ఒకానొక వ్యక్తిగత అనుభవం అనేకానేక వ్యక్తిగత అనుభవాలను తట్టి లేపి, ఆ వయ్యక్తికత లోని సామాజికత వైపు దృష్టిని విస్తరిస్తుంది. అలాగే ఒకానొక సామాజిక ఘటన, పరిణామం వ్యక్తిగత అనుభవం కాకపోయినా సరే అటువంటి అనేక సామాజిక ఘటనలనూ పరిణామాలనూ గుర్తు తెచ్చి, వాటిలోని వయ్యక్తిక అనుభవం పాలుతో సమన్వయం కుదిర్చే అంశాలను చూపుతుంది. సమాజమూ వ్యక్తీ వేరు వేరు అనీ, సమాజానికీ వ్యక్తికీ దాటరాని అంతరం ఉందనీ అనేక సిద్ధాంతాలు ఉన్నమాట నిజమే గాని, రెంటికీ అటు తాత్విక దృష్టిలోనైనా ఇటు నిత్య జీవిత అనుభవంలోనైనా అవిభాజ్య, అవినాభావ సంబంధం కూడా ఉంది, ఉంటుంది. చాలా సందర్భాలలో మనం ఆ సంబంధం గురించి ఆలోచించం, ఆలోచించే వ్యవధి ఉండదు. కాని ఒక్కసారి ఆగి, ఆ సంబంధాన్ని తవ్వడం ప్రారంభిస్తే ఆశ్చర్యకరమైన పురావస్తువులెన్నో దొరుకుతాయి. ఆ సంబంధం ఎంత విశిష్టమైనదో అనుక్షణ స్ఫురణ కలుగుతుంది.
*
2025 ఏప్రిల్ 2 ఉదయం కడవెండిలో రావిచెట్టు నీడలో, దొడ్డి కొమరయ్య స్తూపం ముందర, బొడ్రాయి పక్కన మంచు పెట్టెలో దీర్ఘ నిద్రలో ఉన్న చెల్లి రేణుక మృతదేహాన్ని చూసినప్పుడు, నా మనసు యాబై ఏళ్ల వెనక్కి వెళ్లింది. ఆ రావిచెట్టు, బొడ్రాయి, పక్కన నాలుగైదు బండలు… యాబై ఏళ్ల కిందికీ ఇప్పటికీ అట్లాగే ఉన్నట్టున్నాయి! అవే అనుభవాలను అనుభవిస్తున్నట్టున్నాయి.
యాబై ఏళ్ల కింద, తొమ్మిదో తరగతి విద్యార్థిగా, ఒక ఔత్సాహిక సాంస్కృతిక కార్యకర్తగా నేను చూసినప్పటికి, దొడ్డి కొమరయ్య స్తూపం అప్పుడప్పుడే ఆవిష్కరణ జరిగినట్టుంది. ఆ బండల మీద శ్రీశ్రీ, పత్తిపాటి వెంకటేశ్వర్లు కూచుని ఉండగా, చుట్టూ మరొక ముప్పై నలబై మంది నిలబడి ఉండగా, దొడ్డి కొమరయ్య అన్న దొడ్డి మల్లయ్య అప్పటికి ముప్పై సంవత్సరాల కింద జరిగిన ఊరేగింపు గురించీ, గడిలోనుంచి తుపాకి కాల్పులు జరిగి తన తమ్ముడు కొమరయ్య పడిపోవడం గురించీ, తన తొడకు తగిలిన తూటా గురించీ చెపుతుంటే విన్న జ్ఞాపకం నిన్ననో మొన్ననో జరిగినట్టుంది.
