అభద్రతలో బాల్యం – ఒక ప్రమాద హెచ్చరిక

“ఒక ఆరేళ్ల పిల్ల ఇంకో తొమ్మిది నెల్ల పిల్లోన్ని సంకలో ఎత్తుకొని రోడ్డు దాటబోతూ ట్రాక్టర్ హార్న్ విని ఉలిక్కిపడి వెనక్కి వెళ్ళింది.

ఒకామె నెత్తిమీద పలుగూ పార పెట్టుకొని సంకలో ఒక పిల్లోన్ని చేతిలో ఇంకో పిల్లోన్ని తీసుకొని నడిజామున మట్టిపని నుంచి ఇంటికి వస్తూ ఉంది. సంకలో పిల్లోడు నిద్రపోతూ తన చేతిలో వేలాడుతూ ఉన్నాడు.

ఇద్దరు పిల్లోల్లు ట్రాన్స్ఫార్మర్ దగ్గరలో బచ్చాలాట ఆదుకుంటా ఉన్నారు.

జాషువా మనవడు వీదిలో పోతున్న కుక్కల్ని రాళ్లతో కొడుతున్నాడు.పిల్లలందరూ అపాయపు అంచునే కనిపించేరు.” – ఇండ్ల చంద్రశేఖర్ రాసిన “కోటమామ కూతురు” కథలోని దృశ్యమిది.

దేశంలోని అనేకానేక దళిత వాడల్లో, బస్తీల్లో అతి సాధారణంగా కనిపించే సన్నివేశాలు ఇవి. అక్కడ బతికే జనాలకు వీటిని మార్చుకునే శక్తి లేదు – మార్చాల్సిన యంత్రాంగానికి ఆసక్తి ఉండదు.

ఏ మురుగు కాలవలోనో, బోరుబావి గుంటలోనో పడి పసిపిల్లలు ప్రాణాలు వదిలినప్పుడో, పొత్తిళ్ళలో బిడ్డను వీధి కుక్కలు ఎత్తుకు పోయినప్పుడో బయటి ప్రపంచానికి వార్తలవుతాయి. ఒక్క క్షణం నిట్టూర్చి అందరూ మరిచిపోతారు. అవే పరిస్థితుల్లో పుట్టిపెరిగి, వెలుపలి ప్రపంచంలో అడుగు పెట్టడానికి పోరాటం చేసిన వాళ్ళను తన సొంత మనుషుల దైన్యం కలత పెడుతుంది. దీన్ని మార్చాలనే తపన వేధిస్తుంది. ఈ కథను పాఠకులకు వినిపించే పాత్ర అలాంటి ఒక దళిత విద్యావంతుడిది.

ఒకప్పుడు అతడు కూడా అదే పరిస్థితుల్లో జీవించి ఉంటాడు. దాన్నంతటినీ మామూలు విషయంగానే చూసి ఉంటాడు. ఇప్పుడు అతడొక కాలేజ్ విద్యార్థి. చదువు అతడికి కొత్త దృష్టిని ఇచ్చింది. ఆ కళ్ళతో తన పల్లెను చూసినప్పుడు అక్కడి మనుషులు ఎంత ప్రమాదాల్లో బతుకుతున్నారో స్పష్టమైంది. దాన్ని సమూలంగా మార్చే మార్గం ఏమిటో అతడికీ తెలియదు. కనీసం తన వాళ్లకైనా ఒక హెచ్చరిక చెయ్యాలనే తపన అతడిది.

వాడలో ఎటు చూసినా పిల్లలందరూ ప్రాణాలకు భరోసా లేని పరిస్థితుల్లోనే బతుకుతున్నారు. రోగాలో, వాహనాలో, జంతువులో… ఏ కారణమైనా చాలు వాళ్ళ ప్రాణాలు తియ్యటానికి. ఇవన్నీ తరచుగా ఎదురయ్యే ప్రమాదాలే. కానీ ఊహకందని మరణం నాగమణి కొడుకుది – పాలుతాపే తల్లి రొమ్ము బరువుకు ఊపిరాడక చనిపోవటం!

