అడవి నుంచే మొదలెట్టాలి ..!

అడవి నుంచే ప్రయాణం మొదలెట్టాలి
కొండకోనల మీంచి దూకుతున్న జలపాతంలా
పులులు, సింహాల పిర్రల కిందకు సుర్రుమంటూ ప్రవహించాలి
నెమళ్ల రాజ్యాన్ని కలగనాలి
చెంగుచెంగున ఎగిరే జింకలతో జట్టు కట్టాలి

అడవి నుంచే ప్రయాణం మొదలెట్టాలి
కాలిబాట గుండా కిర్రు చెప్పులేస్కోని నడవాలి
కాళ్ళలో గుచ్చుకున్న ముళ్లను
కళ్ళతో పెకిలించాలి
రాళ్లు రప్పల్ని దాటుకుంటూ
అడవంతా చుట్టి రావాలి

తప్పదు మరి
అడవి నుంచే ప్రయాణించాలి
కొండలెక్కాలి , గుట్టలెక్కాలి
పిచ్చుక గూళ్లలో ఇంకా రెక్కలురాని పిట్టల
వీపులను నున్నగా నిమరాలి
విషం జిమ్మే పసిరిక పాముల్ని పసిగట్టాలి
కసిగా నెలకేసి కొట్టి గిరగిరా తిప్పి విసిరికొట్టాలి

అద్దరాతిరి సద్దుమణిగిన వేల
నెలవొంక ఒడిలో నిద్దరోతున్న
వాగు వంకల గుండె సప్పుళ్ళని
చెవొగ్గి ఆలకించాలి

ఎట్నుంచో పటేల్మని పేలిన తుపాకీ గుండుకు ఎదురొడ్డి
నేలకు రాలిపడిన పావురాయి వెచ్చటి నెత్తురును
తనువంతా రాసుకొని పూసుకోవాలి

మొదట అడవి నుంచే ప్రయాణించాలి
ఎటుపడితే అటు కాకుండా
చీకటి చెరసాలను చీల్చుకుంటూ
గూడెం బొడ్డుపేగు తెంచుకొని పుట్టిన
నల్లపిల్లోడి చేతిలో వెదురు బాణంలా
పురిటి వాసన పోని పచ్చి కవిత్వమై ఉదయించాలి…!

పుట్టిన ఊరు ఎర్రగొండపాలెం. ప్రస్తుత నివాసం ఒంగోలు. కవి, రచయిత, జర్నలిస్టు.  సాహిత్యం : ఖిబ్లా ( సంపాదకత్వం), జంగ్ ( సంపాదకత్వం ), నిప్పు ( సంకలనం ), ఒక దేశద్రోహి ప్రేమ కథ ( సంకలనం ), కథలు : లాకప్ డెత్,  ప్రతిజ్ఞ, నీకి - నాకి, ధక్కా.

One thought on “అడవి నుంచే మొదలెట్టాలి ..!

Leave a Reply