అది 1974. బహుశా జూలై 4 కావచ్చు, లేదా ఆ తర్వాత కొద్ది రోజులకు కావచ్చు. కడవెండిలో ఏదో సభ. ఇప్పుడు పాత పత్రికల్లో వెతికితే ఆ సభ ఎక్కడా రిపోర్టు కూడా అయినట్టు లేదు. నాకు గుర్తున్న వక్తలు శ్రీశ్రీ, పత్తిపాటి వెంకటేశ్వర్లు. అప్పటికే సికింద్రాబాదు కుట్రకేసులో జైలులో ఉన్నారు గనుకనేమో వివి వక్తగా లేరు. శ్రీశ్రీ హనుమకొండకే వచ్చాడు. అప్పట్లో హనుమకొండ నుంచి సూర్యాపేట వెళ్లే బస్సులు ఒకటో రెండో మాత్రమే ఉండేవి. ఆ బస్సులో ఎక్కి అందరమూ సీతారాంపురం స్టేజి దగ్గర దిగాం. శ్రీశ్రీని ఊరికి తీసుకుపోవడానికి కడవెండి జనం చాలమందే సీతారాంపురం వచ్చారు. శ్రీశ్రీ కోసం ఎడ్ల బండి కూడా తీసుకువచ్చారు. ఆయన తాను ఎక్కననీ, పిల్లలను ఎక్కించమనీ అన్నాడు గాని మేం కూడా ఆయన పక్కనే నడిచాం. ఊరు చేరబోతుండగా అడ్డుగా వాగు. కృష్ణకు ఉపనది మూసీలో కలిసే బిక్కేరులో ఒక పాయ అది. సన్నగా పారుతున్నది. అప్పటికింకా వంతెన రాలేదు.
సభ సాయంకాలం గాని, మేం అక్కడికి మధ్యాహ్నానికి ముందే చేరాం. ఉపన్యాసాల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలలో ఆరోజుల్లో సుప్రసిద్ధుడైన పలస భిక్షం ఒగ్గు కథ. కానూరి వేంకటేశ్వర రావు దళం రాజకీయ వీథి భాగోతం. అరుణోదయ ప్రారంభానికి రెండు సంవత్సరాల ముందే, కానూరి వేంకటేశ్వర రావు హనుమకొండ కొమాళ్ల కుంట ఒడ్డున ఉన్న తన ఇంట్లో, ఇంటి పక్కన ఉన్న పెద్ద బావి ఇంజన్ గదిలో ఒక వీథి భాగోతం దళం తయారు చేశారు. అప్పటి ఉజ్వలమైన ఉత్సాహ వాతావరణంలో పద్దెనిమిది – ఇరవై ఏళ్ల యువకులతో ఆ దళం తయారయింది గాని వేంకటేశ్వర రావు గారికీ ఆ యువకులలో ఎక్కువమందికీ కుదరలేదు. అప్పుడిక ఆయన చిన్నపిల్లలయితే సులభం అనుకున్నట్టున్నారు, నా బోటి పన్నెండు పదమూడేళ్ల కుర్రవాళ్లను పోగేసి అదే వీథి భాగోతం శిక్షణ ఇచ్చారు. అట్లూరి రంగారావు గారి అబ్బాయి అనాసు, మాడిశెట్టి భూమయ్య గారి అబ్బాయి అజయ్, వెంకటరెడ్డి గారి మేనల్లుడు ప్రశాంత్, నేనూ మరి ఒకరిద్దరూ ఆ దళంలో సభ్యులం. హనుమకొండ, మానుకోట వంటి ఒకటి రెండు చోట్ల ప్రదర్శనలు ఇచ్చాక, ఈ కడవెండి సభ.
అప్పటికి ఇంకా పదమూడేళ్ల వాడినే గనుక కడవెండి గురించి పెద్దగా తెలియదు. అక్కడికి వెళ్లాక ఆ ఊరి జనం మాట్లాడే మాటలను బట్టి, శ్రీశ్రీకీ, పత్తిపాటికీ చెపుతున్న మాటలను బట్టి, దొడ్డి మల్లయ్య తాము చేసిన పోరాటాల గురించీ, తన తమ్ముడి గురించీ చెప్పిన మాటలను బట్టి నాకు అప్పటికి ఎంత అర్థమయిందో తెలియదు గాని హృదయం మీద కడవెండి ముద్ర బలంగా నిలిచిపోయింది.
