అగ్గిపూల దారి

యేన్నో దూరాన మొదాటి పుంజులు గూత్తాంది.

బురద రోడు మీద ఈరడు కొడుకు శంకర్ బిర్ర బిర్ర నడుత్తర్రు.
ఆ బురదల అయ్యతోని జెపజెప అడుగులు వడ్తలేవు శంకర్కి. ఒగ సేతిల శంకర్… ఒగ సేతిల బట్టలున్న ముల్లె వట్టుకొని నడ్తండు ఈరడు గాని, ఈరనికి గుండెలవిసి పొయ్యే దుక్కముంది.

ఐదేండ్ల పోరణప్పుడు అవ్వ సచ్చిపెయినా ఈరనికి మేనత్త బూదక్క అవ్వైంది. కైకిలి గంబడివొయ్యి బుదక్క కొడుకు లచ్చనితోని ఈరన్ని వెంచింది. పన్నెండేండ్లు నిండంగనే పాలోల్ల ఊల్లె ఒక మంచి పిల్లుంది అంటె పోయింరు ఒగనాడు మబ్బుల నడుసుకుంట. అంబటాల్లకు ఆడికి జేరి… ముందుగాల బూదక్క పెద్ద మామింటికి వోయి, మాట ముచ్చట ఇషారం జేసి… నాగని ఎంకటేసు ఇంటికి వోయిర్రు.

ఎంకటేసుకు ఒక్కతే బిడ్డ నర్సవ్వ. బిడ్డెనుక ఒక పిలగాడు వుట్టి బగ్గ జరమచ్చి సచ్చిపేయిండు. ఎంకటేసుకు భూములు జాగలేం లేవు. సిన్న గుడిసె, దానెనుక ఓ గుంట పెరడి గంతె.
పెండ్లి బలం దొబ్బుకస్తే ఎవలాపిన ఆగది అన్నట్టు… నెల లోపట్నే ఇంత సిన్నగ ఈరనికి నర్సవ్వకు లగ్గమాయే. అన్ని కార్యాలు ఎంకటేసే సేపిచ్చిండు.
అట్ల పదారు పండుగు ఐనంక ఎడ్ల కచ్చులంల తోలుకచ్చిర్రు నర్సవ్వను ఈరన్ని.

అట్ల ఒక రోజు రెండు రోజులు… నాలుగు.. పది.. నెల… మున్నెళ్లు…ఎనిమిది నెల్లు గడిసిపాయే.
పొల్ల ఎంత ముద్దుగుందని ఇంటిసుట్టు ఆడోల్లు అందరనుడుకు బూదక్క ఉబ్బిపెయింది. అట్లా ఎనిమిది నెల్లకు నర్సవ్వ నీళ్లు వోసుకుంది. పొద్దులు వడ్డంక ఎంకటేసు పెండ్లం లచ్చక్క తోల్క పేయింది. ఓనాడు పుంజులు గుయ్యంగ ఈరనికి కొడుకు వుట్టిండు. పురుడు.. తొట్లెసుడు అయ్యి… శంకర్ అని పేరు వెట్టిర్రు. అట్లనే బూదక్క కొడుక్కు గూడా పక్కూరు తెలిసిన కాడ లగ్గం జేసింది శెందిరి తోని..

ఏరు వోసింది ఆల్లకు గానీ పిలగండ్లు కాలేదు ఇంక. ఇగ ఎవలి సందల ఆళ్లు ఉన్నది తినుకుంట బతుకుతన్రు.

ఆ ఊల్లే జరిగేది ఇంకొక తీరుంది.
ఆ ఊరికి ఒక కర్ణం ఉన్నడు దొరలెక్క. ఆ కర్ణంకు ఇద్దరు వెండ్లాలు.
పెద్దామెకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు. సిన్నామెకు ఇద్దరు కొడుకులు. పెద్దామె బిడ్డలు కొడుకులను దీసుకొని పట్నం బొయ్యి ఉన్నది. ఇగ సిన్నామె కొడుకులు ఊల్లే ఉండేది. కర్ణం ఒకనాడు నిద్రలనే జివునం ఇడిసిండు. దినాలు అయ్యేదాకా అందరుండి మాసికాలు ఐనంక ఎవలిది ఆల్లు పంచుకొని పొయిర్రు. సిన్నామెకున్న ఇద్దరు కొడుకులకు లగ్గాలు జేశింది. పెద్ద కొడుకు కోడలు కార్ల వొంగ లారీ టక్కరిచ్చి ఆడిదాన్నే సచ్చిపెయిర్రు. మిగిలిన సిన్న కొడుక్కు నలుగురు కొడుకులు, ఒక బిడ్డ వుట్టింది.

