అత్యాచారాలను పెంచి పోషిస్తున్న పాలకులు…

ఆదిమ సమాజంలో ఉత్పత్తి విధానం అభివృద్ధి కాలేదు. ఆహార సేకరణ కొరకు అందరు వేటలో పాల్గొనేవారు. దొరికిన ఆహారాన్ని అందరూ సమానంగా పంచుకునేవారు. ఒక మనిషి శ్రమను ఇంకో మనిషి దోచుకునే అవకాశం లేదు. అందుకే ఆ సమాజంలో మహిళలపై ఎలాంటి అణచివేత లేదు.

మాతృస్వామిక సమాజంలో పురుషులు వేటలో పాల్గొంటే, మహిళలు వ్యవసాయం చేసేవారు. వేటలో జంతువులు దొరకక పోతే మహిళలు చేసే వ్యవసాయమే గుంపులో ఉన్న అందరికీ ఆకలి తీర్చేది. సామాజిక జీవితం మహిళలు చేసే శ్రమ మీద ఆధారపడి ఉండటం తో ఆమెకు సామాజిక గుర్తింపు లభించింది. గుంపు పెళ్ళిల్లు జరిగినా, పుట్టిన పిల్లలు ఆమె ద్వారా గుర్తించబడి నారు. ఈ సమాజమే ఆమె మనుగడ పై ఆధారపడి ఉంది కాబట్టి ఆమె పై ఎలాంటి లైంగిక హింస, అణచివేత లేదు.

ఉత్పత్తి పని ముట్లలో వచ్చిన అభివృద్ధికరమైన మార్పు వల్ల వ్యవసాయంలో మిగులు ఏర్పడింది. పశుపోషణ లో ప్రాముఖ్యత పెరిగి మిగులు కొందరు సొంతం చేసుకోవడం వల్ల సొంత ఆస్తి ఏర్పడింది. ఆస్తి తో పాటు వర్గాలు, వర్గ అణచివేత మొదలు కావడంతో మాతృస్వామిక సమాజ స్థానం లో పితృస్వామిక సమాజం ఏర్పడింది. వారసత్వ గుర్తింపు కోసం గుంపు పెళ్లి స్థానంలో ఏక పత్ని వ్యవస్థ ఏర్పడింది. పిల్లలు తండ్రి ద్వారా గుర్తించ బడటం, ఉత్పత్తి సాధనాల పై మహిళలకు ఎలాంటి హక్కు లేకపోవడమే కాక, కేవలం పిల్లలను కనే సాధనంగా మారిపోయింది.

భూస్వామ్య సమాజంలో స్త్రీల శ్రమ కు చాలా తక్కువ వేతనం ఇవ్వడమే కాకుండా, లైంగిక హింస ఉండేది.

వెనుకబడిన దళిత మహిళల పై జోగిని, బసివిని, దేవదాసి లాంటి ఆచారాల పేరిట బలవంతంగా వ్యభిచారం చేయించారు.

భూస్వామ్య సంస్కృతి స్త్రీలను విలాస వస్తువుగా చూస్తే, సామ్రాజ్యవాద సంస్కృతి తమ వస్తువుల అమ్మకం కొరకు స్త్రీలను వ్యాపార ప్రకటనల్లో నగ్నంగా, అర్థనగ్నంగా చూపించడమే గాక, సినిమాలలో, టీవీలలో, సాహిత్యంలో అశ్లీలంగా అసభ్యంగా చిత్రీకరిస్తూ వ్యాపార సరుకుగా మార్చేసింది.

పితృస్వామ్యం సమాజం లో యెంత బలంగా ఉందో, కోర్టులు ఈ వైఖరిని ఏ విధంగా వ్యక్తం చేస్తాయో, మధుర సంఘటన వల్ల తేట తెల్లం అయ్యింది. 1987 మహారాష్ట్రలోని చంద్రాపూర్ కు చెందిన పదహారేళ్ల ఆదివాసి మధుర పై పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇద్దరు పోలీసులు అత్యాచారం చేశారు. మధుర అరచి గొడవ చేసిన సాక్ష్యాలు లేవని, ఆమె శరీరంపై గాయాలు కూడా లేవని అందుకే ఆమె అంగీకారం తోనే ఈ ఘటన జరిగిందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.