కడవెండి ముద్ర అలా ఒకసారి హృదయం మీద పడడం మాత్రమే కాదు, ఆ మొదటి సారి నుంచి మొన్న చిట్టమ్మా రేణుకు జోహార్లు అర్పించేదాకా కడవెండి నా హృదయంలోకి యాబై ఏళ్లుగా తిరిగి తిరిగి వస్తూనే ఉంది. పిపీలకం వంటి ఒకానొక వ్యక్తిలో మహా సముద్రం వంటి సువిశాల సమాజం ఎట్లా ప్రతిఫలిస్తుందో, వ్యక్తికీ సమాజానికీ అంతస్సంబంధం ఏమిటో, అనంతమైన సామాజిక ధార అనేక మంది వ్యక్తుల ద్వారా, వ్యక్తులలో ఎలా నిరంతరాయంగా ప్రవహిస్తుందో తెలియజెపుతూనే ఉంది.
బహుశా ఆ కడవెండి ముద్రనో, లేక నా ఆరేడేళ్ల వయసులో మా ఊళ్లో “కమ్మినిస్టు వెంకటి” మాటలూ పాటలూ నినాదాలూ వేసిన ప్రభావమో, నా పదకొండో ఏట చేతికందిన విరసం ప్రచురణ ‘తెలంగాణ పోరాట పాటలు’ పుస్తకం ప్రభావమో, అప్పుడే చెరబండరాజు రాసిన ‘నిజంగానె నిజంగానె తెలంగాణ మాగాణం, అనాదిగా అరుణారుణ వీరులకిది జయగానం’ అనే పాట ప్రభావమో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమూ, ఆ పోరాట మహాజ్వాలలో తొలి నిప్పురవ్వలలో ఒకటైన ఆ ఊరూ ఈ యాబై ఏళ్లుగా నన్ను వదలలేదు. 1982లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద ‘సృజన’ ప్రత్యేక సంచిక వేయాలని, సాహితీ మిత్రులందరమూ తలా ఒక వ్యాసం రాయాలని అనుకున్నప్పుడు అప్పటికి సాయుధ పోరాట స్మృతులూ, అనుభవాలూ, జ్ఞాపకాలూ, పాఠాలూ, దాదాపు డజను పుస్తకాలు వచ్చాయి, అవన్నీ కలిపి ఒక సమీక్షా వ్యాసం రాశాను. ఆ వ్యాసానికి నేను ఎంచుకున్న కలం పేరు ‘కొమరయ్య’.
ఆ వ్యాసం కోసం ఆ డజను పుస్తకాలు మాత్రమే కాదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద అప్పటికి వచ్చిన సాహిత్యమంతా చదవవలసి వచ్చింది. అలా నాటి పోరాట గ్రామాలన్నీ, ఘటనలన్నీ, అనుభవాలన్నీ నా మనసులో నిలిచిపోయాయి, సుళ్లు తిరిగాయి, తిరుగుతూనే ఉన్నాయి. కడవెండి చుట్టుపట్ల తెలంగాణ సాయుధ పోరాటానికి ముందే ఒంటరి పోరాటాలూ, సామూహిక పోరాటాలూ చేసిన, కొమరయ్య హత్య తర్వాత సంఘటిత నిర్మాణ ఉద్యమం నడిపిన, ఎందరో యోధులను అందించిన ఎన్నో గ్రామాల గురించి తెలుసుకున్నాను. బందగీ కామారెడ్డిగూడెం, మొండ్రాయి, ధర్మాపురం, పాలకుర్తి, దేవరుప్పల…. అడగండీ ప్రతి పల్లెను, ప్రతి తల్లిని, ప్రతి చెట్టును, ప్రతి పుట్టను, కథలు కథలు చెప్పునవీ అన్నాడు చెరబండరాజు.
నేను డిగ్రీ రెండో సంవత్సరంలోనో, మూడో సంవత్సరంలోనో ఉండగా అప్పుడే డిగ్రీలో చేరిన నా జూనియర్ ఫైళ్ల వెంకటరమణ, “మాది కడవెండి. నేను ఆర్ ఎస్ యు లో చేరతాను” అని నా దగ్గరికి వచ్చాడు. ఆ పాలుగారే పదిహేడేళ్ల చురుకైన కుర్రవాడి ముఖం ఇంకా కళ్లలో మెదులుతున్నది. రమణ డిగ్రీ పూర్తి చేసి, విప్లవోద్యమ నిర్మాణంలోకి వెళ్లి ఒక ఎన్ కౌంటర్ లో అమరుడయ్యాడు.
