తరించాలన్నడు. నదిలా. సంద్రంలా. హోరెత్తే జలపాత గీతాల్ని జనం గుండెల్లోకి ఒంపిన సృజనశీలి సత్యం.

జైలు జీవితం. ఒంటరి రాత్రులు. అమ్మ గుర్తొచ్చింది. ఆమె ప్రేమ గుర్తొచ్చింది. ఒక్కసారిగా కన్నీటి నదిలా మారిండు. కాయితంపై అక్షరాల పూలు పూసినై. అమ్మకు ఇష్టమైన పూలు. తన గుండె లోతుల్లోని భావాల పూలు. నవ్వినా, ఏడ్చినా రాలే కన్నీటి పూలు. చదువుకోసం దూరమైనపుడు తను రాసే ఉత్తరాల్ని చదివేందుకు అమ్మకు అక్షరాలు నేర్పిండు. పుస్తకాలు చదవడం నేర్పిండు. అమ్మతో అక్షరచాలనం చేసిండు. ఇదెంతటి అపురూపం. ఎంత అరుదైన విషయం. ఒక్క విప్లవకారులు తప్ప ఇంకెవరు చేస్తరిట్ల?
“ఈ క్షణం ఈ జైలు గోడలన్నీ బద్ధలుకొట్టి
అమ్మా అంటూ నీ ముందు వాలాలని వుంది
నీ ఒడిలో కూర్చుని
నీవు ముద్దు ముద్దుగా కసురుతున్నా
నీ బాల్య చేష్టల్ని నీతో పలికించాలనుంది
నీ చేతి అన్నం ముద్దను నీతో కలిసి
సగం సగం పంచుకోవాలనుంది
ఒక్కసారి బాల్యంలోకి ప్రవేశించి
బడికెళ్లనని నేను మారం చేసినపుడు
నువు నా గదమ పట్టుకొని గారాబం చేస్తుంటే (పునరంకితం; 2004, పు. 18)
నీ నుదుటిపై పడే ముంగురులతో ఆడుకోవాలనుంది” అని రాసుకున్నడు. తన కొడుకు దూరమై కుమిలిపోయే అమ్మ కన్నీటి ధ్వనిని వినేవుంటడు. ఆమె మనసులో సుళ్లు తిరుగుతున్న దు:ఖాన్ని కనుపాపల్లో పొదుపుకునేవుంటడు. అందుకే ‘శిశిరం తర్వాత వసంతం రాకమానదు’ అనే గతితర్కం చెప్పిండు. వేయి వెన్నెల వెలుగుల కోసం నిరీక్షించిండు. అమ్మ కనుపాపల్లో వేయి పున్నమిల్ని నింపేందుకు వస్తానన్నడు.
“ఎంత నిర్బంధంలోనైనా వెసులుబాటు దొరకకుండా వుండదు
నేను బయటికొచ్చిన మరుక్షణం నీ ముందు నిలుస్తాను
ఒక్కగానొక్క బిడ్డను బతుకు పోరులో కోల్పోయిన నీకు
నా గుండెను పిండయినా సరే… స్వాంతన చేకూరుస్తాను
నీ చూపుల అర్థాన్ని లోకానికి చెప్పేందుకై
ఫలసాయాన్ని తెచ్చి నీకు అందించి
నీ కళ్లలోని మెరుపును వీక్షించేందుకై
అమ్మా… (అదే; పు. 19)
నేను మళ్లీ ప్రయాణమవుతాను” అన్నడు. 31 ఫిబ్రవరి 1994న రాసుకున్న కవిత ఇది. బహుశా ఇదే కాలంలో ‘కౌముది’ కూడా అమ్మ గురించి పలవరించిండు. అమ్మ చనుబాల తీపిని కలవరించిండు.