ఈ తీర్పు ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిగింది. ఆత్యచారాల పై మొట్టమొదటి సారి దేశవ్యాప్త ఆందోళన జరగడం ఈ కేసు తోనే మొదలయింది. మధుర రేప్ సంఘటన మనదేశంలో స్వయంప్రతిపత్తి మహిళా ఉద్యమ ఆరంభానికి కారణమైంది. జాతీయ స్థాయిలో నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలను సమన్వయం చేసుకుంటూ, ఆందోళనా కార్యక్రమాలు చేసింది. ఫలితంగా లా కమిషన్ రేప్ చట్టం లో నిర్దిష్టమైన సంస్కరణలు ప్రతిపాదించింది.

బాధితురాలిని విచారించే టప్పుడు ఆమె ప్రవర్తన కు సంబంధించిన విషయాలపై క్రాస్ ఎగ్జామినేషన్ చేయకూడదని, అంతేకాకుండా ఆమె వ్యక్తిగత జీవితం ఎటువంటి దైనప్పటికి, దానికి ఈ కేసుకు సంబంధం ఉండరాదని చెపుతూ భారతీయ సాక్షి చట్టం లో సవరణ జరిగింది.1960 నుంచి 1980 వరకు రేప్ చట్టానికి ఎటువంటి సవరణలు లేవు. 1983 లో అత్యాచార చట్టానికి చేసిన సవరణల లో చాలా స్పష్టంగా దోషులకు కనీసం ఏడు సంవత్సరాల శిక్ష వేయాలని, అత్యాచారం నిర్బంధించి జరిపితే (కస్టోడియల్ రేప్) ఆ శిక్ష పది సంవత్సరాలకు తక్కువ కాకూడదని చెప్పినప్పటికీ, ఈ 28 ఏళ్లలో ఈ నేరం చేసినవారికి శిక్ష పడిన కేసులు చాలా తక్కువ. అవి రెండు లేక మూడు సంవత్సరాల కు మించి శిక్ష పడలేదు.

1990 లో నూతన ఆర్థిక విధానాల పై భారత దేశం సంతకం పెట్టిన తర్వాత సామ్రాజ్యవాద దేశాలు పేద దేశాల మార్కెట్ పై కన్నేసి తన పెట్టుబడులను టూరిజం, హోటల్ పరిశ్రమల్లో పెట్టినారు. దీనివల్ల పసి పిల్లలు వేశ్యావృత్తిలోకి నెట్టి వేయబడ్డారు. దీంతో వీరి సంఖ్యలో భారత్ మొదటి స్థానం లోకి వెళ్లి పోయింది. కడు పేదరికంలో పొట్టకూటి కొరకు ఈ చిన్నారులు ఈ వృత్తిలోకి బలవంతంగా నెట్టి వేయబడ్డారు. సామ్రాజ్యవాద దేశాలు అందాల పోటీలను నిర్వహిస్తూ భారత్ లాంటి పెద్ద దేశాల మార్కెట్ గల మహిళల కు కిరీటం పెట్టి, కాస్మెటిక్ వస్తువులను తయారు చేసి, పెద్ద ఎత్తున మార్కెట్ లోకి దించి, మహిళలకు అందం సృహ ను పెంచింది. టీవీలలో వివిధ చానల్స్ కు అనుమతి నిచ్చి, ప్రకటనలను గుప్పించి, వినిమయ సంస్కృతి ని పెంచింది. మార్కెట్ తో పాటు, మహిళల పై హింసా రూపాలు కూడా పెరిగినాయి..