మొదాటి ఇద్దరు కొడుకులు, బిడ్డ సద్వులకు లండన్ వెయిర్రు.
ఇగ రెండో నడిపి కొడుకు సిన్న కొడుకు ఇంటి పట్టునున్నరు. ఇగ ఈల్లు ఊల్లె జనాలను పీడిచ్చుడు.. ఎగిచ్చుడు సిన్నగ లేదు. మంచిగ పంట వండే భూములను గుంజుకున్నరు. గట్టిగ అడిగినొన్ని ఊరందరి ముంగట బట్టలిప్పి కారప్పొడి వొసి తన్ని సంపిర్రు.

ఇగ ఆళ్ల అంతురాల బిల్లింగు ముంగటి కెళ్ళి వొయ్యే ఏ ఆడిది నచ్చుతె దాన్ని గుంజుకచ్చుకున్నరు.

పసి వోరి కాన్నుంచి… పిల్ల తల్లులు.. నడీడు ఆడోల్లను గూడా ఇడిసి పెట్టలేదు.

ఈ ఇద్దరు అన్నదమ్ముల కింద పనిజేసే బుచ్చడు… పోలీస్ పటేల్ ఎప్పుడు ఎక్కడ ఎవతి మంచిగుంది.. ఎవడు జనాలను ఎగెత్తండు అర్సుకొని, ఆల్ల సెవులేసేది. ఆ తెల్లారి ఒక పీనుగు లేసేది వూల్లె. ఈల్లను ఆపుటానికి ఎవలత్తరని కనవడ్డ రాయికి రప్పకు మొక్కుతర్రు ఊరి జనం. అట్ల ఒకనాడు బూదక్క బర్రె పెయ్యకు ఇంత గడ్డి గోసుకొని పోలాలెంబడి అత్తంది నర్సవ్వ. గప్పుడే ఎదో పని మీద వొయిన బుచ్చడు నర్సవ్వను సూసేవరకు ఆని పాపపు కండ్లు మెరిసినయ్.

నర్సవ్వ దూరం వోయే దాకా సూసి.. మెల్లగ ఎనుక వోయిండు. ఆనికి అర్థమైంది అది బూదక్క కోడలో… బిడ్డో అని. ఎవతైతే ఎందని అట్నున్చటే పొయ్యి సిన్న దొర సెవ్వులేసిండు.

అన్నదమ్ములు ఎదో మాట్లాడుకొని నడిజాం రాత్రి పోలీస్ పటేల్ ను పిలిశి.. జీపు తీసి… బూదక్కింటికి నడిపిర్రు. పోవుడు తోనే బూది కొడుకు మేనల్లుడు ఈరన్ని.. ఈరని కొడుకు శంకరును బైటికి ఇగ్గి గుంజెలకు కట్టేశిర్రు. అడ్డమచ్చిన బూదక్కను ఒక్కటి వెడితే గలుమకు గుద్దుకొని అడ్డంవడ్డది. అప్పటికే నర్సవ్వ… శెందిరి పెరట్లకు ఉరికిర్రు గాని… పటెలుకు.. బుచ్చనికి దొర్కి ఎంటుకలు వట్టి గుంజుకచ్చిర్రు ఇద్దర్ని.

ఆ రాత్రి నర్సవ్వ.. షెందిరి ఆ నాలుగు అడివి జంతువులకు పలారమైర్రు. షెందిరి సోయి తప్పింది. నర్సవ్వ గుంజి పారేసిన సీరను సుట్టుకొని కడుపు వలిగే దాక ఏడిసింది. దాని ఏడుపుకు నడుమిరిగిన బూదక్క పాక్కుంటచ్చి నర్సిని వట్టుకోని ఏడిశింది. ఇదంత ఇనవడ్డా.. ఇంటిసుట్టూ ఎవలు గూడా ఇంటి గలుమ దాటి బైటికి రాలేదు.

