అతను ఒక కవితా సైనికుడు. నిత్య సాహిత్య అధ్యయన విద్యార్థి. ఏడు కవిత్వ సంపుటాలు ప్రచురించినప్పటికీ సాదాసీదాగా సాగిపోవడమే అతని జీవన సాఫల్యత. ఎనభై ఒక్క ఏళ్ళ వసంతంలోకి అడుగుపెట్టినప్పటికీ ఇప్పటికీ సాహిత్య సభల్లో సాధారణ శ్రోతగా హాజరై అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. ప్రముఖ ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి తాత్విక ఆలోచన ధారలే తనను నడిపిస్తున్నాయని అంటాడు. ప్రముఖ కవులు కాళోజి సోదరులైన నారాయణరావు, రామేశ్వరరావులతో కలిసి పని చేసిన ప్రముఖ కవి వి.ఆర్. విద్యార్థితో ‘కొలిమి’ ప్రతినిధి కోడం కుమారస్వామి జరిపిన మాట ముచ్చట….
- మీ కవిత్వ జీవితానికి మొదటి స్ఫూర్తి ఏమిటి? అది ఎలా మారింది?
విఆర్ విద్యార్థి: నేను రెండవ తరగతి చదువుతున్నప్పుడు మా స్కూల్ టీచర్… కవులు అంటే తెలుసా? అని క్లాసులో పిల్లలకి ప్రశ్న వేసిండు. నేను వెంటనే లేచి మా భూమిని కౌలుకు ఇచ్చినం అని అన్నాను. అప్పుడు కవులు అంటే మిగతా పిల్లలకు కూడా పెద్దగా తెలియదు. సారు నవ్వీ, కవులు అంటే ఎవరో మాకు అర్థం చెప్పిండ్రు. సొంతంగా ఎట్లా రాస్తారని నేను ఆశ్చర్యపడ్డాను. ఆ విషయం నన్ను కొన్నేళ్లు వెంటాడింది. చివరికి నేను ఆరో తరగతిలో 12వ యేట ‘సైనికుడా! ఓ సైనికుడా!” అనే కవిత రాశాను. అది గేయమో… వచన కవితో… చందో పద్యమో కూడా తెలియని పరిస్థితి. ఈ కవితకు స్ఫూర్తి మా మేనత్త భర్త జయసేన సైన్యంలో పనిచేస్తూ వాళ్లు ముచ్చట్లు చెప్పడం ద్వారా లభించిన తెలివిడితోనే రాశాను.
2. ప్రకృతి, సమాజం లేదా వ్యక్తిగత అనుభవాల్లో ఏవి మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి?
విఆర్ విద్యార్థి : ప్రకృతి, సమాజం, వ్యక్తిగతాలు ఈ మూడు కవిత్వంలో నన్ను ప్రభావితం చేశాయి. అయితే నా కవితల్లో ప్రకృతి మొదటి స్థానంలో ఉందని చెప్పగలను.
3. సృజన ప్రక్రియలో ఒక కవిత రాయడానికి మీరు అనుసరించే పద్ధతి ఏమిటి? శీర్షికలు ఎలా ఎంచుకుంటారు?
విఆర్ విద్యార్థి : ఒక్కోసారి నా చేతి వేళ్ళే ఏకధాటిగా రచనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు నాలో కలిగిన స్పందనలను వివిధ పాయింట్స్ రూపంలో నోట్స్ చేసుకుని కవితగా మలుస్తాను.
4. ప్రతీకలు, భాషా శైలి మీ కవితల్లో ఎలా పని చేస్తాయి?
విఆర్ విద్యార్థి : మొదట్లో జన సామాన్యుల భాషలో రాసేవాడిని. అధ్యయనం వల్ల కలిగిన అనుభవంతో ప్రతీకల్లో, భాషలో క్రమంగా మార్పును తెచ్చుకున్నాను.
5. ముఖ్య కవితలుమీ అభినవ కవితల్లో ఏది మిమ్మల్ని ఎక్కువగా సంతోషపెడుతుంది? ఎందుకు?
