అంకెల్లో తగ్గిన పేదరికం

పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడటంతో ఆగమేఘాల మీద 2022-23 గృహ వినియోగ వ్యయ సర్వే నివేదికను నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ఫిబ్రవరి 24న విడుదల చేసింది. అది కూడా పూర్తి నివేదిక కాదు. కేవలం 27 పేజీల సంక్షిప్త ‘వాస్తవ నివేదిక’ (ఫ్యాక్ట్‌ షీట్‌) పేర ప్రకటించింది. 2023-24 సర్వే ఇంకా కొనసాగుతున్నది. ఇది పూర్తయిన తరువాత రెండు సర్వేల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని సంపూర్ణ నివేదికను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాదిలో ఇది సాధ్యపడదు. నూతన వినియోగ ధరల సూచీని నిర్ధారించటానికి అవసరమైన ప్రాథమిక పునఃపరిశీలన, మార్కెట్‌ సర్వే, వస్తువులకు తగిన వెయిటేజ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇంకా జరగక ముందే సంక్షిప్త నివేదికతో ప్రభుత్వం హడావుడి చేస్తున్నది. ఇప్పుడు ఎన్నికల తరుణంలో ఆకస్మికంగా పేదరికం అంతరించి రామరాజ్యం ఆవిష్కృతమైందని తప్పుడు ప్రచారానికి పూనుకుంటూ ప్రజలను మోసగిస్తున్నది.

2030 సంవత్సరం నాటికి ఆకలి బాధలకు తావులేని ప్రపంచాన్ని ఆవిష్కరించడం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటి. అటువైపు భారత్‌ వడివడిగా అడుగులు వేస్తున్నదని సంబరపడటంలో హేతుబద్ధత ఏమిటని ప్రశ్నిస్తున్న ఆర్థికరంగ నిపుణులెందరో బహుముఖ పేదరికాన్ని మదింపు వేసిన విధివిధానాలపైనే అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. కేలరీల ఆధారిత దారిద్య్ర రేఖ ప్రాంతీయ వైరుధ్యాలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలమవడమే కాకుండా పేదరికం, దాన్ని ప్రభావాలకు సంబంధించిన వివిధ కోణాలను స్పృశించలేకపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మానవాభివృద్ధి సూచీ క్రోడీకరణలో వ్యక్తి ఆదాయాన్ని కీలక ప్రాతిపదికగా ఐక్యరాజ్య సమితి పరిగణిస్తుంది. తలసరి రాబడిపై ఆధారపడి విద్య, ఆరోగ్యం, జీవనస్థాయి  ప్రమాణాలను లెక్కించి వ్యక్తుల వాస్తవిక స్థితిగతుల్ని నిగ్గు తేలుస్తుంది. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, అధిక ధరలు పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తంటే, పేదరికం తగ్గింది అని ఎలా చెప్పగలరు అని ప్రశ్నిస్తున్నారు. పేదరికం తగ్గింపు అన్నది సర్కారీ గణాంకాల్లో కాదు, క్షేత్రస్థాయిలో సంభవించాలంటే వృద్ధి సంక్షేమం ఏకకాలంలో కొనసాగాలి.

