1949 అక్టోబర్ 15న భారత్‌లో అంతర్భాగమైన మణిపూర్, కొన్ని దశాబ్దాల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగి, అనేక పోరాటాల ఫలితంగా 1972 జనవరి 21న రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రంలో 30 వరకూ వివిధ కులాలు, షెడ్యూల్డ్ తెగలు ఉన్నా ప్రధానంగా మూడు తెగలు మెయితీ, నాగా, కుకీ తెగలు రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్నారు. మణిపూర్‌లో 16 జిల్లాలు ఉన్నాయి. వాటిలో కొన్ని లోయ ప్రాంతం జిల్లాలుగా, మరికొన్ని కొండ ప్రాంతం జిల్లాలుగా విభజించారు. రాష్ట్రంలో ఉన్న 90 శాతం కొండ ప్రాంతాల్లో (హిల్ ఏరియా) నాగాలు, కుకీ తెగలకు చెందినవారు 35 శాతం ప్రజలు నివసిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,55,794 మంది ఉన్నారు. అందులో పురుషులు 1,43,586, మహిళలు 14,17,208 ఉన్నారు. 60 మంది ఎమ్మేల్యేలున్న రాష్ట్ర శాసనసభలో 40 మంది మెయితీ కమ్యూనిటీ చెందినవారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో 20 మంది ఎమ్మేల్యేలు ఇతర కుకీ, జోమీ, నాగ వంటి ఇతర షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు.
కేంద్రంలో 2014లో మొదటిసారిగా మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి, ఈశాన్య ప్రాంతం సంఘ్ పరివార్‌కు ప్రయోగశాలగా మారింది. ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ పరివార్‌కు ఎప్పుడూ నచ్చలేదు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కార్యకర్తలను తీసుకురావడం ద్వారా ఈశాన్య ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ఆర్‌ఎస్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నించింది. 2014లో కేంద్రంలో అధికార మార్పు ఈశాన్య ప్రాంతంలో సంఘ్ పరివార్‌కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించింది. అదే అదునుగా తీసుకుని మెయితీ, కుకీ జాతుల మధ్య ఘర్షణను సృష్టించింది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో బిజెపి ఈశాన్య రాష్ట్రాల్లో మెల్లగా అధికారాన్ని చేజిక్కించుకుంది. కాంగ్రెస్‌ను చీల్చడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్‌లలో బిజెపి అధికారంలోకి వచ్చింది. మణిపూర్ ముఖ్యమంత్రి మెయితీ జాతికి చెందిన వాడుకావడంతో జాతి వైషమ్యాలు, ఉదాశీనత, పక్షపాతం వల్ల కుకీ జాతిలో ఆగ్రహం జ్వలిస్తుంది.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో, బిజెపి 32 సీట్లు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ‘ఆపరేషన్ ఆకర్ష్’ ద్వారా వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలతో, 60 మంది సభ్యులున్న అసెంబ్లీలో బిజెపి బలం 37కి పెరిగింది. దీనితో పాలనా శైలి కూడా మారిపోయింది. కేవలం 33 లక్షల మంది జనాభా కలిగిన చిన్న రాష్ట్రమైన మణిపూర్‌లో, మెయితీలు 53 శాతంగా ఆధిపత్య సమూహంగా ఉన్నారు. నాగాలు 20 శాతం, కుకీలు 16 శాతం ఉన్నారు. పంగల్, కోమ్ వంటి చిన్న సమూహాలు కూడా ఉన్నాయి. మెయితీలలో కేవలం 10 శాతం మంది మాత్రమే క్రైస్తవులు కాగా, కుకీ-నాగా సమాజంలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. 1864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇంఫాల్ లోయ, దాని చుట్టూ కొండలతో మణిపూర్ ప్రకృతి దృశ్యం ఆకట్టుకుంటుంది. మెయితీలు పూర్తిగా లోయలలోను, కుకీలు, నాగాలు ఎక్కువగా కొండలలోనూ నివసిస్తారు. మెయితీలు వ్యాపారాల్లో, చదువుల్లో, ఉద్యోగాల్లో, రాజకీయాధికారంలో కుకీల కంటే ఎంతో ముందున్నారు.
