అగ్ని గీతిక

అనంత రోదసిలో బంతులాడే
గోళాల నిర్విరామ చలనాన్నీ
పాలపుంతల పొదుగుల్లోంచి స్రవించే
తెలి వెలి పారదర్శక సోనలనూ
పగటికి కొనసాగింపైన సాయం సంధ్యనూ
దాన్ని తనలో కలుపుకొనే రాత్రినీ
అది ఉషోదయమై ప్రసవించే
వెలుతురు ముద్దనూ
రంగు రంగుల రుతువులనూ
పిక్కటిల్లే సముద్రాలనూ
అన్నిటినీ కలిపి కుట్టే
హేతువు లోకి దూర్చిన
అంతస్సూత్ర మేదో ఉండే ఉంటుంది


నువ్వేంటీ
హేతు స్స్రోతస్సులను పనిగట్టుకొని
సంప్రదాయపు టెడారుల్లో ఇంకిస్తున్నావు?
ఇటు చూడు
స్కాంలకు స్కాంలను వాతాపి జీర్ణం చేసేసే
దొంగ స్వాముల మాయాబజార్లు కావు
ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు
భ్రమింపజేసే మాయల మరాఠిల
రాజకీయ మయ సభలు కావు


ఇవి…
తవ్విన కొద్దీ పొరలు పొరలుగా బయట పడే
విజ్ణాన ఖనులు!
ఆగామి కాల పత్ర హరితాన్ని కల గనే
విశ్వ వనులు!


ఇక్కడ…
అణువు అణువూ కాంతి పుంజాలై వెలిగే
తేజో మయ దేహులు
అపార అక్షర జలధుల మథనం నుంచి పుట్టిన
విద్యుత్తు నర నరాలలో ప్రవహించే
శక్తి వాహులు


నువ్వు ఆర్పబోతున్నది ఉత్త నిప్పుకణికలను కాదు
భావి తరాల కందనున్న
విశ్వ విజ్ణాన అఖండ జ్యోతులను
చైతన్యం ఆకృతి దాల్చిన వీళ్లకు ఏ పేరైతేనేం
ఒక్కొక్కరూ నివురుగప్పిన
ఒక్కో అగ్నిపర్వతం!
వాటిని కదిలించకు
అవి విస్ఫోటిస్తే వెడలే అగ్ని ప్రవాహంలో
బూడిదవై కొట్టుకు పోతావ్ !

కవి, రచయిత, అధ్యాపకుడు. రచనలు: లంబా హై సఫర్( సమగ్ర కవిత్వం),  కొండా... కోనల్లో...(కథలు), దూరాల చేరువలో.

Leave a Reply