వాస్తవానికి ప్రతి ఐదేళ్లకు ఒకసారి దేశంలో ప్రజల వినిమయ వ్యయ స్థితిగతులను తెలుసుకోవటానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ శాంపిల్‌ సర్వే సంస్థ ద్వారా సర్వే నిర్వహిస్తుంది. భారతదేశంలో ఆదాయ సర్వేలు లేనందున ఈ వినిమయ గణాంకాల ద్వారానే ఆదాయ ధోరణులు తెలుసుకోవటానికి కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. అంటే ఒక కుటుంబం నెలకి ఎంత ఖర్చు చేస్తుందో ఈ సంఖ్యల నుండి ఎంత ఆదాయం సంపాదిస్తున్నారో సుమారుగా అంచనా వేయవచ్చు.  దీనికి ముందు 2017-18 కాలంలో నిర్వహించిన గృహ వినిమయ వ్యయ సర్వేను విడుదల చేయకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. 2016లో పెద్ద నోట్ల రద్దు, 2017లో ప్రవేశపెట్టిన వస్తుసేవల పన్ను వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవటంతో దేశ ప్రజలపై తీవ్ర ప్రభావం పడి వారి కుటుంబ వినియోగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ వాస్తవాలు సర్వేలో నిరూపణై బహిర్గతం కావడంతో మోడీ ప్రభుత్వం భగ్గుమన్నది. దీంతో సర్వే డేటా సక్రమంగా లేదనే సాకు చెప్పి సర్వే ఫలితాలను విడుదల చేయకుండా కప్పిపుచ్చేసింది.   

కేంద్ర ప్రభుత్వం మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని,  త్వరలో ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందని చెబుతూ మూడోసారి అధికారం చేపట్టాలనే ఆలోచనతో ప్రణాళికలు రచిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పదేళ్ళ పాలనలో దేశంలో అన్నీ చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. గడచిన తొమ్మిదేళ్ళలో 24.82 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని దాటేశారని జనవరి చివరి వారంలో  కేంద్ర ప్రభుత్వ బుద్ధిజీవుల (థింక్‌ ట్యాంక్‌) బృందం నీతి ఆయోగ్‌ ప్రకటించింది. ఇప్పుడు తాజాగా 140 కోట్ల జనాభా గల దేశంలో మరో అద్భుతం జరిగి పేదరికం ఐదు శాతం కంటే అతి తక్కువ స్థాయికి పడిపోయిందని బుద్ధిజీవుల బృంద నాయకుడు (చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌) బి.వి.ఆర్‌. సుబ్రమణ్యం మరో ప్రకటన చేశారు. మాయలఫకీరు మంత్రనగరిలో, అష్టలక్ష్మీ నివాసనగరిలో ఐశ్వర్యం తాండవించినట్టుగా ఎన్‌ఎస్‌ఎస్‌ (నేషనల్‌ శాంపిల్‌ సర్వే) తాజా నివేదిక ప్రకారం సంపన్న-పేద వర్గాల,  గ్రామీణ-పట్టణ ప్రాంత వినియోగ వ్యయాల్లో అంతరం గణనీయంగా తగ్గిపోయాయంటూ సదరు సుబ్రమణ్యం కొంత ఊహాగానాలు కూడా జోడించి మోడీ ప్రభుత్వానికి మేలు చేసేందుకు పసందైన వంటకం మనకు వడ్డించారు. 

ఎన్‌ఎస్‌ఎస్‌ఒ సర్వే ఫలితాలను గణాంక మంత్రిత్వశాఖ అసాధారణంగా శనివారం (24వ తేదీ) పొద్దుగుంకాక విడుదల చేసింది. 2022-23 సంవత్సరంలో నెలసరి తలసరి వయ్యం (ఎంపిసిఇ) ప్రాతిపదికగా ఈ నిర్ధారణ చేశారు. మనదేశంలో నిరుపదేల సంఖ్య దేశ జనాభాలో 5 శాతం దిగువకు తగ్గినట్లు నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) గణాంకాలు తెలియజేస్తున్నాయి. నిజానికి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెరగలేదు, వలసలు ఆగలేదు, విద్య, వైద్య సదుపాయాలు కూతవేటు దూరంలో లేవు. వాటికి నాణ్యతా ప్రమాణాలు లేవు. ఇంకా గ్రామాలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న తరహాలోనే ఉన్నాయి…ఐనా గానీ గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య వినియోగ వ్యయాల్లో అంతరాలు అమాంతతంగా తగ్గిపోయాయి…! రోజుకు రూ.32లు ఆదాయం సంపాదించేవారి సంఖ్య ఐదుశాతం కంటే క్షీణించిపోయిందంటూ హాస్యాస్పదం ప్రకటనలు చేశారు.      ఆక్స్ ఫామ్‌ నివేదిక వెల్లడించిన ”దేశ సంపద పదిశాతం మందికే సొంతం” అనే మాటలన్నీ శుద్ధ అబద్ధమని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం  బలహీనంగా లేదని సదరు బుద్ధిజీవి చేస్తున్న బలమైన ప్రచారం లోక్‌సభ ఎన్నికలకు ఓటర్లను ఇతోధికంగా సన్నద్ధం చేయడానికేనని తెలియనిది ఎవరికి? 