సత్యనారాయణకు అజ్ఞాత సూరీడంటే ఇష్టం. అతని కవిత్వమంటే ప్రేమ. ఒకానొక అర్ధరాత్రి అజ్ఞాత సూరీడు గుర్తొచ్చి ఇట్లా రాసుకున్నడు.
“అకస్మాత్తుగా అజ్ఞాత సూరీడు సాక్షాత్కరిస్తాడు
‘డియర్ కామ్రేడ్ రెడ్ శెల్యూట్’ అంటూ…
పారే నీటిని పరమాన్నంలా తాగుతుంటాడు (పునరంకితం; 2004, పు.3)
ఎంతటి సాన్నిహిత్యం” అని. అట్లాంటి ప్రియతమ నాయకుడు లొంగిపోయినపుడు రాసుకున్న కవిత ‘అజ్ఞాన సూరీడు’. లొంగుబాట్లు, ద్రోహాలు ఉన్నంతకాలం నిలిచివుండే కవిత ఇది. చరిత్ర పొడవునా విప్లవోద్యమంలో అనేక ఆటుపోట్లు. లొంగుబాట్లు. ద్రోహాలు. అయినా ఓడిపోలేదు. రాజీపడలేదు. విప్లవోద్యమం వసంత మేఘ గర్జనైంది. అందుకే…
“దోపిడీకి గురికావడం
ద్రోహానికి గురికావడం
మాకు కొత్తకాదు
నయవంచకత్వంతో, నర్మగర్భ మాటలతో
మమ్మల్ని వంచించడమూ మాకు కొత్తకాదు
ద్రోహైన వాడెపుడూ ద్వంద్వంగానే మాట్లాడతాడు
విప్లవం అవసరమంటూ, విప్లవానికి ద్రోహంచేయడం (పునరంకితం; 2004, పు. 21)
ద్రోహిత్వానికే పరాకాష్ట” అని రాశాడు.

అతని విప్లవ కాల్పనికత ఇష్టం. అతని ఇప్ప వనాల గాలిని గుండెల నిండా నింపుకున్న కవి సత్యం. అందుకే ఇష్టమైన వ్యక్తిపై ఎంత ప్రేమో. ద్రోహం చేసినపుడు అంతటి ద్వేషం. ప్రేమైనా, కోపమైనా సూటిగా ప్రకటించడమే విప్లవకారుల సహజ లక్షణం. అందుకే సత్యం ఏదీ దాచుకోలేదు. ప్రేమైనా. కోపమైనా.
“రిటైరవుతున్నట్టుగా భావించమనే మాటకు మూలం
అంతరంతరాల్లో అందంగా నిర్మించుకున్న అహంలో వుంటుంది
ప్రశ్నించడాన్ని భరించలేకపోవడానికి కారణం
తానే అన్నీ అనుకునే తత్వంలో వుంటుంది
ఎదుగుతున్న చైతన్యాన్ని గుర్తించలేకపోవడానికి కారణం
అంతా చిన్నవాళ్లేననే చిన్నచూపు లో వుంటుంది” అని రాసిండు. ప్రశ్నను సహించలేని తత్వమే మనిషిలో అహంకారాన్ని పెంచుతుంది.

తమ ప్రియతమ నాయకుడి పేరును అచ్చులో ఆప్యాయంగా తడమడం ఇష్టం. అట్లా అజ్ఞాత సూరీడి కవిత్వాన్ని ఇష్టంగా చదువుకున్నడు. వాస్తవిక జీవితాన్ని విప్లవీకరించడం నేర్చుకున్నడు. కవిత్వానికి విప్లవ కాల్పనికత అద్దిన అతని సృజనంటే సత్యానికి మరింత ఇష్టం.
“మాకు దోపిడీ కొత్తకాదు, ద్రోహమూ కొత్తకాదు
దోపిడీ నిర్మూలనకై చేసే పోరాటమూ కొత్తకాదు
పోరాటాల్లో ప్రాణాల్ని పోగొట్టుకోవడమూ కొత్తకాదు
ఆ ప్రాణాలపై నువ్వు రాసిన పాటల్ని ప్రేమించడమూ అబద్దం కాదు
పాటల్ని పాడుకోవడం, పదాల్ని చదువుకోవడం
అజ్ఞాత సూర్యుడి పేరుని అచ్చుల్లో, ఆప్యాయంగా తడమడం
నిన్నటి త్యాగాల విప్లవానుబంధం (అదే; పు. 22)
మాకు దోపిడీ కొత్తకాదు, ద్రోహమూ కొత్తకాదు” అన్నాడు. ‘ద్వేషించాల్సిన దాన్ని ద్వేషించకపోతే, ప్రేమించాల్సిన దాన్ని ప్రేమించాల్సినంతగా ప్రేమించలేవు’ అనే మావో మాటలు గుర్తుకొస్తయి.