విఆర్ విద్యార్ది : కవికి తాను రాసిన ప్రతి కవిత ఇష్టంగానే ఉంటుంది. కానీ తాను రచించిన కవితల్ని తిరిగి చూసుకుంటే కొన్ని ప్రకటించాల్సిన అవసరం లేదనిపిస్తుంది. నేను ఆ విషయంలో ముఖ్యంగా సమాజానికి అవసరం లేని కవితలను ప్రకటించలేదు.
6. సంప్రదాయ కవుల ప్రభావం మీ రచనల్లో కనిపిస్తుందా?
విఆర్ విద్యార్థి : నన్ను తీవ్రంగా ప్రభావితం చేసిన సంప్రదాయ కవులు ఎవరూ లేరు. అయితే సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం వలన కొద్దో, గొప్ప ప్రతి కవి మీద ఉంటుందని భావిస్తున్నాను.
7. సంఘర్షణాత్మక కాలంలో సామాజిక దృక్పథంతో కవులు ఎలా స్పందించాలని మీరు భావిస్తారు?
విఆర్ విద్యార్థి : కవి ఎప్పుడు ప్రజాపక్షమే ఉండాలి. కానీ బ్యాలెన్స్ ను కలిగిన విధంగా ఉండాలి. ప్రజలకు నష్టం చేకూర్చే విధంగా తప్పుడు మార్గం పట్టించకూడదు.
8. తెలుగు కవిత్వంలో ప్రస్తుత ట్రెండ్స్, సవాళ్ల గురించి మీరేమనుకుంటున్నారు.
విఆర్ విద్యార్థి : తెలుగు కవిత్వం ఇప్పుడు ఎక్కువగా అస్తిత్వ వాదాలకు వేదికగా అయ్యిందని నేను అనుకుంటున్నాను. అది కులం కావొచ్చు, మతం కావొచ్చు. కొంతమేరకే ఈ అస్తిత్వ వాదాలు. అవి ఎప్పటికప్పుడు సమాజంలో వచ్చే మార్పులను బట్టి మారుతూ ఉంటాయి. అంటే కొత్త సవాళ్లను మన ముందుకు తీసుకొని వస్తాయి.
9. భవిష్యత్ ఆలోచనలు కవిత్వంతో పాటు అనువాదాలు లేదా ఇతర సృజనలు చేయాలనుకుంటున్నారా?
విఆర్ విద్యార్థి : గతంలో ఇంగ్లీష్ నుండి తెలుగులోకి చాలా అనువాదాలు చేశాను. అవి పుస్తక రూపంలోకి రాలేదు. అప్పుడప్పుడు కొన్ని పత్రికల్లో ప్రచురితమయ్యాయి. భువన ఘోష అనే సంకలనంలో ప్లాబో నేరుడా కవిత్వం నాదొక పెద్ద అనువాద కవిత అచ్చయింది. విమర్శ మీద దృష్టి పెట్టాలని ఉంది. గతంలో “దక్కన్ దస్తూరి” అనే సాహిత్య వ్యాస సంపుటిని ప్రచురించాను. ఇతరుల రచనలకు నేను రాసిన ముందుమాటలు “ఓరుగల్లు చేవురాలు” అనే వ్యాస సంపుటిగా మరొకటి వచ్చింది. అదేవిధంగా కథారచన పై దృష్టి పెట్టాను. “నోట్ బుక్ ఆఫ్ విఆర్ విద్యార్థి” అనే చిన్న పుస్తకం ప్రచురణకు సిద్ధంగా ఉంది. అది చలం గారి మ్యూజిక్స్ లాంటిదని నేను భావిస్తున్నాను. ఒక రకంగా అది తాత్వికపరమైన రచనలుగా చెప్పవచ్చు.
10. ఒక కవితకు స్ఫూర్తి ఎలా వస్తుంది? ఇది ఒక్కసారి వచ్చి పోతుందా లేక క్రమంగా ఏర్పడుతుందా?
విఆర్ విద్యార్థి : ఒక కవితకు స్ఫూర్తి ఎన్నో రకాలుగా వస్తుంది. అది స్వియ అనుభవం నుంచి రావచ్చు. సమాజం నుంచి కలిగి రావచ్చు. అంటే ఏదైనా ఒక సంఘటన కూడా కావొచ్చు. ఊహాజనితమైనది కూడా కావొచ్చు.
