అనుమతి లేకుండా!?

నయీం పచార్లు చేస్తూ ఓ గార్డెన్ లోకెళ్లాడు. అతనికి అక్కడి వాతావరణం బాగా నచ్చింది. అతను మెత్తని మృదువైన పచ్చగడ్డి తివాచీ పై నడుం వాల్చాడు. తనలో తనే మాట్లాడుకోసాగాడు. ఏదేదో గొణుగుకోసాగాడు.

ఎంత మంచి అహ్లాదకరమైన స్థలం. వింతగా అందంగా ఉంది. ఇంతవరకు ఈ ప్రదేశాన్ని నేను చూడలేదు. నా కంటి చూపులకు కానరాలేదు. కండ్లుండి కూడా చూడలేం అని అనుకొంటూ తనలో తానే నవ్వుకున్నాడు.

పచ్చని గడ్డి పై పండుకున్న తనకు చల్లదనం తాకసాగింది. ఈ పచ్చని తివాచీలాంటి గడ్డి ఎంత ఆనందదాయకంగా ఉంది అని మరోసారి మనసులో అనుకొన్నాడు. అలా అనుకొంటూనే… కండ్లు పాదాల క్రిందికొచ్చాయి… ఈ పూలు… ఈ పూల అందంకన్న ఇందులో ఉన్న గుబాళింపు మనోరంజకంగా ఉంది. ప్రతివస్తువు లో ఏదో ఓ విశేషం ఉంది. మనోహరంగా ఉన్న వస్తువులు హృద్యంగా ఉంటాయి. స్త్రీలు హృద్యంగా ఉంటారు. మగవాళ్లు కూడా… ఏం అర్ధం కావట్లేదు. మెదడులో యేదో గందరగోళం! ఈ అందమైన వస్తువులు ముందు పుట్టాయా… లేదా అందమైన ఆలోచన! ప్రతి ఆలోచన… కల్పన… ఊహా అందంగా ఉంటుంది. కాని సమస్య ఏమిటంటే ప్రతి పువ్వు అందమైనది కాదు.

ఉదాహారణకు ఈ పువ్వు… అతడు లేచి ఓ పువ్వు వైపు చూశాడు. మళ్లీ తనలో తనే మాట్లాడుకోసాగాడు. ఈ కొమ్మ పై ఎంత బాగుందో ఇది… అందంగా కనిపిస్తుంది. ఏదిఏమైనా ఈ ప్రదేశం చాలా బాగుంది. మనోరంజకంగా ఉంది. మంచి వెలుతురు ఉంది… నీడలు కూడా ఉన్నాయి. ఉల్లాసమైన వాతావరణం. నాకనిపిస్తోంది, ఇలా ఆలోచిస్తున్నది నేను కాదు. ఈ ప్రదేశం ఆలోచిస్తోంది! ఇంత మంచి ఉద్యానవనం నా కంటి చూపులనుంచి ఎలా తప్పిపోయిందో? ఈ నేపథ్యంలో నయీం ప్రకృతి పైన ఓ పాట అందుకున్నాడు. ఇంతలో ఓ వాహనం చేస్తూన్న హార్న్ శబ్దం, చెవులకు తూట్లు పడేలా మోగించడం వల్ల అతని పాట మధ్యలోనే ఆగిపోయింది.

నయీం ఉలిక్కిపడి లేచాడు… ఓ వాహనంలో నుంచి పెద్ద పెద్ద మీసాలు కలిగి ఉన్న వ్యక్తొకడు తన వైపుకు కోపోద్రేకం తో చూస్తూ ఉన్నాడు.

” ఎవరు నువ్వు?” అని ప్రశ్నించాడు ఆ మీసాల్రాయుడు.

నయీం తన ఆలోచనల మత్తులో నుంచి ఇంకా తేరుకోనే లేదు.

“ఈ మోటార్ గార్డెన్లో కెలా వచ్చింది!?”

మీసాల్రాయుడు ఆ గార్డెన్ కు యజమాని.

‘చూడడానికి ఈ మనిషి మర్యాదస్థుడుగా కనిపిస్తున్నాడు. కాని ఇందులోకి ఎలా జొరబడ్డాడు… ఎంత ధైర్యంగా పడుకున్నాడు! వాడి అయ్య తోట లా!’ నసిగ సాగాడు, తోట యజమాని.

“ఏమండోయ్…మీకేమైనా వినిపిస్తూందా?” గట్టిగా అరుస్తూ, అడిగాడు.