“తనకు తానై పాడె కట్టుకునే వాడు
ఎవడైతేనేం?!
చరిత్ర ఏదైతేనేం!
చీపురు పుల్లకింద లెక్క
ఆశల ఆశయాల పల్లకీని
అగాధంలోకి తోసేవాడు
ఎవడైతేనేం?!
ఎంతకాలం మోస్తేనేం
ద్రోహికిందే లెక్క
చేవ చచ్చిన లెక్క
చేవ చచ్చిన వాడు
చస్తేనేం! బతికితేనేం (పునరంకితం; 2004, పు. 22)
సమాధైన వాడికిందే లెక్క” అని స్పష్టంచేసిండు సత్యం. ప్రజలతో కలిసి నడిచినంత కాలం నాయకులు మహోజ్వలంగా వెలుగుతరు. అదే ప్రజలకు దూరమైన నాడు ఏకాకి బృందగానంగా మారుతరు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అందుకే వేల ఏళ్లుగా పునరావతమవుతున్న ప్రశ్న. ఒకే ఒక ప్రశ్న. స్పార్టకస్ నుంచీ గోర్కీ దాకా. విశాఖ విద్యార్థుల నుంచీ నేటిదాకా. ఒకే ఒక్క ప్రశ్న. ‘నువు పోరాడే జనం వైపా? పాలకవర్గం వైపా? తేల్చుకో’ అని. సత్యం ఈ ప్రశ్నను సూటిగా ఎక్కుపెట్టిండు.

అతడొక కలగన్నడు. అది ఆకుపచ్చని కల. రక్త వసంతాలాడే దండకారణ్య కల. ఆ కలల దారిలో అక్షరాలే తోడయినై. నీడయినై. సామూహిక స్వప్నం కోసం విముక్తి దారిని ఎంచుకున్నడు. ‘జైలు ఆచరణ’లో…
“కథలు నన్ను కదనరంగంలోకి తీసుకపోతాయి
కవిత్వం నాకు కవాతు నేర్పిస్తుంది
‘డార్జిలింగ్ సూర్యుడా లాల్ సలామ్’ అంటూ
పుస్తకంలోని పుటల్లోంచి కాదు
నా గుండె లోతుల్లోంచి అనామధేయుడి గుండె లయ వినబడుతుంది
రాత్రిని కోల్పోయిన నన్ను
రాత్రిని ఆరుబయట అనుభూతి చెందే అవకాశాన్ని కోల్పోయిన నన్ను
‘శ్వేత రాత్రులు’ రాత్రిలో ముంచి తడిపేస్తాయి
తన పుటల్లో రాత్రిని నింపుకువచ్చి
నా కళ్లముందు పరిచి
రాత్రిపూట ఊళ్లు ఖాళీ అవుతున్న వైనాన్ని కళ్లకు కడుతుంది
‘ఊళ్లు ఖాళీచేయలేం కదా’ అంటూ (పునరంకితం; 2004, పు. 27)
సిధారెడ్డి స్వరం వినబడుతుంది’… అని రాసుకున్నడు.