11. మీ రచనల్లో ప్రకృతి, సామాజిక సమస్యలు లేదా వ్యక్తిగత జ్ఞాపకాలు ఎలా ప్రేరణగా మారతాయి?
విఆర్ విద్యార్ధి : బహుశా….ఈ ప్రశ్న మీరు ఇతరులకు ఎలా ప్రేరణ కలిగిస్తారని అడుగుతున్నారేమో?! అది ఎదుటి వ్యక్తిలోని సంస్కరణను బట్టి ప్రేరణ కలిగిస్తాయి.
12. కవిత రాయాలనే ఆలోచన వచ్చిన తర్వాత మీరు ఎలా ప్రారంభిస్తారు. ఉదాహరణకు, మొదట రైమ్ లేదా థీమ్‌ను ఎంచుకుంటారా?
విఆర్ విద్యార్థి : నేను మొదట దేనిని ఎంచుకోను. కవితలోని వస్తువు యొక్క స్వభావాన్ని బట్టి రూపం దాలుస్తుంది. స్వేచ్ఛ కవితకు, పద్య కవితకు ఉన్న తేడా అదే. హైకులు, నానీలు, రెక్కలు, మొదలగునవన్నీ ఒక చట్రంలో బిగించబడినవే కదా! నాది ఇంతవరకు రాసిందంతా స్వేచ్ఛ కవిత్వమే!.
13. తెలంగాణ భాషా శైలి మీ ప్రక్రియలో ఎలా స్థానం పొందుతాయి?
విఆర్ విద్యార్థి : నా దృష్టిలో తెలంగాణ, ఆంధ్ర భాషలంటూ లేవు. తెలుగు భాష అంతా ఒక్కటే. ప్రాచీన సాహిత్య కావ్యాలు చదివిన వారికి ఈ విషయం అంతా తెలుసు. తేడా ఒక్కటే తెలంగాణ, రాయలసీమ వారు ‘వచ్చినారు’ అంటారు ‘వచ్చిండ్రు’ అంటారు. కోస్తా వారు వచ్చారు అంటారు. ఆంధ్ర ప్రాంత సాహిత్య ప్రభావంతో మా తరం వారు వచ్చారు అని రాశారు అంతే.
14. కవిత సృజనలో సవరణలు, పూర్తి మొదటి డ్రాఫ్ట్ రాసిన తర్వాత ఎన్ని సార్లు సవరిస్తారు, ఏమి మార్పులు తీసుకుంటారు?
విఆర్ విద్యార్థి : కవిత్వం రాసిన తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చేంతవరకు డ్రాఫ్టులు మారుతూనే ఉంటాయి. ప్రత్యేకంగా ఒక లెక్క అంటూ ఉండదు. “తప్పిపోయిన ఆకాశం” అనే రెండు పేజీల కవిత రాయడానికి నాకు 60 ఏళ్లు పట్టింది. భావ సంపన్నమే అంటే సమూహమే కవిత పూర్తయింది లేనిది తెలియజేస్తుంది.
15. కవిత రాయడానికి ఏ సాధనాలు లేదా పరిస్థితులు (మధ్యాహ్నం, రాత్రి) మీకు అవసరం?
విఆర్ విద్యార్థి : నాకైతే కవిత రాయడానికి ప్రత్యేకంగా ఒక సమయం అంటూ ఉండదు. స్పందించినప్పుడే కవిత పురుడు పోసుకుంటుంది. అది ఉదయం కావొచ్చు. మధ్యాహ్నం కావొచ్చు. రాత్రి కావొచ్చు. ఒక ప్లాన్ వేసుకుని రాసే వాళ్ళకి ప్రత్యేకమైన సమయం ఉంటుంది. కలం, కాగితం ముక్క తప్పా ఇంకా ఏ సాధనాలు కావాలి కవిత రాయడానికి.
16. మీకు రచనా ప్రక్రియలో ఎదురయ్యే ప్రధాన సవాళ్లు ఏమిటి?వాటిని ఎలా అధిగమిస్తారు?
