అనచ్ఛాదిత

అన్నా… ముత్యాలమ్మ ముందున్న
పోతురాజన్నా
మనసు దాచుకోవడం రానిదాన్ని
ఓ విషయం అడుగుతా
ఏ ముసుగుల్లేకుండా
సమాధానం చెప్తావా?


అసలు ప్రశ్నకు ఉపోద్ఘాతమే
అవమానంగా భావించకు
మౌనాన్ని ఆశ్రయించకు
శివుని ముందున్న బసవన్నా
ప్రారంభించక ముందే
ప్రశ్న నాకు ఆయుధం అవుతుందని భయపడకు
పరికరం చేసుకుంటానని సందేహ పడకు
హక్కు కోరుతానని ఆవేశ పడకు
మనసులో ఏదీ పెట్టుకోకుండా
నేను అడుగుతా


ఊరి నడిబొడ్డున ఉన్న బొడ్రాయన్నా
నువ్వన్నా చెప్పు
అప్రకటిత నిషేధాలు
అనధికార మరణ దండనలు
అనంగీకార యుద్ధ ప్రకటనలు
నిత్యాగ్ని పరీక్షలు
సర్వత్రా ఉన్మత్త లైంగిక వికటాట్టహాసాలు
ఎల్లవేళలా ఎల్లలులేని అవమానాలు
కురుచ ముసుగుల
పద్మ పత్రాల ఆహ్వానాలు
పైత్య ప్రకోపమేనా అన్నా
నెలల పసిబిడ్డ పై యాసిడ్ దాడి
ఎనిమిది పదుల పండు ముసలి పై అత్యాచారం
పశుప్రాయపు మొగుళ్ళ సహచర్యం
జంతు ప్రవృత్తుల తండ్రుల ఆగడం
తిరిగి చెడిన ఆడతనపు అగచాట్లేనా?

ఊరి పొలిమేరల్లో పోలేరమ్మా
సాక్షం చెప్పమ్మా
కామ మధాంధ మత్తగజాల ఉన్మత్త చర్యల సమర్థనలు ఎందుకు?
కాంక్రీటారణ్యంలో మొలుస్తున్న
పన్నెండేళ్ల పసి బాలింతలు
శాడిస్ట్ భర్తలను భరించవలసిన భార్యలు
తండ్రులను త్యాగం చేయాల్సిన దేహాలు
అనాచ్చాదిత అర్ధనగ్న ప్రదర్శన లేనా?
సురక్షత లేని
ఆరుబయట అవసరాలు మారని కాలం కాదా యంత్రంగా మారిన మనిషి
విలువలు వలువలు వదిలి
నియంత్రణ లేని విశృంఖలత ధరించి
జంతువు అయ్యాడని


చెట్టు చెట్టున కొలువున్న వనమా లచ్చిమీ
పెదవి విప్పి బదులీయమ్మా
ఈ గడ్డపైన నా దేహం అంటే
కోరికల ఎడారుల్లో దాహం తీర్చే
ఒయాసిస్సు మాత్రమేనా?
పవిత్ర సృష్టి కారక ప్రాణ లింగం అనుకున్నా జీవితమంటే ఆకలి కోరికల కాక లేనా?
అర్ధనారీశ్వరి అదృశ్య అనుభూతులనుకున్న సగపాలు మురిపాలు లేని ఆక్రమణలు
అభిక్రమణల అతిక్రమణల ఆరోపణలేనా?


అడవి కాలిపోతోంది
ఆడ జన్మ అంతరించిపోతోంది
కళ్లు తెరవండయ్యా…

జననం: ఖమ్మం జిల్లా, గార్ల మండలం పెద్ద కిష్టాపురం. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని. కవయిత్రి. రచనలు: కాలాన్ని జయిస్తూ నేను-2007(కవిత్వం), సుదీర్ఘ హత్య-2009(కవిత్వం), ఆత్మాన్వేషణ -2011(కథలు), అగ్ని లిపి-2012(తెలంగాణ ఉద్యమ కవిత్వం), జ్వలితార్ణవాలు- 2016(సాహిత్య సామాజిక వ్యాసాలు), సంపాదకత్వం: పరివ్యాప్త-2007(స్త్రీవాద కవిత్వం), రుంజ - 2013(విశ్వకర్మ కవుల కవిత్వం), ఖమ్మం కథలు - 2016(1911-2016వరకు 104 సంవత్సరాల, ఖమ్మం జిల్లా 104రచయితల 104కథలు), అక్షర పుష్పాలు-భావ సౌరభాలు - 2016 (ఖమ్మం బాల కవుల రచనల సంకలనం), ఓరు - 2017(జ్వలిత సాహిత్య సంక్షిప్త సమాలోచన). పనిచేసిన సాహితీ సంస్థలు: 'మట్టిపూలు', 'రుంజ', 'అఖిల భారత రచయిత్రుల సంఘం', 'దబరకం', 'తెలంగాణ విద్యావంతుల వేదిక'. ప్రస్తుతం సాహితీవనం మిద్దెతోట సాగు చేస్తున్నారు.

Leave a Reply