సత్యానికి పాటంటే ప్రాణం. మాటంటే ప్రాణం. మాటల్ని పాటలుగా, మందుపాతరలుగా కూర్చడమంటే ప్రాణం. పాటే ప్రాణమైన మనిషి అతను. పాట కోసం వెతికిండు. కొండల్లో. కోనల్లో. అడివంచు దారుల్లో. అగాధాల లోయల్లో. పాటకోసం పిచ్చిగా పలవరించిండు. వాగుల్లో. వంకల్లో. జలపాతాల సవ్వడిలో. సంకెళ్ల సంగీతంలో. పాటై హోరెత్తిండు. వేనవేల గుండె లయల్లో. పాట కోసం తపించిండు. గాలికి ఊగే కొమ్మల్లో. రెమ్మల్లో. పక్షుల కిలకిలా రావాల్లో. జలపాత సంగీతమై. తొలకరి వానై పలకరించిండు. వసంత మేఘ గర్జనల్లో పులకరింత అది. పాటను ప్రశ్నగా మలిచిన సాహసం అది. ప్రశ్నల్ని సాయుధం చేసిండు. అందుకే…
“పాట లేనిదెక్కడ?
ఎండిన డొక్కలను, ఎదలోని మంటలను చూసినపుడు
లొట్ట చెంపలను, చింపిరి జుట్టులను చూసినపుడు
కడుపు కోసం కాయల్ని అమ్ముకునే కథలను చూసినపుడూ
ఇరానీ హోటల్లో, ట్యాంకుబండు నీడలో, చార్మినార్ చౌరస్తాలో
బతుకే బరువైన బాల్యాన్ని చూసినపుడు
నేను పాటనౌతాను (పునరంకితం; 2004, పు. 28)
నేను బీభత్స రణ సంగీతాన్నౌతాను” అని రాసుకున్నడు సత్యం. తను రాసినట్టుగానే బతికిండు. బతికిందే రాసిండు. డొక్కలెండిన బతుకుల్ని చూసి కన్నీళ్లు రాలినై. బుక్కెడు బువ్వకోసం కడుపున పుట్టిన పసికందుల్ని అమ్ముకుంటున్న దుర్భర దారిద్ర్యాన్ని చూసిండు. తండాల తండ్లాటను దగ్గరగా చూసిండు. అతని కనుపాపల్నిండా పాలింకిన పచ్చి బాలింతలు. గుక్కెడు పాలకోసం తల్లడిల్లే పసిపాపలు. గొంతెండి గుక్కపట్టి ఏడ్చే పసికందులు. అప్పుల బాధల్లో ఉరితాళ్లకు వేలాడే రైతన్నలు. భూమిని బువ్వపెట్టే కంచంగా మార్చినా, బుక్కెడు బువ్వ దొరకని రైతన్నలు. నెత్తురోడే పాదాల కూలి తల్లులు. పొక్కిలైన పల్లెలు. పడావుపడ్డ భూములు. అర్రాజు పాలైన పశువులు. ధ్వంసమైన పల్లె. తన చుట్టూ ఎంత దు:ఖం. ఎన్ని కన్నీళ్లు. ఈ బాధల విముక్తి కోసం వేకువను కలగన్నడు. ఆ వేకువ కోసం సాగిపోయిన అమరుల్ని కళ్లల్లో నింపుకున్నడు. కలంలో నింపుకున్నడు. ఊపిరిలో ఊపిరిగా బతికిండు సత్యం.

