అన్నా చెల్లెళ్ళ రాగబంధం ‘చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్’

ఇరాన్ దేశం నుండి పర్షియన్ భాషలో వచ్చిన అపురూపమైన చిత్రం “చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్” (Children of Heaven). ఈ చిత్రానికి స్క్రిప్ట్ రచననూ, దర్శకత్వాన్నీ కూడా ప్రపంచ ప్రఖ్యాత “మాజిద్ మజిది” (Majid Majidi) నిర్వహించారు. దీని వ్యవధి 89 నిమిషాలు.

ఇతివృత్తం: పేద కుటుంబానికి చెందిన తొమ్మిదేళ్ళ ‘అలీ’ అనే బాలుడు తన తప్పేమీ లేకుండానే అతని చెల్లెలు ‘జహ్రా’ షూస్ బాగు చేయించుకొస్తూ, దారిలో కిరాణాషాపు ముందు సరుకుల కోసం ఆగినప్పుడు పోగొట్టుకుంటాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండానే అన్నా- చెల్లెళ్ళిద్దరూ తమ సమస్యని తామే పరిష్కరించుకోవాలని ఒక పద్ధతిని ఎంచుకుంటారు. ఇది ‘మాజిద్ మజిదీ’ అల్లికలో చాలా హృద్యమైన, పదునైన దృశ్యకావ్యంగా రూపుదిద్దుకుంది.

అలీ తన చెల్లెలు ‘జహ్రా’ పింక్ షూస్‌ ని రిపేర్ చేయించుకుని రావడంతో సినిమా మొదలవుతుంది. అతను వాటిని ఒక కవర్లో కిరాణాషాప్ ముందుంచి, వాళ్ళమ్మ చెప్పిన ఆలుగడ్డలు కొనడానికి లోపలికి వెళతాడు. ఆలుగడ్డలు కొనడం ఐపోగానే షాప్ ముందు కొచ్చి చెల్లెలి షూస్‌ పెట్టిన కవర్ కోసం వెతుకుతాడు. ఈ లోపల చెత్తను ఏరి తీసుకునే ఒక వ్యక్తి వచ్చి షూస్‌ ఉన్న కవర్ ని చెత్త అనుకుని తీసికెళ్ళిపోతాడు. అది తెలియని అలీ చాలా కంగారు పడతాడు. వాటిని ఆదుర్దాతో మూల మూలల్లో వెతికే క్రమంలో కిరాణా కొట్లో డబ్బాలు అటూ ఇటూ పడిపోతాయి. ఆ వ్యాపారి కోపంతో అలీని అక్కడినుంచి వెళ్ళగొడతాడు. తన్నుకొస్తున్న ఏడుపు నాపుకుంటూ అంతులేని విచారంతో అలీ ఇంటికొస్తాడు!

అలీ ఇంటికి చేరుకోగానే చెల్లెలు జహ్రా ఆశగా షూస్ గురించి అడుగుతుంది. ముందు అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు గానీ ఆరాటాన్ని ఆపుకోలేక నిజం చెప్పేస్తాడు. జహ్రాకి బాగా కోపం వస్తుంది! అసలే రోజులు చాలా గడ్డుగా ఏపూట కాపూట గడిస్తే చాలు అన్నట్లు రోజులు వెళ్ళదీస్తూ పేదతనంతో అల్లాడిపోతున్న కుటుంబాన్ని చూస్తున్న ఈ అన్నా- చెల్లెళ్ళు తండ్రితో ఈ విషయం చెప్పి బాధపెట్టడం తప్ప లాభమేమీ ఉండదని ఆలోచిస్తారు. కానీ షూస్ లేకుండా పాఠశాలకి వెళ్ళలేరు. ఇద్దరూ కలిసి ఆలోచించి ఒక రహస్య ప్రణాళిక వేసుకుంటారు. అలీ తన షూస్ ని ఉదయంపూట చెల్లెలి కిస్తాడు. ఉదయం ఆ షూస్ వేసుకుని జహ్రా స్కూల్ కి వెళ్తుంది. జహ్రా స్కూలై పోయాక అవే షూస్ వేసుకుని ఆలీ మధ్యాహ్నం స్కూల్‍కి వెళ్ళేటట్లు ఒక ఒప్పందం చేసుకుంటారు. ఈ సందర్భంగా వయసుకి మించిన వేదనతో, బాధతో సతమతమవుతున్న అలీ జహ్రా ఒప్పుకున్నందుకు తన కొత్త పెన్సిల్ ని చెల్లెలికి కానుకగా ఇస్తాడు.