సంఘ్ పరివార్ క్రైస్తవ కుకీల పట్ల మెయితీలలో విద్వేషాన్ని రగిలించడం ద్వారా చీలిక రాజకీయాలకు పాల్పడుతోంది. బిజెపికి పూర్తి మెజారిటీ రావడంతో, విద్వేష రాజకీయాలు తీవ్రమయ్యాయి. ఆర్‌ఎస్‌ఎస్ నమూనాతో పనిచేసే అరంబై తెంకోల్, మెయితీ, లీపున్ వంటి సంస్థలు సంఘ్ పరివార్ సహాయంతో క్రియాశీలకంగా మారాయి. కుకీ వ్యతిరేక భావన ఈ సంస్థల పునాదిగా ఉంది. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఈ తీవ్రవాద సంస్థలను నేరుగా ప్రోత్సహించారు. బీరెన్ ప్రభుత్వం కుకీలను తరిమికొట్టడంతో పాటుగా, అనేక అణచివేత చర్యలకు పాల్పడింది. ఇది పెద్ద ఎత్తున నిరనసలకు దారితీసింది. మెయితీ తెగకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించడాన్ని పరిశీలించాలన్న హైకోర్టు ఆదేశం మెయితీ-కుకీల మధ్య విద్వేషాలను మరింతగా రగిల్చింది. ఎప్పుడూ లేని విధంగా ఈశాన్య భారతం తన గుప్పిట్లోకి వచ్చిందని గొప్పలు చెప్పుకునే బిజెపి నాయకత్వం మణిపూర్ సంక్షోభం వల్ల ఆ ప్రాంతంపై వినాశకర ప్రభావాన్ని బేఖాతరు చేసి అవకాశవాద రాజకీయాలు నడిపిస్తోంది. అటు గిరిజన తెగలకు వ్యతిరేకంగానూ, మరోవైపున మతాల వారీగానూ తాను సాగిస్తున్న రాజకీయ అవకాశవాదానికి దాన్ని బలిపీఠంగా మార్చింది.
రెండు జాతుల మధ్య 2023 మే 3న ఘర్షణ ప్రారంభమైంది. తిరుగుబాటును ముందుగానే ప్లాన్ చేసుకున్న అరంబై తెంకోల్-మెయితీ, లీపున్ సంస్థలు లోయలోని, కొండల మీది క్రైస్తవ చర్చిలు, పాఠశాలలు మొదలైన వాటిపై విచక్షణా రహితంగా దాడి చేశాయి. లోయలో క్రైస్తవులను వేటాడారు. కుకీలు కూడా ఆయుధాలు చేపట్టడంతో మణిపూర్‌లో పరిస్థితి యుద్ధ వాతావారణాన్ని తలపించింది. మెయితీ-కుకీ ప్రాంతాలు రెండు శత్రు రాజ్యాల మాదిరిగా విడిపోయాయి. మెయితీ తీవ్రవాద సంస్థలకు బహిరంగంగా మద్దతు ప్రకటించిన బీరెన్ సింగ్‌ను తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు సమిష్టిగా డిమాండ్ చేసినప్పటికీ మోడీ, అమిత్ షా చెవికెక్కించుకోలేదు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మెయితీ-కుకీ జాతుల మధ్య చెలరేగిన హింస గడిచిన రెండేళ్లుగా నిత్యం నిరసనలు, అల్లర్లు, హత్యలతో అట్టుడుకుతుంది.