విఆర్ విద్యార్థి : నేను అనుకున్నది లేదా దర్శించింది నా కవితలో ఆవిష్కరించబడిందా లేదా అనేదే నాకు పెద్ద సవాల్. మళ్లీ ఆలోచిస్తాను. మళ్లీ రాస్తాను. నేను సంతృప్తిపడే వరకు. అయినా ఒక్కోసారి కవిత పర్ఫెక్షన్ కు రాకపోవచ్చు. కవితలో ఆరంభం, సమాకం చాలా ముఖ్యం. రెండు “క్యాచింగ్ ” గా ఉంటే పాఠకుడు ఆకర్షింపబడతాడు.
17. మీ తల్లిదండ్రులు పుట్టుపూర్వోత్తరాలు చెప్పండి?
విఆర్ విద్యార్థి : నేను పుట్టింది వరంగల్ పక్కనే ఉన్న గవిచర్ల గ్రామం. వేలూరి కమలమ్మ-నరసయ్య దంపతులకు అక్టోబర్ 8, 1945లో జన్మించాను. మా నాన్న 1970లో గవిచర్ల గ్రామ సర్పంచ్ గా వ్యవహరించారు. మాది దిగువ తరగతి వ్యవసాయ కుటుంబం. సంగెంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశాను.
18. మీ బాల్యంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ప్రాచీన సాహిత్య కవులు ఎవరు?
విఆర్ విద్యార్థి : ప్రత్యేకంగా ఒకరి ప్రభావంలో పడి కవిత్వం రాశానని నేను అనుకోవడం లేదు. తిలక్, శ్రీ రంగం శ్రీనివాసరావు, కాళోజీలను ఎక్కువగా ఇష్టపడ్డాను. ఇది రంగుల కళ్లద్దాలు పెట్టుకొని చదివి నిర్ణయించే విమర్శకులు కాకుండా, ఉన్నదున్నట్టు చూసి బెరీజు వేసే విమర్శకులు తేల్చాల్సిన విషయం.
19. సాహిత్యంలో మిమ్మల్ని బాగా వెంటాడిన, వేధించిన రచన ఏమైనా ఉందా?
విఆర్ విద్యార్థి : చాలా ఉన్నాయి బుచ్చిబాబు- “చివరికి మిగిలేది”, గోపీచంద్ -అసమర్థుని జీవయాత్ర,, శరత్ చంద్- చరిత్ర హీనులు, ఇవన్నీ స్కూల్ రోజుల్లోనే చదివి రోజుల తరబడి డిస్టర్బ్ డుగా ఉండేవాణ్ణి. చలం రచనలు నన్ను మీ డిస్టర్బ్ చేయలేదు.
20. ఆధునిక, వర్తమాన కవులల్లో మీరు గుర్తించ తగినవారు ఎవరు?
విఆర్ విద్యార్థి :
చాలామంది కవులే ఉన్నారు. పేర్లు ఊఠంకిస్తే మిగతా వారిని తక్కువ చేసినట్టు అవుతుంది. ప్రముఖ భారతీయ తత్వవేత్త
జిడ్డు కృష్ణమూర్తి నా ఆలోచన విధానంలో చాలా మార్పులు తెచ్చారు. ఇంకా చాలామంది తత్వవేత్తలను చదివాను. కానీ నాకు ఇప్పటి వరకు కూడా అంటే ఈ 80 ఏళ్లలో వయసులో కూడా జిడ్డుకృష్ణమూర్తి మార్గమే సరైందని అనిపిస్తుంది.
21. జిడ్డు కృష్ణమూర్తి తాత్విక ఆలోచన విధానం మీ ఏ ఏ కవితల్లో ప్రతిఫలించిందో చెప్పగలరా?
విఆర్ విద్యార్థి : చాలా కవితల్లో జిడ్డు కృష్ణమూర్తి ప్రభావం ఉంది. కొన్నింటిలో స్పష్టంగా ఉంది కొన్ని కవితల్లో ఛాయా మాత్రంగా ఉంది. “అనాఛ్ఛాదితంగా రా” లాంటి కవితల్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది.
22. భారత వాయు సేనసేనలోకి మీ ప్రవేశం ఎపుడు, ఎలా జరిగింది?