ఈ సమస్య ఏ విధంగా పరిష్కారమవుతుంది అనే రంధితో బజార్లో కనిపించే షూస్ వైపు దీనంగా చూస్తూ పిల్లలిద్దరూ రోజులు భారంగా గడుపుతుంటారు. అలీ, జహ్రా లిద్దరూ ఒకే జత షూస్ తో స్కూల్ కి వెళ్లడం కోసం సినిమా మొత్తం పరుగులు తీస్తూనే ఉంటారు. జహ్రా రావడం కొంచెం ఆలస్యమయితే అలీ పాఠశాలకి వెళ్లడం కూడా లేటవుతుంది. అన్నా చెల్లెళ్ళిద్దరూ నిరంతరం ఒత్తిడికి లోనవుతుంటారు. జహ్రా పరీక్షలు రాస్తున్న సమయంలో కూడా అలీకి షూస్ త్వరగా ఇవ్వాలనే తపన, ఆందోళనలకు గురవుతుంది! ఈ కారణం వల్ల అలీ తరచుగా పాఠశాలకి వెళ్ళడానికి ఆలస్యమవుతూ ఉంటుంది. అది గమనించిన ప్రిన్సిపాల్ ‘ఇంకోసారి గనక ఇలా ఆలస్యంగా వస్తే అసలు పాఠశాలకే రావద్ద’ని గట్టిగా అలీ ని హెచ్చరిస్తాడు.

ప్రతిరోజూ ఎన్నికష్టాలెదుర్కొంటున్నప్పటికీ అలీ చదువులో మంచి మార్కులతో రెండో రాంక్ సాధిస్తాడు. క్లాస్ టీచర్ మెచ్చుకుని బహుమానంగా ఇచ్చిన కలాన్ని జహ్రా కిస్తాడు. జహ్రా తన కోపాన్నంతా మర్చిపోయి హాయిగా అన్నతో జత కడుతుంది.

ఒక రోజు తన షూస్ లాంటి షూస్ వేసుకున్న ఒక పాపని స్కూల్ లో చూస్తుంది జహ్రా. అన్నకి చెప్తుంది. ఇద్దరూ కలిసి ఆ పాప ఇంటికి వెళ్ళి చూస్తే అ కుటుంబ పరిస్థితి తమ కంటే హీనాతి హీనంగా ఉండడం గమనిస్తారు. ఆ కుటుంబ పెద్ద అంధుడు. ఏమి అడగలేక ఇద్దరూ నిరాశా, నిస్పృహలతో వెనక్కి వచ్చేస్తారు!09

అలీ తన చెల్లెలి షూస్ కోసం ఎడతెగని విచారం, దుఃఖంలో ఉండగానే స్కూల్ నోటీస్ బోర్డ్ లో కనిపించిన ఒక ప్రకటన అతని దృష్టిని అమితంగా ఆకర్షిస్తుంది. దేశవ్యాప్తంగా జరిగే రన్నింగ్ రేస్ లోమూడో బహుమతి సాధించిన బాలుడికి ఒక జత షూస్ లభిస్తాయని దాని సారాంశం. అలీకి వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు తనకి కావలసింది కూడా ఒక జత షూసే కాబట్టి టీచర్ ని బతిమలాడి రన్నింగ్ రేస్ లో పాల్గొనడానికి అనుమతి పొందుతాడు.