“వింటున్నాను సార్! దయచేయండి. ఇక్కడ చాలా అహ్లాదకరమైన వాతావరణముంది.”

తోట యజమాని కోపం తారాస్థాయికి చేరుకుంది.

“సారు కొడుకా…నాదగ్గరికి రా!”

నయీం పడుకునే ఉన్నాడు తివాచీలాంటి గడ్డిపైన.

నా వల్ల కాదు… మీరే వచ్చేయండి… అమ్మతోడు… ఈ ప్రదేశం చాలా బాగుంది. మీ మనసుకు చాలా హాయిగా ఉంటుంది.

తోట యజమాని తన కారులోనుంచి దిగి, బరబరా కోపంతో నడుచుకొంటు నయీం దగ్గరికొచ్చి, “లే ఇక్కణ్ణుంచి…” అని గదిమాయించాడు.

నయీం చెవులకు యజమాని మాటలు వింపుగా అనిపించలేదు.

“ఇంత గట్టిగా మాట్లాడబాకండి… రండి నాతో పాటు బడలిక తీర్చుకోండిక్కడ… ప్రశాంతంగా, నాలాగ పడుకొండి. కండ్లు మూసుకోండి… మీ శరీరాన్ని పూర్తిగా వదులుచేసుకొండి… మీ మెదడులో ఉన్న సమస్యల తోరణాలన్నింటిని విదిలించుకోండి… మీకే తెలుస్తుంది… ఎంత హాయిగా ఉందో ఇక్కడ! రండి నా పక్కన పడుకోండి.”

తోట యజమాని ఓ క్షణం ఆలోచించాడు. నయీంతో చెప్పాడు, “నువ్వు పిచ్చివాడివిలా ఉన్నావు!”

నయీం చిరు నవ్వుతో, “కాదు. మీరెప్పుడు పిచ్చివాళ్లను చూడలేదు. ఒకవేళ నేను పిచ్చివాడినే అయితే ఇలా గుబురుగా విస్తరించి ఉన్న ఈ చెట్ల కొమ్మలపై పసిపిల్లల బుగ్గల్లా వేలాడుతూన్న పువ్వులను చూసి ఆనందించేవాడిని కాదు. వెర్రిదనం సంతృప్తికి మారు పేరుకాదు మిత్రమా! కాని రండి పిచ్చి మాటలే మాట్లాడుకుందాం.”

“పిచ్చి పిచ్చి మాటలొదిలేసి వెళ్లిపో ఇక్కణ్ణుంచి” కోపంతో అన్నాడు. తన డ్రైవర్ ను పిలిచి నయీం ను బయటికి గెంటేయమని చెప్పాడు.

డ్రైవర్ తన యజమాని ఆజ్ఞను శిరసవహించాడు.

“అరెరే…ఇదేమిటిది? మర్యాదస్థుడవనిపించకోవట్లేదు!” నయీం చెప్పసాగాడు. కాని ఆ డ్రైవర్ అతన్ని గార్డెన్ బయటికి తోసేశాడు.

గార్డెన్ గేట్ దగ్గర ఉన్న బోర్డ్ పై నయీం దృష్టి పడింది. దాని పై తాటికాయలాంటి అక్షరాలతో రాసి ఉంది ‘అనుమతి లేనిదే ప్రవేశించకూడదు.’

నయీం చిన్నగా నవ్వుకున్నాడు.

ఆ బోర్డ్ పై తన దృష్టి పడకపోవడం పై ఆశ్చర్యపోయాడు! “కండ్లుండి కూడా కొన్ని వస్తువులు కనిపించవు!?” అని అనుకున్నాడు నయీం.

నయీం ఇక్కణ్ణుంచి చిత్రకళ ఎగ్జిబిషన్ చూడడానికెళ్లాడు. తన మనసును మరో వైపుకు మళ్లించడానికంటూ.

హాల్ లోకి ప్రవ్రేశించగానే నయీం కు ఆడవాళ్లు మొగవాళ్లు గోడలపై తగిలించిన పెయింటింగ్స్ చూస్తూన్న గుంపుల కనిపించాయి.

ఓ మొగాడు పార్సీ యువతి తో అంటున్నాడు, “ఈ పెయింటింగ్ చూశారా మీరు?” అని.

ఆ యువతి తదేకంగా ఆ పెయింటింగ్ ను చూశాక, “ఎంతో బాగుంది. వాస్తవంగా సహజంగా ఉంది!” అని అంది. బహుశా ఆమె అతనికి కాబోయే భార్యలా ఉంది.