మరోవైపు ప్రభుత్వము సవరించి తెచ్చిన అత్యాచార చట్టం లో నీ మార్పులను, ఆచరణలోకి తేలేక పోయింది. ఫలితంగా 2007లో విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం లోని వాకపల్లి అనే గ్రామంలో 21 మంది పోలీసులు 11 మంది ఆదివాసి మహిళలు పైన అత్యాచారం చేస్తే, మహిళలు స్వయంగా చెప్పిన సాక్షం పనికి రాకుండా పోయింది. వారంతా హైదరాబాద్ కు వచ్చి మానవ హక్కుల కమిషన్ ముందు, హైకోర్టు ముందు తమపై పోలీసులు 20 ఆగస్టు 2007 తెల్లవారుజామున అత్యాచారం చేశారని చెప్పారు. మహిళలు చెప్పిన ప్రకారం ఆగస్టు ఇరవై తెల్లవారుజామున డ్యూటీ చేసిన వారందరిపై కేసు నమోదు చేయాలి. అలా జరగ లేదు. అలాంటప్పుడు ఇక్కడ మారిన చట్టం ఏమి ఉపయోగపడింది. భల్లుగూడ సంఘటన కూడా ఇలాగే జరిగింది. ఇక్కడ కూడా న్యాయం జరగలేదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని ప్రజాసంఘాలు, ఆదివాసీ దళిత బహుజన సంఘాలు ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనితో మారిన చట్టాలు అమలు కావడం లేదని స్పష్టమవుతుంది.

మీడియా లో పెరిగిన హింస, సెన్సారు లేని సినిమాలు రావడం తో అత్యాచారం చేసి వదిలేయడం కాకుండా, విపరీతంగా హింసించి చంపివేవడం మొదలయింది. దీనికి ఉదాహరణే నిర్భయ సంఘటన. డిసెంబర్ 2017 లో ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలను రోడ్లపైకి తెచ్చింది. ఉద్యమం ఉవ్వెత్తున వ్యాపించడం తో ప్రజలను శాంత పరచడానికి, మహిళలపై జరుగుతున్న నేరాలను అధ్యయనం చేయడానికి జస్టిస్ వర్మ కమిటీ ని యేర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వము. కమీషన్ కు 80 వేల సూచనలు రాగా, ఒక నెల లోపల 360 పేజీల నివేదిక ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

అత్యాచారానికి ఉరి వేయడాన్ని కమిటీ సమర్థించలేదు. దేశంలో మహిళలపై నేరాలు పెరగడానికి ప్రభుత్వ పాలనా వైఫల్యం, పోలీసుల స్పందన లేకపోవడం, వారి నిర్లక్ష్యంతో పాటు లింగవివక్ష ముఖ్య కారణమని పేర్కొంది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కొనసాగించే విషయాన్ని వీలైనంత త్వరగా సమీక్షించుకోవాలని, ఖాప్ పంచాయితీలు పై నియంత్రణ చేయాలని, అత్యాచారాలకు పాల్పడిన లేక పాల్పడుతున్న వ్యక్తిని బాధితురాలు హతమార్చడాన్నీ ఆత్మ రక్షణ హక్కుగా గుర్తించాలని ఇలాంటి ఎన్నో మంచి సూచనలు చేసింది. వర్మ కమిటీ ప్రభుత్వ వైఫల్యాలను స్పష్టంగా ఈ నివేదికలో పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ సూచనలు ఏవి తీసుకోలేదు. చివరికి తనకి అవసరమైన విషయాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం 2013 లో తీసుకొని వచ్చింది. ఈ చట్టం లో అత్యాచార కారకులకు 20 యేళ్ళ కారాగారం, లేదా జీవితఖైదు మొదలైనవి ఉన్నాయి. నిర్భయ చట్టం తర్వాత ఇవీ తగ్గకపోగా ఇంకా ఎక్కువ పెరిగాయి. దీనివల్ల చట్టాల వల్ల సమాజంలో మార్పు రాదని, ఇవి ఊరడింపు మాత్రమేనని అందరూ గుర్తించారు. మహిళలను సొంత ఆస్తి గా, విలాస వస్తువు గా చూసే ఈ పితృస్వామిక భావజాలం అత్యాచారాలు పెరగడానికి కారణం. ప్రభుత్వం ఒకపక్క వీటిని నిర్మూలించే ప్రయత్నం చేయక పోగా ఇంకో పక్క అత్యాచారాలను ఎక్కువ చేసే మద్యం, గుడుంబా, సారా, గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున్న తయారు చేస్తుంది.

మహిళలకు సంబంధించిన లైంగిక నేరాల విషయం లో నిందితులను అరెస్ట్ చేయాలన్న పోరాటాలు అన్ని వైపుల నుండి వస్తున్నాయి. ఫలితంగా ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది.

