సెలెక్టివ్ అవుట్‌రేజ్: దేశభక్తా? రాజకీయ అవకాశవాదమా?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో, టీవీ డిబేట్లలో, వాట్సాప్ గ్రూపుల్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ – “బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న హింస”.చాలా అవసరమైన చర్చ. అక్కడ జరుగుతున్నది అన్యాయమే. అమాయకులపై దాడి ఎక్కడ జరిగినా ఖండించాల్సిందే. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ, ఇక్కడ మనం గమనించాల్సిన, ప్రశ్నించాల్సిన అసలు విషయం మరొకటి ఉంది. పక్క దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి అంత ఆవేదన చెందుతున్న మన సమాజం… మన కళ్ల ముందే, మన దేశంలో రోజూ జరుగుతున్న దారుణాల గురించి ఎందుకు నోరు మెదపడం లేదు?

మౌనం వెనుక దాగున్న ద్వంద్వ ప్రమాణాలు :
మొన్నటికి మొన్న క్రిస్మస్ పండుగ సందర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో కొన్ని కాషాయ మూకలు చర్చిల ముందు భజనలు చేస్తూ అల్లర్లు సృష్టించారు. శాంతాక్లాజ్ వేషధారణలో బెలూన్లు అమ్ముకునే పేద పిల్లల మీద కూడా దౌర్జన్యం చేశారు. మరి వీటి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడలేదు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ వేదిక మీద ముస్లిం మహిళ హిజాబ్ లాగి , అసహ్యంగా ప్రవర్తించినప్పుడు మన “సామాజిక స్పృహ” ఏమైంది? డెహ్రాడూన్‌లో నార్త్ ఈస్ట్‌కు చెందిన ఒక యువకుడిని జాత్యహంకారంతో కొట్టి చంపినప్పుడు, దేశవ్యాపంగా దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి ఈ సమాజం ఎందుకు మౌనంగా ఉంది?
మహమ్మద్ అఖ్లాఖ్ మొదలుకొని ఎంతోమంది ముస్లిములను “గోమాంసం” పేరుతో నిరాధారమైన ఆరోపణలతో చంపేస్తున్నప్పుడు ఈ దేశం ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోయింది?

మెరిట్ కూడా నేరమేనా? :
మనం తరచూ “రిజర్వేషన్లను ఎత్తివేయాలి, వీటి వల్ల మెరిట్ విద్యార్థులకు నష్టం ” అని వాదించే వారిని చూస్తుంటాం. కానీ అదే మెరిట్, ఒక ముస్లిం విద్యార్థికి ఉంటే అది నేరంగా మారుతోందా? దీనికి తాజా సాక్ష్యమే జమ్మూలోని శ్రీ మాతా వైష్ణోదేవి మెడికల్ కాలేజీ ఉదంతం. అక్కడ మెరిట్ (NEET) ఆధారంగా 50 సీట్లలో 42 సీట్లు ముస్లిం విద్యార్థులకు వచ్చాయి. చదువుకు మతం ఉండదు. కానీ “మా డబ్బుతో కట్టిన కాలేజీలో ముస్లింలకు సీట్లు ఎలా ఇస్తారు?” అంటూ కొన్ని వర్గాలు నిరసనలు చేశాయి. విచిత్రం ఏమిటంటే – ఆ ఒత్తిడికి తలొగ్గి, అధికారులు ఆ కాలేజీ అనుమతినే రద్దు చేశారు. ఒక విద్యాసంస్థ మూతపడితే బాధపడాల్సింది పోయి, స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. “ముస్లింలకు సీటు రాకూడదు అంటే, అసలు కాలేజీయే లేకుండా పోయినా పర్లేదు” అనే స్థాయికి మన ద్వేషం పెరిగిపోయింది.

పద్మశ్రీ గ్రహీత ఒక్కసారిగా దేశద్రోహి అయ్యాడా?
అసలు ఇప్పుడే ఈ “బంగ్లాదేశ్” రాగం ఎందుకు ఎత్తుకున్నారు? దీని వెనుక స్పష్టమైన రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. దీనికి తాజా ఉదాహరణే ఐపీఎల్ (IPL) వివాదం. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తఫిజుర్ రెహ్మాన్‌ను తీసుకున్నారని పెద్ద రచ్చ చేసి ఆ ఆటగాడిని జట్టునుంచి బహిష్కరించారు. కానీ నిజం ఏమిటంటే – ముస్తఫిజుర్ రెహ్మాన్ ఈ రోజే ఆకాశం నుంచి ఊడిపడలేదు. ఆయన గత పదేళ్లుగా ఐపీఎల్‌లో ఆడుతూనే ఉన్నాడు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకు వచ్చింది?మరో విడ్డూరం ఏంటంటే… ఆ ఆటగాడిని తమ జట్టులోకి తీసుకున్నందుకు ఆ జట్టు యజమాని షారుక్ ఖాన్ ను “దేశద్రోహి” అని నిందిస్తు నిరసన చేసారు. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తో సత్కరించిన వ్యక్తి. నిబంధనల ప్రకారం ఒక బంగ్లాదేశ్ ఆటగాడిని జట్టులోకి తీసుకున్నంత మాత్రాన, రాత్రికి రాత్రే దేశద్రోహిగా మారిపోతాడా?