ప్రశాంతంగా ఉండే మణిపూర్ ఉన్నట్టుండి అల్లర్లు చెలరేగి, మారణహోమం జరగడంతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మహిళల మీద అత్యాచారాలు జరిగాయి. మహిళలను నగ్నంగా ఊరేగించారు. వేలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మణిపూర్‌లో చెలరేగిన జాతివైషమ్యాల హింసలో 70,000 మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర గందరగోళంలో చిక్కుకుపోయింది. రాష్ట్రం దాదాపు రెండు జాతులుగా విడిపోయింది. ఇదంతా ఏదో పరాయి దేశంలోనో, మనకు సంబంధంలేని వ్యవహారంగానో మాత్రమే మోదీ సర్కారు భావిస్తోంది. శాంతి భద్రతలు పరిరక్షించడానికి లేదా రాజకీయ పరిష్కారం కనుగొనడానికి కానీ చేసిందేమీలేదు. భిన్న జాతుల వారి మధ్య విద్వేషం నింపి అధికారం మాత్రం సంపాదించింది. సామాజిక-రాజకీయ విభేదాలకు ప్రేరణ ఇచ్చింది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అసమర్థత, తన బాధ్యతను పూర్తిగా విస్మరించిన మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం ఉదాసీనత వల్ల గత 19 నెలలుగా మణిపూర్ హత్యాక్షేత్రంగా మారింది. మణిపూర్‌లో పరిస్థితిని చక్కదిద్దడానికి మోదీ సర్కారు ఇంతవరకు చేసింది ఏమీలేదు.
రాజ్యాంగబద్ధంగా పాలన చేయాల్సిన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మెయితీ తెగ పక్షపాతిగా వ్యవహరించడం వల్ల, జాతుల మధ్య చెలరేగిన హింసతో పరస్పర ఘర్షణలు, మారణకాండకు దారితీశాయి. దేశంలో ఒక రాష్ట్రం జాతి వివక్షతో ఇలా తగులబడుతున్నా కూడా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడకపోవడం, అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించకపోవడం అత్యంత విచారకరం. ఇంతకాలం బీరెన్ సింగ్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించడంతో ప్రధాని మోడీ అల్లర్లకు మరింత దోహద పడ్డారు. ఇంతటి ఘోరకలి మరో విపక్ష పార్టీ పాలిత రాష్ట్రంలో జరిగివుంటే, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చూస్తూ ఊరుకునేదా? శాంతిభద్రతలు క్షీణించాయన్న నెపంతో రాష్ట్రపతి పాలన విధించి, ఆ రాష్ట్రాన్ని కేంద్రం తన ఆధీనంలోకి తెచ్చుకోగలిగే అయాచిత అవకాశాన్ని మోడీ జారవిడుచుకునేవాడా? శాంతి-భద్రతల పరిరక్షణ నిమిత్తం భద్రతాదళాల మోహరింపును పెంచినా అగ్గి జ్వలిస్తూనే ఉంది. కాబట్టి మెజారిటీ మెయితి, మైనారిటీ గిరిజన జాతుల మధ్య సంఘర్షణకు పరిష్కారం తుపాకుల్లోలేదని, వాస్తవ సమస్యలు, అపోహలు, అనుమానాల నివృత్తికి, అటువంటివి మళ్లీమళ్లీ తలెత్తకుండా గ్యారంటీలు కల్పించటానికి జాతుల మధ్య చర్చలకు ప్రభుత్వం తీసుకునే చొరవ, నిష్పక్షపాత ధోరణిలో ఉంటుందని విదితమవుతుంది.
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో దేశాన్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్నామని ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా చేస్తున్న ప్రచారంలోని డొల్లతనాన్ని మణిపూర్‌లోని వారి డబుల్ ఇంజిన్ సర్కార్ బట్టబయలు చేసింది. 2023 మే నెలలో జాతుల మధ్య ఘర్షణనాటి నుండి మణిపూర్ ప్రజలకు కనీసం ఓదార్పు మాటలు చెప్పేందుకైనా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సమయం దొరకలేదంటే ఈశాన్యం పట్ల వారి నిర్లక్ష్యానికి ఇంతకన్నా నిదర్శనం ఏమికావాలి? ఇప్పుడు మణిపూర్ శాంతి-భద్రతల వైఫల్యంతో పాటు రాజకీయ సంక్షోభం అంచున ఉంది. ఏడుగురు ఎమ్మెల్యేలతో బిజెపి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న నేషనల్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కె. సంగ్మా బిరేన్‌సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు బిజెపి అధ్యక్షుడు జె.