ఆయేషా మీరా అత్యాచారం హత్య కేసులో విజయవాడలో సత్యంబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి కోర్టు అతనికి శిక్ష వేసింది. శిక్ష విధించిన తర్వాత నిర్దోషి అని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసులో అప్పటి పురపాలక శాఖ మంత్రి కోనేరు రంగారావు మనువడి పాత్ర ఉందని ఎన్నోచోట్ల విద్యార్థి సంఘాలు, టిడిపి కార్యకర్తలు ఆయనను అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేశారు. మనువడిని రక్షించడానికి ఎవరో ఒకరిని అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో, కడు పేదవాడు దళితుడు అయిన సత్యంబాబును ఈ కేసులో ఇరికించారు అన్నది ప్రజలందరికీ తెలిసిన సత్యం.

కేసుకు సంబంధం లేని వక్తులను అరెస్ట్ చేస్తే, సమాజం నుండి కూడా తీవ్ర వ్యతిరేకత రావడం మొదలయింది. దీనితో ఈ ప్రయత్నాలు మానివేశారు. అత్యాచారం చేసిన వారిని చంపివేయాలని ప్రజల నుండి డిమాండ్ వచ్చిందని, తరువాత క్రమంలో నిందితులను చంపేస్తున్నారు పోలీసులు. వరంగల్ లో యాసిడ్ దాడి సంఘటనలో ఎన్కౌంటర్ చేసి, మొట్టమొదట నిందితులను చంపే ప్రక్రియను మొదలు పెట్టింది వైఎస్ ప్రభుత్వము. అప్పట్లోనే ఈ సంఘటన లో రెండు వాదనలు వచ్చాయి. చావు తో సమస్య పరిష్కారం కాదని కొందరు వాదిస్తే, ఇంకొందరు న్యాయ వ్యవస్థ విపరీతమైన సమయాన్ని తీసుకోవడం వల్ల నిందితులను చంపడమే పరిష్కారం గా చెప్పినారు. 2019 లో జరిగిన దిశ సంఘటనలో, 2020 లో జరిగిన సింగరేణి కాలని సంఘటనలో ప్రజల నుండి డిమాండ్ వచ్చిందనే కారణం తో మళ్లీ నిందితులను చంపడం జరిగింది. మద్యం తయారు చేయవద్దని, అశ్లీల సినిమాలు, టీవీ కార్యక్రమాలు నిషేధించాలని కూడా చాలా మంది ప్రజల నుండి, డిమాండ్ వస్తుంది. మరి ఈ విషయం యెందుకు తీసుకోవడం లేదు. ఫోర్న్ వెబ్సైట్ నిషేధించ మని మేధావుల నుండి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నుండి వచ్చిన సూచనలను పట్టించుకోలేదు ఈ పాలకులు.

దిశ సంఘటనలో బాధితురాలు అగ్ర కులానికి చెందిన మహిళ కాబట్టి, పోలీసులు వెంటనే స్పందించారు. అదే సమయంలో టేకు లక్ష్మి అనే దళిత మహిళ పై జరిగిన అత్యాచారం, హత్య విషయం లో ఎన్నో ఆందోళనలు జరిగినాయి. దిశ కేసు లో చట్ట విరుద్ధంగా చేసిన పోలీసులు, టేకు లక్ష్మి విషయం లో చేయవలసినది కూడా చేయలేదు. దీని వల్ల పాలకులకు కులం ఉందని ఇంకా బలంగా తెలిసింది.

ఒక సంఘటన జరిగిన వెంటనే ప్రజాసంఘాలు, ఆ సంఘటనపై నిజాలు తెలుసుకొని, వాటిని నివేదిక రూపం లో ప్రభుత్వానికి సమర్పిస్తున్నది. 17 ఆగస్టు 2021 గాంధీ ఆసుపత్రి లో అక్క చెల్లెళ్ల పై అత్యాచారం సంఘటన పై నిజనిర్ధారణ వెళ్ళగా మహిళా సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ లో ఉంచారు. ప్రజాస్వామ్యం అనే ముసుగు తగిలించుకున్న వ్యవస్థ లో నిజాలు తెలుసుకునే హక్కు కూడా లేకుండా చేస్తున్నాయి పాలక వర్గాలు. ఈ సంఘటనలో పోలీసుల విచారణ రెండు రోజులలో జరిగిపోయింది.