కవిత్వం అతనికో చూపునిచ్చింది. వెలుగు దారిలో నడిపించింది. వేనవేల స్వప్నాల్ని నింపింది. వసంత గీతాల్ని రాజేసింది. ఎగుడు దిగుళ్లను చదును చేసే నాగలైంది. కలుపు మొక్కల్ని పెరికే కొడవలైంది. విషపు మొక్కల్ని నరికే గొడ్డలైంది. చీకట్లో దారిచూపే మిణుగురుల వెలుగైంది. దిక్సూచిలా నిలిచింది. అందుకే ‘కవిత్వం నా ఆయువుపట్టు’ అని రాసుకున్నడు.
“నన్ను సాయుధం చేసిన సంఘర్షణే
సమాలోచనకు కవిత్వాన్ని ఆసరానిచ్చింది
నేను కవిత రాయడం కోసం
కవిత్వంతో యుద్ధంచేస్తాను
నేను యుద్ధ దృశ్యాల్ని కవిత్వీకరించడం కోసం
కవిత్వంతో యుద్ధం చేస్తాను
కవిత్వం నాపై నన్నే యుద్ధానికి పురిగొల్పుతుంది” అన్నాడు.
“నన్ను నిరంతరం నిర్జీవమై పోకుండా
నిలబెడ్తూ నిలదీస్తున్న (పునరంకితం; 2004, పు. 35)
కవిత్వానికి నా జోహార్లు” అన్నాడు. అట్లా సాహిత్యం ఊపిరిగా మారింది. అదొక అవయవమైంది. ఆయుధమైంది. కవిత్వాన్ని ఆలంబనగా చేసుకొని ఫార్మేషన్ లో పడిపోకుండా నడిచిండు. కలల కౌముదిలా. తరాలపల్లి ఎంకటమ్మ కొడుకులా.

1996 ఆగస్టులో బెయిల్ వచ్చింది. విడుదలయ్యాక జనంలో కలిసిండు. మళ్లీ జనంలోకే. జంగ్ లోకే. సత్యం మళ్లీ వెళ్లాడు. ‘తల్లీ! నీ నిరీక్షణ వృథా కాదు!!’ అని ఆ అమ్మకు మాటిచ్చినట్టుగానే. బయల్దేరిండు. నీళ్లల్లో చేపలా. అడవిలోకి. ఆదివాసీల్లోకి. గిరిజనం గుండెల్లోకి. తొలకరై. పారే ఏరై. నదీ ప్రవాహమై. అక్షరాలను తూటాలుగా పోచ్ లో నింపుకొని. కవిత్వమై సాగిపోయిండు. యుద్ధరంగానికి. ఈస్ట్ డివిజన్ లో దళకమాండర్ గా బాధ్యతలు చేపట్టిండు. మళ్లీ మునుపటి ఉత్సాహమే. మునుపటి తెగువే. వెన్నెల రాత్రుల్లో రేరేలా పాటలైండు.

విప్లవకారుల నాయకత్వంలో (18 ఫిబ్రవరి, 2000) దారకొండ పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. ఈ దాడికి సత్యనారాయణ నాయకత్వం వహించిండు. వందలాది మంది ఆదివాసీలు పాల్గొన్నరు. తెల్లవారు జామున జరిగిన ఆ దాడిలో ఇద్దరు విప్లవకారులు అమరులైన్రు. ఒకరు యలవర్తి నవీన్ బాబు. మరొకరు సత్యనారాయణ. పోలీసులు నవీన్ బాబును ‘గుర్తుతెలియని నక్సలైట్’గా ప్రకటించిన్రు. ఆదివాసీలు సత్యనారాయణ మృతదేహాన్ని అడవిలోకి తీసుకెళ్లి అంతిమ వీడ్కోలిచ్చిన్రు.

విరసం 2004లో సత్యం రచనల్ని (కవిత్వం, కథ, విమర్శ) ‘పునరంకితం’ పేరుతో పుస్తకం ప్రచురించింది. ఇవి సత్యం గుండె లయలు. వ్యక్తీకరణలు. వీటినిండా ప్రేమే. పోరాటమే. త్యాగాల రాగాలే. ప్రజలపై ప్రేమ. ప్రత్యామ్నాయ రాజకీయాలంటే ప్రేమ. విముక్తి పోరు దారంటే ప్రేమ. అతడు జీవితాన్నీ, పోరాటాన్నీ ఒక్కటిగా చేసుకున్న ఆచరణశీలి. సృజనశీలి. ఒక్కమాటలో అతడో యుద్ధకవి.