ఇక పరుగుపందెం మొదలవుతుంది. అలీ అలుపెరగకుండా తన లక్ష్యం వైపు పరుగులు తీస్తూనే ఉంటాడు. ఒక స్టేజ్ లో అందరికంటే ముందుంటాడు. కానీ అతని గమ్యం మూడో బహుమతి కదా? దాని కోసం వెనక్కి తగ్గుతుంటాడు! మొదటి స్థానంలో రాగలిగినప్పటికీ చెల్లెలి ముందు ఓడిపోయిన అలీ గెలవాలనుకుంటే రేస్ లో మొదటి రెండు స్థానాల్లో ఓడిపోయి మూడో స్థానం గెల్చుకుని చెల్లెలికి ఒక జత షూసే సాధించిపెట్టాలి. అదే ధ్యాసతో దేశం నలుమూలల నుంచి వచ్చిన వందలాదిమందిలో ఒకడిగా పందెంలో పరుగులు పెడుతూనే ఉంటాడు. ముందుకి ఉరుకుతూ మళ్ళీ వెనక్కి తగ్గుతూ మూడో స్థానం దక్కించుకోవడం కోసం తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. కానీ అదృష్టవశాత్తూ అతడు మొదటి స్థానంలో నిలుస్తాడు! కానీ అలీ దృష్టిలో అది దురదృష్టమే!

స్కూల్ టీచర్ అతన్ని భుజాల పైన ఎక్కించుకుని విజయగర్వంతో చుట్టూ తిప్పుతాడు. విలేకర్లు ఫోటోలు తీసుకుంటారు. అందరూ అలీ మీద తమ దృష్టిని కేంద్రీకరిస్తారు. కానీ అలీ ముఖంలో మాత్రం రవ్వంత సంతోషం గానీ, గెలిచానన్న విజయగర్వం గానీ కనిపించకుండా విషాద ఛాయలు అలుముకుంటాయి. చెల్లెలికి షూస్ తీసుకొచ్చే అవకాశాన్ని పోగొట్టుకున్నానని ఆ పసిహృదయం అల్లాడిపోతుంది. ఈ సన్నివేశం ఈ సినిమా మొత్తానికే హైలైట్ గా నిలుస్తుంది!పరుగు పందెంలో గెలిచినా చెల్లెలి కిచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయాననే బాధతో ఇల్లుచేరతాడు అలీ. ఏమీ తేకుండా వచ్చిన అన్నను నిరాశగా చూస్తుంది జహ్రా!

చిత్రం చివరలో వారి తండ్రి పిల్లలిద్దరికోసం రంగు రంగుల షూస్ తీసుకు రావడం చూసిన ప్రేక్షకులు హాయిగా ఊపిరి తీసుకుంటారు! ‘మాజిద్ మజిదీ’ చేసిన ఈ కొసమెరుపు మాయాజాలం ‘అలీ- జహ్రా’ల కింకా తెలియదు పాపం!

ప్రపంచవ్యాప్తంగా సినీ మేధావుల విశేష మన్ననలందుకున్న చిత్రం “చిల్డ్రన్ ఆఫ్ హెవెన్”. మొదటి ఐదునిమిషాల సెటప్ లోనే ఈ చిత్రం చాలా ప్రత్యేకమైనదని ప్రేక్షకులకు స్పష్టమవుతుంది! అతి సాధారణమైన ప్రతి పేదదేశంలో, ప్రతి పేదయింట్లో జరిగే కథాంశాన్నే ఎంచుకుని చిన్నారుల సృజనాత్మకతతో కథనాన్ని హృద్యంగా, అందంగా తీర్చిదిద్దాడు మాజిద్ మజిదీ. విలాసవంతమైన దృశ్యాలు లేవు. స్పెషల్ ఎఫెక్ట్ లసలే లేవు. మంచి సినిమాకి తక్కువ మాటలు, శక్తివంతమైన దృశ్యాలుండాలని పెద్దలు చెప్పినట్లే ఈ సినిమా అంతటా, చిన్నారులు ప్రదర్శించిన ప్రదర్శించిన వ్యక్తీకరణలూ, భావోద్వేగాలే డైలాగ్‌ ల కంటే చాలా బిగ్గరగా మాట్లాడతాయి!