మరో యువతి, “సురయా! ఇటొచ్చి ఈ చిత్రాలను చూడు. అక్కడ నిలబడి ఏం చేస్తున్నావ్?” అని ప్రశ్నించింది.

సురయాకు పెయింటింగ్స్ చూడడంలో ఎలాంటి అభిరుచీ లేదు. అసలు ఆమెకు అక్కడ తన బాయ్ ఫ్రెండ్ తో కలవాల్సుంది.

పెయింటింగ్స్ లో అంతగా అభిరుచి లేని వయసు మళ్ళిన ఓ వ్యక్తి, తన వయసు మళ్ళిన స్నేహితుడితో, “పడిశం వల్ల ఆమె రాలేదు. లేకుంటే తప్పకుండా వచ్చేది. నీకు తెలుసేకదా అమెకు పెయింటింగ్స్ అంటే ఎంత పిచ్చో! తను మంచి మంచి పెయింటింగ్స్ వేస్తుంది. మొన్న ఆమె పెన్సిల్ తో కాగితం పై తన చిన్న తమ్ముడి సైకిల్ చిత్రం చాలా బాగా చిత్రించింది. నేను చూసి ఆశ్చర్యపోయాను,” అని అన్నాడు.

నయీం వాళ్లకు దగ్గరగానే నిలబడి వింటున్నాడు. వ్యంగ్యాత్మకంగా అన్నాడు, “అచ్చం సైకిల్ లాగే కనిపించిందేమో!”

ఆ ఇద్దరు స్నేహితులు ‘ఎవ్వడ్రా వీడు మర్యాద తెలియని వెధవలా ఉన్నాడు’ అని అనుకొంటూ అందులో ఒకతనడిగాడు, “ఎవరండి మీరు?” గొంతులో కఠినత్వం చూపుతూ.

“నేనా…నేను…” కొద్ది పాటి క్రోధావేశం తో చెప్పాడు నయీం.

“నేనా…నేనని ఏమంటున్నావ్… చెప్పు ఎవరో నువ్వు?”

నయీం కొంచెం సంభాళించుకొని, “మీరు నెమ్మదిగా అడగండి… నేను చెప్తాను…”

“నువ్విక్కడికెలా వచ్చావ్?”

“నడుచుకొంటూ…” ముక్తసరిగా జవాబిచ్చాడు నయీం.

ఇరుగుపొరుగున ఉన్న వాళ్లు పెయింటింగ్స్ ను చూసే బదులు, ఏవేవో విషయాలపై చర్చించుకొంటున్నవాళ్లు నయీం జవాబు విని నవ్వసాగారు.

పెయింటింగ్స్ ఎక్సిబిషన్ నిర్వాహకుడు వచ్చాడు. అతడికి నయీం చేస్తున్న కొంటెతనం గురించి తెలిపారు.

అతడు కఠిన స్వరంతో అడిగాడు, “మీ దగ్గర కార్డ్ ఉందా?”

నయీం చాలా అమాయకంగా జవాబిచ్చాడు, “కార్డా… ఏలాంటి కార్డు… పోస్ట్ కార్డా?”

“అనుమతి లేకుండా ప్రవేశించావు. వెళ్లిపో ఇక్కణ్ణుంచి!” కోపంగా అన్నాడు.

నయీం అక్కడున్న ఓ అద్భుతమైన పెయింటింగ్ ను చూడాలనుకున్నాడు. కాని కుదరలేదు. అక్కణ్ణుంచి వెళ్లక తప్పలేదు.

నయీం నేరుగా ఇంటికి చేరుకున్నాడు.

తలుపు తట్టాడు.

అతని నౌకర్ ఫజ్లు తలుపు తెరిచాడు.

“నేను లోనికి రావచ్చా?” వేడుకొన్నాడు.

ఫజ్లు విస్తుబోయాడు.

“దొర… దొర… ఇది మీ ఇల్లు. అనుమతి దేనికి!?”

