అత్యాచారం వ్యక్తిగతం కాదు… సామాజిక నేరం

ఓ బూర్జువా సమాజం నిర్మించే చట్టాలతో నేరాలను ఏ మేరకు కట్టడిచేయగలం? ఈ సమాజానికి ఇంకో అదనపు కోర కూడా ఉంది. అది పితృస్వామ్యం. పురుషుల ఆధీనంలో నడిచే వ్యవస్థ స్త్రీల సహజ హక్కులను కాపాడగలదా? మగాడు కేంద్రంగా తయారుచేయబడ్డ ఏ చట్టమూ సరిగా పని చేయదు. వరకట్న నిషేధ చట్టం దీనికో ఉదాహరణ. ఎందుకంటే రాజకీయాలు, రాజ్యాంగ యంత్రం, పోలీసూ, న్యాయవ్యవస్థ అన్నీ పితృస్వామిక ప్రభావంలో పని చేసేవే. కాబట్టి మహిళ పై జరిగే అత్యచారాలను ఆపడంలో వీటి పని తీరు సరిగా ఉండదు. నేరస్తుడికి శిక్ష పడుతుందో లేదో తెలియదు. కానీ ఈ కేసు నడిచే విధానం మాత్రం ఆమెను మానసికంగా కుంగదీస్తుంది.

మహిళలపై జరిగే డొమెస్టిక్ వయొలెన్స్ సంబంధించిత నేరాలూ, హత్యలూ లైంగిక హింస దానికి పరాకాష్ట రూపమైన రేప్ కంటే పెద్ద నేరాలు కాదు. మహిళకు పితృస్వామ్యం ఇచ్చే స్టేటస్ దృష్ట్యా చూసుకున్నా ప్రాకృతిక సూత్రాలను పాటిస్తూ సహజంగా ఆమె వ్యక్తి స్వేచ్ఛను గౌరవిస్తూ ఆమె సమాన హోదాను గౌరవించండం అనేది (ఈ వ్యవస్థ డీఎన్ఎలో లేదు)సాధ్యపడదు. ఇక్కడ కీలకమైందేమిటంటే కొద్దో గొప్పో మహిళలకుదొరికే న్యాయం కూడా జాబ్ లో భాగంగా అంటే వృత్తిలో భాగంగా దొరికేవే. కానీ సమానత్వ సూత్రాలపై ఆధారపడి కాదు. పోలీసులూ, లాయర్లూ, కోర్టులూ, ఇందులో మళ్ళీ మగ జడ్జీలు, ఆశ్చర్యకరంగా మహిళా హక్కులకై పోరాడే ఎన్జీవోలు కూడా తమ తమ వృత్తి ధర్మం(?) లో భాగంగానే న్యాయాన్యాయాలను పరిగణిస్తారు. దీని వల్ల విక్టిమ్ పాక్షిక న్యాయమే పొందగలరు. అది మార్జినలైజ్డ్, లెస్ ప్రివిలైజ్డ్ క్లాసెస్ విషయంలో ఈ న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న పధ్ధతుల పరిధి నుంచి చూసినా న్యాయం దొరకడం అసాధ్యం. అన్నింటికీ మించి న్యాయం వ్యవస్థలోని లోపాల వల్ల న్యాయం ఆలస్యం కావడం (ఈ మధ్యలో కేసు డీలా పడే ఆవకాశం కూడా ఉంది. చాలా కేసులు రాజీబాట పట్టేది ఇందుకే) ఒకెత్తైతే శిక్ష ఆ వ్యవస్థ లో భాగమైన వారందరికీ పడదు. వ్యక్తికి మాత్రమే శిక్ష పరిమితమైపోతుంది. కాబట్టి న్యాయం మసిపూసిన మారేడుకాయగా ఈ దేశంలో మిగిలిపోయింది. లీగల్ పరిభాషలో చెబితే స్టేటస్ కొనసాగుతుంది. సర్దుకుపోయే గుణం ఇక్కడ ఎక్కువ చెలామణిలో ఉంటుంది. కాబట్టే బూర్జువా వ్యవస్థలో న్యాయన్యాయాల జోలికిపోతే చేతులు కాలతాయి.