పేదరికం, దారిద్య్ర నిర్మూలన పథకాల రూపకల్పన నిమిత్తం ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా వాస్తవాల అధ్యయనానికై కమిటీలు వేస్తుంటాయి. మన దేశంలో కూడా వివిధ కాలాల్లో నియమించిన లక్డావాలా, సురేశ్‌ తెందూల్కర్‌, సి.రంగరాజన్‌ కమిటీలు అటువంటివే. అవి ఆహార, వినిమయం, వ్యయం ప్రాతిపదికంగా దారిద్య్రరేఖ నిర్ణయిస్తుంటాయి. ప్రపంచబ్యాంక్‌ అంతర్జాతీయ దారిద్య్రరేఖ నిర్ణయిస్తుంటుంది. కనీస ఆహారం, దుస్తులు, ఆవాసం నీటిపై వ్యయమే ప్రాతిపదిక.  వైద్యం, విద్య రవాణా వగైరా పరిగణనలోకి తీసుకోదు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలూ అంతో ఇంతో ఇచ్చే ఉచితాలను సర్వేలో కలపలేదని కూడా బుద్ధిజీవుల బృందం కితాబిచ్చింది. 90.8 శాతంగా ఉన్న నెలవారీ తలసరి వినియోగ వ్యయం(ఎంపిసఇ) అంతరాలు 70 శాతానికి తగ్గాయని, గ్రామాలు, పట్టణాల్లో కూడా ఆహార వినియోగ ఖర్చులు తగ్గి, లగ్జరీ కొనుగోళ్ళు గణనీయంగా పెరిగాయన్నది ఎన్‌ఎస్‌ఎస్‌ సారాంశం.

పేదరికాన్ని నిగ్గుతేల్చడానికి అనుసరిస్తున్న విధివిధానాలను తప్పులతడకగా నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ లోగడ విమర్శించారు. దేశ జనాభాలో 30 శాతం వరకు బీదరికంలోనే మగ్గుతున్నారని 2014లో నిర్ధారించిన రంగరాజన్‌ కమిటీ నివేదిక అంతకుముందు పాలకులు హోరెత్తించినవన్నీ కాకిలెక్కలేనని తేల్చేసింది. దేశంలో ఆకలితో నకనకలాడుతున్నవారి సంఖ్య 50 కోట్లని సక్సేనా కమిటీ వెల్లడించగా, 75 కోట్లని అర్జున్‌సేన్‌ గుప్తా కమిటీ లెక్కకట్టింది. వాటిని ఇప్పటికీ ఎవరూ అధికారికంగా తోసిపుచ్చే వీల్లేదు. దేశవ్యాప్తంగా 81.35 కోట్ల మంది అన్నార్తులకు ఉచితంగా తిండిగింజల పంపిణీ కార్యక్రమాన్ని మరో అయిదేళ్ల పాటు మోడీ ప్రభుత్వమే పొడిగించింది. ఇప్పటికే వ్యవసాయం, చేనేత, లఘు పరిశ్రమలు వంటివి సంక్షోభం పాలబడి కునారిల్లుతున్నందువల్లే కోట్లాది జీవితాలు అర్థాకలి,  పస్తులతోనే గడుస్తున్నాయి. 125 దేశాలను పరిగణనలోకి తీసుకున్న అంతర్జాతీయ క్షుద్బాధ సూచీలో భారత్‌కు 111వ స్థానం దక్కడం దేశీయంగా ఆకలిమంటల ప్రజ్వలనాన్ని కళ్లకు కడుతోంది. 2018 నాటికి దేశంలోని 19 కోట్ల నిరుపేదల సంఖ్య 2022 నాటికి 35 కోట్లకు విస్తరించిందని ఆక్స్ ఫామ్‌ నివేదిక స్పష్టీకరించింది. ఆకలిని, పోషకాహార లోపాల్ని దీటుగా ఎదుర్కోవడంలో 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విఫలమవుతున్నట్లు ఆ మధ్య నీతి ఆయోగ్‌ స్వయంగా వెల్లడించింది. 

