ఎప్పుడూ మదిలో హోరెత్తుతై
రాత్రంతా విడువని వానలా
ఎప్పటికీ ఒడవని మా అమ్మ కన్నీటి పాటలా
మా అయ్య చిందిన నెత్తుటి జ్ఞాపకాల్లా
జీవితాన ఏ జెకమొక రాయి ఎప్పుడు నిప్పంటిస్తుందో
ఎప్పుడు రగిలిస్తుందో ఎరికేనా ఎవ్వరికైనా!
ఒక పాటో మాటో
ఊరంచు గుడిసెల్లో నదిలా పారే శోక గీతమో నిన్నేది రగిలించిందో
నిన్నైనా తెలుసునా
రేపైనా తెలుసుకోగలవా
తెలుసుకున్నవా ఎపుడైనా
సూటిగా గురిపెట్టిన పద్యమేదో
నీ లోలోపలి సంద్రాలకు నిప్పు పెట్టిన సంగతి కలగన్నావా ఎపుడైనా?
అది ముగింపు లేని తెగింపు వాక్యమై
నిను నిలువెల్లా తడిపేసిన క్షణాన్ని
తెలుసుకున్నవా ఎపుడైనా?
ప్రియ మిత్రుడా
రా… రారా కలుసుకుందామొకసారి
మనం కలగన్న దారుల్ని
తనివితీరా చూసుకుందాం
తొవ్వలు చీలినచోట, దారులు వేరైన చోట
కడసారి కలుసుకుందాం
గుండె గాయాలకు మోదుగుపూల మెరుపుల్ని అద్దుకుందాం
అమ్మ చనుబాల తీపిని మదిలో నింపుకొని సాగిపోదాం
నువ్వో పాటై
నేనో పాటై
చెరో దిక్కు సాగిపోదాం
చీలిన దారులు కలిసే చోటుకి
మళ్లీ మనం కలిసి నడవాల్సిన తోవల్లోకి.
వీడ్కోలు పద్యం కాదిది
విడువలేని దారి గురించిన కలవరింత ఇది
వేనవేల శిశిరాల్ని దాటి
వసంతగీతమై హోరెత్తే నినాదాల పలవరింత ఇది
ఎప్పుడూ మదిలో హోరెత్తుతై
కల్లోల జ్ఞాపకాలై
రాత్రంతా ఎడతెరిపిలేని వానలా
ఊరంచు వెలివాడల దుఃఖంలా
ప్రియ మిత్రుడా…
రా…
రారా
మనందరి మధ్యా నిలువెల్లా మొలిచిన
ఉక్కు గోడల్ని కూల్చుదాం
సమూహమవుదాం.
సామూహిక దారుల్లోకి పయనిద్దాం
రా….