ఈ కడవెండి అధ్యయనానికన్న ముందే, ఆ ఊరితో నాకు మరొక సంబంధం ఏర్పడింది. మా పెద్ద మామయ్య కూతురిని ఆ ఊరికి ఇచ్చి పెళ్లి చేయడంతో ఆమెను తీసుకురావడానికి నేను ఒకటి రెండు సార్లు ఆ ఊరికి వెళ్లవలసి వచ్చింది.
ఒకవైపు కడవెండి రమణ నాకు జూనియర్ అయితే, నాకు సీనియర్ అయిన కడవెండి బిడ్డ ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, నేను ఎంఎ కు ఉస్మానియాకు రాగానే నా గురువూ మార్గదర్శీ నాయకుడూ అయ్యాడు. 1982-84 రెండు సంవత్సరాలు నేను ఉస్మానియాలో ఉన్నప్పటికీ కడవెండిలోనే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్ఞాపకాలతోనే ఉన్నట్టు. 1999 డిసెంబర్ లో సంతోష్ ను బెంగళూరులో ఆదిరెడ్డి, నరేష్ లతో పాటు పట్టుకుని, కరీంనగర్ జిల్లా కొయ్యూరు దగ్గర కాల్చి చంపి ఎన్ కౌంటర్ కట్టుకథ అల్లారు. సంతోష్ అంత్యక్రియల రోజున తీవ్రమైన జ్వరంతో నేను కడవెండి వెళ్లలేకపోయాను గాని, అప్పటికి ఇరవై అయిదేళ్లుగా ఉన్నట్టే ఆ రోజంతా కూడా మనసు కడవెండిలోనే ఉంది.
సంతోష్ అజ్ఞాత జీవితంలో ఉన్నప్పుడే, తానూ రేణుకా సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారని, ఉద్యమ అవసరాల రీత్యా రేణుక బైట ఉండిందనీ, కొన్నాళ్లకే ఎవరిద్వారానో తెలిసి, ఆ దుఃఖం, బైట ఎవరికీ చెప్పుకోవడానికి కూడా వీలులేని దుఃఖం ఎలా అనుభవించిందో అని తలచుకుంటేనే గుండె పగిలిపోయింది. విశాఖపట్నంలో న్యాయవాదిగా ఉండిన రేణుకను కలవడం మళ్లీ ఒకసారి కడవెండిని చూసినట్టే. ఈసారి కడవెండి రేణుక ద్వారా ప్రజా పోరాటానికి ఉన్న బహుముఖ పార్శ్వాలు – విప్లవోద్యమ నిర్మాణం, సృజనాత్మక రచన, పత్రికా నిర్వహణ, న్యాయవాద వృత్తి, మహిళా సమస్యలపై పోరాటం – చూపింది.
2004 చర్చలలో ఒక ప్రతినిధిగా పాల్గొన్న జనశక్తి నాయకుడు రియాజ్ ను పోలీసులు 2005 జూలై 2న హైదరాబాద్ లో పెద్ది రాజుతో కలిపి పట్టుకుని, కరీంనగర్ జిల్లా బదనకల్ దగ్గర కాల్చి చంపారు. పెద్ది రాజుదీ కడవెండి అని తెలిసి ఆ ఊరు పోరాటానికి నాంది పలికినది మాత్రమే కాదు, త్యాగాల చాలు పోసినది అని మరొకసారి అనిపించింది. ఆ తర్వాత అదే ఊరి నుంచి పెద్ది శ్రీనివాస్ కూడా ఒక బూటకపు ఎన్ కౌంటర్ లో అమరుడయ్యాడు.