భారత కార్పొరేట్‌ మీడియా దాని తోకలు భారతదేశంలో పేదరికం పూర్తిగా నిర్మూలన అయిందని, ఐదు శాతానికి దిగువకు ఈ సంఖ్య గత పదేళ్ళ ఆర్థిక విధానాల కారణంగా తగ్గిపోయింది అని ప్రచారం మొదలుపెట్టింది. ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి పాలక పార్టీ నిజంగానే తమ కిరీటంలో కలికితురాయిగా ప్రచారం చేసుకుంటుంది. ఇది నిజమేనా!  పేదరికం అన్న భావనను 1889లో సామాజిక శాస్త్రవేత్తయిన ఇంగ్లాండ్‌కు చందిన చార్లెస్‌ బూత్‌ మొదటిసారిగా ఇలా పేర్కొన్నాడు. అతని ఉద్దేశంలో మనిషి బ్రతకటానికి భౌతికంగా సామర్ధ్యంగా పనిచేయడానికి కావలసిన కనీస అవసరాలు లేకపోతే పేదరికం ఉన్నట్లే. ఈ సమస్యను ఆర్థిక శాస్త్రవేత్తలు ముఖ్యంగా భారతదేశంలోని ప్లానింగ్‌ కమీషన్‌లో ఉన్న కొంతమంది 1963లో ఒక వర్కింగ్‌ గ్రూప్‌గా ఏర్పడి నాటి మన దేశ పేదరికంపైన, దాన్ని తగ్గించే వ్యూహాలపై చర్చించారు. పేదరికాన్ని ఒక ఆర్థిక, సామాజిక సమస్యగా గుర్తించి దానిపై పరిశోధన చేసిన వారు వి.యమ్‌. దండేకర్‌, రత్‌ అన్న ఆర్థిక శాస్త్రవేత్తలు 1971లో ప్రచురించిన పేదరికంపై పరిశోధన చాలా చర్చలకు దారి తీసింది. 

ప్రపంచీకరణ ఆర్థిక విధానాల పుణ్యమా అని రవాణా ఖర్చులు, సెల్‌ఫోన్‌ కొనుగోళ్ళ ఖర్చులు అనివార్యంగా పెరిగాయన్నది నిఖార్సైన నిజం. రవాణా సదుపాయాల లేకపోవడంతో వలసకూలీలకు, సామాన్య, పేద ప్రజలకు ఆ ఖర్చులు పెనుభారమవుతున్నాయి. జీవన విధానంలో అనివార్యమైన అవయంగా మారిన సెల్‌ఫోన్‌ ఖర్చు కోట్లాది జనాభా గల దేశంలో కేవలం 2.50 లక్షల మందిని మాత్రమే సర్వే చేసిన పాతకాలపు ప్రామాణికతలు, కొలమానాలు ఆసరాగా కాకి లెక్కలు కట్టడం, తిమ్మిని బమ్మిని చేసే ‘గోడీ మీడియా’ ప్రచార ఆవిష్కరణలు వంటివన్నీ సామాన్య పేద ప్రజలకు మాయ తెరలు కప్పే ప్రయత్నమే. దేశ వ్యాప్తంగా ప్రజల ఆహార అలవాట్లు గణనీయంగా మారిపోయాయని ఎన్‌ఎస్‌ఎస్‌ నివేదిక స్పష్టం చేసింది. ఈ అలవాట్లు మార్చేయడంలో కార్పొరేట్‌ శక్తులదే కీలక పాత్ర. 