ఎక్కడి మందమర్రి. ఎక్కడి దారకొండ. తాను నడిచిన దారంతా విప్లవ బీజాలు వెదజల్లిన యుద్ధకవి సత్యం. వీవీ రాసినట్టు…”ఈ రచనలకింత శక్తి ఎక్కణ్నించి వచ్చింది- అని ఆలోచిస్తే… అది సత్యానికున్న శక్తి అనిపించింది. ప్రపంచంలో నిజంగానే సత్యానికన్న మించిన సౌందర్యం ఏమైనా ఉంటుందా? జీవితం నుంచి, పోరాటం నుంచి, ప్రాణాలర్పించి ఆవిష్కరిస్తున్న సత్యం.” అట్లా సత్యం ఎప్పటికీ ఉంటాడు. మందమర్రి నేలన వికసించిన ఎర్రెర్ర మోదుగుపూల దారుల్లో. మన్నెం కొండల్లో. ఆదివాసీల గుండెల్లో. వెన్నెల రాత్రుల్లో హోరెత్తే రేరేలా పాటల్లో. సత్యం సమర రంగ రణన్నినాదమవుతడు.

‘‘అమరత్వం రమణీయమైంది
అది కాలాన్ని కౌగిలించుకొని
మరో ప్రపంచాన్ని వాగ్దానం చేస్తుంది’’

లాల్ సలామ్… కామ్రేడ్ సత్యనారాయణ.

( ‘సత్యనారాయణ కథల పరిచయం’ వచ్చే సంచికలో…)

*

(నవీన్ బాబుది గుంటూరు జిల్లా, రేపల్లె మండలం, గుడ్డికాయలంక గ్రామం. మధ్యతరగతి రైతు కుటుంబం. తల్లి సత్యవతి. తండ్రి రాంమోహనరావు. నవీన్ హైదరాబాద్ లోని బబూ జగ్జీవన్ రామ్ కాలేజీలో ఇంటర్మీడియెట్, బీఎస్సీ చదివాడు. తర్వాత M.A(Sociology) చదవడానికి మీరట్ యూనివర్సీటీకి వెళ్లాడు. కొద్దిరోజుల్లోనే ఢిల్లీ వచ్చాడు. J.N.U. యూలోని C.S.S.S.(Centre for the Study of Social Systems, School of Social Sciences)లో M.Aలో చేరాడు. U.G.C.- J.R.F సాధించాడు. ప్రొఫెసర్ యోగేంద్ర సింగ్ పర్యవేక్షణలో ‘వర్ణం నుండి కులం దాకా : భారత సామాజిక వ్యవస్థలో కులం – ఒక రాజకీయ ఆర్థిక విశ్లేషణ’ (From Varna to Jati : Transformation from Pastoral to Agrarian Social Formation) అనే అంశంపై పరిశోధన చేశాడు. 1989లో M.Phil పూర్తయింది. Sociologyలో Ph.D.కోసం యోగేంద్ర సింగ్ వద్దనే రిజిస్టర్ చేసుకున్నాడు. అప్పటికే నవీన్ ప్రత్యామ్నాయ రాజకీయాల్లో నిమగ్నమయ్యాడు. ఎక్కువ సమయం కేటాయించలేకపోవడం వల్ల పరిశోధనను మధ్యలోనే వదిలేశాడు. నవీన్ మొదట్లో ఎస్.ఎఫ్.ఐలో ఉన్నాడు. తర్వాత వాళ్ల రాజకీయాలతో విబేధించి బయటికి వచ్చాడు. తర్వాత ఢిల్లీలోనే ‘ప్రగతి సాహితి’ అనే ప్రగతిశీల తెలుగు సాహిత్య, సాంస్కతిక సంస్థను పునరుద్ధరించాడు. 1986లో శామ్యూల్ అసిర్ రాజ్, హరికుమార్ లతో కలిసి ‘స్టూడెంట్స్ ఫోరమ్’ స్థాపించాడు. రెండేళ్లలో 1988లో ‘ఢిల్లీ రాడికల్ విద్యార్థి సంఘం’ (డి.ఆర్.ఎస్.ఓ.)లో చేరాడు.)