ఈ సినిమాలో పిల్లలు చూపించిన విలువలు ప్రేక్షకులకు గొప్ప సినిమా అనుభవాన్నీ, సంతృప్తినీ కలిగిస్తాయి. ప్రేమలు , పరిశీలనలు, స్వార్ధత్యాగం, తలిదండ్రుల పట్ల గౌరవం, ఒకరి పట్ల ఒకరికి పరస్ఫర సోదరీ సోదరుల ఆదరాభిమానాలు చూస్తున్నప్పుడు కుటుంబ సంబంధాలు ఇంత స్నేహపూర్వకంగా ఆత్మీయంగా ఉండాలని చూసిన ప్రతి ఒక్కరూ కాంక్షిస్తారు.

సినిమా ప్రారంభం నుండి, చెల్లెలికి తన బూట్లను ఎలా పోగొట్టుకున్నాడో వివరించేటప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య సంబంధాన్ని చెల్లెలి కోపంతో, అన్న బాధతో సమానమైన ఉద్విగ్నతలు, ఆత్మీయతలతో పోషించడం మనం చూస్తాం. అలీ ముఖంలో దుఃఖం, జహ్రా కన్నీళ్లు చూడడం నిజంగా హృదయ విదారకంగా ఉంటాయి! పిల్లల ముఖాల్లోని భావాలు చాలా స్వచ్చంగా, వాస్తవంగా, మనస్ఫుర్తిగా, అమాయకత్వంగా ఉన్నాయని సినిమాటిక్‌గా గంటన్నర గడపడం నిజమైన ఆనందం కలిగిస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ విజ్ఞానులు చాలా ప్రముఖంగా ప్రశంసించారు!
ఒక రోజు జహ్రా స్కూల్ నుంచి పరిగెత్తుకుని వస్తుండగా ఒక షూ మురికి కాలువలో పడి కొట్టుకొని పోతుంది. షూ పడిపోయినప్పుడు జహ్రాతో పాటు ప్రేక్షకులు కూడా గుండెలు బిగబట్టి ఉత్కంఠకు లోనవుతారు. అదృష్టవశాత్తూ ఎవరో సహాయం చెయ్యడంతో జాహ్రా, షూస్ ని తిరిగి సంపాదించి అలీకిస్తుంది. ప్రేక్షకులు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు.

ఇంకో రోజు తన షూస్ లాంటి షూస్ వేసుకున్న ఒక పాపని స్కూల్ లో చూసి జహ్రా అన్నతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అంధుడైన ఆ ఇంటిపెద్దను తమ కంటే దుర్భర దారిద్ర్యంలో ఉన్న ఆ కుటుంబాన్ని గమనించి పెద్ద ఆరిందాలలాగా సహానుభూతి చూపిస్తూ నిలదీసి ఏమీ అడగలేక వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఈ సన్నివేశం ‘విట్టోరియా డి సికా’ తీసిన గొప్ప ఇటాలియన్ నియోరియలిస్టు సినిమా “ద బైసైకిల్ థీవ్స్” (The Bicycle Thieves) ను గుర్తుకి తెస్తుంది. అక్కడ కూడా తమ సైకిల్ దొంగ ఇంటికి తండ్రీ-కొడుకులిద్దరూ వెళ్ళి అక్కడ పరిస్థితి తమ కంటే ఘోరంగా ఉందని, ఇంటిపెద్ద మూర్ఛ రోగంతో బాధపడుతున్నాడని ఏమి చేయలేని నిస్సహాయతతో వెనక్కి వచ్చేస్తారు. ఈ సీన్ ద్వారా ఇరాన్ డైరెక్టర్ ‘మాజిద్ మజిదీ’ మీద ‘విట్టోరియా డి సికా’ ప్రభావ ముందని ప్రేక్షకులకు స్పష్టంగా తెలుస్తుంది.