ఏడిసేడిశి బూదక్కను అటు నూకి లేసిందీ.. బైటికి ఉరికి పొయ్యి.. ఇంటి ముంగటి గట్టు సిన్నయ్య పెరట్లున్న బాయిల దునికింది.

నర్సవ్వ ఉరుకుడు సూసి… ”రాల్లో నా బిడ్డను కాపాడుల్లో” అని వాడ వాడంత ఇనవడేటట్టు మొత్తుకుంది బూదక్క.

గప్పుడు ఇంటి సుట్టుపక్కలున్నొల్లు అందినోల్లు అందినట్టు గట్టు సిన్నయ్య ఇంటెనుక పెరటి దిక్కు ఉరికిర్రూ. అప్పటికే నర్సవ్వ అడుగువట్టింది. నుయ్యిల దిగుటానికి ఎనుకాముందు జెత్తర్రు మొగొల్లు. ఆడోల్లు లబ్బలబ్బ మొత్తుకుంటర్రు. ఆకరికి సాకలి బాలిగాడు దునికిండు. ఆన్ని జూసి ఇంకో ఇద్దరు దునికిర్రు.
అడుగువట్టిన నర్సవ్వను మీదికి తెచ్చిర్రు. అప్పటికే పానం ఇడిసింది. ఈ లోపట ఈరిగాన్ని, లచ్చన్ని, ఈరని కొడుకు శంకర్.. సాతగాకున్న బూదక్క అందరు ఉరికచ్చిర్రు.

ఈరడు పెండ్లాం మీద వడి బొచ్చె గుద్దుకుంట ఏడుత్తండు.
ఏమైతందో తెల్వక శంకర్ గూడా ”అవ్వా అవ్వా” అని ఏడుత్తండు.
ఈల్లతోని వాడ వాడంత ఏడుపులతోని దద్దరిల్లింది.
బలబల తెల్లారే వరకు కట్టెలు.. పాడె తయారు జెత్తర్రు. అప్పటికే నర్సవ్వ అవ్వ నాయినల ఇంటికి కవరందింది బిడ్డ నూతిల వడి సచ్చిపెయిందని.

ఆడికెళ్ళి ఆళ్లు మొత్తుకుంట ఉరికచ్చి బిడ్డ మీద వడి ఏడుత్తర్రు. ఎవలిని ఆపెటట్టు లేదు అక్కడ. పినుగు కాలేసే పనులు సగవెడుతన్రు ఆల్లీళ్లు. అట్ల నర్సవ్వ సచ్చిపొయి దినాలైనయ్. బతికున్నోల్లు గూడా ఎడిసి ఎడిసి పినిగులైన్రు.

లచ్చడు.. ఆని పెండ్లాం ఊల్లుండలేక అత్తగారి ఊరికి ఎల్లిపెయిర్రు. మెల్లగ ఒక మూడు నెల్లైనంక… ఓ రోజు నడిజాం లేసి.. బూదక్కను లేపి మాట్లాడిండు ఈరడు. ఏడిసింది ముసలిది. దైర్ణం దెచ్చుకొని ఒగ సంచిల ఈరనియి శంకర్ బట్టలు కుచ్చింది., పైలం బిడ్డ అని సాగదోలింది సప్పుడు గాకుంట.

ఊరు దాటే వరకు గొఱ్ఱుకొయ్యల సుక్కలు పడమటికి గుకుతన్నయ్.

బురద రోడు మీద జెప్ప జెప్ప నడువత్తలేదు శంకరికి. అయ్యెంబడి ఉరుక్కుంట నడుసుకుంట ఊరి రొడ్డం దాటి… రొడు అవుతలి కచ్చులాల బాట అందుకున్నరు.
ఇగ అట్ల కుంట పక్కపొంటి డాంబర్ రోడ్ మీదికచ్చి ఏదన్న లారీ అత్తదని సూత్తర్రు పట్నం బోవుటానికి. అడిగినోళ్లకు… ఉండబుద్ది గాక ఊల్లెకెళ్ళి ఎల్లిపెయిండు అని ఏడుసుకుంట జెప్పింది బూదక్క.