ఇప్పటికే ఆ ఊరి గురించీ, ఆ ఊరి పోరాట సంప్రదాయం గురించీ ఎందరో రాశారు. ఆ ఊరు దొడ్డి కొమరయ్య మరణంతో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రారంభించడం మాత్రమే కాదు, ఆ కొమరయ్య వారసత్వాన్ని సగర్వంగా కొనసాగిస్తూనే ఉన్నది. ఇప్పటికీ గ్రామంలో విప్లవ పార్టీల పట్ల సానుభూతి నిర్బంధపు నివురు కప్పిన నిప్పులా లోలోపల జ్వలిస్తూనే ఉన్నది. పార్లమెంటరీ వామపక్షాల ప్రభావం ఉన్నది. గ్రామంలో ప్రవేశిస్తుండగానే కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసి మరణించిన దాదాపు ఇరవై మంది స్తూపాలు, ఎర్రజెండాలు, సుత్తెకొడవలి చిహ్నాలు స్వాగతం పలుకుతాయి.
ఇప్పుడు మళ్లీ రేణుక సందర్భంగా కడవెండికి వెళితే, వాగు మీద వంతెన వచ్చింది. వంతెన కింద నీళ్లు లేవు గాని ఎనబై సంవత్సరాలుగా నెత్తురు ప్రవహించిన, ప్రవహిస్తున్న ఆనవాళ్లు కనబడుతున్నాయి. ఒకప్పుడు విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు జరిపిన కాల్పుల్లో కావచ్చు, ఇప్పుడు మహా ఘనత వహించిన సర్వసత్తాక, ప్రజాస్వామిక, భారత గణతంత్రపు సైనికులు జరిపిన కాల్పుల్లో కావచ్చు, కడవెండి బిడ్డలు నేలకొరుగుతూనే ఉన్నారు. కడవెండి బిడ్డలు ప్రాణాలను పణంగా పెట్టి న్యాయం కోసం మాట్లాడుతూనే ఉన్నారు, ప్రజల పక్షాన నిలబడే ఉన్నారు. ఒక ఊరు ఎనిమిది దశాబ్దాలుగా తన ఉజ్వల సంప్రదాయాన్ని నిలబెట్టుకోవడం బహుశా దేశంలోనే అరుదుగా కొన్ని ఊళ్లలో మాత్రమే జరిగి ఉంటుంది.
ఒక కొమరయ్య, ఒక రమణ, ఒక సంతోష్, ఒక రాజు, ఒక శ్రీనివాస్, ఒక రేణుక వ్యక్తులుగా తమ తమ శక్తి సామర్థ్యాలతో సమాజానికి, సమాజ పురోగమనానికి ఇచ్చిన కానుకలు, వదిలి వెళ్లిన నమూనాలు సామాజిక చరిత్రలో అపురూపమైన విశిష్ట అంశాలు. వాళ్లందరూ కూడా వ్యక్తికీ సమాజానికీ సంబంధాన్ని పునర్నిర్వచించారు. ఒక ఆదర్శాన్ని నెలకొల్పారు, కొనసాగించారు. వాళ్లు సమాజ మహా వృక్షపు ఆకులూ పూలూ ఫలాలూ. వృక్షం ఒక్కొక్కప్పుడు చలనం లేకుండా ఉన్నట్టు, ఆకులు కదలనట్టు అనిపించవచ్చు. బైట అనుభవిస్తున్న వాతావరణపు ఉక్కపోత ఆ వృక్షం కూడా అనుభవిస్తున్నదా అనిపించవచ్చు. కాని ఆ ఆకులలో చిక్కుకున్న గాలి సడి సేయకుండా కదులుతూనే ఉంటుంది. ఆ పూల పరిమళం మొగ్గల నాటి నుంచి నేల రాలిన తర్వాత కూడా ఏళ్లూ దశాబ్దాలూ శతాబ్దాలూ ఆలోచించగల మనిషి ఉనికిలో ఉన్నన్నాళ్లూ వ్యాపిస్తూనే ఉంటుంది. ఆ ఫలాలూ విత్తనాలూ గాలి మోసుకుపోగలిగినంత దూరం ప్రయాణించి ఎప్పుడో ఒక్కప్పుడు ఎక్కడో ఒకచోట మళ్లీ మళ్లీ మొలకెత్తుతూనే ఉంటాయి.