విఆర్ విద్యార్థి : నేను హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పియుసి చదువుతుండగా 1964లో లింగాల రామచంద్రారెడ్డి ప్రోత్సాహంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ టెస్ట్ రాసి 105 మందిలో రెండవ స్థానంలో నిలిచాను. రేడియో కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో ట్రేడ్ పొందాను. బెంగళూరులో ట్రైనింగ్ పూర్తయిన తర్వాత కొలాంలో మరికొన్ని చోట్ల ప్రత్యేకమైన నైపుణ్యత కోసం ట్రైనింగ్ చేశాను. పదిహేను ఏళ్లు సైనికుడుగా పనిచేసే 1979 చివరలో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశాను. 1965, 1971 యుద్ధాల్లో వార్ ఫ్రంట్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నాను.
23. సైన్యంలో ఉంటూ కవిత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రాశారు?
విఆర్ విద్యార్థి : సైన్యంలోకి వెళ్లే ముందు నుండి విద్యార్థి దశ నుండి నేను కవిత్వం, కథలు రాసేవాడిని. కానీ 1966లో నేను బరోడాలో ఉన్న రోజుల నుండే కవిత్వం విశేషంగా రాశాను. యుద్ధ కాలంలో చాలా కవిత్వం రాశాను. నేను ఎక్కువ కవిత్వం తెలుగు నేలకు దూరంగా ఉత్తర భారతంలోనూ, అమెరికాలోనే రాశాను.
24. యుద్ధ బీభత్సాన్ని ఒక కవిగా, ఒక సైనికుడిగా మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు ?
విఆర్ విద్యార్థి : నేను సైనికుడిగా ఎప్పుడూ క్రమశిక్షణ తప్పలేదు. ఉన్నత అధికారుల ఆదేశాలను ప్రశ్నించకుండా ఆచరించడమే సైనికుడి పని. సైనికుడు అనే వాడు ఆ ప్రకారమే ఉండాలి. కానీ కవితల్లో కాదు కదా! కవి సర్వ స్వతంత్రుడు. తాను చూసింది తెలుసుకున్నది నిర్భయంగా చెప్పాలి. అందుకే సైనికుడిగా సైనిక పాత్ర వహించాను. కవిగా కవిత్వం పాత్ర పోషించాను. కాకుంటే నా కవిత సంపుటాలు అన్నీ సైనిక ఉద్యోగ విరమణ తర్వాత ప్రచురించాను. యుద్ధ బీభత్సాన్ని కవిగా నిరసిస్తాను. సైనికుడిగా విధులు నిర్వహించాను.
25. ”ఖండాంతర కవి” అనే పేరు మీకు ఎలా ప్రచారంలోకి వచ్చింది?
విఆర్ విద్యార్ది : “ఖండాంతర కవి” అని నన్ను సాహితీవేత్తలు చాలా రోజుల నుండే చెప్పుకుంటున్నారు. బహుశా నా కవిత్వంలో విశ్వజనీనత ఉండటం వల్లనే కావొచ్చు. సాహితీవేత్తలు నా కవిత్వాన్ని సరియైన రీతిలో అర్థం చేసుకున్నందుకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.
26. కాళోజీ సోదరులతో మీకున్న అనుబంధం ఏమిటి?
విఆర్ విద్యార్థి : కాళోజీ సోదరులతో నాకు చిన్నప్పటి నుండి అనుబంధం ఉంది. మా కుటుంబాల మధ్య ఉన్న సంబంధాల వల్లనే అనుబంధం ఏర్పడ్డది. నేను కవిత్వం రాయడం వల్ల ఆ అనుబంధం బలపడ్డది. కాళోజీ సోదరులు వారు స్థాపించిన మిత్రమండలి వల్లనే నేను కవిగా నిలబడ్డాను. మిత్రమండలి నా మాతృ వేదిక.
27. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ అవార్డుల కోసం ఎగబడుతున్న తరాన్ని చూస్తే అవార్డులపై మీకు ఏమనిపిస్తుంది?