పి. నడ్డాకు లేఖ రాశారు. సంక్షోభం నివారించటంలో, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణలో బిరేన్‌సింగ్ నాయకత్వం పూర్తిగా విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంగ్మా తెలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికలలో రెండు స్థానాల్లోనూ బిజెపిని ఓడించడం ద్వారా మణిపూర్ వాసులు ఒక హెచ్చరిక ఇచ్చారు. అయినప్పటికీ బీరెన్ సింగ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ కాపాడుతూనే ఉన్నారు. స్పీకర్ తోక్‌చమ్ సత్యబ్రత సింగ్ సహా 18 మంది బిజెపి ఎమ్మెల్యేలు బీరెన్ సింగ్‌ను వ్యతిరేకించారు. ప్రతిపక్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తామని స్పీకర్ కేంద్ర నాయకత్వానికి తెలియజేసిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితిలో బీరెన్ రాజీనామా కోరారు అమిత్ షా. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ మరో మార్గం లేక ఎట్టకేలకు రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తమకు విశ్వాసపాత్రుడైన బీరెన్ సింగ్‌ను అన్ని విధాలుగా రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. బిజెపిలో బీరెన్ సింగ్‌పై తిరుగుబాటు పెరగడంతో పదవి నుంచి నిష్కమించాల్సి వచ్చింది. ఎనిమిదేళ్ల పాలన తర్వాత బీరెన్ సింగ్ రాజీనామా సమయానికి సంఘ్ పరివార్ విభజన రాజకీయాల కారణంగా ఏర్పడిన తీవ్ర గాయంతో మణిపూర్ అల్లాడుతోంది. మణిపూర్‌లో పరిస్థితి జాతి-మత ఘర్షణలతో దిగజారుతున్న తరుణంలో కేంద్ర నాయకత్వం ఎప్పుడో ఆయన రాజీనామాను ఆమోదించి ఉంటే… బహుశా అక్కడ జరిగిన ఊచకోతను కొంతైనా నివారించగలిగేది.
ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ జాతుల మధ్య ఘర్షణలను ప్రేరేపించినట్లు లీకైన ఆడియోలోని గొంతుకు ఆయన గొంతుకు 93 శాతం సారూప్యత ఉందని ట్రూత్ ల్యాబ్స్ గత వారమే నివేదిక ఇచ్చింది. ఆడియో లీక్ అంశాలపై కుకీ ఆర్గనైజేషన్ ఫర్ హ్యుమన్ రైట్స్ ట్రస్ట్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే అనూహ్యంగా బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే చాలా కాలంగా, ఆయన పాలన పట్ల బిజెపి ఎమ్మెల్యేలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అల్లర్లను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలలో తీవ్ర ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో 19నే సొంత పార్టీ ఎమ్మెల్యేలు బీరెన్ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ, ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ లేఖపై సంతకం చేసిన వారిలో అసెంబ్లీ స్పీకర్ తోక్‌చోమ్ సత్యబ్రత సింగ్, మంత్రులు తొంగం విశ్వజిత్ సింగ్, యుమ్నామ్ ఖేమ్‌చంద్ సింగ్ కూడా ఉన్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గత్యంతరం లేక మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపుతో బిజెపి డబుల్ ఇంజన్ ప్రభుత్వ ఘోరమైన దివాళాకోరుతనం తేటతెల్లమైంది. మణిపూర్ ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్రపతి పాలన విధించలేదు. పాలక సంకీర్ణంలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలను పరిష్కరించుకోవడానికి కొంత సమయం కావాలి కాబట్టి ఈ చర్య తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన దోషి అయిన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కు బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ ఇంకా మద్దతు ఇస్తూనే ఉంది. బీరెన్ సింగ్ పక్షపాతంగా వ్యవహరించారన్న అభియోగాలపై న్యాయస్థానం ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఒక గ్రూపు పట్ల ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరించారనడానికి సాక్ష్యాధారాలు కూడా కోర్టుకు చేరాయి. ఈ పరిణామాలతో పదవికి రాజీనామా చేయడం మినహా ముఖ్యమంత్రికి మరో అవకాశం లేకుండా పోయింది. ఈ మొత్తం వ్యవహారాల్లో, రాష్ట్ర ప్రజలు పడుతున్న తీవ్ర ఇబ్బందులు, కష్టాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలను తీసుకోలేదు. హింసాత్మక ఘటనలతో తల్లడిల్లుతున్న రాష్ట్రంలో పర్యటించడానికి కూడా ప్రధాని సుముఖత చూపకపోవడం వారి నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది.