అలీ, అతని తండ్రి తోటమాలి పనికోసం నగర శివార్ల వైపుకి సైకిల్ మీద వెళతారు. ధనికుల గృహాలు సకల సౌకర్యాల ఆధునిక హంగులతో ఉంటాయి. పేదల ఇళ్ళలో కనీసం నిత్య జీవితావసరాలైన రొట్టెలు కొనడానికి కూడా డబ్బు లేక పద్దు రాసుకోమని అమ్మ చెప్పిందని అలీ ప్రారంభ సన్నివేశంలో కిరాణా షాపు అతన్ని బతిమలాడతాడు. అలీ రేసులో వీధుల్లో పరుగెత్తుతున్నప్పుడు, జహ్రా బూట్లు సాధించాలనే తపనే అతని మనసులో మెదులుతూ ఉంటుంది. అదే సమయంలో, ధనికులైన ఇతర పిల్లల తల్లిదండ్రులు ఖరీదైన క్యామ్‌ కార్డర్‌ లలో రేసును చిత్రీకరిస్తుంటారు. అలీ మాత్రం అవసరమైన బూట్ల కోసం పరుగుపందెంలో పోరాడుతుంటాడు. ధనిక-పేదల మధ్య స్పష్టమైన విభజననూ, అసమానతల్నీ మనసులో ముద్రించుకు పోయేటట్లు దృశ్యీకరించాడు డైరెక్టర్ ‘మాజిద్ మజిదీ’.

అలీ తండ్రి పాత్రలో ‘మహ్మద్ అమీర్ నాజీ’ చాలా అద్భుతమైన గాఢతతో, మంచి అభిరుచితో నటించాడు. అతని ఆర్ధిక దుస్థితి అందర్నీ పూర్తిగా ఆకట్టుకుంటుంది. పకడ్బందీగా ఉన్న ఇళ్ళ గేట్ల బయట నుండి పనికోసం ఎలా అడగాలో అలీ తండ్రికి తెలియదు. అతని నోటి వెంట మాటలే రావు. అలీ చక్కని పదజాలంతో గొంతెత్తి పెద్దగా ‘మీకు తోటపని కావాలా’ అని అడగడం చూసి తండ్రి మురిసిపోతాడు. పేదరికం వల్ల తండ్రి కఠినంగా ఉన్నట్లు కనిపించినా కుటుంబాన్నీ, పిల్లల్నీ అమితంగా ప్రేమిస్తున్నాడని కూడా ప్రేక్షకులకు నిక్కచ్చిగా తెలుస్తుంది. ఇక్కడ తండ్రీ-కొడుకుల ఆప్యాయతల, చిరునవ్వుల నటన ప్రేక్షకుల హృదయాల్ని హాయిగా ఉత్తేజపరుస్తాయి.

అద్భుతమైన సహజ శబ్దాలతో నిండిన అద్భుతమైన సౌండ్‌ ట్రాక్‌ ఆకర్షిస్తుంది. పిల్లల ప్రపంచమంతా డిజిటల్ టెక్నాలజీ, సెల్ ఫోనుల్లో మునిగి తేలుతుంటే ఈ పిల్లలిద్దరూ మాత్రం వారి పెరటి చుట్టూ తిరుగుతూ సబ్బు బుడగల నురుగుతో ఆడుకోవడం నిజంగా ఆహ్లాదం కలిగిస్తుంది!

