అధికారధేనువు

వేదఘోషలో యజ్ఞ మాంసమై
ముక్కలైన ఆటవిక ఆవు
ఇప్పుడు అధికార
కామధేనువు !

మాలాగ
ఆవులకి ఓట్లుండవు
అయితేనేం
అవి ఓట్లు తెచ్చే వనరు
మా మీదగా
నరమేధాల సృష్టికర్త !
పవిత్రమాత !!

ఇప్పుడు
స్కూలులో కాలేజీల్లో యూనివర్సిటీల్లలో
పార్లమెంటులో పేవుమెంటులో
పేపర్లలో టీవీల్లో సోషల్ మీడియాలో
అన్ని చోటుల్లో ఆవులే
మనుషులు మాయమైపోయి
జై గోమాతగోరూ!

చిన్నప్పుడు
వెంటాడిన సాధువుగా
వ్యాస పరిచయం
నేడు వేటాడే
క్రూర అస్త్రమై
హింసే పరమ గోధర్మమై !

నిన్న
యజ్ఞగుండంలో
నేడు
అధికార అగ్నిగుండంలో
నువ్వెప్పుడూ
బలిపశువ్వే!

***

ఓరి అమాయకుడా

ఇది దోపిడీ రాజ్యమని
పొంచివున్న ఫాసిస్ట్ పాలనని
అదిగో సమసమాజం
మరో ప్రపంచమంటూ
వాడెవడో మైకును వుద్రేకపర్చగానే
ఆలోచన లేకుండా అజ్ఞాతమయ్యావు
లెక్కలేసుకోకుండా లెక్కలోంచి తొలిగి
అమాయకంగా ఆకాశంలో
బొక్కబడ్డ సూర్యుడిలా

అన్యాయమని తెలిసినా తెలియనట్లు
దుర్మార్గాన్ని చూసీ చూడనట్టు
ధర్మ యుద్ధంలో దూకకుండా
దూకినా దెబ్బతగలకుండా
భద్రంగా బతకటం ఓ కళ
యూనివర్సిటీ టీచర్లులా

మాదిగ పల్లెయినా మాల ఇల్లైనా
ఆదివాసీ ఆడవయినా ఆడపిల్ల బతుకైనా
ట్రాక్టరోడైనా తోపుడు బండోడయినా
బడి పంతులైనా గుడి గంటలైనా
కాలేజీ అయినా కవిత్వమైనా
కుయ్యమంటానికి కుదరదిక
కయ్యానికి కాలు కదపనీయక
అన్నీ మార్కెట్ దిగ్బంధంలోనే
రాజ్యమోడు కాపలా తుపాకీతో

ఇప్పుడు ఏ కళా పనిచేయదు
యూనివర్సిటీవోడి ట్రిక్కులు
మాటకారుల మ్యాజిక్కులు
మర్యాదస్తుడి మౌన సంగీతము
అన్నీ బలాదూర్
నిరంకుశుడి పాట ముందు

ఇప్పుడు తప్పుకునే దారిలేదెవరికి
నిరంకుశుడి అంకుశానికి బలికాక తప్పదు
ప్రతిక్షణం చస్తున్నా బతుకుని నటించాలి
చావుపాటని కీర్తిస్తూ
నటన వెలిసాక బతుకు తెలిసాక
అమాయకుడిలాగానే
ఆందోళనజీవై
అమీ తుమీ తేల్చుకోటానికి సిద్ధమై

***

చెడగొట్టాలి

తాత్వికుడా
నువ్వు నాలుగురోడ్ల కూడలిలో
అబద్ధాల్ని అవహేళన చేస్తూ
ఆజ్ఞానాన్ని అసహ్యించుకొంటూ
అంధత్వానికి ఎదురు ప్రశ్నయి
అన్యాయాన్ని అనుకరించక
ఆధిపత్యాన్ని ఆమోదించక
గుడ్డి నమ్మకాలనుండి నిజాన్ని వేరుచేసి
జ్ఞానం రోజువారీ జీవన ధర్మమంటూ
మనల్ని మనం తరచిచూసుకోని
బతుకొక బతుకేనా అంటూ
కుళ్లిన విలువల విధేయతకి
ఎదురు తిరగబడమన్నందుకే గదా
నీకు చావు నోటీసు ఇచ్చింది!
కుర్రకారుని చెడగొడుతున్నావన్న
అభియోగం మోపింది !

సత్యశోధకుడా
నువ్వన్నట్టుగానే
పరలోకాలికి పరిగెత్తుకుండా
ఈ భూమ్మీద
నింపాదిగా నడిచేందుకు
జవసత్త్వాలుట్టి పడే
నిండు మనిషిగా బతికేందుకు
దేవుణ్ణి చంపేసి
పరాధీన భారాన్ని దించాల్సిందే !

ప్రజా ప్రేమికుడా
ఇంద్రజాలికుల
మాయా ప్రపంచాన్ని చెరిపేసి
పరాయీకరణని పారదోలేసి
మూర్ఖ మత ప్రవక్తల మాటలొద్దు
మోహ మార్కెట్టు కాక
మనిషే చరిత్ర నిర్మాతగా
శ్రమలోనే సర్వస్వముగా
జీవన తత్వంగా
బతుకు ఆచరణలోంచి
మెరిసిన విముక్తి గీతంగా!

స్వాప్నికుడా
దేవుడ్ని చూసినోడ్ని
స్వర్గలోకంలో అప్సరసలతో
నాట్యంచేసొచ్చినోడ్ని
నరకంలో వొళ్ళంతా కాలిపోయినోడ్ని
ఒక్కసారన్నా చూడాలనుకున్నా
తీరని కోరికగానే!

నీతి ప్రబోధకుడా
నిత్య దోపిడీకి బలై
అవమానాలతో దిగాలుపడిన
జాతి గుండెనిండా ధైర్యాన్ని వూది
నిజాన్ని పూసుకుని
నిర్భయంగా ఊరేగుతూ
నీతే న్యాయంగా జ్ఞానంగా
ఆత్మగౌరవంతో నుంచోబెట్టటమేకదా
తాత్విక నైతికతంటే !
న్యాయమంటే సామాజిక
వెలుగుల్ని మోసుకెళ్లటమేగా!

దార్శనికుడా
ఇప్పుడు అన్నీ అజ్ఞాన జాడలే
ఎటు చూసినా ఆధిపత్య ఊడలే
ఈ చీకటి ప్రపంచాన్ని
ప్రశ్నించే తాత్వికత కావాలిప్పుడు
అనినీతే రాజనీతయినప్పుడు
సామజిక దోపిడీయే జాతి
సంస్కృతి, నైతికతలైనప్పుడు
మతమూ మార్కెట్టు మురికిలో
మునిగిపోయినప్పుడు

నా తాత్వికుడా
చారిత్రక అపరాధానికి దూరంగా
మహోన్నత మానవీయం కోసం
సత్యవాక్కుల చిరునవ్వుతో
నేటి యువతరాన్నెట్టాగైనా
చెడగొట్టాల్సిందే

ప్రత్యామ్నాయ సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలపట్ల ఆసక్తి. తత్వశాస్త్ర అధ్యాపకుడు. "దళిత ఉద్యమం, వెలుగునీడలు" (వ్యాససంపుటి), "పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అంబేద్కర్," థీయరిటికల్ అండర్ స్టాండింగ్ ఆఫ్ దళిత్ మూవుమెంట్" రచయిత. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తుంటాడు.

Leave a Reply