చెల్లెలు ఆసుపత్రి ప్రాంగణంలో రెండు రోజులు నగ్నంగా పడి ఉన్న విషయాన్ని పోలీసులు సమాధానం చెప్పకపోగా అక్క చెల్లెలు తాగుడు అలవాటు ఉన్నదని తాగినప్పుడు చెల్లెలు సెక్యూరిటీ గార్డ్ తో సంబంధం పెట్టుకుందని ఇక్కడ అత్యాచారం జరగలేదని , యెంతో వేగంగా కేసును ఛేదించారు.

పాలమూరు కు చెందిన ఈ ఇద్దరు మహిళలు చదువు రాని వారు. వెనుకబడ్డ జిల్లా లో పల్లెటూరు నుండి రాజధాని వచ్చి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారంటే, ఏమి జరగకపోతే ఇంత సాహసం చేయగలరా? పాలక వర్గాలు, పోలీసులు, కుమ్మక్కు అయ్యి, చివరికి నిందితుల నోళ్ళు మూయించారు.

కుటుంబ సభ్యులు చనిపోతే, ఆ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు లో ఉన్న వారిని అరెస్ట్ చేస్తారు పోలీసులు.

హైదరాబాదులో మియాపూర్లోని ఓంకార్ బస్తీలో 13 నెలల పాప అనుమానాస్పద మృతిపై నిజాలు తెలుసుకొనడానికి వెళితే జాగిలాలు చూపెట్టిన ఇంట్లో వ్యక్తిని అరెస్టు చేయకుండా, పాప తండ్రి రంగస్వామి ఆమె అక్క తో సంబంధాలు పెట్టుకొని ఆ గొడవలో పాపను వాళ్ళే చంపిన విషయం ఒప్పుకోమని పాప అమ్మమ్మ ను, రంగ స్వామి అక్క మైనరు పిల్లలను అరెస్టు చేసి, చిత్ర హింసలు పెట్టి, సంసార జీవితానికి పనికి రాకుండా చేస్తామని ఎస్ఐ, సీఐ వత్తిడి పెట్టినారు. నేరస్తునికి పోలీసులతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అతడిని అరెస్ట్ చేయలేదు. పాప శరీరమంతా గాట్లు కొరికిన గుర్తులు ఉన్నాయి.

వైజాగ్ పరిసర ప్రాంతాల్లో మైనర్ అమ్మాయి అపార్ట్మెంటు నుండి పడి చనిపోతే ఆమె మృతిపై పోలీసులు సరైన పరిశోధన చేయలేదు. పైనుంచి కింద పడితే తల ముక్కలవుతుంది. కానీ అదేమీ జరగలేదు. అమ్మాయిని చిత్రహింసలు పెట్టినట్లు మొహం పై గాట్లు ఉన్నాయి. అమ్మాయి చనిపోయిన వెంటనే తల్లిదండ్రులకు పోలీసులు వెంటనే డబ్బులు ఇచ్చి దహనసంస్కారాలు చేయండి అని హడావుడి చేశారు. ఇందులో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అమ్మాయి బాడీ సాక్ష్యంగా ఉంటుంది కాబట్టి పోలీసులు వాటిని ధ్వంసం చేసేందుకు ముందు పడ్డారు. అందుకే మొదట పోలీసుల పై కేసు పెట్టాలి. హత్య అంటే నిందితులను పట్టుకోవాలసి వస్తుంది. అందుకని ఆత్మహత్య చేసుకున్నదని కేసు మార్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

మధుర, షకీలా, రమిజాబి కేసులో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినప్పుడు వారు లాయర్లు, ప్రజా సంఘాల సహకారం తో కోర్టు లలో తమకు న్యాయం జరగాలని పోరాడినారు. బాధితులు బతికి ఉంటే తమకు ముప్పని, దోషులు తరువాతి క్రమంలో లో బాధితులనే మట్టు బెడుతున్నరు. ఇది సాక్ష్యం లేకుండా చేయడం తప్ప మరేమీ కాదు. నేడు తమ కుటుంబ సభ్యుల మరణాల పై విచారణ చేయాలని పోలీసులను ఆశ్రయించగా, చివరికి బాధితులనే నేరస్థులను చేస్తున్నారు. ఇది చాలా సులభమైన పద్ధతి . ఇది యిలాగే కొనసాగితే, మున్ముందు బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించే సంఖ్య తగ్గిపోతుంది. ఫ్రెండ్ లి పోలీసింగ్ అంటే ఇదేనేమో, పాలకులే దీనికి సమాధానం చెప్పాలి.