సహజ న్యాయ సూత్రాలంటే ఏమిటీ? అవి వ్యవస్థ ఆలోచనా విధానం నుంచి ఉధ్బవించేవి. దృక్ఫథం నుండి వచ్చేవి. మధ్య యుగాల్లో కంటికి కన్నూ పంటికి పన్ను అనేది సహజ న్యాయ సూత్రం. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అనేది భూస్వామ్య సహజ న్యాయ సూత్రం. మన బూర్జువా సమాజానికి కూడా సహజ న్యాయ సూత్రాలుంటాయి. అవి సహజ బూర్జువా న్యాయ సూత్రాలే! కాకపోతే దీనికొక పధ్ధతి పాడూ ఉన్నాయి. వీటిలో సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వీటికి ఆపారమైన పరిమితులుంటాయి. ఆర్థిక, సామాజిక హోదాను బట్టి అమలౌతాయి. వీటిలో ఉన్న లొసుగుల వల్ల లోపాయకారి అగ్రిమెంట్లవల్ల ఇవి సులువుగా మానుప్యూలేట్ కాబడతాయి. డబ్బున్న వారికి ఒకరకంగా, పేదవారికి ఒకరకంగా న్యాయం బట్వాడా జరుగుతుంది. మళ్ళీ కుల మత భేషజాల గురించి చెప్పక్కర్లేదు. ఈ విషయంలో అధికారుల అధికారానికి హెచ్చుతగ్గులుంటాయి. జడ్జ్ మెంట్ లు తారుమారవుతాయి. జడ్జీలు కూడా తారుమారవుతారు. కాంగ్రెస్ ఉన్నపుడు పులిలా గాండ్రించిన సుప్రీం కోర్టు మోడీ హయాంలో పిల్లిగా మారిపోయింది.

మన న్యాయవ్యవస్థ గురించీ, దాని పవిత్రత గురించిన సినిమాలు అనేకం వచ్చాయి. చట్టాలు సరిగా పని చేయడం లేదని చూపి శిక్షలు అమలు కావడం లేదని చూపి హీరో చేత హింసా న్యాయం జరిపించే సినిమాలు కోకొల్లలు. ఆ మధ్య కసబ్ గురించి వచ్చిన సినిమాల్లో ఇలాంటి కాల్చి పడేయక జైల్లో పెట్టి మేపడం ఏమిటీ అనీనూ, ఆ మధ్య ఆదరాబాదరగా దిశచట్టం తెచ్చిన ప్రభుత్వం ఇంకా న్యాయ కోవిదులతో చర్చల్లో ఉండగానే బూర్జువా న్యాయ సూత్రాలకు భిన్నంగా అసహజ మధ్యయుగాల కంటికి కన్ను పంటికి పన్ను సూత్రాన్ని పోలీసులు అమలు పరిచారు. ఇవీ హత్యలే. ఇలాంటి హత్యలకు ఎన్కౌంటర్ అనే ముద్దు పేరు కూడా ఉంది. ఇలాంటి హత్యలలో పోలీసులకు గతంలో బూర్జువా సహజ న్యాయసూత్రాల ప్రకారం శిక్షలు కూడా పడ్డాయి. ఇలా తాము రాసుకున్న చట్టాలనే తుంగలో తొక్కడం అనేది చాలా సాధారణం ఈ వ్యవస్థకి. దిశకు న్యాయం జరిగిపోయిందని సభ్యసమాజమూ, ఆ అమ్మాయి కుటుంబమూ పోలీసులకు సన్మానం జరిపారు. నిజానికి పోలీసులు తమ డ్యూటీ తప్పించుకోడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. కేసును నిందుతులు తప్పించుకోకుండా పకడ్బందీగా తయారు చేసి, నేరం జరిగిన మూలాల వరకూ వెళ్ళి, న్యాయస్థానం ముందుంచడం అనే ప్రక్రియ కు పోలీసులు తిలోదకాలిచ్చేసి హాయిగా నిందితులని కాల్చేసి వెళ్ళిపోవడం సులభం కదా!