ప్రకృతి సహజసిద్ధంగా చెట్టు నుండి పండును తెంచి తినే యోగ్యత లేకుండా ఆసేతు హిమాచలాన్నీ వాణిజ్యీకరణ చేసి ప్రజలను ప్యాక్డ్ ఫుడ్స్ కు, బెవరేజెస్‌ వినియోగాలకు అలవాటుపడేలా చేశారు. మీదు మిక్కిలి మద్యం, మాదక ద్రవ్యాలను యదేచ్ఛగా గ్రామాలకు అందించి దోచుకుంటున్నారు. మానవవనరుల సంరక్షణలో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్లనే చిన్న వయసులోనే ప్రాణాంతకమైన పెద్ద రోగాల బారినపడి బీమా సదుపాయం కూడా లేక యువతరం, నడివయస్కులు అర్థాంతరంగా పాడెక్కుతున్నారు. కార్పొరేట్‌ శక్తులను పోషించి పేదలను పీల్చి పిప్పిచేస్తున్న పాపం బిజెపి పాలనలోనే పేట్రేగింది. కొసమెరుపు ఏమిటంటే ఈ ఎన్‌ఎస్‌ఎస్‌ నివేదికను తాత్కాలికంగా, ఆపద్ధర్మంగా విడుదల చేయడం. ఎన్నికల తర్వాత పూర్తి నివేదిక విడుదల చేస్తామని బుద్ధిజీవులు చెప్పడం ఎందుకు? ఇంత ఆదరాబాదరాగా ఎందుకు నివేదిక విడుదల చేశారు? ఈ ప్రశ్నలకు ఉద్దేశపూర్వకంగానే సమాధానాలు లేవు. కోట్లాదిమంది కార్మికులు, రైతుల ఆర్తనాదాలను నిర్లక్ష్యం చేయడం, ఇలాంటి నివేదికలు ఇవ్వడం నరేంద్ర మోడీ ఎన్నికల మాయాజాలమే.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో,  కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 2,61,746 కుటుంబాల నుండి 2022-23 సర్వే నిర్వహించింది. ఇందులో 8723 గ్రామాల నుండి 1,50,514  కుటుంబాలు, 6115 పట్టణాల నుండి 1,06,732 కుటుంబాలు ఉన్నాయి. పట్టణాలకు 5 కి.మీ. లోపు ఉన్న గ్రామాల్లోనే సర్వ నిర్వహించడం మరో దగా. సర్వే వివరాలను పరిశీలిస్తే 2011-12లో గ్రామీణ ప్రాంతాల్లో తలసరి వినియోగం రూ.1430 ఉంటే, 2022-23 నాటికి రూ.3773కు చేరింది. పట్టణ ప్రాంతాల్లో ఇదే కాలంలో తలసరి వినియోగం చూస్తే సగటు తలసరి వినియోగం రూ.2630 నుండి రూ.6459కి పెరిగింది. 2011-12 నాటి ధరల సూచీ ప్రకారం చూస్తే సగటు తలసరి వినిమయ వ్యయం గ్రామీణ ప్రాంతంలో రూ.1430 నుండి రూ.2008కి పట్టణ ప్రాంతాలల్లో రూ.2630 నుండి రూ.3510కి నమోదయ్యింది. 