అది జరిగిన ఏడాదికి… వూల్లే పోషమ్మ బోనాలు ఐతన్నయ్.

ఎక్కడికక్కడ ఆడపోషమ్మలు.. ఊరవోసుకు మేకలు కోళ్ళు తెగుతన్నయ్.

ఆనాడు ఐతారం.. దొరలు నాటుకోల్లు.. దుప్పి మాంసం దెప్పిచ్చి, పట్నం నుంచి తెచ్చిన ఎర్రమందు తాగుదం అని అనుకొంగ… ఏడికెల్లో ఒగ నలుగురు మొగోల్లు.. అందరు పడుసు పోరగండ్లు అసొంటోల్లే.. లొల్లి వెట్టుకుంట అచ్చిర్రు.

“నా పొలం జరుపుకున్నవ్” అని ఒకడంటే..
”అది నీది గాదు.. అయ్య నాకిచ్చిండు…” అని ఇంకొకడు.
”మొత్తం మీరె దున్నుకుంటే మా బతుకులు ఎందని మిగిలినిద్దరు..” అంత గాయ్ గాయి ఒర్రుతన్రు.

“అరే ఓ బాడకావుల్లార.. ఎవర్ర మీరు.. ఎందుకు ఒర్రుతర్రు..”అని లేసిండు సిన్న దొర.
“అయ్యా.. మీ కాళ్లు మొక్కుతా.. నా పొలం.. మా అయ్య నాకిచ్చిన పొలం నేను దున్నుకుంటె.. ఓర్తలేరు బాంచెన్.. మీరె జెప్పాలె ఈళ్లకు గట్టిగ” అన్నడు ముంగట నిలవడ్డోడు.

ఎనుక ఇద్దరు అందుకున్నరు మల్ల…
“అయ్యా అది అందరి పొత్తుల పొలం.. ఈడు ఒక్కడే గుంజుకుంటండు.. ఎట్లన్న అది మాకిప్పియ్యుర్రి” అని.

అసలే తాగుడు మోజుమీదున్న అన్నదమ్ములు.. ”రేపు పొద్దుగాల రాపొర్రి” అని జెప్పిర్రు.

ఇదంత ఆన్నే గూసొని సూత్తన్న పోలీస్ పటెలు.. ”అరెయ్ నడువుర్రి ఈడికెల్లి” అని గద్దరాయించిర్రు.

ముంగటున్నొడు.. జెప్పన దొర కాల్లందుకొని.. ”దొరా గట్లనకుర్రి బాంచేన్” అని కాళ్లు గట్టిగ వట్టుకొంగనే.. ఎనుక ముగ్గురు అంగెనుక వెట్టుకున్న కత్తి దీసి సిన్న దొర మెడ మూడుసార్లు నరికిర్రు. పక్కపొంటి కూసున్న పెద్ద దొర కడుపుల నరికి.. పటేల్..బుచ్చని ఎంబడి వడ్డరు. అప్పటికే బుచ్చడు ఎడ్లు గట్టేసిన దొడ్లెకు ఉరికిండు. ఆని ఎంబడి వడ్డ ఇద్దరు దొడ్లెకెల్లి గుంజుకచ్చి ఆకిట్ల పెద్ద దర్వాజ కాడ గేటు ముంగట మెడ మీద ఒక్క పెటు వెడ్తే… తల ఎగిరి ఆడ వడ్డది.

ఇగ పోలిస్ పటేల్ ను బొత్తల..ఈపుల కత్తుల తొని కుచ్చి కుచ్చీ ఇడిసి పెట్టిర్రు. అప్పటికే ఇంట్ల ఆడొల్లు గజ్జగజ్జ వనుక్కుంట మొత్తుకుంటర్రూ. పనోల్లు.. గాని పాలేర్లు గానీ ఒక్కలు ముందటికి అత్తలేరు. అట్లనే మీది అర్రల మంచం మీద పన్న వీళ్ళ అయ్యను గూడా లేపెసి… బైట వడ్డరు అచ్చినోల్లు. ఒక్కటె రోజు మస్తు లగ్గాలు ఐనట్టు.. ఇక్కడ నరికి పక్కూరి కర్ణం రామయ్యను అనుమాండ్ల గుడికాడ కట్టేసి మెడ నరికిర్రు. తెల్లారి పగటిలి దాక దిక్కు మొక్కు లేకుంట ఆ పినుగులు ఏడియి ఆన్నె పడి ఉన్నయ్ పోలీసులు ఆపిసర్లు అచ్చేదాక.