ఈ సంఘటన వెనక ఎన్ని కారణాలున్నాయో ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ పోతుంది కథ. కోటయ్య కూతురు నాగమణికి పద్నాలుగేళ్ల వయసులోనే పెళ్లి చేశారు. కట్నం లేకుండా పెళ్లి చేసుకునే మాణిక్యరావు
దొరకటమే మహాభాగ్యం ఆ తల్లిదండ్రులకు. పదహారేళ్ల వయసుకే ఆమె తల్లయింది. పసితనం వీడకముందే వచ్చిన మాతృత్వం ఆమె మనసులో కొడుకుపై పట్టరాని ప్రేమనైతే నింపింది కానీ ఇంటిపని, పిల్లవాడి సంరక్షణా కలిపి నిర్వహించటానికీ కావలసిన శక్తి ఆమె లేత శరీరానికి లేకపోయింది. బిడ్డ ఆకలి తీర్చటానికి నిద్రలేని రాత్రులు గడుపుతున్న నాగమణి ఒకరాత్రి ఆదమరిచి నిద్ర పోయింది. పాలతో నిండి బరువెక్కిన ఆమె రొమ్ములు పిల్లవాడి ముఖానికి ఒత్తుకుపోయాయి.వాడి బొజ్జ నిండా పాలకోసమని మంచి తిండి తింటూ పాలతో నింపుకున్న తన రొమ్ములే వాడి ప్రాణాలు తియ్యగలవని ఆమెకూ తెలియదు.

బిడ్డ సంరక్షణకు తల్లి బాధ్యురాలవటం, అందులో ఏ లోపం జరిగినా ఆమెనే తప్పు పట్టడం కుటుంబాలకు, సమాజానికి అలవాటైన పద్ధతి. ఇది కుల మతాలకు అతీతమైన ఆనవాయితీ. సహజంగానే నాగమణి కూడా ఒక నేరస్తురాలైంది. భర్త చేత దెబ్బలు తిని, తనను తాను నిందించుకున్నది.

పిల్లకు అయిదో నెల రాంగనే తెచ్చి పుట్టింట్లో ఒదిలి చేతులు దులుపుకుని పోయిన మొగుడు, కాన్పు ఖర్చులకు అప్పుల పాలై, కూలికి పోనిదే పూట గడవని తల్లిదండ్రులు, ఇంటి పనిలో సహాయం లేని పరిస్థితిలో ఆ లేత బాలింత ఎంత అలిసిపోతోందో ఎవరికి తెలుస్తుంది?

“…పొద్దున్నే లేసి ఇల్లూడ్సి, బాసిన్లు తోమి, గుడ్లుతుక్కొని, ఒండుకుని, పిల్లోడికి నీళ్ళు పోసి, గుడ్డలేసి, అట్ట కన్నుమూస్తే పిల్లాడికి ఏమయ్యిద్దోనని కనిపెట్టుకుని, రాత్రన్న నిద్రబోదామంటే… వాడు పడుకున్నాకే ఈ పిల్ల కూటికి లేవాలయ్యే… అన్ని పనులూ చేసుకుని పడుకునేలికి పిల్లోడు నిద్ర లేస్తాడయ్యే”…అని నాగమణి వాళ్ళ అమ్మమ్మ ఎంత వాపోయినా వినేవాళ్లు మాత్రం ఎవరు? నాగమణి ఇంటిముందు చేరిన ఆడవాళ్ళు ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయో చెప్పుకున్నారు. మగవాళ్ళు మాత్రం ఆ తల్లి “మొద్దు నిద్ర” ను తప్పు పట్టారు.

ఈ కథంతా చెప్పిన కథకుడు, కోటమామ కూతురి దుస్థితికి ఎవరిని అడగాలో, ఏం చెయ్యాలో తోచక మూగబోయి నిలిచాడు.

ఒంగోలు జిల్లా మాండలికంలో ఇండ్ల చంద్రశేఖర్ చెప్పిన ఈ కథ ఎందరో పసి పాపల అకాల మరణాల, తల్లుల గుండె కోతల విషాద గాథ. వ్యవస్థల దుర్మార్గాలకు, సమాజపు బాధ్యతా రాహిత్యానికి, కుటుంబాల నిర్లక్ష్యానికి ఫలితంగా సాగుతున్న ముగింపు తెలియని చరిత్ర.

2019, ఏప్రిల్ 14 న సాక్షి ఫన్ డే లో ప్రచురితమైన ఈ కథ ఇటీవల అన్వీక్షికి పబ్లిషర్స్ తరపున వేంపల్లె షరీఫ్ సంపాదకత్వంలో వెలువడిన “యువ ” కథా సంపుటిలో కూడా దొరుకుతుంది.

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

Leave a Reply