సామాజిక తరగతుల వారీగా చూస్తే గిరిజనులలో నెలవారీ సగటు వినియోగ వ్యయం 2022-23లో గ్రామీణ ప్రాంతంలో ఎస్టీల్లో రూ.3016, దళితుల్లో రూ.3474, ఓబిసిల్లో రూ.3848, ఇతరుల్లో రూ.4392గా ఉన్నట్లు సర్వే నివేదిక పేర్కొన్నది. అలాగే పట్టణ ప్రాంతాల్లో గిరిజనుల్లో రూ.5414, దళితుల్లో రూ.5307, ఓబిసిల్లో రూ.6177, ఇతరుల్లో రూ.7333 నెలవారీ సగటు వినియోగ వ్యయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులు, దళితులు దేశ సగటు వ్యయం కంటే వారి వినియోగం చాలా తక్కువగా ఉంది, ఓబిసిల్లో సగటు కంటే కొంచెం ఎక్కువగా కన్పిస్తున్నది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే గిరిజన, దళిత, ఓబిసి మూడు తరగతులు దేశ సగటు వినియోగం కన్నా అథమ స్థితిలో ఉన్నారు. ఈ తరగతులకు అగ్ర వర్ణాలకు మధ్య వినియోగ వ్యయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది.

సర్వే నివేదిక మరొక అంశాన్ని కూడా నిర్ధారించింది. పేద-ధనికుల మధ్య వినియోగ అంతరాలను కూడా గణించింది. దేశ జనాభాలో అట్టడుగు 5 శాతం నిరుపేదలు సగటున నెలకి గ్రామీణ ప్రాంతంలో రూ.1373 ఖర్చు చేస్తుంటే, అదే పైనున్న 5 శాతం ధనికులు నెలకు సగటున తలసరి రూ.10,501 ఖర్చు చేస్తున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో కింది స్థాయి 5 శాతం పేదలు రూ.2001 ఖర్చు చేస్తుంటే పైస్థాయిలోని 5 శాతం ధనికులు నెలకి సగటున తలసరి రూ.20,824 ఖర్చు చేస్తున్నారు. రోజువారీగా చూస్తే కింది స్థాయి. పేదలు రోజుకి సగటున రూ.46, పట్టణ ప్రాంతాల్లో రూ.67 ఖర్చు చేస్తుంటే, ధనవంతులు గ్రామాల్లో రోజుకి రూ.350, పట్టణ ప్రాంతాల్లో రూ.700 ఖర్చు చేస్తున్నారు. స్థూలంగా గ్రామీణ ప్రాంతంలో 8 రెట్లు, పట్టణ ప్రాంతంలో 10 రెట్లు పేదల కంటే ధనికులు ఎక్కువగా వినియోగం చేస్తున్నారు. ఈ గణాంకాల ద్వారా ప్రజల మధ్య వినియోగ వ్యయ అంతరాలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నయో అర్థం చేసుకోవచ్చు. 

ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఈ అంకెలను చూపి అభివృద్ధి ప్రకటనలు గుప్పిస్తున్నది. ప్రజల ఆదాయాలు పెరుగతున్నాయని, ప్రజల వినియోగ వ్యయం పెరుగుదలే ఇందుకు తార్కాణమని ఊదరగొడుతున్నది. ప్రజల మధ్య ఆదాయ అంతరాలు కూడా తగ్గుముఖం పట్టాయనే ప్రచారానికి కూడా ఈ నివేదికను వాడుకుంటున్నది. వాస్తవంగా ఈ సర్వేని 2011-12 సర్వేతో పోల్చి విశ్లేషణ చేయడం సరైంది కాదు. ఎందుకంటే గత సర్వే కేవలం ఒక ప్రశ్నావళి ద్వారానే కుటుంబాల నుండి సమచారాన్ని సేకరించింది. 2022-23 సర్వేలో 4 ప్రత్యేక ప్రశ్నావళుల ద్వారా మూడుసార్లు ఇళ్ల నుండి సమాచారం తీసుకున్నారు. ఈ సర్వేలో గ్రామీణ ప్రాంతాలను ఎక్కువ భాగం జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను ఎంపిక చేశారు. 