ఇంకొక విషయం – ఆ జట్టుకు షారుఖ్ ఖాన్ ఒక్కడే యజమాని కాదు. ప్రముఖ నటి జూహీ చావ్లా కూడా సహ యజమాని. కానీ నిరసనలు, “దేశద్రోహి” ముద్రలు మాత్రం కేవలం షారుఖ్ ఖాన్ మీదే ఎందుకు పడ్డాయి? జూహీ చావ్లాను ఎందుకు ఒక్కరు కూడా ప్రశ్నించలేదు? ఒకవైపు బంగ్లాదేశీ హిందువుల మీద జరుగుతున్న హింస గురించి ప్రశ్నిస్తున్న మన వ్యవస్థ… మరోవైపు బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులను చారిత్రాత్మకంగా ఓటు బ్యాంకుగా వాడుకున్న షేక్ హసీనాకు ఢిల్లీలో “సేఫ్ హౌస్” ఇచ్చి ఎందుకు రాజభోగాలు కల్పిస్తోంది?
సెలెక్టివ్ అవుట్‌రేజ్ (Selective Outrage) అంటే ఇదే!
మనకు నచ్చినవారికి అన్యాయం జరిగినప్పుడు మాత్రమే స్పందించడం, మనకు నచ్చని వారిని హింసిస్తున్నప్పుడు మౌనంగా (లేదా ఆనందంగా) ఉండటమే “సెలెక్టివ్ అవుట్‌రేజ్”.
హింస ఎక్కడ జరిగినా హింసే. అది బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరిగినా, ఇండియాలో ముస్లింల మీద జరిగినా, మణిపూర్‌లో క్రైస్తవుల మీద జరిగినా… మనిషిగా మనం స్పందించాలి. “మా వాళ్లు కొడితే ఒప్పు – పరాయి వాళ్లు కొడితే తప్పు” అనే సిద్ధాంతం దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం. పక్క దేశం గురించి మాట్లాడే నైతిక అర్హత మనకు ఉండాలంటే… ముందు మన దేశంలో మైనారిటీలు, దళితులు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. వాళ్ళ మీద జరిగే హింస గురించి మాట్లాడాలి, ప్రశ్నించాలి. లేదంటే మనది దేశభక్తి కాదు… కేవలం రాజకీయ అవకాశవాదం మాత్రమే.

స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా, మధిర మండలం, ఖాజీపురం గ్రామం. వృత్తిరీత్యా ప్రస్తుతం సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి సాహిత్యం, కవిత్వం పట్ల ఉన్న ఆసక్తి పుస్తకాల వైపు నడిపించింది. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వలస వెళ్లాక, అక్కడి సామాన్య కార్మికుల కష్టాలు, వారి జీవన పోరాటం సంజయ్ ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆ అనుభవాలను, ప్రవాస జీవితపు వ్యధను ప్రపంచానికి తెలియజేయాలనే తపనతో 'సారంగ' వెబ్ పత్రికలో 'గల్ఫ్ బతుకు కథలు' శీర్షికన కథలు రాస్తున్నాడు. సాహిత్యం ద్వారా సమాజాన్ని అధ్యయనం చేస్తూ, సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలపై విశ్లేషణలు రాయడం సంజయ్ అభిరుచి. మనిషిలోని అంతర్గత సంఘర్షణ, అస్తిత్వాన్ని తన రచనలకు ప్రధాన ఇతివృత్తంగా తీసుకుంటున్నాడు.

4 thoughts on “సెలెక్టివ్ అవుట్‌రేజ్: దేశభక్తా? రాజకీయ అవకాశవాదమా?

  1. This is true current situation in India.. There are many hate crimes happening within our country including on Hindus Muslims Dalits women children etc … Still no outrage and no protests.. India is going backwards because of the atrocities done by the current Government.

  2. Buchireddy gangula
    ————————————-
    Khan ji —u r right sir—79 yrs independence — no change
    No progress — divide and rule —still British policy working
    In the country -religion playing BIG POLITICS — needs change

    1. Thank you Buchireddy Garu. you are 100%, devide and rule politics going on. sad state of affairs.

Leave a Reply