అలాంటి ఇంకో సంఘటన జరగకుండా చూసుకున్నపుడు దిశకు న్యాయం జరిగనట్టౌతుంది కానీ నిందుతులని కాల్చిచంపడం ద్వారా కాదు, అనే జ్ఞానం జనంలోకి పోవాలి. అలా చేసే నైపుణ్యం ఈ వ్యవస్థ డీఎన్ఏలో లేదు. కసబ్ కేసు కానీ ఆ మధ్య నిర్భయ కేసు విచారణ ద్వారా మన న్యాయ ప్రక్రియ కి ఎంతో కొంత మానవీయత ఆపాదించబడింది. ఉరిశిక్ష పడడం ఆలస్యమైంది కానీ శిక్ష అమలు జరిగింది. ఇక్కడ శిక్ష అమలు కావడం ముఖ్యమా? అలాంటి సంఘటనలు పునరావృతం కాకపోవడం ముఖ్యమా? ఒక అభివృద్ధి చెందిన సమాజం ఎప్పుడూ నేరాలు పునరావృతం కాకపోవడం మీదనే ధ్యాస పెట్టాలి. దానికి అవసరమైన సంస్థాగతమైన మార్పులనూ సంస్కరణలనూ తీసుకురావాలి. ఆ నేరం జరగడానకి కారణమైన భిన్న పార్శ్వాలను పరిశీలించి దానికి తగ్గ మార్పులేవో తీసుకురావాలి. ఇక్కడ ఎవరికీ ఓపిక లేదు. నేరాలు మన మధ్యనే మన లాంటి వాళ్ళే చేస్తున్నారు. నిజానికి ఈ వ్యవస్థ అతి సామాన్యమైన మనుషులను ఎప్పుడో ఒకప్పుడు నేరస్తుడిగా మారుస్తుంది. అఖ్లాక్ హత్య జరిగినపుడు చాలా సామాన్యమైన హిందువులు కూడా పాల్గొన్నారు. దేవాలయ పూజారికి కూడా అందులో హస్తం ఉంది. కాశ్మీర్ లో దేవాలయంలో ముస్లిం చిన్నారి పై జరిగిన అత్యాచారంలో పాల్గొన్న వారెవరూ నేరచరిత కలిగిన వారు కాదు. కానీ అత్యంత ఘోరమైన నేరానికి పాల్పడడమే కాదు వారిని బీజేపీ దేశభక్తులుగా కీర్తిస్తోంది? లోపం ఎక్కడున్నట్టూ? ఈ హత్య వెనుక ఎన్ని కోణాలున్నాయీ? మతవివక్ష ప్రాంత వివక్ష ఇందులో వ్యవస్థీకృతమైందనడానికి ఉదాహరణ అవునా?కాదా?

ఈ నేపథ్యంలోనే అత్యాచారం కేసులను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాలి. మన దేశంలో అత్యాచారకేసులను ఎలా డీల్ చేస్తున్నారు. ఈ చట్టం రూపం సారం ఏమిటి? ఈ చట్టంలో పొందుపరిచిన అంశాలు రేప్ లను అడ్డుకోడానికీ, పునరావృత్తం కాకపోవడానికీ, నేరస్తుడిని శిక్షించడానికి ఉపయోగపడతాయా? దీని వల్ల అమాయకులేమన్న శిక్షకు గురయ్యే అవకాశం ఉందా? వంటి ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉంది.

అత్యాచారాలకు వ్యతిరేకంగా దేశంలో ఇప్పటికే చాలా చట్టాలున్నాయి. నిర్భయ దిశ లాంటివి. రేపు ఇంకోచోట రేపు జరిగినపుడు ఇంకో అమ్మాయి పేరు మీద ఇంకో చట్టం సిధ్ధం కావొచ్చు. చట్టాల అమలు బూర్జువా సమాజంలో ఓ ఎండమావి. వ్యవస్థలోని లోపాలను వ్యక్తిమీద రుద్ది చేతులు దులుపుకునేంత వరుకూ అత్యాచారాలు తగ్గవు అని చెప్పడానికి పెరుగుతున్న కేసులే రుజువు.

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

Leave a Reply