భారతదేశంలో 2011 నుండి పేదరిక లెక్కలు విడుదల చేయడం లేదు. ప్రణాళికా సంఘం రద్దయిన తరువాత ఉనికిలోకి వచ్చిననీతి ఆయోగ్‌ కూడా దారిద్య్ర రేఖకు ఎలాంటి కొలమానాలను రూపొందించలేదు. ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన లెక్కల ప్రకారం 11 శాతం మంది అంటే 18.9 కోట్ల మంది ప్రజలు భారత దేశంలో ఆకలితో అలమటిస్తున్నారని పేర్కొన్నది. అలాగే ప్రపంచ ఆకలి సూచిలో 125 దేశాల్లో భారత్‌దేశం 111వ స్థానంలో ఉంది. ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు అతి తక్కువ ఆహారం తీసుకుంటున్నట్లు చెప్పింది. అంతేగాక గ్రామీణ ప్రాంతంలో రోజుకి 2200 క్యాలరీలు, పట్టణ ప్రాంతంలో రోజుకి 2100 క్యాలరీలు ఆహారం పొందాలంటే ప్రస్తుత ధరల ప్రకారం మదింపు చేస్తే దేశంలో 58 శాతం పేదరికంలో మగ్గుతున్నట్లు తెలుస్తున్నది. ప్రపంచీకరణ కాలంలో దేశంలో పోషకాహార పేదరికం బాగా పెరిగిందని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కుటుంబ ఆరోగ్య సర్వే కూడా 15-49 వయస్సు గల మహిళల్లో రక్తహీనత 2015-16లో 53 శాతం నుండి 2019-20కి 58 శాతానికి పెరిగిందని తేల్చి చెప్పింది. 

ముగింపు :

లోక్‌సభ ఎన్నికలముందు, అవి ముగిసేవరకూ ఇటువంటి తప్పుడు తడక లెక్కలే ప్రజలముందుకు రావచ్చు. వేతనాలు తగ్గిపోతూ, ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్న కాలంలో, పేదరికం పెద్దఎత్తున నాశనమైందని, నిరుద్యోగం సమసిపోయిందని కేంద్రప్రభుత్వ సంస్థలు ఎలా చెబుతాయి? నీటిఆయెగ్‌ నివేదిక సరైనదే అయితే, దేశంలో వినియోగం ఎందుకు తగ్గింది. ప్రభుత్వం తన రేషన్‌ పథకాలను మరింత విస్తరిస్తూ 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ ఎందుకు ఇస్తున్నదనేదే అసలు ప్రశ్న. తమ పాలనలో పేదలు పాతికకోట్లు తగ్గారని చెప్పుకోవడం ఎన్నికల ముందు బిజెపికి అవసరం కాబట్టి ఈ జిమ్మిక్కులు. పేదరికం, దారిద్య్ర నిర్మూలన పథకాల రూపకల్పన నిమిత్తం ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా వాస్తవాల అధ్యయనానికై కమిటీలు వేస్తుంటాయి. మనదేశంలో కూడా వివిధ కాలాల్లో నియమించిన లక్డావాలా, సురేష్‌ టెండూల్కర్‌, సి.రంగరాజన్‌ కమిటీలు అటువంటివే. అవి ఆహార, వినిమయం, వ్యయ ప్రాతిపదికంగా దారిద్య్ర రేఖ నిర్ణయిస్తుంటాయి. ప్రపంచబ్యాంక్‌ అంతర్జాతీయ దారిద్య్రరేఖ నిర్ణయిస్తుంటుంది. అదాని సంపద పెంచితే లెక్కల్లో జాతీయాదాయం పెరిగి భారత్‌ ట్రిలియన్‌ జాబితాలో చేరవచ్చు. గానీ వారి పక్కన డొక్కలు మాడిన, కుంచించుకుపోయిన శరీరాలతో పేదలు మనల్ని వెక్కిరిస్తూనే ఉంటారు.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply