అబద్ధం

ఏళ్లకు ఏళ్లుగా వీధుల్లో పడి నెత్తురు తాగి
కడుపు నింపుకున్న నారింజరంగు మబ్బులు
మళ్లీ ఆకాశం నుండి కింద పడి
ముంచెత్తడానికి సిద్ధంగా వున్నాయి

ఎక్కడ చూసినా అబద్ధాల ఆయుధ ఫేక్టరీలు లేస్తున్నప్పుడు
కత్తులు లోహ రూపంలో ఉండవు

గవర్నమెంటు కుళాయిలు తిప్పితే నీళ్లు కాక
పుకార్లు ధారగా పడుతుంటే
కాళ్ల ముందు సత్యం
ఓ అనాధ బిడ్డలా బిగ్గరగా రోదిస్తూ ఉన్నది
అబద్ధం రాబందు రెక్కల చప్పుడులా
దేవుళ్ల పేర్లు వల్లె వేస్తూ
చెవుల్లో హోరెత్తిస్తూ నిద్రల్ని కొల్లగొడుతున్నది

చరిత్ర రోజుకోరకంగా అచారిత్రికమై పోయి
వీధి కాలువలు కళకళలాడుతున్నాయి
వాస్తవాలు కనుమరుగయ్యాక
అబద్ద్ధాన్ని మించిన చరిత్ర లేదు
దాన్ని మించిన ఆదర్శమూ లేదు
మతం నుండి రాజ్యం వరకు
అన్నీ అబద్ధాల హోమగుండాలే
వొళ్లంతా నేతులు పూసుకొని
పొటాపొటీగా అందులోకి దూకేస్తున్నారు
పెరిగిన ధరల్తో మోటార్ సైకిల్లో పెట్రోల్ కొట్టినంత తేలిగ్గా
మనిషి శ్వాస కోశాల్లోకి పుకార్లు కుక్కుతున్నారు
వెన్నులో కత్తిపోట్లు దిగిన బాధితుడే
నిందితుడిగా నమోదవుతున్నాడు
రక్తాల్లో ముంచి తీసిన చేతులే
సింహాసనాల్ని ప్రేమగా నిమురుతున్నాయి

దుర్మార్గాలు వెంటాడుతున్న రైఫిళ్లల్లా భయపెడుతుంటే హడావిడిగా పోతుంటానా
దారి పొడుగునా చెత్త కుండీల్లో పారేయబడ్డ శిరస్సులు!
చకచకా కదిలిపోతున్న మొండేల్లాంటి మనుషులతో ట్రాఫిక్కులు జాం అయిపోతున్నాయి.
దున్నపోతు చర్మాల్ని ఫాషనబుల్ గా తొడుక్కున్న పౌరులంతా
మెడల మీద మొబైళ్లు అతికించుకొని
లోహపు విగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు
రక్తమాంసాలున్న గుండెల్ని పెరికేసుకొని
దేహాల్లోపల ఇనుప కంచెలు పెంచుకుంటున్నారు
పాలబుగ్గల మీద కూడా యజ్ఞయాగాదుల నల్లటి మసి!
ముట్టుకుంటే ఒక్కొక్కడూ
సగం కాలిన కట్టెలా గుచ్చుకుంటున్నాడు
మార్చురీలో శవాల కాళ్లకి నంబర్ల కార్డులు కట్టినట్లు
ప్రతివాడి చూపుడు వేలికి
వోటర్ కార్డులు, నల్ల సిరా మచ్చలు!
ఏమిటో ఒకడి నోటికి మరొకడిని
ఆహార పదార్ధం చేస్తున్నంత కర్కశత్వం!!!

మనుషుల్ని ప్రేమించడం మానేసి
మట్టి మీద నెత్తుటి మోహం పెంచుకోవడం ఓ ఆదర్శం!
నీడలా వెంటాడుతున్నది ద్వేషం
ఒక్క క్షణం నడక ఆపితే
కసుక్కున మెడలో కత్తులు దింపుతున్నది
నాడీ మండలం ధ్వంసమైపోయి
మెదడులో పురాణాలు చీమల పుట్టల్లా లేచి
మతం తాచుపాముల్లా దూరిపోతున్నది

అబద్ధం ఈ దేశపు శ్వాస అవుతున్నది
ఇప్పుడు నాకు అబద్ధాల్ని మించిన శతృవుల్లేరు
ఏ కాలంలో అయినా సత్యం బతకాలంటే
అబద్ధాల్ని హత్య చేయాల్సిందే
కవిత్వం రాస్తున్న నేను అబద్ధాల హంతకుణ్ని
ఇప్పుడు

కవిత్వం
సామాజిక క్రిమి సంహారకం

"నెత్తురోడుతున్న పదచిత్రం", "కవిత్వంలో ఉన్నంతసేపూ...." అనే  రెండు కవితా సంపుటల వయసున్న కవి.  సామాజిక వ్యాఖ్యానం, యాత్రా కథనాల్లోనూ వేలు పెట్టే సాహసం చేస్తుంటాడు.

5 thoughts on “అబద్ధం

  1. నేటి కాషాయభారత భయంకర దృశ్యాన్ని ఆవిష్కరించారు. ధన్యవాదాలు అరణ్య కృష్ణ గారు.

  2. కవిత్వం
    సామాజిక క్రిమి సంహారం

    సూపర్ సర్…

  3. అద్భుతం గా వ్రాసారు..కాకుంటే ఇపుడు నారింజమే కాదు ఇంకా బోలెడు రంగుల వర్షాలు కురుస్తున్నాయి…జనాల్ని మత్తులో ముంచేస్తున్నయి పోటీపడి మరీను…

Leave a Reply