అగ్లీ బాయ్!

1
మాది ఈ రోజు….
‘గండుబిల్లి’కూర సార్.!
ఆ పిల్లాడి నోట ఈ మాట రాగానే
గొల్లున నవ్వింది తరగతి.!

ముక్కిరిసుకుంటా మూతి ముడుసుకుంటా
ఎనుక బేంచిల కూకున్న వాడిని
ఓక్కంటూ చూసిండ్రు పిల్లలంతా.!

ఆ నవ్వులు తనను గాయపరిచేవని
ఆ చూపులు తనను వెలివేస్తున్నయన్న సోయి లేనోడు.!

సిగ్గుపడలేదు ముడుసుక పోలేదు
తలవాల్చలేదు తల్లడం మెల్లడం కాలేదు.!
తనదైన స్టైల్లో…..
మా అయ్యా పిట్టల కొట్టుకత్తెనే
మా కడుపు‌కు తిండి
పిల్లి మా అయ్యా సిల్లకు చిక్కిన నాడు
మాకు పండుగ.!
మా బతుకే అడుక్కుతినడం
అదేమైనా దొంగ లంగ పనా సార్.!

గళ్ల ఎగిరేసి వాడి బతుకు చిత్రం విప్పినప్పుడు.!
తన ఆహార అస్థిత్వం
చెప్పినప్పుడు..

ముచ్చటేసినా….?!

లోపల ఏదో కోత
మనసులో మందుపాతర పేలిన మోత.!
ఎంత తొక్కి పెట్టినా
ముఖం అబద్దం ఆడదు.!
క్లాస్ అంతా పిండ్రాప్ సైలెన్స్
ఇంటర్నల్ సైక్లోన్.!

2
ఎద్దుకూర తిన్నోడికి
ఎక్కాలెక్కడ అత్తయి
లెక్కల రె(గు)డ్డి సారు ఎక్కిరింత..!

గొడ్డుకూర తింటే
నాలిక దొడ్డుగయితది
మాట తట్టుకుంటది
అందుకే మీరు తెలివిలేనోళ్లు.!
దోస్తుగాళ్ల సూటి పోటి మాటలు.!

చిన్నతనంల ఇష్టంగా తిన్న
చియ్యలకూర చిన్నబుచ్చే
ఎక్కిరింతలు.!

శ్రామిక వర్గ తిండి బట్ట హేళన చేసే మరుగుజ్జు తనం
రాజ్య సమర్పన
శాఖాహార జపం
ఆవుకూర అనుమాన ఆఖ్లాక్ ల బలి.!
బుర్రలో గిర్రున కాల చక్రం.!

3
పుడ్ ప్రొడక్షన్ లెస్సన్
టాపిక్ రాబట్టే క్రమంలో
ఈరోజు మీదేం కూర అనే ప్రశ్న తవ్విన జీవనం.!

వారి వారి కూరలు చెప్పి
కూసుంటుండ్రు పిల్లలు
వాడి వంతు వచ్చింది
రోజు అల్లరితో ఇప్పుడు కూరతో వైరల్ అయిండు.!

వాడి పేరు రాజు
సొంత దేశం లేని రాజు.!
ఏడాది కోసారి వాడి ఆధార్ కార్డులో అడ్రస్ మారుతుంది.!
ఊరవతల ఆరడుగుల డేరా తన నివాసం.!

అల్లరితో ఉపాద్యాయులను
ఉక్కిరి బిక్కిరి చేస్తడు.!
ఏ తప్పు జరిగినా నేరం వాడి మీదనే మోపబడును.!
పిల్లలంత వాడి వల్ల
కరాబు అయితండ్రు అనే
నింద నిత్యం మోస్తడు.!
అయినా అనుకడు జనుకడు.!

ఎవడు బడితే వాడిని
బడిలో చేర్పించు కోవద్దు
పేరెంట్స్ వార్నింగ్ లో అంటరాని అవమానాన్ని
మోస్తున్న వాడ తోబుట్టువు వీడు.!

అటెండర్ స్వీపర్ లేని
మా బడిలో అన్ని పనులకు ఆధారం
నల్లని ముఖము
నవ్వు నవనీతము
నోరు తెరిస్తే ఏబెరుకు లేకుండా
బండ బూతులు ఒదులుతడు.!

సత్యం ఓ స్వరమైనపుడు పిచ్చి కూతలు కక్కే నాగరికుల కంటే
బుద్దిలో ఏ మరక లేని వాడి
నోటి దురుసు నాకు అభ్యంతరం లేదు.!

నిరంతర ఆ చలనం
పోయినేడు మా బడిలో చేరిండు
మా బడి వాడికి పెట్టిన
ముద్దు పేరు’అగ్లీ బాయ్’.!

4
ఓ రోజు చినిగిన అంగితో వస్తే
దగ్గరకు పిలిచి
వాడి మొల్దారానికున్న పిన్నీసు తీసి పెట్టా.!

మా అయ్యాగూడ మీలా దగ్గరికి తీసుకోడు.!
మా అవ్వగూడ ఇలా పట్టించుకోదు.!
మురిసిపోతు చెబుతున్న వాడి కన్నుల్లో ఓ మెరుపు.!

అలా మనసులో ముద్ర బడ్డ బుడ్డోడు
ఈనడుమ బడికత్తలేడని
ఫోనులో ఆరాతీశా….

నవ్వుతూనే నమస్తే పెట్టిండు
ఏరా బడికత్త లేవేంది.!?

ఈ ఏడు మా డేరా
పక్కూరికి మారింది సార్.!
మనసు కలికలైంది.!

తేరుకొని మరి హాస్టల్ కు పోతవా.?!
వదిలేయండి సార్ ఏడ
ఉంటే అదే మా ప్రపంచం.!
కుదిరినప్పుడు బడికత్త
పేరు తీసెయ్యకుండ్రి కుండబద్దలు గొట్టిండు.!

విశాల భారతవనిలో
ఇంచు జాగ లేని సంచారం నక్షత్రలేన్నో.!?
మనసు సుడులు తిరుగు తుంటే
మంచిగుండు మరిచిపోకు ఈ సారి గండు బిల్లి పడ్డప్పుడు తిండికి పిలువు అని ఫోన్ కట్ చేశా.!

చారిత్రక పరకాల పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో గల రంగయ్యపల్లి స్వగ్రామం. రేగొండ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. కవి, రచయిత, అధ్యాపకుడు. ఎంఏ(ఎకనామిక్స్), ఎంఈడీ కాకతీయ యూనివర్సిటీలో చదివారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి, సాంఘిక శాస్త్ర బోధన. సమకాలీన అంశాల మీద తక్షణ స్పందనగా "చిలువేరు చురకలు" వారం వారం రాస్తూ సమాజాన్ని మేల్కొలపాలనే సామాజిక బాధ్యతతో కవిత్వ ప్రయాణం. "అమ్మచెక్కిన అక్షరం" తొలి కవితా సంపుటి. విద్యా విధానం మీద పది వ్యాసాలు, నాలుగు కథలు, వందకు పైగా కవితలు నిరంతర కవిత్వ సాగు. ప్రజాతంత్ర భావజాలంతో మమేకమవుతూ ప్రజా పోరాటాలలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.

One thought on “అగ్లీ బాయ్!

Leave a Reply