జాతుల అంతఃకలహాలతో ఏడాదిన్నరగా అల్లకల్లోలంగా ఉన్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో శాంతిసాధనకు, స్థాపనకు కొత్త సంవత్సరంలోనైనా కేంద్రప్రభుత్వం ఏదైనా చొరవ కనబరుస్తుందా? అంటే, ఆ సూచన కనిపించటం లేదు. అసలు అక్కడి సమస్యలో తమ ప్రత్యక్ష జోక్యం అవసరమని కేంద్రప్రభుత్వం గుర్తించినట్లే తోచదు. హోంమంత్రి సంవత్సరంలో ఇదిగో – ఇన్నిసార్లు ఈశాన్య రాష్ట్రాలు సందర్శించారన్న గణాంకాల ప్రకటన తప్ప కల్లోలిత మణిపూర్‌లో సాధారణ పరిస్థితుల పునరుద్ధణకు ఏమి చేశారో వివరణ లేదు. 2024లో ఈశాన్యంలో క్రైమ్ ఘటనల్లో 77శాతం మణిపూర్‌లో జరిగాయని గణాంకాలు తెలుపుతున్నాయి. మణిపూర్ భౌగోళిక స్థితితో ఈ సమస్య ముడిపడి ఉంది. వేర్వేరు తెగలు ఉన్న మణిపూర్ వంటి రాష్ట్రాల్లో సమాఖ్య తరహా పాలన, స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ఏర్పాట్ల వల్ల వేర్వేరు స్థాయిల్లో స్వపరిపాలనకు మార్గం ఏర్పడుతుంది. మణిపూర్‌లో కేవలం రెండు తెగలు మాత్రమే లేవు. హమార్, వైఫీ, గాంగ్జే, కోమ్, చిరు, ఆనల్, మారింగ్ తెగలూ ఉన్నాయి.
మోడీ ప్రభుత్వం, బిజెపి పార్టీ రెండూ తమకు రాజకీయంగా లాభం ఉంటే తప్ప స్వపరిపాలన వ్యవస్థల ఏర్పాటుకు అనుకూలంగా చర్యలు తీసుకోరు. కుకీలు తమ ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి బోర్డు కోరుతున్నారంటే మెయితీలతో పరస్పరం కలిసి ఉండలేనంతగా విద్వేషాలు పెరిగినట్లు అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి వనరులు, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాల్లో కుకీలు ఎక్కువగా ఉంటారు. వీరికి స్వపరిపాలన మార్గం చూపితే కార్పొరేట్ కంపెనీల ఆటలు చెల్లవు. దశాబ్ద కాలం అధికారంలో ఉన్నప్పటికీ మణిపూర్ లాంటి సంక్షోభాలు తలెత్తిన ప్రతి సందర్భంలోనూ బిజెపి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూంటుంది. అయితే కాషాయ పార్టీ స్వయంగా కొట్లాటలను పెంచి పోషిస్తుంది.
కేవలం కుకీలను మాత్రమే నిరాయుధులను చేయాలని చూసిన బీరేన్ గత ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇప్పుడు నేరుగా కేంద్రమే వ్యవహారాలు చేతిలోకి తీసుకున్నది గనక ప్రశాంతతను నెలకొల్పే ప్రక్రియ వేగం పుంజుకోవాలి. మెయితీ, కుకీ, జో వర్గాలతో సహా అందరినీ భాగస్వాములను చేయాలి. అదే విధంగా రాజకీయ పక్షాలను విశ్వాసంలోకి తీసుకోవాలి. శాంతి సామరస్యాల పునరుద్ధరణకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవడంతో పాటు పౌర హక్కులను హరించే నిర్ణయాలను, నిర్దేశాలను వెనక్కి తీసుకోవాలి. రాష్ట్రపతి పాలన పెట్టారు గనక నిర్ణీత వ్యవధిలోగా ఎన్నికల నిర్వహణ దిశలో అడుగులు వేయాలి. అన్నింటికీ మించి అందరం అడగాల్సిన ప్రశ్న- ఈ కల్లోలం నుంచి మణిపూర్ బయటపడే రోజు ఎప్పుడొస్తుంది ?