ఆడ మొదలైన ఎరుపు అగ్గిమంట ఎన్నో ఊర్లకు పాకింది. ఎంతోమంది దొరలను గడీల్ల నుంచి తరిమింది ఆ ఎఱ్ఱెర్రని అగ్గి.

తాళ్లపేట గ్రామం, మంచిర్యాల జిల్లా. గ్రామీణ నేపథ్యం, గిరిజనుల సాంగత్యం. ఎమ్మెస్సీ (జువాలజీ) చదివారు. ఏడేండ్ల పాటు లెక్చరర్ గా పనిచేశారు. గిరిజనుల జీవితం, వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాల గురించి సోషల్ మీడియాలో రాస్తున్నారు. తెలంగాణ జీవభాషలో రాయడం ఆమె ప్రత్యేకత. ప్రస్తుతం మీడియాలో పనిచేస్తున్నారు.

4 thoughts on “అగ్గిపూల దారి

  1. మాండలికాన్ని బతికించే కథలు రావడం ఎంతైనా అభినందనీయం…

  2. అచ్చమైన తెలంగాణ భాష. రాయాలె గాని ఊరికొక అగ్గిపూల దారి ఉంది. పందొమ్మిది వందల ఇరవై , ముప్పై ప్రాంతాల ఉత్తర తెలంగాణ చిత్రిక ఈ అగ్గిపూల దారి. తెలంగాణ ది ఒక విలక్షణమైన భాష, అది కులానికి ఒకరీతి, మతానికి మరొక రీతి,ఆడ కొక మగ కొక రీతి. ఇది ఉత్తర తెలంగాణ సూదరోళ్ళ భాష లాగా అనిపించింది. మొదటి సారి సమాజిక మాధ్యమం లో రాజమ్మ రాత చూసినప్పుడు ఈ కలం కథ మీద దృష్టి పెడితే బాగు అని అనుకున్నా, పరిచయం లేదు గాని ఒకరోజు నేనే చొరవ దీసుకొని మీరు కథలు రాయాలి అన్నా..నాకు తెలియదు తాను కొన్ని కథలు ఇంతకు ముందే రాసింది అని. ఏమయినా భాష అనాటమీ తెలిసిన గొంతు రాజమ్మది. ముందు ముందు మరోన్నో చీకటి కథలు వెలుగు చూడాలి అని..

  3. నేన్ కొన్నాళ్ళు ..
    ఐద్రాబాద్ రాంనగర్ ల వుంటి..
    ఆడ్నే తెలంగాణం నా చెవులబడింది..

    ఆ భాష నాకెందుకో..
    బాగా నచ్చింది అనే కంటే..ఆత్మతో అనుసంధానమైంది.ఆనగలను…

    ఇపుడీ..
    రా’జీవన’అక్షరాలు
    సూత్తా..సదవబడితే..
    నాలో నేనే తెలంగాణాన్ని.
    మళ్ళోసారి ఆవిష్కరించుకుంటున్నా..

    రాజీ లాంటి( కథకుల)
    వోళ్ళ కతలు..ఇగ సదవాలే..

    ఈ కతలోనైతే..
    అక్షరాలు..నన్ను ఆవహించి
    పాత్రలన్నీ నాకళ్ళెదుట ఆవుపడినై..

    ధన్యవాదాలు..రచయిత్రికి..💐
    మాండలీకాన్ని సజీవతన వుంచుతూ..
    మా బోటి చదువరులకూ..వ్రాసేంందుకు..
    ప్రేరణ నిస్తున్నాయ్.. మీ అక్షరాలు..

Leave a Reply