సంభాషణనూ, మార్గాన్నీ తేల్చేది ఆచరణే 

(ఈ నెల 13 న హైదరాబాదులో విడుదల కానున్న “శాంతి చర్చలు : ప్రజాస్వామ్యం – విప్లవోద్యమం” పుస్తకానికి  రాసిన ముందుమాట )

ఈ రచన ఆగస్టు చివరికి పూర్తయింది. ఆ తర్వాత కూడా ఈ పుస్తక ఇతివృత్తంలోని చర్చ కొనసాగింది. సెప్టెంబర్‌ మధ్యలో విప్లవోద్యమం లోపలి నుంచి కూడా ఆరంభమైంది. అచ్చుకు వెళ్లే ముందు ఇప్పుడు చూస్తే, లోపలి నుంచి జరుగుతున్న చర్చకు కూడా అన్వయం అయ్యేలా ఈ రచన ఉన్నట్లనిపించింది. ఎవరు మాట్లాడుతున్నారనేది ముఖ్యమే. ఏం మాట్లాడుతున్నారనేదీ ముఖ్యమే. ఈ రెంటికంటే ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారు? ఎందు కోసం మాట్లాడుతున్నారు? అనేవి మరీ ముఖ్యం. ఆ రకంగా ఈ పుస్తక ప్రాసంగికత పెరిగినట్లనిపించింది. 

మావోయిస్టు ఉద్యమం మీద గత కొన్ని నెలలుగా జరుగుతున్న చర్చోపచర్చలే ఈ రచనలోని వాద విస్తృతికి కారణం. బహుశా విప్లవోద్యమంలోనే ఆ అవకాశం ఉన్నది కావచ్చు. మానవ ప్రాణాల నష్ట నివారణకు శాంతి చర్చలు చేయాలన్నా, దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని వదిలేసి “సక్రమంగా” విప్లవం  చేయాలన్నా మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టాలని ఈ చర్చలో పాల్గొన్న చాలా మంది అన్నారు. ఇప్పుడు ఆ వాదన బలపడుతున్నది. చర్చ నిరంతరాయమని, మానవ ఆచరణే చర్చను నిగ్గుదేల్చుతుందనే స్థూల వైఖరిని కూడా మరింతగా విస్తరించాల్సిన సమయం ఇది.  

శాంతి కోసం సాయుధ పోరాట విరమణా? విప్లవం కోసమే సాయుధ పోరాట విరమణా? యుద్ధానికి ఒక పంథా ఉంటుందిగాని విరమణకు ఏముంటుంది? అనే ప్రశ్న దాకా ఇది చేరుకున్నది. 

ఉత్పత్తి, ప్రయోగం, వర్గపోరాటం అనే మూడు మాటల ప్రాధాన్యతను మావో చాలా ప్రత్యేకంగానూ, కలగలిపీ చెప్పాడు. మొదటి రెంటికీ దారి దీపం వర్గపోరాటం.  ఒకానొక నిర్దిష్ట సందర్భంలో ఆయన ఈ మాట చెప్పినప్పటికీ సమాజ మౌలిక పరివర్తనలోని అన్ని దశలకూ వర్తిస్తుంది. 

వ్యక్తుల ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ చరిత్ర చోదకమైన వర్గ సంఘర్షణలో ఒక్కడో ఒక చోట ఉంటారు. వాళ్లకు తెలిసినా, తెలియకపోయినా అక్కడి నుంచి వర్గపోరాటం గురించి అనుకూలంగానో, ప్రతికూలంగానో మాట్లాడుతూ ఉంటారు. వ్యవహరిస్తూ ఉంటారు. అదీ ఒక వర్గపోరాట రూపంగా కొనసాగుతుంది.

మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుంచి బైటా, లోపలా జరుగుతున్న చర్చలో అలాంటి వైఖరులే ఉన్నాయి. సమాజంలో నిరంతరాయంగా జరిగే వర్గ సంఘర్షణకు ఒక రాజకీయార్థిక సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇచ్చి ప్రజలను ముందుకు నడిపే విప్లవపార్టీ వర్గపోరాటాన్ని కొనసాగించాలా? లేక ఆపివేయాలా? అనేదే ఇన్ని నెలలుగా జరుగుతున్న చర్చ సారాంశం. శాంతి చర్చల గురించి, విప్లవోద్యమం గురించి జరుగుతున్న ఈ సంభాషణలో పాల్గొన్న వాళ్లలో కొందరికైనా ఈ సంగతి తెలియకపోవచ్చు. వర్గపోరాటం  ముగిసిపోతే మన సమాజం తిరిగే మూల మలుపు దగ్గర నిలబడి నిలబడి ఉన్నామని కూడా వాళ్లు పట్టించుకోకపోవచ్చు. వర్గపోరాటం, దాని అత్యున్నత, అనివార్య రూపమైన సాయుధ పోరాటం చరిత్ర నియమమే అయినా అనేక రూపాల్లో ఆటంకాలను అధిగమించి ముందుకు పోవాల్సి ఉంటుంది. ఇది కూడా చరిత్ర నియమమే. మానవుల ఉత్పత్తిదాయకమైన ఆచరణ, దానిలోని సృజనాత్మకత, మేధస్సు నిరంతర ప్రయోగాలతో చరిత్రను ముందుకు తీసికెళతాయి. దారిలో తీవ్రమైన సవాళ్లు ఎదురుకావచ్చు. అద్భుత విజయాలు సిద్ధించవచ్చు. తిరిగి మళ్లీ సరికొత్త ప్రయోగం చేయవలసి రావచ్చు.   

సామాజిక చరిత్ర వికసించే వర్గపోరాటానికి మావోయిస్టులు దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాను దశాబ్దాలుగా అన్వయిస్తున్నారు. ఆచరిస్తున్నారు. భారత ప్రభుత్వం దాన్ని ధ్వంసం చేయడానికి తన శక్తియుక్తులన్నీ వెచ్చిస్తున్నది. శాంతి లేదు, చర్చలు లేవు, ఆఖరి మావోయిస్టును కూడా నిర్మూలించడమే తన కర్తవ్యం అంటున్నది. ఆ  చివరి మావోయిస్టు ఎవరో, ఏ తల్లి రక్తమాంసాల సమ్మిశ్రమమైన ఆ దేహం ఎట్లా ఛిద్రమైపోతుందో మనం చెప్పలేకపోవచ్చు. ఈ యుగంలో మానవాకృతి దాల్చిన కోటానుకోట్ల విప్లవ ప్రజల ఆచరణా, చైతన్యమూ రద్దు కావని మాత్రం ఎలుగెత్తి చాటవలసి ఉన్నది. దానికి ఒక్కటే భౌతిక ఆధారం. విప్లవకారుల నాయకత్వంలో ఈ దేశ ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న విప్లవ పంథా. లక్షల సైనిక బలగాలను, బలీయమైన రాజ్యవ్యవస్థను, అత్యంత పురాతనమైన సామాజిక, సాంస్కృతిక బంధనాలను, నానాటికీ కొత్త రూపాల్లో చెలరేగుతున్న దోపిడీ దుర్మార్గాలను ఎదుర్కోగల ధీశాలిగా ఇప్పటికే ఆ పంథా రుజువైంది. ఈ కారణం వల్లే బైటా, లోపలా అతలాకుతలమవుతున్నది. ఈ కల్లోల తీరం దగ్గర నిలబడి చేస్తున్న సంభాషణ ఇది. దీనితో  గొంతు కలపమని  విప్లవాభిమానులందరినీ కోరడమే ఈ పుస్తక సారాంశం. ఆ తర్వాత ఎవ్వరితోనైనా, ఏదైనా, ఎంతయినా చర్చించవచ్చు. 

(1 అక్టోబర్‌, 2025. జన చైనా ఆవిర్భావ దినం)

కవి, రచయిత, విమర్శకుడు, వక్త. విరసం కార్యవర్గ సభ్యుడు. గతంలో విరసం కార్యదర్శిగా పని చేశారు. రచనలు: 'కలిసి పాడాల్సిన గీతమొక్కటే' (కవిత్వం), 'అబుజ్మాడ్' (కవిత్వం), 'నేరేడు రంగు పిల్లవాడు' (కథలు), 'జనతన రాజ్యం', 'సృజనాత్మక ధిక్కారం'. రెండు దశాబ్దాలుగా మార్క్సిస్టు దృక్పథంతో విమర్శలో కృషి చేస్తున్నారు.

One thought on “సంభాషణనూ, మార్గాన్నీ తేల్చేది ఆచరణే 

  1. BUCHI REDDY GANGULA
    —————————————- PANI GARU — KILLING IS BAD SIR – WHO GAVE PERMISSION TO KILL
    MARX ..MAO —VIPLAVA ABHIMANULU ??KULA PATTIMPULU MI LO KOODA LEVA.

Leave a Reply