అబ్బో కరోనా

‘స్వామీ’

‘స్వామీ ఈశ్వరా’; అబ్బ ఈయన ధ్యాన యోగంల దుమ్మువడ! ఏప్పుడు ఐతే ధ్యానం, లేకుంటే నాట్యం! అది శృంగారమైనా ఆగ్రహమైనా, నాట్యం నాట్యం!’

‘స్…స్..స్వామీ.. పరమేశ్వరా’

‘దేవీ పిలిచితివా?’ అరమోడ్పు కనులను మెల్లగా తెరుస్తూ,

‘ఇప్పుడైతే పిలువలేదు, అరిచిన’

‘ఎప్పుడైనా పిలిచినవా అసలు! ఏప్పుడూ అరుచుడే గద!’

‘గరళ కంఠా, ఎప్పుడూ అరమోడ్పు కనులతో ధ్యానయోగ నిద్రలో కులికే, క.. క్కాదు.. కాదు, కునికే మీకు పిలుపులెప్పడూ వినపడవు, పిలిచి పిలిచి, అలిసి సొలిసి ఆక్రందనలైతేనే గద, మీకు వినిపించి ఉలిక్కిపడి మేల్కొనేది!’

‘హుహ్హు!ఇంతకూ, ఎందుకు పిలిచి, ఆక్రందించితివి ఉమా?’ విశ్వేశ్వరుడు.

‘నా కడుపు మండుతుంటే, మీరు చిద్విలాసిస్తూ, కారణమడుగుచున్నరు!’

‘ఏమీ కడుపుమండుతుందా? ఈ వాళ ఏమి తింటివి?!’

‘అయ్యో , మంటంటే ఆ మంట కాదయ్యా బోలా శంకరా?’

‘నీవునూ నన్ను బోలా శంకరుడని సంబోధించితివా’

‘అంతే మరి,’

‘ఎందుకు ఏమైంది చండీ ఈవాళ! మస్తు ఆగ్రహంగా ఉంటివి?’

‘ఆగ్రహం కాదు ఫాల లోచనా, ఆవేదన!

అదే కడుపు కోత!’

‘హరి హరీ! అపుడు మంట అంటివి,ఇపుడు కోత అనుచుంటివి. ఇంతకీ ఏమిటి నీ వెత?!’

‘మొన్న వినాయక చవితి మరుసటి రోజునుండి, తుమ్ములతో మొదలైంది. ఏదో తుమ్మితే తుమ్మనీ, తుమ్మితే ఊడిపోయే సాధారణ ముక్కు కాదు గద, ఎంతటి దొడ్డు దూలాలైనా ఎత్తగలిగే ధృఢమైన, దీర్ఘ మైన ఊడలాగా వేలాడే నాసికేగద, సర్దుకుంటుందిలే అనుకుంటిని…’

‘దేవీ, ఏమిటీ ఉత్ఖంఠ! తుమ్మిందెవరు?

మన బొజ్జోడా? విషయం త్వరగా వివరించి చా.. కక్. క్కాద్కాదు, వివరించవే అర్ధనారీ’. ఆందోళన శురువవుతుండగా, ఆత్రంగా.

‘ఔను. మన బొజ్జోడికి కాదు, బుజ్జోడికే. అలా రోజులగడుస్తుంటే, తుమ్ములు దగ్గులై, ఆ రెండింటికి తోడు తలనొప్పి తోడై ఐదో రోజుకు జ్వరం పడి, తల్లడిల్లుచుండగా, అదేమీ పట్టకుండా పరమత ఉన్మాదులకు సవాలుగా, ఉన్మాదులకున్మాదంతోనే ప్రత్యుత్తర మివ్వాలనే, భక్తోన్మత్తులై, డోలు వాయిద్యాల చిందులేస్తూ, ఊరేగించి, జబ్బున పడ్డ బొజ్జోడిని, ధన్వంతరి వద్దకైనా తీసికెళ్ళి చూపించి, వైద్యమిప్పించక పోగా నాకైనా అప్పగించక, నా సవతి ఆ గంగ ఒడిలో పడేసిరి!’

‘భక్తోన్మత్తులై కాదు గిరిజా, ద్వేశోన్మత్తులై. ఇదంతా ఆ బాలగంగాధర తిలక్ అనే దేశ భక్తుడు, ఆనాడు తెల్ల జాత్యహంకార వలస పాలకులకు వ్యతిరేకంగా దేశీయుల్లో జాతీయత రగిల్చాలనే జాతోన్మత్తతతో, ఇండ్లలో బుద్ధిగా కొలువై, పూజలందుకునే మన పసిబాలుణ్ణి బజారుకీడ్చి,’గణపతీ నవరాత్రుల’నే బడాయి భజనల కోలాహలంతో ఉత్సవాలనే పేరుతో, మత్సరాన్నెక్కించిన పాప ఫలితమిది.

తిలక్ ఎక్కించిన ఆ తిక్క, ఇంతింతై వటుడింతై అన్నట్లు మన హిమశిఖర మంతై, విచక్షణ నశించి, ఈ పాండమిక్ భూతం భూగోళాన్ని కబళించిన వేళ కూడా ఆగక పోయిరి, అల్లరి మూర్ఖులు, ప్రభుత్వాలెన్ని జాగ్రత్తలూ, హెచ్ఛరింపులూ చేసినా, లెఖ్ఖించక తమ దశాబ్దాల మూఢ సాంప్రదాయాన్నే కొనసాగించిరి.’

‘అబ్బో ! ఎంత నంగనాచి మాటలు!

‘అదేం? నావి, న్..న్నావి, నంగనాచి మాటలా? హద్దులు దాటి మాట్లాడు చుంటివి గౌరీ! నీకిది తగదు.’

‘కడుపు కోతయ్యా కడుపుకోత! వాడు నా కడుపున పుట్టిన కొడుకు.’

‘అంతొద్దు. వాడిని నీవు కడుపున నవ మాసాలు మోసి కనలేదు. ‘నీ కాపలా కోసం కృతిమంగా తయారు చేసి, నీ మహిమను రంగరించి, ప్రాణం పోసితివి.’

‘ఓహో! ఊ.. ఊ.. అట్లందువా?ఇది పెంచిన ప్రేమకు సంబంధించిన అంశం. కన్న ప్రేమకు, పెంచిన ప్రేమ ఏ మాత్రం తీసిపోదు.

ఐనా, మీ మగ జాతి కనేది కాదు, లాలించి పెంచేదీ కాదు, మీకెట్ల అర్థమౌనులే!’

‘ఇంతకూ నన్ను నంగనాచి వంటివి. అదెట్లో చెప్పనే లేదు.’

‘ఔనౌను! నేనునూ మరిచితిని! శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనిరి, మీ భక్తులు. అన్నీ మీ ఆజ్ఞతోనే, నాడు తిలక్ నరుడైనా, మీరన్న ఇప్పటి ద్వేశభక్తులైనా, చేసేవన్నీ మీ ఆజ్ఞ చేతనే గద!’

‘అది ఆ నరుల్లో కొందరి అతి తెలివి వెధవల వాదన! మంచో చెడో, చేసేదంతా వాళ్ళే! చేసిన చెడునుండి తప్పించుకోడానికి, అంతా నామీద నూకే నక్కజిత్తుల మాటలవి!

ఈ కొందరి స్వార్థ, అత్యాశ ఆధిపత్య పాలక వర్గాల మ్లేచ్ఛులు, అభివృద్ది పేర ప్రకృతి మాతను, విచక్షణారహితంగా నాశనం చేసిన ఫలితమే ఆ పాండమిక్!’

‘ఇంతకూ పాండమిక్, పాండమిక్ అనుచుంటిరి. అదేమి రామేశ్వరా?’

‘అదిగో, అట్లా సంబోధించకు. నేను పరమేశ్వరుడనంతే.’

‘సరే, సర్వేశ్వరా, ఇంతకూ ఆ పాండమిక్ ఏందో చెప్పు ఉమాపతీ.’

‘అది కరోనా అనే కొత్త మానవ తప్పిద ఫలిత అంటువ్యాధి. ఇపుడది భూగోళమంతా వ్యాపించి మానవ జాతిని అతలాకుతలం చేస్తున్నది. బహుశా మన బాల గణనాథుడికి కూడా, ఈ నవరాత్రి ఉన్మాద ఉత్సవాల చిందులాటలో ఆ ధూర్తులే అంటించి ఉంటరు. దాని ఫలితమే మన పెద్దోడికీ విపత్తు.’

‘అటులనా! అయ్యో హరహర మహా దేవా! మరి మన బొజ్జోడి గతి ఏమగును.

వ్యాధినుండి బయటపడే మార్గమునేదైనా మీ ఫాల భాగానున్నజ్ఞాన నేత్రంచే అన్వేషించండి నాథా’

‘మన చేతల్లేమీ లేదు. మళ్ళీ ఆ మానవ ధన్వంతురులనే ఆశ్రయించాలె.’

‘ఐతే పదండి భూ లోకానికి’

‘అబ్బో అక్కడ కరోనా! నేను రాను’

పుట్టింది మహబూబ్‌నగర్ నగర్ జిల్లా షాద్‌నగర్. కవి, రచయిత, విరసం సభ్యుడు. పూర్వపు వరంగల్ జిల్లాలో  ముప్ఫై ఏళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పదవీ వీరమణ చేసి హన్మకొండలో స్థిరపడ్డారు.  "అసలుదారి" కథా సంపుటి ప్రచురించారు. మాజీ ఐపీఎస్ అధికారి విభూతి నారాయణ్ ఆంగ్లంలో రాసిన "నగరంలో కర్ఫ్యూ" అనే నవలికను తెలుగులో అనువాదం చేశారు. 'న్యాయ విచారణ', 'వందే మాతరం' అనే మరో రెండు కథల్ని తెలుగు చేశారు. వివిధ పత్రికల్లో నవలలు, కవితా సంకలనాల సమీక్షలు, సామాజిక రాజకీయ వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

One thought on “అబ్బో కరోనా

  1. నమస్తే సర్!
    కథ బాగుంది. వ్యంగ్యం వ్రాసేవారు చాలా తక్కువ ఈ కాలంలో….!

    మీ చురకలు చాలా అర్థవంతంగా, ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.
    మరిన్ని మీ రచనల కోసం ఎదురుచూస్తాను.

Leave a Reply