విదేశాల అప్పు పెరిగి పోవడం తో పాలకులు ఆర్థిక సంక్షోభాలలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వ రంగాలన్నింటిని ప్రైవేటు పరం చేస్తున్నారు. యెంతో మంది ఉపాధి కోల్పోయి, సరి అయిన పని దొరకక, చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఉన్నత విద్య చదివిన యువతకు ఉపాధి లేక మత్తు పదార్థాలకు, మద్యానికి అలవాటు పడుతున్నారు. ఇవి పరిష్కారం చేయకుండా నేరాలు తగ్గవు. ఇంకోవైపు అత్యాచారాలు తగ్గటానికి ఎన్కౌంటర్ పరిష్కారం చూపుతున్న ప్రభుత్వాలకు, తాము ఏరులై పారిస్తున్న మద్యం కానరాదు. ఫోర్న్ వెబ్సైట్లు నిషేదిస్తే కోట్ల ఆదాయాన్ని కోల్పోవలసి వస్తుంది. ఇంతకు ముందు సెన్సార్ బోర్డ్ గురించి చర్చ అయినా జరిగేది. అది పనిచేయక పోవడంతో ప్రస్తుతం సెన్సార్ బోర్డు ఉందని కూడా అందరూ మరచిపోయారు. ఈ మూలాలను ప్రభుత్వము మార్చే ప్రయత్నం చేయదు. యెందుకంటే ఒకవైపు వీటివల్ల వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకోదు. పాలకులు వీటి గురించి ఆలోచించరు. యెందుకంటే వారే ఈ నేరాలను చేస్తున్నారు. మత ముసుగులో జరిగిన అహస్రస్ సంఘటన చూస్తుంటే, హిందుత్వ వాదులు ఒక ప్లాన్ ప్రకారం యితర మతస్థులకు అణచివేస్తున్నట్లు అర్థమౌతుంది. వీరు ఇచ్చే స్టేట్మెంట్స్ లో మహిళ అంటే అనుభవించడానికి ఉన్న ఒక భోగ వస్తువు, ఆమె ప్రవర్తన, వేసుకునే వేషధారణ వల్లే, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అనే భావజాలం తో ఉన్నారు. ఇలాంటి పాలకులు ఉన్నప్పుడు అత్యాచారాలకు మూలాల గురించి ఆలోచించరు. అందుకే ప్రజలు వీటి మూలాలను తెలుసుకొని, వీటి గురించి ప్రభుత్వాలను నిలదీసే స్థాయికి రావాలి. కుటుంబాలలో అసమాన పెంపకం గురించి, నైతిక విలువలు లేని సిలబస్ గురించి, సమాజం లో బలంగా పేరుకొని పోయిన పితృస్వామ్యం గురించి చర్చలు జరగాలి. ఇలాంటివి జరిగినప్పుడు, ప్రజలు చైతన్యవంతులై మూలాల పై పాలకులను ప్రశ్నించగలరు. ఇది జరిగితేనే అత్యాచారాలు కొంత వరకు ఆగుతాయి.

మహిళలపై జరుగుతున్న ఎన్నోరకాల హింసలలో అత్యంత హేయమైనది అవమానకరమైనది అత్యాచారం. సమాజంలో అసమాన సంబంధాలలోని ఆధిపత్య స్థానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. పీడిత వర్గాలు కులాలు మతాలు జాతులు మొదలైన వివిధ వర్గాల పై, తమ ఆధిపత్యం చెలాయించడానికి వారిని అదుపులో ఉంచడానికి నిరంతరం ప్రయోగించే సాధనమే అత్యాచారం. సొంత ఆస్తి కి వారసులను కట్టబెట్టడానికి వచ్చిన పితృస్వామ్యం, తిరిగి ఈ సొంత ఆస్తి రద్దు అయితేనే అంతమవుతుంది. ఇటువంటి సమాజం వచ్చేవరకు వివక్ష, మహిళలపై లైంగిక దాడులు ఆగవు. ఈ ఉన్నత సమాజం కోసం అందరం కృషి చేద్దాం.

Leave a Reply