సబ్ టైటిల్స్ లేకపోయినా ఈ సినిమా చక్కగా అర్ధమవుతుంది. ‘వాస్తవ పరిస్థితుల్నీ, దేశంలో ఉన్న దారిద్ర్యాన్నీ దృశ్యీకరించకూడద’ ని ఇరాన్ ప్రభుత్వం నుంచి దర్శకులకు కఠినమైన ఆంక్షలుంటాయి. అందుకని వారు ఇరాన్ సమాజాన్ని తెలివిగా పిల్లల చిత్రాల ద్వారా వ్యక్తపరుస్తారు! అన్నింటికీ మించి, నిజమైన కళ అనేది బ్రహ్మాండంగా అమర్చబడిన అట్టహాసాలతో గాకుండా మనందరికీ తెలిసినట్లుగా జీవితంలోని సార్వత్రిక సరళతలను పరిశీలించే ఇటువంటి చిత్రాల నుండి వస్తుందని ఈ అద్భుతమైన చిత్రం మనకు గుర్తు చేస్తుంది!

పిల్లల భావోద్వేగాలే కాదు, తల్లిదండ్రుల అనుబంధాలు, పక్కనే ఉన్న వృద్ధ దంపతులు, దుకాణ యజమానులు, అందరూ ఈ ప్రపంచాన్ని చాలా వాస్తవికంగా మార్చారు. నటీనటులు, పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా వారు తమ పాత్రలను చాలా సహజమైన పద్ధతిలో జీవిస్తున్నట్లే ఉంటుంది, అసలు నటిస్తున్నట్లనిపించదు. సినిమా ద్వారా ప్రేక్షకులను తమ జీవితపు మాయాజాలంలోకి హృద్యంగా, లోతుగా లాక్కుంటున్నట్లనిపిస్తుంది!

పిల్లలిద్దరూ మనస్పూర్తిగా పేద కుటుంబ శ్రేయస్సు పట్ల బాధ్యతగా, శ్రద్ధగా ఉన్నారు. ప్రధాన పాత్ర, తొమ్మిదేళ్ల అన్న అలీ గా, ‘అమీర్ ఫరోఖ్ హషేమియన్’ (Amir Farrokh Hashemian) తన ఎడతెగని పరుగుతో నిజంగా సినిమాను ఉరుకులెత్తించాడు. చిన్నారి చెల్లెలు జహ్రా గా ‘బహరేహ్ సెద్దిఖీ’ (Bahare Seddiqi) తెరమీద గొప్ప నిగ్రహాన్ని, సంయమనాన్ని ప్రదర్శించింది. ఆ ముడుచుకున్న ముఖాలు, ఆరాటంగా వంచే కనుబొమ్మలు-ఇద్దరి ముఖాల్లో కనిపించే విచారకరమైన ఛాయలు, దురదృష్టాలన్నిటినీ సమిష్ఠిగా ఎదుర్కొన్న విధానం-ఇవన్నీ వారిద్దరి స్నేహ సౌశీల్యాలనే గాక తలిదండ్రులకి ఏమాత్రం బాధ కలిగించని వారి ప్రవర్తన ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.

‘పర్విజ్ మాలెక్‌జాడే’ (Parviz Malekzaade) ఆకర్షణీయమైన సినిమాటోగ్రఫీ, సంగీతాలను అందించాడు. నిజ జీవిత వాస్తవ చిత్రీకరణలతో కెమెరా పనితనం ఉన్నతంగా ఉంటుంది.