“కాదు ఫజ్లు… ఇది నా ఇల్లు కాదు… శాంతిని ప్రసాదించిన ఇల్లు నాదెలా అవుతుంది… నాకిప్పుడో కొత్త విషయం తెలిసింది…”

“ఏంటది దొర”

నయీం క్లుప్తంగా వివరించసాగాడు:

అదే… ఈ ఇల్లు నాది కాదు… కాని ఇక్కడి దుమ్ము ధూళి, ఇక్కడి చెత్తచెదారమంతా నాది. నాకు అప్రియమైన వస్తువులన్నీ నావి. ఈ ఇంట్లోని యే వస్తువులైతే నాకిష్టమైనవో అవి మరొకరికి సంబంధించినవి… దేవుడెరుగు. ఇవి ఎవరివో! ఈ వస్తువులను తాకడానికి నాకు భయంవేస్తోంది. ఏదైన మంచి వస్తువును ముట్టుకోవాలంటే ఒళ్లు జలదరిస్తోంది… ఈ నీళ్లు నావి కావు… ఈ గాలి నాది కాదు… ఈ ఆకాశం నాది కాదు… చలిని తట్టుకోవడానికి కప్పుకునే ఆ బ్లాంకెట్ నాది కాదు… అందుకే వీటన్నింటినుంచి స్వేచ్ఛ కోరుతున్నాను. ఫజ్లు వెళ్ళిపో… నువ్వు కూడా నావాడివి కావు…”

ఫజ్లు వెళ్లిపోయాడు.

రాత్రి పది గంటలు దాటిపోయాయి.

హీరా మండి లో ఉన్న ఓ వేశ్యా గృహం లోనుంచి వినిపిస్తున్న పాట, ‘ప్రియా నీవు లేనిది… శాంతించదు నా మనసు’ మధురామృత కంఠం లో నుంచి వెడలిన పదాలు గాలిలో ఎగురుతూ తన చెవులలో దూరసాగాయి.

నయీం ఆ వేశ్యా గృహంలో ప్రవేశించాడు.

లోపల ముజ్రా (నృత్యగానం) వింటూన్న నలుగురైదుగురిని చూశాడు.

నృత్యకారిణితో అడిగాడు, “ఈ సజ్జనులకు నా రాకతో ఏమైనా అభ్యంతరముంటుందా?”

వేశ్య మందహాసంతో “వారికి అభ్యంతరమేముంటుంది… అలా పరుపుగద్దె పై దయ చేయండి” అని అంది.

నయీం ఆసీనమైయ్యాడు. గదంతా కలయ చుశాడూ. వేశ్య తో అన్నాడు, “ఈ జాగ ఎంతో బాగుంది!”

వేశ్య మొహం సీరియస్ గా మారింది.

“తమరు నన్ను పరిహాసించడానికొచ్చారా? ఇది మంచి స్థలమా? ఇది నీచాతి నీచమైన స్థలం అనుకొంటారు.”

“ఇది మంచి స్థలమని ఎందుకన్నానంటే ‘ఇక్కడ అనుమతి లేకుండా ప్రవేశించకూడదు’ అన్న బోర్డ్ తగిలించబడలేదు.”

ఇది విన్న వేశ్య, అక్కడ ఆమె నృత్యగానం తిలకించడానికొచ్చిన తమాషాయీలు నవ్వసాగారు.

నయీం దృష్టిలో ప్రపంచం ఓ విధమైన వేశ్య లాంటిది. దీని నృత్యగానంతో ఆనందించడానికి ఇలాంటి తమాషాయీలొస్తుంటారు.

ఉర్దూ కథ : సాదత్ హసన్ మంటు

పూర్తి పేరు మహమ్మద్ అమ్జద్ అలి. స్వస్థలం ఖమ్మం. ఖమ్మం గవర్న్మెంట్  కాలేజీలో డిగ్రీ చదివారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ భోపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఎమెస్సి, ఎమ్మే, ఎఎల్ బి. మైసూర్ నుంచి సెరికల్చర్  డిప్లోమా. వృత్తిరీత్యా సౌది అరేబియాలో గత  ముప్పయ్ ఐదేండ్లకు పైగా ఉంటున్నారు. ప్రస్తుతం కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్సిటీ జెద్దా,  ప్రాజెక్ట్స్ డిపార్ట్మెంట్ లో లీడ్ ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్ట్ /సీనియర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.

తెలుగు చదవడం, రాయడం చిన్ననాటి నుంచే హాబీగా ఉంది. మొదట్లో కవితలు, తర్వాత కథలు, నవలలు  ఆ తర్వాత అనువాదాలు (ఇంగ్లీష్, హింది, ఉర్దూ భాషలలోనుంచి కథలు), సాహిత్య, రాజకీయ వ్యాసాలు రాస్తున్నారు. ఇంతవరకు రెండు నవలలు, ఒక కథా సంకలనం, కవితా సంకలనం, ఉర్దూలోనుంచి అనువదించిన కథా సంకలనం, ప్రపంచ భాషల నుంచి కథా సంకలనం ప్రచురితమయ్యాయి.

Leave a Reply