సుధాకరా సుధాకరా…

పల్లవి:

సుధాకర సుధాకర నేలరాలినావా
తారలల్లో ధృవతారగా వెలుగుతున్నావా
అడవిలో పంతులుగ పాఠమైనావా
సడలనీ పోరుదీక్ష అమరుడినైనావా

అనుపల్లవి:

నెత్తుటి తైలం
కొవ్వొత్తిగ జ్వలనం
కత్తి మీద సాము
నిలువెత్తున త్యాగం
చలపతీ చలపతీ
నిరుపేదల దళపతీ

                   ||సుధాకరా||

1). ఎంత శాంతి వదనం-ఎదలో
రగిలే క్రాంతి మదనం
పట్టుదలే సాక్ష్యం
చెమట చుక్క రాలిపడుతూ-మొలిచే మొక్కగా
ఆయుర్వేద వైద్య విద్య అడివే-ఆలంభణగా

             ||నెత్తుటి||  సుధాకరా||

2). అడవి బిడ్డ తత్వం-రుచించే
గణతంత్ర రాజ్యం
పురోగమన చిత్తం-రచించే
కాల గమన సత్యం
నిలువెత్తు మనిషినందు లేదు- వీసమెత్తు స్వార్థం
ప్రజల కొరకు ప్రాణమిచ్చి-చేరే హిమశిఖరం

              ||నెత్తుటి||  సుధాకరా||

3) నాగరికత జననం-అడవిలో
భూగర్భమే ఖనిజం
ఆదివాసి హననం-అక్కడ
పెట్టుబడి జననం
ఆపమంటూ కోరినావా-కౄర కగారు
కాల్చి కూల్చి చంపుతుంది-ఏమిటి సర్కారు

             ||నెత్తుటి||  సుధాకరా||

4) నడిచినట్టి పయనం-శాంతికై
కదిలినట్టి వైనం
కలిసి ఉన్న తరుణం-మనలో
మలిన రహిత మర్మం
భూమి కొరకె భుక్తి కొరకె
చర్చ నడిసెగా
శాంతియైన యుద్ధమైన
ప్రజల కొరకెగా

అనుపల్లవి :

అమర జ్యోతిగా
వెలగనున్నావా
రక్తచలన గీతమై
మోగనున్నావా
చలపతీ చలపతీ
నిరుపేదల దళపతీ
జోహార్లు దళపతీ
జోహార్లు దళపతీ

(2004 అక్టోబర్ లో జరిగిన శాంతి చర్చలలో మావోయిస్టు పార్టీ ప్రతినిధిగా కామ్రేడ్ సుధాకర్ కొద్దిపాటి సహచర్యాన్ని తలుచుకుంటూ…)

పుట్టింది కరీంనగర్ జిల్లా వేములవాడ. కవి, రచయిత, గాయకుడు. విప్లవోద్యమ నాయకుడు. అసలు పేరు కూర దేవేందర్. కలం పేరు మిత్ర. అమర్ పేరుతో సీపీఐ(ఎం.ఎల్.) జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు. రచనలు : 1. మిత్ర తెలంగాణ పాటలు, 2. పొదుగు, 3. వరుపు, 4. మిత్ర జనం పాటల సవ్వడి (పాటలు); 5. చితాభస్మంలోంచి...(కవిత్వం); 6. తెలంగాణ డప్పు దరువు, 7. తెలంగాణ ధూం ధాం, 8. తెలంగాణ కోలాటం పాట, 9. ముంబై తెలంగాణం, 10. బహుజన బతుకమ్మ, 11. వీరతెలంగాణ (నృత్యరూప గానాలు).

Leave a Reply