మాజిద్ మజిదీ ఒక మేధావి అనీ, “చిల్డ్రన్ ఆఫ్ హెవెన్” విదేశీ చిత్రాల మూసను బద్దలు కొట్టిందనీ, అన్ని సంస్కృతులను దాటి మానవత్వాన్ని ఎత్తిపట్టిందనీ, ఇంతవరకూ వచ్చిన బాలల చలన చిత్రాల్లో కెల్లా అత్యుత్తమ చిత్రమనీ, ఒక కళాఖండాన్ని సృష్టించి, ప్రపంచ సినిమా పటంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడని ప్రపంచవ్యాప్తంగా సినీ మేధావులు, సినీ విమర్శకులు, సినీ ప్రేమికులు ప్రశంసించారు!

ఏడు నిమిషాల పిల్లల రేస్ సీక్వెన్స్ ముగింపులో చాలా చాకచక్యంగా దర్శకత్వం వహించబడింది. ఈ చిత్రంలో చాలా కాలం పాటు మదిలో కళాత్మకంగా నిలిచిపోయే సన్నివేశాలున్నాయి.

ఇద్దరు బాలనటుల సామర్థ్యాలు కొంతమంది పెద్ద పేరున్న ప్రముఖ నటులను కూడా సిగ్గుపడేలా చేస్తాయనీ, ఇంత మంచి బాలల చలన చిత్రాన్ని ఇంతవరకూ చూడలేదనీ, ఈ సినిమా కుటుంబసమేతంగా చూసి బాలలందరికీ చూపించాలని కోరుతూ ప్రపంచ ప్రేక్షకులు మాజిద్ మజిదీ కి ధన్యవాదాలు చెప్పారు!

మొదటి స్థానంలో వస్తే ఒక జత బూట్లే గాక ఇంకా చాలా కొనుక్కోవచ్చని ఆ పసివాడు అలీకి తెలియదు పాపం! బాల్యంలో ఏది, ఎంతవరకు, ఎక్కడ, ఎలా సంపాదించుకోవాలో దానికే, అంతవరకే ఆశ పడతారు పిల్లలు. ఎదిగిన పెద్దలకే చుట్టూ ప్రపంచం ఏమైపోతున్నా సరే ఆబగా సకల సంపదలూ తమకే స్వంతం కావాలనే స్వార్ధాలూ, అంతులేని కోరికలూ పెరిగిపోతాయి. బాల్యంలో పసివాళ్ళు ఏది అవసరమో దానిమీదే తమ దృష్టి నిలుపుతారు!

ప్రతి ఒక్కరికీ తమ తమ నిష్కల్మషమైన బాల్యాలను గుర్తుకి తెచ్చే మనోహరమైన సినిమా ఇది!

నేను అనేకసార్లు ఈ సినిమా చూశాను. మేము ఒక డీవీడీ కొని, కాపీలు తీసి పిల్లల పుట్టిన రోజులకు బహుమతిగా ఇస్తుండేవాళ్ళం.

ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్కార్ నామినేషన్ కి ఎంపికైంది.

ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ప్రజల ప్రశంసల జల్లులే ఈ చిత్రాన్ని దేశాల కతీతంగా, కాలాల కతీతంగా, విశ్వజనీనంగా నిలిపి ఉంచుతుంది!

జననం: గుంటూరు జిల్లా భట్టిప్రోలు. రేపల్లె, తెనాలి, హైదరాబాద్ లో విద్యాభ్యాసం. హైదరాబాద్ టెలికాం (ఇప్పటి బీఎస్ఎన్ఎల్)లో ఉద్యోగం చేశారు. మహిళల సమస్యలపై పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ(ఇంగ్లిష్ లిటరేచర్), ఎం.ఏ(తెలుగు సాహిత్యం), హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శ్రీ శ్రీ రేడియో నాటికల మీద ఎం.ఫిల్ చేశారు. S.M Synge(Ireland writer ) రాసిన “Riders to the Sea” ఏకాంకికకి తెలుగు అనువాదం. శాస్త్రీయ దృక్పథం, ప్రత్యామ్నాయ సినిమా, సినిమా అక్షరాస్యతను పెంపొందించుకోవడం ఇష్టమైన విషయాలు.

Leave a Reply