విఆర్ విద్యార్థి : అవార్డులు కవిత్వానికి ప్రోత్సాహమే కానీ గుర్తింపు కాదు. ప్రభుత్వపు అవార్డుల కోసం ఎగబడుతున్న తరాన్ని చూస్తే జాలి పడతాను. ఎందరెందరో గొప్ప కవులు, అవార్డుల వల్ల గొప్పవాళ్లుగా గుర్తింపబడలేదు. వారి రచన బలం వల్ల గుర్తింపు పొందినారు.
28. పాలస్తీనాలో జరుగుతున్న యుద్ధ బీభత్సం మీద మీరేమైనా కవిత్వం రాశారా?
విఆర్ విద్యార్థి : ఒక పాలస్తీనా యుద్ధ బీభత్సమే కాదు, ఏ యుద్ధభత్సాన్ని కూడా నిరసిస్తాను. ఒక కవిగా దుఃఖిస్తాను. ప్రత్యేకంగా పాలస్తీనా యుద్ధ బీభత్సం గురించి కవిత్వం ఏమీ రాయలేదు.
29. ఇప్పటివరకు మీరు ప్రచురించిన వివిధ రచనల గురించి తెలియజేస్తారా?
వీఆర్ విద్యార్థి : ఇప్పటివరకు ఏడు కవితా సంపుటాలు ప్రచురించాను. అలలు (1987), “పలకరింత”(1996), “ధర్మ సముద్రం” (2004), “మంచు మైదానం” (2005), ఖండాంతర (2007), ఇతర కవితలు (2012), “దృశ్యం నుండి దృశ్యానికి” (2020 ) సంపుటాలు ప్రచురించాను. ఉర్దూలో “ఆస్మా కా లమ్స్”, ఆంగ్లం లో “హా రైజన్” కవిత్వం ప్రచురించాను. హిందీ లో “అంతర్యాన్” కవితల అనువాదం సంపుటాలు ప్రచురితమైనవి. ముఖ్యంగా ఉర్దూ మరియు హిందీలో నా కవిత్వానికి మంచి గుర్తింపు లభించింది. వాటిపై చాలా సాహిత్య విమర్శ వ్యాసాలు వచ్చాయి. ప్రచార లోపం వల్లే ఇంగ్లీష్ అనువాదానికి ఎక్కువ పేరు రాలేదనుకుంటున్నాను. నా కవిత్వం గురించి తెలుగులో “పాలపిట్ట” మాసపత్రిక ప్రత్యేక సాహితీ సంచిక ప్రచురించింది. ఉర్దూలో “షాయర్” ప్రత్యేక సంచిక ప్రచురించబడింది. ఉర్దూలో నాతోనే ఇతర భాష కవుల ప్రత్యేక సంచికలు ప్రారంభమయ్యాయి. నా కవిత్వం మీద చలనం, ప్రేరణ, ఇలకుకల అనేక గ్రంథాలు వచ్చాయి. కాకతీయ విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వేరువేరుగా రెండు పీహెచ్డీలు కూడా జరిగాయి. ప్రచురించాల్సిన సాహితీ గ్రంథాలు చాలానే ఉన్నాయి.
30. వి.ఆర్. విద్యార్థి పేరు వెనుక ఉన్న కథ ఏంటి?
వీఆర్ విద్యార్థి : నా అసలు పూర్తి పేరు వేలూరి రాములు. అయితే సొంత పేరును ఇంటి పేరును విఆర్ గా మార్చుకున్నాను. చివరగా ‘విద్యార్థి’ అని చేర్చాను. విద్యార్థి అనే పేర్లు ఉత్తర భారత దేశంలో ఉంటాయి. సైన్యంలో ఉంటూ కవిత్వం రాసి ప్రచురించాల్సిన సందర్భాల్లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి నాకు నేనుగా “వీఆర్ విద్యార్థి”గా నామకరణం చేసుకున్నాను. విద్యార్థి అంటే నిరంతర అధ్యయనశీలి. ఆ స్వభావం నాలో నిరంతరం కొనసాగుతూనే ఉంది. కనుక నేను సార్ధకనామధేయునిగా ‘విఆర్ విద్యార్థి’గా ఉండటమే నాకు ఇష్టం.