ముకుందాపురం, నల్లగొండ జిల్లా. క‌వి, రచయిత, ప‌రిశోధ‌కుడు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సాక్షి దిన‌ప‌త్రిక‌లో ఎనిమిదేళ్లు జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేశాడు. 'ఓయూ సాహిత్య వేదిక' వ్య‌వ‌స్థాప‌క స‌భ్యుడు, మొదటి కన్వీనర్. ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి 'విప్ల‌వ క‌విత్వంలో వ‌స్తురూప వైవిధ్యం'పై ప‌రిశోధ‌న (పిఎచ్. డి.) చేశాడు. రచనలు : 1. తూర్పార, 2. ఏరువాక (సాహిత్య విమర్శ). 'కొలిమి' వెబ్ మేగజీన్ ఎడిటోరియల్ లో పనిచేస్తున్నాడు.

One thought on “అమర సత్యం ‘పునరంకితం’

  1. నాకు తెలిసిన నవీన్ లో మరో కోణముంది. జేేఎన్‌యూ రీసెర్చర్ గా ఉంటూ తన కాలం పిలుపును మన్నించి నేరుగా విప్లవోద్యమంలో దూకినవాడు. మహానగరాలనుంచి మహారణ్యాల వరకు జంగ్ పత్రిక పనిలో భాగంగా అన్ని ఉద్యమ ప్రాంతాల్లో కలదిరిగనవాడు. నల్లమలలో పార్టీ తరపున ఏపీ రాష్ట్రస్థాయి స్కోప్ క్లాసులకు ప్రతినిధిగా హాజరై పట్టుబట్టి నాచేత ఎంగెల్స్ డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్ పుస్తకంలోనే ఒక మిలటరీ పరమైన వ్యాసాన్ని క్లాసుల మధ్య విరామ సమయంలో అనువాదం చేయించి 1997 జూలై అగస్టు జంగ్ పత్రికలో ప్రచురించినవాడు. ప్రతి కార్యకర్తకు అర్థమయ్యేలా జంగ్ పత్రికను అత్యంత సరళంగా నిర్వహించిన కీలక బాధ్యతల్లో పనిచేసినవాడు. గెరిల్లాలకు చైతన్యం మాత్రమే పనిచేయదు, శారీరక బలం లేకుంటే ప్రత్యక్ష యుద్ధంలో పోరాడి నిలబడటం సాధ్యం కాదని, బూర్జువా మిలటరీ సైన్స్ సైనికుల శారీరక పాటవంపై నెలకొల్పిన సూత్రాలు గెరిల్లాలకు కూడ వర్తిస్తాయని, బూర్జువా మిలటరీ అని కొట్టిపారేయడం తగదని సోదాహరణ పూర్వకంగా క్యాంపులో అందరికీ వివరించినవాడు.. నల్లమల అడవిలో అనువాదం సమస్యలపై అయిదారుమంది మద్య జరిగిన చర్చలో పాల్గొని తన అనుభవాలను పంచుకున్నవాడు. ఫాస్ట్ రన్ లో ఆయాసం ఎక్కువగా వస్తోందంటే శరీర ఆరోగ్యంలో ఏదో లోపముందని, టెస్టులు చేయించుకోవాలని ఊపిరి వేగాన్ని కొలిచే మీటర్ ద్వారా నిరూపించి చూపినవాడు… అమరుడు నవీన్ లో ఎన్ని కోణాలున్నా.యని చెప్పాలి. నాకు తెలిసిన నవీన్ బయటి ప్రపంచానికి తెలీకపోవడం దురదృష్టకరం.

Leave a Reply